ప్రతి ఏడు వచ్చే నూతన సంవత్సరానికి చూడని ప్రదేశాలకి వెళ్లడానికి మేము సరదాపడుతుంటాం. ఈసారి అంటే 2026లో ప్రవేశానికి ఎక్కడుందామా, ఎక్కడికి వెళదామా అని ఆలోచించి చివరికి పెంచ్ టైగర్ రిజర్వ్ లో నాలుగు రోజులు గడిపి వచ్చాము.
పెంచ్ పులుల సురక్షిత క్షేత్రం రెండు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) విస్తరించి ఉంది. అదే ప్రాంతంనుండి ప్రవహిస్తున్న పెంచ్ అనే నది పేరన పులుల క్షేత్రానికి పేరు పెట్టారు. నాగపూర్ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్లు. జాతీయ రహదారి 44 పక్కనే కావున రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. మేము నిర్మల్ నుండి డిసెంబర్ 30, 2025 నాడు ఉదయం కార్లో బయలుదేరాం.
నిర్మల్లో మా ఇల్లు జాతీయ రహదారి పక్కనే! మూడువందల ఎనభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసాక మేము బుక్ చేసుకొన్న రిసార్ట్ కి మధ్యాన్నం రెండు గంటలకి చేరుకొన్నాం. రహదారిపై ప్రయాణమే ఒక మంచి అనుభవం. రెండుమూడు చోట్ల చిన్న రోడ్డు నిర్మాణ అసౌకర్యాలు తప్పితే రహదారంతా రాజమార్గమే! మావారికి కారు నడపడం ఎంతో ఇష్టం. ఇద్దరం కబుర్లతో, తెలుగు, హిందీ పాటల్ని వినుకుంటూ ప్రయాణ అలసట అన్నది తెలియకుండానే మా గమ్యస్థానానికి హాయిగా చేరుకొన్నాం.
లంచ్ రెడీగా ఉంది. కాస్త విశ్రాంతి తీసుకొని ఆసక్తితో ఎదురుచూస్తున్న పెంచ్ యాత్రకి శ్రీకారం చూట్టాం. చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిశీలించి అక్కడివారితో ముచ్చటించి స్థానికవివరాలని సేకరించాం. డిన్నర్ కోసం డైనింగ్ హాలుకి వెళితే క్రమశిక్షణతో ఉన్నయాత్రికులు. దేశం నలుమూలల నుండి వచ్చారు. వివిధ భాషలు మాకు వినిపించాయి. పిల్లలు పెద్దలతో పండగలా ఉండింది. ఒక గుజరాతి కుటుంభం నుండి నాలుగు తరాలవారు వచ్చారు. సీనియర్ వృద్ధజంటని చూస్తే ముచ్చటేసింది. వారిలో ఒక కోడలుది ఆదిలాబాద్ కావడంతో నాతో స్నేహం బాగా కుదిరింది.
మరునాడు 2025వ సంవత్సరపు చివరిరోజు -డిసెంబర్ 31. మా సఫారి యాత్ర ఉదయం ఆరుగంటలకు మొదలయ్యింది. రిసార్ట్ వారు బ్రేక్ ఫాస్ట్ ని చక్కగా ఒక బాస్కెట్లో పెట్టి సఫారి వాహనంలో పెట్టారు. అడవిలోకి ప్రవేశించే ముందటి ఫార్మాలిటీస్ డ్రైవర్ పూర్తి చేసాడు. అక్కడ గైడ్ మాతో చేరాడు.
గైడ్ తన పరిచయం చేసుకొని ఐదు గంటల సఫారి యాత్రకి మంచి ఉపోద్ఘాతాన్నిచ్చాడు. మేము అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా జవాబులిస్తూ చక్కగా అర్థం చేయించాడు. ఎన్నో వాహనాలు. అందరికీ పులిని చూడాలన్న ఆశ. దీని కోసమే దేశం నలుమూలలనుండి డబ్బుల్ని ఖర్చుపెట్టుకొని, బిజీ జీవితాలనుండి సమయం చిక్కించుకొని వన్యప్రాణుల్ని ప్రకృతి స్థావరాల్లో చూడడానికి వస్తారు.
జింకలు, దుప్పులు, కోతులు, కొండముచ్చులు తోవలో కనబడ్డాయి. రకరకాల పక్షులు, వాటి అరుపుల సంగీతాలతో మట్టి రోడ్డుపై జీపు ప్రయాణిస్తుంటే శరీరాలు వాటంతట అవే ఊగిపోయాయి! సెల్ ఫోన్ల రాకతో గైడ్లు ఎక్కడైనా పులి కదలికలు ఏ ఒక్క గైడ్ కి తెలిసినా వెంటనే అందరూ గైడ్లకి తెలిసిపోతుంది. జీపులన్నీ వెంటనే పులి కనబడిన వైపే స్పీడుగా వెళతాయి. అందరి కళ్లు పులులవైపు. రెప్పవాలిస్తే ఎక్కడ పులి వెళ్లిపోతుందోనన్న ఉత్కంట. బైనాకులర్స్, సెల్ ఫోన్లు, కేమరాలు, పొడగాటి టెలిస్కోప్ లెన్సులతో అప్రమత్తమై దుర్గాదేవి వాహనానికై చూపులు.
“ఆ గయా, నికల్ పడి, దేఖో, దేఖో…అటువైపు పోతుంది…” యాత్రికులందరు నిశబ్దంగా మహారాజులా, గంభీరంగా దూరంలో నడుస్తున్న పులి కనబడేంతవరకు కంటిరెప్పల్ని వాల్చకుండా చూడడంతో మనస్సులు నిండిపోయాయి. తృప్తి. యాత్ర సఫలమైనట్టుగా గుండెలోతుల్లో సంతోషాలు. మాకూ పులి చక్కగా కనబడింది. వాహనాలన్నీ ఎవరితోవన వారు వెళ్ళిపోయారు. మమ్మల్ని ఒక రాళ్ళ గుట్ట దగ్గరికి తెసుకెళ్లి పెద్ద రాయిపై బ్రేక్ ఫాస్ట్ సర్దారు. ప్రకృతిని, అందాల్ని చూస్తూ గడిపాం.
మా గైడు రెండు జంతువుల (కొండ ముచ్చులు, జింకలు) మధ్య ఉండే పరస్పర సంబంధాలని మాకు అడవిలో చూపాడు. కొండముచ్చులు అడవుల భూమిపై తిరుగుతున్నప్పుడు జింకలు శబ్దాల్ని చేసి క్రూరమృగాలనుండి అప్రమత్తం చేస్తాయట. కొండముచ్చులు చెట్ల శిఖరాలకి వెళ్ళి ఆకుల్ని తెంపి కిందకు వేస్తే జింకలు తింటాయి. ఇది మొదట నమ్మశక్యం కాలేదు. కొండముచ్చులున్న ఒక చోట గైడ్ ఆపి మాకు ఈ విచిత్రాన్ని చూపాడు. మేము ఈ ప్రక్రియని సెల్ ఫోన్లో బంధించాం. ఒక గుంపు కొండముచ్చులు పొడవైన చెట్టు చివరికి చేరి ఆకుల్ని తెంపి కిందకి వదులుతుంటే, కిందున్న జింకల గుంపు సంతోషంగా మేయడం మొదలుపెట్టాయి. మా వారు వెంటనే గూగుల్ చేసి, ఇలాటిది ప్రకృతిలో ఈ రెండు జంతువులమధ్య జరుగుతుందని నిర్దారణ చేసుకొన్నారు. ఈ చమత్కారాన్ని చూపినందుకు గైడుని మెచ్చుకొన్నాం. ఐదు గంటలు అరణ్యంలో గడిపి రిసార్ట్ కి చేరుకొన్నాం.
డిసెంబర్ 31 పగటినుండే రిసార్త్లో నూతన సంవత్సరవేడుకలకి తయ్యరీలు మొదలయ్యాయి. స్విమ్మింగ్ పూల్ ముందరి లాన్లో అలంకరణలు, లైట్లు, బెలూన్లు, సీట్ల అమరికలు, మ్యూజిక్ సిస్టమ్స్, బార్బేక్యూలు… ఒకటొకటిగా చేరుకొన్నాయి. కొన్ని గంటల్లో నూతనసంవత్సరం (2026) లోకి ప్రవేశం!
రిసార్టులో ఉన్న అతిథులు ఒక్కొక్కరు చేరుకొన్నారు. సంగీతం నేపథ్యంలో తన పని తాను చేసుకుపోతుంది. చలి ఎక్కువ కావున నెగళ్లతో స్థలాన్ని వెచ్చగా ఉంచారు. అందరూ తమకి తోచిన రీతుల్లో పాటలు పాడారు. రిసార్ట్ యజమాని మంచి హిందీ పాటల్ని వినిపించాడు. పానీయాలు, స్టార్టర్లు అందరి దగ్గరికి చేరుకొంటున్నాయి. గడియారం తనపని తాను చేసుకొంటుంది.
కౌంట్ డౌన్ మొదలయ్యింది… ఫైవ్, ఫోర్, త్రీ, టూ, వన్… కొత్త సంవత్సరం ఆరంభం… అతిథులందరు గట్టిగా చప్పట్లు కొట్టి, ఆప్యాయంగా పరస్పర శుభాభినందనలు తెలుపుకొన్నారు.
చుట్టుపక్కల ప్రాంతాల్ని చూడడానికి ఒకరోజు అదనంగా ఉంచాం. ఒక ఊరికి వెళ్ళి వ్యవసాయం గురించి తెలుసుకొన్నాం. విస్తారమైన కొత్త రిసార్టులు వ్యవసాయ భూముల్ని ఎలా కబలిస్తున్నాయో తెలుసుకొన్నాం. దగ్గర్లో మరో చిన్న గ్రామం – పచాధర్. అన్నీ కుమ్మరి కుటుంబాలే. అక్కడి మట్టి శ్రేష్టమైనది కాబట్టి ఈ కళ అక్కడ తరతరాలుగా కొనసాగుతుంది. ఈ వారసత్వపు నైపుణ్యాన్ని గమనించి ప్రభుత్వం ఈ ఊరుని దత్తత తీసుకొని పలురకాల సహాయసహకారాలని అందిస్తుంది. ప్రతి ఇల్లు గమ్మతుగా ఉంటుంది. ఇంటిముందే మట్టి, కుమ్మరి చక్రాలు, బట్టి, అమ్మకాలకోసం ఒక చిన్ని ప్రదేశం… హస్తకళా నైపుణ్యాలని చూస్తూ ఆ వీదిలో నడవడం ఒక చక్కని అనుభూతి. జ్ఞాపికలకోసం టీ-షర్టులు, పుస్తకాలు, టోపీలు, కీ చేన్స్… కొన్నాం.
జనవరి రెండు. మదినిండా తియ్యని అనుభవాలతో, కొత్త జ్ఞానంతో తీరిగ్గా బ్రేక్ ఫాస్ట్ చేసి పదకొండు గంటలకి రిసార్ట్ ని వదిలాము. నాలుగురోజుల్లో స్టాఫ్ తో ఒక అనుబంధం ఏర్పడింది. అందరూ బయటకి వచ్చి ఆప్యాయంగా బాయ్ చెబుతుంటే మా కారు గేటుని దాటి నిర్మల్ వైపు దౌడు తీసింది.
*








Meme velli chuusina vidham gaa , chaalaa baagaa cheppaaru …Thanks …