రచయితగా అంతకంటే ఏం కావాలి?

‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అంటూ రాసిన తొలి నవలతోనే పాఠకలోకానికి ఎంతో దగ్గరైన రచయిత రవి మంత్రి. ‘ఇది అమ్మ ప్రేమకథ’ అంటూ ప్రచారమైన ఈ నవల సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ నెలలో విడుదలై ఐదు ఎడిషన్లు ప్రింటయ్యి ఇప్పుడు ఆరో ఎడిషన్ వరకు వచ్చింది. కాకినాడలో పుట్టి పెరిగిన రవి మంత్రి, ప్రస్తుతం ఐర్లాండ్‍లోని డబ్లిన్‌లో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2019 నుంచి కథలు రాస్తూ ఎన్నో కథా కవితల పోటీల్లో బహుమతులు పొందారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, సారంగ తదితర పత్రికల్లో ఈయన కథలు ప్రచురితమయ్యాయి. ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ తొలి నవల. అప్పుడే ఇంకో కొత్త నవలతో సిద్ధమవుతున్నారు. త్వరలో రాబోతున్న ఆ నవల గురించి, సోషల్ మీడియాలో, అమెజాన్లో సెన్సేషన్‍గా మారిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ పుస్తకం గురించి రవితో జరిపిన సంభాషణ.. సారంగ పాఠకుల కోసం..

నమస్తే రవి గారూ! సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ గురించి కనిపిస్తోంది. ఈ పుస్తకం గురించి కొన్ని మీమ్ పేజీలు చేసిన రీల్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఏడాదిలో ఒక తెలుగు పుస్తకం ఐదు ఎడిషన్లు అమ్ముడుపోవడం అంటే పెద్ద అచీవ్మెంటే! ఈ సక్సెస్ స్టోరీ గురించి చెప్పండి!

ముందుగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీకు, సారంగ పత్రికకు ధన్యవాదాలు అండీ. ఇక సక్సెస్ స్టోరీ అని మీరు పెద్ద పెద్ద మాటలు ఏవో అంటున్నారు. నాకు నిజంగా అవన్నీ తెలియదండీ. ఏ అంచనాలు లేకుండా సరదాగా నిజాయితీగా రాసుకున్న కథ ఇది. మొదటి కథ కదా. అందువల్ల కూడా ఏ అంచనాలు లేకపోయి ఉండొచ్చు. ఒకరిద్దరు పబ్లిషర్లకు పంపించాను. వాళ్ళు చదవకుండానే రిజెక్ట్ చేశారు (అనిపించింది). ఆ తర్వాత మల్లికార్జున్‌ని కలిసి మాట్లాడి, నచ్చితే చెప్పమన్నా. తను, అజు పబ్లికేషన్స్ కో-పబ్లిషర్ శ్వేత (ఈ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి) చదివి, ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నామని చెప్పి నాకు కొన్ని సూచనలు చేసారు. ఇదంతా జరిగి ఈ పుస్తకం ఇలా రావడానికి దాదాపు సంవత్సరం పైనే పట్టింది. 2023 జూన్ నెలలో మొదటి ఎడిషన్ రిలీజ్ అయినప్పుడు ఒక 200 పుస్తకాలైనా అమ్ముడవుతాయా అనుకున్నా. మూడు నెలల తర్వాత రెండో ఎడిషన్ వచ్చింది. తర్వాత మూడు. నమ్మలేకపోయాం. నాలుగో ఎడిషన్ రిలీజ్ అయ్యాక రెండ్రోజుల్లో కాపీలన్నీ అయిపోయి వెంటనే ఎక్కువ కాపీలతో అయిదవ ఎడిషన్‍కి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆరో ఎడిషన్ వచ్చేసింది. గత నెల రోజులుగా విపరీతంగా మెసేజీలు ఫోన్లు. అమెజాన్ ఇండియాలో నెంబర్ 1 బెస్ట్ సెల్లర్ ప్లేసుకెళ్ళింది. అప్పుడు మెల్లగా అర్థం అయింది, ఈ పుస్తకాన్ని బాగా ఆదరిస్తున్నారని. ఇందులో సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కీలక పాత్ర పోషించింది. పుస్తకం కొని చదివిన వాళ్ళలో అరవై శాతం మంది పాతికేళ్ళలోపువాళ్ళే. పైగా వాళ్ళకి ఇది మొదటి పుస్తకం. ఒక రచయితగా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయం.

మీకు ఇంత పేరు సంపాదించి పెడుతున్న ఈ పుస్తకం ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వేరే భాషల్లోకి అనువాదం చేసే ఆలోచన ఉందా?

ఈ పుస్తకం వేరే భాషల్లో వస్తే బావుంటుందని నాకు చాలా రోజుల్నుంచి అనిపిస్తోంది. ఇది తెలుగువాళ్ళ కథే అయినప్పటికీ ప్రేమ ఏ భాషలో అయినా ఒకటే. అందువల్ల ఇది మిగతా భాషలవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందని నా నమ్మకం. కొందరు ఇతర భాషల్లో అనువాదం  కోసం అడుగుతున్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు చెప్తాం.

సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‍గా కూడా మీరు బాగా పాపులర్ అయ్యారు. అది ఒక రచయితగా మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తోంది? మీ రచనలపైన సోషల్ మీడియా ప్రభావం ఉంటుందా?

పుస్తకం విడుదలయ్యేనాటికి నేను ఒక సగటు సోషల్ మీడియా యూజర్‍నే. కొద్దిగా యాక్టివ్‌గా ఉన్నానంతే. మెల్లగా నేను చేసిన కంటెంట్ జనాలకి నచ్చి నా గురించి వెతకటం ప్రారంభించి నా కథల్ని కూడా చదవటం మొదలుపెట్టారు. అది పుస్తకం సేల్స్ పెరగటానికి హెల్ప్ అయింది. నా రచనలపై సోషల్ మీడియా ప్రభావం అస్సలు ఉండదు. రోజూ వాళ్ళు చూసేదే చెప్పటం కన్నా కొత్తగా చెప్పటం ఇష్టపడతాను నేను.

మీరు రాస్తున్న కొత్త పుస్తకం గురించి చెప్పండి. అలాగే ఈ ఐదేళ్ళలో మీ రచనా శైలిలో వస్తున్న/వచ్చిన, మీరు గమనించిన మార్పుల గురించి చెప్పగలరా?

కొత్త కథ కూడా ప్రేమకథే అండీ. ఇప్పటి తరానికి రొమాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉందనిపించింది. కొద్దిగా పొయెటిక్‍గా రాసుకున్న నవల అది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను. ఎదురు చూడాల్సిందే. మీతో పాటు నేను కూడా!

మీ కథల కోసం మీరు చేసే రీసెర్చ్ ఎలా ఉంటుంది? మీరు పరిగణనలోకి తీసుకునే అంశాలేంటి?

నేను నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా, సున్నితమైన అంశాల్ని నా రచనల్లో తీసుకుంటాను. రీసెర్చ్ కోసం ఒక్కోసారి అవసరమయితే కొంతమంది ముందుతరం వాళ్ళతో మాట్లాడతాను.

తెలుగులో రచయితలు / ప్రచురణకర్తలు వాళ్ల పుస్తకాలు ఎక్కువమంది పాఠకులకి చేర్చాలంటే ఏం చేయాలంటారు?

మాట్లాడే తెలుగుకి, పుస్తకాల్లో వచ్చే తెలుగుకి తేడా ఉంటుందని తెలుసుకోవాలి. సినిమాల్లో సీరియల్స్‌లో లాగా జీవితానికి దూరంగా ఉండే కథల్ని రాసి చదివించాలంటే కత్తి మీద సాములాగ అనిపిస్తుంది నాకు. బాగా రీసెర్చ్ చేసి అర్థం చేసుకుని రాస్తే కథ ఎక్కువ మందికి చేరుతుంది. కొత్త రీడర్స్ కోసం కాంటెంపరరీ రచనలు, వినూత్నమైన మార్కెటింగ్ పద్ధతులు అవసరమని నమ్ముతాను. మార్కెటింగ్ విషయంలో సోషల్ మీడియా సహాయం కూడా కొంతవరకు అవసరం. ఇందులో మా పబ్లిషర్, అజు పబ్లికేషన్స్ టీం చేస్తున్న కృషి కూడా అభినందనీయం.

*

శ్వేత యర్రం

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు