ఎంగిలి కాని వాక్యాలతో అసలు కథ

చన అందించే తుదిఫలం ఆనంద, విషాదాల కంటే ఆలోచన అవాలి. ఆనంద విషాదాల పునాది పొరలను తవ్వే ఆలోచన, నిన్న రేపట్లతో గొడవపడే ఇప్పటి బతుకును తేట పరిచే ఆలోచన.  ఆ ఆలోచన చదువరితనపు పాత అనుభవాలని ముక్కలు ముక్కలుగా చీల్చగలగాలి. అలా చీల్చిన  సృజన రచన చదువరిని ఎల్లకాలం వెంటాడుతూ వుంటుంది. ఆ వెంటపడే భావానికి చివరంటూ వుండదు. రోజువారీ బతుకులో అతికే అవసరానికి ఆ భావం ఎప్పుడూ అతుకుతూనే వుంటుంది. ఈ విధంగా చదువరిని వెంటాడే, అతుక్కుని వుండే రచయితలు తెలుగులో చాలా అరుదు. పతంజలిశాస్త్రి గారిది ఆ కోవే.

ఆయన మొదటి కథల పుస్తకం ‘వడ్ల చిలకలు’. పై మాటలకి పట్టింపుగా ఆ పుస్తకానికి పెట్టిన పేరున్న కథనే చూద్దాం.

వడ్ల చిలకలు

ఈ కథ 1994 ఏప్రిల్ ఆహ్వానం సాహిత్య మాస పత్రికలో అచ్చయింది.

డిగ్రీ పూర్తీ చేసిన విశ్వనాథం తల్లితండ్రుల బలవంతంతో కలెక్టర్ ఆఫీసులో తాత్కాలిక ఉద్యోగం కోసం సబ్ కలెక్టర్ ని కలవడంతో కథ మొదలౌతుంది. ఆ సబ్ కలెక్టర్ ఇంకా పెళ్లి కాని, అందమైన బెంగాలీ అమ్మాయి. పేరు అనుపమ ఛటర్జీ. ఆమె అందం, హోదా అతన్ని మోహపరవశుణ్ణి చేస్తాయి. సర్టిఫికెట్స్ పరిశీలించి సాయంత్రం బంగ్లా కొచ్చి కలవమంటుంది. ఇంటికొచ్చి ఆమె ఆరా లోనే తేలుతూ ఉంటాడు విశ్వనాథం. ఉదయం ఆమెని కలిసినప్పుడు ఆమె అన్న మాటలు అతనికి నచ్చుతాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో ఆరితేరిన అతను ఈ చిన్న ఉద్యోగంలో ఇమడడం ఆమెకి ఇష్టం లేదు. ముందు సైకిల్ యాత్ర చేసి దేశం పర్యటించమంటుంది. కలెక్టర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవమంటుంది. సాయంత్రం బంగ్లా లో ఆమెను కలిసి ఆమె చెప్పినట్లే నిర్ణయించుకుంటాడు కూడా. తల్లితండ్రులు, పెదనాన్న, ఈ ఉద్యోగానికి రికమండ్ చేసిన సుబ్బారావు విశ్వనాథం నిర్ణయాన్ని కాదంటారు. పెదనాన్న అయితే విశ్వనాథం ఎంచుకున్న బాటలో వుండే కష్టాల్ని ఏకరువు పెడతాడు. వాళ్ళంతా తాము చెప్పినట్లు ఉద్యోగంలో చేరితే అతని భావి జీవితం బావుతుందని నూరిపోస్తారు. తండ్రి కోపంతో మాట్లాడడు. తల్లి పోరుపెడుతుంది. మెల్లగా విశ్వనాథం కరిగి వారు చూపిన బాటలోనే ఉద్యోగం లో జాయిన్ అవుతాడు. పెళ్లౌతుంది. కూతురు పుడుతుంది. ఇప్పుడు అతను అందరిలాగే ఒక సామాన్య ఉద్యోగి. అతను ఉద్యోగం లో జాయిన్ అయిన ఏడాదే అనుపమ బదిలీ మీద వెళిపోతుంది. ఆమె ఒక మలయాళీ చిత్రకారుణ్ని పెళ్ళాడడం తెలిసిందని విశ్వనాథం తోటి ఉద్యోగితో అంటాడు.

ఇలా భాష ద్వారా కుచించి ఈ కథని చూడొచ్చు. కానీ భావం ద్వారా ఆయన సూటిగా చెప్పని అంశాలెన్నో వున్నాయి. అవి చదువరిలో ప్రశ్నలై మెలి పెడతాయి. రచయిత వాడే భాష, వాక్యాలు చెప్పే కథ ఒకటైతే ఆ భాష, వాక్యాల వెనక దాగిన అసలు కథ వేరే వుంటుంది. ఇలా కథ చెప్పడం శాస్త్రి గారి పేటెంట్.  ఆ పైకి చెప్పని కథని అందుకోవడానికి చదువరి కొన్ని నొప్పులు తప్పకుండా పడవలసి వుంటుంది. ఆ నొప్పులు పడకుండా ఉపరితలం చదివితే రచయిత ఏదో చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అనే దురభిప్రాయం కలిగే అవకాశం కూడా వుంది. అందుకే శాస్త్రి గారి కథలు సూపర్ హిట్ తెలుగు సినిమాలాగా హంగామాలు చేయడం వుండవు.

ఇంతకీ ఆ చెప్పని కథ ఏవిటీ? విశ్వనాథం అనుపమల మధ్య జరిగినదేవిటో రచయిత విశ్వనాథం కోణం నుండే వాచ్యం చేస్తారు. అనుపమ కి అతని పట్ల ఎటువంటి భావమో ఏమీ పైకి చెప్పరు. విశ్వనాథం అనుపమ పట్ల ఆకర్షితుడు అవుతాడు. కానీ అనుపమకి కూడా విశ్వనాథం మీద తెలియని గురి ఏర్పడుతుంది. అందుకే అతన్ని మొదటి పరిచయంలో ఎక్కువ సేపు తన ముందు వుండనిస్తుంది. ఒక రిటైర్డ్ గుమస్తా కొడుకుని అంతసేపు వుండనీయడం, టీ ఆఫర్ చేయడం వెనక ఆమెకున్న ఆకర్షణని వాచ్యంగా రచయిత చెప్పరు. అతని పట్ల ఆకర్షితురాలు అవడానికి కూడా ఆమెకున్న కారణాలు ఏవిటి అనేది కథలో వున్న వాక్యాల్లో చదువరి గ్రహించగలగాలి. అతని చదువు పక్కన పెడితే యవ్వనం లో మొదటి చూపు, రూపం పట్ల వుండే మోహం. అతనిది దృఢమైన దేహం అని చెప్పడానికి బదులు అతని ఆటలలో నైపుణ్యం చెపుతారు రచయిత. ఆమె అతనిని ఈ చిన్న ఉద్యోగం కంటే కలెక్టర్ లెవెల్ కి చదవమని ప్రోత్సహిస్తుంది. ముందు దేశం చుట్టి రావడానికి సైకిల్ యాత్ర చేయమంటుంది. ఇవి ఉచితంగా ఇచ్చే సలహాలే అని అనుకుంటే సరిపోదు. అతని పట్ల ఆమె కన్సర్న్ ఫీల్ అవుతోంది అనే స్పృహ ఆమె చేష్టల్లో కనిపిస్తుంది. సాయంత్రం బంగ్లాకి రమ్మని అతన్ని టైం కూడా చెప్తుంది. ‘why don’t you come to my place, say , around six.?’ అందామె.

అసలు ఈ కథకి ఈ పేరు ఏవిటి? అని చదివిన వాళ్ళందరూ వేసుకునే ప్రశ్న. ఎలా ఈ పేరు ఈ కథకి నప్పుతుంది? అసలు వడ్ల చిలకలు అంటే ఏమిటి?, అనేది తెలిసినా ఆ పేరు కథకి ఎలా ప్రతీక అనేది తెలియడానికి విశ్వనాథం ఆర్ధిక సామాజిక కుటుంబ నేపథ్యం పసి గట్టగాలగాలి. వడ్ల కు పట్టే పురుగును వడ్ల చిలకలు, వడ్ల గువ్వలు అని కృష్ణా గోదావరి సాగు ప్రాంతంలో పూర్వం అనేవారు. బహుసా ఇప్పుడు ఎవరికీ తెలియక పోవచ్చు. ఇప్పుటి పురుగు మందుల  సాగు పద్ధతులకి అవి కనుమరుగు కూడా అయిపోయాయి. పంట పండిన తర్వాత నూర్పిళ్ళు అయ్యాకా వడ్లను చేను పక్క దిబ్బల మీదా ఇంటి అవసరాలకు ఇంటి వెనక దొడ్లోనో వడ్లరాశి చుట్టూ పురికట్టి పైన గడ్డి, తాటాకులతో కప్పేవారు. కొన్ని రోజులు, నెలలపాటు ఆ పురి చుట్టిన రాశులు అలానే ఉండేవి. వడ్లు దంచుకోవలసినప్పుడో మిల్లు ఆడించవలసినప్పుడో పురి విప్పేటప్పుడు ఆ వడ్లలోనే పుట్టిన వెండిరంగు పురుగులు కనిపించేవి. అప్పటికే అవి తినగలిగినంత వడ్లలోని గింజలను మాయం చేసేవి. ఈ పురుగులు కొంచెం ఎత్తు ఎగరగలవు. ఇవి పురుగులే కానీ వడ్లంత సైజులోనే చిలక ఆకారంలో రెండు రెక్కలతో వుంటాయి. ఎగిరీ ఎగరడంలోనే అవి పొడి అయిపోతాయి. పురుగు అని పసి కట్టే లోపే అవి పొడి అయిపోతాయి. చిలకలు చెట్ల కాయల్ని కొడితే ఈ వడ్లచిలకలు వడ్లలోనే పుట్టి వడ్ల గింజల్ని తిని తనువు చాలిస్తాయి.

ఈ కథావస్తువుకు వడ్ల చిలకలు పేరు ఎలా సరిపోతుంది. బ్రిటష్ కలెక్టర్ దొర దగ్గర పనిచేసిన కోటీశ్వరరావు కొడుకే విశ్వనాథం. కథా కాలానికి తండ్రి రిటైర్ అయి ఉంటాడు. మధ్యతరగతి బతుకులు. జీవితానికి సంబంధించిన ప్రతీ విషయమూ అది రేపటిది లేదా ఇరవై ఏళ్ళ తరవాతదీ అయినా సరే ఈ వర్గం ముందే ఒక గిరి గీసుకుని ఆ గిరిలోనే అంతమై పోతూ వుంటుంది. ఆటల్లో మెరిక లాంటి విశ్వనాథాన్నీ తదనుగుణమైన అతని కలల్నీ, అతని ఆలోచనల్నీ తనని చేసుకోనివ్వదు. అతని జీవితానికి సంబంధించి ఏ విషయం లోనూ అతనిని వేలు పెట్టనివ్వదు. విశ్వనాథాన్ని ఆ సబ్ కలెక్టర్ సూచించిన విధంగా వెళ్ళే మార్గాన్ని ధ్వంసం చేసి అతణ్ణి ఒక బడుగు బతుకు ఉద్యోగి చేసేలా తల్లితండ్రులు, పెదనాన్న, సుబ్బారావుల మధ్యతరగతిగుంజ కట్టేస్తుంది. ఇక్కడ వడ్ల చిలకలు ఎవరో మళ్ళీ అరటిపండు వొలవక్కర్లేదు. మధ్యతరగతి లో పుట్టి మధ్య తరగతిలోనే మాయమయ్యే బడుగుల తలపులు. ఇంత నేపథ్యం వున్న ప్రతీకని కథకి పేరుగా పెట్టి రచయిత చదువరికి ఒక పజిల్ కూడా గీస్తారు.

శాస్త్రి గారి వాక్యాల వెనక చాలా కథ వుంటుంది అనుకున్నాం కదా. అయితే కొన్ని వాక్యాలు చదువరిని మరీ అవాక్కు చేస్తాయి. ఆ వాక్యాల సందర్భం వర్ణన గానీ కథన గమనం గానీ కావచ్చు. ఓ మూడు వాక్యాలు చూద్దాం. ఆఫీసులో ఆమె ఎదురుగా విశ్వనాథం వున్నపుడు ఆమె అతని సర్టిఫికెట్లు అన్నీ గమనించి అతనికి ఈ వుద్యోగం కాదని వేరే దిశానిర్దేశం చేస్తూ అతడినే గమనిస్తూ వుండగా ‘చంటి పిల్లాడు యేడిచినట్టు ఫోన్ మోగింది. చిరు విసుగుతో ఫోన్ అందుకుందామె.’ ఆమె ఇంటెన్షన్ ని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగడాన్ని పై పోలిక వాక్యం ఆ వాతావరణాన్ని పట్టి ఇస్తుంది. పాతకాలం గుండ్రంగా డయల్ చేసే ఫోన్లు చేసే శబ్దాన్ని చంటిపిల్లాడి ఏడుపు తో చేసిన పోలిక దగ్గర కొంచెం చదువరి పాజ్ తీసుకుంటాడు. ఎందుకంటే రచయిత చేసిన పోలిక ఎంగిలిది కాదు. సరి కొత్తది. రెండోది అనుపమ ఆకర్షణ లో పడి సాయంత్రం ఇంటికి రమ్మన్న తరవాత బయటకి వచ్చి ‘లూనా మీద రోడ్డుకి కనీసం అడుగు ఎత్తులో ఇంటికి చేరాడు విశ్వనాథం’. ఆమె ఆలోచనలతో ఆమె లోకంలో ఎగురుతూ అనేవి సాధారణ రచయితల వాక్యాలు. అడుగు ఎత్తులో అని సూచించడం, ఆ తర్వాతి వాక్యాలు కూడా  ఆమె పట్ల అతని మైకపు స్థితిని వర్ణించే వాక్యాలు కూడా. మూడవది విశ్వనాథం ఉద్యోగం చేయడానికి బదులు తీసుకున్న నిర్ణయాన్ని ఇంటిలో అందరూ తిరస్కరిస్తూ అతనికి మధ్యతరగతి జ్ఞాన బోధ చేస్తారు. పెదనాన్న ఇంకా ఎక్కువ క్లాసు తీసుకుంటాడు. ఇదంతా నాలుగైదు పేరాలు సుదీర్ఘంగా నడుస్తుంది. దానికి ముందు గట్టి నిర్ణయంతో ఇంటికి చేరిన విశ్వనాథాన్ని సుబ్బారావు, పెదనాన్నలు ‘మధ్యలో యేవో అడుగుతూ విస్వనాథాన్ని ఇంటి కక్ష్యలోకి తీసుకువచ్చేరు’ అంటారు రచయిత. ఇంటి కక్ష్య ఇక్కడ మధ్యతరగతి సంసారపు గిరిలోకి అనే ప్రతీక. చివరికి విశ్వనాథం ఇంటివారి దారిలోకే చేరడాన్ని ఈ వాక్యం ముందుగానే చెప్పకనే చెప్తుంది. ఇటువంటి నిగూఢమైన సూచన వాక్యాలు శాస్త్రి గారి కథలలో చొక్కాలోపలి బనీనులా దాగి వుంటాయి.

ఇంకా ఈ కథ గురించీ శాస్త్రి గారి రచనాశిల్పరీతుల గురించీ ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఎవరికి వాళ్ళు ఆ ఆలోచానా స్పోరక కథా పజిల్ లోకి చొరబడకపోతే, పైన చెప్పిన నొప్పులు పడకపోతే తత్త్వం బోధ పడదు. ఎందుకింత శ్రమ పడి చెరకు చీల్చి రసం తాగడం, డిస్పోజబుల్ గ్లాస్లో అయిస్ కలిపి  గొంతులోకి దిగిపోయే రెడీమేడ్ సరుకు వుండగా అనే చదువరులకు ఓ దణ్ణం. శాస్త్రి గారి ఓ పుస్తకానికి ముందుమాటలో కేఎన్వై పతంజలి, ‘శాస్త్రి గారు రచయితల రచయిత’ అని అనడం పొగడ్త కాదు.

*

కె.రామచంద్రా రెడ్డి

4 comments

Leave a Reply to దశరధ్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శాస్త్రి గారి రచనలోని ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. శాస్త్రి గారి రచనలు ఎలాంటి ఆలోచనలను కలిగిస్తాయి అనే విషయం రామచంద్రారెడ్డి గారు చక్కగా వివరించారు. శాస్త్రి గారి కథలు చదువుతుంటే, ప్రతి వాక్యం చివర ఉండే పుల్ స్టాప్ మనల్ని తప్పకుండా అవుతుంది. అక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ముందుకు సాగాల్సిందే.

  • శాస్త్రి గారి వాక్యంలోపలి వాక్యంలా రారెడ్డి.చొక్కా వెనుక బనీనులా.

  • నిజం. చాలా బా చెప్పారు.

  • “వడ్ల చిలకలు” కథ చదివాక భయం కూడా వేస్తుంది, వడ్ల చిలకలులా మారొద్దు అని రచయిత ఉద్దేశం కావొచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు