కథలు ఇలా రాయకూడదు..

పాఠకులని గౌరవించండి, అందుకు ప్రతిఫలంగా పాఠకుల గౌరవాన్ని పొందండి.

ది ముప్పైవ భాగం. చివరి భాగం. ఇంత రాస్తానని అనుకోలేదు. కాని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా రాసినందుకు సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ముగించే ముందు ఇన్ని రోజులుగా చర్చించిన వాటిల్లో ముఖ్యమైనవి ఒకసారి పునఃశ్చరణ చేసుకుంటే బాగుంటుందని ఇది రాస్తున్నాను.

ఈ ఇరవై తొమ్మిది వ్యాసాలలో…

కాల్పనిక రచన (Fiction writing) చాలా సహజంగా, ఒక ప్రేరణ నుంచి పుట్టే కళగా చెప్తారు. పాత్రలు తమంతట తాముగా జీవం పోసుకుని, పేజీలపైన జీవిస్తూ, రచయిత ప్రమేయం లేకుండా, వాటంతట అవే కథని ముందుకు తీసుకెళ్తాయని అంటారు. ఇదంతా ఒక నిగూఢమైన ప్రక్రియగా చిత్రీకరిస్తారు. నేను వీటినన్నింటినీ కాదనడంలేదు కానీ, పాఠకుల మనసును నిజంగా కదిలించి, వాళ్ల జ్ఞాపకాలలో ఉండి, సదా వెంటాడి, వాళ్లు ప్రపంచాన్ని చూసే దృక్పథాన్నే మార్చివేసేన ప్రతి కథ వెనుకా.. ఒక సృజనాత్మక శిల్పం (Craft) ఉందని నేను నమ్ముతాను.  కథలు చెప్పడం అనేది ఉత్కృష్టమైన కళ అయితే కావచ్చు, కానీ దాని వెనుక ఒక వ్యూహంతో నిర్మించిన సంక్లిష్టమైన నిర్మాణం కూడా ఉండాలని చెప్తున్నాను. అది సాధించాలంటే పాఠకులని కథలో ఎలా లీనం చేయాలనే అవగాహన, అలాంటి కథ పట్ల సడలని అంకితభావం ఎంతో అవసరం అని ఈ వ్యాసాలలో చెప్తూ వచ్చాను. పైన చెప్పిన వాక్యాలు ఇంత నిర్దుష్టంగా ఇప్పటిదాకా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చదివిన వాళ్లలో కొంతమందికి కోపం వచ్చే అవకాశం ఉంది. అది భరించడానికి సిద్ధంగానే ఉన్నాను.

ఎందుకు కోప్పడతారు? రెండు కారణాలు

  1. కథ అంటే కుట్లు, అల్లిక లాంటిది కాదు. ఒక మూసలో పోసి దాన్ని కథ అనడానికి వీల్లేదు.
  2. కథ అనే దైవదత్తమైన ఒక కళ. నేర్పిస్తే నేర్చుకునేది కాదు.

రెండో ప్రశ్నకి మొదట సమాధానం ఇస్తాను. ఈ ప్రపంచంలో నేర్చుకోలేనిది ఏదీ లేదు. ఇది (కార్పొరేట్ ట్రైనర్‌గా) నా వృత్తి నాకు నేర్పించిన జ్ఞానం మాత్రమే కాదు, నేను నమ్మి ఆచరించే విలువ కూడా. స్వతహాగా కొంతమందికి కొన్ని traits ఉంటాయి. ఉదాహరణకి ఎదుటి వ్యక్తి ఒక మాట అనగానే దాన్ని సెటైర్‌తో తిప్పి కొట్టడం. “ఇలాంటివి దైవదత్తంగానూ, పుట్టుకతోనూ రావాలండీ” అనేది నేను అంగీకరించను. పెరిగిన వాతావరణం, దగ్గరి వ్యక్తుల వ్యవహార శైలి, సినిమాలు, పరిచయాలు, పుస్తకాలు మొదలైనవి ఏవోవో పని చేసి ఆ చిన్న ప్రత్యేకమైన లక్షణాన్ని కల్పిస్తాయి. అంతే! ఆ తరువాత అంతా ఆ లక్షణాన్ని ఎంత వాడారు, ఎంత సాన పెట్టారు అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. స్వతహాగా ఒక లక్షణం ఉన్న వ్యక్తి, పట్టుదలతో దాన్ని సాధన చేసేట్లైతే ఆ వ్యక్తికి training అద్భుతంగా పని చేస్తుంది. స్వతహాగా అలాంటి లక్షణం ఒకటి లేకపోయినా, పట్టుదలతో సాధన మాత్రమే చేస్తాను అనే వ్యక్తికి కూడా training అద్భుతంగా పని చేస్తుంది. కేవల ప్రత్యేకమైన ట్యాలెంట్ ఉండి (ఉదాహరణకి శృతి,లయల జ్ఞానం), కష్టపడి సాధన చేసే లక్షణం లేకపోతే, శంకరాభరణం శంకరశాస్త్రి దగ్గర శిష్యరికం చేసినా అక్షరం పలకదు. ఈత కొట్టడం నేర్పిస్తే వచ్చేది కాదు అనగలమా? మరి ఒడ్డున కూర్చుని ఈత కొట్టడం ఎలా అనే పుస్తకం చదివేస్తే ఈత కొట్టడం వచ్చేస్తుందా? పుస్తకం టెక్నిక్ చెప్తుంది, ఏది ఎలా సాధన చెయ్యాలో చెప్తుండి. ఆ తరువాత సాధన మాత్రమే దాన్ని సాధించేలా చేస్తుంది.

ఇక మొదటి ప్రశ్నకి సమాధానం – కథ అనే కళ పుట్టుక మూసతో జరగలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా కథలు చెప్తూ చెప్తూ మనం అది చెప్పే విధానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. గొప్ప కథలు మూసతో రాసినవి కావు. కానీ ఆ కథలన్నీ కలిపి మనం ఒక రూపుని తయారు చేసుకున్నాం. పుట్టలో వేలుపెడితే కుట్టిన చీమ కథ కూడా – ఒక సెటప్ (ఏర్పాటు, అమరిక), ఒక పేసింగ్ (నడక, వేగం), ఒక సర్‌ప్రైస్ ఎండింగ్ (ఆశ్చర్యకరమైన ముగింపు)లతో ఎందుకు ఉంది. “అనగనగా ఒక ఈగ తన పేరు మర్చిపోయింది. చివరికి ఒక గుర్రప్పిల్ల సకిలించి “ఈహిహిహి నీ పేరు ఈగ కదా” అని చెప్పేదాకా దానికి పేరు గుర్తుకురాలేదు. గుర్రప్పిలని కలవడానికి ముందు ఆ ఈగ ఎవరెవరిని కలిసిందో తెలుసా? ఆవు, ఆవు కడుపులో దూడ…” ఇలా ఎందుకు ఆ కథని చెప్పట్లేదు? కథలు చెప్తూ చెప్తూ కథ చెప్పే విధానం తెలుసుకున్న జంతువులం మనం. ఆ జంతువుల నుంచి ఈ రోజుటి నాగరికమైన మనిషి వరకు జరిగిన మార్పు మొత్తానికి కారణం – కథ. దేశం ఒక కథ, కరెన్సీ ఒక కథ, మతం ఒక కథ, యుద్ధం ఒక కథ…

చెప్పొచ్చేదేమిటంటే కథ మూసలో పోస్తే రాదు. కానీ దానికి పరిధులు లేకపోతే కూడా అది కథ కాదు. కథగా అది నెరవేర్చాల్సిన ప్రయోజనాన్ని అది సాధించలేదు. ఈ వ్యాసాలలో నేను మూసలు అందివ్వలేదు. పరిధులు దాటిన కథ ఎందుకు పని చెయ్యదో చూపించే ప్రయత్నం చేశాను. తద్వ్రా కథకి ఉండే పరిధుల్ని తెలుసుకుని అందులోనే కథలు నడపటం నేర్చుకుంటారని ఈ ప్రయత్నం చేశాను.

డైరీ రాసుకోడానికి నిర్దుష్టమైన పద్ధతి లేదు. అవసరం లేదు కూడా. ఎందుకంటే అది ఎవరికి వారు రాసుకునేందుకు, చదువుకునేందుకు ఏర్పరచిన ప్రక్రియ. కథ అలాంటిది కాదు. మనం ఇప్పుడు ‘చదువుతున్న’ కథ పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే (మౌఖిక రూపంలో) పుట్టి మనుగడ సాగించిన ప్రక్రియ. మౌఖికమైన కళకి (వినడానికి) రెండో వ్యక్తి అవసరం ఉంది కదా? అంటే శ్రోతలేని ముఖిక కథ లేదు. పాఠకులు లేని కథా రచన లేదు. కాబట్టి నా సంతోషం కోసం, నా తృప్తి కోసం నేను రాసుకుంటున్నాను అని అనేందుకు కథా రచయితకు అవకాశం లేదు. అనడానికి అనుమతి లేదు.

నేను రాసిన ఇరవై తొమ్మిది వ్యాసాలను పైపైనే పరిశీలిస్తే వాటిల్లో కథా నిర్మాణంలో సాధారణంగా జరిగే పొరపాట్లు, రచయితలకు ఉపయోగపడే ఆచరణాత్మకమైన సలహాలు కనపడతాయి. కానీ ఇంకొంత పరిశీలనగా చూస్తే అన్ని అధ్యాయాలలో ఒక ప్రాథమిక సూత్రం మూలస్తంభంగా నిలబడిందని మీకు అర్థమౌతుంది. అది –

పాఠకులని గౌరవించండి, అందుకు ప్రతిఫలంగా పాఠకుల గౌరవాన్ని పొందండి.

రాయబడని ఒప్పందం

కథ అనేది రచయిత తన పాండిత్యాన్ని ప్రదర్శించుకునే వేదిక కాకూడదు, సమాచారాన్ని కుమ్మరించే స్థలం కాకూడదు, అనవసరమైన నీతి ఉపన్యాసాలు ఇచ్చే ప్రసంగపీఠం కాకూడదు. పాఠకులు ఒక రచనని చదవటం మొదలుపెట్టిన మరుక్షణమే, అక్కడ ఒక రాయబడని ఒప్పందం కుదురుతుంది. లీనమయ్యేలా చేసే, భావోద్వేగపరంగా తృప్తినిచ్చే నిజాయితీతో కూడిన, కథ అనే ప్రయాణాన్ని అందిస్తానని వాగ్దానం రచయితలు చేస్తారు. పాఠకులు దానికి ప్రతిఫలంగా తన సమయాన్ని, ఊహాశక్తిని, నమ్మకాన్ని పెట్టుబడిగా పెడతారు. ఈ ఒప్పందాన్ని గౌరవించి చేసిన రచన సహజంగానే గొప్ప రచన అవుతుంది. ఇది సాధించాలంటే, నాకు మనసులో పుట్టిన కథ, నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాను అనడానికి లేదు. కథలోని మొదటి వాక్యం నుంచి ప్రయత్నపూర్వకంగా ఒక నిర్మాణాన్ని అనుసరించాలి. అదే ఈ వ్యాసాలలో నేను చెప్పినది.

కథ మొదలైనప్పుడు, ప్రారంభ వాక్యాలలో, పాఠకులకు రచయితకు ఏ సంబంధమూ ఉండదు. పాఠకులు రచయితకి ఎలాంటి బాకీ ఉండరు. “నాకు వేరే పనుంది. సర్లే, ఏదో కథ అంటున్నవుగా. త్వరగా చెప్పు” అని మొదలుపెడతారు. సాదాసీదా దినచర్యలతో, వాతావరణ వర్ణనలతో, నిష్క్రియంగా సాగే పాత్రలతో కథనాన్ని ప్రారంభించడం అనేది పాఠకుడిని “అయితే ఏంటి?” అని ప్రశ్నించుకునేలా చేసి, కథ నుండి దూరం చేస్తుంది. ఒక కథ ఆరంభం పాఠకుడిని వెంటనే ఒక సంఘర్షణలోకి, ఒక ఉత్కంఠలోకి కనీసం ఒక ఆసక్తికరమైన జిజ్ఞాసలోకి తీసుకెళ్లాలి. ఈ విషయంతోనే ఈ వ్యాసాలను మొదలుపెట్టాను.

కథ ఒక కాల్పనిక ప్రక్రియ అని అందరికీ తెలుసు. అంటే రచయిత ఒక ప్రపంచాన్ని, ఒక సందర్భాన్ని, కొన్ని పాత్రలను ఊహించి (కల్పించి) రాయటం. ఈ కల్పన అక్కడితో ఆగదు. ఆ రచనని చదువుతున్న పాఠకుల మనసులో కూడా ఒక ప్రపంచం, ఒక సందర్భం, కొన్ని పాత్రలు రూపుదిద్దుకుంటాయి. రచన సాగినంతసేపు ఇది ఒక గాలిబుడగలా విస్తరిస్తూ ఉంటుంది. గాజుభవనంలా స్థిరమౌతూ ఉంటుంది. ఇలా ఉన్న కాల్పనిక జగత్తుని పగలగొట్టే పనులు చెయ్యకూడదని కొన్ని ఉదాహరణలతో చెప్పే ప్రయత్నం చేశాను. అందులో ముఖ్యమైనది అనుభూతి ఐక్యత. కథ ఎప్పుడూ ఆలోచనలోనూ, శైలిలోనూ ఒక సామరస్యాన్ని నిర్వహించాలి – అదే అనుభూతి ఐక్యత. కవితాత్మక వచనం నుంచి అకస్మాత్తుగా వాడుక భాషలోకి, మాండలికాలలోకి మారిపోవడం, కథనంలో సరైన కారణం లేకుండానే మొదటి నుంచి నడుస్తున్న శైలిని మధ్యలో మార్చేయడం పాఠకుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. పాఠకుల మనసులో విస్తరిస్తున్న కథా బుడగ పగిలిపోతుంది. గాజుభవనం కూలిపోతుంది.

తెలివైన పాఠకులు… తప్పు, తప్పు. పాఠకులందరూ తెలివైనవాళ్లే. వాళ్లు రచయిత లోతు లేని ఊహలతో రాస్తున్నాడనే విషయాన్ని ఠక్కున పసిగట్టగలరు. నిజమైన సాధికారికత లేని గొంతు రచయితని పాఠకులకు పట్టి ఇస్తుంది. లోతైన పరిశోధన, ప్రామాణికమైన అవగాహన, అనుభవపూర్వకమైన సందర్భ కల్పన, చిత్తశుద్ధితో చేసిన భావోద్వేగ చిత్రణ ఉంటేనే కథ నమ్మదగినదిగా అనిపిస్తుంది. అలాంటి పరిశోధన, అవగాహన, అనుభవం కలగలసిన రచయిత రచన పాఠకులకి ఒక తపస్సులా సాగుతుంది. కథలో అసహజంగా ధ్వనించే అంశాలు ఆ తపస్సుని భగం చేస్తాయి. అందుకు ఉదాహరణగా స్థల, కాలాల గురించి చెప్పాను.

నాకున్న పరిమిత సినిమా అనుభవంలో నేర్చుకున్న దృష్టికోణం, అమరిక (మీజాన్‌సేన్),  వచనంలో ప్రదర్శించడం లాంటివి కొన్ని చెప్పాను. గొప్ప వచనం ఒక నివేదిక లాగా సంఘటనలను కేవలం అందించడంతో సరిపెట్టుకోదు. దాన్ని ఒక మంచి దర్శకుడిలా ప్రదర్శిస్తుంది. నాటక రంగానికి చెందిన ‘రంగస్థల అమరిక’ను (Mise-en-scène), సినీ దర్శకత్వ సూత్రాలను, కల్పనా సాహిత్యంలోకి తీసుకురావడం ద్వారా రచన బహుళ-ఇంద్రీయానుభవంగా మారి, పాఠకుల మనసులో నిలిచిపోతుందని ప్రతిపాదించాను.

భావోద్వేగ అద్దం – దృష్టికోణం (POV): ఏ దృష్టికోణంలో కథ రాయాలి? ఉత్తమ పురుష (“నేను”)లో రాస్తే మంచిదా లేక ప్రథమ పురుష (“అతను/ఆమె”)ల్ఫ్ రాస్తే బాగుంటుందా? అన్న ప్రశ్న  వ్యాకరణప్రంగా చేసుకునే ఎంపిక మాత్రమే కాదు. అది కథలో ఉండే ప్రపంచాన్ని ఎటు వైపు నుంచి చూడాలని అనుకుంటున్నారనే నిర్ణయం. ఏ భావోద్వేగ మీద, ఆ ఆలోచన మీద మీరు కాంతిని ప్రసరింప చెయ్యాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం. మానసిక సంఘర్షణలో ఉన్న ఒక పాత్ర ఒక స్థలాన్ని, సందర్భాన్ని తటస్థంగా చూడలేదు; అలాంటి పాత్ర అంతరంగంలో ఉన్న ఆందోళనే వారు తమ చుట్టూ ఉన్న వస్తువులను, శబ్దాలను, పరిధులను, పరిసరాలను ఎలా అనుభవిస్తున్నారో నిర్ణయిస్తుంది. పాఠకులకి ఏ అనుభూతిని ఇవ్వాలని అనుకుంటున్నారో, ఆ అనుభూతి ఇవ్వగలిగి అవకాశం ఉన్న దృష్టికోణం ఎంచుకోవాలని కొన్ని వ్యాసాలలో చెప్పాను.

చెప్పొద్దు – ప్రదర్శించు: పాఠకుల తెలివితేటలను నమ్మాలి. “అతను బాధపడ్డాడు” లేదా “కుటుంబం ముఖ్యమని ఆమె గ్రహించింది” అని భావోద్వేగలను వాచ్యంగా చెప్పి, ఇప్పుడు నవ్వు, ఇప్పుడు బాధపడు అని పాఠకులకి నిర్దేశింఛకూడదు. పాత్రల భౌతిక చర్యలు, చిన్న చిన్న ప్రవర్తనలు, శరీరంలో కనిపించే ప్రతిచర్యలు,  పరిసరాలతో, ఇతర పాత్రలతో వాళ్లు ప్ర్వర్తించే తీరు కథలో చూపిస్తూ వాటి ద్వారా ఆ అంతర్గత స్థితులను చూపించడం గురించి చెప్పాను.

రంగస్థల అమరిక: నాటకరంగం నుంచి తెచ్చుకున్న మీజాన్‌సీన్ ఆధారంగా కథలో set అమరిక ఎలా ఉండాలో కొన్ని వ్యాసాలలో చెప్పాను.  కథా నేపథ్యంలో ఉండే ప్రతి అంగుళాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించుకోవాలి. ఒక్క సంభాషణ వాక్యం కూడా మాట్లాడక ముందే.. పాత్రల నిలబడే తీరు, దుస్తుల సర్దుబాటు, బల్ల దగ్గర కూర్చునే ఎక్కడ కూర్చుంటున్నారు, ఏది పట్టుకుంటున్నారు, వాళ్ల ఎంపికలు,  పరిసరాలతో వారు ప్రవర్తించే తీరు… ఇలాంటి వన్నీ కలిసి పాత్ర స్వభావం, వాళ్ల అధికారక హోదా, వాళ్ల మనసులో ఉంటే సందేహం, భావోద్వేగ సంఘర్షణ లాంటివి ఎన్నో నిశ్శబ్దంగా సూచించే సంకేతాలుగా పనిచేస్తాయి. వాటిని వాడమని చాలాచోట్ల సూచించాను.

సంభాషణలో సంఘర్షణ: పాత్రలు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేసుకునే సహజమైన సంభాషణలు కథలలో ఉండవి. సహజం అనిపించే సంభాషణలు ఉంటాయి. ఆ సంభాషణల్లో కచ్చితంగా ఒక ఘర్షణ ఉండాలి; అవి విభిన్న పాత్రల నేపథ్యాలను, వారి చదువుల తీరును, ఆ సందర్భంలో ఆ పాత్ర మనసులో ఉండే భావోద్వేగం వంటివి ప్రతిబింబించాలి. ఒక దృశ్యంలో ఉండే నాటకీయమైన బరువు పైకి చెప్పే మాటలలో ఉండదు. అది ఆ మాటల వెనుక దాగి ఉండే అంతర్లీనమైన అర్థంలో ఉంటుంది. ఇది చెప్పడానికి కొంట ప్రయత్నం చేశాను.

ఎప్పటికీ గుర్తుండిపోయే కథ రాయాలంటే కచ్చితంగా రెండు భిన్నమైన సూత్రాలను సమతుల్యం చేసుకోవడం రావాలి. ఎంతో ఆత్మీయంగా, మనసుకి దగ్గరగా ఉండే, స్థానిక/వైయుక్తిక ప్రత్యేకతలలో (నేల వాసన) కథ పునాదులు వేసుకుని, అందులో స్థిరంగా పాతుకుపోయి ఉండాలి. అదే సమయంలో సార్వత్రికమైన మానవ జీవిత సత్యాన్నో, ఒక సార్వజనీయమైన తాత్విక చింతననో ఆవిష్కరించాలి.

ఆధునిక భావజాలాలను పాత కాలంపై రుద్దకుండా, ఒక కాలం ఒక ప్రాంతంలో ఉండే నిర్దిష్టమైన సామాజిక-రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వాస్తవాలను గౌరవించడం ద్వారా రచయిత ఒక నమ్మదగిన ప్రపంచాన్ని నిర్మించచ్చు అన్నాను. అయితే, కథా నేపథ్యం, స్థానికత ఒక భాగం మాత్రమే. దుఃఖం, ఆశయం, నమ్మకద్రోహం, కుటుంబ బాధ్యత, స్వేచ్ఛాకాంక్ష వంటి ప్రాథమిక మానవ అనుభవాలపైన ప్రధాన సంఘర్షణను నిలపడం ద్వారా, ఆ కథ తన స్థలకాలాలను అంటే భౌగోళిక, చారిత్రక పరిధులని దాటి సాగుతుంది. కథ ఏ యుగానికి, ఏ సంస్కృతికి చెందినదైనా, పాఠకులు ఏ కాలానికి, ఏ సంస్కృతికి చెందినా, ఆ కథనంలో ఆ పాటకులు లీనమై, అందులో ఉన్న రచయిత ఆలోచన జాడల్లో నడిచే అవకాశం ఇస్తుంది.

రచయిత ఓపిక నశించినప్పుడో, అనుకున్న పదాల సంఖ్య పూర్తయినప్పుడో, అకస్మాత్తుగా రాయడం ఆపేయాలని నిర్ణయించుకున్నప్పుడో కథ ముగిసిపోదు. నిజమైన ముగింపు ఒక అనివార్యమైన సందర్భం. కథా ప్రారంభ పేజీలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చె అవకాశం. కథ మొత్తం నాటిన భావోద్వేగాలను, అంతర్లీనమైన ఆలోచన అనే విత్తనాన్ని మొలకెత్తనిచ్చే మలుపు.

అందుకే అత్యున్నతమైనవని చెప్పబడే కథలు పరిశీలిస్తే వాటిల్లో చౌకబారు పరిష్కారాలు ఉండవు. చౌకబారు అంటే? ముందస్తుగా ఎలాంటి సంకేతాలు ఇవ్వని బలవంతపు మలుపులు, ఉన్నట్టుండి పాత్రలలో వచ్చే మార్పులు, అసహజమైన పరివర్తనలు, రచయిత ప్రతినిధులుగా మారిన పాత్రలు ఇచ్చే ప్రసంగాలు, శుభం కార్డు పడే సినిమా క్లిషే సుఖాంతాలు. ఒక గొప్ప ముగింపు చివర్లో ఇవ్వదల్చిన భావోద్వేగాన్ని కథ మొత్తం కష్టపడి సంపాదించుకుంటుంది; అది కథలోని సంఘర్షణకు, సందర్భానికి ఒక ముగింపును ఇస్తూనే.. చివరి పేజీ మూసేసిన తర్వాత కూడా పాఠకుల మనసులో ఆలోచింపజేసే ఒక ప్రతిధ్వనిని వదిలి వెళ్తుంది. ఇది చివరి ఐదారు వ్యాసాలలో చెప్పిన విషయాలు.

అసలు ఇదంతా ఎందుకు రాశాను?

కొంతకాలం క్రితం, కథా రచనలో పెద్ద తలకాలైన ఇద్దరిని కలిసే అవకాశం వచ్చింది. ఆ రోజు ఆ ఇద్దరూ సాహిత్య ఎకాడమీ యువ పురస్కారానికి అర్హత కలిగిన రచయితల కోసం వెతుకుతున్నారు. “నీ వయసెంత?” అన్నారు. “వయసు రీత్యా అర్హత ఉంది కానీ పుస్తకం వేసి ఉండాలనే నిబంధన ఉందట కదా? నేను ఇంకా వెయ్యలేదు.” అన్నాను.

అప్పుడు వాళ్లలో ఒకాయన అన్న మాట –

“తొందరగా వేసెయ్. గట్టిగా ఐదారుగ్గురి కన్నా లేరు సిఫార్స్ చేద్దామంటే!”

ముఫై ఐదు దాటని, పుస్తకం వేసిన రచయితల లేరు! అంటే ఒక తరం రాయడం ఆపేశారు.

కథా స్రవంతి పిల్ల కాలువగా మారింది. ఇది మళ్లీ జీవ నదిగా మారేదెట్లా? ఇంకా చాలా మంది రాయాలి. రాసే వాళ్లకి చెయ్యి అందించి, ముందుకు తీసుకెళ్లే వ్యవస్థ కావాలి. – ఇప్పుడు ఇదంతా రాస్తున్నా కానీ అప్పుడు ఇంత ఆలోచన లేదు. నేను, వెంపల్లె షరీఫ్ కలిసి ఇలాంటి మాటలే మాట్లాడుకున్నాం. షరీఫ్ కొత్తగా రాస్తున్నవాళ్ల కోసం ఏదైనా చెద్దాం అని ఫేస్‌బుక్‌లో కథ అనే ఒక గ్రూప్ మొదలుపెట్టాడు. ఆ గ్రూప్ కోసం మొదలుపెట్టిన పని ఇది – “కథలు ఇలా రాయకూడదు”

నేనూ, నాలాంటి వాళ్లు ఇంకొంతమంది కథలు రాయడం మొదలుపెట్టినప్పుడు మాకు సలహాలు చెప్పేవాళ్లు పెద్దగా లేరు. కథా రచనలో కిటుకులూ, సూత్రాలు నేర్పించేవాళ్లు లేరు. బహుశా సాహితీలోకంలో మా పరిచయాలు మితంగా ఉండటం వల్ల కూడా కావచ్చు. పాత కథకులని చదివి కొంత నేర్చుకున్నాం. ట్రయిల్ ఎండ్ ఎర్రర్ పద్ధతిలో కథలు పత్రికలకు పంపిస్తూ, తిరుగు టపాలో వచ్చిన కథలను మళ్లీ మళ్లీ మార్పులు చేసుకుంటూ నేర్చుకున్నాం. రచయితలు వసుంధరగారు రచన మాసపత్రికలో సలహాలు సూచనల శీర్షిక నడిపేవాళ్లు. వారి సహకారం చాలామంది లభించింది. నా కథలు ఒకటి అరా పత్రికలలో వచ్చాక కొంతమంది రచయితల పరిచయం ఏర్పడటంతో వాళ్లు చెప్పే సూచనలు కూడా నా కథని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాయి. ఫేస్ బుక్ కథ గ్రూప్ పెట్టిన తరువాత చాలా చర్చలు, కొన్ని సెమినార్లు జరిపాము. కథలని ప్రేమించే ఖదీర్‌బాబు నిర్వహించే రైటర్స్ వర్క్ షాపులు, జ్ఞానాన్ని, పరిచయాలనీ పెంచాయి. వీటన్నింటివల్ల కొద్ది కొద్దిగా కథకి మెరుగులు దిద్దడం, మెరుపులు అద్దడం నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకునేందుకు చాలా వుంది. ఆ దారి అలాగే వుటుంది. కానీ నేను వచ్చిన దారిలో ముందుకు అడుగులు వేయడానికి సిద్ధంగా వున్నవాళ్లు, నాలుగు అడుగులు వేసి ఆ తరువాత ఎటు వెళ్లాలో తెలియక తికమకగా నిలబడ్డవాళ్లు వున్నారు. వెనక్కి తిరిగితే అలాంటి వాళ్లలో చాలా మందికి కథలు రాయడానికి సూచనలు, సలహాలు కావాలని అనిపించింది. అలాంటి వాళ్ల కోసం ఏదోకటి చెప్పాలనిపించింది. అందుకే అప్పట్లో ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఈ శీర్షిక మొదలుపెట్టాను. ఇంత విస్తృతంగా కాదు కానీ, ఒక ఏడెనిమిది వ్యాసాలు అక్కడ రాసినవే.

కథలు ఎలా రాయాలో చాలా మంది రాశారు. కథా శిల్పం (వల్లంపాటి వెంకట సుబ్బయ్య), కాబోయే రచయితలకు పనికొచ్చే చిట్కాలు (ఆరుద్ర), కథా కథనం (కారా మాష్టారు), పాపులర్ రచనలు చేయడం ఎలా (యండమూరి వీరేంద్రనాథ్), కథకుడి పాఠాలు (బి.ఎస్.రాములు), కథాయణం (అనిల్ ఎస్. రాయల్), కథలు ఇలా కూడా రాస్తారు (మొహమ్మద్ ఖదీర్‌బాబు) ఇంకా ఎన్నో వున్నాయి. ఇవన్నీ ఎలా రాయాలో నేర్పిస్తాయి. నేను అలా చెప్పదల్చుకోలేదు. ఎందుకంటే ఇలాగే రాయాలి అంటే అది పరిధిని నిర్ణయించినట్లు అవుతుంది. దాని బదులు ఏ తప్పులు చెయ్యకూడదో చెప్పడం ద్వారా రచయిత స్వతంత్రాన్ని హరించకుండానే కథలు రాయడం నేర్పించవచ్చు అనిపించింది. అందులో ఉన్న మరో ఉపయోగం – తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అందుకే అప్పట్లో శీర్షిక పేరు “కథలు ఇలా రాయకూడదు” అని పెట్టాను.

కథలు రాసేటప్పుడు “రచయితలు తరచుగా చేసే తప్పులు” అని వ్యాసాలతో ఏకరవు పెట్టకుండా ఉండేందుకు ఒక మార్గం ఎన్నుకున్నాను. ప్రతి వ్యాసం ఒక కథలో నుంచి తీసుకున్న ఒక భాగంతో మొదలుపెట్టి, ఆ కథాభాగం ఉదహరిస్తూ చెప్పాలనుకున్నది చెప్పాను. ఇవేవీ నిజం కథలు కావు. ఎవరి కథనో తీసుకోని అందులో తప్పులు చూపించడం నా అభిమతం కాదు కాబట్టి నేనే కొన్ని తప్పులు చేస్తూ కొన్ని కథలను కల్పించి వాటి నుంచి చెప్పాల్సిన పాఠం చెప్పాను. ఒక రకంగా కేస్ స్టడీ విధానం. ఒక కార్పరేట్ ట్రైయినర్‍గా గణించిన అనుభవం ఈ శీర్షిక నడపడానికి చాలా ఉపయోగపడింది. ఇలా ఫేస్‌బుక్ కథ గ్రూప్‌లో ఏడెనిమిది వ్యాసాలు రాశాను.

ఆ తరువాత కథా రచయిత అపర్ణ తోట LGBTQ+ community కోసం కథ రచన మీద ఒక వర్క్‌షాప్ నిర్వహించి, అందులో నన్ను మాట్లాడమన్నప్పుడు ఇదే విధానంలో కొన్ని కథల్ను తయారు చేసి, ఆ కథలను వాళ్లతో చదివించి, అందులో ఉన్న లోపాన్ని గుర్తించేలా సెషన్ నడిపాను. అది కూడా మంచి ఫలితాలను ఇచ్చింది.

ఇదంతా గతం.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇబ్బడిముబ్బడిగా కథకులు పుట్టుకొచ్చారు. కొత్త తరం. కొత్త గొంతు. కొత్త దృక్కోణాలు. కొత్త కథాంశాలు. ఇదొక విచిత్రమైన తరం. రేడియా కాలం ముగిసిపోయింది అన్నప్పుడు పుట్టిన FM రేడియో లాంటి వాళ్లు వీళ్లు. “తెలుగులో పెద్దగా ఏమీ చదవలేదండీ. నేను చదివిందంతా ఇంగ్లీష్ నావల్స్ మాత్రమే” అని చెప్తూ తెలుగు కథ రాసేవాళ్లు. వీళ్లకి పాత తరం తెలియదు. “యండమూరి తెలుసండీ, మా అమ్మ చదివేది, చలం పేరు విన్నట్లే ఉంది, కొకు ఎవరో తెలియదండీ” అనగలిగిన జన్‌జీ ఇది. వాళ్లు తెలియకపోతే నేరమనీ, పాపమనీ నేను అనట్లేదు. అనను కూడా. గొప్ప రచయితలని రచనలని చదవకపోతే ఆ రచయితల బరువు భుజానికి ఎక్కదు. వాళ్లని చదివిన మా లాంటి వాళ్లకి “అంత గొప్పగా మనం రాయగలమా” అన్న భయం అక్షరం రాయనివ్వని పరిస్థితి తీసుకొస్తుంది. అది వీళ్లకి ఉండదు. ధైర్యంగా నాకు రాయాలనిపించింది నేను రాస్తాను అని రాసేయచ్చు. అదే చేస్తున్నారు ఇప్పటి యువ పురస్కార్ అర్హత ఉన్న రచయితలు. ఇది మంచిదే. కానీ కొన్ని దశాబ్దాలుగా కథా రచన అనే కార్యశాలలో ఎంతో మంది రచయితల చేసిన ప్రయోగాలు, వాటి ద్వారా ఏర్పడ్డ దారులు తెలిసే అవకాశం ఉండదు. ఇదెలా ఉంటుందంటే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యి, “నాకు KT ఒద్దు, ఏం చెయ్యాలో నేనే కనుక్కుంటాను” అన్నట్లుంటుంది. (KT: నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్). కనుక్కుంటారు. కానీ ఈ లోపే జరగాల్సింది జరిగిపోతుంది.

ఒకరోజు ఒక పుస్తకం చదివాను. కొత్త రచయిత. మొదటి రచన. నవల. ఫేస్‌బుక్‌లో రివ్యూలంటిది రాస్తూ ఆ రచనలో ఉన్న లోపాలను ఎత్తి చూపాను. ఒక మంచి కథ, మంచి వాక్య నిర్మాణచాతుర్యం చిన్న చిన్న తప్పుల వల్ల వృధా అయ్యయని నా బాధ. ఒక రచయితగా ఒక కథని బాగా చెప్పలేకపోతే ఆ నష్టం ఆ రచయితది మాత్రమే కాదు. ఆ రచనది కూడా. అమ్మకాల గురించి కాదు నేను చెప్తున్నది. అసలు కమర్షియల్ రైటింగ్ గురించి నాకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఆ రచయితలని మార్కెట్ చూసుకుంటుంది. బాగా రాయడం రాని కమర్షియల్ రచయితని మార్కెట్ క్షమించదు. ఈ తరహా రచనలకి కొలతలు ముందే నిర్థారించబడి ఉన్నాయి. పాఠకులు ఆ కొలతల ప్రకారం ఉండే రెడీమేడ్ కథనే ఇష్టపడతారు. కమర్షియల్ రైటర్‌గా ఎదగాలనుకున్న రచయితకి ఇవి నేర్చుకోక తప్పదు. కాబట్టి ఆ దిశలో వెళ్లే రచయితలు అనివార్యంగా నేర్చుకుంటారు. సమస్య నాన్-కమర్షియల్ రచనల విషయంలోనే. ఈ ప్రపంచానికి ఆరు పేజీల మంచి చెయ్యాలని రాసే రచయితలతోనే. ఇలాంటి కథలు ఎంత బలంగా, ఎంత విస్తృతంగా పాఠకులని చేరితే సమాజానికి అంత మంచిది. అందుకే అలాంటి రచనలు చేసే రచయితలు కథ రచనలో ఉన్న మెలుకువలు తెలుసుకోవడం అత్యావశ్యకం అనుకున్నాను.

అప్పుడు అనిపించింది. “కథలు ఇలా రాయకూడదు” అనే శీర్షిక అవసరం ఇప్పుడు ఎక్కువగా ఉందేమో అని. నేరుగా అఫ్సర్‌గారికి “ఇలాంటి శీర్షిక రాస్తాను” అని చెప్పాను. “వేద్దాం” అనడానికి, పెద్ద సమయం పట్టలేదు. శీర్షిక పేరు కోసం చాలా రోజులు “చాట్” భారతాలు నడిచాయి. చివరాఖరికి నిర్ణయించిన పేరు “కథాలజీ.”

చెప్పానుగా, ఇన్ని భాగాలు రాస్తానని అనుకోలేదు. మిడిల్ డ్రాప్ అవుతానని నేను, ఆపద్దని అఫ్సర్. ఎప్పుడో ఒకసారి వచ్చే ఒకటో అర కామెంట్, ఏ సభలోనే కలిసిన రచయితలు (ఉణుదుర్తి సుధాకర్, జి. ఉమామహేశ్వర్ లాంటి సీనియర్ రచయితలు కూడా) చదువుతున్నామని, బాగున్నాయని చెప్పిన మాటలు పట్టుకుని ఈ కొండ ఎక్కాను. ఒక బాధ్యత నెరవేర్చినంత తృప్తి ఉంది.

నాకు చెప్పే అర్హత ఉందా? తెలియదు. నేను రాసిన వ్యాసాలు చదివి కొంతమంది చాలా బాగున్నాయి అన్నారు. చెప్పనివాళ్లలో, మౌనంగా అభినందించే వాళ్లు ఉండే ఉంటారు. “ఆయనగారికి ఏం తెలుసని అంతంత వ్యాసాలు రాసేస్తున్నాడు” అనుకునేవాళ్లు కూడా ఉండే ఉంటారు. “వినదగు నెవ్వరు చెప్పిన” అన్నాడు సుమతీ శతకకారుడు. ఆ తరువాత మరో మాట కూడా అన్నాడు – “వినినంతనె వేగపడక వివరింపదగున్, గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ.” కాబట్టి నేను చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఎంతో కొంత పనికొచ్చే భాగం ఉంటుంది. అది మీకు ఉపయోగపడితే చాలు అనే ఇదంతా రాశాను.

ఉర్దూ రచయిత సదత్ హసన్ మంటో తన సమాధి రాయి పైన చెక్కించమని రాసుకున్న వాక్యం ఒకటి గుర్తుకొస్తోంది – “ఇక్కడ సాదత్ హసన్ మంటో విశ్రమిస్తున్నారు. కథా రచనకు సంబంధించిన సమస్త కళలు, రహస్యాలు కూడా ఆయనతో పాటే  ఇక్కడ సమాధి అయ్యాయి… గొప్ప కథకుడు ఎవరు? దేవుడా, లేక ఈయనా అన్న ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.” (వివాదాలకు భయపడి కుటుంబసభ్యులు ఈ వాక్యాలని వద్దని, ఇంకేవో చెక్కించారని చెప్తారు. ఏది ఏమైనా…) నాకు ఆ బాధలేదు. నాకు తెలిసిన ఆ రహస్యాలేవో చెప్పేశాను. అదే తృప్తి నాకు.

ఈ వ్యాసాలన్నీ కలిపి పుస్తకంగా వేస్తానేమో. ఇంకా తెలియదు. ఇప్పటికైతే కథ కంచికి మనం ఇంటికి.

  *

అరిపిరాల సత్యప్రసాద్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంత వివరంగా మాకు కథలు ఎలా రాయకూడదో చెప్పినందుకు ధన్యవాదాలు అరిపిరాలగారూ.

  • ఇన్ని వ్యాసాల మీ కృషి అమూల్యం సత్యప్రసాద్ గారూ.
    ఇందుకోసం ఎంతెంత సమయం కేటాయించి ఉంటారో నేను ఊహించగలను.
    తప్పనిసరిగా పుస్తకంగా తీసుకురండి.
    అభినందనలు.

  • ఇంత ఓపికతో , ఇంత వివరంగా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మాలాంటి కొత్త తరం రచయితలకి మీరు ఇక్కడ అందించిన ఇన్సైట్స్ ఎంతో అమూల్యమైనవి, బయట ఎక్కడ ఏ వర్క్ షాప్ లో దొరకని అమూల్యమైన విషయాలను అందించారు. అందుకు మీకు హృదయపూర్వకంగా చాలా ధన్యవాదాలు 🙏❤️.

  • చాలా విలువైన కథా పాఠాలు చెప్పారు సత్యప్రసాద్. ఒక పుస్తకంగా తీసుకు రండి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.