ఇన్నాళ్ళ సహనం

న్నాళ్ళ మౌనం సహనానికి పరీక్ష కాదు
సంయమనానికి ప్రతిరూపం
కిక్కిరిసిన ఆలోచనల తొడతొక్కిడిలో
ఎక్కడో జారి పడిన ఉనికి
మసకబారిన చూపు లో
సంగీత విభావరిని సమన్వయిస్తున్న
జారీ జారని నీటి ముత్యాలు

ముక్కున వలలు తగిలించుకు
గుంపులు గుంపులుగా కదిలే పావురాలు
లేత రంగులూ తెలుపూ నలుపూ కలనేత
మేళవింపులో
కనికట్టు చేస్తూ కల్మషాన్ని మోసుకు వస్తాయి
ఉన్నట్టుండి నడినెత్తిన సముద్రాలు గుమ్మరించే
అసహనం వరదల్లో
నిలదొక్కుకోలేక నీడ చెల్లా చెదరవుతుంది

కడుపులోనే ఊపిరందక
మూసిన కళ్ళతోనే వీడ్కోలు పలికే
ఉబలాటాలు
ఊరవతల ఏటి ఒడ్డున
ఆగిఆగి ఊపేస్తున్న ఆవేశపు సుడిగాలికి
తలవంచి రాలిపోయే పున్నాగ మొగ్గలు
పాపం గుప్పిట్లో ఒదిగిన పరిమళాల ఓదార్పుతో
ఉపశమిస్తూ

***

ఎక్కడో చటుక్కున
ఓ అలికిడి
మోడువారిన కొమ్మ మధ్యన
చిన్నగా ఒక పొటమరింత
పిసరంత హరితన్ని బాధపడి ప్రసవించిన
వైనం

పండుటాకులూ పచ్చని ముదురు కొమ్మల మధ్య
కొత్త తరం ఉదయించిన సంబరం
ఎర్రెర్రని చేతులు కలిపి నృత్య సరాగం
అప్పుడే ఎక్కడో గొంతు సవరించుకున్న
కోయిల కూనలతో కుహూ రవాలు
వల్లె వేయిస్తున్న పెద్దతరాలు
లేలేత తొలి వెలుగు చారలో
తొణికిన భావాలు ఏరుకునే
తూర్పు అరుణిమ
పాలిపోయి కరిగి నీరై వెలవెలబోతూ
అస్థిత్వం వదిలేసుకున్న చుక్కలు
ఏ నెరియల్లోకి ఇంకిపోయాయో
సూటిగా దూసుకొచ్చే యువకిరణాల
తాకిడికి గాయపడిన సింధూరపవనాలు

******

ఎంత వరకులే కీచురాళ్ల రొద
రాత్రి నిలువెల్లా కరిగి నదిలా ప్రవహిస్తూ
పారిపోయే వరకే
ఎంత గొంతు సవరించుకున్నా
మాటలు దొరకని కవి పుంగవుల్లా
తడబాటును వడబోస్తూ
అరువు తెచ్చుకున్న
మధుపానం మనసు జారి
ఒలికి పోయే వరకే

*************

వెన్నెల విహారానికి అడుగు కదిపిన మధుమాసం
అడుగు అడుగునా
లక్షల అక్షరాలు మొలిచి
ఉగాదులు పలవరిస్తున్న మావి కొమ్మ
మునిపంట మధురిమలు ఒలికించే కోయిల కూన

స్వాతీ శ్రీపాద

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు