ఒకే గాటన కట్టలేం: దర్భశయనం

కవితా సంపుటులకు అంతగా ఆదరణ లేదన్నది నిజమే. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోవడం అంత సులభం కాదివాళ. సంకలనాల పరిస్థితి దానికి భిన్నంగా ఏమీ లేదు.

జీవితానికీ, సాహిత్యానికీ, దృక్పథానికీ మధ్య అందమైన బాలన్స్ దర్భశయనం శ్రీనివాసాచార్య! ఆయన  కవి, విమర్శకుడు, “కవిత” సంకలనాల ఎడిటర్. ప్రతి సంవత్సరం ఎంతో శ్రమ కోర్చి ఆయన వెలువరిస్తున్న “కవిత” సంకలనం అనేక తరాల కలయిక. సమకాలీన జీవన ప్రతిఫలనం. కవిత 2017 వెలువడిన సందర్భంగా ఆయనతో ఈ ముఖాముఖి!

  1. దశాబ్దానికి పైగా కవితలు సంకలనం చేస్తున్నారు, కదా; తొలి సంకలనంలో కవితలకు, ఇప్పుడు తాజా సంకలనంలోని కవితలకు మీరు గమనించిన తేడాలు ఏంటి?

‘కవిత 2004’తో మొదలైంది నా సంపాదక బాధ్యత. అప్పుడు నేను సహ సంపాదకుణ్ణి. 76 కవితల్తో ఆ మొదటి సంకలనాన్ని తెచ్చాం. దానిలో ప్రసిద్ధుల కవితలే ఎక్కువ. ఆ సంకలనంలో వర్తమానత, గ్లోబలైజేషన్ పర్యవసానాలు, స్థానికత, వైయక్తిక అనుభూతులు, జీవన స్థూల వ్యాఖ్యానంతో కూడిన కవితలు కనబడతాయి. ఆ కాలంలో ప్రముఖంగా వున్న వాదాల ప్రతిఫలనాలున్న కవితల్ని ఆ సంకలనం ప్రతిబింబించింది. అటు వస్తు ప్రాధాన్యతతోపాటు రూపానుకూలతను కూడా దృష్టిలో పెట్టుకుని మేం కవితల్ని ఎంపిక చేశాము. తాజాగా నా సంపాదక త్వంలో వచ్చిన ‘కవిత్వం 2017’ సంకలనం అరవై కవితల్తో రూపొందింది. పద మూడేళ్లుగా నేను పాటిస్తున్న మౌలిక విలువల్నే ప్రాతిపదికగా చేసుకుని 60 కవితల్ని స్వీకరించాను. కొత్త కవులు నిస్సంకోచంగా, నిర్భయంగా, తాజాదనంతో కవితల్ని రూపొందించిన తీరును ఈ సంకలనంలో స్ఫుటంగా గమనించొచ్చు. ఇక సీనియర్ కవుల దగ్గరికొస్తే వాళ్లందర్నీ ఒక గాటన కట్టి మాట్లాడలేం. కొందరు వాళ్ల తొలినాళ్ల నిబద్ధతను కాపాడుకుంటూ ఇవాళ్టికీ రాస్తున్నారు. వాళ్ల కవితలు ‘కవిత్వం 2017’లో కనపడతాయి. కొందరిలో ఒకప్పటి గాఢత, శ్రద్ధా, ఇవాళ తగ్గినట్లనిపి స్తుంది. కవిత్వం 2017లోని ‘అడవి నెత్తావి’, ‘అడవి వెన్నెల’ కవితలు దాదాపు యాభై యేళ్ల సామాజిక అనుభవాన్ని చిత్రిక పట్టాయి. కొత్త వ్యక్తీకరణల కోసం కవులు చేస్తున్న యత్నాన్ని ‘కవిత్వం 2017’లోని కవితల్లో చూడొచ్చు.

  1. ప్రతి సంకలనంలోనూ చోటుచేసుకున్న కవులు కొందరున్నారు. వారి కవితల్లో మీరు గమనించిన గుణాత్మకమైన మార్పులేంటి?

కొందరు కవులు ప్రతి సంకలనంలో కనబడతారని మీరన్నమాట నిజం. స్థూలంగా వాళ్లకు వస్తువునూ శిల్పాన్నీ సమన్వయ పరిచే సామర్థ్యం ఉండడం. దాని కోసం వాళ్లు నిరంతరం సాధన చేస్తారని నేననుకుంటాను. సామాజిక గతిలో వస్తున్న మార్పుల్ని వాళ్లు ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకోడానికి యత్నిస్తారు. అట్లాగే శైలిపరంగా వస్తున్న మార్పులపట్ల కూడా వాళ్లు అప్రమత్తంగా వుంటారనుకుంటాను. దీని అర్థం –ఈ కవులు ప్రతి కవితనూ సమతుల్యతతో రాస్తారని కాదు. ఆ చింతన వాళ్లకుండడం వల్ల వాళ్లు ఒక సంవత్సర కాలంలో రచించే కవితల్లో కొన్ని విశిష్టమైనవిగా రూపొందడానికి వీలుంది. నాలాంటి సంపాదకులకు ఇలాంటి కవితలు గొప్ప వనరులు.

  1. దశాబ్దానికి పైగా మీరు సంకలించిన ఏ సంకలనంలోనూ చోటు చేసుకోనివారిని కవులు కాదని భావించవచ్చా?

అలా అనుకోవడానికి లేదు. ఒక నిర్దిష్ట కాలంలో రాసే కవుల సంఖ్య కొన్ని వందల్లో వుండొచ్చు. సంకలనంలో కొన్ని కవితల్నే చేర్చగలం. ఉదాహరణకు నేను సంపాదకత్వం వహిస్తున్న కవిత్వ సంకలనాల్లో 60 కవితల్నే చేర్చుతున్నాను. ఆ పరిమితి వల్ల కొన్ని విశిష్ట కవితలు అందులో చేరకపోవచ్చు. అంతమాత్రాన వాటిని రాసిన వారు కవులు కాకుండా పోరు. ఒక్కోసారి సంపాదకుడిగా నాకు గొప్పగా అనిపించని కవిత మరొకరి దృష్టిలో గొప్పది కావచ్చు. ఒక్కోసారి ఒక మంచి కవిత నా దృష్టికి రాకుండా పోవచ్చు. అట్లా సంకలనంలో అది చేరదు. అంతమాత్రాన అది మంచి కవిత కాకుండా పోదు. సంపాదకులు ఎంత ఆబ్జెక్టివ్ గా వుండడానికి యత్నించినా, వాళ్ల ఎంపికలో ఎంతో కొంత సబ్జెక్టివిటీ వుంటుంది. ఉదాహరణకు ‘కవిత్వం 2017’ సంకలనంలో వ్యవసాయానికి సంబంధించిన కవితలు నాలుగు న్నాయి. అలా జరగడంలో నా మొగ్గు నా సబ్జెక్టివిటీ వుందనే కదా. కాబట్టి ఏ కవితా సంకలనమైనా ఒక ప్రయత్నమే. అది సర్వసమగ్రము కావడానికి అవకాశం లేదు.

  1. కవితల ఎంపికకు మీరు పాటిస్తున్న ప్రమాణాలు ఏంటి?

ఇది చాలా పెద్ద ప్రశ్న. కవిత్వం ఒక కళ. కవిత్వ కళ పేరిట వచ్చే రచనలో కవిత్వం వుండి తీరాలని నా నిశ్చితాభిప్రాయం. ఏది కవిత్వం అనే దాన్లో భిన్నాభిప్రాయాలుం డొచ్చు. ఐతే, వచనప్రాయంగా వున్న రచనను ఎవ్వరూ కవిత్వమని అనరు. కొం దరు ఆ కవిత్వ కళను సాధించడానికి పదచిత్రాల్నీ, అలంకారాల్నీ ఆశ్రయిస్తే, మరి కొందరు శబ్దాల వాడకంలో ఔచిత్యాన్ని పాటించి సాధిస్తారు. కవిత్వముండి తీరాల నేది నేను పెట్టకున్న మొదటి ప్రమాణం. ఎంచుకున్న వస్తువూ, దాని పరిధీ, దాని నిర్వహణ-వీటిలో కవి ఏర్పరుచుకున్న స్పష్టతా, ఎంచుకున్న సంక్లిష్టతా లేదా సారళ్యత ఏంటో అది నా రెండో ప్రమాణం. కవికే లేని స్పష్టత పాఠకుడికెలా ఏర్పడుతుంది? కవితను చదవగానే కవి అవగాహన ఏంటో తెలియాలి. ఆ అవగా హన గతానిదా? వర్తమానానిదా? భవిష్యత్తు గురించా? ఎప్పుడైనా తక్షణ సమస్యల మీద అప్పటికప్పుడు స్పందించే వాళ్లే ఎక్కువ. ఐతే తక్షణ స్పందన లోంచి వచ్చే కవితల్లో వర్తమానత వుంటుంది కానీ పరిణతి, అవగాహన, నిర్వహణ వుంటాయని అనుకోలేం. వుండొచ్చు. వుండకపోవచ్చు. వర్తమానతను దాటి మాన వవిలువల్ని ఎత్తి చూపే కవితల్ని రాయడానికి కొందరు కవులు ఇష్టపడొచ్చు. వాటి అవసరమూ వుంది. సంకలనంలో చేరే ప్రతీ కవిత వల్ల కొంత ప్రయోజనం ముండాలని సంపాదకుడిగా భావిస్తాను. గొప్ప సౌందర్య భావనను ప్రసరించే కవి తకూ ఒక ప్రయోజనముందని నేననుకొంటాను. కొన్ని వైయక్తిక అనుభవాలకు ఉత్తమమైన మానవ విలువలుండొచ్చు. అవి కవితలుగా వెలువడినపుడు వాటినీ స్వీకరించాలనిపిస్తుంది. స్థూలంగా వస్తువు, శిల్పమూ-రెంటి నడుమ ఒక బాలెన్స్ పాటించే కవిత కోసం నేను ఆరాటపడతాను- ఎంపిక చేసే క్రమంలో. ఒక సంవత్సర కాలంలో వచ్చిన కవితల్లోంచి కవితల్ని ఎంచుకునేటప్పుడు ఆ కాలంలో జరిగిన సామాజిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక మార్పుల్నీ, లేదా ఘటనల్నీ ప్రతిబిం బించే కవితలు సంకలనంలో వుండాలనే ఒక ప్రమాణమూ సంపాదకుడికి అవసర మనుకుంటాను. ఒక్కోసారి ఓ కవితను చదివినపుడు కదిలిపోతాను. ‘ఇది కదా కవితంటే’అని అన్పిస్తుంది. బహుశా నేను పైన చెప్పిన గుణాత్మ విషయాలేవో దాన్లో వుండి వుంటాయి, నన్ను కదిలించేలా. ఉదాహరణకు 2016లో అచ్చయిన కవి తల్ని పరిశీలిస్తున్నపుడు నందకిశోర్ రాసిన ‘పండగ పూట’ కవిత చూడగానే కదిలిపోయాను. ఏడ్చాను కూడా, అప్పటికప్పుడు. అట్లా అది సంకలనంలో చేరింది.

  1. ఈ సంకలనాలు చర్చనీయాంశం కాకపోవడం, వాటికి సాహిత్య లోకం అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించవచ్చా?

ప్రతీ సాహిత్య నిర్మాణ కార్యక్రమం చర్చకు రావాలని లేదు. నా మటుకు నేను భావించేదేంటంటే, ప్రతి సంవత్సరం కొన్ని వేల కవితలు అచ్చవుతాయి. వాటినన్నిటినీ రికార్డు చేయడం కష్టం. కొన్ని విశిష్ట కవితల్ని ఒక సంకలనం రూపంలో తీసుకొస్తే భావితరాలకు అది ఉపకరణమవుతుంది. ఐతే సంకలనాల్ని రూపొందించేది కేవలం సాహిత్యలోకం కోసం కాదు. సాహిత్యాభిరుచి కలిగిన ప్రతి ఒక్కరి కోసం. అదే ప్రధాన ప్రయోజనం. చర్చల వల్లనే ప్రాధాన్యతలు నిర్ణయించబడ తాయని నేననుకోను. మన సమాజంలో అత్యంత ప్రధానమైన అంశాలన్నో వున్నాయి కదా. వాటిలో ఎన్ని ఇవాళ చర్చకొస్తున్నాయి చెప్పండి? చర్చలు కూడా మంచి ఆచరణకు దారి తీయాలని నా అభిప్రాయం. ఐతే ఈ సంకలన ప్రయత్నం ఆహ్వానించదగినదనే స్థూలమైన ఒక అభిప్రాయం సాహిత్య లోకంలో వుందని నేను అనుకుంటున్నాను. అది నాకు గొప్ప ప్రేరణ.

  1. ఈ సంకలనాల ద్వారా వెలుగులోకి వచ్చిన కొత్త కవులు ఎవరైనా ఉన్నారా?

2004లో మొదలు పెట్టిన దగ్గర నుంచీ, ప్రతీ సంకలనంలో కొంతమంది కొత్త కవుల కవితల్ని చేర్చే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. మూడేళ్లుగా నా పూర్తి సంపాదక త్వంలో సంకలనాల్ని రూపొందిస్తున్నపుడు ఈ అంశంమీద నేను ప్రత్యేకంగా ధ్యాస పెట్టాను. నేను ఎంపిక చేసే ఏ కవితైనా ఎక్కడో అంతకు మునుపు ప్రచురితమైందే. కొత్త కవులకు ఉత్సాహమిస్తున్న పత్రికలు ముందు అభినందనీయమైనవి. వాటి వల్ల కవులకు మరింత ప్రయాణం చేయడానికి ఇంధనం అందుతుంది. ఐతే సంకల నంలో తన కవిత చేరితే ఏ కొత్త కవైనా తప్పక ఉప్పొంగుతాడు. అంతమాత్రాన అతన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత సంకలనానికి దక్కుతుందని నేను అనను. అతని రచనా శక్తే, అతని సాధనే అతని వెలుతురని నేను నిశ్చయంగా నమ్ము తాను. ఆ వెలుతురును ఆహ్వానించి నలుగురికీ అందించే పనిని సంకలనం చేస్తుందనుకొంటాను. సంకలనాలతో చాలామంది కొత్త కవితల్ని ఫోకస్ చేసిన తృప్తివుంది.

  1. లబ్దప్రతిష్టులైన కవులు వ్యక్తిగతంగా వేసుకునే సంకలనాలకే ఆదరణ లేదని వింటు న్నాం కదా, ఈ సంకలనాలకు ఆదరణ ఎలా ఉంది?

కవుల కవితా సంపుటులకు అంతగా ఆదరణ లేదన్నది నిజమే. వెయ్యి కాపీలు కూడా అమ్ముడుపోవడం అంత సులభం కాదివాళ. ఇక సంకలనాల పరిస్థితి దానికి భిన్నంగా ఏమీ లేదు. దానిక్కారణం- ఈ సంకలనాల్లోచేరిన కవులకున్నంత ఆసక్తి, మిగతావాళ్లకు అంతగా లేకపోవడం. సగటు సాహిత్యాభిమానులకు ఇలాంటి పుస్త కాల్ని చేర్చే ఒక నెట్ వర్క్ లేకపోవడం మరొక కారణం. మంచి ప్రయత్నానికి ఎప్ప టికైనా దక్కాల్సిన ఆదరణ దక్కుంతుందని నా ఆశాభావం.

  1. ఈ సంకలనాల ద్వారా మీరు ఏ కేటగిరి చదువరులకు రీచ్ కావాలని అనుకుంటు న్నారు?

నా ధ్యాస ఎప్పుడూ సాహిత్యాభిరుచి వున్న వ్యక్తుల మీదనే. చదువు నేర్చిన ప్రతి వ్యక్తికీ సాహిత్యం చేరినపుడే కదా దాని ప్రయోజనం విస్తారమవుతుంది. కవిత్వాన్ని రాయకపోయినా, కవిత్వం పట్ల ఇష్టమున్న ప్రతి వ్యక్తినీ రీచ్ కావాలన్నదే నా అభిలాష. దీనికి కాలం పట్టొచ్చు. నాది దీర్ఘకాలిక ప్రయాణం.

  1. ఆయా సంవత్సరాలలో జరిగిన సామాజిక ఆర్థిక, రాజకీయ పరిణామాలకు ఈ సంకలనాల్లోని కవితలు భవిష్యత్తులో గీటురాయిగా నిలుస్తాయంటారా?

ఒక సంవత్సరకాలంలో జరిగిన అన్ని పరిణామాలూ సంకలనంలో ప్రతిఫలనమవు తాయని చెప్పలేం. ఆ కాలంలో వున్న కవులు చేసే పనినిబట్టి ఇది ఆధారపడు తుంది. కవులు అప్రమత్తంగా వుండి తమ కవితల ద్వారా ఈ పరిణామాల్ని ఒడిసి పడితే, వాటిని సంకలనం కోసం ఎంచుకోవడానికి సంపాదకుడికి అవకాశం కల్గు తుంది. ఐతే తెలుగు కవిత్వంలో వర్తమానత పట్ల కవుల ధ్యాస ఎక్కువగా వున్నం దున, ఇది సాధ్యమే. అన్ని పరిణామాలు కాకపోయినా, మొత్తం సమాజాన్ని ప్రభా వితం చేసే పరిణామాల్ని రికార్డు చేయాలనే ధ్యాస సంపాదకుడిగా నాకు ఉంది. ఉదాహరణకు ఇటీవలే విడుదలైన ‘కవిత్వం 2017‘ సంకలనాన్ని చూడండి. సమా జాన్ని కుదిపేస్తున్న రైతుల ఆత్మహత్యలు, రైతుల దుస్థితి, నక్సల్ బరీ ఉద్యమం గురించి ఇప్పటి ఆలోచనలు, పర్యావరణ సమస్య, యుద్ధాల మీద అవగాహన, ఇప్పటి యువత ప్రేమాన్విత ఆలోచనలు, గొప్ప వ్యక్తుల స్మరణ (ఆర్టిస్ట్ మోహన్), గౌరీ లంకేశ్ హత్యకు నిరసన, నిరసన తెలిపే వాళ్ల మీద నిర్బంధం(సాయిబాబ), టేకులపల్లి ఎన్ కౌంటర్.. ఇవన్నీ ఆ సంకలనంలో ప్రతిఫలించాయి.ఒకనాటి మానవ జీవన రీతిని స్థూలంగా తెలపడానికి తప్పక ఈ సంకలనాలు దోహదం చేస్తాయని నేననుకుంటాను.

*

దేశరాజు

దేశరాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దేశారాజూ … ‘ దశాబ్దానికి పైగా వెలువడిన అన్ని సంకలనాలూ కలిపి ఏ సంకలనం లోనూ చోటు చేసు కొనని కవులు ‘ అన్నారు – కొన్ని పేర్లు (వారి కవితలు ఎక్కడో ఒక చోట అచ్చులో వచ్చిన వివరాలు – వీలైతే ) చెప్పగలరా ?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు