నామాలస్వామి! అలిమేలు మంగమ్మ!!

వెంకటేశ్వరస్వామికి పద్మావతిదేవి మీద కోపం వచ్చింది. ‘‘వచ్చిన రోజే శాపనార్ధాలు పెడుతున్నావు. కూతుర్ని కాపురానికి పంపిస్తున్నప్పుడు ఏ లోటు రాకుండా చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత, మీ నాన్న తొండమండలానికి రాజు. కనీసం కరేపాకు కూడా గతిలేదా మీకు?’’ అని ఆవేశంలో అనేసాడు. అంతే…

కాంతసేవ పూర్తయ్యింది. స్వామిని నిద్రపుచ్చి అర్చకులు ఇళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళువెళ్ళిపోగానే అటుతిరిగి నిద్రపోతున్నట్టు నటిస్తున్న నామాలస్వామి ఇటుతిరిగి లేచికూర్చున్నాడు. నిద్రపట్టటంలేదు. పదేపదే అలిమేలుమంగమ్మ గుర్తుకువస్తోంది. తనకోసం ఎదురుచూస్తూవుంటుంది. ఎలాగైనా సరే ఈరోజైనా అలిమేలుమంగమ్మని ఒప్పించి కొండపైకి కాపురానికి తీసుకురావాలి అని అనుకున్నాడు.

ఉన్నమనిషి వున్నట్టుగానే యలబారినాడు నామాలస్వామి.

రాత్రిపెట్టిన నైవేద్యాలు ఇంగా వేడివేడిగా పొగులుకక్కుతున్నాయి. చక్కెరపొంగలి, నేతి పొంగలి, దద్దోజనంలాంటి మధురాతి మధురమైన పదార్ధాలు. నేతిపొంగలి అంటే అలిమేలుమంగమ్మకు మహాఇష్టం. ఒకదొప్పలో నేతి పొంగలి మంగమ్మకోసం పట్టుకెళ్ళాలను కున్నాడు. హడావిడిలో మరిచిపోయాడు.

పునుగు, జవ్వాది, జాపత్రి లాంటి అత్తరు బుడ్డీలు అక్కడ పెట్టి ఉన్నారు. రాత్రంతా అవి పరిమళాల్ని వెదజళ్ళుతు స్వామిని నిద్రమత్తులో వుంచుతాయి. అలిమేలు మంగమ్మకు పునుగు పరిమళమంటే చాలాఇష్టం. పునుగుబుడ్డీని మంగమ్మకోసం పట్టుకెళ్ళాలనుకున్నాడు.

అది మరిచిపోయాడు.

రకరకాల పూలగంపలున్నాయి. పారిజాతాలంటే అలిమేలుమంగమ్మకు చాలా ఇష్టం. ఒక గంపెడు పారిజాతాలు పట్టుకెళ్ళి అలిమేలుమంగమ్మ మీద పూలవర్షం కురిపించాల నుకున్నాడు.

పూలనీ మరిచిపోయాడు.

అలిమేలుమంగమ్మని కలవాలన్న ఆతృతలో అన్నీ మరిచిపోయాడు. ఉత్త చేతులతో యలబారినాడు. మనసంతా అలిమేలుమంగమ్మే నిండివుంది. ఎప్పుడెప్పుడు కలుస్తానని హృదయం తల్లడిల్లిపొతోంది.

నామాలస్వామి గుడి బయటకు వచ్చాడు. గబగబా అవ్వాచారి కోనలోకి దిగాడు. ఒక్క అంగలో గాలిగోపురం దగ్గరకు వచ్చాడు. మోకాలు పర్వతం దగ్గర మెట్టుమీదనుంచి, మెట్టుమీదకు దూకుతూ కిందికి దిగుతున్నాడు.

అధిక జ్యేష్టమాసం. ఆరోజు పున్నమి. వెన్నెల కూడా అధికంగా కురుస్తోంది. ఆ వెన్నెల్లో దిగువ తిరుపతి తడిసిపోతోంది. పిండిని చల్లినట్టున్న వెన్నెల్లో కరెంటు దీపాలు కూడా గుడ్డిగా వెలుగుతున్నాయి. గోవిందరాజులస్వామి గుడిగోపురం వెన్నెల దుప్పటిని కప్పుకుని మత్తుగా నిద్రపోతోంది.

తిరుపతికి కొంచెం దూరంలో విసిరేసినట్టుగా తిరుచానూరు కనిపిస్తోంది. అమ్మవారి గుడిగోపురం వెన్నెల్లో తడుస్తూ వళ్ళువిరుచుకుంటోంది. కోనేటి నీళ్ళపై వెన్నెలపడుతోంది. వెండిని కరిగించి పోసినట్టు కోనేరంతా దగద్ధాయమానంగా మెరిసిపోతూవుంది.

నామాలస్వామి కొండదిగుతుంటే, ఆకాశంలో చందమామ కొండదిగుతున్నట్టు వుంది. దేవుని చుట్టూ ఒకవెలుగు ఆవరించివుంది. సూర్యునిలోని జ్వాలల్లా ఆ వెలుగు ఎగసెగసి పడుతోంది.

స్వామిని ప్రత్యక్షంగా మనకళ్ళతో చూడలేనంత వెలుగు. ఆ వెలుగు విశ్వాంతరాల మంతా, పాలపుంత ఆవలితీరమంతా, ఆది, అంతము లేనంతగా వ్యాపించివుంది.

ప్రతిరోజు అర్ధరాత్రి నామాలస్వామి కొండదిగిరావటం, అలిమేలుమంగమ్మ చేతులు పట్టుకుని కాపురానికి రమ్మని బతిమాలుకోవటం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే… దానికి ఒక కథ వుంది.

పూర్వం దుర్వాసమహాముని ముల్లోకాల్లోవున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కలవటానికి బయలుదేరాడు. కైలాసానికి వెళ్ళాడు. పార్వతీ, పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తూ దుర్వాసుడ్ని పట్టించుకోలేదు. పరమేశ్వరుడ్ని లింగరూపుడిగా శపించి, బ్రహ్మలోకానికి బయలుదేరాడు. బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వీణవాయిస్తూ వుంది. బ్రహ్మదేవుడు ఆ వీణానాదంలో మైమరచిపోయి, దుర్వాసుడు పిలుస్తున్నా పట్టించుకోలేదు. భూలోకంలో బ్రహ్మదేవుడికి గుడి వుండదని శపించి వైకుంఠానికి బయలుదేరాడు. వైకుంఠంలో శేషతల్పంమీద పడుకుని, లక్ష్మీదేవి కాళ్ళు వత్తుతుంటే మహావిష్ణువు కళ్ళుమూసుకుని మాయానిద్రని నటిస్తున్నాడు.

దుర్వాసుడికి కోపం వచ్చి, విష్ణు వక్షస్థలం మీద కుడికాలితో తన్నాడు. అది లక్ష్మీదేవి స్థానం. ఒక్కసారిగా లక్ష్మీదేవికి కోపం వచ్చింది. విష్ణువు తప్పు అయిపోయిందని దుర్వాసుడి కాళ్ళుపట్టుకున్నాడు. అది చూసి లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. విష్ణువు, దుర్వాసుడి కాళ్ళు పట్టుకున్నట్టే పట్టుకుని, కుడికాల్లో వున్న అహంకారం అనే నేత్రాన్ని వత్తేసాడు. ఆ కన్ను చితికిపోయి అసలైన కళ్ళు తెరుచుకున్నాయి. స్వామి పాదాలపై పడి క్షమాపణలు కోరాడు దుర్వాసుడు.

లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలివెళ్ళిపోయినందుకు స్వామి చాలా బాధపడ్డాడు. ఆమెను వెతుక్కుంటూ స్వామి కూడా భూలోకానికి వచ్చేసాడు. అలా భూలోకానికి దిగిన స్వామి తిరుమల కొండమీద పాదం మోపాడు. ఆ పాదమే బ్రహ్మకడిగిన పాదము. బ్రహ్మము తానైన పాదము.

ఎంతటి దేవుడికైనా భూలోకంలో అడుగుపెడితే మానవ క్షణాలే అబ్బుతాయి. లక్ష్మీదేవి విరహవేదనలో వున్న స్వామిని వకుళమాత చేరదీసింది. తన కొడుకుగా స్వీకరించి, వరాహస్వామిని ఆశ్రయం కల్పించమని కోరింది. వరాహస్వామి అందుకు అంగీకరించాడు. అప్పట్నుంచి తిరుమలకొండ స్వామి నివాసస్థలమైంది. స్వామి భక్తుపాలిట కొండంత దేవుడు అయ్యాడు.

భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ఒక బంగారు పద్మంలో పసిపాపగా ఉద్భవించింది. తొండమండలానికి రాజైన ఆకాశరాజు పుత్రికామేష్టియాగం చేసి, పసిడి నాగలితో భూమిని దున్నుతుంటే, పసిడి పద్మంలో బంగారు ఛాయతో మెరిసిపోతున్న పసిపాప దొరికింది. ఆ పాపని తీసుకుని మురిసిపోయారు ఆకాశరాజు దంపతులు. పద్మంలో పుట్టింది కాబట్టి ఆ పాపకి పద్మావతిదేవి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.

పద్మంలా విచ్చుకుని నవయవ్వనంలోకి అడుగుపెట్టింది పద్మావతిదేవి.

ఒకరోజు నారాయణవనంలో చెలికత్తెలతో పద్మావతిదేవి ఆడుకుంటూవుండగా, ఏనుగు గుంపు ఒకటి అడవిలోనుంచి నారాయణవనంలోకి ప్రవేశించాయి. అడవిలోని ఏనుగులు ఊళ్ళోకి అడుగుపెడితే అవి పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తాయి. తొండంతో చెట్లని లాగి పెకలించేస్తున్నాయి. మండపాలని కూల్చేస్తున్నాయి. ఎదురొచ్చిన సైనికులను తొండంతో పడగొట్టి, స్తంభాల్లాంటి కాళ్ళతో వాళ్ళ తలల్ని దిష్టితీసిన గుమ్మడికాయల్లా తొక్కేస్తున్నాయి.

ఒక ఏనుగు పద్మావతిదేవి వెంటపడి తరిమింది. భయంతో పరిగెత్తింది. కాలు తగులుకుని కిందపడిపోయింది. ఆ ఏనుగు దగ్గరికొచ్చి చెవులు చిల్లులుపడేలా ఫీుంకారం చేస్తూ, కాలు పైకెత్తి తొక్కబోయింది. అటువైపు వేటకొచ్చిన వెంకటేశ్వరస్వామి ఆ దృశ్యాన్ని చూసాడు. ఒక్క ఉదుటున వెళ్ళి ఆ ఏనుగు కాలుని తన బాహువులతో వుడుములా అదమిపట్టుకున్నాడు. స్వామి శక్తి ముందు దాని శక్తి సన్నగిల్లింది. కాలుని వెనక్కి తీసుకుంది. మదమనిగిన ఏనుగు పారిపోయింది. ఆ ఏనుగుతోపాటూ మిగతా ఏనుగులు కూడా అడివిలోకి పారిపోయాయి.

పద్మావతిదేవి ఇంకా ఆ భయంలోనే వుంది. అప్పుడు చూసాడు పద్మావతి దేవిని. లక్ష్మీదేవి అంశతో పుట్టిన పద్మావతి దేవిని. స్వామికి మతిపోయింది. మతి తప్పిన స్వామి కొండకువచ్చి, పద్మావతిదేవి తలపుల్లోనే వుంటూ, బాహ్యప్రపంచానికి తలుపులేసు కున్నాడు.

అది గమనించింది వకుళమాత. పద్మావతిదేవిని, వెంకటేశ్వరస్వామికి ఇచ్చి పెళ్ళిచేయమని అడగటానికి నారాయణ వనం వెళ్ళింది. స్వామి కూడా ‘సోది చెపుతానమ్మ సోది…’ అంటూ, సోది చెప్పే ఆమె వేషంలో వెళ్ళి ఆకాశరాజు దంపతులను పెళ్ళికి ఒప్పిస్తాడు.

నారాయణవనంలో పద్మావతి, వెంకటేశ్వరుల కళ్యాణం జరిగింది.

అత్తవారింట ఒకమాట కూడా పడనివ్వకుండా, చీరలు సారెలు, కట్నకానుకలు, బహుమానాలు ఏనుగు అంబారీకెత్తి, మందిమార్బలంతో ఏలోటు రానివ్వకుండా తన కూతురైన పద్మావతిదేవిని, ఆకాశరాజు కాపురానికి పంపిస్తాడు.

వెంకటేశ్వరస్వామి చిటికెనవేలుని పట్టుకుని సంతోషంగా తిరుమలకొండకు కాపురానికి వచ్చేసింది పద్మావతిదేవి.

కాపురానికి వచ్చిన మొదటిరోజే ఒక సంఘటన జరిగింది. పోటులో (వంటశాల) కూర తిరగమాతపెడుతుంటే కరేపాకు లేకుండా పోయింది ‘కూతుర్ని కాపురానికి పంపిస్తూ, కరేపాకు కూడా ఇచ్చి పంపించలేదు. ఆకాశరాజుకి కరేపాకు కూడా గతిలేదా?’ అని అన్నాడంట వంటవాడు. అది తెలిసి పద్మావతిదేవి మనసు చివుక్కుమంది. కోపంతో శాపం పెట్టింది. ‘ఈ కొండమీద కరేపాకు మొక్కే మొలవదు అని శపించింది. ఆరోజు నుంచి ఈ రోజు వరకు కొండమీద కరేపాకు మొక్క కనిపించదు.

ఇది తెలిసిన వెంకటేశ్వరస్వామికి పద్మావతిదేవి మీద కోపం వచ్చింది. ‘‘వచ్చిన రోజే శాపనార్ధాలు పెడుతున్నావు. కూతుర్ని కాపురానికి పంపిస్తున్నప్పుడు ఏ లోటు రాకుండా చూసుకోవటం తల్లిదండ్రుల బాధ్యత, మీ నాన్న తొండమండలానికి రాజు. కనీసం కరేపాకు కూడా గతిలేదా మీకు?’’ అని ఆవేశంలో అనేసాడు. అంతే… ఆ మాటతో అలిగి పద్మావతి దేవి కొండదిగి వచ్చేసింది. అమ్మగారి ఇంటికి వెళ్ళడం ఇష్టంలేదు. తిరుచానూరులోనే వుండిపోయింది.

తనతప్పు తెలుసుకున్న వెంకటేశ్వరస్వామి ఆరోజు అర్ధరాత్రి కొండదిగి వచ్చి, తిరుచానూరులో వుండే పద్మావతిదేవి చేతులు పట్టుకుని తప్పు అయిపోయింది క్షమించమని వేడుకున్నాడు. కాని పద్మావతిదేవి మనసు కరగలేదు.

ఆరోజు నుంచి ప్రతిరోజూ అర్ధరాత్రి కొండదిగి వస్తాడు. పద్మావతి దేవిని బతిమాలుతాడు, కాపురానికి రమ్మని పిలుస్తాడు. వేడుకుంటాడు! ప్రాధేయపడతాడు! ఎంతటిదేవుడైనా భర్తే కదా! తప్పదు మరి…

లోకమంతా మత్తుమందు చల్లినట్టు హాయిగా నిద్రపోతున్నారు.

అలిమేలుమంగమ్మ గుళ్ళోనుంచి బయటకు వచ్చింది. కోనేటికట్ట పిట్టగోడ మీద కూర్చుంది. కోనేటి నీళ్ళల్లో పున్నమినాటి చంద్రుడు మునుగుతూ, తేలుతూ వున్నాడు. తన సహోదరుడైన చంద్రుడ్ని మురిపెంగా చూస్తూవుంది అలిమేలుమంగమ్మ.

వెన్నెల మల్లెపూలు రాలినంత మెత్తగా పడుతోంది.

ఆదరాబాదరాగా వచ్చి, పెద్దగా శ్వాసతీసుకుని అలిమేలుమంగమ్మ పక్కన పిట్టగోడమీద కూర్చున్నాడు నామాలస్వామి. అలిమేలుమంగమ్మ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్వామి వైపు చూసింది.

‘ఎందుకలా చూస్తావు? నిన్ను చూడటానికి అర్ధరాత్రి కొండదిగి వచ్చాను. నీకు ఇష్టమని ఏం తెచ్చానో చూడు’ అని ఉత్తచేతుల్ని చూపించాడు.

ఉత్తచేతుల్ని చూసి నవ్వుకుంది అలిమేలుమంగమ్మ. అప్పుడు అర్ధమైంది స్వామికి మంగమ్మ కోసం ఏమీ తేలేదని, ఉత్తచేతులతో వచ్చానని.

‘నిన్ను చూడాలన్న హడావిడిలో మరిచిపోయాను మంగమ్మ. నీకు ఇష్టమైన నేతిపొంగలి, పునుగుఅత్తరు, పారిజాతాలు అన్నీ మరచిపోయాను’ అన్నాడు. మరచిపోయినందుకు చింతిస్తూ…

‘అవును… నన్నుకూడా మరిచిపోయారు. శంఖచక్రాలను ధరించటం కూడా మరచిపోయారు. కనీసం ఆయుధం కూడా తీసుకోలేదు. ముసలి బారినుంచి గజేంద్రుడు రక్షించమని వేడుకోగానే అన్నీ మరచిపోయి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయారు. భక్తుల మీద వుండే ప్రేమ, పెళ్ళాంమీద మీకు లేదు’ అని దెప్పిపొడిచింది అలిమేలుమంగమ్మ.

ఆ మాటకి నామాలస్వామి మౌనంగా వుండిపోయాడు, తేలుకుట్టిన దొంగలా!

‘ఇంత మతిమరుపు మొగుడితో నేను కాపురం చెయ్యలేను స్వామీ. నేను మీతో కొండమీదకి రాలేను’ అంది నిష్టూరంగా అలిమేలుమంగమ్మ.

‘నీ మీద ఇష్టంతో నీకు ఇష్టమైన వాటిని కూడా మరిచిపోయానంటే, నీమీద ఎంత ప్రేమవున్నట్టు చెప్పు మంగమ్మ? నేను నా భక్తులనైనా, భార్యనైనా భక్తుడిలానే ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. నేను దేవుడ్ని కాదు మంగమ్మ. నీ భక్తుడ్ని’ అన్నాడు.

ఆ మాటతో కరిగిపోయింది మంగమ్మ. నామాలస్వామి ఎదపై వొదిగిపోయింది. మంగమ్మని కౌగిలిలో పొదుపుకుని హృదయానికి దగ్గరగా హత్తుకున్నాడు.

వాళ్ళు దేవుళ్ళైనా, సగటు భార్యాభర్తల్లా ఒకరి స్పర్శని ఒకరు ఆస్వాదిస్తున్నారు.

గోపిని కరుణాకర్

తెలుగు కథకి రాయలసీమ నించి "కొండంత" దీపం పట్టుకొచ్చినవాడు గోపిని కరుణాకర్. తన భాషతో తన కథనంతో వచనాన్ని వెలిగించిన వాడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఊహు ఏమి కాదు అన్ని మర్చిపోయిన మొగుడేగా నేను కూడా నమ్మను–

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు