ఒక ముంపు గ్రామ అర్వాచీన పద్యం

వేసవికాలం
నులక మంచంలో పడుకున్న
దీర్ఘకాలిక రోగి మూడంకె వేసినట్టు
ప్రాజెక్టులో నీళ్లు తగ్గాయి

ఒడ్డున తేలిన ఒక ముంపు గ్రామం
మానని గాయంలా సలుపుతున్నది
దర్శనీయ స్థలంలా అయినది
పక్షులు లేని గూడులా బావురుమంటున్నది
చెట్టు తోడులేని నీడలా ఉన్నది తెలిసింది
దర్శనీయ స్థలం అయినది

గూన ఇళ్లన్నీ ఏడ్చి ఏడ్చి
ఇక నీళ్లు  కార్చలేక
మొండి గోడలు నాచు పాకురును
ఆచ్ఛాదనలా ధరించాయి
సిమెంట్ బంగ్లాలు కల చెదిరిన
ఎండిన కన్నీళ్ల చారికల్లా ఉన్నాయి

నాలుగు తొవ్వలను
కలిపే చౌరస్తాలు
నడువ ఏ రస్తా దొరుకక
అంగవైకల్యంతో బాధపడుతున్నది

పిల్లాజెల్లలను కోల్పోయిన
ఇండ్లు  బావురుమంటున్నాయి

పిట్ట అలికిడి లేక
కాలానికి ఎదురు నిలిచిన
ఒకటి అరా చెట్లు
మౌనంగా తమ విషాద గాథను
చిరుగాలికి తలలోపుతూ
కాంట తో గాయం అవ్విచ్చినట్టు
గానం చేస్తున్నాయి

నిలుచున్న ఒంటి కరెంటు స్తంభం మీద
కర్రె పిట్ట కూర్చొని
చిరునామా పోగొట్టుకున్న
తన సహవాస గాని
వీరోచిత పాటను
గొంతెత్తి పాడుతున్నదిపచ్చని

వాగొడ్డు పొలాలన్నీ
ఇప్పుడు ఇసుక మేటలు వేసి
ఒకప్పటి తన వైభవాన్ని తలపోస్తూ
నింపాదిగా  నెమరువేస్తున్నవి

ఊరు ఇప్పుడు
నిర్మానుష్య పట్నం అయ్యింది
గుళ్ళు ఉన్నాయి కానీ
పూజించే ప్రజలు లేక
పాడు పడిపోయాయి

ఒక్క కట్ట మైసమ్మకు మాత్రమే
నిత్య మొక్కులు చెల్లిస్తున్నారు

పెండ్లి అయిపోయి
అత్తగారింటికి పోయిన ఆడబిడ్డలు
రాత్రో ఓ రాత్రి తట్ట బుట్ట నెత్తిన పెట్టుకొని
పునరావాస కేంద్రాలకు
తరలి వెళ్ళిన ఇంటి కోడండ్లూ
గూడు చెదిరిన పక్షుల్లా కలిసి వచ్చారు

నీళ్లలోంచి దేవినట్టున్ళ ఊరిని చూసి
ముఖం మీద కొంగు కప్పుకొని
వలవలా ఏడుస్తున్నారు

నులివెచ్చని యాదులను
మనాదితో గొంతెత్తి
పురా జరా గాయాలకు
మలాం రాసినట్టు గేయాలు అల్లుతున్నారు

(ఆత్మీయ జర్నలిస్టు మిత్రుడు కాయితి బాలుకు…)

జూకంటి జగన్నాథం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.