ఇదీ కొన్ని ఫోటోల సొంత జీవితం!

మంచి సాహిత్యం లాగే మంచి ఫోటో అంటే ఏమిటి అనేది ఒకటో రెండు సూత్రాలు చెప్పి  తేల్చగలిగిన విషయం కాదు.

నువ్వు ఫోటోలు తీసుకుంటావా, తీసుకో అన్నట్టు పట్టించుకోకుండా ఉండేవారు దొరికితే, ఫోటో  ఫ్రేమ్ లోపల ఒక ఊహించని  పలుకరింత, సంవాదం లాంటిదేదో నిక్షిప్తం చేసే వీలు ఉంటుందేమో కదా అని ఆశిస్తూ వెతుక్కునే ఫోటోగ్రాఫర్లల్లో నేనూ___ ఒకణ్ణి.

2012లో నేను ఆకాశవాణి ఆదిలాబాద్ లో కార్యక్రమ విభాగ నిర్వాహకుడిగా చేరినప్పటి నుండి ఉద్యోగం నుండి రిటైర్ అయ్యేవరకు  ఒక ఎనిమిది సంవత్సరాల పాటు అక్కడి గోండు, కొలాం, నాయకపోడు మొదలైన అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీల సంస్కృతీ  సంప్రదాయాలను రేడియో కోసం వాళ్ల మాటలు, పాటల్లో విస్తృతంగా రికార్డు చేసే పని చేపట్టడానికి ఆశించిన దానికన్నా ఎక్కువే వీలైంది.

దానికి మా కార్యక్రమ సిబ్బంది లోనే దుర్వ భూమన్న అనే అనౌన్సర్ తోడుగా లభించడం ముఖ్య కారణం. ఆయన స్వయంగా గోండు లేక కోయితుర్  జాతివాడు. (గోండు అనే మాట బయటి వాళ్ల వల్ల వచ్చింది,  వాళ్లల్లో వాళ్లు తమను కోయ, కోయితుర్ అనే అనుకుంటారు). వాళ్ల పండుగలు, రీతులు అన్నీ బాగా తెలిసిన వాడు,  స్నేహశీలి, మెత్తని  పలుకు వాడు.

తమవైన విశిష్ట ఆచార వ్యవహారాలు, సామాజిక  కట్టుబాట్లు, సొంత దేవుళ్లు, పురాణాలు – ఇలా పెద్ద సాంస్కృతిక సరంజామా ఉన్న సమాజం ఆదిలాబాద్ గోండులది. మామూలుగా దుమ్ము పట్టినట్టు, పరమ సాదాసీదాగా ఉండే గోండు గూడేలు పండుగలు, పెళ్లిళ్లు వచ్చాయంటే ఒక్కసారిగా ఆట – పాట – వాయిద్య ధ్వనులు, అలంకరణలు, విందు భోజనాలతో  కూడిన సామాజిక ఉత్సవ స్థలాలుగా మారిపోతాయి.  పెద్దగా తారతమ్యాలు లేని  సమాజపు  ఉమ్మడిదనపు సౌఖ్యం అంటే ఏమిటో  ఇటువంటి సందర్భాల్లోనే మనకు హాయిగా తెలియవచ్చేది.

‘రాం రాం!చకోట్ మంతీ (బాగున్నారా)? ‘  అని వాళ్ల  కోయ భాషలోనే పలుకరించి మాట్లాడితే వాళ్లు స్పందించే తీరే వేరు. దుర్వ భూమన్న  తోడు వల్ల మాకు ఈ పని చాలా సులభం అయిపోయేది.

ఆ సందర్భాల్లోనే తీరికగా ఎన్నో ఫోటోలు తీయడానికి వీలయ్యింది.

మన కులాల మాదిరిగానే ప్రతి ఆదివాసీ సమాజంలో కూడా తాము తమ పౌరాణిక మూలాలు, సంస్కృతి, ఆచారాల కారణంగా ప్రత్యేకమైన వాళ్లము, విశిష్టమైన వాళ్ళము అని తరతరాలుగా అంతఃకరణలోకి ఇంకిపోయిన ఒక భావన ఉంటుంది. చదువూ సంస్కారమూ లేని వెనుకబడిన వాళ్లు వీళ్లు అన్నట్టు చూసే పై చూపుతో కాకుండా, వాళ్ల అస్తిత్వ భావనకు, సంస్కృతికి  విలువనిచ్చి, అర్థం చేసుకునేవాళ్లు ఎదురు పడ్డప్పుడు వాళ్ల నుంచి వచ్చే స్నేహశీలమైన స్పందన మామూలుది కాదు. వేరుదనం లోని ఉమ్మడిదనం అన్న మాట!

ఆ అదృష్టం ఆదివాసిగూడేల్లోకి వెళ్లినప్పుడు,  వాళ్ల సంబురాల్లో భాగమైనప్పుడు ఇప్పటికీ ఇంకా దక్కుతోంది. ప్రభుత్వ అభివృద్ధి పథకాల తంత్రం, ఆధునిక ప్రపంచపు వ్యాపార,  వినిమయ, తంత్రాలు మారుమూల గూడేల వరకు చొరబడి చేరిపోతూ ఉన్నా సంప్రదాయ జీవనోత్సవ శైలి ఇంకా చాలా భాగం మిగిలే ఉంది కాబట్టి.

మంచి సాహిత్యం లాగే మంచి ఫోటో అంటే ఏమిటి అనేది ఒకటో రెండు సూత్రాలు చెప్పి  తేల్చగలిగిన విషయం కాదు. కానీ ఫోటో అనే చిత్ర పరిధిలో మనం గమనిస్తూ ఉంటే,  దానిలో చేరి ఉన్న అనేక అంశాలు, వాటి మధ్య ఉన్నట్టు తోచే  పలు సంబంధాలు  — వెలుగునీడలు,  రంగుల సంయోజనంతో కలుపుకొని  –  మనల్ని కొంతసేపు నిలబడగలిగేలా చేసి, ఒక  కొత్త రకమైన పరిజ్ఞానమో అనుభూతో కలిగిస్తే అది ఎంతో కొంత ప్రయోజనకరమైన వ్యవహారం అని అనుకోవచ్చేమో!

అయితే మనం ఫోటో తీస్తున్న సందర్భానికి, అక్కడ జరుగుతున్న ప్రక్రియకు ఎటువంటి విఘాతమూ అడ్డంకీ కలిగించకుండా, సరైన లైట్ ఉందా లేదా, వ్యక్తులో వస్తువులో అడ్డం ఉన్నాయే అని చిరాకు పడుతూ చింతించకుండా, ఒక జీవన శకలాన్ని,  సందర్భాన్ని పట్టుకునే పని చేస్తున్నప్పుడు ఒక సారళ్యం, వినమ్రత లాంటిదేదో ప్రవేశిస్తుందే అది  ఫోటోగ్రాఫర్ కు దక్కే  తక్షణ అదృష్టం!

ఎన్ని ఫోటోలు ఉంచుకోదగినవి, పంచుకోదగినవి అని పరీక్షించుకొని చాలా వాటిని  వదిలేయాల్సిన అవసరం ఎలాగూ వస్తుంది. ఆ తర్వాత మొదలవుతుంది బతికిపోయిన ఫోటో సొంత జీవితం! అక్కడే  ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి పరిసమాప్తి!!

*

సుమనస్పతి రెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.