ఒక దేశ దిమ్మరి కవితా యానం

దేశం రెండు వందల ఏళ్ళకి కు పైగా ఒత్తిడి చిత్తడి నిర్భందాల నుండి అధికార మార్పిడీ పొందింది. అంతకు ముందు  వెయ్యేళ్ళకు పైగా నిరాకాటంగా సాగిన ఇస్లామిక్ పాలన నుండి కూడా మరొక అధికార మార్పిడీ జరిగింది. ఈ రెండు సంఘటనల మధ్య జరిగిన అంతులేని రక్తపాతం చరిత్రలో తక్కువగా నమోదు అయ్యింది. దాని మూలంగా ఎన్నో జీవితాలు,సంస్కృతులు విస్మరణకు లోనయ్యాయి. ఒక బలమైన ఇంపీరియల్ చట్రం నుండి విముక్తి పొందిన దశలోనే మరొక బలమైన ఇస్లాం రాజ్య అవనతం కూడా జరిగింది. రెండు మతాలు రెండు దేశాలుగా విడగొట్ట బడిన కాలంలోనే కోట్లాది లక్షలాది మంది బలవంతంగా తమ నేలనుండి వేరు పడ్డారు. రెండు ప్రపంచ యుద్దాలను చూసిన బ్రిటిష్ సామ్రాజ్యం తమ వలస దేశాల నుండి వచ్చిన ప్రతిఘటన గాలులకు తోక ముడిచి దేశాన్ని రెండు ముక్కలు చేయడం తో బాటు ఆపరేషన్ పోలో పేరుతో లక్షలాది మందిని ఊచకోత కోసాయి.
స్వీయ పాలన కోట్లాది మందిని ఇబ్బందులు పెట్టిన లక్షలాది మందిని చంపేసిన ఘటన మరవక ముందే మరొక ఉత్పాతం హైదరాబాద్ నగరం మీద జరిగింది. జాతీయోద్యమ ఉన్మాదం విచ్చుకత్తుల్లాగా స్వైరవిహారం చేసింది. మరొక సారి లక్షకు పైగా అనామక చావు చిందిన రక్తం దక్కన్ నేలమీద చిప్పరిల్లింది. భారతదేశ చరిత్రలో హిందూ ముస్లిం సంవాదంలో ఇదొక నెత్తుటి గాయం అది రెండు రాజకీయ శిభిరాల మధ్య కుంపటి లా మండుతూనే ఉంది. రాజకీయాలు గతి తప్పిన ప్రతి సందర్భం లో ఆ కుంపటి చుట్టూ మూగి చలి కాసుకునే తెంపరి తనాన్నీ చరిత్ర చూసింది.
ఈ దేశంలో పాలక వర్గ అవసరాల కోసం దేశాల కు రాష్ట్రాలకు సరిహద్దులు మారాయి. నగరాలు, గ్రామాలు రక్త కాసారాలు అయ్యాయి. కానీ నాగరికత వికాసం జరిగిన  దగ్గర నుండి ఏనాడూ సరిహద్దులు స్థిరంగా లేవు. ఇరవయ్యో శతాబ్దాన్ని వెంటాడిన జ్ఞాపకం సరిహద్దు.
ఆ సరిహద్దుల చుట్టూ సమస్త భావోద్వేగాల చరిత్ర ఉంది. సాహిత్యం, కళలు, ప్రజా ఉద్యమాలు ఆ సరిహద్దుల మీదనే తమ తమ సృజనను మెరుగు పెట్టుకున్నాయి.  ఈ సరిహద్దుల చుట్టూనే అనేక భావోద్వేగాలు ఉన్నాయి. ఆ సరిహద్దుల మధ్య మిగిలిన సమూహాలు పొలిమేరదాకా తరమబడ్డాయి. అదికార దాహం తో ఆధిపత్య ఉన్మాదాల తో సమాహాలు కేంద్రంలో ఉండి  పొలిమేర మీద ఇచ్చిన తీర్పులు అవి రాజేసిన నిప్పుల వాగు నిరంతరం మండుతూనే ఉంది. వాటి మీద నిందా పూర్వక తీర్పులు, సూత్రీ కరణలు ఎన్నో గడిచిన రెండు వందల ఏళ్ళుగా సాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒక బక్క సాయిబు కాసిన్ని మిరపకాయలు,చింతపండు కావడి మీద వేసుకొని ఊరూరూ తిరుగుతూ కాసిన్ని అన్నం మెతుకులు ఏరుకుంటున్నాడు.
ఆ బడుగుజీవికి ఏమాత్రం సంబంధం లేని కథ మనం పైన మాట్లాడు కున్నది. ఏ రోజు గాసం ఆ రోజు వెతుక్కునే బ్రతుకు జీవికి ఏ రాజ్యం ఎటుపోతే ఏమిటి ? ఏ దేశ సరిహద్దులు ఏ రూపానికి మారితే ఏమి?  కలిమీ లేమి కావడి కుండల్లా మోసిన వాడికి సరిహద్దుల్లో తెగిపడ్డ తలలు ఐతిహ్యాలు ఏమాత్రం ఊరట నిస్తాయి. కానీ ఆ సరిహద్దు రేఖల చిట్టా పట్టాలు రాసే ఒక చరిత్ర కారున్ని తాను కనుగొనే క్రమానికి రొట్టేమాకు రేవు ఒక మజిలీ అయ్యింది.
ఆ బక్కజీవి కావడిలో మోసిన బ్రతుకు చిట్టా, నుదిటి మీద గీయబడ్డ  సరిహద్దురేఖలో దాగిన ఆకలి కన్నీళ్ళు నాలుగు మాటలు మీతో పంచుకోవాలి అనిపించింది.
అవును కవి యాకూబ్ రాసుకున్న వాక్యాల సారం ఒక్క వాక్యం లోకి తర్జుమా చేస్తే  ‘నాయినా ! ఇదంతా నీ కన్నీటి వ్యధ’ … .
ఎక్కడో పుట్టిన తన తండ్రి మరోక్కడో పెరిగిన తన తల్లి ఇద్దరూ జీవన యానంలో కలిసారు, బ్రతుకు సమరంలో రొట్టెమాకు రేవు తన జీవిన మజిలీ చేసుకున్నారు. అక్కడి మేకపాలతో కడుపు నింపుకున్నారు.కాళ్ళతో, రాళ్ళతో ముంత పొగల మధ్య,దండనల మీద చింతచిగురు, కోళ్ళ గంప నెత్తిన పెట్టుకుని బుడంకాయలు అమ్మిన ఒక బాల్యం దేశం మొత్తం తన కవితా వాక్యాలు వెదజల్లితూ యాకూబ్ గా విస్తరించాడు.
అరవై ఏళ్ళకింద  ఖమ్మం జిల్లా రొట్టెమాకు రేవులో మొదలైన బాల్యం సింగరేణి బొగ్గు గనుల్లో గడిచిన యవ్వన కాలాలు ఖమ్మం, హైదరాబాద్ లో చదువు కున్న ఉద్యమ పాఠాలు ఒక పరిపూర్ణ మనిషిగా తీర్చి దిద్దాయి.
యాకూబ్ ఉస్మానియా లో చదువుతున్న కాలంలో రాడికల్ విద్యార్థిసంఘం,ప్రగతిశీల విద్యార్ధి సంఘం,స్టూడెంట్ ఫెడరేషన్ లు బలమైన ఆలోచనలతో అక్కడి గాలులను ఎరుపెక్కిస్తున్నాయి అవి ఉద్యమ జడివానలో తడిపాయి.
నాలుగు కవితా సంకలనాలు, రెండు సిద్దాంత గ్రంధాలు, మరో రెండు విమర్శనా పరామర్శ రాసుకున్న పుస్తకాలు, ఇది స్థూలంగా మాట్లాడుకుంటే యాకూబ్ జీవితం. కానీ అది సాకారం కావాడానికి ఆయన ఎక్కిన మెట్లు, దిగిన అఘాతాలు, అనుభవించిన ఆకలి అవమానాలు కల్లోలాలు చిన్నవి కావు. అవి రాస్తే ఒక పరిపూర్ణ పల్ల్లెటూరి కవితా సేద్యగాడి జీవితం అవుద్ది.
ఆయన గురించి రాయాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు.
ఏ వారసత్వ చిట్టా ఇవ్వాలో కూడా తెలియలేదు. ఆనవాళ్ళు లేని అనామక బ్రతుకులు కదా నడిచిన పాదముద్రలను తడిమితే చాలు అనిపించింది.
ఖమ్మం జిల్లా మైనారిటీ కవిత్వం లో మూడు బలమైన పాయలు ఉన్నాయి ఒకటి హనీఫ్ ,కౌముది,ఖాదర్ మోహియుద్దీన్, అఫ్సర్, ఇక్బాల్ చంద్. జావేద్, సైఫ్ అలీ గోరె. ఇది ఉమర్ అలీషా, ఇస్మాయిల్, వజీర్ రహమాన్, సాహిత్య ఘరానా, చుట్టరికం, మేధో పాయ .
మరొక పాయ దిలావర్, అక్బర్, ఖాజా, షాజహాన్, శంషాద్. ఏ తాతల ముత్తాతల వారసత్వమ లేదు సంపదా తెలియదు.
మరొక పాయ యాకూబ్ , హనీఫ్, నిర్గుణ్ ఈ పాయకు ఏ పండిత వారసత్వం లేదు స్వయంగా ప్రాకాశించిన చాంద్ తార లు వాళ్ళు. ఉమర్ అలీషా, వజీర్ రహమాన్ పాయలో కొంత కాంగ్రెస్ మరికొంత బలమైన వామపక్ష రాజకీయాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకు  విద్యార్ధి ఫెడరేషన్,అభ్యుదయ,విప్లవ సాహిత్య సంఘాల తో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.
బ్రతుకు దెరువు కోసం విస్తాపన చెందిన కుటుంబం యాకూబ్ కుటుంబీకులది.
నేటికి ఆరు దశాబ్దాల కింద ఒక విస్తాపితుడి కడుపున పుట్టిన యాకూబ్ ప్రాదమిక మాధ్యమిక విద్యను కారేపల్లి , ఖమ్మం లో పూర్తిచేసి, ఉన్నత విద్యకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తన జీవికను మార్చుకున్నాడు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో చేరేనాటికి బలమైన వామపక్ష రాజకీయాలు దేశానికి దిశా నిర్దేశం చేసే ఆలోచనలు బలంగా ఉన్నాయి. కొలిమిలో మండే ఇనుములా పదునుగా, నిత్యం జ్వలించే ఆలోచనలూ బిగిసిన పిడికిల్లూ ఎగిసిన ఆవేశాలూ ఆ కళాశాల ప్రాంగణాలు ఎర్రజెండా రేపరేపల్లో ద్విగుణీకృతం అవుతున్న కాలాన ఆయన ఒక కవిగా, కళాకారుడిగా, గొంతెత్తి పాడే గాయకుడిగా తనను తాను ఆ ఉద్యమ జడివానలో పునీతం చేసుకున్నాడు.
యాకూబ్ ఒక మారుమూల గ్రామం నుండి సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘాల ఆఫీస్ కాసింత నీడ ఇస్తే ఆ నీడనే నిట్టాడిగా, కవితా పాదాలే కొప్పుగా ప్రేమమయ జీవితమే లక్ష్యంగా సాగిన బ్రతుకు యుద్ధం యాకూబ్ ఆయనది.
పందొమ్మిది వందల ఎనభై అనంతరం కవితా యానంలోకి ప్రవేశించిన కవులు అనేక విషమ పరిస్థితులను యెదుర్కొన్నారు. నిజానికి అదొక వైభవోజ్వల సంధికాలం. ఒక వైపు కవులను నిబద్దత నిమగ్నత వైపు ఆలోచనలను మళ్లించిన దశ లోనే మరోవైపు విరుచుకపడ్డ చుండూరు, కారంచేడు. అదేకాలంలో విశ్వవిద్యాలయాలలో మండల కమిషన్ రాజేసిన నిప్పు రవ్వలు మళ్ళీ పదేళ్ళకి జరిగిన బాబ్రి విద్వంశం, గుజారాత్ గాయాలు, కంధమాల్ ఉన్మాద చర్యలు కవితా లోకాన్ని నిద్రలేకుండా చేసింది. ఈ సంక్షోభాలను కొందరు బాధ్యతగా నమోదు చేసారు, మరికొందరు చీలికలుగా పేలికలుగా తమ తమ కలుగుల్లో దాక్కున్నారు.
కొందరు కాలానికి ఎదురీదారు,
మరికొందరు రాజ్యం తో ములాకత్ అయ్యారు. మనం నమ్మిన విస్వశాలు మనం గౌరవంగా చూసిన కవులూ నాయకులూ వ్యక్తిగత జీవితం లో రాసే రాతలకీ జీవితానికీ పొంతన లేకుండా నిర్లజ్జగా బ్రతుకు తున్న విషాద కాలాన మనిషిగా వ్యవస్తీకృతం అయిన దోపిడీ పీడన గుర్తెరిగి మసులుకున్న యాకూబ్ మొదటి నుండీ నమ్మిన యెర్ర జెండాను మాత్రం వదల లేదు.
పందొమ్మిది వందల తొంబై ఒకటి లో మొదలన తొలి కవితా సంకలనం ‘ప్రవహించే జ్ఞాపకం’(91) మళ్ళీ పదేళ్ళ తర్వాత వచ్చిన ‘సరిహద్దు రేఖ’(2002) మళ్ళీ ఏడేళ్ళకి ‘ఎడతెగని ప్రయాణం’,(2009) నదీ మూలం లాంటి ఇల్లు (2014) తీగల చింత (2019) .
ఖమ్మం జిల్లా ఈ తెలుగు కవిత్వానికి ఏమిచ్చింది అని ఎవరన్నా అంటే ఎనభైల తర్వాత తెలుగు ఆధునిక కవితా ప్రపంచానికి చోదక శక్తులు అయిన ఆరుగురు కవులను ఇచ్చింది అన్నాడు
బి.తిరుపతి రావు. ‘ప్రపంచం లోని ఏ బాషా సాహిత్యం లోనయినా ప్రతి పదేళ్ళ కొకసారి కొత్త స్వరాలు  పుట్టుకు రావడం సర్వ సాధారణం. కొత్త తరం కొత్త సాహితీ పనిముట్లతో రంగ ప్రవేశం చేయడమే
ఆ సాహిత్య పరిణామానికి రుజువు’ అంటాడు కవి, పాలిమిసిస్ట్ ప్రసేన్.
కవితా లోకంలో మారుతున్న కవితా సందర్భాలను పుట్టుకొని వస్తున్న నూతన అభివ్యక్తులను గమనించిన ఆయన చేసిన ఒక బలమైన ప్రాతిపదిక.
ఆ రకంగా చూసుకున్నప్పుడు యాకూబ్ కవితా యానం మూడు దశాబ్దాలు నిరంతరంగా సాగింది. రాస్తున్న ప్రతి సంపుటికీ ఆయన ఎన్నుకున్న శీర్షికలు ఆయన ఎన్నుకున్న కొత్త పనిముట్ల కు నిదర్శనం.
యాకూబ్ ది జంగమ స్థితి, తన తండ్రి కావడి మోసీ మోసీ బుజాలు కాయలు కాసి, పెచ్చులుగా రాలిపోయి బ్రతుకు సేద్యంలో దినమొక గండంగా కలో గంజో పోసి కుటుంబాన్ని సాకాడు. కావడిలో మోసిన పసికూనల ఆకలి.
“నాయినా! ఇదంతా నీ కన్నీటి వ్యధ …
మామ్మతో నీ నిఖా ముచ్చట్లు, మాతాత కరీంసాబు గొడ్లుకోసి పోగులు పంచిన దృష్టాంతాలు, కావిడి చేతుల కాకలు తీరిన నీ ముచ్చట్లు; ముత్రాసి గూడెం, రేగులగూడెం, పూసమోళ్ళ గుంపు, అనంతారం ‘ఓ సాయిబూ ‘ అని పిలుచుకున్న దగ్గరి తనాలు, వడితిరిగి పోయిన నీ పిక్కల నరాలు, తట్ట మోసిమోసి బోడిగుండైన నీ వంకీల జుట్టు” రుణం తీర్చు కోవడాలు, పందిరేయడాలు,పగ్గమేయడాలూ ,పందిరేయడాలు,పగ్గమేయడాలూ. అబ్బా ! ఇదంతా నా వారసత్వపు కధ !.
నిజానికి తానేదో ఉద్దరించడానికి కవిత్వం రాసా అని చెప్పలేదు. కేవలం ఎక్కడెక్కడో విరిగిపడ్డ గాయపు శకలాలను ఒక దగ్గర పేర్చి కూర్చాడు. ఆయన తన కవిత్వాన్ని లలితమైన సొబగులు అద్డలేదు,
మార్మికత ను పోదగలేదు, కేవలం నినాద పూరతమైన వాక్యం అవలేదు.
ఒక్కోసారి అది వచనం లో తేలిపోయినా నిజాన్ని నిష్కల్మషంగా నమోదు చేసుకున్నాడు. తాను కాలంతో ప్రవహించాడు, జ్ఞాపకాలను పేర్చి ఒక దగ్గర కూర్చాడు.
ప్రవహించే జ్ఞాపకం నుంచి, నదీమూలం లాంటి ఒక ఇల్లుగా తీగల చింత తో మళ్ళీ తాను పుట్టి పెరిగిన మడిచెక్క నే జీవిక గా చేసుకోవాలి అనుకుంటున్నాడు.
విద్యార్ధి నాయకుడిగా, కవిగా అధ్యాపకుడిగా, గాయకుడిగా జ్ఞాపకాల ప్రవాహవాటం లో ఒక వొడ్డున చేరి తీగల చింత  లతో సేద తీరుతున్నాడు.
తన పూర్వీకుల నుండి తన దాకా విస్తాపన లోనే ఉన్నారు. తన తండ్రి పుట్టిన నేల లో ఇప్పుడు తాను లేడు, తాను ఏర్పరుచుకున్న స్థావరం లో తన పిల్లలు లేరు, వలస ఒక అనివార్యం అయిన చోట కోల్పోయిన స్థావరాల కోసం తలపోత మాత్రమే ఉంటది. బహుశా ఆ తలపోతలే ‘నదీ మూలం లాంటి ఆ ఇల్లు’ గురించి రాసుకునే లా చేసింది. ఆ తలపోతలే ‘తీగల చింత’ల్లో ఆధునిక సాలె గూళ్ళను వదిలి వూరు,వాగు,పొంత,కలికుండలు,కావడి బరువులు, కలత నిద్రలు, ఉట్టి, సిబ్బి,తెడ్డు కోసం తండ్లాట, పొగల పొయ్యి, జొన్నంబలి, ఉండ్రాళ్ళు, ఊస బియ్యం కోసం వగచేలా ఒక సృజన కారుణ్ణి మళ్ళీ తన మూలల లోకి తమ తాతల తండ్రుల మట్టి పొరల్లోకి పోయే లా చేసుద్ది. ఆ పని ప్రభావ వంతంగా చేసాడు.
మైనారిటీ కవిత్వం లో రెండు భిన్న మైన వైరుధ్యాలను గమనించా. స్త్రీవాద రాజకీయాలు బలంగా మాట్లాడే ఇద్దరితో వేరు వేరు సందర్భాల లో మాట్లాడా.
ఒకరు పదిమందిలో ఉంటె నేను బురఖా వేసుకుంటే నా ఉనికి అస్తిత్వం చాటుకోవడం పదిమందిలో ఉనికే ప్రమాదం అయిన చోట పర్దా నాకు తప్పేమీ అనిపించలేదు అంటే,
మరొకరు నాకు ముఖమే లేదు అస్తిత్వం ఎక్కడ అనడం. పర్దా నాకు పితృస్వామ్యం మిగిల్చిన బందిఖానా దానిని బద్దలు కొట్టడం లోనే నాకు విముక్తి ఉంది అనడం. ముస్లిం సమాజాల లో పెరుకొని పోయిన అమానవీయమైన కట్టు బాట్ల మీద అంతర్గత తిరుగు బాటు చేసిన వాళ్ళు కొందరు , ఆ తిరుగు బాటు వెనక దాగిన డైన మిక్స్ ను తెలిసి కూడా మాట్లాడని మేధావి సమాజమూ అక్కడ ఉంది. అది మేలు కన్నా కీడే చేసింది.
ఈ క్రమం లో కొందరు సమాజుల్లో, ఖర్భాలా లో ఖననం కాబడిన మృతవీరుల శౌర్య గాధల్లో, దర్గాలో  సూఫీ ప్రవక్తల వచనాల లో    సాంత్వన పొందితే
యాకూబ్ మాత్రం “చెబితే నమ్మరు కానీ మా బాధలేవరూ మాట్లాడడం లేదు,మళ్ళీ ఇక్కడ కూడా పది పదకొండు తరాల తరవాతి వాళ్ళే తమ కోల్పోయిన వైభవాల తలపోతల్ని మా అందరి భాష గా మాట్లాడుతున్నారు. అనుభవాల దోపిడీ అంటే ఇదేనేమో” ఎప్పుడూ మిగుల్చుకోవడానికి ఏమీ లేనివాళ్ళం చెప్పుకోవడానికి మాకేం మిగుల్తుంది”
వివక్షితుల్లో వివక్షితుల భాష ఇది అందుకే యాకూబ్ వాక్యాల్లో గతం పట్ల పెద్దగా వ్యామోహం లేదు వర్తమాన సంక్షోభాల పట్ల అనవసరపు రాద్ధాంతమూ లేదు. ఈ స్థితికి తాను నడిచొచ్చిన గతుకుల తొవ్వ. కొందరు తన పూర్వీకులు పరిచిన  రహదారుల మీద నడిస్తే రాళ్ళూ రప్పలూ చదును చేస్తూ కవితా దారిని వేసుకున్నాడు.
ఆ రకంగా చూస్తే యాకూబ్ , ఖాజా మైనారిటీ కవితా సంవాదంలో తిరుగుబాటు స్వరాలు. అందరి పీడనలూ,ఏడుపులూ ఒకటి కాదని ప్రతి దుఃఖానికి కొలమానం ఒకటే కాదని అంటున్నారు.
యాకూబ్ బాల్యం బ్రతుకు కోసం తన పూర్వీకులు చేసిన విస్తాపన, రెండు  తన జీవిక కోసం చేసిన ప్రయాణం అది నిరంతరం ఒక జ్ఞాపకంగా ప్రయాణం చేస్తూనే ఉంది. అందుకే ఇటీవల ఆయన పుస్తకానికి నదీ మూలం లాంటి ఆ ఇల్లు గురించి అటు వెంటనే తీగలచింత అనే తాత్విక పాయలోకి ప్రయాణం.
యాకూబ్ కవిత్వం మొత్తం లో ఆయన నడిచివచ్చిన స్థావరాల స్థల పురాణం మాత్రమే మనం చూడగలం. నలభై ఏళ్ళ తన జీవిత యానంలో నదీ పాయలాంటి తన బ్రతుకు అనుభవించిన కోతలు ఎగుడు దిగుడులు, లోయలు, జలపాతాలు, జీవితం ఇచ్చిన ఎన్నో గుణ పాఠాలు తెలుగు కవితా ఉద్వేగాలు విద్వేషాలు వెన్నుపోటులు అన్నీ తన కవిత్వంలో పొందిక గా అమర్చాడు.
ఈ నలభై ఏళ్ళ యాకూబ్ కవితా ప్రస్తానం లో తన బాల్యం అనుభవించిన అనేక సంక్షోభాలు, విలాపాలు,విజయాలు ఉద్విగ్న మానస సంభాషణలు ఎన్నో కవితా వాక్యాలుగా అల్లుకున్నాడు.
ఆయన జీవితం ప్రతి పదేళ్లకు ఒక రూపం తీసుకుంది. ప్రవహించే జ్ఞాపకం నాటికీ, సరిహద్దు రేఖ, నదీమూలం లాంటి ఆ ఇల్లు నాటికీ  నాటికీ తీగల చింత కథలూ వ్యధలూ రాసుకునే నాటికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అక్షరం తో మార్పు దిశగానే ప్రస్తానిస్తున్నాడు.
పాడుబడ్డ హాస్టల్ లో కాసింత కుదురుకునే జాగా కోసం, బ్రతుకు యుద్ధం చేసిన ఆయన  తనను తాను నిలబడం కోసం, కోసం ఉనికి కోసం, ఉద్యమ అవసరాల కోసం తనను తాను నిలదొక్కు కోవడం కోసం ఆ కోపం లో కసిలో రాసే రాతల్లో పాడే పాటల్లో వేసే దరువుల్లో పలికే పలుకుల్లో తన  ఊరు బ్రతుకునీ,  వాడ నుడికారాన్నీ బ్రతికించుకున్నాడు.
మనిషికి బాల్య, కౌమార్య, యవ్వన వృద్దాప్య దశలు ఉన్నట్టే ఆయన కవిత్వానికీ ఆ దశలు ఉన్నాయి. తొలి దశలో జ్ఞాపకాల తల పోతల్లో , మధ్య వయసులో సరిహద్దుల లెక్కల కొలతల్లో, ఎడతెగని ప్రయాణాలు చేసి నదీమూలం లాంటి ఆ ఇంటివైపుగా మూగగా తీగల చితి చింతల తాత్విక బరువుల్లో  సాగిపోయాడు.
యాకూబ్ కి నలుగురు కలిస్తే పండగ నాలుగు మంచి వాక్యాలు వింటే సంతోషం అతను కవిత్వాన్ని సంగమం చేసినవాడు .
ఇరుకు కవితా వాకిళ్ళ ని విస్తృతం చేసిన వాడు. మంచి వాక్యం కనబడితే చాటింపు వేసి ఇది చదవండి జయ హో  అంటూ చాటింపు వేసాడు తన కవితా నడకను అనుభవాలను పదిమందికి పంచాడు . జీవితాన్ని పండగ చేసుకున్నవాడు. కవిత్వాన్ని తన ఇంటి చిరునామా చేసుకున్న వాడు.మొత్తంగా ఒక సూఫీ లా మిగిలాడు.
మొత్తం గా యాకూబ్ కవిగా కన్నా మనిషిగా బ్రతికాడు. యాకూబ్ పోసే వలపోత ఒక విచిత్ర మయినది. అదో చిత్తడి బ్రతికు . ఆయనకూ నాకు ఒకే పోలిక ఇద్దరం ఎదురు బడితే కళ్ళల్లో చెమ్మ ఊరుద్ది .
కారణం తెలియదు బహుశా ఆకలి ఒకటే కాక పోవచ్చు, అదో గతకాలపు స్మృతి గీతాల వలపోత. ఆ వలపోత తెలంగాణలో ప్రతి పల్లెలో పోద్దు గూకినాక ప్రతి తల్లి ఇంట్లో అమరున్ని తలుచుకొని చేసే వలపోత ఇది. నాకు మా ఇంట్లో అప్పుడప్పుడూ తెలియని శోకం వినిపించేది . దానికి కారణం తెలిసేది కాదు ఒక్కోసారి . ఎప్పుడయినా ఏ వన బోజనాలకో వెళితే ఎవరో లేరు మనతో అనే వెతుకులాట. ఏదయినా స్పెషల్ గా వండుకున్నా ఒక దగ్గర కొంచం నేల మీద పెట్టి దండం పెట్టేవాళ్ళు .
అది ఎవరికో ఇప్పటికి నాకు తెలియదు . నాకు ఎదురుగా శూన్యం కనిపించేది కాని అందరూ ఎవరి కోసమో నైవేద్యం పెట్టేవారు . ఆ గాయపు గుర్తులు నాకు అర్ధం అయేవి కావు. ఆ సామూహిక చిత్తడి జ్ఞాపకాలు నా బాల్యం లో పీర్ల పండగ సమయం లో అనుభవించా.
కుల, మత, చిన్న, పెద్దా అంతరాలు లేని సామూహిక దూల ఒక నాటి కల.
ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య అంతరాలు రోజురోజుకీ పెరుగుతున్నప్పుడు, యాకూబ్ తన కవిత్వం లో కలవర పడి, కలత నిద్దరలో  పలవరించిన  సరిహద్దు రేఖలు అంతం అవుతాయా ?
ఒకటి నిజం నేడు ప్రతి పల్లెలో దుఖం ఎందుకో సర్వనామం, అవన్నీ ప్రతి శోకంలో అంతస్సారం గా ఉంటాయి . అదో ధుఖ ధార ఆ దారం కొన మనకు యాకూబ్ ప్రతి కవితలో ఉంటది. వాళ్ళ అమ్మకు మల్లె ఆయనది ముడి భాష మాట్లాడితే ఊరు గుప్పున వాసన వస్తది.
నేను మనసు పెట్టి చదివే అతి కొద్ది మంది కవులలో యాకూబ్ ఒకడు. ఎందుకంటె అతనెప్పుడూ ఒక లౌకిక స్వప్నం గూర్చే కలగనే కళల బేహారి. మేమిద్దరం ఎప్పుడు కలిసిన నా కంట్లో కన్నీరే ఉబికేది. నాదో వెతల కలబోత అదో చిక్కుదారి  విచిత్రంగా ఇద్దరం ఆ దారిలో ఎక్కడయినా కలుస్తాం అతని దూదేకుల బాల్యం చిత్తడి నేలలో నడిచిన పురాగాధ కంబలి లో కలిసి తింటాం.
దానికి ఒక ముగింపు అసలే ఉండదు కొనసాగింపే .. నిజంగా మనకున్న మనసున్న కొద్దిమంది కవులలో యాకూబ్ ఒకడని నా పిచ్చి మనసుకు నమ్మకం.
*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవితాస్నేహం గుబాళించింది ఈ రాతలో.!

  • ఆత్మీయుడు యాకూబ్ పై వచ్చిన ఆర్టికిల్స్ అన్నింటిలోకీ ఇది అత్త్యుత్తమ మైనది అనడంలో సందేహం లేదు.కవి యాకూబ్ కు శుభాకాంక్షలు.ఇంత మంచి ఆర్టికిల్ రాసిన డా.గుర్రం సీతారాములు కి ప్రత్యేక అభినందనలు.ప్రచురించిన సారంగ కు థ్యాంక్స్.

    అయితే కొన్ని విషయాలు నాకు అర్థం కాలేదు.
    1. 3 రకాల కవుల వర్గీకరణ.అది ఎలా ? మేము అందరం రక్త సంబంధీకలం కాబట్టి?అంతేనా ?
    అయితే వీరిలో కూడా భావజాల తేడాలు వున్నవాళ్ళు కూడా వున్నారు. కౌముది,అఫ్సర్ ల మర్కిస్ట్ తనం ఇస్మాయిల్,వజీర్,జావెద్,ఇక్బాల్ లలో లేదు.వీరు సాహిత్యంలో ఏ వాదానికీ సంబందించిన వారు కాదు కదా?
    2. ఖమ్మం జిల్ల 6 గురు కవులా ? ఎవరు ? నాకు తెలీదు.

    3. నాకు తెలిసినంతవరకు డా.దిలావర్,డా.యాకూబ్,డా.ఖాజా,డా.షాజహాన లు తెలుగు సాహిత్యం లో పరిశోధన చేసిన డాక్టరేట్ పట్టాదారులు. వీరిని మేధోపాయ కాదని ఎలా అనగలం? తెలుగులో (వేరే భాషల గురించి నాకు తెలీదు)వీరిది మేధో పాయ అనే నా నమ్మకం.వీరందరూ ప్రతిభ,వ్యుత్పత్తి ,అభ్యాసం వున్న మంచి స్కాలర్స్ అనే నా అభిప్రాయం.

    4.నాకు తెలిసినంతవరకు ఉమర్ అలి షా , ఇస్మాయిల్, వజీర్ రహమన్ ,ఇక్బాల్ చంద్,జావెద్ లు ఖమ్మం జిల్లా కవులు కాదు అలాగే మైనారిటీ కవులూ కాదు.

    5.వారసత్వ సంపద మాకు మేలు చేయలేదు,కీడు చేసింది.పూర్వీకుల తప్పులకు మేము మూల్యం చెల్లించాం.చెల్లిస్తున్నాము కూడా.
    6.ఇక్కడ ఇద్దరు హనీఫ్ ల పేర్లు ఉన్నాయి.ఒకరు హనీఫ్ చంద్ (వీరు సాహిత్య అభిమాని మాత్రమే ,కవి కాదు.
    మరొకరు ముఖౌటా హనీఫ్.వీరు మాత్రమే కవి అని గమనించాలి.)

    ఏమైన తప్పుగా కనిపిస్తే ముందుగానే క్షంతవ్యుణ్ణి.
    దీనిపై సహృదయ చర్చ జరిగితే స్వీకరించడానికి నేను సిద్ధం.వ్యక్తిగత దూషణ కు దిగితే ఆ దిగువ స్తాయికి నేను దిగజారలేను.
    నమస్తె!!!

    శెలవ్!
    మీ ఇక్బాల్ చంద్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు