సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
15 డిసెంబర్ 2018కొత్త పుస్తకం కబుర్లు

అవును, ఆమె అస్తమించలేదు!

అరణ్య కృష్ణ
సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె వొక్క కవితే చాలు. పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు వుంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ  డిసెంబర్ ఇరవైన  మళ్ళీ మన ముందుకు తెస్తున్న అరణ్య కృష్ణతో సావిత్రి పుస్తకం “ఆమె అస్తమించలేదని…” గురించి నాలుగు మాటలు:
1. మీకు సావిత్రి గారు ఎలా పరిచయం? ఎంత పరిచయం?
నాకు సావిత్రిగారు ఆమె చివరి దశలో మాత్రమే పరిచయం.  నేను హైదరాబాద్ నుండి విశాఖకి బదిలీ మీద వెళ్ళినప్పుడు అన్నె అరుణ, కత్తి పద్మ, వశీరా వంటి మిత్రులు చెప్పారు ఆమె గురించి.  ఎవరో మిత్రుడితో కలిసి ఆమెని చూడటానికి వెళ్ళాను.  అప్పుడామె రామా టాకీస్ దగ్గర ఉమా నర్సింగ్ హోంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  ఆమెని చూసిన క్షణమే ఖిన్నుడనయ్యాను. సన్నగా, పుల్లలా వున్నారామె.  (అప్పుడామె బరువు 24 కిలోలే).  ఒక చేతిని మరో చేతితో పట్టుకొని ఆమె ఒక పుస్తక సమీక్ష చేస్తున్నారు.  కళ్ళు సరిగ్గ కనబడవు.  చెవులు వినబడవు.  మాట నీరసంగా వున్నా ఆవిడ నవ్వు దేదీప్యమానంగా వుంది.
  నా కవితలు కొన్ని చదివారట.  “మీ కవితలు బాగుంటాయి.  కానీ మీ సహచరితో మీరెలా వుంటారో నేను చూస్తే కానీ మీరు కూడా అంత మంచి మనిషని నేననుకోలేను” అన్నారు ఆవిడ.  అప్పుడు నేను నా జీవితంలోకి ఇంకా ఒక సహచరి రాలేదని చెప్పాను.  నవ్వారు.  ఆ తరువాత ఆవిడని అతి కొద్ది సార్లే కలిసాను.  నాకావిడతో సాన్నిహిత్యం చాలా తక్కువ.  ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి ఈవిడ సరిగ్గా మందులేసుకోవటం లేదని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది.  రెండో అమ్మాయి అలా నిస్సహాయంగా నేల చూపులు చూస్తున్నది.   ఆవిడ మాత్రం ఏం ఎరగనట్లు ఏదో పుస్తకం చదువుకుంటూ వుండిపోయారు.  ఆమెతో సాన్నిహిత్యం లేకపోయినా ఆమె మరణానంతరం సోమయాజులు, కృష్ణాబాయిగారు వంటి మిత్రులు, ఆమె పిల్లల ప్రోద్భలంతోనే “సావిత్రి” పుస్తకానికి సంపాదకత్వం వహించటానికి పూనుకున్నాను. నా పేరు వేసుకోలేదు కానీ అప్పటికే ప్రజా రచయితల సమాఖ్య తరపున బాల కార్మిక వ్యవస్థ మీద “మొగ్గ మిరుగులు”, దక్షిణాఫ్రికా  పోరాటానికి మద్దతుగా “జాతి మొత్తం బందీ అయినప్పుడు” వంటి పుస్తకాలు రావటంలో నా పూర్తి పాత్ర లేదా భాగస్వామ్యం వున్న అనుభవం వున్న కారణంగా కూడా సరేనన్నాను. 
2. “సావిత్రి” పుస్తకం కోసం మీరు చేసిన కృషి ఏమిటి?  అందులోని ఆమె సాహిత్యం అంతా అంతకు ముందే ముద్రితమా?  ఆమె రచనలు ఎలా సంపాదించారు?
ముందు కేవలం మిత్రుల రచనలతో ఒక యాభై పేజీలతో స్మృతి సంచిక మాత్రమే తేవాలనుకున్నాం.  కానీ తరువాత నా ఆలోచన మారింది.  సావిత్రిగారి రచనలు కూడా వేస్తే బాగుంటుందనుకున్నాను.  అయితే, ఆమె రచనలు ఏవీ అందుబాటులో లేవు ఒక్క “బందిపోట్లు” కవిత తప్ప.  కానీ ఆవిడ ఏదో ఒకటి రాస్తుండేవారని అందరూ అన్నారు.  ఎక్కడున్నాయి అవి మరి? అని ఆలోచించాను.  ఆమె ఖచ్చితంగా శక్తిమంతంగా రాసుంటారని అనిపించింది.  ఆమె వ్యక్తిత్వమే కాదు, ఆమె సాహిత్యాన్ని కూడా భావి తరాలకు అందించాలనిపించింది.  అందుకే పుస్తకంలో ఆమె సృజన, స్మృతి రెండూ వుండాలనుకున్నాను .
సావిత్రి గారి రచనల కోసం చాలామందిని సంప్రదించాను.  ఆమె తన రచనలను ఏ మాత్రం జాగ్రత్త చేయలేదు.  పి.రామకృష్ణా రెడ్డీ వంటి పత్రికల్లో పని చేసే మిత్రుల మీద ప్రధానంగా ఆధారపడ్డాను.  ఆమెకి ‘రేడియో సావిత్రీ అనే పేరు కూడా వున్నందున రేడియోలో పనిచేసే మధువంటి మిత్రుల్ని కూడా ఆశ్రయించాను.  సాహిత్య పేజీల్లో ప్రకటనలిచ్చాను.  ఆమె ముద్రితాల కంటే అముద్రితాల కోసమే ఎక్కువ వెతకాల్సి వచ్చింది.  పత్రికలకి పంపనివి ఆమె ఎంతో కొంత రాసుంటారు అని బలంగా అనుకున్నాను.  ఆ ఊహ నిజమైంది.  చివరికి ఒక ట్రంకు పెట్టెలో కొన్ని పుస్తకాల మధ్యలో ఆమె రచనలు కొన్ని దొరికాయని ఆమె పిల్లలు ఇచ్చారు.  కొన్ని ముద్రితాల్ని కృష్ణాబాయి గారు, రాజమండ్రి మిత్రులు ఇచ్చారు.  గౌతమి లైబ్రరీలో పనిచేసే సన్నిధానం నరసింహ శర్మగారు కూడా సహకరించారు.  ఇంక ఆమె స్మృతిలో మిత్రులు రాసినవి తీసుకున్నాను.  కేవలం ఆవిడ స్మృతి సంచిక తేవాలని మొదలెట్టి, ఆ తరువాత ఆవిడ రచనలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాక ఆవిడ రచనలే ప్రధానంగా వేయాలని అనుకున్నాం.  ఆ పుస్తకంలో మంచి చెడు అంతటికీ నాదే బాధ్యత.  ఎవరూ వేలెట్టలేదు.  సావిత్రి గారి కుటుంబానికి ఆత్మీయ మిత్రుడు, ఈ పుస్తకం రావాలని ప్రధానంగా సంకల్పించిన సోమయాజులు మాత్రం వాకబు చేస్తుండేవాడు. చివరికి ఇంతకంటే ఆమె రచనలు ఇంక దొరకవు అని నిర్ధారణకొచ్చాక, ఒక పది నెలల తరువాత ప్రింటింగ్ కి వెళ్ళాం.
  ఈ పుస్తకాన్ని ఆమెకెంతో ఇష్టమైన రాజమండ్రి సాహితీవేదిక ముఖ్య మిత్రుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది.  చేకూరి రామారావుగారు హైదరాబాద్ నుండి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కృష్ణాబాయి, అద్దేపల్లి రామ్మోహనరావు, సతీష్ చందర్, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి సాహితీవేత్తలు మాట్లాడారు.  చేకూరి రామారావుగారు తన ‘చేరాతలు”లో ఈ పుస్తకాన్ని సమీక్ష చేశారు.  అది చాలా గొప్ప సమీక్ష.  ఆమె సాహిత్యం లోతుల్లోకి కాదు, ఆమె హృదయ లోతుల్లోకి వెళ్లి చేసిన సమీక్ష.  దాన్నే ఇప్పటి పుస్తకానికి పీఠికగా తీసుకున్నాం.
3. సావిత్రిగారి పుస్తకాన్ని ఇప్పుడు మళ్ళీ ముద్రిస్తున్నారు కదా! మారుతున్న సమాజం నేపధ్యంలో సావిత్రి గారి రిలవెన్స్ ఇప్పుడెలా వుంటుందనుకుంటున్నారు? 
చేకూరి రామారావు గారు తన సమీక్షలో “స్త్రీ విముక్తి ధోరణి కవయిత్రుల్లో ప్రథమ గణ్యగా సాహిత్య పరిశీలకులు పరిగణిస్తున్న సావిత్రిని ఎవరూ అని ఇవాళ ఎవరు అడగరు.” అని 1992లో   అన్నారు.  కానీ ఒక పావు శతాబ్దం తరువాత పరిస్థితి చూస్తే సావిత్రిగారు ఈ తరం లోని చాలామందికి తెలియదన్న విషయం అర్ధమైంది.  చేరాగారే మరో మాట అన్నారు.  “కృష్ణశాస్త్రి గారు భారతి రజతోత్సవ సంచికలో ‘పాతికేళ్ళ తెలుగు కవిత్వం’ అనే వ్యాసం రాస్తూ గురజాడ అప్పారావుగారు మరణించిన తర్వాతనే జీవించడం ప్రారంభించారన్నారు. ఈ మాట సావిత్రికి కూడా అన్వయిస్తుంది. స్త్రీ విముక్తి ధోరణి సాహిత్యంలో సావిత్రి స్థానం ఆధునికాంధ్ర సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి స్థానంతో పోల్చదగింది కావడం కూడా ఈ సందర్భంలో గుర్తురాక మానదు.” ఈ మాటలు కూడా నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి.
మరి గురజాడ తరువాత స్థానంలో సావిత్రి గారున్నారని  చేరా అంతటి వాడన్నాక ఈ తరానికి, ముందు తరానికి సావిత్రిగారిని అందివ్వాల్సిన బాధ్యత మన మీదనే వున్నది.  లేకుంటే కెరీరిజం, కీర్తి కండూతి వున్న వారే సాహిత్యంలో జాతి ప్రతినిధులు కాగలరు.  సరే, కాసేపు సావిత్రి గారి గొప్పదనాన్ని పక్కన పెట్టి ఆలోచిద్దాం.  ఇవాళ ప్రపంచం సాంకేతికంగా చాలా మారింది.  కానీ మన సమాజంలో మనిషి మారలేదు. మానవ సంబంధాలు, ముఖ్యంగా  స్త్రీ పురుష సంబంధాల్లోని పవర్ రిలేషన్స్ ఏమీ మారలేదు.  అయితే స్త్రీల ప్రతిఘటన చైతన్యం పెరుగుతున్నది.  వారిలో స్వేచ్ఛ కాంక్ష బలీయమౌతున్నది.  ఈ సందర్భంలో సావిత్రిగారి జీవితం, సాహిత్యం స్ఫూర్త్తిదాయకంగా  పనిచేస్తుందనుకుంటున్నాను.   అందుకే ఈ పుస్తకానికి టైటిల్ కూడా “ఆమె అస్తమించలేదని…” అని పెట్టాను.  ఈ సందర్బంగా నేను ఈ పుస్తక ప్రచురణ గురించి ఆలోచన పంచుకోగానే ఒక ఐదుగురు మిత్రులు భారం పంచుకోటానికి ముందుకొచ్చారు.   వారి బేషరతు సహకారానికి నా కృతజ్ఞతలు.
*

 

అరణ్య కృష్ణ

View all posts
ఇడ్డూరం గుడ్డు బెడితే అయ్యవోరమ్మ అట్టు పోసిందట!
నాజీరు

4 comments

Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Suseela says:
    December 19, 2018 at 7:11 am

    అరణ్యకృష్ణగారు! సావిత్రిగారు అన్న స్త్రీ శక్తిని చాలా బాగా ఆవిష్కరించారు. ఆమె రచనల పుస్తకం తీసుకురావటానికి మీరు తీసుకొన్న ఉత్సాహం శ్లాఘనీయం! పుస్తకం చదవాలి ! ఎలా తెలుపండి దయచేసి. అభినందనలు!

    Reply
    • aranya krishna says:
      December 19, 2018 at 8:49 am

      It will be released tomorrow andi. Please contact me in box of facebook.

      Reply
  • rani siva sankara sarma says:
    December 22, 2018 at 7:12 am

    సావిత్రి గారి గురించి మరోసారి పుస్తకం తేవడం ముదావహం

    Reply
    • aranya krishna says:
      December 24, 2018 at 12:06 am

      Thanks sir! Your article is there in the book.

      Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

హంస బేసర

మునిసురేష్ పిళ్లె

నా స్వరాన్ని గుర్తు చేసుకో అదీ గుర్తుంటేనే….

శాంతి ఈశాన్

అహం పూర్వమేవ జానామి!

మానస ఎండ్లూరి

మా అమ్మమ్మ గారి ఊరు సర్జాఖాన్‌పేట్

భరత్ కనికె

సురూపుడు

ముక్కామల చక్రధర్

పుస్తక శత్రువు 

ఏ.కె. ప్రభాకర్
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు