పగలు యుద్ధక్షేత్రంలా అనిపించిన ఊరే
రాత్రి అమ్మ ఒడిలా ఉంటుంది
మూతపడని టీ దుకాణంలా,
కొత్తగా అక్షరాలను తడిమి తడిమి
నేర్చుకుంటున్న పిల్లాడి
అక్షరాభ్యాసంలా ఉంటుంది.
మరేం పని లేనట్టు
ఒక రాత్రంతా ఊరికే ఊరిని చూడడం
ఒక అద్భుతం.
*
మన ఊర్లోనూ తాజ్ మహల్స్ ఉంటాయి
మన ఊర్లోను కోటి ఊటి అందాలు ఉంటాయి
మన ఊర్లోను ఎర్రకోటలు ఉంటాయి
మన ఊర్లోను చార్మినార్లు ఉంటాయి
ఎగిరే ఉద్యానవనాలు, మహా సౌధాలు,
లోయలు శిఖరాలు నదులు సముద్రాలు
అడవులు పర్వతాలు..
ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు.
*
ఊరు లేవకముందు
ఊరు నిద్రపోతున్నప్పుడు
ఊరు నిద్రలేస్తున్నప్పుడు
ఊరు నిద్రలోకి జారుకుంటున్నప్పుడు
మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడో
ఊరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడో
ఊరు మొత్తం అలా.. తిరిగి చూడాలి.
రాత్రప్పుడే…
అప్పుడెప్పుడో తప్పిపోయిన-
మనల్ని మనం వెతుక్కోవాలి
మరిచిపోయిన మిత్రుల్ని
ప్రేమలని గుర్తు తెచ్చుకోవాలి
రాయని ఉత్తరాలనో,
రాసి పోస్ట్ చేయని ఉత్తరాలనో,
రాని ప్రత్యుత్తరాలనో గుర్తు తెచ్చుకోవాలి.
*
రాత్రి కదా , ఊరు కదా
అందరికీ అన్నీ గుర్తుకు వస్తాయి.
మరచిపోయిన మనుషుల్ని జీవితాల్ని
రాత్రి పూట ఊర్లు అన్నీ గుర్తుతెస్తాయి.
ఒక రాత్రిలో ఊరు
ఎన్నో రంగులు మార్చుకుంటుంటే
ఒక్కో గంటా – ఎన్నిన్ని మార్పులు,
ఎన్నెన్ని రహస్యాలు, ఎన్నెన్ని దాపరికాలు
ఎన్నెన్ని ప్రేమలు, ఎన్నెన్ని వీడ్కోల్లు
*
ప్రతి రాత్రి ప్రతి ఊరూ
మనుషుల్ని వెతుక్కుంటుంది
మనుషుల్ని కలగంటుంది
మనుషుల్ని తీర్చి దిద్దుకుంటుంది
మనుషుల్ని పునరుజ్జీవులని చేస్తుంది
*
ఊర్లోంచి వెళ్లే వాళ్లకి ,
ఊర్లోకి వచ్చే వాళ్ళకి
ప్రతి రాత్రి ఒక వారధి.
నువ్వెప్పుడైనా
రాత్రిని చూసావా?
నిజమైన ఊరిని చూసావా?
రాత్రంతా ఊరికే తిరుగుతూ
ఊరు ఎట్లా ఉంటుందో చూసావా?
*
ప్రతి రాత్రీ ప్రతి ఊరూ
కొన్ని వాగ్దానాలను చేస్తుంది.
ప్రతి రాత్రీ ప్రతి ఊరూ
మరికొన్ని వాగ్దానాలను
నెరవేర్చుకుంటుంది.
*








కొత్త ఊరును సొంతం చేసారు
నువ్వెప్పుడైనా
రాత్రిని చూసావా?
నిజమైన ఊరిని చూసావా?
రాత్రంతా ఊరికే తిరుగుతూ
ఊరు ఎట్లా ఉంటుందో చూసావా?
నిజమే… ఊరుని, వీధులను, బాల్యపు జ్ఞాపకాలను రాత్రి పూట నే చూడాలి. చాలా బాగుంది అండి కవిత. అభినందనలు బాలాజీ గారు