స్మిత మేడం

వెళ్ళిపోతుందని ఎప్పటినుంచో తెలుసు. వేరే ఊరు నుంచి పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడెలా ఉండిపోతారు?

శేషు గాడికి ఏడుపు తన్నుకొస్తోంది. ఏడ్చినప్పుడు ఆడి మొహం అద్దంలో చూసుకున్నాడు ఇదివరకొకసారి. అది గుర్తొచ్చి అతి కష్టం మీద మొహం మామూలుగా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. పైకి ఏడవకపోవటం వల్ల గొంతు అంతా నొప్పి పుడుతుంటే, ఆ నొప్పి అప్రయత్నంగా ఇచ్చే బలంతో వేగంగా పొలం గట్టుపై నడుస్తున్నాడు. మరో ఐదు నిమిషాల్లో కుండపోతగా కురుస్తానని ఆకాశం మొత్తం కమ్ముకున్న మబ్బులు భయపెడుతున్నా, వానలో తడిచి ఇంటికెళ్తే అమ్మ ఈనుపుల్లలతో కొడుతుందని తెలిసినా, ఇంటివైపు కాక ఏటో నడిచేసి పోతున్నాడు. ఇప్పుడు గాలివాన గట్టిగా కొడితే మరి ఇందాకే బయల్దేరిన స్మిత మేడం వాళ్ళ బస్సు క్షేమంగా వెళుతుందా అని ఒక సారి ఆగి లెక్కేసుకున్నాడు. అయినా స్మిత మేడంకి అలాగే అవ్వాలి, తనని వదిలేసి పోతున్నందుకు. వెళ్లిపోయే ముందు రోజు స్మిత ఇచ్చిన వాచీ గుర్తొచ్చి చేతిలో అది కనపడకపోయేసరికి ఒక్కసారి గుండె జారిపోతే, కంగారుగా కింద వెతుక్కుంటూ వెనక్కి పరుగెత్తాడు. ఇందాకటి నుండి ఆపుకున్న ఏడుపు ఇక రాగం అందుకుంది. వాడి పరుగుకి లూజు నిక్కరు జేబులో ఉన్న వాచీ పెట్టె ఊగుతూ చేతికి తగిలింది. మేడం వెళ్లిపోతుందన్న బాధలో జేబులో పెట్టుకున్నది కూడా మర్చిపోయాడు. ఒక్కసారిగా కంగారు పోయి రెండు క్షణాలు శాంతించాక అసలు ఇందాక ఎందుకేడుస్తున్నాడో మర్చిపోయాడు. మరే. స్మిత మేడం వెళ్ళిపోయింది. కుళ్ళి మేడం.

వెళ్ళిపోతుందని ఎప్పటినుంచో తెలుసు. వేరే ఊరు నుంచి పని మీద వచ్చిన వాళ్ళు ఇక్కడెలా ఉండిపోతారు?అయినా వెళ్లిపోవాలా? వేసవి సెలవులన్నీ ఎంత చక్కగా గడిచాయో మేడం ఉన్నన్నాళ్లూ. మేడం దగ్గర ఎంచక్కా రెండు కెమెరాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఫోటోలు తీస్కోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ సినిమాలు చూడ్డానికి లేప్టాపు కూడా ఉంది. మేడం పని సూపరు. పెద్దయ్యాక తను కూడా documentary filmmaker అయితే ఆవిడలాగే అవన్నీ కొనుక్కోవచ్చు.

మేడం వెళ్లిపోయిందన్న కోపం మధ్యలో బెంగ, ఆరాధన, ఆకర్షణ కూడా అప్పుడప్పుడూ తొంగి చూస్తున్నా వీటన్నిటికీ మూలంగా ఆకర్షణే నిలిచింది. శేషుని ఊరు చూపించటానికి పనిలో కుదుర్చుకున్న మరునాడు మేడం వేసుకున్న ఎర్ర పంజాబీ డ్రెస్సు గుర్తొచ్చింది. ఎంత తెల్లగా ఉందో, అచ్చం హీరోయిన్ లాగ. ఎప్పుడూ మంచి సెంటు వాసన వస్తాది. వాళ్ళ క్లాసులో వనజే అందరికంటే అందగత్తె అని అనేసుకున్నవాడు, అసలు మేడంని చూసిన రెండ్రోజులకే వనజ ఈవిడ పక్కన ఎందుకూ పనికిరాదన్న తీర్పు ఇచ్చేసుకున్నాడు. వేసవి సెలవుల్లో అమ్మ కోడిగుడ్లు తెమ్మన్నప్పుడల్లా ముసలోడి కొట్టు వీధి చివరే ఉన్నా, సైకిల్ డెక్కుతూ వెచ్చావారి అగ్రహారం దాకా వెళ్లి పద్మజ వాళ్ళ ఆంటీ కొట్టులోనే తెచ్చేవాడు. సెలవుల్లో వాళ్ళ ఆంటీతో కబుర్లు చెప్తూ వనజ కూడా కొట్టులోనే కూర్చుంటాది మరి. కానీ మేడం వచ్చాక అది మరీ దూరం అనిపిస్తుంది. పైగా కొట్టుకెళ్ళే ప్రతిసారీ సంక్రాంతికి కొన్న షర్ట్ వేసుకొని ఊడిపోయిన పై బటన్ స్థానంలో పిన్నీసు పైకి కనబడకుండా లోపల్నుంచి పెట్టుకోవాలంటే కష్టమే.

మేడంకి అయితే ఎంచక్కా ఎన్ని డ్రెస్సులుంటాయో. ఆ లైట్ గ్రీను డ్రెస్ ఏస్కున్నప్పుడు మాత్రం స్మిత మేడంని మించిన అందగత్తె ప్రపంచంలోనే లేదనుకున్నాడు. రోజంతా అలా చూస్తూనే ఉండిపోయాడు. మేడంని పెళ్లి చేసుకున్నట్టు కల కూడా కానీ పారేసాడు. కానీ అప్పట్నుంచీ కొంచెం మేడం దగ్గర ఉన్నప్పుడు సిగ్గు మొదలైంది. ఇదివరకూ ఊరంతా చూపించి ఆగకుండా వాగేవాడు కాస్తా మాటలు తగ్గించాడు. “ఏంటి శేషు ఈ మధ్య సైలెంటుగా ఉంటున్నావ్? ” అని మేడం అడిగితే ఏం చెప్పాలో తెలియక బిడియంగా మేడం మొహంలోకి చూసి తల అడ్డంగా ఊపాడు. స్మిత నవ్వుకొని, బుగ్గ గిల్లి “ఐస్ క్రీం తింటావా? ” అని అడిగి కొనిచ్చింది.

అమ్మాయికి అబ్బాయికి మధ్య బంధం ఏంటో తెలుసుకోటానికి Flames అనే ఆట ఏదో ఉంటదని వేణు గోపాల్ గాడు చెప్పాక గబా గబా ఆడేస్తే L అని వచ్చింది. L అంటే లవర్ కాబట్టి ఇక తన ప్రేమకు దేవుడు కూడా అంగీకారం తెలిపేసినట్టే మరి. కానీ మరి అమ్మేమో ప్రేమించటం తప్పు అని చెప్పిందిగా? కానీ స్మిత మేడం కూడా తనను ప్రేమిస్తుందిగా మరి? లేకపోతే రోజులో అన్ని సార్లు తనకెందుకు ఫోటోలు తీస్తుంది? కుడి పాపిడి తీసినరోజు అయితే భలే ఉన్నావ్ అని అన్ని సార్లు ఎందుకంటుంది? ఈ మీమాంసలో ఉండగానే మేడం ప్రాజెక్టు చివరి వారంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఊరొచ్చారు. కావ్య మేడం, స్వప్న మేడం, కృతిక మేడం, స్మిత మేడం ఫ్రెండ్స్ అందరూ చాలా తెల్లగా, అందంగా ఉంటారు. ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు. వాళ్ళతో వచ్చిన నితిన్ అనే కుర్రాడు కొంచెం మేడం మీద చేయి వేస్తున్నాడు. శేషుకి వాడు నచ్చలేదు.

ఏంటో పెద్ద హీరోలా పోజ్ కొడతాడు నితిన్. ఆడొక్కడికే ఇంగ్లీష్ వఛ్చినట్టు చెవిలో అదేదో పెట్టుకొని ఎప్పుడూ స్టైల్ కొడుతుంటాడు. మేడం దగ్గర మార్కులు కొట్టేయ్యటానికి చాలా స్వీట్లు కొనిస్తాడు కానీ నితిన్ మంచోడేమి కాదు. శేషుగాడు బాగా పాడతాడని ఆరడుగుల బులెట్ పాట మేడం పాడించినప్పుడు వినకుండా ఫోన్లో ఎదో చూసుకున్నాడు. మేడం ఏదైనా పని చెప్పినప్పుడు నితిన్ కూడా ఏ సిగరెట్లు తెమ్మనో డబ్బులిస్తే గిరాటేసేసి “నువ్వే తెచ్చుకో” అనేద్దాం అనుకున్నాడు కానీ, అదృష్టం బావుండి నితిన్ ఎప్పుడూ అడగలేదు.

“హే శేషు… నితిన్ నా fiance. నితిన్, శేషు అని ఇక్కడ నా best buddy. Super-sharp and cute ” అన్న స్మిత వైపు ఎప్పటిలాగే నవ్వుతూ చూసి బుర్రలో మాత్రం “fiance” అన్న పదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆలోచనలో పడ్డాడు. “నితిన్ నా లవర్” అని అంటుందేమో అని చాలా కంగారు పడ్డాడు. Fiance అంది కాబట్టి పర్లేదు. Fiance అంటే ఏంటి ఇంతకీ?

“Fiance అంటే కాబోయే భర్త రా”

“అంత సీన్ లేదు”

“కావాలంటే డిక్షనరీ చూద్దాం. పందెం ఎంత? అయినా అదెక్కడొచ్చింది నీకు?”

“ఏదో సినిమాలో విన్నాను”

అయినా ప్రేమించడం తప్పు కదా. స్మిత మేడం మంచిది కదా, ఆవిడ కూడా ప్రేమించడం ఏంటి? ఎప్పుడు చూసినా బాగా చదువుకోవాలని నాకు చెప్పి ఆవిడ మాత్రం ప్రేమించుకుంటదా? అంటే వాళ్లు ఇద్దరూ సినిమాల్లోలాగే కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటారా? బాబోయ్. స్మిత మేడం మంచిది కాదు.

ఊరెళ్లిపోయే ముందురోజు స్మిత శేషు ఇంటికి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి అమ్మమ్మ “నీళ్లు కాగిపోయాయి, తానం సేసెయ్ సేశా” అని ఎదవ గొంతుకేసుకొని అరుస్తుంది. నాన్నేమో వాకిట్లోనే మేడంకి కుర్చీ వేసాడు. వాకిట్లో ఉన్న నూతి దగ్గరే మనోడు రోజూ స్నానం చేసేది.

“నేను ఇవాళ బాత్రూమ్లో సేత్తాను” అని గింజుకున్నాడు.

“అందులో మీ అప్ప దూరింది. తలకేసుకుంటుంది, ఇప్పుడే రాదు. నోర్మూసుకొని ఇక్కడ సెయ్యి” అని ముసల్ది రెచ్చిపోతుంది.

కానీ మేడం ముందు ఎలా చేసేది? అమ్మ నాన్నతో అటుతిరిగి మాట్లాడుతున్నా, శేషు గురించి వచ్చినప్పుడల్లా ఇటు తిరిగి చూస్తుంది మేడం. ఇంకాసేపు లేట్ చేస్తే అమ్మమ్మ కొబ్బరి కమ్మ తీసుకుంటుందని తెలిసి టవల్ కట్టుకొని నీళ్లు దిమ్మరించుకున్నాడు.

“ఓయ్… తువ్వాలు తడిపేసావ్, ఏమెట్టి తుడుసుకుంటా? ” అన్న ముసలిదాని అరుపులకి మేడం నవ్వింది. సత్తు చెంబు తో ముసలిదాని నెత్తిమీద ఒక్కటి ఇవ్వలన్నంత కోపం వచ్చింది శేషుకి.

ఒళ్ళు తుడుచుకొని బట్టలేసుకొచ్చాడు. వెళ్ళిపోడానికి సిద్ధమై దడి వరకూ వెళ్లిన స్మిత తయారై వచ్చిన శేషుని చూసి హ్యాండ్బ్యాగ్ లోంచి ఒక కొత్త వాచ్ తీసి ఇచ్చి, “థాంక్స్ శేషు. నీతో అసలు టైమే తెలీలేదు. బాగా చదువుకోవాలి, ఓకేనా? సెవెంత్ కూడా నువ్వే క్లాస్ ఫస్ట్ రావాలి. చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు. ” అంది. తనను చిన్నపిల్లాడిలా చూడటం శేషుకి అసలు నచ్చలేదు. తాను పెద్దవాడు కానందుకు, పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్లయినందుకూ శేషుకి మహా కోపం ముంచుకొచ్చింది. మారు మాట్లాడకుండా ఉండిపోయిన శేషుని అమ్మ మొట్టి “థాంక్స్ సెప్పరా ఎదవా” అని తిట్టింది.

మేడం లక్ష్మిగారి ఇంటిదాకా వెళ్లి సందు తిరిగేవరకూ దడి దగ్గరే నుంచొని, సందు తిరిగే ముందు చెయ్యి ఊపి లోపలి వచ్చేసారు అమ్మ, నాన్న. శేషు అంతకు ముందే లోపలికి వెళ్ళిపోయి నిద్ర నటిస్తున్నాడు. స్మితను బస్సెక్కించడానికి రేపు నాన్న వెళ్తాడు. శేషుకి కూడా వెళ్లాలనుంది కానీ వెళ్తే మేడం మీద కోపం ఉన్నట్టు ఆవిడకేలా తెలుస్తుంది? మేడం వెళ్ళిపోయాక వాళ్లు తిరిగిన ప్లేసులన్నీ తిరిగాడు. మేడం మళ్ళీ బస్సు దిగి వస్తుందేమో చూడ్డానికి బస్సు స్టాండ్ రోడ్ మీదకి కూడా వెళ్లి చూసాడు.

మేడం హైదరాబాదులో ఉంటాది. అది చాలా పెద్దదంట. అక్కడోళ్ళందరూ భలే తెల్లగా ఉన్నారు. అందంగా ఉన్నారు. మొన్న ఫిదాలో వరుణ్ తేజ్ ఎస్కున్న షర్ట్ ఏస్కున్నాడు నితిన్ సార్. వాళ్ళలా ఉంటే భలే ఉంటది.

శేషు పొలం గట్టు మీద కూర్చొని తన చేతులు చూసుకున్నాడు. నల్లగా నిగ నిగా మెరుస్తున్నాయి. అసహ్యం వేసి చెమట షర్టుకి తుడుచుకున్నాడు. అది నల్లటి మరకయ్యింది. సెకండ్ బెంచీ లాస్య కి love letter ఇస్తే ఆ అమ్మాయి ప్రిన్సిపాల్ సార్ కి చెప్పి స్కేలుతో కొట్టించిన విషయం అప్పుడే ఎందుకో గుర్తొచ్చింది. ఏడుపొచ్చింది. స్మిత మేడం వాళ్లు ఎక్కడో హైదరాబాదులో పెద్ద పెద్ద మేడల్లోకి వెళ్తున్నట్టు ఊహించుకున్నాడు. ఆ పగటికలలో స్మిత మేడం, వాళ్ళ ఫ్రెండ్సూ, నితినూ వీళ్ళందరూ సినిమాల్లో చూపించే పార్కులో లాప్టాపులతో, కెమెరాలతో ఆడుకుంటున్నారు. తను మాత్రం ఇక్కడే. దూరంగా దూడ అరిచిన శబ్దం. కృష్ణబాబు గారి గేదె దూడ మళ్లీ తాడు తెంపేసుకున్నట్టుంది. మెల్లిగా పగటికల, పొలంగట్టూ ఏకమైపోయాయి. స్మిత మేడం వాళ్ళ పార్కు ఇంకా వెలిగిపోతూ పెద్దదైపోతుంటే శేషు చుట్టూ ఉన్న పొలం, గేదెలు, తాడి చెట్లూ, బడ్డీ కొట్లు, కాలువగట్టు, ఆ మట్టి రోడ్డు, గాంధీ బొమ్మ, ఆ మురికి బస్టాండ్ రోడ్డు, అన్ని ముడుచుకుపోయి కమ్ముకొని మీదకొస్తూ నాలుగు దిక్కులూ మూసుకుపోతున్నట్టు అయిపోయి ఊపిరాడలేదు.

పైన ఉరుములు మొదలయ్యాయి. గాలికి తుక్కు రేగి కంట్లో పడుతుంది. మెల్లగా మబ్బుల తాలూకు చీకటి కమ్ముకొచ్చి భయమేసింది శేషుకి. అమ్మ గుర్తొచ్చి పరుగు లంకించుకున్నాడు. ఇల్లు చేరేసరికి వర్షం పెరిగిపోయింది. ప్లేటులో మినపరొట్టె, మాగాయి పచ్చడి పెట్టి ఇచ్చి “తినేసి కొట్టుకెళ్ళి కోడి గుడ్లు పట్రా” అంది అమ్మ.

“సైకిలేది? ”

“అక్క ప్రవేటుకి ఎస్కెళ్లింది. అయినా నాలుగిళ్ళ అవతలున్న కొట్టుకి సైకిలేందుకు? నడిసెల్లు”

టీవీలో ఖుషి సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ భూమికని వాళ్ళ హాస్టల్కి కార్లో తీసుకెళ్లి దిగబెడుతున్నాడు.

“అమ్మ, ఆళ్ళకి భలే కార్లున్నాయి కదా.” అన్నాడు ఉండబట్టలేక

“బాగా సదుంకుంటే నువ్వు కూడా కొనుక్కోవచ్చు కారు.” అంది అమ్మ.

“ఊ… మీ బాబుని కారెక్కించుకుని తాపీ పనికాడ దింపిదీగాని” అని వెటకరించింది అమ్మమ్మ.

“యేయి… ఈడు ఉజ్జోగం సెత్తే తాపీ పనికెళ్ళే గతేంటి మాకు” అని తిరగేసింది అమ్మ. శేషు మాత్రం పవన్ కళ్యాణ్ లాగ బ్లాక్ షర్ట్ వేసుకొని అలాంటి కారులో స్మిత మేడం ఇంటికెళ్లినట్టు ఊహించుకుంటున్నాడు.

వర్షం ఆగి ఇంకా చిన్న తుపరు పడుతుంది. నల్ల గొడుగు బరువు మోసీ మోయలేక నడుస్తూ ముసలోడి కొట్టు దాటేసి వేణు గోపాల్ ఇంటికెళ్ళాడు శేషు.

“రేయ్ వేణు, సైకిలోసారి ఇవ్వరా.” అని బైటనుండే అరిచాడు.

లోపలినుంచి వచ్చిన వేణు గాడు “ఎక్కడికి? మా డాడీ సైకిల్ దూరం తీసుకెళ్ళొద్దన్నాడు” అన్నాడు.

“దూరం కాదు. ఇక్కడే వెచ్చావారి అగ్రహారం ఎల్లాలి” అని నవ్వాడు.

 

*

స్వరూప్ తోటాడ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెల్ల కాగితంపైన గీసిన ప్రతీ గీత
    చెరగని చిత్రమే

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు