ఏభై ఏళ్ల ఎడం ‘ఏడుకానాల వంతెన’

దివారం. విశాఖ సముద్ర తీరం. కెరటాల ఉధృతి. పొద్దున్నే, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అక్కడికి చేరుకొని నీళ్లల్లో తడుస్తూ మైమరిచిపోతూంటే – ఒక బక్కపలచని పిల్లవాడు, నావయసు వాడే – వచ్చి పలకరించాడు. ఇద్దరం ఎంతసేపు ఆడుకున్నామో తెలియలేదు. పొద్దెక్కింది; కరకరా ఆకలి. మేఘాలు కమ్ముకొచ్చాయి.

“అమ్మో! ఇంటికి వెళ్లాలి!” అన్నాడతడు. వెంట నడిచాను. మా ప్రక్క వీధిలోనే ఉంటాడని అర్థమైంది. ఉన్నట్టుండి వర్షం. మా బట్టలు తడిముద్ద.

“మావయ్య తంతాడు!” అన్నాడతడు భయంగా! వాళ్ల నాన్న పోయాట్ట. మేనమావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాం నేనూ, చెల్లీ అన్నాడు.

“మరి మీ అమ్మ?”

“ఇక్కడే ఉంటుంది – మాతోనే”.

పైన వరండాలో ఆరవేసిన గావంచాని తీసుకొని కొట్టుగదికి దారితీసాడు; తల తుడుచుకొని నాకందించాడు. చుట్టూ పుస్తకాలు.

“ఎవరివిరా ఇవన్నీ?” పెద్దగా పరిచయంలేని వాళ్లని ‘ఏరా’ అనకూడదని తెలీదు.

“మా తాతగారివి”.

అతని మావయ్య కోపంతో ఊగిపోతున్నాడు.

“ఏరా, అడ్డ గాడిదా! పొద్దున్నే చాంద్రాయణాలు మొదలుపెట్టావా? ఇక్కడ మీ అమ్మ బెంగ పెట్టుకు ఛస్తోంది, పనికిమాలిన వెధవా!”

నా కొత్త స్నేహితుడ్ని చాచి లెంపకాయ కొట్టాడు. వరండాలో ఉన్న పేపరు తీసుకొని విసురుగా లోపలికి వెళ్లిపోయాడు.

అతని అమ్మ కాబోలు. “మావయ్యకి చెప్పి బయటకి వెళ్లాలి కదరా? అయ్యో! బట్టలన్నీ తడిసిపోయాయి. లోపలికి వెళ్లి మార్చుకో…ఈ పిల్లాడెవరు?”

“పక్క వీధిలో ఉంటాడు. బీచిలో ఫ్రెండయ్యాడు,” అన్నాడతడు, కందిన బుగ్గని తడుముకుంటూ.

“టిఫిన్ చేశాను. ఇద్దరూ తిందురుగాని”.

వాడు లోపలికి వెళ్లాడు. అలమార తెరిచి, నా చేతికందిన ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాను. దానికి అట్ట లేదు. అదెన్నాళ్లుగా అక్కడ దాక్కొని ఎదురుచూస్తోందో – నాకోసం?

శత్రువులకు పట్టుబడి, ఒక వంతెన మీద ఉరి తీయబడ్డ సైనికుడి కథ అది. అతన్ని ఉరి తీసేందుకు సన్నాహాలు జరుగుతూంటే వంతెన క్రింది నదీ ప్రవాహాన్ని చూస్తాడు. దూకి పారిపోయినట్టు ఊహించుకుంటాడు. అది కేవలం ఊహ మాత్రమే అని చివర్లో తెలిసినప్పుడు చలించిపోయాను. అది ఏంబ్రోస్ బియర్స్ రాసిన సుప్రసిద్ధ కథ ‘ఎన్ అక్కరెన్స్ ఎట్ ఔల్ క్రీక్ బ్రిడ్జ్’ కి తెలుగు అనువాదం అని అప్పుడు తెలియలేదు.

ఇంతలో వాడూ వచ్చాడు.

“నాకీ పుస్తకం కావాలిరా!”

“మా మావయ్య చూడకుండా పట్టుకుపో!”.

మరి కాసేపట్లో వాళ్లమ్మ వచ్చింది. స్టీలుకంచంలో వేడిగా అట్లూ, బెల్లపావకాయా తెచ్చిన ఆ మహాతల్లి నాకంటికి అన్నపూర్ణమ్మలాగా కనిపించింది.

“ఈ ఊరికి కొత్తగా వచ్చాం, బాబూ! మావాడికిక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వస్తూపోతూ ఉండు,” అంది వాళ్లమ్మ కంచం అందిస్తూ. ఆమె మాటల్లో, కళ్లల్లో – ఆఖరికి చిరునవ్వులోకూడా ఎంతో విషాదం ఉందని ఆరోజుల్లోనే అనిపించింది.

ఆ వేసవిలో ఆ ఇంటికి వెళ్లి చాలా పుస్తకాలే చదివాను. ఆ ఇంట్లో వాళ్లెవరికీ వాటిపట్ల అంత ఆసక్తిలేదని అర్థమైంది. కొన్నింటిని నా మిత్రుని సహకారంతో తస్కరించాను.

మళ్లీ వేసవి సెలవులకి మా తాతగారింటికి వెళ్లినప్పుడు వాళ్లక్కడలేరు. అక్కడో టైపు ఇన్స్టిట్యూట్ నడుస్తోంది. పుస్తకాల కొట్టుగది ఆఫీసుగా అవతరించింది. లోపల్నించి డొక్కు మెషీన్ల టకటక; ‘ట్రింగ్’ అని మ్రోగే గంటలూ, బర్రుమని కేరియర్ని మళ్లీ మొదలుకీడ్చిన శబ్దాలూ; లూబ్రికేటింగ్ ఆయిల్ కి తోడైన రిబ్బన్ల ఇంకు వాసన. ఆ చెక్కసున్నపు చెమ్మగోడల, పాతకాలపు పెంకుటింట్లో ఇంకేమీ మిగల్లేదు.

ఆ ఇంట్లోంచి తెచ్చుకున్న అట్టలేని అనువాద కథల పుస్తకం, నావద్ద చాలాకాలం ఉండేది. దురదృష్టవంతుడైన సైనికుడి కథ మాత్రం నన్ను వెంటాడింది. అంతర్జాతీయ సాహిత్యపుటంచులనుండి అనుకోకుండా నా చేతికి అందిన ఆ గొప్ప రచన, ఏభైఏళ్ల తరువాత వ్రాసిన ‘ఏడుకానాల వంతెన’ అనే కథకు ప్రేరణగా నిలిచింది.

*

‘ఏడుకానాల వంతెన’ ఇక్కడ చదవండి

ఉణుదుర్తి సుధాకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథలు జీవితంలోంచే పుడతాయి. ఆశ్చర్యం ఏమిటంటే చాలాసార్లు జీవితం కథా, కథే జీవితమా అన్న మీమాంస. చిన్ననాటి అనుభవం… చమర్చేట్లుంది.

  • మంచి కధ రాసిన సుధాకర్ గారికి పరిచయం చేసిన చందు తులసి గారికి అభినందనలు. ఏంబ్రోస్ బియర్స్ రాసిన సుప్రసిద్ధ కథ ‘ఎన్ అక్కరెన్స్ ఎట్ ఔల్ క్రీక్ బ్రిడ్జ్’పుస్తకాన్ని పాఠకులకి పరిచయం చేసిన పద్ధతి బావుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు