ఇవన్నీ జ్ఞాపకం కాదు వాస్తవమే…

కొత్త కుండలో నీళ్ళు జలుబు చేస్తాయట. పాత జ్ఞాపకాలు కూడా అంతే! ఎప్పుడు మొదలైంది ఈ ఊపిరాడని భావన. మొన్న వాన వెలిసి కరెంట్ పోయిన రాత్రి నుండి అనుకుంటా. తెల్లవారిన తరువాత, నడిచే దారిలో కనిపించిన వేప చెట్టు ఒక జ్ఞాపకం పొర విప్పితే, పసుపు పూలతో తివాచీ పరిచిన కాపర్ పాడ్ మోసుకొచ్చే వాసనలు ఇంకొన్నింటిని కదిలించాయి.  రోజువారీ పనులు, బాధ్యతలు. బంధాలు అలానే సాగుతూ ఉన్న సమయాల్లో, వీటన్నింటికీ అతీతంగా సబ్ కాన్షస్ లో ఏదో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మొదలే తప్ప ముగింపు లేని ఒక అనుబంధం, ఇన్నాళ్ళైనా అంటిపెట్టుకున్న దాని  తాలూకు పరిమళం…..

తెల్లవారు ఝామున  వేంకటేశ్వర స్వామి గుడి  నుండి వినిపించే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గొంతు లోని ఆర్ద్రత, ఇళ్ల బయట కళ్ళాపి చల్లే నీళ్ల చప్పుడు, ఆ టైంలో వూరి గుండా వెళ్లే మెయిల్ కూత , కొక్కొరొక్కో అనే కోడి పిలుపు- అన్నీ ఇంచుమించు ఒకేసారిగా ఊరిని నిద్ర లేపేవి. రోడ్డు మలుపు లో ఉన్న దేవుడి గుడి దాటి ఒక యాభై అడుగులు వేసి కుడి వైపు తిరిగితే ఒక చిన్న సందు వస్తుంది. అందులో నుండి నడిచి ఇంకో యాభై అడుగులు వేస్తే ఒక పెద్ద ఇల్లు- భవంతి అనాలేమో! ఆ మొత్తం స్థలంలో ఆ పెద్ద ఇల్లు ఒక్కటే కాకుండా  అదే ప్రాంగణం లో ఇంకా కొన్ని  చిన్న ఇళ్ళు కూడా ఉండేవి.  అసలక్కడ అలాంటి ఒక ప్రపంచం ఉందని తెలిసే అవకాశం లేదు నాకు- తన పరిచయం లేకపోతే!

రెండంతస్తుల పెద్ద మేడ, ముందు అంత పెద్దది కాని  తోట , మధ్యలో కృష్ణ విగ్రహం- మొదటి సారి చూసాను. ఇనుప తీగలతో చేసిన గేటు తీసి వెళ్తే తోట చుట్టూ ఉన్న వైరు గోడకు అల్లుకున్న రాధామాధవం తీగ, అలవోకగా నేల కి జారుతూ, మొదటి సారి చీర కట్టుకున్న అందమైన అమ్మాయి లా అనిపించింది. మేడ మీదకి వెళ్లేందుకు ఉన్న చుట్టు మెట్లని ఆనుకొని పైదాకా పాకి విరగబూచిన మాలతీ లత, నిశ్శబ్దం గా అన్నీ గమనిస్తూ!  ఒక పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళినపుడు వెన్నెల్లో ఇంకా తెల్లగా మెరిసిపోతూ అందం గా అల్లుకున్న మాలతీ లత ఇంకా జ్ఞాపకం. అసలు ఆసరా కోసం అల్లుకున్నపుడు కూడా అంత హుందా గా ఉండేచోటు అని అంతకంటే బాగా ఎవరు చెప్పగలరు. ఆ ఇంట్లో ఎవరు తెలియకపోయినా, అక్కడి అందమైన వాతావరణం తో ప్రేమ లో పడిపోయాను. ఆ ప్రదేశం తో  చాలా రోజుల్నించీ పరిచయం ఉన్న భావన.

అప్పటిదాకా అక్కడ తను ఉంటున్నట్లు నాకు తెలీదు- అసలు తను నా ప్రపంచంలోకి రాబోయే విషయం కుడా తెలీదు. ఎప్పుడైనా చిన్న నవ్వు తప్ప మొదట్లో పెద్దగా మాటలు ఉన్న గుర్తు లేదు మా మధ్య. కొంతవరకు పక్కనున్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కావడం, తను ఎక్కువ వినే వ్యక్తి కావడం కూడా ఒక కారణం ఏమో మరీ. ఎప్పుడూ వాళ్ళ ఇంటి నిండా బోల్డంత మౌనం ఉండేది- మా మధ్య కూడా…

ఇంటి బయట సన్నగా పొడుగ్గా ఉన్న మెట్లు, నాకు చాలా ఇష్టం. కుడి వైపు మాత్రం  మొక్కలకి కుండీలు లాగా ఖాళీ వదిలి, క్రింది ఒక వరుస అరుగు కూర్చునేందునకు వీలుగా ఉండేది.  దీపావళికి అక్కడే వరుసగాప్రమిదలు వెలిగించడం చూసిన గుర్తు. ఆ వెలుగులో మెరిసిన తన నవ్వు కూడా…అప్పుడప్పుడూ అందులో నాటిన మొక్కలకి కొన్ని పూలు పూస్తూ ఉండేవి. అన్నింటి కంటే ముఖ్యంగా చెక్క తలుపు పక్క మూలన దాక్కుని తన పరిమళం తో మాత్రమే మాట్లాడే విరజాజి చెట్టు నాకిష్టం. కొన్నిసార్లు తన నవ్వు విరజాజి విచ్చుకున్నట్లు ఉండేది. ఎప్పుడైనా తనకొసం వెళ్తే సాయంత్రాలు ఓపిగ్గా జాజిపూలు కోస్తూ వాళ్ళమ్మ గారు తల తిప్పి ఒక నవ్వు నవ్వే వారు- అంటే తను ఇంట్లోనే ఉందని అర్థం- బోల్డంత హాయిగా అనిపించేది. అప్పుడున్న నా ప్రపంచం లో ఉన్న బరువు బాధ్యతల మధ్య తనొక పెద్ద ఒయాసిస్. అసలు తను ఉండటమే పెద్ద ఊరట. చాలాసార్లు విన్నాను ఈ మాటల్ని- “నన్ను కాదు,  నేనున్నాను అనిపించే భావాన్ని మాత్రమే  ప్రేమిస్తున్నావు” అని. ఇప్పటికీ ఆ వాదనకి జవాబు చెప్పడం చాలా కష్టం నాకు. ‘యోగ వాసిష్టం’ లేకపోతే ‘రఘు వంశం’ బాగానే అర్థం అయినట్లు ఉంటుంది కానీ, ఈ ప్రశ్నకి మాత్రం  కొత్త కొత్త సమాధానాలు పుడుతూ ఉంటాయి. గెలుపు తెచ్చే ముగింపు కన్నా ఇష్టంగా మళ్లీ మళ్లీ ప్రయత్నించే ఈ అలసట లోనే నిండి పోయింది నా అస్తిత్వం అంతా! ఆద్యంతాలు లేని ఒక భావాన్నిఎన్ని అక్షరాలలో నింపినా లోలోన ఇంకా వెలితి మిగిలి పోయేది.

ఎప్పుడో ఒకసారి వాళ్ళ మేడ మీదకి వెళ్తే నేలమీద పరిచిన రంగురాళ్ల డిజైన్,  నగిషీ చెక్కిన తలుపులు, చిన్నప్పటి చందమామలో చదివిన రాజుగారి కోట అందులోని అందాల రాకుమారి- ఎందుకో ఇలాంటి కథలు గుర్తొచ్చేవి. గదిలో పందిరి మంచం, నల్ల చెక్కతో చేసిన డ్రెస్సింగ్ టేబుల్, చాలా సోరుగులు ఉండే చెక్క బీరువా, ఇవన్నీఒక వంద సార్లు ఐనా నా గొంతు విని ఉంటాయి. “జబ్ కోయి బాత్ బిగడ్ జాయే…” పాట, ఎల్టన్ జాన్ డయానా కోసం పాడిన పాట మొదటగా తన టేప్ రికార్డర్ లోనే విన్నాను. లత గొంతులో “రసిక బల్ మా….’, ఒకసారి వర్షం లో తడిసి వచ్చాక తన గదిలో వినిపించింది. నిద్ర లేచిన దగ్గరి  నుండీ గదిలో  రేడియో సర్వకాలసర్వావస్థ ల్లోనూ మోగుతూ ఉండేది- తను ఇంట్లోనే ఉన్న గుర్తుగా. గోడకు ఉన్న అలమార్లలో ఉన్న లావు బౌండ్ లా పుస్తకాలు,  వాళ్ళ తాతయ్య దగ్గర నేర్చుకుని అప్పుడప్పుడు చదివే  ఫ్రెంచ్ పుస్తకాలు , తన కోసం ఎదురు చూస్తున్నపుడు నాకు కంపెనీ ఇచ్చేవి- నిశ్శబ్దంగా……

గాన్ విత్ ద విండ్’ పుస్తకం మూడు సార్లు తను చదవడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. ప్రతిసారీ చదివాక తనలో కొంచెం దిగులు. ఆ పుస్తకంలో చివరి వాక్యం తనకి ఇష్టం కూడా. అనసరంగా ఇన్నిసార్లు చదివావా అని ఇప్పుడు అనిపిస్తుంది.

ఇంటి బయట చాలా రకాల గులాబీలు పూసేవి,  ముద్దుగా బొద్దుగా-  ఎరుపు , పసుపు ఇంకొన్ని విప్పారిన తెలుపు. వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు వాటిని,  అన్నదాత మాగజైన్ తెప్పించి మరీ. నేలకు దాదాపు ఆనుకుని ఉన్న పడక కుర్చీలో పడుకుని నెమ్మదిగా  తాతయ్య కళ్ల జోడులోంచి చూస్తూ, వాళ్ళ అమ్మతో ఏదో మాట్లాడుతూ ఉండేవారు, ఆవిడ కాలేజీ నుండి రాగానే కాఫీ కప్పుతో పక్కన కూర్చుని తను వాళ్ళ నాన్నగారితో నెమ్మదిగా మాట్లాడే తీరు, ఆ ఫ్రేమ్ చూడడానికి చాలా ముచ్చటగా ఉండేది. ఇంటి బయట ఉన్న వేప చెట్టు తప్ప మా మాటలు ఎవరూ వినే వారు కాదు. ఇదిగో ఇలాంటి వేసవి రాబోయే ముందటి మధ్యాహ్నపు వేళ కూడా, గంటలు గంటలు దాని క్రింద కూర్చుని కబుర్లు చెప్పిన గుర్తు. అప్పుడు విరబూసిన వేప పూత వాసన నిన్న పొద్దున నడిచినప్పుడు కూడా వచ్చింది. చెట్టు ఆనుకుని సిమెంట్ బెంచీ, అప్పుడప్పుడు పలకరించే పక్కింటావిడ, ఏదో మాటల్లో ఉన్నపుడు హడావిడిగా నవ్వి వెళ్లిపోయే వాళ్ళ అక్కయ్య. ప్రతి వాళ్ళు చాలా ప్రత్యేకం. తనకి సంబధించిన ప్రతి మనిషీ, పువ్వూ, మొక్కా, చెట్టూ పుట్టా.

ఒక పువ్వు ఇష్టంగా అనిపిస్తే, ఎందుకో అదొక్కటే కాదు – పువ్వు ఉన్న కొమ్మ, చెట్టు మిగిలిన కొమ్మలు దానికి ఆల్లుకున్న తీగ, చెట్టు పాదు లో మిగిలిన నీళ్లలో ఆడుకునే గువ్వ పిట్టలు, అన్నీ ఇష్టంగా అనిపిస్తాయి. అనిపించాలేమో కూడా(ఎందుకని అన్నానిలా. ఏమో ఏదో ధోరణిలో…). అసలు నన్ను నేను మర్చి పోవడం తన  పరిచయం తోనే మొదలైంది. అన్నట్లు తోట ముందు ఒక జామ చెట్టు అందులో వగరుగా ఉన్న జామ పిందెలు తిన్న రుచి ఇంకా గుర్తుంది. తను ఎప్పుడైనా అలిగినప్పుడో, కోప్పడినప్పుడో ఇవి గుర్తొచ్చేవి.

వాళ్ళ ఇంటి మెట్లు-

మోసింది మా మాటల్లోని బరువుని కూడా. మొదటి సారి తను చాలా మాట్లాడింది కూడా ఆ మెట్ల మీదనే. కిందంతా రాలిన వేప పండ్లు, తను చెప్తూ ఉంది,  నేను వింటూ ఉన్నాను. మనసంతా చేదు నిండిన ఫీలింగ్. అన్నీ మాట్లాడిన తరువాత నిర్లిప్తమైన తన సన్నటి నవ్వు మాత్రం నేను భరించలేకపోయాను. ఇంకా కలుక్కుమంటుంది గుండెల్లో…

“ఒక అందమైన అమ్మాయి…. అద్దాల మేడలో ఉండి, మాలతీ లత పక్కకి తోసుకుంటూ మెట్లు దిగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎదురుగా ఉన్న తోటలో కాసేపు నడిచి రాధామాధవం తీగని సరిచేసి వెళ్తుంది. సాయంత్రాలు కురిసే వెన్నెల్లో కాసిని జాజి పూలు కోసి మాల కడుతూ పాత హిందీ పాట సన్నగా పాడుకుంటుంది. గోరింటాకు పెట్టుకున్న ఆమె చేతి వేళ్ళు, నేర్పుగా పూలు గాయపడకుండా దండ కట్టే తీరు, సరిగ్గా చూసే వాళ్ళ గుండెల్లో నిలిచి పోతాయి.. అక్కడక్కడా రాలి పడిన ఆకులు, క్రింద పడి ఎండిపోయిన పక్షి రెట్టల మధ్య ఎండ వేళ,  కొంచెం వేడెక్కిన సిమెంట్ బెంచీ సాక్షిగా-  వెళ్లే ముందు నాలుగు మాటలు అరగంట నిశ్శబ్దం మధ్య లో దొర్లుతాయి. మళ్లీ ఎప్పుడు వస్తావని అడిగే ప్రశ్న మాత్రం గొంతులోనే మిగిలి పోతుంది, సమాధానం సన్నటి నవ్వే కనుక భరించే శక్తి లేక,  అందం గా పింగాణీ పెంకులతో చేసిన ఫ్లోరింగ్ చూస్తుంటే తన కోసం తెచ్చిన సంపెంగ వాసన చూస్తూ ఆ అమ్మయి ఏదో మాట్లాడుతుంది.  బయటకి వచ్చేదారిలో పలుచటి రెక్కల గులాబీ, ముద్దగా ఉన్న ఇంకో ఎర్ర గులాబీ చూస్తూ ఉంటాయి.  “సరే మరి!”  అన్న తరువాత కూడా ఇంకో గంటసేపు మాటల్లో పడి ఆగినప్పుడు మాత్రం అవి విసుగ్గా తల తిప్పుకున్నట్లు అనిపిస్తుంది.”

నా డైరీ లోని ఈ పేజీని కొన్ని వందల సార్లు చదువుకుని ఉంటాను- ఇన్నేళ్ళలో.

ఇంకో రోజు….

“ కొంచెం ఆ పక్కగా ఉన్న గోరింటాకు చెట్టు మాత్రం నువ్వు గోరింటాకు పెట్టుకున్న రోజు గర్వంగా నవ్వినట్లుంటుంది. ఎర్రగా పండిన చేతులతో నువ్వు వీణ సాధన చేసేప్పుడు ఒకసారి వచ్చాను అనుకోకుండా. ఎలా ఉన్నావని చెప్పాలి …

