ఎస్. రామకృష్ణన్ తమిళ కథ: తరమణిలో బొద్దింకలు

ఒక సమాజం బొద్దింకల్ని  ఎందుకు అసహ్యించుకుంటుంది? కంటపడితేనే ఎందుకు వికారం చెందుతారు? ఇదే రకమైన పగ సాధింపు చర్య? ఎందుకింత ఏహ్య, అసూయ భావాలు? ఆ ఐదు రోజులూ ఇదే ఆలోచించాను, కానీ నాకు జవాబు దొరకలేదు.

ప్రస్తుత తమిళ సాహిత్య ప్రపంచంలో ఎస్. రామకృష్ణన్ ముఖ్యమైన రచయిత. గత ముప్పై ఐదేళ్ళుగా కథలు, నవలలు, వ్యాసాలు, నాటికలు, బాలల సాహిత్యం, అనువాద రచనలూ రాస్తున్నారు. సినిమాలకు కూడా రచనలు చేస్తున్నారు. ఎలక్ట్రానిక్, టీవీ మాథ్యమాల్లోనూ రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటివరకు ఈయన రచనలు వందకు పైగా పుస్తకాలుగా వెలువడ్డాయి. ఉపపాండవం, యామమ్, ఉఱుపసి, తుయిల్, నిమిత్తం, చంచారం, ఇటక్కై, పదిన్ వంటివి ప్రసిద్ధమైన కొన్ని నవలలు. భారత దేశమంతా తిరిగి ఆ జీవితానుభవాలతో ‘దేశాంతరి’ అన్న శీర్షికతో రాసిన వ్యాసాలు అతి ముఖ్యమై రచనల్లో ఒకటి. ఎనదు ఇందియా, మఱైక్కప్పట్ట ఉణ్మైగళ్ వంటివి ఈయన రాసిన చారిత్రక గ్రంథాలు. తుణైయెళుత్తు, కథావిలాసం, కేళ్విక్కుఱి, సిఱుదు వెళిచ్చం వంటివి లక్షలాది పాఠకులని ఆకట్టుకున్న రచనలు. బాలలకోసం పదిహేనుకు పైగా పుస్తకాలు రాశారు. ‘ఇయల్’ సాహిత్య సంస్థవారి జీవినసాఫల్య పురస్కారం, ఠాగూర్ పురస్కారం, పెరియార్ పురస్కారం, మాక్సిమ్ గోర్కీ పురస్కారం, తమిళనాడు ప్రభుత్వం అందించే ఉత్తమ నవలా రచయిత పురస్కారాలు ఈయన అందుకున్న పురస్కారాల్లో కొన్ని. ఈయన రాసిన ‘చంచారం’ నవలకుగానూ 2018వ సంవత్సరం సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

*

మీరు నన్ను చూసుంటారు కానీ నా పేరు మరిచిపోయుంటారు. లేదంటే అస్సలు అడిగే ఉండరు. ఎందుకంటే నేను నా పేరు చెప్పి పరిచయం చేసుకోవడం కూడా తక్కువే. నన్ను గుర్తుపట్టేది ‘బొద్దింకల మందు అమ్మేవాడు’ అనే. అది కూడా జర్మనీకి చెందిన ప్రసిద్ధ పురుగుల మందుల సంస్థ ‘విల్హెమ్ ఒబేర్’ సేల్స్ రిప్రజెంటేటివ్ అనే ఐడెంటిటీ కార్డు నా మెడలో వేలాడటంవల్లే. అది చాలు మీకు. నా పేరు మెల్ల మెల్లగా నాకే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది.

అస్సలు నా పేరు నన్ను అంటిపెట్టుకుని ఉండటంలేదు. ఉద్యోగం మారినప్పుడల్లా అదికూడా మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు నాకు ఆ సందేహం ఉండేది. అసలు ఎదుటివాళ్ళ కోసం నేను పేరెందుకు పెట్టుకోవాలి? నా పేరు వల్ల నాకేంటి లాభం? అది అనవసరమైన ఆఱో వేలులా నాకెందుకు అతుక్కుని ఉంది? లోకంలో పేర్లు లేకుండా ఎన్నో వస్తువులు ఉన్నాయి. అవి మన కంటపడుతూనే ఉంటాయి. అయితే మనం వాటిని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోము. నేను కూడా అలా ఉండిపోతే తప్పేముంది?

కానీ నా చుట్టూ ఉన్న మనుషులకు పేరు కావాలి. ఏదో ఒక పేరు ఉంటే చాలు. ఒక్క అక్షరంతో పలికే పేరైనా అది ఆమోదయోగ్యమే. అందుకే ఒబేర్ సంస్థ నాకు అంటించిన “బొద్దింకల మందు అమ్మేవాడు” అనే పేరు సరిపోతోంది. ఆ పేరును నేను తమిళంలోకంటే ఇంగ్లీషులో చెప్పినప్పుడు, మీరు నాకింకా దగ్గరవుతారు. బొద్దింకల్ను కూడా చాలా ఇళ్ళల్లో ‘కాక్రోచ్’ అని పిలుస్తారు. బొద్దింక స్థాయిలోకూడా తమిళానికి అంగీకారం దక్కడం అన్నది నగరవాసులకు నచ్చదెందుకో.

నా గురించి తెలుసుకోవడంలో మీకు ఏమాత్రం ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ నాకు ఇప్పుడు రెండు గంటల విరామం ఉంది. ఆ ఖాళీ సమయాన్ని గడపడం కోసమే మీకు ఇవన్నీ చెప్తున్నాను.

ఆఱేళ్ళ క్రితం నేను ట్రైనీగా ఉన్నప్పుడు, నెసప్పాక్కం పెట్రోల్ బంక్ ఎదర మేమంతా ప్రతిరోజూ ఉదయం కలుసుకునేవాళ్ళం. మణినారాయణ మా అందరికీ పై అధికారి. ఆయన బొద్దింకల మందు అమ్మడంలో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచిన ఘనుడు.

మాలో ప్రతి ఒకరూ రోజుకు రెండు వందల స్ప్రేలు అమ్మాలని ఆయన టార్గెట్ పెట్టేవాడు. అందుకే ఉదయం ఏడు గంటలకే మమ్మల్ని జట్లుగా విడగొట్టి ఫీల్డ్‌లోకి పంపేవాడు. ‘బొద్దింకలు పొద్దున్నే ఏడింటికల్లా లేచేస్తాయా? లేక గుర్రుపెట్టి నిద్రపోతుంటాయా?’ అన్న నా ధర్మ సందేహాన్ని ఆయన్ని అడిగి నివృత్తి చేసుకునే సాహసం చెయ్యలేకపోయాను.

ఆయన తన నల్ల సూట్‌కేసులో చెన్నై నగర మ్యాప్‌ను నాలుగ్గా మడతపెట్టి ఉంచుకుంటా‍డు. ఆ మ్యాప్‌లో నగరంలోని ప్రతి ప్రాంతమూ ఒక్కో రంగుతో విభజించబడి ఉంటుంది. ఏ ప్రాంతంలో బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి, అక్కడికి ఎంతమంది వెళ్ళాలి అని ఆయన రౌండ్ చేసి ఉంచుతారు.

ఒక నగరాన్ని బొద్దింకల సంఖ్యలు, గణాంకాల ఆధారంగా విడగొట్టడం ఎంత పెద్ద ఘనకార్యం! ఆ విషయాన్ని మణినారాయణ గ్రహించుంటాడా?

ఆయన చాలా గాంభీర్యమైన ముఖకవళికలతో, పళ్ళు బిగపట్టుకుని మాట్లాడుతారు. ఆయన మాటలు కూడా ఒక ముసలి బొద్దింక మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఈ నగరంలో బొద్దింకలు బాగా ఎక్కువే ఉండుంటాయి. వాటిలో అధిక భాగాన్ని తుడిచిపెట్టి, బొద్దింక జాతి మూలాల్ని సగానికి పైగా నాశనం చేసిన గర్వం ఆయనలో కనిపిస్తుంది.

ఆ రోజు నెసప్పాక్కం ప్రాంతానికి మమ్మల్ని ఆరుగురిని పంపారు. అది కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇంకా పల్లెటూరి ఛాయలు పోలేదు. పాడి గేదెలు, రోడ్డు మీద నిల్చుని స్నానం చేసేవాళ్ళు, చిన్న పెంకుటిళ్ళు, మునగ చెట్లు, పిడకలు అమ్మేవాళ్ళు, చెక్క బల్లలు వేసిన టీ కొట్లు, సిటీ బస్సులు రాని సందులు… ఇలా అంతా మిశ్రమంగా ఉండేది. నేను ఆ ఏరియాలో దక్షిణ భాగంలో ఉన్న పన్నెండు వీధుల్ను మధ్యాహ్నంలోపు పూర్తి చేయాలని నాకు పురమాయించారు.

ఏ ఇంటి తలుపు ముందుగా తట్టాలో అర్థం కాక నడుస్తూనే ఉన్నాను. మా పనిలో మొదటి శత్రువు కుక్కలు. అది వీధి కుక్క అయినా, పెంపుడు కుక్క అయినా వాటికి మేమంటే పరమ అసహ్యం. మమ్మల్ని చూడగానే ఆపకుండా మొరుగుతాయి, కరవడానికి వెంటబడతాయి. అవే కుక్కలు సేల్స్ ఆడవాళ్ళను చూసి మాత్రం మొరగవు, తోకాడిస్తుంటాయి. వాటికి ఆ వివక్ష ఎందుకో నాకు అస్సలు అర్థం కాదు. కుక్కలు మనుషులతో ఉండి ఉండి మనుషుల స్వభావాన్నే అలవరుచుకున్నాయేమో! ఒక్క కుక్క కూడా కుక్కలా ప్రవర్తించడంలేదన్నదే నిజం.

దీనివల్ల నేను కుక్కల్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టాను. చైనా దేశంలో నగరాల్లో కుక్కలను పెంచడం గానీ, వీధుల్లో తిరగడం గానీ అనుమతించరని ఒకరోజు పేపర్‌లో చదివాను. అది నా జీవిత కాల స్వప్నం కూడా. కానీ నగరవాసులు కుక్కల్ని ప్రేమిస్తారు. ఎందరో దయామయులు వీధి కుక్కలకు కూడా పూట తప్పకుండా శ్రద్ధగా అన్నం పెట్టి వాటి వంశాభివృద్ధికి పాటుపడుతున్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావం నాకు అస్సలు అర్థం కాదు.

నేను సేల్స్‌మెన్‌గా చేరినప్పుడు ఒక వారం రోజుల పాటు ఫైవ్ స్టార్ హోటల్‌లో మాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇళ్ళల్లోకి ఎన్ని రకాల పురుగులు, కీటకాలు, చీమలు వస్తాయో వాటి ఫోటోలతో సహా ఒక పెద్ద క్యాటలాగ్ ఇచ్చారు మాకు.

నేను నమ్మలేకపోయాను. 416 రకాల పురుగులు మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి! బొద్దింకల్లోనే ఎన్ని రకాలు! రంగులో, రూపంలో ఒకదానికొకటి ఎంతో భిన్నమైనవి. మనం కంటితో చూసినప్పుడు వాటికున్న తేడాలను స్పష్టంగా గుర్తుపట్టలేము. పైగా బొద్దింకలకు విడివిడిగా పేర్లు ఉండవు కాబట్టి మనం వాటన్నిట్నీ ఒకే గాటిన కట్టేస్తాం.

ఆ పురుగుల ఫోటోలు చూసినప్పుడు మనం కూడా చిన్న పురుగుల్లాగే బతుకుతున్నాం అనిపించింది. నిజానికి నేను ఆ ఫోటోలను ప్రేమించాను. ప్రతి బొద్దింకను నేరుగా కలిసి పరిచయం చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ వాళ్ళు మాత్రం వాటిని ఎలా చంపాలి, అవి ఎక్కడ దాక్కుంటాయి, ఎంత సేపట్లో బొద్దింక చనిపోతుంది అని ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టారు.

నిజానికి బొద్దింకల్ని చూసి జనం ఎందుకు భయపడతారు? అవి కరిస్తే విషమా అని నా తోటి ఉద్యోగిని అడిగాను. ‘అదంతా అబద్ధం. చాలా కాలంగా మనం ఈ అబద్ధాన్ని పెంచి పోషిస్తున్నాం. ఆ అబద్ధంలోనే మన సంపాదన ఆధారపడి ఉంది’ అని నవ్వుతూ చెప్పాడు.

నేను దాన్ని అంగీకరించలేకపోయాను. ఒక సమాజం బొద్దింకల్ని  ఎందుకు అసహ్యించుకుంటుంది? కంటపడితేనే ఎందుకు వికారం చెందుతారు? ఇదే రకమైన పగ సాధింపు చర్య? ఎందుకింత ఏహ్య, అసూయ భావాలు? ఆ ఐదు రోజులూ ఇదే ఆలోచించాను, కానీ నాకు జవాబు దొరకలేదు.

మా ట్రైనింగ్ క్లాస్ తీసుకోవడానికి కలకత్తానుండి వచ్చిన మోహిత్ సేన్, బెంగాలీ యాస ఇంగ్లీషులో ‘మీరు ఒక్కో ఇంటి తలుపూ తట్టగానే చెప్పాల్సిన మొదటి అబద్ధం ఏంటో తెలుసా?’ అని అడిగాడు. మేమంతా నిశ్శబ్దంగా ఉన్నాం.

‘ఆ అబద్ధం ఒక మంత్రదండం. అది ఏ ఇంటి తలుపునైనా తీయగల తాళం చెవి లాంటిది’ అని చేతులు ఉపుతూ ఎంతో నాటకీయతతో అభినయిస్తూ చెప్పాడు. ఆయన చెప్పబోయే అబద్ధం కోసం మేము ఆత్రుతగా ఎదురుచూశాం.

‘మీ మొదటి అబద్ధం ఇదే – మీ పరిసరాల్లో విషపూరితమైన బొద్దింకలు విపరీతంగా పెరిగిపోతున్నాయని తెలిసింది. అవి కరిస్తే ప్రమాదకరం. వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మా ప్రాడక్ట్‌ను ఎందుకు వాడకూడదు?’

‘ఈ అబద్ధాన్ని మీరు భావోద్వేగానికి లోనవ్వకుండా, కళ్ళల్లో ప్రేమ, ఆప్యాయతలను ఒలకబోస్తూ పదే పదే చెప్పి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కొత్త మనుషులతో మాట్లాడేప్పుడు ఎవరైనా ముందుగా వాళ్ళ కళ్ళనే చూస్తారు’ అని అన్నాడాయన.

ఆ మాటలు వినగానే చిరాకేసింది. ఏ మనిషీ ఎదుటివారి పెదాల్ను ఎందుకు గమనించడు? కళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పవు, పెదాలే అబద్ధం చెప్తాయి. కానీ వాటిని పట్టించుకోరు. ఎదుటివారి అబద్ధాల మీద మనకు లోలోపల ఒక ఇష్టం ఉంటుందేమో అనిపిస్తుంది నాకు.

ఆ రోజు మా ట్రైనింగ్ క్లాసులో ఉన్న 42 మందీ ఒకరినొకరం చూసుకుంటూ, కళ్ళల్లో ప్రేమా, ఆప్యాయతలూ కురిపిస్తూ ‘మీ ఇంటి చుట్టూ విషపూరతమైన బొద్దింకలు పెరిగిపోయాయి, మా స్ప్రే వాడి వాటిని చంపండి’ అని ప్రేమగా చెప్పడం ప్రాక్టీస్ చేశాం.

అర్థంపర్థంలేని నాటకంలో పాత్రధారినైపోయినట్టు అనిపించింది. ఆశ్చర్యకరమైన వాస్తవం ఏంటంటే, పదిహేను నిమిషాల్లోనే నేను ఆ వేషంలోకి సరిగ్గా ఇమిడిపోయాను. నేను ఆ మాటలు చెప్తుంటే ఆ ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నట్టు నా కళ్ళకు నిజంగా కనిపిస్తున్నట్టే ఉందని మోహిత్ సేన్ నన్ను మెచ్చుకున్నాడు.

అబద్ధాలు చెప్పడానికి అలవాటు చేసుకోవడం చాలా తేలిక. నిజం చెప్పడానికే ఎంతో కష్టపడి నటించాల్సి ఉంటుంది. ఆ ట్రైనింగ్ దశలో జనాల్ను భయపెట్టడమే మేము పదే పదే చేయాల్సిన పని అని చెప్పారు.

అది అంత సులువైన పనేం కాదు. జనం ఎప్పుడు దేనికి భయపడతారు అన్నది ఒక పెద్ద మిస్టరీ. కానీ బొద్దింకల పేరు చెప్పి ఆడవాళ్ళను సులభంగా భయపెట్టొచ్చు. అందుకే మగవాళ్ళు ఇంట్లో లేని సమయాలేవో చూసుకుని మఱీ మేము తలుపులు తట్టాల్సి ఉంటుంది.

బొద్దింకల గురించి ఆడవాళ్ళకు రకరకాల ఊహాగానాలున్నాయని నా ఉద్యోగ అనుభవంలో స్పష్టంగా తెలిసింది. మఱి ఏ పురుగు కంటే కూడా బొద్దింక అంత దురదృష్టకరమైంది. ఆడవాళ్ళు వాటిని అసహ్యించుకుంటారు. వాటిని తుడిచిపెట్టడానికి డబ్బు ఖర్చు చేస్తారు. ఆడవాళ్ళ చేత అసహ్యించుకోబడేది ఏదైనా అంతరించిపోవడమన్నది సహజమే కదా?

నేను ఆ‍డవాళ్ళకి బొద్దింకల గురించి రకరకాల అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాను. ముఖ్యంగా బాత్‌రూముల్లో దాక్కునే బొద్దింకలు ఒక రకమైన పచ్చటి ద్రవాన్ని చిమ్ముతాయని, అది ఒంటి మీద పడితే చర్మం మీద చుక్కలు వస్తాయని బెదిరించేవాడ్ని. దాన్ని నిర్లక్ష్యం చేస్తే నెల రోజుల్లో ఒళ్ళంతా వ్యాధి వ్యాపించి వికారంగా తయారవుతారని చెప్పేవాడ్ని.

ఈ అబద్ధం ‘బ్రహ్మాస్త్రం’ లాంటిది. దీన్నుండి ఏ మహిళా తప్పించుకోలేదు. ఒకామె ఈ మాట విని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది. నిజంగానే ఆమెను బొద్దింకలు కుట్టాయని, నా మాటతో ఆ అనుమానం నిజమైందని నమ్మి వెంటనే స్ప్రే కొనుక్కుంది. అంతే కాకుండా అప్పుడు ఆమె ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా ఆరా తీసింది.

దీని కోసం నేను అదనంగా కొన్ని బ్యూటీ చిట్కాలుకూడా చదివి తెలుసుకోవాల్సి వచ్చింది. అదేం పెద్ద పనికాదు. పాత పేపర్ దుఖానాల్లో ఐదారు ఏళ్ళ క్రితం నాటి ‘ఫెమినా’, ‘ఈవ్స్ వీక్లీ’ లాంటి ఇంగ్లీష్ మేగజైన్లు తిరగేసి అందులోని బ్యూటీ టిప్స్ గుర్తు పెట్టుకునేవాడ్ని.

నిజానికి బొద్దింకల మందు అమ్మేవాడు తన ఉద్యోగంలో భాగంగా ఎంత లోకజ్ఞానం తెలుసుకుని మెలగాల్సి ఉందో మీరే ఊహించండి. నేను చెప్పిన ఆ బ్యూటీ చిట్కాను ఆమె కచ్చితంగా పాటించడం మొదలుపెట్టి ఉంటుంది. అన్ని బ్యూటీ చిట్కాలూ భయంనుండే కదా పుడతాయి.

బొద్దింకల గురించి చెప్పే అబద్ధాలను జనం ఏమాత్రం అనుమానించరు. పురుగులు చచ్చిపోతుంటే జనం హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. బొద్దింకలు ఎంత కాలం బతుకుతాయి? వాటిలో ఆడా మగా తేడా ఉంటుందా? ముసలితనం వచ్చి చనిపోయిన బొద్దింక ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అంటూ ఇలాంటి ప్రశ్నలు నన్ను ఎవరూ అడగలేదు.

ఉద్యోగం మొదలుపెట్టిన కొత్తలో కాలింగ్ బెల్ కొట్టడానికి నాకు మొహమాటంగా, బెరుకుగా ఉండేది. బెల్ మీద చెయ్యి పెట్టగానే నా గుండె వేగంగా కొట్టుకునేది. లోపలి నుండి ఏ వయసు వాళ్ళు బయటకు వస్తారోనన్న ఊహా చిత్రం మనసులో మెదిలేది. చాలా వరకు నా ఊహ అబద్ధం అయ్యేది. అరుదుగా మాత్రం నేను ఊహించినట్టే నిద్ర కళ్ళతో రేగిన జుట్టుతో సన్నటి ఆడవాళ్ళు వచ్చేవారు.

నేను నేర్చుకున్న మార్కెటింగ్ చిలుకపలుకులు వాళ్ళ చెవిన పడేవి కావు. విసుగ్గా ‘వద్దు’ అనో, ఎందుకు బెల్ కొట్టావు అని కోపంగానో తలుపు మూసేసేవాళ్ళు. మూసిన తలుపు బయట కొన్ని నిమిషాలు అలాగే నిలబడిపోయేవాడ్ని. అప్పుడు మనసులో రకరకాల విపరీతాలోచనలు వచ్చేవి. హత్య, దోపిడీ, అత్యాచారం వంటి ఆలోచనలు నల్లటి పొగలా మనసును చుట్టుముట్టేవి. ఆ తర్వాత అవి తగ్గి గుమ్మం దిగి వెళ్ళిపోయేవాడ్ని. పురుగుల మందు అమ్మేవాడు అంతకంటే ఏం చేయగలడు?

సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే బహిరంగంగా జనజీవన స్రవంతిలో తిరిగే ఒక నటుడు. నాటకంలో పాత్ర తన వేదిక మీదకు ప్రవేశించడానికోసం తెర వెనుక ఎలా ఎదురుచూస్తుందో, ప్రతిరోజూ నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

ప్రతిరోజూ పురుగుల మందులతో వీధిలో నడవడం మొదలుపెట్టగానే ముందుగా ఏ ఇంటి తలుపు తట్టాలి అని అయోమయంగా ఉండేది. ఈ విషయంలో నా తోటి ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉండేది.

సీనియర్ సేల్స్‌మన్ శంకరం ఎప్పుడూ కుడివైపున ఉన్న ఇంటినే మొదట తట్టేవాడు. ఎల్.గోవిందుకు తొమ్మిది లక్కీ నెంబర్ కాబట్టి ఎనిమిది ఇళ్ళను దాటుకుని తొమ్మిదో ఇంటి తలుపు తట్టేవాడు. నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు. నేను అలా నడుస్తూనే ఉండేవాడ్ని. కొన్నిసార్లు వీధి చివర వరకు వెళ్ళేవాడ్ని. మనసులో ‘ఇక నటించడం మొదలుపెట్టు’ అనే శబ్దం వినబడగానే టక్కున అక్క‍డున్న ఒక ఇంటి తలుపు తట్టేవాడ్ని.

పగటి పూట ఈ ఇళ్ళను గమనిస్తుంటాను. అన్ని ఇళ్ళూ రకరకాల వస్తువులతో చిందర వందరగానే ఉంటాయి. క్రమపద్ధతిలో ఉండవు, ఒక అశ్రద్ధ కనిపిస్తుంటుంది. ఏవేవో పనికిరాని వస్తువులు కుప్పలుగా పడుంటాయి. ఏదో భయంతోనే తలుపులు తెరుస్తారు. కొన్ని ఇళ్ళల్లో తలుపులు అస్సలు తీయరు, కేవలం గొంతు మాత్రమే వినిపిస్తుంది. అలాంటి తలుపులను అబద్ధం చెప్పి తెరిపించడంలోనే మా సమర్థతంతా బయటపడుతుంది.

అందుకని తలుపు బయట నిలబడి హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చానని అబద్ధం చెప్తుంటాను. వెంటనే తలుపు తెరుచుకుంటుంది. జనం ప్రభుత్వం అంటే భయపడతారు. ఇది ఎంత గొప్ప లక్షణం! హెల్త్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ ఏరియాలో బొద్దింకలు పెరిగిపోయినట్టు గుర్తించారని హుందాగా చెప్తాను. వాళ్ళు కంగారు పడిపోతూ అది తమ తప్పు కాదన్నట్టు వింటారు. నా దగ్గరున్న నోట్ బుక్కులో వాళ్ళ వివరాలు రాసుకుని, మఱుసటి రోజు నా తోటి ఉద్యోగి ఒకడ్ని పంపి స్ప్రే అమ్మించడం ఒక పద్ధతి.

మనుషులు తమకంటే చిన్న జీవులన్నిట్నీ అసహ్యించుకుంటారు. చంపడానికి తహతహలాడి పోతుంటారు. ఈ విషయంలో పిల్లలు కూడా మినహాయింపు కారు. ఏ పసి బిడ్డా చిన్న చీమనైనా ప్రేమించడు. చీమను తల వేరు, మొండెం వేరుగా చేసి చంపడంలో ఎంత ఆనందం పొందుతారో! ఇక మనం అందగత్తెలుగా కొనియాడే ఆడవాళ్ళు పురుగుల్ను కర్రతోనో చీపురుతోనో కట్టెతోనో ఎంతో కసిగా చంపుతారన్నది మీరు దగ్గర నుండి చూడాలి. ఎంత ఆవేశం, ఎంత ఆగ్రహం!

మగవాళ్ళు పురుగులతో కలిసి జీవించడం అన్న విషయం గురించి పెద్ద పట్టింపేమీ ఉండదు. అప్పుడప్పుడు విసుక్కుంటారంతే. కొన్నిసార్లు వాటిని నియంత్రించలేని తన మగతనం గురించి కోపం తెచ్చుకుంటారు. సున్నితమైన మనసున్న అతి కొందరు మగవాళ్ళు మాత్రమే పురుగుల మందులు వాడతారు. ఇది లోక సత్యం కాదు, నా అనుభవంలో తెలుసుకున్న పరిశోధనాత్మక సత్యం.

బొద్దింకల మందు అమ్మేవాళ్ళ దగ్గర ఇలాంటి పరిశోధనాత్మక సత్యాలు చాలా ఉంటాయి. మఱో ఉదాహరణ చెప్తాను. బొద్దింకను చంపిన తర్వాత చాలామంది దాని మీసాలను పట్టుకుని మాత్రమే బయట పారేస్తారు. దానికి కారణం మనుషులకు మీసాల మీద ఉండే విపరీతమైన అసహ్య భావమే. మనుషుల్నెవరినైనా ఇలా మీసాలు పట్టుకుని బయట పారేస్తారా?

చాలా ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురంతా నా దగ్గరుండే ఆ స్ప్రేను ఎంత తక్కువకు బేరమాడి కొనేద్దామనే. ఆ కిటుకును కొనుగోలుధారుకు మేమే ఇస్తాం. మా స్ప్రే ధర పన్నెండు రూపాయల ముప్పై పైసలు. దాన్ని మేము రెండు వందలా యాబై రూపాయలకు అమ్ముతాము. ‘ఇంటికే వచ్చి ఇచ్చే ఆఫర్’ అని యాబై రూపాయలు తగ్గించి రెండు వందలకు అమ్ముతాము. ఇంకా బేరమాడే వాళ్ళకు ‘మీకోసం మాత్రమే నూటయాబై’ అని ఇస్తాం. అలా బేరమాడి తక్కువకు కొనుక్కునేప్పుడు ఆ‍డవాళ్ళకు కలిగే విజయగర్వం, ఆనందం అంతా ఇంతా కాదు. మఱి బొద్దింకల స్ప్రేను బేరమాడి తక్కువకు కొనడం సామాన్యమైన విషయమా ఏంటి?

ఒక్కసారి ఒకామె నన్ను ‘ఈ స్ప్రేతో ఎన్ని బొద్దింకల్ను చంపొచ్చు?’ అని అడిగింది. మా ట్రైనింగ్ సమయంలో నేను ఈ ప్రశ్న అడిగి ఉంటే కచ్చితంగా చప్పట్లు దొరికుండేటివి. మోహిత్ సేన్ వెంటనే సమాధానం చెప్పేవాడు. కానీ ఆ రోజు ఆమె అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు. వెంటనే అబద్ధం కూడా చెప్పలేకపోయాను.

నేను సమయస్ఫూర్తితో ‘మీ ఇంట్లో ఉన్న అన్ని బొద్దింకలను చంపొచ్చు’ అని మాత్రమే చెప్పాను. వెంటనే ఆమె “దీనితో చీమలను చంపగలమా?” అని అడిగింది. చీమలు, ఈగలు, పురుగులు అన్నీ చంపొచ్చని చెప్పాను. ఆమె ‘బల్లిని చంపొచ్చా?’ అని మళ్ళీ అడిగింది. బల్లిని చంపడం పాపం అని మాత్రమే చెప్పాను. ఆమె కూడా దాన్ని అర్థం చేసుకున్నట్టు తల ఊపి డబ్బులు ఇచ్చింది. అందులో ఒక చిరిగిన యాబై రూపాయల నోటు ఉంది. దాన్ని తెలివిగా నాకు అంటగట్టిన తృప్తి ఆమెకు మిగిలుంటుంది. బహుశా ఆ నోటును వదిలించుకోవడానికే ఆమె ఆ స్ప్రే కొని ఉండొచ్చు.

మనుషులు చాలా విచిత్రమైనవాళ్ళన్నదే నా అనుభవం. ఎదుటివాళ్ళని మోసం చేయడంలో ఒక రకమైన ఆనందం పొందుతారు. ఆ తెలివితేటల్ని బాగా పెంపొందించుకోవాలని అనుకుంటారు. తరువాయి తరానికి నేర్పిస్తారు. మోసం చేసిన దాని గురించి గర్వంగా చెప్పుకుంటారు.

ఒకరోజు శ్రీనివాసా థియేటర్ దగ్గరున్న ఇంటి తలుపును తట్టాను. మధ్యాహ్నం సమయం కావచ్చు. చాలా మంది మధ్యాహ్నం నిద్రపోతుంటారు. ‘మనుషులు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది’ అన్న వాక్యాన్ని ఒక రోజు చించిన క్యాలెండర్‌ పేపర్లో చదివాను. అది నాకు బాగా నచ్చింది.

అందుకే మేము మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు పనిచెయ్యము. ఎక్కడో ఒక చోట విశ్రాంతి తీసుకుంటూ గడిపేస్తాం. ఆ రోజు నాలుగు గంటల కంటే కొంచెం ముందే ఆ ఇంటి తలుపు తట్టాను. ఒక వృద్ధుడు తలుపు తీశారు. ఆయనకు నేను సేల్స్ మెన్ అని చెప్పగానే లోపలికి రమ్మన్నారు. ఆ ఇల్లంతా దుమ్ముగొట్టుకుపోయి ఉంది. గోడలంతా వాన నీటి మరకలు. కట్టేసున్న కిటికీలు. నాలుగు ఐదు చితికిపోయిన పాత టూత్ బ్రష్‌లు. గదంతా పాత వార్తా పత్రికలు, వార, మాస పత్రికలు, పుస్తకాలు చెత్త కుప్పలా పడి ఉన్నాయి. ఆయన వాటి మధ్యే ఒక వాలు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. పక్కనే ఒక తుప్పు పట్టిన మంచం, దాని మీద రకరకాల పుస్తకాలు, మంచం కింద కూడా పాత పేపర్ల కట్టలు. దండెంమీద ఆరేసిన పాత పంచెలు, బనియన్లు. కచ్చితంగా ఆయనకు ఒక స్ప్రే అమ్మేయొచ్చు అనిపించింది.

నాకు ఆ దుమ్ము వల్ల కలిగిన అసౌకర్యాన్ని సైతం లెక్క చేయకుండా నిలబడ్డాను. ఆయన ఒక పేపర్ల కట్టను చూపించి దాని మీద కూర్చోమన్నారు. నేను దుమ్ము దులిపి కూర్చోబోతుంటే తుమ్ములు వచ్చాయి. నా స్ప్రే తీసి డెమో ఇవ్వడం మొదలుపెట్టాను.

ఆయన ‘అది తర్వాత చూద్దాంలే, నేను కచ్చితంగా ఒకటి కొంటాను’ అంటూ నాకు పెళ్ళయిందా అని అడిగారు. లేదని చెప్పాను. తాగుడు అలవాటు ఉందా అని అడిగారు. లేదని చెప్పాను. ఆయన నవ్వుతూ ‘ఇప్పటివరకు ఎన్ని బొద్దింకలను చంపడానికి తోడ్పడ్డావు?’ అని ఇంగ్లీషులో అడిగారు. అది నన్ను నిలదీసినట్టు అనిపించింది.

వాటివల్ల ఎవరికేం ఉపయోగం? అవి చంపేయాల్సినవే కదా’ అని కఠినమైన స్వరంతో చెప్పాను. ఆయన తల ఊపారు. తర్వాత ఒక పేపర్ కట్టను చూపించి విప్పమన్నారు. నేను వంగి విప్పుతుంటే అందులో 1978 నవంబర్ 7వ తేదీ పేపర్ తీయమన్నారు. ఎందుకు ఇవన్నీ దాచిపెట్టారో నాకు అర్థం కాలేదు.

పాతబారిన ఆ పేపర్ తీసి చాచాను. అందులో ఆరో పేజీ తెరిచి గట్టిగా చదవమన్నారు. తిప్పి చూస్తే అందులో ఒక బొద్దింక ఫోటో ఉంది. గట్టిగా చదివాను. మడగాస్కర్‌లో కనిపించే రాక్షస బొద్దింక అది. ఐదు అంగుళాల పొడవు, 30 గ్రాముల బరువు. దాన్ని ‘బొద్దింకల డైనోసార్’ అని రాశారు. ఆయన శ్రద్ధగా విని ‘ఇలాంటిది ఎప్పుడైనా చూశావా?’ అని అడిగారు. లేదన్నాను.

‘ఇది మన ఊరినుండి నిర్మూలింపబడిన బొద్దింక జాతి. నేను దీన్ని చూశాను. దీని గురించి పేపర్‌కు వివరంగా లేఖ రాశాను కానీ వాళ్ళు ప్రచురించలేదు’ అన్నారు. నేను మౌనంగా ఉన్నాను. ఆయన విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, ఐన్‌స్టీన్ క్వాంటం థియరీ, రిచర్డ్ డాక్కిన్స్ ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు పని ఉందని నేను లేవబోయాను.

ఆయన తన పర్సు నుండి రెండు వందల రూపాయలు తీసి ఇస్తూ ‘స్ప్రే నాకు వద్దు, నువ్వే ఉపయోగించుకో. నీకు వీలైనప్పుడల్లా వచ్చి నాతో మాట్లాడుతుండు. ప్రతిసారీ నేను ఒక స్ప్రే కొంటాను. ఎందుకంటే నేను కూడా ఒక బొద్దింకలాగే బతుకుతున్నాను. నాకు ఇప్పుడు డెబ్బైయాఱేళ్ళు. పన్నెండేళ్ళుగా ఈ గది దాటి బయటకు వెళ్ళలేదు. పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, ఇంకెవరూ కూడా నన్ను వెతుక్కుంటూ రారు.

ముప్పై ఏళ్ళు విజ్ఞానశాస్త్ర పరిశోధనా శాఖలో పని చేశాను. పదవి, సంపాదన, బంధువులు, పేరు, హోధా అన్నీ అబద్ధం, పెద్ద మాయ. ఏవీ మనకు తోడు రావు. ముసలితనం ఒక సుదీర్ఘమైన పగలులా ఉంది.

పాత పేపర్లు చదవడం నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇవన్నీ జరిగిపోయిన పాత విషయాలే కదా, కానీ వాటి గురించి నెమరువేసుకుంటుంటే మనసుకెందుకో సంతోషంగా ఉంది. నీకు ఎప్పుడు ఖాళీ దొరికినా నా ఇంటి తలుపు కొట్టొచ్చు. ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు నేను చనిపోయి పడుంటే, ఈ పుస్తకంలో కొంచెం డబ్బు ఉంది, అది తీసుకుని నన్ను దహనం చేసేయ్ అన్నారు.

నేను నిజంగా భయపడిపోయాను. ఆయన ఇచ్చిన డబ్బును ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆయన్ని కలిసిన తర్వాత నేను వెళ్ళిన ఏ ఇంట్లోనూ ఒక్క స్ప్రే అయినా అమ్మలేకపోయాను. మనసులో ఆయన గొంతు నన్ను వేధించడం మొదలుపెట్టింది. ఆయన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అందుకే ఆ రాత్రి నేను, సెల్వరత్నం కలిసి మందు తాగడానికి వెళ్ళాం.

వైన్ షాపుల్లో బొద్దింకలు విరివిగా పెరుగుతాయి. తాగుబోతులు వాటిని ప్రేమిస్తారు. తాగి మత్తెక్కాక మాట్లాడటానికి మనుషులు లేనప్పుడు బొద్దింకలతో మాట్లాడుతారు. నేను మత్తులో సెల్వరత్నంతో ‘మన మేనేజర్ మణినారాయణను చంపేయాలి. ఆయన పందికొక్కులా మన కష్టాన్నంతా దోచుకుని తిని బలిసిపోతున్నాడ’ని అరిచాను. సెల్వరత్నం ఆపుకోలేనంతగా ఏడ్చాడు. సేల్స్‌ రెప్రసెంటేటివ్‌లు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అది నాక్కూడా తెలుసు. కాబట్టి నేను కూడా అతనికి తోడుగా ఏడవాలని ప్రయత్నించాను కానీ అలా పదుగురున్న బహిరంగ ప్రదేశంలో ఏడవడం నా వల్ల కాలేదు. సెల్వరత్నం ఏడవడం చూసి అతని మీద జాలి, అభిమానం కలిగి ఒక తాగుబోతు తన మందును పంచుకున్నాడు.

అప్పుడు నా సీటు పక్కనున్న ఇటికెల గోడ మీద ఒక బొద్దింక నిలబడి నన్ను చూస్తోంది. అది నాతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఉంది దాని చూపు. నేను ఏం మాట్లాడాలో తెలియక నేను నా చూపును తిప్పుకున్నాను. ఎప్పటికైనా ఇలాంటొక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని నాకు తెలుసు, కానీ ఇప్పుడు దాన్ని ఎదుర్కొనలేకపోతున్నాను. అందుకే కోపంతో ‘బొద్దింకలను తరిమి కొట్టండి’ అని అరిచాను.

అక్కడి పనివాళ్ళు ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఆ బొద్దింక గర్వంగా, ధీమాగా నన్ను చూస్తోంది. నాకు అపరాధభావం కలిగింది. వెంటనే అక్కడి నుండి బయటకు వచ్చేసి ఒంటరిగా నడవసాగాను.

అపరాధభావమనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. దాన్ని ఎప్పుడూ ముదరనివ్వకూడదు. లేదంటే అది మనల్ని బతకనివ్వదు. చాలా సేపు బీచ్ రోడ్డులో తిరిగి గదికి వచ్చాను. నిద్ర అస్సలు పట్టలేదు. ఫ్యాన్ వైపు చూస్తూ పడుకున్నాను. ‘నేను చదువుకున్నవాణ్ణి కాబట్టే బహిరంగంగా ఏడవలేకపోతున్నాను’ అన్న సత్యాన్ని ఆ రాత్రే కనుగొన్నాను.

ఆ ముసలాయన్ను మళ్ళీ కలవకూడదనే నేను తరమణికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అది ధనవంతులు, సాఫ్ట్‌వేర్ ఆఫీసులు, ఆఫీసర్ల ఇళ్ళు ఉండే ఏరియా. అక్కడ ఈజీగా సేల్స్ చేసి ప్రమోషన్ సంపాయించవచ్చు. తరమణిలో బొద్దింకల మందు అమ్మడానికి పెద్ద పోటీనే ఉండేది.

నేను పావుల్ని కదిపి ఆ ఏరియా సంపాదించుకుని వచ్చేశాను. మిగతా ఏరియాలతో పోలిస్తే తరమణిలో సేల్స్ చేయడం చాలా సులువుగానే అనిపించింది. తరమణిలో బొద్దింకలు కూడా ఇంగ్లీషులో మాట్లాడుతాయి. అవి మిగతా చోట్ల కనిపించే బొద్దింకల్లా భయపడి బిలబిలమని పారిపోవు, మెల్లగా నడుస్తాయి. అక్కడ సున్నితమైన మనసున్న మనుషులు ఎక్కువున్నారు. అందువల్ల నేను రోజుకు ఐదు వందల స్ప్రేల వరకు కూడా అమ్మగలిగేవాడ్ని. పైగా ఫోన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్ళేవాడ్ని. బొద్దింకల గురించి నేను చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారు వాళ్ళు.

అలాంటి ఒకరోజు ‘సీ వ్యూ టవర్స్’లో ఉన్న ఒక ఇంటిలో డెమో ఇచ్చి బయటకు వస్తుంటే వాచ్‌మేన్ నన్ను పట్టుకున్నాడు. రిజిస్టర్లో సంతకం చేయలేదన్న నెపంతో నన్ను దొంగ అని అనుమానించాడు.

నేను ఐడి కార్డులు, స్ప్రేలు చూపించినా అతను నమ్మలేదు. నన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించి తద్వారా తన ఉద్యోగంలో మెప్పు పొందాలని చూస్తున్నాడని అర్థమైంది. నేను దానికి సహకరించుదామని నిర్ణయించుకున్నాను. ‘సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్’ – ఎంత అందమైన వాక్యం!

నన్ను పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అప్పగించాడు. నేను ఏమైనా దొంగతనం చేశానా అని పోలీసులు అతన్ని అడిగారు. అతను పెద్ద వివరణ ఇస్తున్నాడు. సాయంత్రం వరకు నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. స్టేషన్‌కు అవసరమని రెండు స్ప్రేలు ఫ్రీగా తీసుకుని ఆ రాత్రి నన్ను వదిలేశారు. ఆ రోజే ఈ ఉద్యోగం మానేయాలని అనుకున్నాను. కానీ ఈ ఉద్యోగం వదిలేస్తే తర్వాత ఏం చేయాలనే అయోమయం కలిగింది.

ఎవరినైనా సలహా అడుగుదామని అనుకున్నాను. మణినారాయణ ఇంటికి వెళ్ళాను. ఆయన నన్ను వాళ్ళ ఇంటి హాల్లో కూర్చోబెట్టి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు. గోడకు పెద్ద టీవీ, అధునాతనమైన సోఫా, అందమైన చిత్రపటాలు, ఫిష్ ట్యాంకులు ఉన్నాయి. బొద్దింకలు ఆయన్ని ఎంత వైభవోపేతంగా బతికిస్తున్నాయో!

మణినారాయణ నా సమస్యలు విని నవ్వుతూ ‘నీకెందుకు అపరాధభావం? నువ్వేమైనా బొద్దింకలను చంపుతున్నావా? అది జర్మన్ కంపెనీ పని. మనం కేవలం బాణాలం. దీనకి కర్త ఆయనే’ అంటూ భగవద్గీత లాంటి సుధీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చాడు. నేను ఆయన్ని ‘నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలి?’ అని నేరుగా అడిగాను.

ఆయన నవ్వుతూ ‘మనుషులకు భవిష్యత్తు గురించిన భయం ఎక్కువ. దాని ప్రతీకే ఈ బొద్దింక. అది ఎక్కడ మనల్ని కరుస్తుందోనన్న భయం ఉన్నంత కాలం మనం హాయిగా ఉండొచ్చు. కాబట్టి నువ్వు ఏ ఇంటి తలుపు తట్టినా అప్పుడు నిన్ను నువ్వు ఒక దేవదూతలా ఊహించుకో. నువ్వు వాళ్ళను కాపాడటానికే వచ్చావని నమ్ము. రెండే నెలల్లో నువ్వు ఎంతో ఎదిగిపోతావు’ అన్నాడు.

ఎంత గొప్ప ఓదార్పునిచ్చాయో ఆ మాటలు! మఱుసటి రోజు నుండే దీన్ని అమలు చేశాను. నా మాటలో, కళ్ళలో కొత్త నమ్మకం కనిపించింది. నగరవాసులు నా మాటలు నమ్మారు. ఒకాయన ఒకేసారిగా మూడు స్ప్రేలు కొన్నాడు. అంతలా మాట్లాడి మెప్పించే విద్య నాకు అలవాటైపోయింది. ఇంగ్లీషు ఎంతో సౌకర్యవంతమైన భాష. ఆ భాషలో ఎంత నేర్పు, ఎంత మాయ ఉందో!

మణినారాయణ చెప్పింది నిజం. నేను టార్గెట్ కంటే ఎక్కువ అమ్మి రికార్డు సృష్టించాను. విశ్రాంతికోసం ఆఫీసు వాళ్ళే నాకు వారం రోజులు సెలవిచ్చి గోవాకు పంపించారు. జీతం పెరిగింది, వాహనం ఇచ్చారు. ఇప్పుడు నా కింద ఆరుగురు పని చేస్తున్నారు. ఏడాదిలో నేను మణినారాయణ స్థానానికి చేరుకుంటాను. ప్రకృతి మనుషుల్ని బతికిస్తోంది అంటారు, అది నిజం.

మీ ఇళ్ళల్లో, ఆఫీసుల్లో కూడా బొద్దింకలు ఉండొచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకండి. అవి చంపబడాల్సినవి. నా గురించి శ్రద్ధగా విని తెలుసుకున్న మీకోసం నలబై శాతం స్పెషల్ డిస్కౌంట్‌తో స్ప్రేలు ఇస్తాను. మీకు ఇష్టమైతే ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. మీ ఇంటికే వచ్చి ఉచితంగా డెమో ఇవ్వడానికి నేను సిద్ధం.

**

మూలం: తరణియిల్ కరప్పాన్ పూచ్చిగళ్

https://www.sramakrishnan.com/%E0%AE%A4%E0%AE%B0%E0%AE%AE%E0%AE%A3%E0%AE%BF%E0%AE%AF%E0%AE%BF%E0%AE%B2%E0%AF%8D-%E0%AE%95%E0%AE%B0%E0%AE%AA%E0%AF%8D%E0%AE%AA%E0%AE%BE%E0%AE%A9%E0%AF%8D%E0%AE%AA%E0%AF%82%E0%AE%9A%E0%AF%8D%E0%AE%9A/

 

అవినేని భాస్కర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు