ఇది ముంచుకొచ్చిన ఆఖరు యుద్ధం 

II
రెండో విదూషకుని రంగప్రవేశం
కన్నులున్నవారికి దండాలు పెట్టి కన్నీళ్లను తుడుచుకొనును
శవాలు బాబూ! శవాలూ!
పిల్లలున్న, పెళ్ళాలున్న, తల్లులున్న, మొగుళ్ళున్న, నాన్నాలున్న శవాలు శవాలు బాబూ! శవాలూ!
వీధి నిండా, ఊరి నిండా
రాష్టం నిండా, దేశం నిండా శవాలు.
శవాలు శవాలు శవాలు శవాలు
చరిత్రకు పాక్షిక సత్యాలు
సత్యానికి అంతిమ సమాధులు
యుద్ధానికి చివరి శాంతి వచనాలు
శవాలు బాబూ! శవాలూ!
అభివృద్ధి భవనాల్లో నివశిస్తున్న కళేబరాలన్నీ
రాజుని కీర్తిస్తున్నాయి
యుద్ధం మహత్యం గురించి స్తుతిస్తున్నాయి
మాజీ పౌరులు శవాల శిధిలాలు చూసి
కన్నుల చన్నుల్లో కన్నీళ్ళ ధారలను పిండుతున్నారు
ఇది ముంచుకొచ్చిన ఆఖరు యుద్ధం
పశ్చిమ తీరాల్లో కులికేందుకు పరిచిన తివాచీ ఈ యుద్ధం
యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
శవాలను కక్కుతోంది
శవాలను మెక్కుతోంది
శవాలను మోసుకొస్తోంది
ఇళ్ళ స్థలాల్లో కాస్త ఖాళీ చూపండి
సరికొత్త శవాన్ని పూడ్చాలి
హృదయాల్లో చోటులు లేని చోట
శవాలకు స్థానాలను ఇవ్వండి
శవాలు బాబూ! శవాలూ!
నువ్వు రీల్స్ మీద తూనీగలా తిరుగుతుంటే
లైకుల, కామెంట్ల చినుకులే కాదు
శవాల హోరు వానా కుంభవృష్టిలా పడుతోంది
సోషల్ మీడియాలో అంగాల జాతరలో తిరుగుతుంటే నువ్వు
చెట్లు నెత్తురు మాయని విడిచి
శవాలకు పురుడు పోస్తున్నాయి
ఓహో దేశమెంత శవాల వనంగా వికసిస్తోంది…
ఇది కదా అభివృద్ధి
ఇది కదా ధర్మస్థాపన
ఆహా! ఏమి మీడియా తంత్రం
శవాలని ఉగ్రవాదులుగా, దేశ ద్రోహులుగా చూపటంలో
ఎంత నైపుణ్యం చూపాయీ…
వారి చతురతకు కప్పండి ఓ శాలువా
వెయ్యండి పడక కుర్చీ
కాలు చాపే వీలులేకపోయినా
కార్యానికి ఆహ్వానం పలికే సరసరత ఉంది.
అబ్బా! వచ్చిండయ్యా
శవాలను పాకిస్తాను, చైనా పంపే పుంగవుడు.
వీడు రోజూ వట్టలసప్పు యూనివర్శిటీలో
పోస్టుల కుంకుమలతో దేశం కన్నెరికం కాపాడుతూ ఉంటాడు
విదేశీ వ్యాభిచారులకు పక్కపరిచి
వీళ్ళ బాసు ఆర్డరు విచ్చినప్పుడల్లా
కన్నెని సాగనంపుతూ ఉంటాడు.
అయ్యో! శవాలూ!
అలుపెరగక, విల్లు విరవక
గుంపులు గుంపులు అడవుల గుండెల మీద వాలిన శవాలు.
పాలు కుడిచే బిడ్డలకు రొమ్ముల్ని అందిస్తున్న శవాలు
రొమ్ముల్ని కోస్తున్న పడుపువృత్తి ప్రతివ్రతలకి బలవుతున్న శవాలు
ఇది శవాల జాతర
ఇది శవాల కొలుపు
ఇది శవాల ఊరేగింపు
ఇది శవాల ప్రదర్శన
శవాలు శవాలు శవాలు శవాలు
శవాలు బాబూ! శవాలూ!
ఎన్ని శవాలు ఎన్నెన్ని శవాలు
చరిత్రలో శవాలు
వర్తమానంలో శవాలు
భవిష్యత్తులో శవాలు
ఇది శవాల శతాబ్దం
అంగాలను ఊరేగిస్తున్న దశాబ్దం
శవాలు బాబూ! శవాలూ!
ఎవరదీ..?
శవాల మీద కొంగుని విసుర్తోంది
ఎవరమ్మా నువ్వూ?
తల్లివా, చెల్లివా, చెలికత్తెవా
ఇది శవాల దిబ్బ
శాఖాహార దేశంలో నీచు వాసన వేస్తున్నాయి
త్వరగా పూడ్చాలి
లేదా కాల్చాలి
నువ్వడ్డు పడ్డా అవి మాయం అవుతాయి
నువ్వెవరో చెప్పమ్మా… ఊరికే మాట్లాడించకా?
ఏం నిజం!
వాళ్ళు చరిత్రనే మార్చినవాళ్ళు
అబద్దాల పుట్టలకి రోజూ నెత్తురు పోస్తున్నవాళ్ళు
నిజం అన్నావా
ఆ శవాలకు పట్టిన గతే పడుతుంది నీకూ.
ఎవరో చెబుతావా లేదా?
అడివివా?
అరణ్యానివా?
ఆదివాసీ గూడేనివా?
మావోయిస్టు తుపాకీవా?
ప్రజా పోరాటానివా?
హా… హ్హా హ్హ… హా… హ్హా హ్హ…
భలే చెప్పావులే…
అయితే నువ్వు చైనా కుక్కవి
పాకిస్తాను నక్కవని నీ మీద ఎలా ముద్ర వేస్తారో చూడు!
స్టాంపుల బిజినెసు ఇది
హా… హ్హా హ్హ… హా… హ్హా హ్హ…
వాళ్ళకి బానిసలు ఎక్కువ
నిన్ను పశ్చిమానికి కట్టబెట్టడానికే
వాళ్ళ అవతార చాతీ పురుషుడు ఇన్ని శవాలను పోగేసింది…
వాళ్ళ నిజమైన కుక్కలు శవాల చుట్టూ చిందేసింది…
ఇది దేశభక్తి తలుగుల్ని పంచే మార్కెట్
తెలీదా నీకూ..?
త్వరగా ఏడ్చి వెళ్ళి సుబ్బరంగా నిద్రపో
రేపు ధనరాంగులు వస్తారు
నీ మీద వేలంపాట పోటీ ఉంది.
అయినా ఇదేం అన్యాయం కాదూ!
ఈ శవాలన్నీ నిజంగా శవాలు అనుకోకూ
హోమగుండంలో వేసే చిదుగులు
మంట వెలిగించటానికి పుల్లలు వేరటం తప్పా!?
పోమ్మా! బాగా ముస్తాబై సింగారించుకో
వాళ్ళకి చాలా పనుంది
ఆ భగవంతుడే దిగివచ్చి ఈ చోటునంతా అభివృద్ధి చేశాడని
ఎంగిలి జొల్లు వెదజల్లుతారు రేపు
అంతా సుభిక్షం అని వంచిస్తారు.
లే… ఎంత సేపు ఏడుస్తావు…
ఇక్కడ ఏడవటం రద్దు చేశారు
నవ్వటం రద్దు చేశారు
ప్రేమించటం రద్దు చేశారు
అసలు జీవించటమే రద్దు చేశారు
ఇలా నువ్వు రోధించటం
దేశద్రోహ చర్య
అదీ శవాల కోసం శోకించటం
ఇంకా అధర్మ చర్య
దేవుడు నెత్తురు పూసుకు తిరుగుతున్నాడు
కత్తుల సన్మానం జరిగే స్థలం ఇది
తూటాలకు పూలు పరిచే చోటు ఇది
ఉన్మాదం వీర్యం చిందించిన యోని ఇది
హంతకుల్ని లాలిస్తున్న పురిటిగుడ్డ ఇది
హోమగుండం ఇది
ఇక్కడ ఏడవకు
వాళ్ళు చెట్లు చిదిమేశారు
పిట్టల్ని నలిపేశారు
గూడెలాని కూల్చేశారు
పువ్వుల్ని పళ్ళకింద నమిలి ఉమ్మేశారు
సంస్కృతినే చింద్రం చేశారు
ఇంక ఏడుపూ నవ్వులూ ఏముంటాయి
అంతా ముగిశాక రిక్త హస్తాలు
మన కళ్ళు
ఏడవకమ్మా!
ఏడ్చి కన్నీటిలో శవాలను ముంచకూ
హృదయాన్ని నిదురలేపకూ
వెళ్ళమ్మా! నన్నూ ఏడిపించకూ
(మూడో భాగం వచ్చే సంచికలో)

గూండ్ల వెంకట నారాయణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.