అప్పటి నుండి వీణను కూడా ప్రేమించడం మొదలు పెట్టాను. ఒకసారి తెగి పోయిన తీగను సరిచేయడానికి చాలా సేపు ప్రయత్నం చేశావు. ఏమైందో అడగడం గుర్తులేదు నాకు కానీ నువ్వు వీణ మళ్లీ వాయించలేదు. పిట్ట గోడకి తలానించి నువ్వుమాట్లాడేప్పుడు, నా దోసిట్లో నీ మెత్తటి అర చేతుల  స్పర్శ ఇంకా గుర్తుంది నాకు. రోజూ నువ్వు వినే అనార్కలి సినిమాలో పాటలు, నువ్వు వస్తున్నప్పుడు మెల్లగా దగ్గరయ్యే కాలి పట్టీల సవ్వడి నాతో పాటు నీ తలుపు పక్కగా ఉన్న తెల్ల గులాబీ తీగ కూడా వినేది”.

తన జ్ఞాపకాల బరువు ఎక్కువ ఎంత అంటే కొన్నిసార్లు నేను మోయలేనంత!  వద్దని తలుపు మూసిన ప్రతిసారీ మొండిగా మళ్లీ దబా దబా కొడుతూ ఉంటాయి. వినపడనంత దూరం పారిపోవాలి అని ప్రయత్నిస్తే… ఇదుగో ఇలాగే- వేప చెట్టు గాలి, మధ్యాహ్నపు గాలికి వూగుతున్న గంటలు, క్రింద రాలిన జాజి పూలు, ఏదో ఒకటి మళ్లీ మొదటికి తెస్తాయి.

గుడిలో ప్రదక్షిణలు, ఎంత మంది జనం మధ్య ఉన్నా తన్నతో ఉన్న కాస్త సమయం  ప్రశాంతం గా అనిపించడం, అందరూ వెళ్ళాక నవ్వుతూ పలకరించి అప్పాలు ప్రసాదంగా ఇచ్చే పూజారి, గుడికి రాగానే కాళ్ళు కడుక్కునెందుకు నీళ్లు తోడినప్పటి బక్కెట్ చప్పుడు, బావి పక్కనున్న తెల్ల జిల్లేడు చెట్టు, గేటు దగ్గర ఉన్నది  పంచముఖ నాగేంద్రుడు కనుక అయిదు ప్రదక్షిణలు చేసి ” సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం…..” అని ఈ శ్లోకం  చదవాలని తను చెప్పడం – ఇవన్నీ జ్ఞాపకం కాదు వాస్తవమే

(అదే  శ్లోకం మొన్న గుడికి  వెళ్ళినపుడు కూడా చదివాను).  కొంచెం ఆలస్యంగా వెళ్ళినపుడు దత్తాత్రేయుని గుళ్ళో, వేదం చదివే పిల్లల్తో పాటు చివరగా తీసుకున్న ప్రసాదం, గాయత్రి అమ్మవారి ఎదురుగా నిశ్శబ్దంగా నువ్వు పెట్టుకున్న కుంకుమ, దర్శనం అయ్యాక కూర్చున్నపుడు, వినిపించే శివాలయంలోని గంటలు, బయటకి వచ్చేపుడు వినిపించి మెల్లగా దూరమయ్యే పినాకిని ఎక్స్ప్రెస్ చప్పుడు – ఎప్పటికీ దూరం కాని ప్రశాంతత; ఇవన్నీతనకిష్టమైన వాటిలో కొన్ని. తను వేసుకునే టమాటో పండు రంగు ఎర్ర గాజులు, వాటి పక్కన మెరిసే వెడల్పాటి ఒక్కో బంగారు గాజు, మాట్లాడుతూ వాటిని నువ్వు సరిచేసుకునే సమయంలో నీ వేలికి మెరిసే తెల్ల రాళ్ళ ఉంగరం కళ్ల ముందు కదుల్తూ ఉంటాయి.  గుడి వెనుక చూసిన సూర్యాస్తమయం లోని అందం,  అశ్వద్ధ వృక్షం క్రింద గూట్లో ఉన్న దత్త పాదాల మీద తలానించినప్పుడు  మనసంతా నిండే  చల్లదనం తన ముఖంలో కనిపించేది. ఒక ఆదివారం అనుకుంటా, లాకుల్లో చూసేందుకు తన క్లాస్మేట్ రమ్మందని వెళ్ళాం. కాలువల మీద కట్టిన సిమెంట్ కడ్డీల మీద నడక, చుట్టూ పచ్చటి పొలాలు కాలేజీ రోజుల్లో నిండిపోయిన కొన్ని జ్ఞాపకాలు. అసలు ఇవన్నీ కాదు. వీటన్నింటిలో  తను నాతో ఉండటం….ఉహూ…అసలు తన ఉనికే వీటి మధ్య అపురూపం.

ఏరుకుని దాచుకున్న ఇన్ని జ్ఞాపకాల్ని ఎక్కడ మొదలుపెట్టి రాయాలి? గుడి గంటల నుండి, రోడ్డు పక్కగా నడుస్తూ కుడి వైపు తిరిగి కాస్త దూరం చీకట్లో వెళ్తే, అక్కడ ఉండే ఒక ప్రపంచం, పైన చెప్పిన బంగళా,  అందులో ఉన్న అందమైన మనసున్న ఒక అమ్మాయి, తన చుట్టూ ఉన్న చెట్టు, పుట్ట,  రాయి,  గోడ, వంతులుగా పూసే రాధా మాధవం పూలు, అప్పుడప్పుడూ వినిపించే వీణా నాదం, రాత్రి అవగానే చల్లగా వీచే వేప చెట్టు గాలి ఇంకా చాలా…

అక్కడ నుండి తను వెళ్ళాక ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసాను ఆ పరిసరాల్ని.  “ఇక్కడ నువ్వు లేవు నీ పాట ఉంది ……”అన్న తిలక్ కవిత గుర్తొచ్చింది. కామాలు తప్ప ఫుల్ స్టాప్ లేని స్వగతం ఇది. అరటి ఆకులో సంపెంగ మళ్లీ ఎప్పుడూ కొనలేదు నేను. మాలతీ లత కూడా చూసిన జ్ఞాపకం లేదు. రోడ్డు మీద నుండి మాత్రం వేప చెట్టు కనబడుతుంది. ఈసారి ఎప్పుడైనా తను  వస్తే నాకు చెప్పమని అనడం తప్ప, దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి వస్తే బాగుండు అని చాలా సార్లు అనిపిస్తుంది.  ఉగాది తరువాతనో, వర్షం పడే రోజుల్లో అయినా… ఎప్పుడో ఓసారి. సిమెంట్ బెంచీ మీద కూర్చుని మనసులో మిగిలి పోయిన ఆ ఒక్క మాటా చెప్పాలి, ఈ సారి పక్కనే ఉన్నవేప చెట్టుకి కూడా వినబడకుండా…..

జలుబు చేసినట్లు అనిపిస్తోంది, కానీ నీళ్ల వల్ల కాదు. నిన్న రాత్రంతా తన కోసం వ్రాసుకున్న అక్షరాలు వెనకనుండి తు(త)డుపుతూ గడిపాను.

***

 

శ్రీరంగవల్లి

చదవటం ఇష్టం. ఇలాంటివి అని చెప్పడం కష్టం - వాతావరణాన్ని బట్టి( బయటా లోపలా) ఏదైనా కావచ్చు: టాగూర్, రూమి, చలం ఇంకా చాలా. మనుషుల్ని చదవటం ఇంకా ఇష్టం - రోజువారీ జీవితంలో తారసపడే ప్రతి ఒక్కరి ప్రభావం మనమీద అంతో ఇంతో లేకుండా ఉండదు అని నమ్ముతాను. ఇలాంటి చాలా అద్దాల్లో కనిపించే మనల్ని పరీక్షగా చూసుకోవడానికి జె.కె ఫిలాసఫీ ఇంకా ఇష్టం. వృత్తి రీత్యా మాధమ్యాటిక్స్ ఫాకల్టీ, అప్పుడప్పుడు రాసుకున్న లైన్లు ఎప్పుడైనా ఇలా..బయట పడుతూ ఉంటాయి-

ఆమె( ఇమ్మే) చ్యూరు గా…..

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు