ఏలూరెళ్ళాను

జ్ఞాపకం కూడా ఒక కరెన్సీనోటు లాంటిది, పాస్‌పోర్టు లాంటిది. ఉభయపక్షాలూ అంగీకరిస్తేనే చెలామణీ జరుగుతుంది. వెంకట్రామయ్య జ్ఞాపకం నేను ఆయనతో ఎక్ఛేంజి చేసుకోలేకపోయాను. మోదీరద్దు చేసిన వెయ్యి రూపాయల నోటులాగా అది కేవలం నేను విలువనిచ్చే నా వస్తువుగా మిగిలిపోయింది.

మాటలు వచ్చిన కొద్దిరోజులకే నాకు మా ఇంట్లోవాళ్లు ఒక శ్లోకం నేర్పించారు. “శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో” అన్న ఈ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతంలో వినిపించేది. ఎంతో శ్రద్ధగా దాన్ని నేర్చుకుని ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేటప్పుడు వల్లించేవాడిని.  అదే నా ప్రార్థన. ఆ ప్రార్థనాశ్లోకంలో ‘శ్రీనివాస’ అన్న మాట వచ్చినప్పుడు అది నా పేరే కదా అని ఒక మురిపెం కూడా ఉండేది.  అట్లా  మొదలయిన  నా దైవప్రార్థనకు కొత్త కొత్త  పద్యాలు శ్లోకాలు చేరి, నా నిద్రను పావుగంట ఆలస్యం చేశాయి.

నాకప్పుడు సుమారు పదేళ్లు.  మా నాన్న ఏలూరులోని చింతలపాటి బాపిరాజు ఓరియంటల్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు. 1970 ప్రాంతాల పరిస్థితులకి ఉన్న నేపథ్యం వల్ల కొంత, ఆ విద్యాసంస్థల్లో అంతర్గతంగా ఉన్న సమస్యల వల్ల కొంత ఆయన తెలంగాణకు తిరిగి వచ్చేయాలని నిర్ణయం చేసుకుని కొత్త ఉద్యోగాల వేట మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ ఓరియంటల్‌ కాలేజీలో ఒక ఖాళీ ఉన్నదని తెలిసి, ఆ ప్రయత్నం మీద ఆయన వెళ్లారు. మా నాన్నకు కొత్తఉద్యోగం దొరికితే మేం ఏలూరు వదిలి వెళ్లవలసి వస్తుందని నాకు అర్థమయింది. చాలా దిగులుగా అనిపించింది. ఇక తప్పదు వెళ్లవలసిందే అన్న నిర్ధారణ జరిగేవరకు, రాత్రుళ్లు నేను మా నాన్నకు కొత్త ఉద్యోగం రావద్దు దేవుడా అని ‘శ్రీమన్నభీష్ట’ వల్లెవేసేవాడిని. శ్రీవైష్ణవులకు వేరే దేవుడు నిషిద్ధమయినా సరే, లోకంలో నాకు తెలిసిన దేవుళ్లందరికీ పేరుపేరునా మొక్కుకుని నిద్రలోకి జారుకునేవాడిని. కుటుంబ సార్వభౌమాధికారానికి  నేను తలపెట్టిన ద్రోహాన్ని దేవుడు అనుమతించలేదనుకోండి.

అప్పుడు నేను శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయంలో  ఆరోతరగతి చదువుతున్నాను. ఆ బడీ మా ఇల్లూ కూడా అగ్రహారంలోనే ఉండేవి. ఐదోతరగతి కూడా నేను ఏలూరులోనే చదివాను కానీ, ఆ స్కూలు ఏదో నాకు గుర్తు లేదు. ఈ స్కూలు మాత్రం మనసులో ముద్రపడిపోయింది. స్కూలుకు ఎదురుగా ఏలూరు కాలువ. కాలువకూ రోడ్డుకూ మధ్య కొద్దిపాటి పచ్చిక. ఆ పచ్చిక మీద కూర్చుని పిల్లలం మాట్లాడుకునేవాళ్లం. ఎవరో పిల్లవాడు, అక్కడే నాతో అన్నాడు, “నువ్వు ఎంచక్కా హైదరాబాద్‌ వెళ్లి చార్మినార్‌ చూస్తూ ఉంటావు, మేమేమో ఇక్కడ ఈ కాల్వను చూస్తూ కూర్చోవాలి”. కాల్వ అనే అన్నాడు. మురిక్కాల్వ అనలేదు. ఇప్పుడు అయితే అదేమాట అనాలి. అసలిప్పుడు అక్కడ కూర్చునే వీలే లేదు. నా క్లాస్‌మేట్‌ అనుకున్నట్టు,  ఏలూరు నుంచి మా నాన్న ఉద్యోగార్థం వెళ్లిన ఊరు హైదరాబాద్‌ కాదు. దానికి 100 కిలోమీటర్ల దూరంలోని పెద్ద గ్రామం.

ఏలూరులో నాకు ఒకటి రెండు లైబ్రరీలు, మా నాన్న కాలేజి, నేను చదివిన గాంధీ స్కూలు, అందులో ఒక టీచరు, ఒక క్లాస్‌మేట్‌ – ఇవి మాత్రం గుర్తు. టీచర్‌ పేరు నల్లాన్‌ చక్రవర్తుల అప్పలాచార్యులు, తెలుగు టీచర్‌, ఆయనే స్కౌట్స్‌ కూడా చేసేవారు.  గుర్తున్న మిత్రుడి పేరు  వెంకటరామయ్య. అగ్రహారంలోనే స్కూలుకు మలుపు తిరిగే చోట ఉండేది వాళ్ల ఇల్లు. బాగా ఉన్నవాళ్లు. అతనితో ఎక్కువ తిరిగేవాడిననుకుంటా. ఆ పేరును ఇన్నేళ్లూ మోసుకుంటూనే వస్తున్నా.

1980 దశకంలో రెండుసార్లు, 1990 లో ఒకసారి కలిపి విజయవాడలో ఐదేళ్లున్నా, ఎప్పుడూ ఏలూరు వెళ్లడం కాలేదు. బహుశా జ్ఞాపకం, జ్ఞాపకంగా ఉండడంలోని ఆనందమే అప్పుడు సరిపోయి ఉంటుంది. జ్ఞాపకాన్ని సాక్షాత్కరించుకోవాలన్న ప్రలోభం అప్పుడు లేదు. కాలాన్ని తిరిగి అది పారిపోయిన చోటికి ఈడ్చుకుని వెళ్లి, నా గడచిపోయిన ‘నేను’ ముందు నిలబెట్టాలని చూశానా?

నా ఏలూరు బాంధవ్యం తెలిసి, ఐదేళ్ల కింద కావచ్చు, మల్లీశ్వరి  పనిగట్టుకుని మరీ ఏలూరు వెళ్లి గాంధీ స్కూలును పట్టుకుని నాలుగు ఫోటోలు తీసి, నా బిడియపు జ్ఞాపకంతో ముఖాముఖీ ఏర్పాటు చేసింది. తన సొంతూరు, శివారులోని కొక్కిరపాడు అయినా, తను పుట్టింది ఏలూరులో. అదీ, నేను ఏలూరులో ఉన్న రోజుల్లో, అగ్రహారానికి కూతవేటు దూరంలోని ఓ ఆస్పత్రిలో. మల్లీశ్వరి పంపిన ఫోటోల్లో ఆ స్కూలు బోర్డు, లోపలి ఆవరణం, గాంధీగారు నాటిన చెట్టూ చూసి శిశువు చిత్రనిద్ర నుంచి ఉలిక్కిపడ్డట్టు మేల్కొన్నాను. ఈ మధ్య కడుపు గంగాధరరావు అనే ఆయన ఫేస్‌బుక్‌లో తనను ముగ్ధుడిని చేసిన ఏలూరు పిల్లల గ్రంథాలయం ఫోటోను పోస్ట్‌ చేసి మరో జ్ఞాపకాన్ని రగిలించారు. ఆ లైబ్రరీని ఆయన బాల చదువరిగానే కాదు, గ్రంథపాలకుడిగా కూడా ప్రేమించారు. రిటైరయ్యేలోపు ఆ లైబ్రరీలో లైబ్రేరియన్‌గా చేయాలని తపించి తపించి సాధించారాయన. ఆ వయసులో, ఆ గ్రంథాలయమే నన్ను పిల్లల సాహిత్యపు అద్భుత లోకానికి ఓపెన్‌ ససేమ్‌ చెప్పించింది. సింద్‌బాదూ సిండ్రెల్లా చిక్కుడుతీగ పట్టుకుని పైలోకానికి పాకిన బాలుడూ పేదరాశి పెద్దమ్మా ముసలి మంత్రగత్తె – అందరూ అప్పుడే నాకు పరిచయం. బహుశా, ఆ అక్షరాల వండర్‌లాండే, నాలోపల ఏలూరును బలంగా నాటింది.

ఆ మధ్య కొల్లేరుకు వెళ్లినప్పుడు కూడా ఏలూరును ఈదుకుంటూనే వెళ్లాను. అగ్రహారం, గాంధీ స్కూలు ఇట్లా గూగుల్‌ లో వెదుకుతుంటే, కిలోమీటర్‌ దూరంలోనే ఉన్నట్టు ఎర్రచుక్క చూపించింది. అంత దగ్గరా, ఇప్పుడు వెళ్లాలా, అని బద్ధకంగా అనిపించింది, నా సంకోచం మనసును బిగపట్టిందేమో, వెడదామా అనుకునేలోపు ఆటపాక చేరేశాం. అమ్మయ్య తప్పిపోయింది – అనుకున్నాను.

కానీ, ఈ మార్చి 26 నాడు తప్పలేదు. మా పశ్చిమగోదావరి ఆంధ్రజ్యోతి సహచరులు నేను గాంధీ స్కూలు గురించి, అగ్రహారం గురించి పదేపదే అంటుంటే సీరియస్‌గా తీసుకున్నారు. ముందు పిల్లల గ్రంథాలయం చూపించారు. శ్రీరామనవమి సెలవు ఏమో, దానికి తాళం వేసి ఉంది. చెక్కుచెదరని ఆ భవనం, నా జ్ఞాపకంలాగే ఉంది. పిల్లల కోసం ప్రత్యేకమైన లైబ్రరీ నేను మరెక్కడా చూడలేదు. ఆ లైబ్రరీ నుంచి, అప్పటి మా ఇంటికి వచ్చేదారిని పునర్నిర్మిస్తూ ఆ వీధిలో ప్రయాణించాం.  ఆఫీసు మీటింగులూ వగైరా పూర్తయ్యాక, మసకచీకటి సమయానికి నన్ను గాంధీ స్కూలు ఆవరణలోకి తోసేశారు.

మేం వెళ్లిన సమయంలో ఒక ఎండోమెంట్స్‌ ఉద్యోగి మాత్రం స్కూలులో ఉన్నారు. ప్రస్తుతం స్కూలు ఎండోమెంట్స్‌ అధీనంలో ఉన్నది. ఎయిడ్‌ ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రస్తుతం నాలుగు ఎయిడెడ్‌ పోస్టులే ఉన్నాయి. వాళ్లూ రిటైరయితే ఆ గ్రాంటూ ఇవ్వనక్కరలేదు. తక్కిన అందరూ వలంటీర్లే. బడిపిల్లల సంఖ్య 120 అట. దానిదేముంది, చాలా స్కూళ్ల పరిస్థితి అట్లాగే ఉన్నది కానీ, ఇది గాంధీ చేతుల మీదుగా నెలకొల్పిన స్కూలు. ఆయన నాటిన మేడి మొక్క స్కూలు ఆవరణలో, మొత్తం కాండం అంతా తొలిచేయగా డొల్లగా మిగిలి, స్కూలుకు ప్రతీకగా నిలిచి ఉన్నది. లోపలి పాకలు, గదులు కొన్ని పాతవి మిగిలే ఉన్నాయి. నేను చదివిన ఆరో క్లాస్‌ ఎక్కడ ఉండేదో నాకూ, ఎండోమెంట్స్‌ ఆయనకూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఆయన నా తరువాత పదేళ్ల బ్యాచ్‌ వాడు. మా ఇద్దరికీ ఒకే తెలుగు టీచర్‌, అదొక్కటే నన్ను అక్కడ, అప్పుడు కనెక్ట్‌ చేసింది. ఏలూరులో ఆంధ్రజ్యోతి కోసం పనిచేసే ఒక మిత్రుడు కూడా అదే స్కూలు అట. కాసేపు ఆగితే, ఒక చిన్నపాటి అల్యుమినీ సమావేశం సాధ్యపడేది, కానీ నాతో మెలిగిన, నా పక్కనే కూర్చున్న మిత్రులేరీ, ఒక్కసారి, ఒక్కసారి 1970 – 71 నాటి రోజులను పునర్జీవింపగలమా? శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో, ఒక్కసారి అవకాశమిస్తే, నా అప్పటినేనును ఎగరేసుకుపోయి, తదనంతర ప్రయాణాన్నంతటినీ పునర్లిఖించనా?

స్కూలునుంచి బయటికి వచ్చి, మేమున్న అగ్రహారం ఇల్లు ఎట్లా ఉన్నదో చూద్దామని కుడివైపు సందులోకి తిరిగాము. సందు మూలమలుపున అప్పుడు నా చిన్నప్పడు చూసినట్టే ఒక చిన్న బంగళా, వెల్లవేశారేమో కానీ, పాతఇల్లే. “నాకు గుర్తుండి, మా వెంకట్రామయ్య ఇల్లు ఇదే, ఉన్నాడో లేడో”- అని గొణుగుతున్నాను. చొరవ చేసి వెళ్లి కనుక్కుందామని నాకు లేదు. ఆ వెంకట్రామయ్యను అట్లా పదేళ్ల పిల్లవాడిగా ఉండనిద్దామని అనుకున్నాను. పక్కనున్న మిత్రుడు రాజు, ‘మీరుండండి, నేను కనుక్కుంటాను కదా’ అని కారు ఆపడమేమిటి, లోపలికి వెళ్లి వెంకట్రామయ్యగారూ అని పిలవడమేమిటి, ఉన్నారు రండి, అంటూ మా మిగతా మిత్రులు నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లడమేమిటి – అన్నీ చకచకా జరిగిపోయాయి.

హాలులో ఉయ్యాల మంచంమీద కాళ్లు పెట్టుకుని కుర్చీలో కూర్చున్న పెద్దమనిషి – పొట్టిగా ఉన్నాడు, జుత్తు రాలిపోయింది, లుంగీ మీదున్నాడు – బయటకు గబగబా వచ్చి, ‘ఎవరు కావాలీ’ అన్నాడు,  ‘మా సారు మీ క్లాసుమేటు, మిమ్మల్ని చూట్టానికి వచ్చారు’ అని మా కొలీగ్స్‌ చెప్పారు. “నేను శ్రీనివాస్‌ని, ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం చేస్తాను, మనిద్దరం గాంధీ స్కూలులో ఆరోక్లాసు కలిసి చదువుకున్నాం”- గబగబా అన్నాను ఆయనతో. కానీ, ఆయనకు నేనెవరో గుర్తు రాలేదు. ఆ మొహంలో ఒక అయోమయం. శూన్యం. ‘అలాగా, థ్యాంక్స్‌’ అన్నాడాయన. ఉన్నదాని కంటె బాగా పెద్దగా కనిపిస్తున్నారాయన. పదోక్లాసు తరువాత చదివినట్టు లేదు. కుటుంబవ్యాపారం పొగాకు. అదే కొనసాగిస్తున్నట్టున్నారు. అతనిలోకి నేను ఒకఅడుగు వేయగలిగాను. మరోఅడుగు పడడం లేదు. అతని ప్రపంచమూ నా ప్రపంచమూ వేరు వేరు. అవి ఇంతకాలం కలవకుండా ఉండడమే సహజం. ఇకముందు.. చెప్పలేము. గాంధీస్కూలు చూసి వచ్చాను, నేను కూడా ఒక అల్యుమినీని కదా. ఎప్పుడైనా కలుస్తానేమో అతన్ని మళ్లీ. కానీ ఇక ఆ ఉత్సాహం ఉండదు.

‘రష్యాలో అరవయ్యేళ్లు దాటితే చంపేస్తారు తెలుసా!’ – వెంకట్రామయ్య నాతో చిన్నప్పుడు చెప్పిన మాటల్లో అది బాగా గుర్తున్నది. వాళ్లింట్లో  దీపావళికి 200 రూపాయలు పెట్టి టపాకాయలు కాలుస్తారని కూడా అతనే చెప్పాడు. ఆ సంవత్సరం వెంకట్రామయ్య ఇంటి ఉదాహరణ చెప్పిన తరువాత కూడా మా నాన్న నాకు ఐదు రూపాయలే ఇచ్చాడు దీపావళి మందుగుండుకు. ఇటువంటి గురుతులేవీ వెంకట్రామయ్యకు నా గురించి లేవు. కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. నా జ్ఞాపకంలో నేనే తప్పిపోయినట్టు అనిపించింది.

జ్ఞాపకం కూడా ఒక కరెన్సీనోటు లాంటిది, పాస్‌పోర్టు లాంటిది. ఉభయపక్షాలూ అంగీకరిస్తేనే చెలామణీ జరుగుతుంది. వెంకట్రామయ్య జ్ఞాపకం నేను ఆయనతో ఎక్ఛేంజి చేసుకోలేకపోయాను. మోదీరద్దు చేసిన వెయ్యి రూపాయల నోటులాగా అది కేవలం నేను విలువనిచ్చే నా వస్తువుగా మిగిలిపోయింది.

ఏలూరెళ్లాలి, ఏలూరెళ్లాలి – అనుకున్నన్ని రోజులు ఆ ఫీలింగ్‌,  చాసో కథలాగా ఎంత బాగుందో. ఇప్పుడు ఏలూరు తెర తొలగిపోయింది.

జూట్‌మిల్లు ఉన్నది. జిల్లా గ్రంథాలయం ఉన్నది. పిల్లల లైబ్రరీ  ఉన్నది. గాంధీ స్కూలు శిథిలమవుతూ ఉన్నది. ఇప్పటికీ ఏలూరులో నన్ను నేను వెదుక్కోగలను. వెంకట్రామయ్య జ్ఞాపకంలో తప్ప.

*

 

 

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక ఎడిటర్.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • జ్ఞాపకం గురించి ఎంతో హృద్యంగా చెప్పారండీ…

  • చిట్టచివరి పదం ‘తప్ప.’ దగ్గరే చూపు తడిబారి అనాదేశంలో రెప్పలు మూసాయి. రాల్చాయీ.
    శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో!

  • అప్పటి బాల్యమే వేరు అనుకునే మనబోటి వాళ్లకు , కాలం కోరల్లో , బాధ్యతల బందీఖానాల్లో చిక్కుకుని బాల్యస్మృతులే లేని ఇలాంటి బాల్యమిత్రులెందరో !! ఏ ఉమ్మీద్ లేకుండా బాల్యస్మృతుల సాకారానికి పయనిస్తే వస్తుగత స్మృతులనయితే అనుభూతించవచ్చు .

  • జ్ఞాపకాల దొంతరని హృద్యంగా కదిలించారు శ్రీనివాస్ గారు. నేను ఆంధ్ర జ్యోతి , నవ్య పాఠకుడినే. అయితే అప్పుడప్పుడూ సమకాలీన సమస్యలపై ఆయన వ్రాసే వ్యాసాలూ తప్ప ఇలాటి రచన చేయగా చదవలేదు. ఇప్పుడు ఆ కొరత తీర్చారు. అలాగే వారు నవ్య వీక్లీ లో కూడా అప్పుడప్పుడు వ్రాస్తూ ఉంటే బాగుంటుంది. వారికి. సారంగ కూ అభినందనలు.

  • బాగుంది సార్,
    మీరిక్కడ అక్ష “రాళ్ళు” విసరడం ఏమోగానీ, నా బాల్య కాసారం లో ఒకటే .. జ్ఞాపకాల తుళ్ళింతలు! ఏలూరు వెళ్లడంలో కాకతాళీయమే అయినా చాసో కూ మీకూ సామీప్యం ఒక ఆనందాశ్చర్యం !
    శీర్షిక కొనసాగించగలరని ప్రార్థన.

  • నా జీవితంలో సంతోషకరమైన జ్ఞాపకాలు. రెండు ఫోటోలు. బాల్యంలో సుదీర్ఘ కాలం ఆ బాలల శాఖా గ్రంధాలయంలో నడిచింది. తెల్లారి త్వరగా తయారై ఏడు గంటలకిముందు ఆ గ్రంధాలయం గేటు తియ్యక పూర్వమే మా
    పిల్ల బ్యాచ్ అక్కడ రెడీగా నిలబడేది . ముందు వెళితే ‘చందమామ’ దొరుకుతుంది. లేటుగా వెళితే అది ఎంగేజ్ అయిపోతుంది. అలా ఎన్నో వేసవులు….కొద్దిగా పెద్దయి జిల్లా గ్రంథాలయానికి వెళ్లే దాకా. ఇంకా రెండో ఫోటో, గాంధీ స్కూల్, అందులో మా పెళ్లి జరిగింది. పెళ్లి అనుకోకుండా సడన్ గా కుదిరి కళ్యాణ మండపాలు దొరక్క బడిలో చేశారు. పెళ్లి కూతురూ, పెళ్లి కొడుకూ టీచర్లు కాబట్టి, బడిలో పెళ్లి జరగడం సహేతుకమే అన్నారు కొందరు చమత్కారులు. భలే సంతోషంగా వుంది ఇది చదివి!

  • నింపాదిగా చదువుకొస్తున్న నాకు వెంకట్రామయ్య గారి ఇంటిలోంచి బయటికొస్తున్నపుడు ఏదో బరువు మీద పడింది. జ్ఞాపకాన్ని ప్రత్యక్షపరచుకోవాలనే ప్రలోభాన్ని జయించే ఎరుక జ్ఞాపకాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవడంలోని సుఖానికి మొదటి అర్హత.
    తదనంతర ప్రయాణాన్ని పునర్లిఖించుకోవాల్సిన అవసరముంటుందా అని ఒక క్షణం అనిపించింది గానీ వెంటనే అలా అనిపించని మనిషెవరన్నా ఉంటారా అన్న ఆలోచనా వచ్చింది. ధన్యవాదాలు.

  • డియర్ సర్
    మనమిచ్చిన జ్ఞాపకానికి ఎదరవాళ్ళు విలువ ఇవ్వకపోతే చాలా బాధాకరం .మీ మిత్రుడును కలవక పోయినా కనీసం గుర్తు ఉండేవాడినేమో అనిపిస్తుంది .ఇప్పుడు ఈదిలేదు .నాకు కూడా పెద్దాపురం తో ఇలాంటి భందమే .చిన్నప్పుడు 2 చదివా .తర్వాత కాకినాడ.ప్రతి ఒక్కరి జీవితం లో ఉండే ఈ విషయం మీద చాలా బాగా రాశారు .

  • జాపకాల నోటుని ఇరుపక్షాలు అనుమతించాలి .గుడ్ మెమొరబుల్.

  • ‘అతనిలోకి నేను మరో అడుగు వేయలేకపోయాను’ wonderful శ్రీనివాస్ ! ఇలా కూడా జరగొచ్చు అని ముందే అనుకుంటే అంత బెంగేం వుండేది కాదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు