ఆర్ యు అవైలబుల్?

ఈ బంధంలో ఒక స్థిరత్వం, కొనసాగింపు ఉంటుందా? తాము సహజీవనం చేయడమో,లేక పెళ్ళో చేసుకుంటామా ?

“ఆర్ యు అవైలబుల్?” మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కుతూనే,  పౌర్ణమి మెసేజ్ చూసింది. కానీ జవాబు ఇవ్వలేదు. ఆమె ఎక్కాల్సిన రైలు ఇంకా రాలేదు. మరో ఐదు నిమిషాల తర్వాత

“ఇంకా ఆఫీసులోనేనా? రాగానే మెసేజ్ చెయ్. వచ్చేస్తా”

అతను అట్లా అడిగినప్పుడల్లా

“ఎందుకు ఈ ప్రశ్నకి  కొన్ని వందల సార్లు “ఎస్” అనే సమాధానం చెప్పేదాన్ని?

అవును నేను అందుబాటులోనే ఉన్నాను.అవును నువ్వు కోరుకున్న చోట, కోరుకున్న సమయానికి నేను అందుబాటులోనే ఉన్నాను’’ అనే  అర్థంగా బహుశా అతడికి ఆ మూడక్షరాల పదం  తర్జుమా అయేది అనుకుంటా అనుకుంది పౌర్ణమి.

రైలు వచ్చే ముందు పట్టాలు చెక్ చేసి, క్లియర్ చేసి, పచ్చ జెండా ఊపే గార్డ్ లా, అతని రాకకు ఏదీ అడ్డు లేకుండా చూసుకోవడం ఆమెకి తెలియకుండానే అలవడింది.

ఆమె అతన్ని ప్రేమించింది.హద్దులు లేని పేమ అనుకునో  లేక  హద్దులు మరిచిన  ప్రేమనుకొనో కానీ, ఆ అద్భుత ప్రేమ అనే మాయా లోకపు  మెట్లపై  ఒకొక్క అడుగూ వేస్తూ, పై, పైకి  వెళ్ళాక, మెట్లు కరిగి  మాయమై, మళ్ళీ  వెనక్కి దిగలేక, ఆమె పాదాలు ఊబిలో చిక్కుకుని, ఇక ఆమె అక్కడే  నిలిచిపోయి,  తన చుట్టూ ఒక ఇనుప దడిని కట్టింది. కొన్నేళ్లుగా దాని మధ్యలో ఒక్కతై నిలిచింది.

పరుల గాలి కూడా చొరని ఆ ఏకాంత దడి తలుపులు అతను కొట్టినప్పుడల్లా  అతని కోసం అవి  తెరుచుకుంటాయి. ఆమె  ఇంట్లో ఆమే  వున్నా,

“ఓపెన్ సిసేమి! ఓపెన్ సిసేమి!” అంటూ ఆ తలుపులు తెరిచే మంత్రదండం ఎందుకో అతడి వద్దే వుంది. నిజానికి ఆమే అతడికి అప్పగించింది.

***

“నువ్వు చలాన్ని చదివావా?” లేదు, లేదు చదవలేదు. “అయ్యో స్వేచ్ఛకి అర్ధం ఎలా తెలిసేది నీకు”

అతను పుస్తకాలు తెచ్చాడు. ఆమె చదివింది. కొంచం అర్ధం అయి, అర్ధం కాక, కొంచెం అద్భుతం అనిపించి, మరెంతో గందరగోళ పడితే, చలం రాతలకి, అతడు అతడిదైన భాష్యం చెప్పేవాడు.

స్త్రీలు  తాము  ఇష్టపడిన పురుషుడి కోసం కుటుంబం,సమాజం,లోక భయం వంటి అన్ని శృంఖలాలూ తెంచుకుని నిలబడాలి అని … అట్లా అతను అన్నప్పుడు, అబ్బా ఎంత అద్బుతంగా వున్నాయి  ఈ మాటలు అనుకునేది పౌర్ణమి.

‘ఆర్ధిక స్వేచ్ఛ నిన్ను ఎన్నింటి నుండో లిబరేట్ చేస్తుంది. నీ జీవితం నీ చేతులలోకి తెచ్చుకోవాలి’ అంటూ  అతను ఫెమినిజం అన్న ఒక కొత్త పదాన్ని ఆమెకి పరిచయం చేసినప్పుడు  ఆమె కళ్ళు విప్పారాయి.  పౌర్ణమి వెన్ను నిటారుగా నిలిపి, తలెత్తి ఆకాశం కేసి చూసింది.  ఎంత స్వేచ్ఛ తనకి  ఎగిరేందుకు  రెక్కలు… కొత్త రెక్కలు మొలిచి తాను  ఎగురుతోంది అక్కడ. పైకి, మరింత, మరింత  పైకి,

ఏ హద్దులూ లేని, ఎవరి పెత్తనం తనపైన లేని, ఆ విశాల ఆకాశంలో. ఇదంతా  తన కోసం తాను కాదు. అతనికి కావలిసిన పౌర్ణమిగా ఆమెని ఆమె రూపొందించుకునేందుకు అనేది అప్పుడు తెలియనే లేదు ఆమెకి.

అతడు ఆమెకి  పరిచయం చేసిన ఆ కొత్త భావాలను, వాటి  లోతును ఆమె  సరిగ్గా ఆకళింపు చేసుకోక ముందే, అతడితో ఆమె సాన్నిహిత్యం ఎంతగానో  పెరిగింది. ఆ అపరిచిత నగరంలో, ఆమెకి పరిచితులైన వాళ్ళు పెద్దగా లేని చోట,  ఫేస్ లెస్ గా వుండటంలో వుండే స్వేచ్ఛను ఆమె నెమ్మదిగా ఆస్వాదించడం నేర్చుకుంది.

మదనపల్లి లో ఒక మామూలు మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.  ఇద్దరు కూతుళ్లను మంచి చదువులు చదివించి, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్లు చేస్తే చాలనుకునే, ఉన్నంతలో ఒద్దికగా బతికే  మామూలు  తల్లిదండ్రులు.

మొదటి నుండీ చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండే పౌర్ణమికి ఇంజనీరింగ్ అయ్యాక, పెద్ద కష్టమేమీ లేకుండానే  కాంపస్ సెలక్షన్స్ లోనే,  హైదరాబాద్ లో  ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది.

మొదట, ఆరేడు  నెలల పాటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండి, భోజనం,వసతి ఏమాత్రం సరిపడక, ఆరోగ్యం పై  ప్రభావం పడటంతో, తన లాగే అవస్థ పడుతున్న మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి మాదాపూర్ లో ఒక డబుల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ లోకి మారింది. పనిమనిషి  ఇల్లు శుభ్రం చేయడంతో పాటూ, వంట కూడా చేసి పెట్టేది. వాషింగ్ మిషన్, ఏసీలు, మంచాలతో సహా, రెంట్ కి ఇచ్చే ఏజెన్సీ, వాళ్ళు పాలిట వరమే అయింది. స్వంత ఇంట్లోలా సుఖంగానే కాక, అక్కడి కన్నా ఎంతో స్వేచ్ఛగా కూడా అయింది పౌర్ణమి జీవితం.

పౌర్ణమితో పాటు ఉండే నార్త్ ఇండియన్ అమ్మాయి రితిక కాలు విరిగినప్పుడు ఆమెని హాస్పటల్ కి తీసికెళ్ళితే, అక్కడ కలిశాడు అతను మొదటి సారి.

చాలా తక్కువ కాలంలోనే  పౌర్ణమి  జీవితంలోకి అతను దూసుకు వచ్చాడు. మనిషి మంచి మాటకారి ఆకర్షణీయంగా, జోవియల్ గా, చొరవగా ఉంటాడు. ఆమెకి పరిచయం అయ్యే నాటికి అతను  ఒక కార్పొరేట్  ఆసుపత్రిలో  జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.

పౌర్ణమి చుట్టూ వున్నా సమాజం మారుతూ వుంది. ఉద్యోగం చేసే చోటా, బయట,అంత దాకా ఎందుకు  ఆమెతో పాటు ఇల్లు షేర్ చేసుకుంటున్న రితిక, ప్రియాంకలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అతనితో స్నేహానికి, చాటింగ్ కి ఆమె పెద్దగా సంకోచించ లేదు.

ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు, కలిసి వుండటానికీ, శారీరక సంబంధానికి పెళ్లితో పనేమిటి? ప్రీ మారిటల్ సెక్స్ తప్పు అనుకోవడం మూర్ఖత్వమని, శరీర వాంఛ ఆకలంత సహజమైందనే అతని వాదన. స్త్రీల లైంగిక స్వేచ్ఛ గురించి అతను మాట్లాడే మాటలు, మెదట్లో పౌర్ణమికి చాలా తీవ్రమైన భావాలుగా,  తికమకగా, ఒక్కోసారి అవును నిజమే కదా అని, అనిపించేవి.

“స్మాల్ టవున్ గర్ల్  కొంచెం అప్డేట్ కా” అని అతను అంటే “నిజమే” అని  నవ్వేసేది.

ఒక పక్క అతని మాటలు, మరో పక్క  తల్లిదండ్రులు,బంధువులు, పెరిగిన కుటుంబ వాతావరణ ప్రభావం, ఆమెని తాడాటలో లాగా ఎప్పుడూ అటు వైపు ఒకసారి,ఇటు వైపు ఒకసారి  లాగుతూ ఉండేవి.

ఈ సంశయాల, గందరగోళ మానసిక స్థితి, మధ్యే, వాళ్ళ మధ్య  ఇంటిమసీ మెల్లిగా పెరుగుతూ వచ్చింది. గడియారంలో లోలకంలా ఊగిన ఆమె కొత్త ఊహలు, సంశయాలు,భయాలు, అన్నీ, చివరికి ఒక వర్షపు రాత్రి వాళ్ళ శరీరాల  కలయిక తరువాత, ఆమె కాలం అతని  సమక్షంలో స్తంభించి నిలిచింది.

మరో ఏడాది కల్లా  పౌర్ణమి ఒక్కతే, అతని సలహాతో  వేరే  ఇంటికి మారింది. అతనికి మునుపటి కన్నా  ఇప్పుడు ఆమె ఎక్కువ  అవైలబుల్ గా ఉండేందుకు మరింత వీలు చిక్కింది.

అతను ఆమె దగ్గరికి వచ్చే వాడు. గంట, లేదా కొన్ని గంటలు, ఒక పూట, ఒక రాత్రి… అతనికి  వీలైన, అనుకూలమైన సమయాలకు తగ్గట్టు ఆమె తనని తాను మలుచుకుంటూ ఉండేది. అతని కాలపు పాత్రలో ఆమె నీళ్ల వంటిది. నీళ్ళకి ఒక రూపం ఏమిటి?

పౌర్ణమి పెళ్లి చేసుకుందాం అని అతనితో అన్నప్పుడు, అసలు పెళ్లెందుకు, పెళ్ళిలో మన స్వేచ్ఛను పోగొట్టుకోడం తప్పా ఏముంది, ఇలా హాయిగా వుంటే చాలదా అనో, నా ఎం.డి పూర్తయ్యాక  ఆలోచిద్దాంలే అనో అనేవాడు. అతని గురించి నిజంగా ఆమెకి ఏమి తెలుసు? అతను తప్పా, అతని  బయిటి  ప్రపంచం ఏమిటో ఆమెకి పెద్దగా తెలీదు. పొడి పొడి మాటలే తప్పా అతని వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా మాట్లాడేవాడు కూడా కాదు.

‘’మా తల్లిదండ్రులకు, స్నేహితులకు నిన్ను  పరిచయం చేస్తాను ఎప్పుడన్నా’’ అంటూ ఉండే అతని మాటలు ఎన్నడూ వాస్తవ రూపం దాల్చలేదు. వాళ్ళిద్దరూ కలిసి బయట తిరిగింది కూడా పెద్దగా లేదు. పౌర్ణమి ఎప్పుడన్నా అడిగినప్పుడు చదువు, పనులు, సమయం దొరక్కపోవడం వంటి అనేక  కారణాలు  అలవోకగా దొర్లేవి అతని నోటి నుండి. ఎప్పటికప్పుడు పౌర్ణమి నిజమేలే,  అని తనకు తాను సర్ది చెప్పుకునేది. “నాకు నువ్వు, నీకు నేను చాలు కాదా, లోకం గోల మనకెందుకు” అనే మరుల  మాటల మత్తుమందు  చల్లడంలో నేర్పరి అతడు.

“ఇలా  ఏకాంతంగా, ప్రశాంతంగా  నువ్వూ, నేను మీ ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకోడం కన్నా హాయి,  ఆనందం ఏముంది చెప్పు? కలిసి  బయట  తిరిగేందుకు ఆరాటం ఎందుకు? మన బిజీ షెడ్యూల్స్ మధ్య దొరికే  ఈ  కాస్త సమయాన్నీ, మనం  వెస్ట్ చేసుకోడం తప్పా” అనే అతడి మాటలకి ఆమె దగ్గర సమాధానం లేదు.

ఈ బంధంలో ఒక స్థిరత్వం, కొనసాగింపు ఉంటుందా? తాము సహజీవనం చేయడమో,లేక పెళ్ళో చేసుకుంటామా ? అన్న సందేహం ఆమెకి  కలిగి అతన్ని అడిగినప్పుడు-

“నీకీ అనుభవం, మనం ఇలా వుండటం  సంతోషంగా లేదా? “ అన్నాడతను.

“ఉంది. కానీ, చాలా భయంగా కూడా వుంది. నేనేమిటి ఇలా చేస్తున్నాను అన్న సంకోచంగా, మా ఇంట్లో తెలిస్తే ఎలా అని ఆందోళనగా, నిజంగా నువ్వూ నేనూ కలిసి ఉండగలమా  అన్న భయంగా   …” పౌర్ణమి మాట పూర్తి కాకుండానే

“ భయం దేనికి? నీ జీవితం నీది. ఎవరు ఒప్పుకోవాలి, ఎవరికి చెప్పాలి మన గురించి. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు  వుంటావ్. చదవనైతే  చదివావు కానీ,  నీకసలు స్త్రీ స్వేచ్ఛ,  చలం అర్ధం కాలేదు, ఫెమినిజం అంతకన్నా అర్ధం కాలేదు” అన్నాడతను.

అవును. ఆమె  చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. ఎవరినీ పోషించాల్సిన అవసరం లేదు.  ఎలాంటి బాధ్యతలూ లేని, ఒక రకంగా చెప్పాలంటే ఇండిపెండెంట్ ఉమెన్ పౌర్ణమి. అతనిపై ఆమెకి వున్నది ప్రేమ, ఎమోషనల్ డిపెండెన్సీ నే తప్పా, ఆర్ధికంగా అతడి  పై ఎన్నడూ ఆమె  ఆధారపడలేదు. నిజానికి  అతనికి అవసరం అయినప్పుడు ఆమెనే అనేక మార్లు సహాయపడేది.

ఇట్లా కాదు ఈ బంధం అని అనిపించినా, అతడి   ధోరణి, అనేక సార్లు  మనసుకు కష్టం  కలిగించినా, తాను ప్రేమించినంతగా అతడు తనని ప్రేమించడం లేదేమో అని అనిపిస్తూ వున్నా, అతడిని  నివారించ లేక  పోయిన అశక్తత ఏదో ఆమెని కమ్ముకుంది. అతని  చొరవ, ఆకర్షణ, ఒక్కో సారి విపరీతంగా  ప్రేమ కుమ్మరించే మాటలు, ఇవన్నీ అతని పట్ల ఒక స్పష్టమైన అంచనా ఆమెకి రానీయ లేదు.  ఏమైతేనేం వాళ్ళ సహజీవనం మొదలైంది. సహజీవనం అనే కంటే,  ఆమె వున్నా చోటుకు అతను తనకి వీలైనప్పుడు  రావడం మొదలైంది.

పౌర్ణమి కి కాల్ చేసి వస్తాను అని అతను  అన్నప్పుడు-

” అయ్యో! సందేహం వద్దు. నా పనులన్నీ మానుకుని,  నీకై నేను ఉంటాను. నేను వున్నదే నీ కోసం, నీ రాక కోసమే నేను ఎల్లప్పుడూ వేచి ఉంటాను” ఇన్ని మాటలనూ,  ఆమె.  “ఎస్” గా పలుకుతుంది. ఆమె దిన చర్య అతని సమయానికి తగినట్లు, పదే,పదే గడియారంలో ముళ్లను ముందుకి,వెనక్కి తిప్పినట్లు మారుతూ వుండేది. పౌర్ణమికి  అతని కోసం ఎదురుచూడటం అలవాటైంది.

అతను వస్తా అన్నప్పుడు, అతనకి ఇష్టమైనవి  ఎంతో శ్రద్ధగా వండుతుంది.  ఆనందంతో వెలిగే ముఖంతో అతని కోసం ఎదురుచూస్తుంది. అబద్ధం కాదు, నిజంగా ఆత్రంగా, సంతోషంగా చూస్తుంది.

“వస్తాడా, వస్తా అన్నాడు కానీ, నిజంగా వస్తాడా?” ఈ ప్రశ్న పౌర్ణమి లోలోపల  పదే, పదే సుళ్ళు తిరుగుతుంది. కొన్నిసార్లు అతను  వస్తానని  రాడు. పౌర్ణమి అతను చెప్పినట్లే అవైలబుల్ గా ఉన్నా సరే, అతనికి మాత్రం అతని ప్రాధాన్యతల ప్రకారం ఆ  సమయం అందుబాటులో ఉండదు. మొదట్లో ఆమెకి  చాలా దుఃఖంగా, కష్టంగా అనిపించి, కొంచెం ఉక్రోషంగా “ఎంత ఎదురు చూసానో, ఎందుకు రాలేదు?” అని అలిగి, గొడవ పడేది . “పనులు” అని క్లుప్తంగా అని ఊరుకునే వాడు. వాదనలు అతనికి ఇష్టం వుండవు. పౌర్ణమి క్రమక్రమంగా అతడికి అనుకూలమైన మెంటల్, ఎమోషనల్ కండీషనింగ్ లోకి వెళ్ళింది. స్నేహితులు, కుటుంబ, సామాజిక సంబంధాల కన్నా అతనికి, అతని మాటలకి ఎక్కువ విలువ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతే కాదు, ఆమె బయటి ప్రపంచం మెల్లిగా కుంచించుకు పోయింది.

***

ఇంట్లో పెళ్లి చేసుకోమనే వత్తిడి మొదలైంది పౌర్ణమికి. ఊరికి పోవడం, ఇంటికి  ఫోన్లు చేయడం, మాట్లాడటాలు  తగ్గించి, ఆఫీసు పనులు, టూర్లు అంటూ ఏవో సాకులు చెబుతూ ఆ విపత్తు నుండి బయట పడగలను అనుకుంది కానీ, ఒక రోజు తెల్లవారు ఝామునే తల్లీ, తండ్రీ చెప్పా పెట్టకుండా  పౌర్ణమి ఇంటి తలుపు తట్టారు. తండ్రి మూడో రోజుకే  వెళ్ళినా, తల్లి మరో వారం ఉండి వస్తానని ఆగిపోయింది.

ఇరుగు పొరుగు, అమ్మలక్కలు, అయ్యలన్నలు, నా గురించి ఏమనుకుంటే నాకేంటి అనుకుని, పౌర్ణమి వాళ్ళ చూపులను అసలు  పట్టించుకునేది కాదు. వాళ్ళతో ముచ్చట్లు పెట్టేంత ఆసక్తి, తీరికా కూడా ఆమెకి వుండేవి కావు.

ఆమె ఎవరు ఏమనుకుంటే  నాకేమిటీ అనుకున్నా, అతను ఆమె ఇంటికి వస్తూ, పోతూ ఉండటాన్ని   మాకెందుకులే, అని  పొరుగు వాళ్ళు అనుకోలేదు. పౌర్ణమి ఆఫీసుకి వెళ్ళాక, ఆమె  తల్లితో పక్కింటి ఆంటీ, చెప్పీ చెప్పనట్టు అతను ఆమె ఇంటికి వచ్చిపోవడాల గురించి, పౌర్ణమి మేలు కోసమే చెబుతున్నట్లు చెప్పింది. ఆ రాత్రి తల్లి  సీరియస్ గా విషయం ఏమిటని  అడిగాక, ఆ తల్లీ, కూతుర్ల మధ్య గట్టిగానే వాదోపవాదాలు జరిగాయి.

పౌర్ణమి ఆఫీసుకు వెళ్లి, అక్కడి నుండి అతనికి కాల్ చేసి ఇంట్లో పరిస్థితి చెప్పింది.

అతను “కొంచెం ఆలోచించనీ” అన్నాడు అంతే. ఆ రాత్రి  పౌర్ణమిని తల్లి ఏమీ అనలేదు కానీ, మర్నాటి ఉదయానికల్లా  తండ్రి, మేనమామ దిగారు.

ఇక అప్పుడు అతని గురించి ఆమె వాళ్ళకి  కొంత చెప్పక తప్పలేదు. అతని ఎంఎస్  పూర్తయి ఈ మధ్యే మరో  పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో చేరాడని, తామే మరి కొన్నాళ్ళలో,  పేరెంట్స్ తో, పెళ్లి విషయం మాట్లాడదాం  అనుకున్నాం అని  అంది. కానీ, ఆమెకి తెలుసు  పెళ్లి ప్రస్తావన తేగానే అతను మరో వైపుకు తమ  సంభాషణ మలుపుతాడని. అప్పుడు  అతనికి చలం, ఫెమినిజం ఆవరించేవి. తను ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నాను, ఎంత వెనుకబాటుతనంతో వున్నాను అని పౌర్ణమే సిగ్గుపడేలా వుండేవి అతని మాటలు.

అతన్ని పిలిస్తే మేము మాట్లాడతాం. అతనితో, అతని తల్లిదండ్రులతో అని  వాళ్ళు వత్తిడి చేసినప్పుడు ఆమె  సమాధానం ఇవ్వలేదు. వాదనలు పెరిగి వాతావరణం వేడెక్కాక, తండ్రితో

“మీరెవరు నా విషయాల్లో కల్పించు కోవడానికి. పెళ్లి చేసుకుంటానో, కలిసుంటానో  మీకెందుకు” అంది. తల్లి కి ఆ మాటలు,చేష్టలు అహంకారంగా, పొగరుబోతుతనంగా  అనిపించి కూతురి చెంపపై ఈడ్చి కొట్టింది ఆగ్రహంతో. కూతురు పెద్దదైందని తెలుసు కానీ, మరీ తమని మీకు ఏమీ సంబంధం లేదని పక్కకు నెట్టేసంత పెద్దదయిందని అనుకోలేదు వాళ్ళు.

పౌర్ణమి కోపంగా తల్లి కేసి చూసి, ఒక్క మాటన్నా మాట్లాడకుండా చెప్పులు వేసుకుని,  హ్యాండ్ బ్యాగ్  తీసుకుని విసురుగా, తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయింది.

అతనికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇనార్బిట్ మాల్లో  కాళ్ళు నొప్పి పుట్టే వరకూ తిరిగింది.

మళ్ళీ అతనికి కాల్ చేసింది. ఎత్తాడు. ఇంట్లో జరిగింది చెప్పింది. అతను విన్నాడు. విని

“ఏమి చేయాలో నువ్వే ఆలోచించుకో“ అన్నాడు.

“ ఆలోచించాను. నువ్వు మా ఇంటికి వచ్చి  మా వాళ్లతో మాట్లాడు మన పెళ్లి గురించి”

“నీకేమన్నా పిచ్చా, రేపు పొద్దుటే  సర్జరీ అపాయింట్మెంట్ వుంది. ఎలా వస్తాను ఇప్పుడు? అయినా మా ఇంట్లో వాళ్ళని కలుస్తాం అని మీ వాళ్ళు పట్టుబడితే… మా ఇంట్లో వాళ్లకి  మన విషయం తెలీదని నీకు తెలుసు కదా!  మా వాళ్ళకి ఇంత సడన్ షాక్, రచ్చా అవసరమా?”

“మరి నాకు అవసరమా, మా అమ్మా వాళ్ళతో?”

“ఏమో నాకేం తెలుసు. దట్ ఈజ్ యువర్  ఇష్యూ. యు హావ్ టు హాండెల్ దెమ్మ్”

“అదేంటి? మన ఇద్దరి జీవితపు సమస్య  కదా ఇది ?”

అటు పక్క మౌనం …

“నాకు అసలు  ఇంటికి పోవాలని లేదు”

“అయితే పోకు”

“ చెప్పు, ఇప్పుడు  నేనేం చేయాలో”

“ఆఫీసు ట్రిప్ వుంది  ఊరికి వెళ్ళాలి, తరువాత మాట్లాడతాను అని చెప్పి, మీ వాళ్లను ఊరికి వెళ్ళమను. వాళ్ళు వెళ్ళక పోతే, నువ్వే  రెండు రోజులు  మీ ఫ్రెండ్ రితిక దగ్గరకు వెళ్ళు” అన్నాడు.

ఆమె తో పాటూ వస్తాననో, లేదా  ఈ సమస్యను  కలిసి మనం డీల్ చేద్దాం అనో అతను అనలేదు. ఈ విషయం  గురించి అతను  ఆలోచిస్తాడు, మాట్లాడతాడని  ఆమెకి అనిపించలేదు. ఇక అతనితో ఈ సంగతి  మాట్లాడం అనవసరం అనుకుంది  పౌర్ణమి.

ఆరు మిస్డ్ కాల్స్ అమ్మ నుండి.

తిరిగి  కాల్ చేయగానే పౌర్ణమి తల్లి ఏడుస్తున్నది. సారీ చెబుతూ, పౌర్ణమికి ఏమైనా అయిందేమో  అని తామంతా ఎంత భయపడ్డారో గబ గబా మాట్లాడుతోంది.  వాళ్ళు ఆమెను భయపెట్టి, బాధపెట్టి కంట్రోల్ చేసిన వాళ్ళేమీ కాదు. చెడ్డవాళ్ళు అసలే  కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో  భయపడ్డ వాళ్ళు.

లోకానికీ, అగమ్యంగా అనిపిస్తున్న కూతురు జీవితానికీ.

పౌర్ణమి ఇంటికి వచ్చింది. తల్లి  ఆమెకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేసింది. తిని, ఏమీ మాట్లాడకుండా  లోపలి గదిలోకి వెళ్లి పడుకుంది పౌర్ణమిని. వెంటనే నిద్రపోయింది. తన గురించి  భయపడాల్సినదేమీ లేదని, వాళ్ళకి   ఆమె చెప్పినా, ఆ మాటల పట్ల వాళ్ళకి  ఇసుమంత  నమ్మకం కలగలేదు. ఏమనాలో, ఏమి చేయాలో తెలియక, వాళ్ళు బరువెక్కిన గుండెలతో, భయపడుతూ వెనక్కి వెళ్ళారు.

వాళ్ళు వెళ్ళాక, మళ్ళీ అక్కడే , అందరికీ తెలిసేలా గొడవ అయిన  ఆ ఇంట్లోనే వుండటం చికాకుగా అనిపించి  మరో మారు  వేరే ఇల్లు వెతుక్కుని వెళ్ళింది పౌర్ణమి. పొరుగు వాళ్ళ జోక్యం, అదనపు క్యూరియాసిటీల  నుండి తప్పించుకునే క్రమంలో  అది ఆమె మారిన అయిదో  ఇల్లు. నగరంలో ఉన్న చోటు నుండి మారి, కొత్త ప్రారంభాన్ని ప్రారంభించడం, మరీ  కష్టమేమీ  కాదు. ప్రతి సారీ ఆమె తన చుట్టూ  కట్టుకున్న దడికి అదనంగా  మరొక కొత్త  గోడ కట్టుకుంటుంది.

***

అతను అన్న మాట  “దట్ ఈజ్ యువర్   ఇష్యూ. యు హావ్ టు హాండెల్” అన్న మాట  వినడానికి బాగున్నా, అది ఎంతో  తీవ్రమైన  ఒంటరితనపు  నొప్పిని, అతనితో ఉన్న బంధం పట్ల కొంత  అపనమ్మకాన్నీ  కలిగించింది ఆమెకి. నా కష్టం అతని కష్టం కాదని,  నిజంగా అవసరం ఉన్నప్పుడు అతను తన పక్కన తోడుగా నిలబడడని, నిజంగానే  అర్ధమైంది  మరి కొన్నాళ్ళకి పౌర్ణమికి.

ఎక్కడో, ఏ అజాగ్రత్త వల్లో, పట్టించుకోక పోవడం వల్లో చిన్న సందేహంగా మొదలై, ఎందుకో ఇది ప్రెగ్నెనెన్సీ  నా అనే  సీరియస్  సందేహం కలిగి, సెల్ఫ్ చెక్ లో నిజమే అనిపించి, ఎంతో భయం కలిగింది పౌర్ణమికి. అతను చికాకుపడ్డాడు. జాగ్రత్తలు తీసుకోనందుకు.

అతను రిఫర్ చేసిన  లేడీ డాక్టర్ అతని  క్లాస్ మెంట్. “నువ్వు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ ఇష్యూ  చెప్పాను. ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తారు వచ్చేయచ్చు” అన్నాడు. కానీ,ఆ ప్రాసెస్ లో అతను ఆమె వెంట రాలేదు. అయితే ఇది అతనికి సంబంధం లేని నా ఇష్యూ మాత్రమే అన్న మాట. అలా అనుకోగానే పౌర్ణమికి పట్టారని దుఖం వచ్చింది. పంతం గా కూడా అనిపించింది.  రితికను తోడు రమ్మని పిలవాలి అనుకుని, మళ్ళీ ఎందుకులే, అనుకుని ఒక్కతే వెళ్ళింది.

ఆ పని పూర్తి అయ్యాక ఒక్కతీ, తిరిగి ఇంటికి వచ్చింది. పౌర్ణమి దేహమే కాదు, మనసు కూడా తీవ్రంగా గాయపడింది.

ఆ సాయంత్రం అతను ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె అటు  తిరిగి పడుకుంది, నిశబ్దంగా  కాస్సేపు కూర్చొన్నాడతను.

“నీకు కోపం వచ్చింది అనుకుంటాను. ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. కొంచెం రెస్టు తీసుకోవాలి. అంతే” అన్నాడు తేలికగా.

అతని  ఇండిఫరెన్స్ పట్ల  ఆగ్రహం కలిగి

“ ఎందు కొచ్చావ్ ఇప్పడు? నీకు బాధ్యత లేదా? ఇది కేవలం  నా ఇష్యూనా? సింపుల్ విషయమా

నీకు” అంది గబగబా.

“అయినా, కాకున్నా, అంతిమంగా ఫేస్ చేయాల్సింది నువ్వే కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ రాకుండా నువ్వేగా జాగ్రత్త పడాల్సింది. అయినా  నేను అరేంజ్‌మెంట్స్ చేసాగా! ఆ డాక్టర్ నా ఫ్రెండ్ కూడా. అక్కడికి వచ్చి, అందరి ముందూ నువ్వు నేనే కారణం అనేలా బిహేవ్ చేస్తే  …”

“ ఓహో, నీకు లోక భయం. ఎవరికన్నా తెలిస్తే ఎలా అని. నీ  గౌరవానికి, నీ ఇమేజ్ కి ఎక్కడ భంగం కలుగుతుందో  అన్న భయం. ఇదిగో ఇప్పడు ఇలా మనిద్దరం కలిసి చేసిన పనికి, నేను హాస్పిటల్ కి వెళ్ళాల్సి రావడం నా ఇష్యూ, నేను డీల్ చేసుకోవాల్సిన ఇష్యూ. నాకు మాత్రం  ఎలాంటి గౌరవాలు, మర్యాదలు, వుండవు  అంతే కదా? అర్ధమయ్యింది. నీకు ఎటువంటి  బాధ్యతా, రిస్క్ లేని, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెడీగా ఉండే  రిలేషన్ షిప్ కావాలి. ఆ రిలేషన్ వల్ల  ఏవైనా ఇబ్బందులు వస్తే మాత్రం  అది నా ఒక్కదాని సమస్య. అంతే కదా” అంది పౌర్ణమి స్వరం పెంచి. ఆమె శరీరం కోపంతో వణుకుతోంది సన్నగా.

అతను నువ్వు నన్ను మిస్ అండర్ స్టాండ్  చేసుకున్నావ్ అంటూ ఏదో చెప్పబోతే, పౌర్ణమికి మరింత ఒళ్ళు మండింది.

“నీ కోపం తగ్గాక మళ్ళీ వస్తా బేబి, టేక్ కేర్. కాల్ చేస్తాను. అర్జంట్  పనివుంది” అంటూ వెళ్ళిపోయాడు.

‘ఏమిటీ మనిషి? ఎంతో  ఆదర్శవంతంగా మాట్లాడే ఆ మాటలన్నీ వట్టి మాటలేనా?

అసలితను  నిజంగానే నన్ను  ప్రేమించాడా? జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమేనా తమ మధ్య వుంది? నాకు నిజంగా కష్టం కలిగినప్పుడు, నా పక్కన బాధ్యతగా వుండాల్సినప్పుడు అతడు ఎప్పుడూ లేడు. ప్రతి సారీ ఒంటరిగా వదిలేసి పోయాడు’  ఎడతెగని ఆలోచనలతో  పౌర్ణమికి ఏడుపు వచ్చింది. ఎంతో నిస్సహాయంగా అనిపించింది.

లేచి, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన  మొఖం కడుక్కొని, గట్టిగా తుడుచుకుని, తల విదిలించుకుంది. ముసిరిన ఆలోచనలు రాలిపోయేలా.

రితిక కి కాల్ చేసి, రాత్రికి ఉండేలా  రమ్మని చెప్పింది. ప్రేమ లో విచక్షణ  కోల్పోతాం ఏమో అనుకుంది. అతను  స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడే మాటలు పురుషుడికి అవసరమైన ఒక కొత్త ఆడమనిషిని తయారు చేసుకునే  అవసరానికే తప్పా, నిజంగా సమానత్వం,సమాన బాధ్యతల ప్రాతిపదికపై వుండే నూతన సంబంధాల కోసం కాదేమో, అనిపించింది ఆమెకి.

ఫుడ్ ఆర్డర్ చేసి, అది వచ్చేలోగా  కాఫీ కలుపుకు తెచ్చుకుంది.

రితిక వచ్చాక జరిగింది చెప్పితే, కోపంగా తిట్టింది. ఒక్కదానివీ వెళ్లావు ఎందుకు? నేను వచ్చేదాన్ని కదా అని. షేరింగ్, మాటలు, నేను వున్నా కదా అనే భరోసా మనిషికి ఎంత ధైర్యం ఇస్తుందో కదా అనిపించింది పౌర్ణమికి. ప్రేమ అద్భుతము, అతి సుందర భయానకము, అపరిమిత స్వేచ్ఛ భరితము, అంతులేని ఐచ్ఛిక బానిసత్వము .. అధికారము, ఆత్మ సమర్పణము.

లైంగిక స్వేచ్ఛ, సమానత్వం, ఫెమినిజం, చలం అంటూ అతను తరుచూ చెప్పే మాటలు, నిజమే కదా అతను అన్నది అనిపించేలా వుండే అతని  ప్రవర్తన ఆమెను  ఇంప్రెస్ చేసేందుకు వాడిన సాధనాలు.

ఆ నూతన భావాలు, అతను నిజంగా నమ్ముతున్నాడా? తనకి తెంచుకో అని  చెప్పిన ఆ  అన్ని శృంఖలాలూ అతడు కూడా తెంచుకున్నాడా? ప్రేమించిన మనిషి కోసం లోకాన్ని, పరువును, ప్రతిష్టను, కులాన్ని,డబ్బును,కుటుంబాల వత్తిడులను,సెంటిమెంట్‌లను అన్నింటినీ  ధిక్కరించి నిలబడే స్త్రీల పక్షపాతా అతను ? అసలు అతను, ఇంత మాట్లాడే అతను, ఆడవాళ్ళని తనతో పాటూ సమానులే అని నిజంగా అనుకుంటున్నాడా?

ఒకటి,రెండు రిలేషన్స్ బ్రేక్ అయి, డిప్రెషన్ లోకి వెళ్లి, బయటపడిన రితిక అన్నది.

“ఈ నేల సమానంగా లేదు పౌర్ణమి. సమాజంలో మగవాళ్లకి వున్న  స్థానం, పవర్, పెట్రియార్కీ, కులం  వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు, అధికారం, ఆస్తులు  అన్నీ  వదులుకుని, ఆడవాళ్లు మాతో పాటూ  సమానం అనుకునేందుకు, మెజారిటీ మగవాళ్లు ఇంకా  సిద్ధంగా లేరు. వాళ్ళున్న కంఫర్టబుల్, సేఫ్ జోన్  నుండి బయటపడి, మేము  మారాలి అనుకునే  మగవాళ్లని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. చదువుకున్న ఈ  సోకాల్డ్ మగ వాళ్ళకి,  ఇప్పుడు   తమని ఎలాంటి  ఇబ్బంది పెట్టని, అన్నివిధాలుగా   కంప్ఫర్ట్ గా తమని   వుంచే ‘ స్వేచ్చాయుత, ఆధునిక మహిళ’ కావాలి ప్రేమించేందుకు. సంబంధాలు పెట్టుకునేందుకు. అందుకు తగ్గ భాష ఈ ఆధునిక పురుషుడు నేర్చుకున్నాడు. మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోడానికి మాత్రం వీళ్ళకి ట్రెడిషనల్ ఉమన్ కావాలి”

“ అంటే అలాంటి ఆడవాళ్ళని కంఫర్ట్ ఉమెన్ అనచ్చా?’’ అంది పౌర్ణమి

“హిట్లర్ తన సైన్యం సెక్సువల్ నీడ్స్ కోసం ఏర్పాటు చేసిన ఒక భయంకర వ్యవస్థ అది. ఆ అర్ధంలో కాకున్నా, ఈ సోకార్డ్  సెక్సువల్లీ లిబరేటెడ్ అనుకునే   ఆధునిక పురుషుడికి, ఎలాంటి బాధ్యతా వహించాల్సిన అవసరం లేని, ఎప్పుడు వాళ్ళకి, వీలయితే అప్పుడు అందుబాటులో వుండే, సింగిల్ అండ్  ఎకనమికల్లీ  ఇండిపెండెంట్, ఉమెన్ కావాలేమో! వాళ్ళు మరో అర్ధంలో అతడి నుండి   ఏమీ కోరకుండా, అతడిని  కంఫర్టబుల్ గా వుంచే వాళ్ళు. ఈ మారని సమాజంలో  సమాన టర్మ్స్ భూమిక మీద నిలిచిన సంబంధాలు కావు మనం ఆధునికం అని  అనుకుంటున్న అనేక  రిలేషన్ షిప్స్ అనిపిస్తుంది నాకు” అంది రితిక.

పౌర్ణమి ఎప్పుడూ రాని సందేహం అప్పుడు కలిగింది. సరిగ్గా తనను అతడు అడిగినట్లే నేను అతన్ని అడిగానా? ఎప్పుడన్నా అడగగలిగానా? అట్లా అడగాలన్న సృహ తనకెన్నడన్నా కలిగిందా?  ఆమె గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది.

” ఆర్ యు అవైలబుల్? కెన్ ఐ కం టు యువర్ హోం ?”

లేదు అట్లా  అతనిని అడగాలన్న ఆలోచన కూడా ఆమెకి  కలగలేదు. అతని స్పేస్‌లోకి, టైం జోన్ లోకి అతను ఎప్పుడూ ఆమెకి  ప్రవేశం కల్పించలేదు. అతనికి కూడా తను  కోరుకున్న తరహాలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండే, అతని పై ఎలాంటి ఆర్ధిక, ఎమోషనల్ బాధ్యతనీ , భారాన్నీ వేయని  “ లిబరేటెడ్ ఉమెన్” కావాలి. అందుకు అనుగుణంగానే అతని స్త్రీ ఉద్దరణ  భాష  కూడా వుండేది.

అతడి ద్వారా పరిచయం అయిన ఆ  భావాల సారాన్ని అర్ధం చేసుకుని, వేటిని స్వీకరించి, వేటిని వదిలేయాలో తెలుసుకుంటూ,  నిజమైన స్వభావంలో స్వతంత్ర మహిళగా రూపొందే క్రమం తనలో  ప్రారంభం కావడం కన్నా ముందే, అతనికి  ఆమె ‘అవైలబుల్ ఉమెన్’ గా  మారిన సంగతి ఆలస్యంగా, అనుభవ పూర్వకంగా ఇప్పుడు  మెల్లిగా   తెలుసుకోగలిగింది పౌర్ణమి.

***

‘ మీరు ఎక్కవలసిన రైలు మరికొద్ది సేపట్లో ప్లాట్ ఫారం మీదకు రానున్నది.. దయచేసి సిద్ధంగా

ఉండండి.. ‘

మెట్రో స్టేషన్ లో అనౌన్స్మెంట్ వస్తుంది.

అమీర్ పేట మెట్రో జంక్షన్ లో జనం, పరుగు లాంటి నడకతో అటూ,ఇటూ హడావిడిగా కదులుతున్నారు.

చేతిలో ఫోన్ మోగుతూవుంది. ఆమె నుండి  మెసేజ్ లేకపోవడంతో కాల్ చేస్తున్నాడు అతను.

మోగి, మోగి ఆగిపోయిన ఆ ఫోన్ కేసి నిర్వికారంగా చూసింది పౌర్ణమి.

“నేను సిద్ధంగా లేను, నీతో నా ప్రయాణం ఇక ముగిసింది. ఇక నేను సిద్ధంగా లేను. ఐయాం నాట్ ఎవైలబుల్ .. ”  అలా  వేల గొంతుకల ఘోష ఆమె లోలోపల హోరెత్తి, వచ్చి ఆగిన  ఆ రైలు కేసి, ఉన్న చోటు నుంచి కదలకుండా నిస్త్రాణంగా అట్లా చూస్తుండగానే, ఆమె ఎక్కాల్సిన రైలు ఎప్పుడో ఆమెను దాటి  వెళ్ళిపోయింది.

అతడికి, అతడి లాంటి అనేక మంది అతడుల కోసం–

అదిగో ఆ పసుపు రంగు చుడీదార్ వేసుకున్న ఆ అమ్మాయి సిద్ధంగా ఉందా, ఆర్ యు అవైలబుల్? తల్లో పూలు పెట్టుకొని వెళ్తున్న ఆ నడి వయసు ఆమె, నువ్వు అవైలబుల్? రజియా, రాగరాగిణి, సునీత, రేష్మ, కళ్యాణి, విక్టోరియా, జుబేదా, నాగరత్నం, అనసూయ, యాదమ్మ… ఆర్ యు అవైలబుల్?’ మీరు అతళ్ళకి  కంఫర్ కలుగజేసే ఉమెనా  ??? .. తుఫాను గాలికి  కొట్టుకుంటున్న తలుపు రెక్కల్లా పౌర్ణమి ఆలోచనలు ఫెడేలున కొట్టుకుంటున్నాయి లోలోపల.

ఆమె చుట్టూ ఆడవాళ్లు … అనేక వయసుల్లో ఉన్న వాళ్ళు, ఎస్కలేటర్ ఎక్కుతున్న  వాళ్ళు, దిగుతున్న వాళ్లు, టప టపా చెప్పులు చప్పుడు చేసుకుంటూ గబగబా మెట్లు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు.. ఎందరో ఆడవాళ్లు… ఎక్కడికి పరుగులు పెడుతున్నారు వీళ్ళంతా?

వెళ్లండి వెళ్లండి, మీ కోసం మీరు లేరు కాక లేరు.. మరెవరి కోసమో మిమ్మల్ని అవైలబుల్ అని  అడిగే వాళ్ల కోసం రెడీగా, హా , మై తయ్యార్ హు, ఎస్,ఐ యాం రెడీ, అని అరిచి, అరిచి … చెప్పండి, లేనని  చెప్పలేక కుమిలి కుమిలి ఏడ్చి చావండి.

ఎవరికి అందుబాటులో ఉన్నారు? మీ జీవితాంతం, మీది కాని మీ జీవితంలో, వట్టి దేహాలై, ఎవడి శరీరాల కాంక్షలను తీర్చేందుకు రంభా, ఊర్వశులై, ఎవడి కడుపు ఆకళ్ళను తీర్చేందుకు అన్నపూర్ణలై   మీరు ఎవరికి,ఎవరెవరికి  అవైలబుల్ గా ఉన్నారు…

పరిగెత్తు పౌర్ణమి పరిగెత్తు. ఎవరికి అందనంత దూరం? ఎవరికీ అందుబాటులో లేనంత దూరం.. పరిగెత్తు నీదైన లోకంలోకి, నీ దైన దేహం లోకి ..

పౌర్ణమి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి? తలదించుకుని నడుస్తున్న ఆమెని, ఆ హడావిడి జన సందోహం లో కూడా ఒకరిద్దరు చూశారు.

పద్దెనిదేళ్లన్నా లేని ఓ లేత కుర్రవాడు రెండు అడుగులు ముందుకేసి, ఆమె దగ్గరికి వచ్చి ” ఏమైంది మేడం? నేనేమైనా సాయపడగలనా?”  ఇంగ్లీషులో అడిగాడు.

ఆ మాటకి ఒకసారి తల ఎత్తి చూసి, గబగబా రెండు అరచేతులతో కన్నీళ్లను  తుడుచుకొని,

“థాంక్యూ, ఏం లేదు. ఏం లేదు. ఊరికే..” అని ఒక పేవలమైన నవ్వు నవ్వి అక్కడి నుంచి కదిలి, మెట్లు దిగి కిందికి, రోడ్డు మీదకు వచ్చింది.

రణగొణ ధ్వనులతో, రకరకాల వాహనాలతో మనుషులతో రోడ్డు కిక్కిరిసి ఉంది. ఫుట్ పాత్ పైన, కిందా మనుష్యులు నడుస్తూ, వాహనాల మధ్య గా చోటు చేసుకుని  రోడ్డు దాటుతూ, హడావిడిగా  పోతున్నారు.

ఎటువంటి  మానవ ప్రవాహం ఇది . ఈ జనసందోహం లో  ఎవరు ఎవరికోసం పరుగెతున్నారు..ఎవరు ఎవరికోసం వేచి వుంటారు?

పౌర్ణమి గబగబా ముందుకు నడిచింది. తన లోపల అలల వలే ఎగిసిపడుతున్న  ఆలోచనలన్ని అట్లా నడిస్తే , అక్కడే ఆ సమూహం మధ్య పారబోసి తేలికై పోవచ్చన్న వెర్రి ఆశతో  నడిచింది. మనుషుల్ని తప్పుకుంటూ, తోసుకుంటూ.. చాలాసేపటికి అలసిన శరీరము, మనసుతో, నొప్పితో  నడవమని గోల  చేస్తున్న పాదాల్ని ఇక మోయలేక ఆమె ఆగింది.

అప్పుడు చుట్టూ చూస్తే, తాను వెళ్లవలసిన దారికి పూర్తిగా వ్యతిరేక దిశలో తాను ఇప్పటిదాకా నడిచినట్టు అర్థమైంది. క్యాబ్ బుక్ చేసుకుని, తల వెనక్కి వాల్చి  సీటు లో కూర్చుని కళ్ళు మూసుకుంది. వెచ్చటి కన్నీళ్లు ఆమె  కళ్ళ చివర నుండి చెంపలపైకి జారాయి.

కళ్ళు తుడుచుకుని, చేతి సంచిలో నుండి వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగింది. వెట్ టిష్యూ తో ముఖం తుడుచుకుంది. కొంచెం తేరుకున్నట్లు అనిపించింది.

ఫోన్ లో సమయం రాత్రి 8:30 గంటలు చూపిస్తుంది. మెసేజ్ బాక్స్ లో ఆరు  సందేశాలు. “ఏమయ్యావు, ఎప్పటికి వస్తావ్, నేను వస్తాను. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అంటూ”

” డోంట్ కమ్. ఐ యాం నాట్ ఎట్ హామ్.మై మదర్ ఈస్ నాట్ వెల్.  ఊరికి వెళ్తున్నా” అని అతని కి మెసేజ్ పంపి ఫోన్ సైలెంట్ లో పెట్టింది. లేకపోతే అతను నేరుగా ఇంటికి వచ్చేయ గలడు.

మనసు బాగోని వేళల్లో ఏమి తినాలని లేదు అనుకుంటూ భోజనం ఎగ్గొట్టే అలవాటు ఉండేది ఇంతకు ముందు  పౌర్ణమికి. దానివల్ల నీరసం, మరింత డిప్రెస్ కావడం తప్ప ఉపయోగం ఏమీ లేదు అని ఈ మధ్య గుర్తించడం మొదలు పెట్టింది ఆమె. నేను ఇప్పుడు  మెదట నన్ను నేను ప్రేమించుకోవడం సాధన చేయాలి అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది పౌర్ణమి.

స్నానం చేసి వచ్చి, ఫ్రిజ్ తెరిచి ఎప్పుడూ రెడీగా ఉండే బ్రెడ్, రెండు కోడి గుడ్లు బయటికి తీసి, బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినింది. పాలు వేడి చేసి కొంచెం పసుపు, తేనె వేసి గాజు కప్పులో పోసుకుని బాల్కనీలో  ఉన్న కుర్చీలో కూర్చుని చుట్టూ చూస్తే పచ్చగా హాయిగా అనిపించింది. ఆ మధ్య నర్సరీ కి వెళ్లి కొనుక్కొచ్చిన పూల మొక్కలు  తనని పలకరించినట్టు అనిపించింది. ఆకాశంలో చందమామ సుదూరంగా మెరుస్తున్న చుక్కల మధ్య నిశ్చలంగా కనబడ్డాడు.

‘ తాను ఏమి కోరుకుంది? ఏమి పొందింది? స్వేచ్ఛగా భ్రమసి, ఎటువంటి స్థితి కి చేరుకుంది? అతను అతనికి తగ్గట్టుగా లాక్కు వెడుతున్నా, ఏమీ   అర్ధం కాని గందరగోళాల మధ్యకి తనని తాను కూడా   ఈడ్చుకు పోయింది కదా?’

‘స్వేచ్ఛగా జీవిస్తున్నాను, నాకు నచ్చినట్లు వుంటున్నాను. అన్ని శృంఖలాలూ  బద్దలు కొట్టాను   అని తను అనుకుంటుంది నిజంగా  నిజమేనా ?   స్వేచ్ఛ అని అనుకున్న ఈ భ్రమాజనిత స్వప్నాలు చివరికి తనని ఏ దరికి చేర్చాయి? అతను లేడు నిజంగా ఎన్నడూ  తన వెంట. అతని రహస్య కోర్కెలు తీర్చే సోకాల్డ్  స్వేచ్ఛా స్త్రీ  మాత్రమే నిజానికి తను అతనికి .

‘నా జీవితాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టలేదు. నా జీవితం పై ఎవరి నియంత్రణలు  లేవు’ అని నన్ను నేను నమ్మించుకునేది   అంతా, సమాన ప్రాతిపదికే లేని  ఒక  అబద్ధానికి కప్పిన అందమైన ముసుగు అని  తెలుసుకోవడానికి నాకు ఎందుకు ఇంతకాలం పట్టింది?’ రూపంలోనూ, వ్యక్తీకరణ లోనూ కొత్తగా కనిపించేది, నిజానికి సారంలో అసలు మార్పు కాక పోవచ్చు.

“ప్రేమ, స్వేచ్ఛ” అనే  అనే షుగర్ కోటింగ్ పైన  దట్టించి బయలుదేరే మగవాళ్లు, వాళ్ళతో కలిగే ప్రేమలు, సంబంధాల పేరుతో, అవి కల్పించే అనేక భ్రమల కింద   ఎన్ని విషయాలు వాటి అసలు రూపు కోల్పోయి, కొత్త బానిసత్వాలను, లొంగుబాటు బతుకులను ఆడవాళ్లకు  తెస్తున్నాయో  కదా’ అనుకుంది  పౌర్ణిమ.

బెడ్ మీద వెనక్కి ఆనుకుని, కాళ్ళు చాపుకుని కళ్ళు మూసుకుంది ఒక్క నిముషం. సెల్ఫోన్ తీసి అతనికి మళ్ళీ మెసేజ్ పెట్టింది “ అ యాం నాట్ ఎవైలబుల్. ఇప్పటికే కాదు ఎప్పటికీ. మా ఇంటికి వచ్చే ప్రయత్నం మరెన్నడూ  చేయకు” అని. అతని ఫోన్ నెంబర్ ని డిలీట్ చేసింది. ఇక  అతని కోసమే కాదు అతని  రెస్పాన్ కోసం  కూడా  ఎదురు చూడాల్సిన పని లేదు అనుకోగానే ఎంతో రిలీఫ్ గా అనిపించింది పౌర్ణమికి.

టీపాయ్ పై చలం మ్యూజింగ్స్ కనపడింది. పుస్తకాలు ఏం చేస్తాయి? ఆ పుస్తకాన్ని ఇప్పుడు అతని ఇంటెన్షన్స్ కి అనుగుణంగా,  అతను  చేసే  ఇంటర్‌ప్రిటేషన్స్ ఏవీ లేకుండా, నాకు నేను  చదువుతాను అనుకుంటూ పేజీలు తిప్పింది.

*

Image: Rafi Haque

విమల

44 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఫెమినిజం..మగవాడు నేర్చుకున్న ఆధునిక భాష.
    కథను ఎంతో అందంగా అల్లిన రచయిత్రికి అభినందనలు

  • కథకురాలిగా విమల గారు, ఆధునిక నగర మధ్యతరగతి ఆర్థిక స్వతంత్రం గల యవ్వన దశ లో ఉండే స్త్రీల ప్రపంచపు ఒక ముఖాన్ని బలం గా ఆవిష్కరించింది.

    స్వేచ్ఛ మనుషులు ఎవరికివారు విశ్లేషించుకొని లోపలికి నింపుకోవాల్సిన విమర్శనా పూరిత మేధోశ్రమ అని చెప్పింది.

    చెప్పుడు మాటల స్వేచ్ఛను పురుషులు స్త్రీలను లోబర్చుకునేదానికి ఎట్లా వాడుతారో రూపు కట్టించింది.

    కంఫర్ట్ ఉమెన్ అనే ఒక దుర్మార్గపు సంకలీన రూపాన్ని ఆవిష్కరించింది.

    అనేక మంది పౌర్ణమి వంటి వారిని, అనేక మంది అతడు వంటి వారు చేయగల మోసాన్ని చూపింది.

    కథ లో అక్కడక్కఆడ విత్వ భాష కలిసి గొప్పగా ఉంది. చాలామంది చదవాల్సిన కథ.

    చలం రచన లలో పురుష పాత్రాలను విశ్లేషించాలి అని ఇటీవల ఎవరో అన్నారు.అది జరగాలి.

    స్త్రీలు స్వేచ్ఛను విశ్లేషణ చేస్తూ చూడాలి.

  • ఆధునిక పురుషుడి అవకాశవాదం గురించి చాలా బాగా రాసారు. కథ ఆగాల్సిన చోట ఆగలేదు కానీ చివరికి ఆగింది. అభినందనలు విమల గారూ!

  • స్త్రీ స్వేచ్ఛను పురుషుల algorithm నుంచి కాకుండా స్వయంగా నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పారు.
    కథలో అతడు సర్వనామం కావడం ‘కథా న్యాయం’.
    కథ చాలా బాగుంది.💯

  • Magavadu chanuvu teesukodaaniki ammaelu kooda kaaranam .”
    Ani chebutundi ee story.
    “So take care of yourself “!

    • Yes. Agree with your comment.

      Moreover Love affairs contain element of risk, mismatch and other future problems.

      Arranged marriages provide scope for understanding between families. It may not be perfect always but a safer option.

      • లేదండి. ఎలాంటి పెళ్లిళ్లలో అయినా సమాన ప్రాతిపదిక పై లేని సంబంధాలు లొంగుబాటు, రాజులతో, లేదా హింసాత్మకంగానో రూపాంతరం చెందుతాయి మెల్లిగా.

  • కథ బాగుంది మేడం. ప్రేమకు, కామానికి, స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి గల తేడాను చక్కని కథనం ద్వారా తెలియచేశారు.

  • చదివించే మీ వచనం ఎప్పటిలాగే సున్నితం, సుందరం. అశక్తత, అవైలబుల్ అనే స్థితులు అనేక రూపాల్లో బలహీనుల ఆచరణలు. చివర్లో వివరం ఎక్కువ అనిపించింది. కథ సరిగానే ల్యాండ్ అయింది.

  • ఆధునిక యువతులంతా చదివి తీరాల్సిన కథ విమలగారూ! చాలా బాగా రాశారు!
    కవితాత్మకమైన మీ శైలి, సమకాలీన సమాజపు ఒక విషాద పార్శ్వాన్ని సున్నితంగా ఆవిష్కరించింది. కథలో కొన్నిచోట్ల సాగతీత కనిపించింది. అది సవరిస్తే ఇంకా crisp గా వస్తుందనిపించింది.

  • కథ చాలా బాగుంది విమలగారు.ఆమె మానసిక స్థితి విశ్లేషించిన తీరు,అతని మనస్థత్వం విశదీకరించి తీరు మొత్తంగా కథనం చాలా చాలా బాగుంది.
    మగవాడు ఎప్పుడూ ఇంతే.కానీ స్త్రీ ఆర్థికంగా నిలబడిన దశలో మరింత అదృష్టవంతుడయ్యాడు.
    పౌర్ణమిలాంటి అమ్మాయిలు తమకేం కావాలో,తామేం అడగాలో గ్రహించే లోపే మగవాడు తన పని చక్కబెట్టుకుని పలాయనమౌతాడు.అయినా ఆ బేల మరో ఇలాంటి పురుషుణ్ణి నమ్మదనేం లేదు.
    తరతరాలుగా ఇదే భ్రమ.
    మంచి అర్థవంతమైన కథ చదివాను అనే భావన.

    • అవునండి. చలం కాలం నుండీ అదే పరిస్థితి ఇన్నేళ్ల తరువాత చదువు, ఉద్యోగాలు, ఆర్థిక స్వాతంత్రం వచ్చినా, కొత్త రూపాల్లో స్త్రీల పైన హింస జరుగుతూనే ఉంది..

      Thank you అనసూయ గారు

  • Chalam himself became a devotee of Ramana Maharshi and led a spiritual life. Whether his earlier writings are useful to society? Probably he himself may not agree with his pre realisation period ideas. I am not sure whether present generation even know about him.

    Sanatana Dharma is time tested system and Chalam realised it. He was a great person because such a drastic transformation is very rare.

    • చలం రజనీకాంతరావు గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ వినండి. తాను గతంలో రాసిన వేటిని చలం రిజెక్ట్ చేయలేదు. అతని తాత్వికత మరొక దశలోకి వెళ్లి ఉండవచ్చు గాని..

  • ramalakshmi vచాలా బాగాఉందమ్మా మీ రాసి న కథ. చాలా ఈ కాలానికి కావలసిన కథ. ఆడ పిల్లలకు ఈ కథని చదవడమే కాదు.అర్ధం చేసుకుని,కంఠతా పట్టి., ఏదైనా అడుగు వేసేటప్పుడు ఈ కథని ఒక సారి గుర్తు చేసుకుని అన్ని విషయాలు తెలుసు కుని.చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.మగ,ఆడ సమానమే.అందరికీ ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితాన్ని సుఖంగా జీవించడానికి తగిన నిర్ణయాలు అన్న్ని రకాలు గా ఆలోచించితీసుకోవాలి.

  • విమలగారూ, మీ కథ చదివాక నాకేమనిపించింది అంటే… ఇన్నాళ్ల ప్రయాణం తర్వాత ఎట్టకేలకు ఫెమినిజం సరైన గాడిలో పడిందని. చలం మ్యూజింగ్స్ మాత్రమే కాదు, జీవితాన్ని కూడా మరొకరి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా ఎవరికివారే చదువుకోవాలి. ఈ కథ చెప్పింది అదే అంతిమంగా. నిజమేనంటారా!

  • కాలానికి అనుగుణమైన కథ. చాలా అవసరమైన కథ. ఎన్నో సందేహాలకీ సంశయాలకీ మధ్య ఎలా ఆలోచించాలో దిశా నిర్దేశం చేసే కథ. నాకు తెలిసిన వాళ్లతో తప్పక పంచుకుంటాను.

    రిలేషన్షిప్స్ వాటికవే ఏర్పడవు, డిజైన్ చేయబడతాయనీ, ఆ డిజైనింగ్లో ఏ ఒక్కరో కాక, ఇద్దరూ కలిసి చేసుకుంటే గొప్పగా మారతాయని అర్థం అవుతుంది.

    మొదటి నుంచి పౌర్ణమి ఎలా ఉండి ఉంటే బాగుండేదో అని ఆలోచిస్తున్నాను.

    మంచి కథ చదివానన్న తృప్తి బాగుంది. thank you విమల గారూ 👏🙏

    • ధన్యవాదాలు. ప్రతి కథలోనూ,దానిలోని పాత్రలకి వాటిదైనా ఉద్దాన పతనాలు ఉంటాయి. ఆ ప్రాసెస్ ని , ఆ పాత్ర స్థాయిని బట్టి వచ్చే ఎరుకలు మాత్రమే ఈ కథలో చెప్పాను. పౌర్ణమి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆమె నిర్ణయించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది కథ చివరలో.. మన ఆశయాలు, వాంఛలకు అనుగుణంగా పాత్రల చైతన్యాన్ని చెప్పే ధోరణి మరొకటి.

  • A modern exploitation. చివరికి చలమూ, స్వేచ్ఛా కూడా దీనికి కారణమవ్వటమే విషాదం.

    కథ నెమ్మదిగా, సాదాగా మొదలైనా చివరికొచ్చేసరికి ఉరవడి పెరిగింది. భావ తీవ్రతతో గాఢమై, కవితాత్మకమై మెరిసింది.

  • ఆధునిక తరం కథ, అవసరమైన కథ. చాలా బాగుంది. అభినందనలు విమల గారూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు