కర్ఫ్యూ నీడలో హైదరాబాద్ – నా జ్ఞాపకాలు 

ది 1979వ సంవత్సరం. నా జీవితంలో మొదటిసారి భాగ్యనగరంలో అడుగుపెట్టిన అపురూపమైన కాలం. ఈరోజు మనం చూస్తున్న ఆకాశహర్మ్యాలు, ఫ్లైఓవర్లు, ఐటీ కారిడార్లు, నిరంతర వాహనాల హడావిడి ఉన్న ఈ కాంక్రీట్ జంగిల్ అప్పటి హైదరాబాద్ కాదు. అప్పట్లో నగరం చాలా నిమ్మళంగా, ప్రశాంతంగా, ఒక పల్లెటూరి ఆత్మీయతను గుండెల్లో దాచుకున్నట్టు ఉండేది. దిల్సుఖ్‌నగర్ దాటితే నగరం ముగిసిపోయి సరిహద్దు ప్రాంతం వచ్చేసేది. ఆ తర్వాత అంతా ఖాళీ స్థలాలు, చెట్లు చేమలే. రోడ్ల మీద ఇప్పటిలా కార్ల హడావిడి, ఆటో, మోటార్సైకిళ్ల హోరు అసలే లేదు.

అక్కడక్కడా నడిచే ఎర్రటి ఆర్టీసీ బస్సులు, ‘ట్రింగ్ ట్రింగ్’ అంటూ గంట కొడుతూ వెళ్లే రిక్షాలు, మధ్యతరగతి మనుషులు నింపాదిగా తొక్కుకుంటూ వెళ్లే సైకిళ్లు…ఎప్పుడో ఒకటి మేమున్నాం అంటూ వచ్చే రాజదూత్ వంటి మోటార్ సైకిళ్ళు, అంబాసిడర్, ఫియట్ కార్..అంతే, అప్పటి ట్రాఫిక్! రోడ్డు దాటాలంటే భయపడాల్సిన పనిలేదు, కాసేపు రోడ్డు మధ్యలో నిలబడినా పెద్దగా హారన్ లు ఉండేవి కాదు. విసుక్కునే వాహనదారులు ఉండేవారు కాదు.

గౌలిగూడ బస్టాండ్: ఆసియాలోనే అద్భుత నిర్మాణం

నేను ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో తప్పాను. ఆ బాధ, భవిష్యత్తు గురించి ఆందోళన మనసును తొలిచేస్తుంటే, నన్ను చదివించాలనే పట్టుదలతో మా అమ్మ నన్ను తీసుకుని హైదరాబాద్ బయల్దేరింది.  మూసారాంబాాగ్‌లో ఉన్న మా పెద్దమ్మ ఇంటికి వెళ్లడం కోసం మేమిద్దరం గౌలిగూడ బస్టాండ్‌లో బస్సు దిగాం.

నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ గౌలిగూడ బస్టాండ్ ఒక అద్భుతం! అది భారీ ఇనుప గ్రిడర్లతో నిర్మించిన భారీ డోమ్ (గుమ్మటం) ఆకారంలో ఉండేది. ఆసియాలోనే అతిపెద్ద ఇనుప కట్టడాలలో అది ఒకటి అని చెప్పుకునేవారు. నాకంటే ముందే హైదరాబాద్ చూసిన నా తమ్ముడు రవి కళ్ళు పెద్దవి చేసి చెప్పిన మాట “అక్కా! ఆ డోమ్ కింద నిలబడితే మనం చాలా చిన్న చీమల్లా కనిపిస్తాం తెలుసా!” బాగా గుర్తుంది. వాడు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయిన నేను, నిజంగానే ఆ డోమ్ కింద నిలబడి, పైకి చూస్తూ ఉండిపోయాను. అంత పెద్ద నిర్మాణం, దాని కింద వందలాది బస్సులు, వేలాది మంది జనం… నా పల్లెటూరి కళ్లకు అదో వింత లోకంలా అనిపించింది.

రావూస్ ట్యుటోరియల్స్… కోఠి వీధుల కోలాహలం

ఫెయిల్ అయిన ఫిజిక్స్ సబ్జెక్ట్ పూర్తి చేయడం కోసం నన్ను బ్యాంక్ స్ట్రీట్, అబిడ్స్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ “రావూస్ ట్యుటోరియల్” లో చేర్పించారు. మూసారాంబాగ్ నుంచి రోజూ ట్యుటోరియల్‌కి వెళ్లడం నా దినచర్యగా మారింది. అప్పట్లో సిటీ బస్సు ప్రయాణం ఒక మంచి అనుభూతి. మూసారాంబాగ్‌లో 152 నంబర్ లేదా 156 నంబర్ బస్సు ఎక్కి బ్యాంక్ స్ట్రీట్ లో దిగేదాన్ని. కొన్నిసార్లు 96 నంబర్ బస్సు దొరికేది. కోఠిలో దిగి నెమ్మదిగా అబిడ్స్ వైపు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. క్లాసులు అయిపోయాక తిరిగి బ్యాంక్ స్ట్రీట్ లేదా కోఠి లో బస్సు ఎక్కేదాన్ని.

కోఠి బస్ స్టాప్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఎక్కువ బస్సులు దొరకడం ఒక కారణమైతే, ఆ ప్రాంతంలోని కోలాహలం చూడాలనిపించడం మరో కారణం. అట్లా గుంపులు గుంపులుగా జనం వచ్చే బస్సులు తోసుకుంటూ  ఎక్కుతూ, దిగుతూ, నిలబడి కబుర్లు చెప్పుకుంటూ, ఎటో ఆలోచిస్తూ చూస్తూ .. రకరకాల మనుషులు.. వారిని ఇలా చూడటం నాకు  సరదా.

ప్రసిద్ధ కోఠి ఉమెన్స్ కాలేజీ గోడ వారగా పాత పుస్తకాల దుకాణాలు వరుసగా ఉండేవి. పాత నవలలు, అకాడమీ పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ బుక్స్… ఆ పుస్తకాల వాసన, వాటిని వెతికే కుర్రాళ్లు, పెద్దవాళ్ళలో మహిళలు ఎక్కువ కనిపించేవారు కాదు. అయినా ఆ జనం నన్ను ఆకట్టుకునేవారు.  సాయంత్రం వేళల్లో ఉమెన్స్ కాలేజీ గేట్లు తెరుచుకోగానే గుంపులు గుంపులుగా, రంగురంగుల సీతాకోకచిలుకల్లా బయటకు వచ్చే విద్యార్థులు, వారి నవ్వులు, కబుర్లు చూస్తూ బస్ స్టాప్ వైపు నడవడం నాకెంతో ఇష్టం గా ఉండేది. ఇక రోడ్డుకు ఇటువైపు చూస్తే  ఆంధ్రాబ్యాంక్, గోకుల్ చాట్, పక్కనే గాంధీ గ్యాన్ మందిర్.

డబుల్ డెక్కర్ బస్సు: కలల వాహనం

హైదరాబాద్ వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సును చూడటం, అందులో ప్రయాణించడం అంటే నాలాంటి  వారికి ఒక పెద్ద వైభోగం. అది కేవలం ఒక ప్రయాణ సాధనం కాదు, మధ్యతరగతి కలల వాహనం అనొచ్చేమో! ఆ బస్సు దూరంగా వస్తుంటేనే ఉత్సాహం, ఆనందం. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ రూట్‌లో ఈ బస్సులు ఎక్కువగా నడిచేవి. దురదృష్టవశాత్తూ, మలక్‌పేట రైల్వే బ్రిడ్జ్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల నేను వెళ్లే మూసారాంబాగ్ రూట్‌లో ఈ డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేవి కావు. అది నాకు చాలా బాధగా ఉండేది.  మొదట్లో నాకు ఆ బస్సు ఎక్కే అవకాశం రాలేదు. కానీ, ఆ తర్వాతెప్పుడో ఒక రోజు ప్రత్యేకంగా సమయం చూసుకుని ఆ బస్సు ఎక్కి నా కోరిక తీర్చుకున్నా. బ్యాంక్ స్ట్రీట్ లో అఫ్జల్ గంజ్ వెళ్లే డబుల్ డెక్కర్ ఎక్కి అఫ్జల్ గంజ్ దిగి అక్కడనుంచి పురానాపూల్ మీదుగా నడిచి మూసీకి ఆవలి వైపు కి వెళ్లి చార్మినార్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే 72 బస్ ఎక్కి మూసారాంబాగ్ లో దిగడం ఆ రోజుల్లో నేను చేసిన అడ్వెంచర్.

డబుల్ డెక్కర్ బస్సు ఆగీ ఆగగానే, కింద ఎక్కేవాళ్ల తోపులాటను తప్పించుకుంటూ అందరి చూపులు ఆ లోపల ఉండే చిన్న, ఇరుకైన వంకర మెట్ల మీదే ఉండేవి. ఆ వంకర మెట్లు ఎక్కి రెండో అంతస్తుకు వెళ్లడం ఒక సాహసం, ఒక అద్భుతం! మెట్లు ఎక్కుతూ  “దేవుడా .. దేవుడా! పైన ముందు  సీటు ఖాళీగా ఉండాలి” అని పదే పదే అనుకున్నా కానీ ఆ దేవుడు కరుణించలేదు. ముందు వరుస సీటు దొరకలేదు.

మెట్లు ఎక్కి పైన అడుగు పెట్టినప్పటి నుంచీ నా కళ్లు ఒక రేడార్‌లా, స్కానర్‌లా ఖాళీ సీట్ల కోసం వెతికాయి. వచ్చే స్టాప్ లో దిగడానికి ముందు నుంచి లేచారు ఒకరు.  ఆ ముందు వరుసలో, ఆ పెద్ద అద్దం పక్కన సీటు దొరికింది. ఏదో ప్రపంచ యుద్ధం గెలిచినంత సంబరం! ఆ పెద్ద అద్దం ముందు కూర్చుంటే రోడ్డు మీద వెళ్లే ట్రాఫిక్, మనుషులు అంతా మన కాళ్ల కింద ఉన్నట్లు అనిపించింది.  మేడ మీద నుంచి ఊరేగింపును చూస్తున్నట్లు ఉంది.  పక్కనే నిలబడ్డ వాళ్ల వైపు “చూశారా, నాకు ముందు సీటు దొరికింది” అన్నట్లు ఒక గర్వంతో కూడిన చూపు విసిరా.  ఆ తర్వాత చాలాసార్లు డబుల్ డెక్కర్ బస్ ఎక్కినా మొదటి అనుభవం ఇచ్చిన కిక్కే వేరు.

ఒక్కోసారి, మెట్లు ఎక్కి తీరా పైన చూస్తే సీట్లన్నీ నిండిపోయి ఉంటే… ఆ నిరాశ వర్ణనాతీతం. ముఖం చిన్నబోయేది. అయినా ఓటమి ఒప్పుకోకుండా ఎవరో ఒకరి సీటు పక్కన స్టాండింగ్ లో నిలబడే వాళ్లం. నిలబడి ఉన్నా మన కళ్లన్నీ కూర్చున్న వాళ్ల కదలికల మీదే ఉండేవి. ఎవరైనా సంచి సర్దుకుంటున్నా, లేదా టికెట్ తీసి గమ్యం చూసుకుంటున్నా… వాళ్ళు తర్వాత స్టాపులో దిగిపోతారేమో అని ఆశగా వాళ్ల వైపు చూసేదాన్ని. వాళ్లు దిగడానికి కొద్దిగా లేవగానే, చిరుత పులిలా దూకి వాళ్ళ సీటు మీద మన చెయ్యి లేదా రుమాలు వేసి రిజర్వ్ చేసుకోవడం అప్పట్లో ఒక గొప్ప విద్య! సందె వెలుగుల్లో  ఆ బస్సు వెళ్తుంటే, కింద నడిచి వెళ్లే పాదచారులను, రంగురంగుల దుకాణాలను ఆ ఎత్తు నుంచి చూడటం ఒక వైభోగంగా ఉండేది.

Oplus_131072

కొత్త స్నేహాలు… అమాయకపు రుచులు

రావూస్ ట్యుటోరియల్స్‌లో నాకు కొత్త కొత్త స్నేహాలు కుదిరాయి. క్లాస్ అవ్వగానే ఇంటికి వెళ్లకుండా స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం ఒక అలవాటుగా మారింది. పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన నాకు ఆ నగరపు పిల్లల మాటలు చాలా వింతగా, కొత్తగా అనిపించేవి. వాళ్లు లాడ్ బజార్ గాజుల గురించి, గోకుల్ చాట్ రుచుల గురించి, ‘చాకో బార్’ గురించి, నౌబత్ పహాడ్ గురించి మాట్లాడుకుంటుంటే నాకేమీ అర్థమయ్యేది కాదు.

మా ఊళ్లో నాకు తెలిసిందల్లా వీధిలో సైకిల్ వాడి దగ్గర కొనే ఎర్రటి, తెల్లటి ‘ఐస్ ఫ్రూట్’ (పుల్ల ఐస్) మాత్రమే. అంతకు మించి ఐస్ క్రీముల్లో రకాలు ఉంటాయని నాకు తెలియదు. చాక్లెట్ ఐస్ క్రీమ్,  చాకో బార్ వంటి అనేక కొత్త పదాల్ని నేను మొదటిసారి ఆ ట్యుటోరియల్‌లోనే విన్నాను. ఒకరోజు రేణుక యాదవ్ అనే  మిత్రురాలు  తన పుట్టినరోజు అని మా అందరికీ తలా ఒక చాకో బార్ కొనిచ్చింది. ఆ పైనున్న చాకోలెట్ పొరను కొరుకుతూ, లోపలి వెనిలా ఐస్ క్రీం కరిగిపోతుంటే, అది కింద పడకుండా నాలుకతో అదుపు చేస్తూ మేము తిన్న తిండి… ఆ తినడం వెనుక ఉన్న అమాయకత్వం, ఆనందం గుర్తొస్తే ఇప్పటికీ నా పెదవులపై చిన్న నవ్వు విరుస్తుంది.

అలాగే చిత్తూరు నుంచి వచ్చిన స్నేహితురాలు ఇందిర ఒకరోజు చేతుల నిండా మెరిసిపోయే రంగుల గాజులు వేసుకు వచ్చింది. “ఇవి లాడ్ బజార్ గాజులు” అని చాలా మురిపెంగా చెప్పింది. చార్మినార్ పక్కన ఉండే ఆ ఇరుకైన గల్లీల్లో, రెండు వైపులా ఉన్న షాపుల్లో, లైట్ల వెలుతురు మధ్య ఆ గాజులు మెరుస్తుంటే కళ్లు చెదిరిపోతాయని, అదో ప్రత్యేక ప్రపంచమని తను చెప్తుంటే మొదట విన్నాను. ఆ రంగు రంగుల రాళ్లు పొదిగిన గాజులు కొనుక్కోవాలనే ఆశ కలగలేదు కానీ, జీవితంలో ఒక్కసారైనా ఆ ‘లాడ్ బజార్’ వీధి చూడాలని మనసులో బలంగా అనుకున్నాను.

1979 నాటి సినిమా ప్రపంచం ఒక రంగుల కల

1979 నాటి హైదరాబాద్ సినిమా ప్రపంచం అంటే ఒక రంగుల కల. ఈరోజు మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి, అరచేతిలోనే ఓటీటీ లు ఉన్నాయి. కానీ అప్పట్లో వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే. కాచిగూడ చౌరస్తా, అబిడ్స్, కోఠి ప్రాంతాల్లో థియేటర్ల వద్ద వాతావరణం నిత్యం ఒక పండగలా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా ఆడేవి.

అప్పట్లో బాలచందర్ గారి ‘మరోచరిత్ర’ సినిమా గురించిన చర్చ మా గ్రూప్‌లో విపరీతంగా జరిగేది. ఆ సినిమాలో నటించిన నటి మాధవి గారి చెల్లెలు మా బ్యాచ్‌లోనే ఉండేది. దాంతో మా గ్రూప్‌లో ఆమెకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. తనే హీరోయిన్ అన్నంత బిల్డప్ ఉండేది, ఆమె వేషధారణ కూడా అలాగే ఉండేది.

అప్పటి కాలపు ఫ్యాషన్ కూడా చాలా విచిత్రంగా ఉండేది. నేను, నాలాంటి ఒకరిద్దరు సాంప్రదాయబద్ధంగా లంగా-జాకెట్, ఓణీలతో వచ్చేవాళ్ళం. కొందరు అమ్మాయిలు చీరలు కట్టేవారు. కానీ ధనిక కుటుంబం నుంచి వచ్చిన నగర యువతులు కొందరు బెల్ బాటమ్ ప్యాంట్లు, మ్యాక్సీ అని పిలిచే గాగ్రా లాంటి పొడవాటి దుస్తులు వేసుకునేవారు. చుడిదార్ లు అప్పట్లో చాలా అరుదు,  మగపిల్లల సంగతి చెప్పక్కర్లేదు… కింద పెద్దగా లూజ్ ఉండే బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద పెద్ద పూల డిజైన్లు ఉన్న పూల చొక్కాలు వేసుకుని, తల నిండా జుట్టుతో హిప్పీ కటింగ్ తో తిరిగేవారు.

ఎన్టీఆర్ ఇంటి గేటు ముందు సులేఖ నిరీక్షణ

సినిమా హీరోల గురించి, వాళ్ళ పోస్టర్ల గురించి క్లాస్ కి క్లాస్ కి మధ్య ఉన్న గ్యాప్ లో తెగ మాట్లాడుకునేవాళ్లం. మా ట్యుటోరియల్స్ నుంచి ఎడమవైపు అంటే అబిడ్స్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే, రోడ్డుకు ఎడమ చేతి వైపు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి ఇల్లు ఉండేది. .

మా స్నేహితురాలు సులేఖ ప్రతిరోజూ ఆ గేటు వంక బస్ లోంచి ఆశగా చూసేది. “ఇప్పుడు సరిగ్గా ఆ గేటు తెరుచుకుంటుందేమో… ఆ మెరిసిపోయే తెలుపు రంగు అంబాసిడర్ కారు బయటకు వస్తుందేమో… వెనక సీట్లో ఆ ఆజానుబాహుడు, దైవాంశ సంభూతుడు కూర్చుని ఉంటాడేమో… ఆయన మన వైపు చూసి ఆ నవ్వు నవ్వుతారేమో…” అని తను పగటి కలలు కనేది. ఆ గేటు దగ్గర నిలబడే సెక్యూరిటీ గార్డును చూసినా, లోపల మొక్కలకు నీళ్లు పెట్టే తోటమాలిని చూసినా… “అబ్బా! వీళ్లు ఎంత అదృష్టవంతులు, రోజూ ఆయనను చూస్తారు” అని మనసులో ఒక రకమైన ఈర్ష్య కలిగేదట. “ఎన్టీ రామారావు గారు ఏదో ఒకరోజు కనపడకపోతారా అని నేను ఈ రావూస్ ట్యుటోరియల్‌లో చేరాను, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన దర్శనం కాలేదు” అని సులేఖ చాలాసార్లు బాధపడేది.

అప్పట్లో రావూస్ దాటి ముందుకు నేనెప్పుడూ వెళ్లలేదు కానీ, నా మిత్రులు మాత్రం ఫతే మైదాన్, పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ, అప్పట్లో నౌబత్ పహాడ్ కొండపై కొత్తగా కట్టిన బిర్లా మందిర్ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వినేదాన్ని. సిటీ బస్సుల బోర్డులపై ‘ఫతే మైదాన్’ అని రాసి ఉంటే చూసేదాన్ని. అవన్నీ ఆనాటి నగర నడిబొడ్డున కీలకమైన గుర్తులు.

గోకుల్ చాట్- హైదరాబాద్ సంస్కృతికి చిరునామా

నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ‘గోకుల్ చాట్’ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొదటిసారి నేను గోకుల్ చాట్‌లో మిర్చి బజ్జీలు తిన్నది ఆ ట్యుటోరియల్స్ రోజుల్లోనే. ఆ తర్వాత కాలంలో నేను పెళ్లయి, పిల్లలు పుట్టాక… అమ్మతోనో, చెల్లెళ్లతోనో, మిత్రులతోనో కలిసి కోఠిలో షాపింగ్ చేసుకుని ఎన్నిసార్లు గోకుల్ చాట్‌కి వెళ్లినా, ఆ మొదటిసారి తిన్న మిర్చి బజ్జీ రుచే వేరు!

ఈ రోజుల్లో నగరంలో వందల రకాల చాట్ సెంటర్లు వచ్చాయి కానీ, నాటి గోకుల్ చాట్ ఒక సంచలనం. ఆ గల్లీల్లో వ్యాపించే ఆ ఘాటైన మసాలా వాసన… కోఠి వీధుల్లో నడిచిన ఎవ్వరూ తమ జీవితంలో మర్చిపోవడం సాధ్యం కాదు. గోకుల్ చాట్ అంటే కేవలం ఒక తినుబండారాల షాప్ కాదు, అది హైదరాబాద్ సంస్కృతికి, ఉమ్మడి జీవనానికి ఒక చిరునామా.

ఎప్పుడు చూసినా చుట్టూ జనం కిక్కిరిసి ఉండేవారు. అప్పట్లో గోకుల్ చాట్ దగ్గర నిలబడితే వయసుతో, హోదాతో పనిలేదు… అందరూ సమానమే. పక్కనే ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు, పుస్తకాల కోసం వచ్చిన కుర్రాళ్లు, ఆఫీసు పని ముగించుకుని రిలాక్స్ అవ్వడానికి వచ్చే పెద్దమనుషులు, షాపింగ్ బ్యాగులతో అలసిపోయిన మహిళలు… ఇలా అందరితో ఆ ప్రాంతం కిటకిటలాడేది. ఒకరినొకరు తగులుతున్నా, ఆ తోపులాటలో కూడా ఎవరూ కోప్పడేవారు కాదు. అందరి లక్ష్యం ఒక్కటే, ఆ రుచికరమైన చాట్ తినడం!

కౌంటర్‌లో డబ్బులు కట్టి టోకెన్ తీసుకున్నాక, ఆ బజ్జీల కౌంటర్ వైపు కళ్లు కాయలు కాచేలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం, స్పెషల్ మసాలా నింపిన ఆ వేడి వేడి మిర్చి బజ్జీని విస్తరాకులో వేసి చేతిలో పెట్టగానే ఏదో అంతరిక్షాన్ని జయించినంత అనుభూతి కలిగేది. వాళ్లిచ్చే ఆ ప్రత్యేకమైన చట్నీ రుచి గోకుల్ చాట్ తప్ప ప్రపంచంలో మరెక్కడా దొరకదేమో! అక్కడ పనిచేసే సర్వర్లు చాలా వేగంగా ఉండేవారు. చేతిలో ఐదారు ప్లేట్లు పట్టుకుని గారడీ చేస్తూ, వారి నోటి వెంట వినిపించే హైదరాబాదీ హిందీ ఒక ప్రత్యేక ఆకర్షణ. “క్యా హోనా మామ్ సాబ్?” అని వాళ్లు అడుగుతుంటే ఒక రకమైన ఉత్సాహం వచ్చేది. అక్కడ కూర్చోవడానికి చోటు దొరకడం గగనంగా ఉండేది, అందుకే  నిలబడి తినడమే అప్పట్లో ఒక పెద్ద ఫ్యాషన్!

సులేఖ, ఇందిర, ఇంద్రాణి… ఇలా నా అప్పటి మిత్రులందరం కలిసి మొదటిసారి గోకుల్ చాట్‌కి వెళ్లి, ఆ వేడి బజ్జీలు తింటూ నవ్వుకున్న క్షణాలు నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి.

ఆగస్టు 25, 2007: గోకుల్ చాట్ చరిత్రలో చీకటి రోజు

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 2007 ఆగస్టు 25వ తేదీ… గోకుల్ చాట్ చరిత్రలోనే కాదు, మొత్తం హైదరాబాద్ చరిత్రలోనే ఒక అత్యంత చీకటి రోజు. నేను ఎంతో ఇష్టంగా వెళ్లే ఆ గోకుల్ చాట్ మీద, ఒక శనివారం సాయంత్రం వేళ, కాలయముడు బాంబు రూపంలో విరుచుకుపడ్డాడు. ఉగ్రవాదులు పెట్టిన ఆ బాంబు పేలుడు తో నిమిషం క్రితం వరకు నవ్వులు, కబుర్లు, పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా స్మశానం గా మారిపోయింది. రక్తసిక్తమైన దేహాలు, తెగిపడిన అవయవాలు… దుకాణంలోని అద్దాలు పగిలి, మేము ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలన్నీ రోడ్డుపై రక్తం ముద్దల మధ్య చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఆ దారుణమైన పేలుడులో 32 మందికి పైగా అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ వార్త టీవీలో చూసినప్పుడు నా గుండె ఆగిపోయినంత పనైంది. నా చిన్ననాటి స్నేహాలు, ఆ మధురమైన రుచులు తిరిగిన చోట అంత రక్తపాతమా! ఆ బాంబు దాడి కేవలం గోకుల్ చాట్ మీద జరిగిన దాడి కాదు, హైదరాబాద్ నగర ఆత్మ మీద, ఇక్కడి శాంతి సౌభ్రాతృత్వాల మీద జరిగిన దాడి.

కానీ హైదరాబాద్‌కు ఒక గొప్ప గుణం ఉంది… అది ఎన్ని దెబ్బలు తిన్నా మళ్లీ లేచి నిలబడుతుంది, గాయాలను మాన్పుకుని కోలుకుంటుంది. కొన్ని నెలల తర్వాత గోకుల్ చాట్ మళ్లీ తెరుచుకుంది. కొత్తగా నగరంలో ఎన్ని వందల ఆధునిక చాట్ సెంటర్లు వచ్చినా, ప్రజలు మళ్లీ పాత పద్ధతిలోనే అక్కడికే వెళ్లి ఆ రుచిని ఆస్వాదించడం ప్రారంభించారు. అది కేవలం ఒక తిండి మీద ఉన్న మోహం కాదు, ఆ ప్రాంతం మీద, హైదరాబాద్ అస్తిత్వం మీద నగర ప్రజలకు ఉన్న అమరమైన ప్రేమకు నిదర్శనం.

1979: కర్ఫ్యూ అనే పదం పరిచయమైన వేళ

1979 నాటి కర్ఫ్యూ ముచ్చట చెప్పనే లేదు కదూ! నేను రావూస్ ట్యుటోరియల్స్‌లో చేరి కొద్ది రోజులు గడిచాయో లేదో… పాతనగరంలో మతపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల నగరంలో ‘కర్ఫ్యూ’ ప్రకటించారని వార్త.  కాసేపటిలోనే నగర వాతావరణం 180 డిగ్రీలు మారిపోయింది. ఎప్పుడూ సందడిగా, రద్దీగా ఉండే రోడ్లన్నీ ఒక్కసారిగా బోసిపోయాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు అన్నీ మూతపడ్డాయి. (ఇటీవల మనం చూసిన కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో విధించిన కర్ఫ్యూ వాతావరణం ఎలా ఉందో, సరిగ్గా అప్పుడు అలాగే ఉందన్నమాట).

అప్పటి వరకు ‘కర్ఫ్యూ’ అంటే ఏమిటో, దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలియని అమాయకపు వయసు నాది. ఆ రోజు క్లాసు పూర్తవకుండానే అందరినీ ఇళ్లకు పంపించేశారు. బ్యాంక్ స్ట్రీట్ లో బస్సు ఎక్కడం కష్టంగా ఉంది. కోఠి వైపు నడక ప్రారంభించా.  కోఠి ఉమెన్స్ కాలేజీ ముందు వేలాది మంది విద్యార్థినుల సందడి ఒక్కసారిగా మాయమైపోయింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే జనం క్రమంగా తగ్గిపోయారు. సైకిళ్లపై ఆఫీసు పనులు ముగించుకుని వెళ్లేవాళ్లు లేరు. సిటీ బస్సులు, దూరప్రాంత బస్సుల హారన్ల చప్పుడు లేని ఆ నిర్మానుష్యమైన ఖాళీ రోడ్లు చూస్తుంటే భయం వేసింది.

రోడ్ల మీద తుపాకులు పట్టుకున్న పోలీసులు, ఆర్మీ జవాన్లు పహారా కాస్తూ కనిపిస్తుంటే గుండెల్లో ఏదో తెలియని వణుకు మొదలైంది. అంతలోనే నాలో ఒక మొండి ధైర్యం వచ్చింది… ఎలాగైనా సరే ఇంటికి చేరాలి అని.

నేను కోఠి నుంచి మూసారాంబాగ్ వెళ్లాలి. బస్సులు లేవు, కనీసం ఒక రిక్షా కూడా లేదు. రోడ్డు మీద సాధారణ జనం లేరు.  నడుస్తూ ఇసామియా బజార్ గల్లీలలో చూస్తే అంతా శ్మశాన నిశ్శబ్దం. అక్కడ మా బాబాయ్ ఇల్లు ఉంటుందని నాకు తెలుసు, కానీ ఆ గల్లీల్లో అడుగుపెట్టాలంటే సంశయంగా, భయంగా అనిపించింది. రోజూ ఆ వీధుల్లో గోళీలు ఆడుతూనో, కేకలు వేస్తూనో కనిపించే పిల్లలు లేరు. నింపాదిగా పనులు చేసుకునే సాదాసీదా మనుషులు లేరు, పండ్లు అమ్మే బండ్లు ఏవీ లేవు. సాధారణ రోజుల్లో ఆ షాపుల దగ్గర, గల్లీల్లో మనుషుల మధ్య ఒక తెలియని నమ్మకం, ఆత్మీయత ఉండేది. కానీ అవన్నీ మాయం చేస్తూ, మనుషుల మధ్య అపనమ్మకం అనే పెద్ద గోడలు కట్టింది ఆ కర్ఫ్యూ!

మూసీ నదిపై ఉన్న చాదర్‌ఘాట్ పాత వంతెన పై వెళ్ళాలి. అప్పుడు ఒక పెద్ద చెక్ పోస్ట్‌గా మార్చారు. పాతబస్తీలోని ఉద్రిక్తతల సెగలు ఇటువైపు రాకుండా ఉండటానికి అక్కడ భారీ బారికేడ్లు వేసి, ఆర్మీ వాళ్ళు పహారా కాస్తున్నారు. ఆ నిర్మానుష్యమైన, నిశ్శబ్దమైన వంతెన మీద నేను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే… వెనుక నుంచి ఏదైనా పోలీస్ జీపు సైరన్ వినబడితే చాలు, నా ప్రాణాలు గుప్పెట్లోకి వచింది. ‘ఎందుకు బయటకు వచ్చావు?’ అని అడిగి, ఎక్కడ కాల్చేస్తారో అన్న భయం వేసింది. అలా భయపడుతూ, వణుకుతూ ఎలాగోలా నడుచుకుంటూ నేను ఇంటికి వెళ్లేసరికి… పెద్దమ్మ రేడియో వార్తల కోసం ఎదురుచూస్తూ, నాకోసం విపరీతమైన కంగారుతో గుమ్మం దగ్గరే నిలబడి ఉంది. నన్ను చూడగానే ఆవిడ కళ్లలో నీళ్లు తిరిగాయి. నన్ను గట్టిగా కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్లింది.

 

అట్టర్ ప్లాప్ అయిన సినిమా ప్లాన్

అప్పట్లో థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద హీరోల కటౌట్లు, వాటి కింద అభిమానులు వేసిన భారీ పూలమాలలు, నిత్యం వేలాది మందితో, ఈలలు, గోలలతో హోరెత్తే వాతావరణం ఉండేది. టికెట్ల కోసం కిటికీల దగ్గర కొట్లాడే యువత, వారిని అదుపు చేయడానికి పోలీసులు చేసే లాఠీచార్జీలు… ఇవన్నీ ఆనాటి సినిమా క్రేజ్‌కు నిదర్శనాలు.

నిజానికి ఆ కర్ఫ్యూ రాకపోయి ఉంటే, ఆ మరుసటి రోజు మేమంతా (స్నేహితులం) కలిసి అబిడ్స్‌లో ఉన్న ‘సాగర్ థియేటర్’ లో ఒక హిందీ సినిమాకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈ కర్ఫ్యూ పుణ్యమా అని మా ప్లాన్ కాస్తా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది!

కర్ఫ్యూ కారణంగా ఇళ్లలోనే బందీలుగా ఉన్న వాళ్లకి ఇప్పటిలా కాలక్షేప సాధనాలు ఎక్కడివి? కనీసం టీవీగానీ, ఫోన్‌గానీ సామాన్యుల ఇళ్లలో లేని రోజులవి. సమాజంలో ఉన్న ఏకైక అతిపెద్ద వినోదం సినిమా మాత్రమే. ఆ వినోదమే లేకుండా పోయేసరికి ఇళ్లల్లో సమయం గడవడం నరకంలా ఉండేది. కర్ఫ్యూ ఎప్పుడు ఎత్తుతారా, మళ్లీ ఎప్పుడు థియేటర్ లోపల ఆ చీకటిలో వెండితెర వెలుగులు చూస్తామా అని ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. కర్ఫ్యూ సడలింపు వార్తల కోసం, అసలు నగరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాకు ఉన్న ఏకైక ఆధారం ఆ రేడియో మాత్రమే!

నాటి హైదరాబాదీ భాష-యాస: ఒక నవాబీ హుందాతనం

1979 నాటి హైదరాబాద్ భాష, యాస గురించి మాట్లాడుకుంటే అదో అద్భుతమైన మిశ్రమం. అప్పట్లో హైదరాబాద్‌లో వినిపించే తెలుగు కేవలం ఒక భాష కాదు, ఆ యాసలో ఒక రకమైన నవాబీ హుందాతనం, ఉర్దూ కలిసిన తీపిదనం స్పష్టంగా తెలిసేవి. మతాలకు అతీతంగా అందరూ ఒకే భాష మాట్లాడేవారు.

వయసులో పెద్దవాళ్లను ఎంతో గౌరవిస్తూ ‘సాబ్’ అని పిలవడం, సోపతిగాళ్లను ‘ఏందిరా బై’ అంటూ పలకరించడం, చిన్న పిల్లలను ‘ఓ పొల్లా’, ‘పోరగాడా’ అని పిలవడం అప్పట్లో ఒక ఆత్మీయతకు గుర్తు. అలాగే ‘కాకో’ (పిన్ని/అత్త), ‘ఖాలా’, ‘భాయ్’ అనే పిలుపులు మతంతో సంబంధం లేకుండా అందరి ఇళ్లల్లోనూ వినిపించేవి.

“నక్రాల్!”, “బేజారు” ‘ బై”, “ఖతమ్”, “కైకో “, “నకో “, వంటి పదాలు అప్పటి హైదరాబాదీ తెలుగు భాషలో ఎంతగానో కలిసిపోయి ప్రతి నోటా వినిపించేవి. అప్పట్లో మనుషుల మాటల్లో ఒక రకమైన నిమ్మళం, నిశ్శబ్దం, వినయం స్పష్టంగా కనిపించేవి.

*

శాంతిప్రబోధ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.