సైనికుడి అస్తిత్వ కథనం

యుద్ధంలో నయినా గానీ, ఆ యుద్ధం సకారణ మయినా అకారణ మయినా గానీ, అది ఏ రంగుని పూసుకున్నా లేదా దానికి ఏ రంగుని పులిమినా గానీ, దానికి వెలలేని మూల్యాన్ని చెల్లించేది మాత్రం ఆయుధాన్ని పట్టుకుని ప్రత్యర్ధితో పోరాడేవాళ్ళు. వాళ్లకి, తమ కప్పగించిన విధులని సక్రమంగా నిర్వర్తించడం తప్ప వేరే మార్గం ఉండదు. ఆ సైనికులని విమానాల్లో ఎక్కించి వేరే దేశంలో పోరాడమని నాయకవర్గం ఆదేశించినప్పుడు కూడా అదే పరిస్థితి. కనీసం దేశసరిహద్దుల్లో జరిగే పోరాటాల్లో శత్రువు గూర్చిన స్పష్టమయిన అవగాహన, తమ దేశాన్ని పరిరక్షించు కుంటున్నా మన్న భావనా వాళ్లకి సహజంగానే కలుగుతాయి గనుక వేరే ఎవరూ ఆ విషయాన్ని ప్రబోధించ నక్కర లేదు. స్వదేశానికి దూరంగా, దేశం కాని దేశంలో శాంతి పరిరక్షణకు నెలకొల్పబడిన భద్రతా దళాల్లో పరిస్థితి వేరేగా ఉంటుంది. వాళ్లకి ప్రజల మధ్యలో దాక్కుని యుద్ధం చేస్తున్న శత్రువుతోనే గాక ఆ శత్రువుకి సానుభూతిపరులుగా ఉండే సామాన్య ప్రజల నించీ గూడా ప్రమాదం సంభవించే అవకాశం మెండుగా ఉంటుంది. అలా పోరాడే సైనికుల అస్తిత్వపు కథనాలు చాలా అరుదుగా కళ్ళబడుతుంటాయి. అలాంటి అరుదయిన కథ “ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్.” ఇరాక్ దేశంలోని ఫలూజాలో పహారా కాస్తున్న అమెరికన్ సైనికుల కథ. ఒక సైనికుడి గొంతులో, “రీడిప్లాయ్‌మెంట్” అన్న కథా సంకలనం నించీ.

2003లో ఇరాక్ దేశం మీద జరిగిన దాడి జరిగి సదాం హుస్సేన్ పదవీచ్యుతుడు అయిన తరువాత అమెరికన్ సైనికులు వంతులవారీగా మిలిటరీ పోలీసులుగా (MPలుగా) ఆ దేశానికి పంపబడుతూనే వున్నారు. ఆ దేశపు పౌరులు లేదా చుట్టుపక్కల దేశాలనించీ వచ్చిన కొందరు దొంగ చాటుగా దీన్ని ప్రతిఘటిస్తూనే ఉన్నారు. 2003 నించీ ఈనాటి దాకా ఇలా జరుగుతున్నదంటే ఇరాక్ లో ఒక జనరేషన్ పిల్లలు ఈ పరిస్థితిలో పెరిగినట్లు. వాళ్లకి, తాము పుట్టినప్పటి లేదా బుడిబుడి నడకలు వేసే వయసులో ఉన్నప్పటి దేశ, కాల పరిస్థితులు ఏమీ తెలియవు. కనిపిస్తున్నదల్లా అమెరికన్ సైనికులు, వాళ్లంత ప్రఛ్ఛందంగా స్వేఛ్ఛగా కాక నీడల్లో తిరుగుతూ చీకట్లో మసలుతూ  వాళ్ల తల్లిదండ్రుల వంటి సామాన్య ప్రజల మధ్యలో దాక్కుని అమెరికన్ సైనికులకి ఎదురుదెబ్బలకి కారణభూతు లవుతున్న కొందరు. అమెరికన్ మిలిటరీ పోలీస్ వెళ్లే దారుల్లో లాండ్ మైన్స్ పెట్టడమూ, సామాన్య ప్రజానీకానికి మిలిటరీ తుపాకులని అందించడమూ ఆ ప్రతిఘటనలో భాగాలు. ఇదీ ఈనాటి అక్కడి పరిస్థితి, పరిచయం చేస్తున్న ఈ కథకు నేపథ్యం.

లాన్స్ కార్పోరల్ సుబ, కార్పోరల్ గర్జ, టిమ్‌హెడ్ – ఈ ముగ్గురూ గర్జ కమాండ్ లో MRAP (మైన్ రెసిస్టెంట్ ఆమ్బుష్ ప్రొటెక్టివ్ వెహికిల్) లో వెడుతుండగా ఆ వాహనం ఒక లాండ్ మైన్ మీదుగా వెళ్ళడం దగ్గర మొదలవుతుంది కథ. లాన్స్ కార్పోరల్ సుబ ఉత్తమ పురుష కథనం. ఆ వాహనం పదిహేను టన్నుల స్టీల్ తో చెయ్యబడడం వల్ల అది ఆ మైన్ ప్రభావానికి తట్టుకుని నిలబడి ఆ ముగ్గురినీ సజీవులుగానే మిగిల్చింది. వాళ్లు ఆ వాహనంలో నించీ బయటకు రాగానే ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల కలిగిన పొగా రేగిన ధూళీ చుట్టుముట్టి ఉండడం వల్ల అంతగా దృష్టి ముందు ఆనదు గానీ అది కొంత సర్దుకోగానే వాళ్ల చుట్టుపక్కల ఇళ్లల్లోనించీ కొన్ని ఇరాకీ మొహాలు తమని చూస్తున్నట్లు వాళ్లకి కనిపిస్తుంది. అంత పెద్ద బాంబుని అక్కడ పాతడం ఆ పౌరులకి తెలిసేవుంటుందని లాన్స్ కార్పోరల్ సుబకి నమ్మకం. MRAP లో నించీ దిగిన ముగ్గురూ పరిస్థితిని ఆకళింపు చేసుకుంటుండగా వాళ్ల మీదకు జరుపుతున్న తుపాకీ పేలుళ్ల శబ్దాలు వాళ్ల చెవిని సోకుతాయి. సుబ ఆ MRAP వెనక్కు వెళ్లి దాక్కుంటాడు. ఆత్మసంరక్షణార్థం టిమ్‌హెడ్ తిరిగి జరిపిన కాల్పుల్లో చనిపోయింది ఒక పదమూడు, పద్నాలుగేళ్ల వయసు కుర్రాడు. అతను కాల్చిన AK47తో అతనికి ఏమాత్రం సాధన లేదు. సుమారుగా గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడంతే. అందువల్ల అమెరికన్ MPలలో ఎవరికీ దెబ్బలు తగలలేదు గానీ రైఫిల్ కాల్చడానికి శిక్షణ పొందిన టిమ్‌హెడ్ కాల్పులకి ఆ కుర్రాడు మాత్రం నేలకొరిగాడు – అతనికి కేవలం కొన్ని గజాల వెనుకగానే ఉన్న అతని తల్లి చూస్తుండగానే!

గర్జతో, ఆ కాల్చింది తను కాదంటాడు టిమ్‌హెడ్. అందువల్ల సుబ కాల్చడంవల్లనే ఆ పిల్లాడు చనిపోయాడని గర్జ అనుకుంటాడు. ఆ వార్తా అలాగే అందరికీ చేరుతుంది. తరువాత ఎవరో అడిగినప్పుడల్లా సుబ ఆ పిల్లాణ్ణి తనే కాల్చినట్లుగా చెప్పడమే కాక మెల్లిగా అది తన కథే నన్న భావనని పొందుతూంటాడు. టిమ్‌హెడ్ ముభావంగా ఉంటాడు.

తరువాత ఇంకొక MRAP బ్లాస్ట్ కు గురవుతుంది. మెక్‌క్లేలాండ్ దానిలో మరణిస్తాడు. “బిగ్ మెన్” అని నిక్‌నేమ్ ఉన్నతను ముఖంమీద దెబ్బలు తగులగా కంటి చూపు దెబ్బతిని ముందుగా TQ (టెంపరరీ క్వార్టర్స్) లోకి మారి తరువాత స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాడు.  జోబ్రానీకి దెబ్బ తగులుతుంది. వేరే అటాక్ లో బులెట్ హార్వీ మెడను రాసుకుంటూ పోతుంది. ఈ దెబ్బలూ, బయటికి పెట్రోల్ డ్యూటీ మీద వెళ్ళినప్పుడు విపరీతమయిన టెన్షన్ అనుభవించడం ఈ మిలిటరీ పోలీసులకి నిత్యకృత్యం. ఈ క్రింది పేరా వాళ్ల మానసిక స్థితికి అడ్డం పడుతుంది.

Somebody said combat is 99 percent sheer boredom and 1 percent pure terror. They weren’t an MP in Iraq. On the roads I was scared all the time. Maybe not pure terror. That’s for when the IED actually goes off. But a kind of low-grade terror that mixes with the boredom. So it’s 50 percent boredom and 49 percent normal terror, which is a general feeling that you might die at any second and that everybody in this country wants to kill you. Then, of course, there’s the 1 percent pure terror, when your heart rate skyrockets and your vision closes in and your hands are white and your body is humming. You can’t think. You’re just an animal, doing what you’ve been trained to do. And then you go back to normal terror, and you go back to being a human, and you go back to thinking.

(IED: ఇంప్రొవైజ్‌డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్)

మొదట సుబతో కూడా మౌనంగా ఉండడం, తరువాత టిమ్‌హెడ్ సుబతో జరిపిన సంభాషణ తరువాత మానసిక పరిస్థితి గూర్చి  PTSD (పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ డిజార్డర్)ని సూచిస్తున్నదని, అందరూ అనుకున్నట్లు ఆ బాధ తను భరిస్తున్నట్లుగా స్టాఫ్ సార్జెంట్ తో సుబ మాట్లాడతాడు. కానీ, కాంబాట్ స్ట్రెస్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి మాత్రం ఒప్పుకోడు.  చాప్లెయిన్ దగ్గరకు వెళ్లమన్న సూచనని కూడా సుబ తిరస్కరిస్తాడు కానీ, ఇంకొక IED ఎక్స్‌ప్లోషన్ తరువాత అతనే వెదుక్కుంటూ సుబ వద్దకు వస్తాడు. తను రెలిజియస్ కాదనీ, రోజూ ప్రార్థనలు చేసిన మెక్లేలాండ్ పోయాడన్న సుబతో, “ప్రార్థన అనేది దేవునితో మనిషికి ఉన్న సంబంధం గూర్చి, బతికి ఉన్నప్పుడు ఆత్మకి సహాయకారిగా మాత్రమే గానీ దానివల్ల రక్షింపబడతా రని కా” దంటాడు ఆ చాప్లెయిన్.

ఆ పిల్లాణ్ణి చంపిన దానికన్నా ఎక్కువ బాధని టిమ్‌హెడ్ అనుభవిస్తున్నది ఆ పిల్లాడి వెనక నిలబడి అతని చావుని ప్రత్యక్షంగా చూసిన ఎనిమిది-తొమ్మిదేళ్ల వయసున్న – టిమ్‌హెడ్ చెల్లెలి వయసే – పిల్ల అన్న సంగతి సుబకు తెలుస్తుంది. టిమ్‌హెడ్ కూడా ఇంకా టీనేజరే! ఆ పిల్ల మనసులో అది జీవితంలో ఎప్పుడూ చెరపలేని ముద్ర వేసిందని అతని బాధ. సుబ ఈ విషయాన్ని కూడా స్టాఫ్ సార్జెంట్ కు చేరవేస్తాడు. స్టాఫ్ సార్జెంట్ వయసులో కొద్దిగా పెద్దవాడే అయ్యుండాలి – “అది ఆ పిల్ల తన జీవితంలో చూసిన మొదటి ఘోరం అనుకుంటున్నావా? ఆల్-కైదా శవాలని రోడ్లమీద వదిలేసి పోయేవాళ్లు. పొగ తాగినందుకు వేళ్ళని కోసేసేవాళ్ళు. జిల్లా కొకటి చొప్పున హింసపెట్టడానికి ప్రత్యేకమయిన ఇళ్లుండేవి. నేను పెరిగిన నూవార్క్ కన్నా కూడా ఈ ఫలూజా చాలా ఘోరమయినది,” అని జవాబివ్వడానికి. “ఈ ఊళ్ళో ప్రతిరోజూ యుద్ధాలు జరుగుతున్నాయి. బాంబులు పేలుతూనే వున్నాయి. అది ఆ పిల్ల ఉంటున్న ఇల్లు. ఇప్పటిదాకా ఇలాంటి వెన్నో చూసేవుంటుంది. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదన్న సంగతి నీ కేమాత్రం తెలియదు. అంతకన్నా ముఖ్యమయిన విషయం, ఆ పిల్ల నీ చెల్లెలు కాదు!” అని చేరుస్తాడు కూడా. ఇక్కడ, విమానంలో ప్రయాణం చేసినవాళ్లకి “ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ డ్రాప్, ఆక్సిజెన్ మాస్కులు మీ ముందు డ్రాప్ అయినప్పుడు ముందుగా మీరు పెట్టుకుని తరువాత మీ పిల్లలకి పెట్టండి,” అన్న సూచన గుర్తొచ్చే ఉండాలి.

ఒక వారం తరువాత ఒక స్నైపర్ కాల్పులో బులెట్ హార్వీ మెడని రాసుకుంటూ పోతుంది.

“సైనికులు సామాన్య పౌరుల మరణాలకి కారకులయారు, వాళ్లని శిక్షించాలి!” అన్న వాదాలు వియత్నాం యుద్ధంలోనే గాక ఇప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటాయి, వినిపిస్తూనే ఉంటాయి. ఆ సైనికుల స్థానంలో లేకుండా, వాళ్ల మనఃస్థితితో సంబంధం లేకుండా, వాళ్లు అక్కడకు పంపబడడానికి కారకులయినవాళ్ళమీద గాక పావుల్లా కదపబడుతున్న ఆ సైనికుల మీద విరుచుకుబడడం ఏమాత్రం సబబు కాదనిపిస్తుంది ఈ కథ చదివిన తరువాత. ఈ అస్తిత్వ కథనాన్ని అందించిన సైనికుడు ఫిల్ క్లే కి మన మందరం ధన్యవాదాలని తెలుపుకోవాలి.

రచయిత పరిచయం:

Phil Klay, a U.S. Marine Corps veteran, ఇరాక్ లోని అన్బార్ ప్రావిన్స్ లో జనవరి 2007 నించీ ఫిబ్రవరి  2008 దాకా పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ గా పనిచేశారు. “రీడిప్లాయ్‌మెంట్” అన్న కథా సంకలనాన్ని వెలువరించారు. పత్రికలలో చాలా వ్యాసాలని ప్రచురించారు. వీరి “మిషనరీస్” అన్న నవల అక్టోబర్ 2020 లో వెలువడనున్నది.

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు