ఉధృత ప్రవాహాన్ని కలగంటున్న కవి

ఉధృత ప్రవాహాన్ని కలగంటున్న కవి

వ్యక్తి వ్యక్తిత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? దేనిని కొలమానంగా తీసుకొని సమాజం ఒకవ్యక్తి వ్యక్తిత్వాన్ని గుర్తిస్తుంది? అని చూసినప్పుడు  ఆ వ్యక్తి  మాటలు  ఆతని చేతలు ఆధారం గానే అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రెండు సాధనాలతోనే ప్రధానంగా వ్యక్తిత్వాన్ని గుర్తించే  అవకాశముంటుంది.  ఆపైన మరికొన్ని సాధనాలు కూడా వుంటే వుండవచ్చు.

తనదైన సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వ్యక్తి తాను మాట్లాడే మాటలకు చేసే చేతలకు మధ్య దూరం పెరగకుండా చూసుకోవాలి. ఆదూరం ఎంత తక్కువ ఉంటే ఆ వ్యక్తి యొక్క విలువ గౌరవం అంత ఎక్కువగా ఉంటాయని అనుభవ పూర్వకంగా మనకు తెలుసు. ఆ దూరం పెరిగే కొద్దీ ఆతని విలువ యొక్క సాంద్రత తగ్గుతుంది. తద్వారా వ్యక్తి నలుగురులో పలచన అవుతాడు.

కొందరు వ్యక్తులు మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు  సరికదా! వ్యతిరేక దిశలో వుంటాయి. అలాంటి వారిని గురించి చెప్పెందుకే సమాజంలో కొన్ని సామెతలు ఏర్పడ్డాయి. ఉదా: “చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు” వంటి సామెతలు ఉన్నాయి.(ఇక్కడ “దొమ్మరి” పదం వాడినందుకు క్షమించాలి. లోకంలో ఉన్న సామెతను మాత్రమే గుర్తుచేశాను.)

మరి కొంత మంది ఉంటారు. వారు సంఘంలో(సమాజంలో) కానీ వివిధ సంస్థలలోగానీ పెద్ద మనుషులు గా చెలామణి అవుతారు. అంగపుష్టి,ఆర్థిక బలం, నలుగురిలో పేరు, పలుకుబడీ వంటి బలాలున్నవారు. ఆలాంటివారిలో కొందరు చెప్పే మాటలకు చేసే పనులకు మధ్యనున్న వ్యత్యాసాన్ని చూసి “మాటలు చూస్తే కోటలు దాటుతాయి పనులు చూస్తే పంచపాళి దాటవు” అంటారు. ఈ సామెత ముఖ్యంగా రాజకీయ నాయకులకు, గ్రామాల్లోని గ్రామ పెద్దలు, పెత్తందార్లకు  చెందుతుందని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఏది ఏమైనా వ్యక్తి గౌరవం తను చెప్పే మాటలు చేసే పనుల మీద ఆధారపడి ఉందని మనకు అర్థం అవుతుంది. ఈ రెండింటి మధ్య సమాజం ఒక స్పష్టమైన గీత గీసి చూస్తుంది. అయితే ఆ గీత సామాన్య దృష్టికి కనపడదు. అది స్పష్టమైనగీతే అయినప్పటికీ అస్పష్టంగానే ఉంటుంది. బయటకు అందరికీ కనపడదు.

‘దృష్టి మారితే సృష్టి మారుతుంది’ అనడంలోని అంతరార్థము కూడా ఇదే అని నా అభిప్రాయం. అంతవరకు కనిపించే సృష్టి( చుట్టు వున్న సమాజం) మన దృష్టి మారినప్పుడు మరోలా కనిపిస్తుంది. ఇక్కడ దృష్టిమారడం అంటే ఒక తాత్విక దృక్పథంతో చూడటం. ఒక తాత్విక దృక్పథాన్ని అలవరచుకొని  తాను అలవరచుకున్న తరువాత  వచ్చే నవీన దృష్టికి/ లోతైన చూపుకి, అంతకు ముందరి సామాన్య    దృష్టికి మనచుట్టూ ఉన్న సమాజం యొక్క రూపురేఖలు వేరుగా కనబడతాయి. అయితే అవి ఆయా వ్యక్తులలో తాము ఏర్పరచుకున్న తాత్వికతలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించవచ్చు కూడా.

కార్ల మార్క్సు ప్రపంచము తల్లక్రిందుల్లుగా నడుస్తోంది అంటాడు. నాకు అలా కనపడలేదే అంటే నువ్వు కూడా తలకిందులుగా నడుస్తున్నావు గనుక, నీకు ఆ వ్యత్యాసం తెలియట్లేదని అంటాడు. నువ్వు నిటారుగా నిలబడితే ప్రపంచం ఎలా నడుస్తుందో కనిపిస్తుందని చెబుతాడు. ఒకే వేగంతో సమాంతరంగా నడిచే వస్తువుల మధ్య దృశ్యం మారదు అనేది మనకు తెలిసిన సత్యమే. మార్క్సు అలా  చెప్పడంలో భావం, మన దృష్టిలో అనగా మన ఆలోచనలలో రావాల్సిన మార్పుగురించే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే

ఇటీవల ఒక పత్రికలో వచ్చిన వి.లక్ష్మణరావు గారి కవిత ‘ప్రవాహం’ చదివాక నాలో కలిగిన భావాలను పంచుకోవాలని చేసిన ప్రయత్నమే ఈ వ్యాసం.

కవితలోకి వద్దాం. కవిత ప్రారంభం ఇలా ఉంది.

“మాటకీ  చేతకీ మధ్య

స్పష్టాతిస్పష్టమైన అస్పష్ట గీతే

మొలకను వేరు నుంచి

చినుకును మేఘం నుంచి

మనిషిని చరిత్ర నుంచి వేరు చేస్తోంది”

మొలకది పురోగమనము అది వేరులా భూమిలో దాగదు. పైకి లేస్తుంది పెరుగుతుంది. విస్తరిస్తుంది. చినుకు మేఘములో బందీ కాదు. ఎందుకంటే అవి ఆచరణ వాదులు తమ ఆచరణలో పరోపకారానికై ప్రయత్నిస్తాయి. స్తబ్దంగా వుండలేవు. అందుచేత  అవసర మైనప్పుడు అవి వేరుపడతాయి. తరువాతి వాక్యంలో ‘మనిషిని చరిత్రనుంచి వేరు చేస్తోంది ’ అంటాడు కవి.

మనిషిని చరిత్ర నుంచి వేరు చేస్తోంది ఎవరు? ఈ స్పష్టాతి స్పష్టమైన అస్పష్టగీతే. నిజానికి మనకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది. మనిషే లేకుంటే చరిత్ర ఎక్కడవుంది!? అని. మనిషి చేసే చేతలే కదా! చరిత్ర. నిన్నటి మనిషి చేసినపనే నేటి చరిత్ర. ఆ చరిత్ర తననుంచి మనిషిని ఎలా వేరుచేస్తుంది అంటే ఇక్కడ మనిషిని ఒక వ్యక్తిగా భావించాడు కవి. ఆ మనిషి ఆచరణ లేని వ్యక్తి అయినప్పుడు చరిత్ర ఆతనిని తన నుంచి వేరు చేసేస్తుంది. అతడు చరిత్రలో భాగం కాలేకపోతాడు అనేదే కవి భావం.

ఆ స్పష్టమైన అస్పష్ట గీత ఇంకా ఎలా పని చేస్తుందో కవితలో చెప్తున్నాడు.

“కదిలిన కాలానికి కరిగిన గతానికి

చిగురించిన జీవితానికి రాలిన క్షణాలకి

పెనవేసుకున్న బంధాన్ని తెగ్గోస్తుంది”

అంటాడు.

ఇందులో భావాన్ని స్పష్టంగానే చెప్పాడు. కదిలే లేక కదులుతున్న కాలం భవిష్యత్తు వైపు వెళుతుంది కరిగిన కాలము, భూత కాలానికి జారిపోతుంది. ఈ రెండింటి మధ్య గీత వర్తమానం. అలాగే చిగురించిన జీవితం.. జీవితంలో రాలిన క్షణాలు కూడా. ఇది వాస్తవం. శుద్ధ భౌతికము. అయితే

“అయోనిజుడని మనోఫలకం మీద

భిన్నకల్పనలతో పునః ప్రతిష్టకి

మాయోపాయాన్ని అల్లుతుంది” అంటాడు.

మన లోపల చైతన్యం మండే కాగడా లాగా ఉన్నప్పుడే ఈ భౌతిక వాస్తవాన్ని గుర్తించగలుగుతాం. మన లోపల మబ్బుకాసినట్లైనా మనలో చీకటి వ్యాపిస్తుంది. భిన్నకల్పనలతో తిరిగి అభౌతిక అంశాలతో రకరకాల కథనాలతో అయోనిజులు, కుంభసంభవులు గురించిన కథలు పుక్కిటి పురాణాలు మనలోకి వ్యాపిస్తాయి. తిరిగి తిరిగి మనల్నిఅల్లుకుపోతుంటాయి. ఇది వ్యక్తికే కాదు సమాజానికి వర్తిస్తుంది. సమాజ చైతన్యం మసక బారినప్పుడు దట్టమైన పొగమంచులా కల్పన అల్లుకుపోతుంది. నేడు దేశములో జరుగుతున్నది అదే కదా!

“ఆ గీతే…

కదిలిన సమూహాలకి కన్న కలలకి

నడిచిన దారులకి రాలిన కన్నీళ్ళకి

చిందిన నెత్తురికి మధ్య

పొసగని ఇతివృత్తం

నిర్వేదపు జాడగా మిగులుతోంది” అని అంటాడు.

ఎన్నో కలలతో కదిలిన సమూహాలు, ఉద్యమాలు, నడిచిన దారులు రాలిన కన్నీళ్లు చిందిన నెత్తురుకి మధ్య పొసగని ఇతివృత్తం నిర్వేదపు జాడగా మిగిలుతోంది అని చెప్తున్నాడు.

ఆ గీతను గుర్తించకుండా తదనుగుణంగా కాకుండా పనిచేసే ఏ సమూహాలైనా ఏ ఉద్యమాలైనా వారు చేసే త్యాగాలైనా చివరికి నిర్వేదపు జాడగా మిగిలిపోతాయని, మిగిలిపోతున్నాయని వాపోతాడు.

కనుక ప్రతి ఒక్కరూ ఆగీతను గమనించాలని మాటలు చేతలు మధ్య, అనగా ఆలోచనలకు ఆచరణకు మధ్య గీతను చెరిపేయాలని పరోక్షంగా కోరుకుంటున్నాడు.

అయితే కవి నిరాశ పడ్డాడా!.. లేదు చివరి చరణంలో ఈ నిర్వేదనని ఎలా అధిగమించాలో అధిగమిస్తామో కూడా చెప్పాడు.

“నేత్రపుట తెరిచిన క్షణాన

తీరం వెంబడి ఓ కెరటం

ఉదృతంగా లేస్తోంది

ఆ ఉధృతిలోంచి  యుద్ధనగారా

మార్మోగుతోంది

మాటకి చేతకే మధ్య

గీసిన గీతను చెరిపివేసే

ప్రవాహం కోసం”..అంటున్నాడు

సమాజం చైతన్యవంతమై కళ్ళు తెరిచిన నాడు ఆప్రజా చైతన్యం ఒక కెరటంలా లేచి, ఉద్యమించి యుద్ధ నగారా మోగిస్తుందని అది మాటకీ చేతకీ మధ్యనున్న గీతలను చెరిపేస్తుందని, అపుడు గీతల అవసరమే వుండదని చెపుతున్నాడు. ఆ ప్రవాహంలో కేవలం ఆ గీతనే కాదు మనుషుల మధ్య గీయబడిన అన్ని గీతలు చెరిగిపోతాయి. కుల మత వర్గ విభజన రేఖలన్నీ విరిగిపోతాయి. ప్రవాహములో కొట్టుకుపోతాయి  ఇటీవల నేపాల్ లో వచ్చిన ఉధృతమైన వరదలా జనచైతన్యం ఉప్పొంగుతుంది. దాన్ని ఏ శక్తి నిలువ రించలేదని కవి భవిష్యత్ లోకి తొంగి చూసి చెప్పిన మాట. నేపాల్ హిమానీ నదాల వల్ల ఏర్పడ్డ వరద వినాశనానికి దారితీసింది. కానీ సమాజ చైతన్యం కన్ను విప్పితే అది అన్ని అపసవ్యాలను అపమార్గాలని రూపుమాపుతుంది. (నేను ఇక్కడ నేపాల్ ఉదాహరణ ఇవ్వడం ఆ ఉధృతిని చెప్పడం వరకే) ఇటీవల ఎగిసి పడ్ద జెన్ జీ ఉద్యమాలను పరోక్షంగా ధ్వనింప చేస్తున్నాడు కవి.

ఈ కవిత మామూలు దృష్టికి అంత సులువుగా అందకపోవచ్చు చుట్టూ జరుగుతున్న పరిస్థితులతో మేళవించి చూసుకున్నప్పుడు కవిత గొప్ప భావస్పోరకంగా ఉందని అర్థం అవుతుంది. అన్ని అడ్డంకులను అవరోధాలను అధిగమించే ప్రవాహన్ని కలగంటూ ఉద్వేగపూరితమైన నడకతో రాసిన కవిత మనలో ఆసక్తిని కలగజేస్తుంది. మంచి కవిత రాసిన లక్ష్మణ రావు గారికి అభినందనలు.

ప్రవాహం

 

మాటకీ  చేతకీ మధ్య

స్పష్టాతిస్పష్టమైన అస్పష్ట గీతే

మొలకను వేరు నుంచి

చినుకును మేఘం నుంచి

మనిషిని చరిత్ర నుంచి వేరు చేస్తోంది

 

ఆ గీతే..

కదిలిన కాలానికి కరిగిన గతానికి

చిగురించిన జీవితానికి రాలిన క్షణాలకి

పెనవేసుకున్న బంధాన్ని తెగ్గోస్తుంది

అయోనిజుడని మనోఫలకం మీద

భిన్నకల్పనలతో పునఃప్రతిష్టకి

మాయోపాయాన్ని అల్లుతుంది

 

ఆగీతే..

కదిలిన సమూహాలకి కన్న కలలకి

నడిచిన దారులకి రాలిన కన్నీళ్ళకి

చిందిన నెత్తురికి మధ్య

పొసగని ఇతివృత్తం

నిర్వేదపు జాడగా మిగులుతోంది

 

నేత్రపుట తెరిచిన క్షణాన

తీరం వెంబడి ఓ కెరటం

ఉదృతంగా లేస్తోంది

ఆ ఉధృతిలోంచి  యుద్ధనగారా

మార్మోగుతోంది

మాటకి చేతకే మధ్య

గీసిన గీతను చెరిపివేసే

ప్రవాహం కోసం.

*

రెడ్డి రామకృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.