ఎందుకు రాశానంటే…

ఆయన తన ఆత్మకథలో కనబరచిన ఫ్రాంక్ నెస్,కుండబద్దలుకొట్టినట్టు విషయాన్ని బహిర్గతం చేయటం ఆశ్చర్యపరచేవే.

ఏప్రిల్ ఏడో తారీఖున ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఆత్మ కథ “ఇంటి పేరు ఇంద్రగంటి” పరిచయ సభ ‘ఛాయా’ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగింది.  సౌండ్ ఇంజనీర్ రామం గారి మాటలు, రేడియో కృష్ణ మోహన్ గారి పాటలు, ఆకాశవాణి మిత్రుల ఆత్మీయ సందడితో సభ సాహితీ సమావేశం కన్నా,  స్నేహితుల  గెట్ టు గెదర్ లా మురిపించింది.  ఆ సందర్భంగా AIR రాంబాబు గారితో శర్మ గారు కొన్ని నిఖార్సయిన మాటలు మాట్లాడారు.  అవేంటో మీరూ వినండి.

 

సుదీర్ఘ ప్రయాణంలో…

ఆత్మకథ రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు..దానికి నిజాయితీ తెగువ నేపథ్యం ఉండాలి.అక్షరాల కూర్పు అందంగా జతగూడాలి. అందుకే ఆత్మకథలన్నీ ఆకట్టుకోవు.కానీ ఇటీవల వచ్చిన ఇంద్రగంటి శ్రీ కాంతశర్మగారి ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ దీనికి మినహాయింపు. విస్సన్న చెప్పింది వేదం అన్న మాట 150ఏళ్ళకితం వారి వంశస్థులు ఇంద్రగంటి విశ్వపతిశాస్త్రి గారి పాండిత్యానికి మురిసిన జనం చెప్పకున్న నానుడి…ఇక కథను ఏభని పిలవాలన్నప్పుడు కథానిక అన్న పేరును ఖాయంచేసింది హనుమచ్ఛాస్త్రి గారే.శాస్త్రిగారు పండితులు కవివరేణ్యులు.ఇలాంటి పండితవంశంనుంచి వచ్చిన శ్రీ కాంతశర్మగారికి ఆత్మకథలు చరిత్ర దాచిన సత్యాలను వెల్లడిస్తాయన్న నమ్మకం ఆయనను ఈరచనకు పూనుకునేలా చేసింది.

ఆయన తన ఆత్మకథలో కనబరచిన ఫ్రాంక్ నెస్,కుండబద్దలుకొట్టినట్టు విషయాన్ని బహిర్గతం చేయటం ఆశ్చర్యపరచేవే.ముఖ్యంగా 40-50 ఏళ్ళకితం మధ్యతరగతి బ్రాహ్మణకుటుంబాల్లో ఉండే కీచులాటలు,సాంసారిక బాధలను ఆయన తన కుటుంబపరంగా దాచుకోకుండా చెబుతారు.రామచంద్రపురం జీవితం ,తల్లిదండ్రులు సోదరులు ,అంతగా సంబంధాలులేని చుట్టాలు పక్కాలు అక్కడి స్కూల్ జీవితంలో చికాకులు చిరుకోపాలు చిలిపితగాదాలు చాలా ఆసక్తిగా చెబుతారు శర్మగారు. తమ తండ్రిగారు క్లిష్టమైన వైవాహిక జీవితాన్ని ఎదుర్కుంటూనే సాహిత్య ప్రపంచాన్ని కోల్పోలేదంటారు.వారికున్న అపరిమిత సాహిత్యపరిచయాలు,రామచంద్రపురం వదిలిపెట్టి కావలిలో గడిపిన  జవహర్ భారతి జీవితం…ఈరెండుకాలాలలో హనుమచ్చాస్త్రి గారు  సలిపిన అవిరళ కృషి మనలిని గుక్కతిప్పుకోనివ్వవు.తండ్రి గారన్న మినహాయింపులేకుండా బాణాల్ని ఎక్కుపెట్టారు శ్రీకాంతశర్మగారు..ఇది ఒక ప్రకరణమైతే తరువాతి ప్రకరణంలో రామచంద్రపురం నేషనల్ స్కూల్ లో సాగిన వారిచదువు తాలూకు సాహసాలు ఆ తరవాత కాకినాడ ఆంధ్రగీర్వాణపీఠంలో భాషాప్రవీణ పూర్తిచేయటంలో ఎదుర్కొన్న కష్టాలు…భాషాప్రవీణ చదువుతూనే  తణుకులో జానకీబాల గారితో పరిచయం ఆపై పరిణయం.. తండ్రిగారితో విభేదాలు.. ఎన్నిమలుపులు ఆవయసులో…ఇక్కడితో ఓ ఘట్టంముగిసి ఉద్యోగపర్వం నిడదవోలు ఆంబ్రోస్ స్కూల్ లో మొదలై జర్నలిస్ట్ కావాలనే కోరిక కొమ్మూరివేణుగోపాలరావుగారి రూపంలో అందిన ప్రోత్సాహంతో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ ప్రస్థానం ప్రారంభమవటం…

అక్కడ త్రిమూర్తుల్లాంటి నార్ల,నండూరి రామ్మోహనరావు, పురాణం ల సాహచర్యంతో నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ మనమూ చూస్తాము…ఈక్రమంలో విస్తరించిన ఆయన పరిచయాలు విశ్వనాథ,శ్రీ శ్రీ, ఆరుద్ర,అజంతా,బాపు,ముళ్ళపూడి,జంధ్యాల వంటి అనేకమందితో ఆయన పరిచయాల జర్నీ 76 వరకూ సాగితే 76-96 వరకూ ఆయన ఆకాశవాణిలో నిర్వహించిన బాధ్యతలు ఆయన కలాన్ని కొత్తపుంతలు తొక్కించాయి…

శ్రీకాంతశర్మగారు  ఆకాశవాణిలో పనిచేసినకాలంలో దాదాపు వారు రచన చేసిన ఇరవై కార్యక్రమాలకు ఆకాశవాణి జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి.

ఆయనకావ్యం శిలామురళి రేడియో నాటకంగా రూపొంది శ్రోతల మన్ననలను పొందింది. ఇదేసమయంలో ఆయన చేసిన సాహితీయాత్రలు కలుసుకున్న వ్యక్తులు, అక్షరయాత్ర అన్నీ అనుభవాలై పలకరిస్తాయి. ఆకాశవాణిలో రజనీ మార్గదర్శకత్వం,ఉషశ్రీ సాంగత్యం,సత్యంశంకరమంచిరామం, కృష్ణమోహన్ల సాహచర్యం ఆయన్నో వెటరన్ బ్రాడ్ కాస్టర్ చేశాయి.

తర్వాత పార్శ్వంలో ఆంధ్రప్రభ ఎడిటర్ బాధ్యతలు నిర్వహించటం అక్కడ మళ్ళీ జర్నలిజం ప్రయోగాలు హంపీనుంచి హరప్పాదాకా తిరుమల రామచంద్రగారి రచన వంటివి.

మధ్యలో సినిమారంగంలో కాలుపెట్టి కొన్నిపాటలు రాయటం…ఇలా ఊపిరి సలుపుకోకుండా శర్మగారి జీవితం పరిగెత్తింది…

డెబ్భై రెండేళ్ల వయసులో జ్ఞాపకాలను పేర్చుకుంటూ సాగిపోవటం మాటలుకాదు..అద్భుతమైన వచనంతో ఆకట్టుకునే కథనంతో మనల్ని ఆయనతో లాక్కెళ్ళిపోతారు…

చిక్కబడుతున్న చీకటిని చీల్చే వెలుగులా ఆయన వచనం మనల్ని ఓ పట్టాన వదలదు..

అందంగా రూపొందిన పుస్తకం మనచేతిని అందంగా అలంకరిస్తుంది

ఒక తరం చరిత్రను రికార్డు చేసిన ‘ఇంటిపేరుఇంద్రగంటి’

చదవండి..ఆతరంవారు కళ్ళముందు కదలాడటమేకాదు

శ్రీకాంతశర్మగారి నిజాయితీని కళ్ళకు కట్టిస్తుంది.పుస్తకం చివరిలో శర్మగారితో తల్లవఝల పతంజలిశాస్త్రిగారి ఇంటర్వ్యూ ఇటీవలికాలంలో వచ్చిన గొప్ప ఇంటర్వ్యూ…ఆత్మకథను ముగిస్తూ ఆయనోమాటంటారు”నా అస్తిత్వపు పడవనడుపుకుంటూ సమాజనదిలో నాలుగువైపులా చూసి ఆనందిస్తూ,తుఫానుల్ని,వరదలను,సహిస్తూ-తడుస్తూ,ఎండుతూ,నా ప్రయాణం, దిలాసాగా సాగించడం నాకిష్టం”.నిజమేకదా ఎవరికయినా అలా సాగాలనే ఉంటుందికదా.

-చెన్నూరి రాంబాబు 

Avatar

Chennuri Rambabu

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు