అమ్మమ్మ @100

తమానం భవతి! శతాయుష్మాన్ భవ!
అంటారే కానీ అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు.

ఆ అదృష్టం వరించిన
అమ్మమ్మ నూరో వసంతం లోకి అడుగుపెట్టింది

నూరేళ్లు బతకటమంటే
ఉవ్వెత్తున ఎగసిపడే జీవనోత్సాహన్ని
బ్రతుకుపొడుగునా విస్తరించుకుంటూ పోవడమే

నిర్మలమైన నవ్వుతో
ప్రేమానురాగాల్ని వితరణ చేస్తూ
చేసిన నూరేళ్ల ప్రయాణం
వయసు చెప్పే కథ కాదు;
విలువలు నిలబెట్టిన చరిత్ర,
ప్రేమను పంచిన పరిమళం,
సేవను జీవించిన సందేశం.

సైమన్ గో బ్యాక్ నినాదాల మధ్య పుట్టిన నువ్వు
ఓ జ్ఞాపకాల పేటికవి
కదిలిస్తే కథలు కథలుగా అనుభవాల పక్షులు
కూవకువలాడుతూ చెవులముందు వచ్చి వాలతాయి

సినిమాల్ని కాలదన్ని పుస్తకాలు చేతబట్టి
వేలాదిమంది విద్యార్థుల జీవనయానానికి
బాటలు వేసిన నువ్వు
చేయి పట్టుకొని దిద్దించిన
అక్షరాల పరిమళం
దిగ్దిగంతాలకు వ్యాపించి
కాలపు సింహాసనంపై నిన్నదిష్టింపజేసాయి

శరీరానికి ముడుతలు
తలపైన వెండి కిరీటం సమాకూరినా
ముఖం పైన స్వచ్ఛత
మనసులోని వెలుగు
మాటలోని రేపటి చూపు
ఇప్పటికీ నిత్య వసంతమే.
దేహానికంటిన వయసు
మనసుకంటించుకోకపోవడమే
నీలోని చతురత

నీ జ్ఞాపకశక్తి కి పరీక్ష పెట్టాలనుకొని
ఎవరైనా వచ్చి నేనెవర్ని అని అడుగుతారా;
పేరు చెప్పకుండానే ఒసేయ్ నిన్ను గుర్తుపట్టలేనంటే
అని నవ్వుతావ్ చూడు
అప్పుడు చూడాలి నిన్ను……
ఇప్పటి విషయాలేమో గానీ
నీ బాల్యపు, యవ్వనపు, ప్రౌఢత్వపు
ఎప్పటిప్పటి సంగతులో సుళ్లు తిరుగుతూ
మాటల తరంగాలై నిలుస్తాయి.

నీతో మాట్లాడటమంటే
ఒక చరిత్రతో మాట్లాడటం
ఒక కాలంతో మాట్లాడటం
ఒక జ్ఞానం తో మాట్లాడటం
వర్తమానపు పునాదులతో మాట్లాడటం
నీ శతకాలపు వాక్కులకు వందనం.

*

కోగంటి ఉమారాణి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.