కదా మరి…..

నసులు రెండు

వేరుగా ఓదాని చుట్టూ ఒకటి

ఉత్తగ తిరగడం కాదు

గట్టిగా ఒక్కటిగ

సంలీనం చెందాలి కదా!

అప్పుడే సంసిద్ధత

కండ్లూ కండ్లు కలిసి

ఇద్దరూ ఊకె సూసుకుంట

మురుసుడు కాదు

జప్పున ఊహాలోకంలో ఎగిరి

అమాంతం హత్తుకోవాలి కదా !

అప్పుడే తాదాత్మియత

మనుషులిద్దరూ కలుసుకొని

గాలిలో ఖాళీ కరచానాలు

ఊపుకునుడు కాదు

దేహాలు చెక్కల్ గులగుల

చేసుకుంటేనే కదా!

అప్పుడే ఏకాత్మత

రెండు హృదయాలు

లయాత్మకంగా

శబ్దాలు చేయడమే కాదు

బిగ్గరగ దగ్గర దగ్గరైన

లవ్వు ధ్వనించాలి కదా!

అప్పుడే సౌందర్యాత్మకత

ఆలోచనా లోచనలు

వేటికవే పారడం కాదు

నిదానంగా ప్రవహించి ప్రవహించి

సముద్రమయ్యేందుకు

ఒక్క నదిలో కలిసిపోవాలి కదా!

అప్పుడే చలన శీలత

రెండు దేహాత్మలు

వేరువేరు గదుల్లోని నిద్రలు కాదు

ఒకే అర్ర ఒకే మంచం

ఒకే దుప్పటి కప్పుకుంటేనే

ఆనందం చిందులు వేస్తుంది కదా!

అప్పుడే సంసార సాఫల్యత.

*

అన్నవరం దేవేందర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.