నట్టనడి అడవిలో చెంచురాణి కొడుక్కి ఒక చెంచుపిల్ల తారసపడింది. మాట కలిసింది. స్నేహం కుదరింది. నేస్తులిద్దరూ పాతాళగంగకి ఆవల ఉన్న చెంచు గూడెంకి బయలుదేరారు. ఏటిని ఈదుకుంటూ ఆవలిగట్టుకి చేరారు. తన నేస్తానికి ఆ పిల్ల కడుపునిండా అడవి పళ్లు పెట్టింది.కొండలు చుట్టి , లోయలు దిగి నడుస్తున్నారు. తోవలో చెంచు పిల్ల ఎన్నో పాటలు పాడింది. ఎన్నో ఊసులు, ఎన్నెన్నో కథలు చెప్పింది. నలగని బాటలగుండా, ఇతరులకు తెలియని దారులగుండా ఆ పిలగాడిని అడవిలో నడిపించింది.
చింతా దీక్షితులు రాసిన ‘చెంచురాణి’ కథలోని ఈ దృశ్యం,తరచూనా కలలోకి వచ్చేది. లేదా, నేనే బహుశా కలలోంచి ఈ దృశ్యంలోకి ప్రవేశించేవాడినేమో!నిండు వెన్నెల రాత్రి మల్లీశ్వరి సినిమాలో భానుమతి, ఎన్టీ రామారావులా తుళ్లింతలు కేరింతలతో పరుగులు తీస్తున్న ఆ జంటను కనువిందుగా చూసేవాడిని. చెంచు పిలగాడికి ఆ పిల్ల తినిపించిన పళ్లను నేనూ అడవి చెట్లలో కోసుకుని తినేవాడిని. జలపాతాలకింద నడిచి, ఏటిలో ఈదులాడేవాడిని. అయితే వారి మాటలూ, ఊసులూ మాత్రం నాకు వినిపించేవి కాదు. నడిచి, ఆడి, పాడి అలిసి ఏ బండమీదనో వాళ్లు నడుం వాల్చిన వేళ.. ఆ పిల్ల చెప్పే కథలను పిలగాడు చెవులొగ్గి వినేవాడు. ఆ కథల మాధుర్యం అతడి ముఖంలో ప్రతిఫలించేది. ఇంకేదో మార్మికలోకంలోకి అతడిని ఆ పిల్ల చెప్పే కథలుతీసుకువెళ్లేవి. కథ చెప్పే పిల్లా, కథ వింటున్న పిలగాడూ తమ ఉనికిని కోల్పోయి కథలోకి వెళ్లిపోయినట్లుగా ఒక అలౌకిక స్థితిలో కనిపించేవారు.
అంత మైమరిపించేలా చెంచుపిల్ల,చెంచు పిలగాడికి చెప్పిన ఆ కథలు ఏమై ఉంటాయి? అతడి మనోఫలకంపై దృశ్యం కట్టిన ఆ కథన శిల్ప సౌందర్య రహస్యం ఏమిటి?
ఎంత కుతూహలపడ్డా ఆ కథలేమిటో నాకు అంతుపట్టలేదు. బహుశా ‘చెంచురాణి’ కథ రాసిన చింతా దీక్షితులుకి కూడా తెలిసివుండకపోవచ్చు. ఎందుకంటే.. కథ రాసిన ఆయనా, కథలోంచి కలలోకి ప్రవేశించిన నేనూ కూడా చెంచుపుట్టక పుట్టలేదు కాబట్టి. ‘చెంచురాణి’ కథలో కనిపించని, నా కలలో వినిపించని ఆ చెంచుకథల కోసం తెలుగు కథ ఇప్పటికీ వెంపర్లాడుతూనే ఉంది.
బహుశా 1930, 40ల మధ్య చింతా దీక్షితులు ‘చెంచురాణి’ కథను రాశారు. దీనికి ముందే ఆయన ‘చెంచు దంపతులు’ అని ఇంకో కథను కూడా రాశారు. చింతా దీక్షితులు చెంచు కథలు రాసి 90 ఏళ్లు అవుతున్నా తెలుగునేల మీద అసలైన చెంచుకథ ఇప్పటికీ పుట్టనేలేదు. ఒక్క చెంచు కథ మాత్రమే కాదు, తెలుగు నేల మీద దాదాపు 35గిరిజన జాతులున్నా… అచ్చమైన ఆదివాసీ కథ సాహిత్య ప్రపంచానికి తగినంతగా అందనే లేదు. ఆదివాసీలు పాత్రలుగా ఆదివాసీయేతరులు రాసిన కథలున్నా, అవి ఆదివాసీ కథలు కావు. ఆదివాసీల బతుకు వెతలను ఎంత ఒడుపుగా చెప్పినా సరే వాటినిఆదివాసీ కథలు అనలేం. చింతాదీక్షితులు రాసిన ‘చెంచురాణి’ కథ నన్ను అబ్బురపరిచినా, ‘అమ్మనుడి’ పత్రికలో తోకల గురవయ్య రాసిన చెంచుకథలు చదివిన తర్వాతే అసలైన చెంచుకథ ఏమిటో తెలిసింది. చింతా దీక్షితులు గోదావరి జిల్లాల్లో పుట్టి ఉద్యోగం కోసం రాయలసీమలో ఉన్న కాలంలో చూసిన చెంచు జీవితాన్ని కథగా మలిచాడు. చెంచుపెంటలో పుట్టిన తోకల గురవయ్య తాను అనుభవించిన చెంచు బతుకును కథగట్టి చెప్పాడు. బయటి చూపు సానుభూతినీ, సహానుభూతినీ ఇవ్వవచ్చునుగానీ ఆదివాసీ హృదయపు లోతులను పట్టి చూపించవీలు కాదు. బతుకులోనే కాదు, పలుకులో, తిండీ తిప్పల్లో, పనీ పాటల్లో, కట్టూ బొట్టులో, ఆటల్లో ఉండే విలక్షణత బయటి చూపుకు దొరకదు. ఆదివాసీలు మాత్రమే అచ్చమైన ఆదివాసీ కథ రాయగలరు. దు:ఖాలూ, సంతోషాలూ, నమ్మకాలూ, సంబరాలూ, నవ్వులూ, ఏడుపులూ, ఎత్తిపొడుపులూ, జ్ఞాన నైపుణ్యాలూ…. వీటిని పొదుపుకున్న సామెతలు.. ఇవి కదా ఆదివాసీ కథకు రక్తమాంసాలను ఇచ్చి జీవం పోస్తాయి!
ఆదివాసీ జీవ కథ ఎలా ఉంటుందో పద్దం అనసూయ కోయ కథలు చదివినపుడు అర్థం అవుతుంది. చింతా దీక్షితులే ‘సుగాలీ దంపతులు’ అని సుగాలీల నేపథ్యంగా రాయలసీమ కరువును చెప్పే కథ రాసినా, రమేశ్ కార్తీక్ నాయక్ కథలు చదివాకనే సుగాలీ కథ సౌందర్యం నాకు తెలిసింది. చింతా దీక్షితులే మాలదాసర్ల కళ కొడిగడుతున్నదంటూ ఆవేదనగా రాసిన కథ చదివినప్పటికన్నా, పుట్టా పెంచలదాస్ ‘యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా..’ అంటూ రాసిన కథ దు:ఖపు జీరను నాలోకి ఒంపింది.
మల్లిపురం జగదీశ్ రాసిన సవర కథలూ, భుక్యా గోపీ నాయక్, సూర్యా ధనుంజయ్ రాసిన బంజారా కథలూ, పలమనేరు బాలాజీ తన మూలాలను తడుముకుంటూ రాసిన ఎరుకల కథలూచదువుతూవుంటే.. ఆదివాసీ కథ రెక్కలు విప్పుకుంటున్న చప్పుడు వినిపిస్తుంది. అక్కడా అక్కడా ఒకటీ అరా కథలు రాసిన, రాస్తున్న ఆదివాసీ రచయితలు ఇంకొందరు ఉండవచ్చు గానీ, అంతా కలిపినా పట్టుమని పాతికమంది కూడా లేకపోవడం తెలుగు కథకు తీరని వెలితి. వెంటాడే వ్యథ.
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి పెద్ద సమూహంగా యానాది జాతి ఉంది.కరుణకుమార ఎప్పుడో రాసిన ‘బిళ్లల మొలతాడు’ తప్పవీరి నుంచి కథల్లేవు. తెలుగు నేలమీద ఉన్న ముప్పయికి పైగా ఆదివాసీ జాతులను ఇప్పటికీ తెలుగు కథ తాకనే లేదు.గోండు,కొండదొరలు, ముఖదొరలు, జాతాపులు, గదబ, భగత, నాయకపోడు, కోలాములు.. ఇలా ఎన్నో జీవితాలు తమ సొంత గొంతులను తెలుగు కథలో ఇప్పటికీ వినిపించనే లేదు.
ఇంతేనా? తెలుగు నేల మీద నుంచి దేశం నలుమూలలా తిరుగాలాడే సంచార, అర్ధసంచార జాతుల నుంచి కూడా కథ పుట్టలేదు. గారడీలు చేసే కాటిపాపలు, మాయలు చేసే మోడోళ్లు, పాములు పట్టి ఆడించే ఇర్లోళ్లు, కత్తులతో విన్యాసాలు చేస్తూ శైవ గాథలు పాడే వీరభద్రులు, సర్కస్ సాహసాలు చేసే దొమ్మరివారు, పంబ వాయిస్తూ కథాగానం చేసే పంబలవారు, గంగిరెద్దులతో ప్రదర్శనలు ఇచ్చే గంగిరెద్దులవారు, భజనలు, శకునాలు చెప్పే బుడబుక్కలు,జోల పాటలతో భిక్షాటన చేసే బాల సంతులు.. ఇట్లా ఎందరనీ.. ? సంచార జ్ఞాన భాండాగారాలైన వీరి జీవన ఆచార సంప్రదాయాలూ, కళలూ, వాయిద్యాలూ.. తెలుగు కథ కోల్పోతున్నది కదా!
రాతలో తెలుగు కథ గురజాడ ‘దిద్దుబాటు’ (1910) తో పుట్టిందనుకున్నాం. కాదు, 1902లో భండారు అచ్చమాంబ ‘ధనత్రయోదశి’ అన్నాం. రచయిత ఎవరో తెలియకపోయినా ‘చిలుక గురించిన సంభాషణ’ 1879లోనే జనవినోదిని లో ప్రచురితం అయిందంటూ ‘దిద్దుబాటు కి ముందు కథలు’ లో వివిన మూర్తి ప్రకటించారు. ఇన్నేళ్ల ప్రయాణంలోనూ తెలుగు కథ ఆదివాసీ, సంచార, అర్ధసంచార, ఆశ్రితకులాల బతుకులను పైపైనే తడిమింది. లోపలి నుంచి పుట్టిన కథ మాత్రమే లోతులను పట్టి చూపించగలదు. ఆ లోటును పూడ్చే ప్రయత్నం తెలుగు నేల మీద మనసు పెట్టి జరగడం లేదనే దిగులు పెరుగుతోంది. కథల బడులూ, రైటర్స్ మీట్ లూ తమ కథానైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి కథకులకు ఉపయోగపడతాయి గానీ ఆదివాసీ, సంచార, ఆశ్రిత కులాల కథలను వెలికి తీయలేవు. ఇందుకోసం ప్రత్యేక కథా వర్క్ షాప్ లు నిర్వహించాలి. నోటి కథ తెలిసిన ఆదివాసులకు రాత సులువులు వివరిస్తే చాలు.. కథ వారిని అల్లుకుపోతుంది. తెలుగు కథ పుట్టుక సంపూర్ణమవుతుంది. ఆదివాసీ కథ కోసం తెలుగు కథ జోలె పట్టుకుని ఎదురు చూస్తోంది.
*
చిత్రం: సుమనస్పతి రెడ్డి








Add comment