సేవలో కొనసాగుతూ…

1991లో ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్) పరిసమాప్తమైంది. దాంతో బెర్లిన్ గోడ కూలిపోయింది, తర్వాత సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యింది. అప్పటికి ఏడు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న ఒక సంప్రదాయిక రాజకీయ, సైద్ధాంతిక ప్రత్యామ్నాయ శక్తి తన ప్రాసంగికతను కోల్పోయినట్టయింది. దీన్ని అనుసరించి మేధోపరమైన చర్చల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

నా తరం మనుషులంతా – శ్రామిక వర్గానికి స్వర్గం అనదగిన పాలననందించే ఒక ఆచరణయోగ్యమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఉందన్న నమ్మకంతో పెరిగి పెద్దయినవాళ్లం. అది ముక్కలైపోవడం మాకు ఊహించని శరాఘాతం. అప్పటిదాకా అన్నిటా అగ్రరాజ్యం అనిపించుకున్నది కాస్తా ఒక్కసారిగా ఏమీ అర్థం లేని భావనగానూ, మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాల్లాగా ఆర్థికంగా దుర్బలమైనదిగానూ కనిపించింది. ఒక బలమైన రాజ్యం పగిలిపోయి, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పదిహేను చిన్న దేశాలు పురుడుపోసుకున్నాయి. అవి పాత తరహా పాలనకు చరమగీతం పాడేశాయి కాని కొత్త పాలన ఎలా ఉండాలో తెలియక సతమతమయ్యాయి.

దీనికి ముందు 1970ల చివర్లో వచ్చిన ఆర్థిక సంక్షోభం, స్తబ్దత వల్ల ఒక నూతన రాజకీయ తత్వానికి  అంకురార్పణ జరిగింది. అదేమిటంటే ‘ప్రభుత్వం’ అనేది ఒక పరిష్కారం కాదు, నిజానికి అదే ఒక సమస్య అని. ఇంగ్లాండులో అధికారంలోకి వచ్చిన థాచర్, అమెరికాలో అధికారంలోకి వచ్చిన రీగన్ ప్రభుత్వాలు – రాజ్యం, ప్రభుత్వాల ఆర్థిక, రాజకీయ సరిహద్దులను పునర్నిర్మించే దిశగా ప్రయత్నాలు చేశాయి.

అప్పుడే పారిశ్రామిక దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యాయి. అప్పులు చేసి మరీ  సంక్షేమ కార్యక్రమాలకు నిధులు వెచ్చించడం వల్ల తర్వాత తరాలపై భారం పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వ్యయాల్లో ‘సబ్సిడీ’ అనేది ఒక అంతులేని బలహీనతగా తయారయ్యి, దేశ బడ్జెట్లను హరించెయ్యడం ప్రారంభించింది.  సంక్షేమ పథకాలు, పింఛను పథకాల్లో సంస్కరణలు అమలుచెయ్యడం రాజకీయంగా క్లిష్టమైన నేపథ్యంలో, పాతవిధానాలకు స్వస్తి పలకడం తప్పనిసరి అవసరంగా మారింది.

అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు కాస్త భిన్నమైనవి. అయినా అవి తీవ్రంగా ఉండేవి.  ఏ విధంగానూ స్థిరత్వం లేని, స్వాభావికంగా దుర్బలమైన ప్రాథమిక వనరుల మీద అతిగా ఆధారపడటం ఈ సమస్యకు మూలకారణం. దీని ఫలితంగా ప్రభుత్వ ఆదాయాలు చాలా అస్థిరత్వానికి గురయ్యాయి. ఇదిలా ఉంటే, రాజకీయ సంక్షోభాల నుంచి తప్పించుకోవడానికి క్రమానుగతంగా సవరించిన రక్షణ వ్యయం, జీతభత్యాల వలన ప్రభుత్వ వ్యయాలు (పబ్లిక్ ఎక్స్ పెండిచర్) స్థిరంగా పెరగసాగాయి.

వీటన్నిటికితోడు ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక వైఫల్యాలు బడ్జెట్లపైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తక్కువ ఆదాయం, ఖర్చులు ఎక్కువ కావడం అనేది  లోటు బడ్జెట్లకు దారి తీసింది. అది కొన్నిచోట్ల ద్రవ్యోల్బణానికి, మరికొన్నిచోట్ల విదేశీ ఋణాలు ఎక్కువైపోవడానికి కారణమయ్యింది. ఋణాలు పెరిగినప్పుడు వడ్డీ పెరుగుతుంది. దాంతో అందరిలోనూ భయం నెలకొంది. వడ్డీరేటు కొంచెం పెరిగినా, వ్యాపార, ప్రభుత్వ వర్గాలు భయపడటం మొదలెట్టాయి. చిన్న కుదుపు అయినా పెను ప్రకంపనలకు దారి తీసేలా మారిపోయింది పరిస్థితి. ఈ నేపథ్యంలో అభివృద్ధి అనేది అంతటా నిలిచిపోయింది.

చమురు ఉత్పత్తి చేసే దేశాలు కూడా ఈ తరహా సమస్యల నుంచి తప్పించుకోలేకపోయాయి. కువైట్ సౌదీ అరేబియా వంటి చాలా దేశాల ఆదాయవ్యయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు సంభవించాయి. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు మీద వచ్చే రాయల్టీలు ప్రాముఖ్యతను కోల్పోయి, పెట్టుబడుల వలన వచ్చే ఆదాయం ముఖ్యమైనదిగా మారింది. ఖర్చులు చూస్తే – మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి మార్గాలు క్షీణించిపోయి, నిర్వహణ వ్యయాలు పెరిగాయి. అలాగే రాజకీయ సమీకరణాలు మారిపోవడం వల్ల రక్షణ రంగానికి అధికశాతం ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

మొత్తమ్మీద ప్రపంచమంతటా ఏదోక వైఫల్యం ఉన్న సమయం అది. ఆర్థికవ్యవస్థల ఒడుదొడుకుల వల్ల అందరిలోనూ భయం, విషాదం ఉండేవి.  ఆ సమయంలో ప్రజలు కూడా సమస్య పరిష్కారానికి ఎంత చేదుమందైనా మింగడానికి సిద్ధపడ్డారు.

ఆర్థిక విధానాల్లో చేసిన మార్పులు సత్వర ఫలితాలనివ్వడం లేదని పారిశ్రామిక దేశాలన్నీ గుర్తించాయి. కాని పాత శకం ధోరణులకు గట్టిగా స్వస్తిచెప్పేసే మార్గాన్ని పట్టాయి. ఆ క్రమంలో ప్రభుత్వ విధానాల్లో మార్పులకు, సంక్షేమ పథకాల్లో కోతలకు, ప్రజాధనం వ్యయం చేసే విధానాల్లో మార్పులకు ప్రజలు అంగీకరించడం మొదలెట్టారు. అయినా ఆ దారి ముళ్లదారే.

అమెరికాలో రీగన్ ప్రభుత్వం పన్లురేట్లను తగ్గించడానికి, అనేక నిర్బంధ ఆర్థిక నిబంధనలను సడలించడానికి కంకణం కట్టుకుంది. వ్యయం పెరుగుతున్నప్పుడు పన్నురేట్లు తగ్గించడం వల్ల ఆర్థికలోటు పెరిగిపోయింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని యుక్తులు పన్నవలసి వచ్చింది! అందులో మొదటిది – ఆర్థికాభివృద్ధి అంతా బాగున్నట్టుగా ఒక మిథ్యాచిత్రం చూపించి తద్వారా ఆదాయాన్ని ఆశించడం. ఆ రోజుల్లో ‘లాఫర్ కర్వ్’ సిద్ధాంతాన్ని అనుసరించి, పన్నులు తగ్గిస్తే ఆదాయం పెరుగుతుందనుకున్నారు.

పన్నెండేళ్ల రిపబ్లికన్ల పాలన బడ్జెట్ పదకోశానికి మూడు కొత్త పదాలను చేర్చింది. అవి రోజీ సినారియో (అంతా బాగున్నట్టు చూపించడం) మేజిక్ ఏస్టరిస్క్ (మాయా తారక –  త్వరలో ఖర్చులు తగ్గిస్తామని చెప్పడం) రీడ్ మై లిప్స్ (పన్నులు పెంచుతామని చెప్పకనే చెప్పడం).  ఈ రకమైన కొత్త ఆర్థిక, రాజకీయ వాదం చెల్లింపుల్లో ఒక తీవ్రమైన లోటును వారసత్వంగా మిగిల్చింది. తద్వారా అమెరికా చరిత్రలో మొదటిసారి అప్పులపాలయ్యింది. విదేశీ పెట్టుబడుల్లో అధికశాతం యూఎస్ ట్రెజరీ బిల్ మార్కెట్ అనే స్వర్గధామానికి సురక్షితంగా చేరాయి. దీనిద్వారా అవసరమైనప్పుడు జపాన్ వంటి దేశాలు సర్దుతామని మాటిచ్చాయి.  ఆవిధంగా 1980ల మధ్యలో ఎక్స్ ఛేంజ్ రేటులో సర్దుబాట్లు అవసరమైనప్పుడు యు.ఎన్.ప్లాజా చర్చలు జరిగి జపాన్ సహా చాలా దేశాల మధ్య ఉమ్మడి సర్దుబాట్లు జరిగాయి. ఆ సందర్భంలోనే జపాన్ అమెరికాకు చేసే వాహన భాగాల ఎగుమతులపై నియంత్రణకు స్వచ్ఛందంగా సిద్ధపడింది.  ద్రవ్యలోటు పెరగడం వల్ల – అధిక రేట్లు డిమాండ్ చేసే మార్కెట్లకు, ప్రతిస్పందించవలసిన ప్రభుత్వానికీ రెండింటికీ ఎదురుదెబ్బలు తగిలాయి.

అమెరికా పరిస్థితి ఇలా ఉండగా, 1980ల్లో లాటిన్ అమెరికన్ దేశాలు కూడా సమస్యల పాలయ్యాయి.

అంతకుముందు దశాబ్దాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల నియమాలు, విధానాలు అప్పటికే అభివృద్ధి చెందినవాటితో పోలిస్తే భిన్నంగా ఉంటాయని అనుకునేవారు. ద్రవ్యోల్బణం అనేది నిర్బంధ పొదుపు మొత్తాలను పారిశ్రామిక దేశాలకు పెట్టుబడులుగా మళ్లించడానికి ప్రేరేపిస్తుందని, పారిశ్రామికీకరణ వల్ల దిగుమతులు తగ్గుతాయి గనక ద్రవ్యోల్బణం అనేది ఏమంత చెడ్డది కాదని ఒక అభిప్రాయం. దీన్ని సాధించడానికి ఈ దేశాల్లో చేసిన ఋణాల వల్ల ఆ దేశాల ఆర్థికవ్యవస్థలు దెబ్బతిన్నాయి.

అదే సమయంలో ఆ దేశాల్లో రాజకీయ మార్పులు కూడా సంభవించాయి. అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాల్లో పాత మిలిటరీ ప్రభుత్వాల స్థానంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి ఆర్థిక అస్థిరతకు అడ్డుకట్ట వేస్తాయన్న ఆశ ఉండేది. కాని అది నెరవేరలేదు. లోటు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడింది,  నిజానికి చమురు నిల్వలు సమృద్ధిగా ఉండి,  వనరుల కొరత లేని మెక్సికో వంటి దేశాలు కూడా భారీగా అప్పులపాలైపోయాయి. సరైన మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఏర్పడిన  సమస్యల నుంచి బయటపడటానికి భారీ ఎత్తున సహాయ చర్యలు అవసరమయ్యాయి. ఐ.ఎమ్.ఎఫ్, ప్రపంచబ్యాంక్, ఇంటర్ అమెరికన్ డెవలప్ మెంట్ బ్యాంక్, అమెరికా ప్రభుత్వాలు కలిసి వీటిని చేపట్టాయి. వాటివల్ల సానుకూల మార్పులు వచ్చి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు గట్టెక్కాయి.

కాని ఆ సమయంలో ఆసియా దేశాల అనుభవాలు వేరేగా ఉన్నాయి. అక్కడ వార్షిక వృద్ధి రేటు ఎక్కువగా నమోదైంది. కొన్ని దేశాలు కొత్త దిగ్గజాలుగా ఆవిర్భవించాయి.

అయితే దక్షిణాసియా దేశాలతో పోలిస్తే  భారత ఉపఖండం పరిస్థితి భిన్నంగా ఉంది. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వ రంగ సంస్థల మీద ఏళ్ల తరబడి ఆధారపడటం అనేది ఎగుమతుల వృద్ధికి నిరోధంగా మారాయి. మరోవైపు విదేశీ పెట్టుబడుల మీద నియంత్రణ వల్ల అవి రాలేదు. తమకు అంత లాభదాయకం కాకపోవడంతో ప్రవాస భారతీయులు స్వదేశంలో పెట్టుబడులు పెట్టలేదు. ఈ రకమైన విధానాల వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్రమంగా తగ్గనారంభించాయి.

ఆఖరికి ఒకానొక సందర్భంలో భారతదేశం 200 మిలియన్ పౌండ్ల ఋణం కోసం రెండు టన్నుల బంగారాన్ని బ్రిటన్ కు తాకట్టు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది.  ఎయిరిండియా విమానంలో బంగారాన్ని తరలించే ఆ దృశ్యాన్ని దూరదర్శన్ లో చూసినప్పుడు దేశపౌరులు చాలామందికి బాధగా అనిపించింది.

తర్వాత హంగెరీ, పోలాండ్ వంటి దేశాలు క్రమంగా మార్కెట్ ఎకానమీ వైపు మొగ్గు చూపాయి. చైనా ఆ సమయానికి తిరుగులేని అభివృద్ధిని సాధించి, అతి పెద్ద ఎగుమతిదారుగానూ, అతిముఖ్య ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగానూ ఆవిర్భవించింది. తమ సంప్రదాయ ఆర్థిక నిర్వహణ సూత్రాలను పాటిస్తూనే, పాశ్చాత్య ఆర్థిక విధానాలకు కూడా తలుపులు తెరిచింది. ఆ నేపథ్యంలో నేను తొలిసారి బీజింగ్ వెళ్లాను.

ప్రపంచ బ్యాంకులోని ఎకనామిక్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్, సెంటర్ ఫర్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. కెనడాకు చెందిన రిచర్డ్ బర్డ్ అనే పెద్దమనిషి ఈ కార్యక్రమానికి కోర్డినేటర్. అతను పూర్వం ఫండ్ లో మాతో కలిసి పనిచేశాడు. అతను నేను తప్పక రావాలని పట్టుపట్టాడు. రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైనాన్సెస్ కు చైనాలోని సెంటర్ ఫర్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సమ ఉజ్జీ. అటువంటిది, సాంస్కృతిక విప్లవం సమయంలో మూతబడింది. ఆ ప్రాంగణంలో సిగరెట్ల కర్మాగారం నెలకొల్పబడింది! 1980ల మధ్యలో ఈ సెంటర్ కు పున: ప్రాణప్రతిష్ట చేశారు. అక్కడి సదుపాయాలు చాలా ప్రాథమిక దశలో ఉండేవి. కాని అందులో పాల్గొనడానికి వచ్చిన అభ్యర్థుల ఉత్సాహం, పట్టుదల చాలా గొప్పగా ఉండేవి. బీజింగ్ లో జూన్ నెల సూర్యప్రతాపాన్ని తట్టుకుంటూ సైకిళ్ల మీద రావడం మాటలు కాదు. అయినా ప్రతి సమావేశానికి అనుకున్న సమయం కన్నా ముందే హాజరుగా ఉండేవారు.

మేం ప్రపంచ బ్యాంకు కార్యాలయానికి దగ్గర్లో ఉన్న ఫ్రెండ్షిప్ హోటల్లో ఉండేవాళ్లం. హోటల్లోగాని, బయటగాని చాలా తక్కువమంది ఇంగ్లిష్ మాట్లాడేవారు. కమ్యూనిస్టు సిద్ధాంతాల అమల్లో భాగంగా ఆ హోటల్లో రూమ్ సర్వీస్ నిషిద్ధం. నావంటి శాకాహారులు ముస్లిములకని కేటాయించిన రెస్టారెంట్ల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఎందుకంటే వాళ్లు పందిమాంసం తినరుగనక. అసలు శాకాహారం దొరకడమే తక్కువ. నగరంలో ట్యాక్సీల సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ పిలిస్తే రెండువైపుల ఖర్చు మనమే ఇవ్వాల్సి వచ్చేది.

ఒక్క నాలుగు సంవత్సరాల కాలంలో  ఈ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. చాలా టాక్సీలు అందుబాటులోకి వచ్చాయి, ఇంగ్లిష్ మాట్లాడేవారు ఎక్కువయ్యారు. షాంగ్రీలా వంటి పెద్ద హోటళ్లు బోలెడు అందుబాటులోకి వచ్చాయి. ఆర్థికపరమైన అభివృద్ధే కాకుండా, సర్వతోముఖ అభివృద్ధి చోటు చేసుకుంది. అక్కడి ప్రజల వేషధారణ కూడా మారిపోయింది. మావో సూట్లకు కాలం చెల్లింది. ఆర్థికశాఖ అధికారులు మామూలు సూట్లలోనే కనిపించారు ఈసారి.

కాని దీనికి మాతృక అయిన రష్యన్ సమాఖ్యలో మాత్రం అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండేది. గోర్బచెవ్ చేసిన నూతన రాజకీయ ప్రయోగాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. పంటల్లేక ఆహార పదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఆఖరుకు సిగరెట్లు కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రక్షణ రంగ పరిశ్రమలు, తత్సంబంధ ఖర్చులు, సబ్జిడీలు దేశ బడ్జెట్ కు గుదిబండలుగా మారాయి.

ఈ సమయంలో ఐ.ఎమ్.ఎఫ్.లో సభ్యత్వం కోసం రష్యా ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి అది బ్రెటన్ వుడ్స్ సమావేశంలో పాల్గొన్నది కనుక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటి. అయినా తనంతతానుగా ఫండ్ నుంచి వైదొలగింది కనుక మళ్లీ సభ్యత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించాల్సి వచ్చింది. దానికోసం తన ప్రధాన నిర్ణయాల్లో  కొన్ని మార్పులకు, కొన్ని షరతులకు లోబడవలసి వచ్చింది. ఇదిలా ఉన్నా, రాజకీయంగా చూసినప్పుడు మొక్కుబడి తంతుగా ఉన్న ఎన్నికల స్థానే, అది నిజమైన ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసింది. ఇది ఘన విజయం. కాని పెరుగుతున్న ఆర్థిక కష్టాలు ఈ ఘన విజయాన్ని కారుమబ్బుల్లా కమ్మేశాయి.

మొత్తమ్మీద ఈ కాలం మార్పునీ, అపజయాన్నీ రెండింటినీ చవిచూసింది. కొందరు దాన్ని క్షీణ దశగా కూడా అంటారు. కాని విజయవంతంగా సంక్షేమ రాజ్యాలను ఏర్పరచి, అందరికీ సమాన, రాజకీయ, ఆస్తి హక్కుల భరోసా కల్పించడం అనేది ఈ కాలంలో సాధించిన గొప్ప విజయంగానే చెప్పుకోవాలి. కాని దాన్ని సాధించేందుకు బోలెడన్ని విలువలను కోల్పోవలసి వచ్చింది. ప్రభుత్వం , శాసన వ్యవస్థలు ఓటికుండలుగా మారాయి. ప్రభుత్వం సమాజానికి సేవ చేసేదిగా కాకుండా అణచివేసేదిగా పేరు తెచ్చుకుంది. అవినీతి పెరిగింది, దానివల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో అపనమ్మకం, రాజకీయాలంటే ఏవగింపు, ఓటర్లలో ఒకరకమైన ఉదాసీనత పెరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభాల వల్ల ప్రభుత్వాల సామర్థ్యం ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో మెరుగుదల కోసం చేసే ప్రయత్నాలు ఆర్థిక, ద్రవ్య విధానాల్లో మార్పులకు కారణమయ్యాయి.

*******

ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చేనంటే,  ఫండ్ లో నేను చేసే ఉద్యోగానికి నేపథ్యం ఇది. ఫండ్ పాలసీల రూపకల్పనకు స్టాఫ్ సహకరిస్తారు, వాటికి లోబడే అందరూ పనిచెయ్యవలసి వస్తుంది. ఆక్స్ ఫర్డ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వృత్తి  జీవితంలో నేను కొన్నాళ్లు డివిజన్ హెడ్ గా పనిచేశాను. ఆ విభాగాన్ని అనంతర కాలంలో ‘ పబ్లిక్ ఎక్స్ పెండిచర్ డివిజన్’గా పేరు మార్చారు. కొన్నాళ్లు ఫిస్కల్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ సభ్యుడిగా చేశాను. టెక్నికల్ అసిస్టెన్స్ అందించడానికి, పరిశోధనలకు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణలోనూ నేను నా కాలాన్ని, కృషినీ వెచ్చించాను.

ఫండ్ సభ్య దేశాల్లో పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ ప్రాముఖ్యతను తెలియజెయ్యడం, దానిలో సాధారణంగా తలెత్తే సమస్యలను గుర్తించడం, అవి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేమిటో తెలియజెయ్యడం – ఇవే మా లక్ష్యాలు.  వీటిని సాధించేందుకు ప్రపంచంలోని అనేక దేశాల్లో మిషన్స్ ను చేపట్టింది ఐ.ఎమ్.ఎఫ్.

ఫండ్ సభ్యత్వం ఉన్న దేశాల్లో చాలావాటిని  సందర్శించే అవకాశం ఫండ్ ఉద్యోగులందరికీ రాదు. అలాంటి అరుదైన అవకాశం తక్కువమందికే వస్తుంది. ఎందుకంటే ఫండ్ స్టాఫ్ కు సాధారణంగా ఒక రీజియన్ (ప్రాంతాన్ని) కేటాయిస్తారు. సాధారణంగా వారు వాటినే చూడగలరు. కాని నేను పని చేసేది ఫంక్షనల్ డిపార్టుమెంటులో గనక అటువంటి అరుదైన భాగ్యం నాకు లభించింది. నాకు ఒక్కటే ప్రధాన సమస్య – భాష. ఫ్రెంచ్ దేశాలకు వెళ్లినప్పుడు ఆ భాష తెలిసిన సహోద్యోగులుండేవారుగనక దాన్ని కూడా అధిగమించగలిగేవాడిని. వియత్నాం వంటి దేశాలు కూడా ఫ్రెంచి మాట్లాడేవి. 1980ల తర్వాత అవి కూడా ఇంగ్లిష్, రష్యన్ లోకి మారాయి. అందువల్ల నేను వెళ్లగలిగాను. ఎన్ని దేశాలకు నేను వెళ్లాను అని ఒక సంఖ్య చెప్పుకోవడం గర్వంగా, ఏదో ప్రదర్శనలాగా ఉంటుంది. అందువల్ల ఆ జాబితాను చెప్పుకోదలచలేదు. కొన్ని ముఖ్యమైన అనుభవాలను పంచుకోవాలనిపిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, ఆయా దేశాలు ఏదో పెద్ద సంక్షోభంలో ఉన్నప్పుడో, దాన్నుంచి బయటపడినప్పుడో నేను వాటిని సందర్శించడం జరిగింది. అందువల్ల ఆ సందర్భాలు చాలా ముఖ్యమైనవి.

ఉదాహరణకు బ్రెజిల్.

ఆ దేశం మిలిటరీ పాలన నుండి బయటపడి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ నేను అక్కడకు వెళ్లాను. అప్పటికి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ప్రమాణస్వీకారం చెయ్యకమునుపే మరణించారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి అధ్యక్షపీఠాన్ని అధిరోహించారు!

1991 యుద్ధం ముగిసిన రెండు నెలల్లోపు కువైట్ వెళ్లాను. చమురు క్షేత్రాలు ఇంకా కాలుతూనే ఉన్నాయి, ఆ దేశానికి వచ్చిన అతిథులు సగం కాలిపోయిన షెరటాన్ హోటల్లోనే ఉండాల్సి వచ్చేది. అలాగే తియానన్మెన్ స్క్వేర్ కాల్పులు జరిగిన నెలలోపే చైనా వెళ్లాను. అల్లర్ల తర్వాత అక్కడి ప్రభుత్వం స్వాగతించిన తొలి విదేశీ మిషన్ మాదేనేమో. ఒక సుదీర్ఘమైన, భయంకరమైన శీతకాలం తర్వాత మాస్కో వెళ్లాం. అప్పుడే ముక్కచెక్కలైన సోవియెట్ యూనియన్ వివిధ దేశాల కామన్వెల్త్ గా ఆవిర్భవించింది. చమురు ధరలు పెరిగి, రియాద్ నగరం ఇంకా అరేబియన్ నైట్స్ కథల్లో వర్ణించినట్లు ఉన్నప్పుడు సౌదీ అరేబియాకు వెళ్లాను. అత్యున్నత పర్వత శ్రేణులైన ఆండెప్స్, ఆల్ప్స్, హిమాలయాలను నా ప్రయాణాల్లో భాగంగా పలుమార్లు దాటవలసి వచ్చింది.  అమెరికా సాయుధ బలగాల పర్యవేక్షణలో 38 పారలల్ (ఉభయ కొరియాల సరిహద్దు)ను దాటాం.

ఇవి కొన్నే ఉదాహరణలు. ఎన్నో సందర్భాల్లో ఫండ్ సభ్యదేశాలకు సేవలందించే అవకాశం నాకు, ఫండుకూ కలిగింది. నేను నేర్చుకున్న జ్ఞానం ఆయా దేశాల పబ్లిక్ ఎక్స్పెండిచర్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ ను మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. నిజానికిది ఒక్క వాక్యంలో చెప్పేసేది కాదు. ఒక్కో మిషన్ లో భాగంగా ఒక్కో దేశంలో ఏం చేశామో చెబుతూ వెళితే అది సామాన్య పాఠకుడికి ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. కాని కొన్నికొన్ని సంఘటనలను చెబితే అది క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది.

* * * * * * *

టెక్నికల్ అసిస్టెన్స్ అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో 1964లోనే ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ కొన్ని విభాగాలను ఏర్పాటు చేసినప్పటికీ, మేనేజ్ మెంటు మొత్తం విధానం (ఓవరాల్ అప్రోచ్) ఏమిటన్నది మాత్రం కొంత సందిగ్థంలోనే ఉండేది. ప్రపంచ బ్యాంకులాగా కాకుండా, ఫండ్ లో ఎక్కువమంది ఆర్థికవేత్తలు ఉద్యోగులుగా ఉండేవారు. కొద్దిమంది ప్రొఫెషనల్ అకౌంటెంట్లు, న్యాయనిపుణులు ఉన్నప్పటికీ  1980ల్లో దాదాపు 90శాతానికి పైగా స్టాఫును ఆర్థికశాస్ట్రం నుంచే తీసుకున్నారు. ఈ విస్తృతమైన చిత్రంలో టెక్నికల్ అసిస్టెన్స్ అనే యాక్టివిటీ విభిన్నంగా నిలిచింది. ఈ రంగంలో పనిచేసేవారిని సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ అని పిలిచేవారు. ఈ భేదాలు 1980ల వరకూ నామమాత్రంగా ఉండేవి. కాని క్రమంగా టెక్నికల్ అసిస్టెన్స్ ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అప్పటివరకూ మామూలు విషయాలైన టాక్స్ అడ్మినిస్ట్రేషన్, ఎక్స్ పెండిచర్ మానేజ్ మెంట్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ రిఫార్మ్ వంటివి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వాటిని కన్సల్టేషన్, ప్రోగ్రామ్ రిపోర్ట్స్ లో భాగం చెయ్యవలసి వచ్చేది. వీటికి ఓ ప్రత్యేకమైన పంథా ఉంది, భాష ఉంది. మాక్రో ఎకానమిస్టుల పంథాకు భిన్నమైనది.

ఆకర్షణీయమైన అంశాలన్నీ మాక్రో ఎకనామిక్స్ కిందకు వస్తే, చిన్నచిన్నవి, మసీమరకా అయ్యేవీ అన్నీ సబ్జెక్ట్ ఎక్స్ పర్టుల చేతిలో ఉండేవి అని అందరూ అనుకునేవారు. టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఏదైనా దేశం అభ్యర్థిస్తే చేసే పని తప్ప, ఫండ్ విధుల్లో ఒకటి కాదు.

ఏరియా డిపార్ట్ మెంట్ నుంచి మిషన్ ఏర్పడుతుంది.   అది ఆయా దేశాల అధికారులకు టెక్నికల్ అసిస్టెన్స్ గురించి తెలియజేస్తుంది. అది ఎలా సాయపడుతుందో వివరిస్తుంది. అంతే. అంతమాత్రాన ఆ దేశాలు ఫండ్ నుంచి టెక్నికల్ అసిస్టెన్స్ తీసుకోవాలనేం లేదు. తమ అవసరాలను బట్టి  కొన్ని దేశాలు ఫండ్ తో కలిసి సహకార పద్ధతిలో సాయం తీసుకుంటాయి.

1980ల మొదట్లో ఈ చిత్రం మారిపోయింది. అప్పటికి, టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఫండ్ పరిభాషలో ప్రోగ్రామ్ సపోర్ట్ గా రూపాంతరం చెందింది. ఫండ్ వనరులను సద్వినియోగం చేస్తూ టెక్నికల్ అసిస్టెంట్లు పనిచెయ్యాలి. కాని ఆయా ఒప్పందాల్లో భాగంగా వారు ఇచ్చే టెక్నికల్ అడ్వైజ్ ఆ నిపుణుడి వ్యక్తిగతం, డిపార్ట్ మెంటు అభిప్రాయాలను ప్రతిఫలించేవి తప్ప, ఫండ్ అభిప్రాయాలను కాదు.

ప్రోగ్రామ్ విషయంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం కోసం పత్రాలను పెడతారు, అదే టెక్నికల్ అసిస్టెన్స్  నివేదికను మాత్రం ఆయా దేశాల అధికారులకే నేరుగా పంపుతారు, వాటి కాపీలను మాత్రం ఐ.ఎమ్.ఎఫ్.లోని ఆ దేశ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కు ఇస్తారు. వాటిలోని సమాచారం రహస్యమైనది గనక అందరికీ పంపిణీ చెయ్యరు.  ఆ రకంగా ఆయా దేశాలు తమ మీద ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటారు ఫండ్ స్టాఫ్.

అయితే ఎగ్జిక్యూటివ్ బోర్డు నేరుగా పర్యవేక్షించదుగనక టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఫండ్ కార్యక్రమాల్లో ఒక అంతర్గత భాగం కాకుండా ఒక సైడ్ షోలాగా మిగిలిపోయేది. దాంతో కొత్త పేరు ప్రోగ్రామ్ సపోర్ట్ గా మార్చవలసి వచ్చింది. అయినా కూడా మాక్రో ఎకానమిస్టులు, సబ్జెక్ట్ స్పెషలిస్టుల మధ్య అభిప్రాయభేదాలు బయటకు పొక్కాయి, పెద్దగా  మారాయి. 1980ల్లో మధ్యలో ఫండ్ తన అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఇదొక పెద్ద విషయమై కూర్చుంది.

అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ రీగన్ ఉన్న కాలంలో ఆయన ఆర్థికశాఖవారు ఐ.ఎమ్.ఎఫ్., ప్రపంచ బ్యాంకులు ఇచ్చే వేతనాల మీద ఓ కన్నేసి ఉంచేవారు. ఈ సంస్థలు వేతనాలు ఎక్కువగా ఇస్తున్నట్టు, ఇతర సదుపాయాలు కూడా ఎక్కువని వాళ్లకు అనిపించేది. దాంతో అడ్మినిస్ట్రేటివ్ వ్యయాల్ని తగ్గించుకోవాలని పోరుపెడుతూ ఉండేవి. ప్రపంచబ్యాంకులో అంతర్గతంగా పాలనా సంస్కరణలు తీసుకురావడం, వలంటరీ రిటైర్మెంట్ కార్యక్రమాలు పెట్టి సీనియర్లు వెళ్లిపోయేలా చెయ్యడం, వాళ్లకొన్ని ప్రయోజనాలివ్వడం అనేది ఏటా జరిగే ఒక తంతులాగా మారింది.

ఫండ్ లో అది అరుదు, దానికి బదులు ‘జాబ్ గ్రేడింగ్’ అనేది జరిగింది. దాన్ని కొందరు ‘డీగ్రేడింగ్ ఎక్సర్ సైజ్’ అనేవారు. ఈ ధోరణివల్ల టెక్నికల్ అసిస్టెన్స్ స్టాఫ్ ఉద్యోగపర్వాలు నత్తనడకన నడిచేవి. ఫలితంగా ఎందరో సీనియర్ అధికారులు సంస్థను వదిలి వెళ్లిపోయారు. వారిలో అవమాన భారం తీవ్రంగా ఉండేది. అలా బలవంతంగా రిటైర్మెంట్ తీసుకున్నవారు తర్వాత మనోవ్యథతో త్వరగా మరణించేవారు.

ఫండ్ మేనేజ్ మెంటు ఈ ‘జాబ్ గ్రేడింగ్’ అనే తమ ప్రయోగం పరిమితంగా పనిచేసిందని చెప్పుకునేది. కాని స్టాఫ్ దృష్టిలో అది భారీ వైఫల్యం. దానివల్ల ఫండుకు నష్టం జరిగిందని అనుకునేవారు. టెక్నికల్ అసిస్టెన్స్ కు భారీగా డిమాండు పెరుగుతున్న సమయంలో, సంస్థ అన్ని రకాలా అభివృద్ధి సాధించాలని అనుకుంటూ ఉన్న తరుణంలో ఇలా జరగడం ఎవరికీ మింగుడుపడలేదు. అంతర్జాతీయ స్థాయి బ్యూరాక్రసీలు కూడా అన్న ప్రభుత్వ సంస్థల్లాగా బుర్ర తక్కువగా పని చేస్తాయని, చెప్పేదానికీ చేసేదానికీ మధ్య బోలెడు అగాథం ఉంటుందని ఈ అనుభవం నిరూపించింది.

* * * * * * *

ఏ దేశంలోనైతే అనేక సందిగ్థాలుంటాయో, పరిస్థితుల్లో అనిశ్చితి ఉంటుందో, వాటికేం కావాలన్నది ప్రభుత్వాలకే ఇదమిత్థంగా తెలియదో, అలాంటప్పుడు ఐ.ఎమ్.ఎఫ్. అందించే టెక్నికల్ అసిస్టెన్స్ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లయితే అసలు ప్రభుత్వం అంటూ ఒకటి ఉండదు.

ఇరవయ్యో శతాబ్దం చివరి దశాబ్దంలో రష్యా పరిస్థితి అదే. పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ ఫండింగ్ ఇనిస్టిట్యూట్ల సహకారం కోరుతూ గోర్బచెవ్ చర్చలు జరుపుతూ ఉండేవారు. జర్మనీ మీద కుదిరిన ఒప్పందం వల్ల డబ్బు వచ్చింది, ఉపయోగపడింది, కాని అది కొంత మేరకే. ఆర్థిక వ్యవస్థను సమీక్షించి చూసినప్పుడు లోపాలెన్నో పెరుగుతూ కనిపించాయి. ఆ దేశం ముందుకెలా వెళుతుందో ఎవరికీ అంతుచిక్కనప్పటికీ, ఇంటర్నేషనల్ ఫండింగ్ సంస్థలు తమకు తోచినంత చెయ్యడంలో తలమునకలయ్యాయి.

డిసెంబరులో నేను వేరే మిషన్ నుంచి తిరిగిరాగానే, వీలయినంత త్వరగా రష్యా మిషన్ లోకి వెళ్లాలని చెప్పారు నా అధికారులు. అది క్రిస్మస్ ముందే పూర్తయిపోవాలని కూడా సూచించారు. (అమెరికాలో క్రిస్మస్ సందర్భంగా బోలెడు సెలవులుంటాయి, ఎవరూ పనికి వెళ్లరు, అందరూ కుటుంబాలతో సరదాగా గడుపుతారు) అంత తక్కువ సమయంలో – అక్కడి ప్రభుత్వ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఫెడరల్ స్థాయిలో ఎలా పనిచేస్తోంది, సమస్యలేమిటి, వాటికి పరిష్కారాలు ఏమిటన్నది మా మిషన్ సిద్ధం చెయ్యాలి!

ఒత్తిడిగా అనిపించినప్పటికీ నేను ఆ అవకాశాన్ని వదులుకోదల్చలేదు. నా కౌమారదశ నుంచి నేను రష్యా గురించి చదువుతున్నాను. తొల్ స్తాయ్, గోర్కీ, తుర్గనేవ్ వంటి వారి రచనలు తెలుగులోకి అనువాదమై వచ్చాయి. అవి చదివి అప్పట్లో ఎంతో ఊహించేవాళ్లం ఆ దేశం గురించి. సిడ్నీ, బియాట్రిస్ వెబ్ వంటివారు సోవియెట్ యూనియన్ కమ్యూనిజం మీద రాసినవి మా రీడింగ్ లిస్టులో ఉండేవి కాలేజీలో. మా బంధువుల్లో కొందరు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు. అందులో ఒకాయన నా చిన్నప్పుడు ‘ఎలాగైనా రష్యా వెళ్లడం నా కల. మాస్కోలో అడుగుపెట్టాలి, కార్మికుల పాలిట స్వర్గం అనిపించుకున్న ఆ దేశాన్ని చూడాలి’ అని భావోద్వేగపూరితంగా మాట్లాడటం నా పసి హృదయం మీద చెదరని ముద్ర వేసింది. (తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి మారాడు, చాలా ఎదిగాడు). తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ రష్యాలో పర్యటించడం, ఆయనకు లభించిన ఘన స్వాగతం గురించి మూడు గంటల సినిమాలు చూశాం. దానికి ప్రతిగా కృశ్చేవ్, బుల్గనిన్ ల భారత పర్యటన – ఇవన్నీ నా మనసులో తాజా జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఢిల్లీలో  కొందరు వ్యాపారస్తులు రష్యాకు షూలు, నాసిరకం పొగాకు ఎగుమతి చేస్తూ ఉండేవారు. వారిలోనూ తెలుగువారు నాకు పరిచయస్తులుండేవారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – జాతీయ స్థాయి నాయకుల్లో మా జిల్లావారుండేవారు. వారితో సన్నిహితంగా పనిచేసే మరికొంతమంది కూడా నాకు బాగా తెలిసినవారుండేవారు.

వీటన్నిటివల్లా నాకు రష్యా అంటే అమితమైన ఆసక్తి ఏర్పడింది. అందువల్ల నేను ఒత్తిడి ఉంటుందని తెలిసినా, రష్యా వెళ్లడానికి, అక్కడేం జరుగుతోందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి ఉత్సాహపడ్డాను. అప్పటివరకూ సూపర్ పవర్ గా, సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న దేశం ఎందుకు ఛిన్నాభిన్నమైందో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అది ఒక్కసారిగా ఎలా కుప్పకూలింది? చట్టాల్లో, సంస్థాగతమైన లోపాలూ ఏవి? వాటిని సరిచేసేందుకు ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలు నన్ను నిలవనివ్వలేదు.

అవకాశం వచ్చిందిగనక అన్నిటినీ తెలుసుకోవాలనుకున్నాను. అంత ఘన చరిత్ర ఉన్న సోవియెట్ యూనియన్ కు నేనేం చెయ్యగలను? ఐ.ఎమ్.ఎఫ్.లో స్టాఫ్ మెంబర్ గా అప్పటికి రెండు దశాబ్దాల అనుభవం నాది. కాని అదొక్కటే సరిపోదని తెలుసు. వాళ్లు నన్ను భారతీయుడిగా చూస్తారు. అప్పటికి భారత్ తనవైన సమస్యలతో ఆర్థిక సుడిగుండాల్లో ఉంది. అందువల్ల భారీ అంచనాలు ఉండకపోవచ్చు.

ఈ ఆలోచనతో నా రష్యా మిషన్ను కొత్తగా తీర్చిదిద్దాలనుకున్నాను. తమ ఆర్థికవ్యవస్థల్లో తలపండిన, అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను చేర్చుకోవాలనుకున్నాను. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించి, ఆయా దేశాల నుంచి నిపుణులు కావాలని అడిగాను. ఇటువంటి మిషన్ ముందు చేసినది కాదు. దాంతో ఇదెంత సఫలీకృతం అవుతుందో వారికీ అంచనా చిక్కలేదు. కాని సమ్మతించారు.

బ్రిటన్ ఆర్థికశాఖలో డిప్యుటీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజరుగా పనిచేస్తున్న రాచెల్ లోమాక్స్, అమెరికా ప్రభుత్వంలో మేనేజ్ మెంట్ అండ్ బడ్జెట్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన డేవిడ్ మాథీసన్, జర్మనీలో బడ్జెట్కు డిప్యుటీ డైరెక్టర్ గా పనిచేసిన సియెగ్మార్ కుమాస్ – వీరు ముగ్గురూ నా మిషన్ లో భాగమయ్యారు. ఆ చలికాలం సాయంత్రం మేం నలుగురం మాస్కోలో దిగాం.

అప్పటికే ఐ. ఎమ్.ఎఫ్. తరఫున నాలుగు మిషన్లున్నాయి అక్కడ. డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఏదో పని మీద వచ్చి ఉన్నారు. అలాగే ఈ తరహా ప్రయత్నాల్లోనే వచ్చిన ప్రపంచ బ్యాంకు అధికారులు మరో ముప్ఫై నలభై మంది వరకూ ఉన్నారు. మేమందరం ‘మెట్రో పోల్’ హోటల్లో లేదంటే మారియెట్ హోటల్లో ఉండేవాళ్లం. శీతకాలం మంచు దట్టంగా పడేది. మేమున్న మూడు వారాల్లో మేం సూర్యరశ్మిని చూసింది కొద్ది నిమిషాలే. మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తిగా చీకటైపోయేది – అసలే నిరాశగా ఉన్న దేశ పరిస్థితికి అద్దం పడుతున్నట్టు.

స్థానిక పరిస్థితులను అంచనా వెయ్యడానికి మేం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడే అక్కడి ఆర్థికమంత్రి రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. అంటే ఆ విభాగానికి నాయకుడెవరూ లేనట్టే. అకడమిక్ సభ్యులతో కొత్త బృందం ఏర్పడిందిగాని ఇంకా రంగంలోకి దిగలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన పరిణామం ఏమంటే – దేశం రాజకీయంగా చీలిపోతూ ఉండేది. విడిపోగా మిగిలిన రష్యన్ ఫెడరేషన్ కు అధ్యక్షుడు కావలసిన వ్యక్తి యెల్ట్ సిన్, ఉక్రెయిన్, కజకిస్తాన్ నేతలతో చేరి స్వతంత్ర రాష్ట్రాల కామన్వెల్త్ ఏర్పాటు కోసం కుట్రలు చేస్తూ ఉండేవాడు. కాని దానికి ఎవరు నేతృత్వం వహిస్తారో ఎవరికీ తెలియదు. ప్రభుత్వోద్యోగులకు తమ భవితవ్యం ఏమిటో తెలియదు. విదేశాంత మంత్రిత్వ శాఖను మూసేశారని, ఉద్యోగులను విధుల్లోకి రావొద్దన్నారని పుకార్లు. మేం మాట్లాడటానికి దొరికిన అధికారులే తక్కువ. బడ్జెట్ కమిటీ మెంబర్లు మాత్రం అందుబాటులో ఉండేవారు. (వారంతా వైట్ హౌసులో ఉండేవారు, తర్వాత దానిమీద యెల్ట్ సిన్ బృందం బాంబులేశారు.)

ఇక్కడ మేం కొంచెం అదృష్టవంతులం. మాకు ప్రొఫెసర్ సొఖొలోక్ ప్రాపకం దొరికింది. ఆయన మాస్కో యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా పనిచేసి, బడ్జెట్ కమిటీ ఛైర్మన్ అయ్యారు. ఆ రంగంలో అనుభవజ్ఞుడు. ఆయన సహోద్యోగుల్లో ఒకరు లాట్వియన్, మంచి ఇంగ్లిష్ మాట్లాడేవారు. అగ్రికల్చరల్ కమిటీలో కూడా సభ్యుడు. మాకు చాలా సాయం చేసేవాడు. మాకు దుబాసీ (ఇంటర్ప్రెటర్) దొరకనప్పుడు ప్రొఫెసర్ సొఖొలోవ్ దృక్పథం ఏమిటో ఆయనే అనువదించి చెప్పేడు. జర్మనీ నుంచి వచ్చిన కునాస్ ఆయనతో ఫ్రెంచిలో సంభాషించేవాడు.

ఎన్ని ఆధారాలు పట్టుకున్నా, మాకు వచ్చిన సమాచారమంతా అరకొరదే. దాంతోనే తంటాలు పడి, వచ్చే కొన్నేళ్లకు సరిపడా బడ్జెట్ ఎక్స్ పెండిచర్ అంచనాలు తయారుచేశాం. అప్పుడు మాకు తెలిసింది ఏమంటే – ఎంత వనరులను సమీకరించినా, బడ్జెట్ లోటును పూరించలేమని! ప్రత్యామ్నాయాలూ పెద్దగా లేవు. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా ఎన్నో ఏళ్లపాటు తగ్గించాలన్నది ఒక మార్గం. మా దృష్టికి వచ్చిన విషయాలను వారితో చర్చించాం. ఇబ్బందేమిటంటే అవి మాకూ, వారికీ కూడా కొత్తవి కాకపోవడం. కాని అంతకుమించి చెయ్యగలిగిందేం లేదు. ప్రభుత్వం, దేశం కూడా వేగంగా శిధిలమవుతూ వచ్చాయి. మేం కలుస్తున్న అధికారులకు సైతం ఏం జరుగుతోందో అర్థమయ్యేది కాదు.

సమాచారానికి మిగిలిన ఆధారమల్లా, బిబిసి, సిఎన్ఎన్ వంటి వార్తాసంస్థలు. వాళ్లు త్వరగా అర్థం చేసుకుని కవరేజ్ ఇచ్చేవారు. ఒక ప్రభుత్వ పతనాన్ని అంత దగ్గరగా చూడటం నాకు జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. చేదు జ్ఞాపకం. మనసుకు కష్టంగా అనిపించేది. ఆ పతనం శ్రామికుల తిరుగుబాటు వల్ల కాదు, పెట్టుబడిదారీ వర్గం మోసం వల్ల కాదు. కేవలం రాజకీయ నాయకుల కుతంత్రాలు, అధికార దాహం వల్ల.  ఆ మార్పుల్లో ప్రజలకు ఏ పాత్రా లేదు. అటువంటి సన్నివేశాన్ని ముందెవ్వరూ ఊహించలేదు. ఎంతోమంది మేధావులు, రచయితలు, సృజనకారులు, దార్శనికులు ఉన్నా సరే.

మాస్కోలో విపరీతమైన చలి. ఎన్ని పొరల దుస్తులు వేసుకున్నా ఆగదు. అందువల్ల మేం బయట ఎక్కువగా తిరగలేకపోయాం,  పౌరజీవనాన్ని ఎక్కువగా గమనించలేకపోయాం. ఆ నగరంలో విభిన్న నిర్మాణ శైలులు కనిపిస్తాయి. ప్రతిదీ ఒక శకాన్ని ప్రతిబింబిస్తుంది. క్రెమ్లిన్, చుట్టుపక్కల ప్రాంతాలు యూరోపియన్, ఇటాలియన్ శైలిని ప్రతిబింబిస్తాయి. వాటిని ఆయా దేశాల కార్మికులే నిర్మించారు. విప్లవానికి తరువాత, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్టాలిన్ శకంలో కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అవి వేరే శైలిలో ఉంటాయి. మరోవైపు నగరమంతా నిస్తేజంగా, సగం పని పూర్తయిన అపార్టుమెంట్లు కనిపించాయి. ఎయిర్ పోర్టు నుంచి క్రెమ్లిన్ వరకు ఒక్కటే గీత గీసినట్టు ఒంపులేమీ లేని రహదారి. దాని వెంబడి అందంచందం లేని అపార్టుమెంట్లు కనిపిస్తాయి. లోపల చిన్నగా, ఇరుగ్గా, తేనెపట్టులోని గదుల్లాగా ఉంటాయి. నా అభిప్రాయం ప్రకారం అవి ఢిల్లీలోని క్లాస్ డి ఉద్యోగుల క్వార్టర్ల కన్నా కూడా చిన్నవి.

మాస్కో యూనివర్సిటీ లెనిన్ హిల్స్ ప్రాంతంలో భారీ భవనాలతో ఉంటుంది. వెడ్డింగ్ కేకుల్లాగా కనిపించే స్టైల్లో ఉంటాయి. మాస్కో నదికి ఇరువైపులా కనిపించే విదేశాంగ శాఖ, ఉక్రెయిన్ హోటల్ వంటివి ఇలాగే ఉంటాయి. మేం చూసేనాటికి వాటిని చాలా అధ్వాన్నంగా నిర్వహిస్తూ ఉన్నా సరే, పెద్ద ఉద్దేశాలతో నిర్మించారని చూడగానే అర్థమయ్యేది.  వాటిని బ్రెజ్నేవ్ శకంలో కొనసాగించారు. ఆయన కాలంలో కట్టినవి అన్నీ ఎత్తైన భవంతులు. ఉక్కు, గ్లాస్, కాంక్రీట్ నిర్మాణాలు. పశ్చిమ యూరప్, చైనా, ఇండియాల్లో కొన్ని భాగాల్లో కనిపించేలాంటివి.

ఈ మూడు తరహాలూ మాస్కోలో విభిన్నంగా కనిపిస్తాయి.

ప్రపంచంలో అత్యున్నతమైనదని పేరున్న లెనిన్ లైబ్రరీ, బడ్జెటరీ లోటు వల్ల మేమున్నప్పుడు మూసేసి ఉంది. క్రెమ్లిన్ లో చర్చిలు, భవనాలను బాగా సంరక్షిస్తారు. రష్యన్ సంప్రదాయ చర్చి పునరుద్ధరణ వైనం చూడటానికి ఆసక్తికరంగా ఉండేది.  రాజకీయ, ఆర్థిక సంక్షోభాల మధ్య అది కొత్త రూపునూ బలాన్నీ పుంజుకుంది. అన్ని వ్యవస్థల పట్లా నమ్మకం పూర్తిగా సడలిపోయి, మరలడానికి పెద్ద ప్రత్యామ్నాయాలేవీ లేనప్పుడు, నిరాశలో కూరుకుపోయినప్పుడు ప్రజలు దేవుడు, పూజారులను ఆశ్రయించారేమో అనిపిస్తుంది. వారి క్రతువులు సుదీర్ఘమైనవి, మన హరిద్వార్ లోని పండాల పూజల్లాగా అనిపించాయి నాకు. (నేనెప్పుడూ కాశీ పట్టణానికి వెళ్లలేదు. అందువల్ల అక్కడ సంగతి నాకు తెలీదు, నా పాపాలూ పూర్తిగా పోలేదేమో) వాళ్లు దక్షిణల కోసం కూడా గట్టిగా పట్టుపడతారు.

మతంలో ఉన్నలాంటి సుదీర్ఘ క్రతువులే కమ్యూనిజంలోనూ వర్థిల్లటం విచిత్రంగా అనిపిస్తుంది. ఉదాహరణకు కొత్తగా పెళ్లయినవాళ్లు తమ పెళ్లి దుస్తుల్లో దేవాలయాలకు వెళ్లినట్టు, అక్కడ క్రెమ్లిన్ గోడ పక్కనున్న ఒక అమరవీరుడి స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులర్పిస్తారు. లెనిన్ స్థూపం వద్దకు వెళ్లి, ఎంబామింగ్ చేసున్న ఆయన పార్థివ దేహాన్ని దర్శిస్తారు. ఎంత చలికీ వెరవకుండా దాన్ని దర్శించేందుకు వారు క్యూలో ఓపిగ్గా నిల్చోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అదొక సాంకేతిక అద్భుతం. ఆయన ముఖ కవళికలను పొల్లు పోకుండా, చివరకు ఆయన చిరుగడ్డాన్ని సైతం వాక్స్ తో తీర్చిదిద్దారు! మేం కూడా లెనిన్ స్థూపం, ఆయన పార్థివ దేహాన్ని చూశాం. అంతకుముందు నేను బీజింగ్, హనోయి వెళ్లానుగాని ఛైర్మన్ మావో, హోల దేహాలను చూడటానికి ఇష్టపడలేదు.

మాస్కో వాసులకు క్యూల్లో నిలబడం ఒక సహజమైన చర్యేమో అనేలాంటి క్యూలను మేం చూశాం. దాని చివర ఏం జరుగుతుందో వాళ్లకు అనవసరం. ప్రతి మహిళ ఒక షాపింగ్ సంచి భుజానికి తగిలించుకుంటుంది, లైను కనిపిస్తే వెళ్లి నిలుచుంటుంది. లైన్లు ప్రశాంతంగా ఉంటాయి, జనాలు సహనంగా తమ వంతు కోసం వేచి చూస్తారు.

ఒకరోజు వేద్ గాంధీ, నేనూ ఒక సమావేశం తర్వాత హోటలుకు వెళుతున్నాం. ఒక లైను కనిపిస్తే ఆసక్తితో నిల్చున్నాం. అది బ్రెడ్ కోసం. మేం కొన్నాం. డాలర్లలో చెల్లింపులు చేస్తే లైన్లో నిల్చోనవసరం లేదు. ఒక అమెరికన్ పిజ్జా చైన్ దుకాణాలు దీన్ని బాగా అనుసరించాయి. గుమ్ సూపర్ మార్కెట్లో కొన్ని దుకాణాల్లో కేవలం డాలర్లలోనే చెల్లించాలి. అక్కడ లైన్లుండవు. ఒకనాడు జార్లు, తర్వాత శ్రామికులు – వారి శక్తికి దర్పణంగా నిలబడిన కోటకు ఎదురుగానే వాణిజ్యవిలువల శక్తిని చాటి చెబుతున్నట్టుగా నిలబడిన సూపర్ మార్కెట్ చూసేందుకు ఆశ్చర్యంగా ఉంటుంది.

యెల్ట్ సిన్ అధ్యక్షతలో జరిగిన సామాజిక కూల్చివేతను మేం దగ్గర్నుంచి చూశాం. ఆ కాలంలో నిరుద్యోగం ఎక్కువ అయింది. సబ్ వే స్టేషన్లకు  ఇరువైపులా అడుక్కునే అనాధలు, యువత కనిపించారు. ఒకనాడు శ్రామికుల స్వర్గంగా పేరొందిన ప్రదేశంలో అంత పెద్ద ఎత్తున భిక్షాటన ఊహించలేం, అసలు. ఆ దృశ్యం చూడటానికి కష్టంగా ఉండేది. అద్భుతంగా కట్టిన స్టేషన్లతో సబ్ వే సిస్టమ్ మాత్రం బాగానే నడిచేది. కొన్ని కోపెక్కులు చెల్లించి ఎవరైనా నగరమంతా చుట్టిరావొచ్చు. మేం టికెట్లు బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని మరీ బొల్షోయ్ వెళ్లాం. క్రెమ్లిన్ చుట్టుపక్కల అమ్మే రష్యన్ చలి టోపీలు, ఆర్మీ వాచీలు కొన్నారు నా సహోద్యోగులు.

జర్మనీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ కునాస్ మాస్కోలోని పుష్కిన్ మ్యూజియమ్ లో వారసత్వ కట్టడాల బొమ్మలున్న  కొన్ని కాఫీ టేబుల్ పుస్తకాలను కొనాలనుకున్నాడు. ఒక పుస్తకాల దుకాణానికి వెళ్లాంగాని దొరకలేదు. అంతలో ఒక సేల్స్ బోయ్ వచ్చి ఒక మహిళ మాకు సాయం చేస్తుందని చెప్పాడు.  ఆమెను పక్కకు తీసుకెళ్లి చెవిలో ఏదో ఊదాడు. మేం అడిగిన పుస్తకాలేమీ లేవని చెప్పినది ఆమే ముందు. తనే మళ్లీ మమ్మల్ని షాపులో ఓ మూలకు తీసుకెళ్లి పెద్ద గుట్టను చూపించింది. కునాస్ కు కావలసిన పుస్తకాలు అచ్చంగా అవే! కొంచెం డబ్బుకు ఆయనకు కావలసినన్ని మంచి పుస్తకాలు దొరికాయి. వాళ్లు బిల్లు ఇవ్వలేదనుకోండి, అయినా పచ్చనోటు (డాలరు) మహత్యం ఏమిటో మాకు అలాగ తెలిసొచ్చింది.

ఆ దేశంలోని భయంకరమైన, దిగజారిపోతున్న వాతావరణం మాస్కో నుంచి తిరిగివచ్చేశాక కూడా నన్ను కొన్నాళ్లపాటు వెంటాడి కలత పెట్టేది.

దీనికో కారణం ఉంది. అక్కణ్నుంచి రాగానే నేను భారత ఆర్థికశాఖ అధికారులతో చర్చల కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడి పరిస్థితి అంతకన్న మెరుగ్గా ఏమీ కనిపించలేదు. ఎంత పెద్దది, శక్తిమంతమైనది అయినా, నిర్వహణ సరిగా లేకపోతే ఆర్థికవ్యవస్థలు కుప్పకూలిపోతాయన్న నిజం కళ్లముందు నిలిచి నన్ను భయపెట్టింది. శ్రామికశక్తికి శత్రువు పెట్టుబడిదారీ వర్గం కాదు, చట్టాల్లోని లొసుగులు, వ్యవస్థ నిర్వహణలో లోపాలు.

కొన్నేళ్ల తర్వాత మరొక చలికాలం మధ్యలో నేను  రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ వారి అతిథిగా మళ్లీ మాస్కో వెళ్లాను. అప్పటికి సోవియెట్ యూనియన్ పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. ఒక కొత్త రష్యన్ ఫెడరేషన్ ఆవిర్భవించింది. పాత సుత్తి, కొడవలి గుర్తున్న జెండా పోయి త్రివర్ణ పతాకం ఎగిరింది. అప్పటికల్లా నేను రాసిన ‘పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్’ రష్యన్ భాషలోకి అనువాదమై విడుదలైంది, నిత్యజీవితంలో ఉపయోగించేవారికి చేరింది కూడా.

రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైనాన్స్ చాలా పెద్ద సంస్థ. ప్రభుత్వోద్యోగులకు శిక్షణనిస్తుంది. విద్యార్థులకు డిగ్రీ కోర్సులు నిర్వహిస్తుంది. సాధారణమైన భవనంలో నడుస్తూ ఉంటుందిగాని అక్కడ చదివినవారు కేంద్ర మంత్రులయ్యారన్న ప్రఖ్యాతి ఉంది. యెల్ట్ సిన్ అధికారంలో ఉన్నప్పుడు దాని దశ తిరిగింది. ఆ సంస్థ డైరెక్టర్ గా ఉన్న మహిళ ఆయనకు సపోర్టర్. దాంతో – పూర్వం సోవియెట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండే భవనాలను ఆయన ఈ సంస్థకు కేటాయించారు. అప్పట్లో పార్టీ వార్షిక సమావేశాలప్పుడు అధినాయకత్వం కోసం కొన్ని సూట్లు కేటాయించేవారట. నేను అతిథిని గనక నాకోసం ఒకటి కేటాయించారు. దానిలో ఫైవ్ స్టార్ హోటల్ ను తలపించే సౌకర్యాలుంటాయి.

నా లెక్చర్, పని పూర్తైన తర్వాత నన్ను నగర సందర్శనకు తీసుకెళ్లారు. అప్పుడు నేను పూర్వం నా పర్యటనలో గమనించిన అంశాలతో పోలిస్తే వర్తమానం ఎలా ఉందో అని బేరీజు వేసుకుంటూ వెళ్లాను.

మాస్కో నగరం పూర్తిగా మారిపోయింది. రంగురంగుల ప్రకటనలు, వాటిలో చాలామటుకు స్టాక్ బ్రోకర్ కంపెనీలవి, ఇతర ఉత్పత్తులవి. నేను పూర్వం చూసిన అపార్టుమెంట్ల ముందుభాగమంతా వీటితో కవరయిపోయింది. విపరీతమైన వాణిజ్యమయం అయిపోయింది. ప్రైవేటైజేషన్ విస్తరించింది. దానివల్ల లాభపడిన పెద్దమనుషులు కనిపించారు. స్థానిక ప్రజలు అక్కడ కొత్తగా అవతరించిన పెద్ద మనుషుల చేతిలో పీడనకు గురయ్యేవారు.

రూబుల్ విలువ గణనీయంగా పడిపోయినా, కొంత స్థిరంగా ఉండేది. పేదలు మరింత పేదలైపోయారు, నిరుద్యోగం బాగా పెరిగింది. జీవన ప్రమాణాలు పడిపోయాయి. ప్రజలకు రాజకీయంగా స్వేచ్ఛ లభించిందిగాని ఆర్థికంగా మాత్రం తిరోగమనంలోనో, ఉన్నచోటనే ఉండిపోవడమో జరిగింది. నేను కలిసిన అధికారులు కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. కాని అది ఒకనాటి ‘సూపర్ పవర్’ కాలం నుంచి మిగిలినదని స్పష్టంగా తెలుస్తూనే ఉండేది. సాయం అడగాలంటే వారికి ఎక్కళ్లేని గర్వం. అయినా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలు సాయం చేసేవి.  అలాగని వారి కాళ్ల మీద వారు నిల్చునే బలం లేదు.

నేను ఫండ్ నుంచి రిటైరయ్యాక, కొత్త శతాబ్దంలో మరోసారి మాస్కోను సందర్శించే ఆహ్వానం అందుకున్నాను. సెంటర్ ఫర్ ఫిస్కల్ స్టడీస్ వారు పిలిచారు ఈసారి. అదొక ప్రైవేట్ కన్సల్టింగ్ ఫర్మ్. ప్రపంచ బ్యాంకు సాయంతో నడుస్తుంది. అది వేసవి కాలం కావడంతో నాకు బయట తిరిగేందుకు సమయం, స్వేచ్ఛ లభించాయి. అప్పటికల్లా యూనియన్ ఆర్థిక నిల్వలు పూర్తిగా దిగనాసిల్లిపోయాయి. బయటి రుణాలు తీర్చలేని పరిస్థితి. డీవాల్యుయేషన్ వలన రూబుల్ విలువ తగ్గిపోయింది. రాజకీయ నాయకత్వం మారిపోయింది.  అప్పటికల్లా తమ అనుభవాల సారాంశం ఏమిటని చెప్పడానికి మాస్కో పౌరులు, ఇతరులు సంకోచించలేదు, నిజాల్ని దాచలేదు.

ఆ పర్యటనలో ఆ ప్రాంత గవర్నర్ నాకు సాదర స్వాగతం పలికారు. అక్కడ కొన్ని మీటింగుల్లో ప్రసంగాలు చేశాను, స్థానిక ఆర్థిక అమాత్యులతో కలిసి ఒక టెలివిజన్ టాక్ షోలో కూడా పాల్గొన్నాను. ఒకనాడు గోర్బచెవ్ నివసించిన ‘దాచా’ను గౌరవ పురస్సరంగా నాకిచ్చారు. ఆయన భార్య రైసా అక్కడి యూనివర్సిటీలో బోధన చేసేవారు. నాకిచ్చిన ‘దాచా’ లో ఫర్నిచర్ సాధారణంగా ఉన్నా, సౌకర్యంగా ఉండేది.

అప్పటికల్లా ఆ దేశం మంచి అభివృద్ధి సాధించింది, రాజకీయ స్థిరత్వం ఉంది, కాని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు స్పష్టంగా ఉండేవి కాదు. ఖర్చులు, బాధ్యతలను స్థానిక ప్రభుత్వాలకు బదలాయిస్తూ బోలెడన్ని డిక్రీలు జారీ అయి ఉండేవి. కాని వాటికి వనరుల కేటాయింపు మాత్రం జరగలేదు. ఫలితంగా స్థానిక, ప్రాంతీయ పరిస్థితులు క్షీణించాయి. బోలెడన్ని ఎరియర్లు పేరుకుపోయాయి. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, స్థానికంగా ఉన్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ కు చెల్లింపులు – ఇవన్నీ బకాయిలుండేవి. అంతకన్నా ముఖ్యం, స్థానిక స్థాయిలో జవాబుదారీతనం తగ్గి, బలహీనంగా ఉండటం. ఈ సమస్యలను అధిగమించేందుకు వారి సంకల్పం మాత్రం దృఢంగా ఉండేది. నేను పూర్వం చూసిన వాతావరణం లేనందుకు, అది ప్రగతి మార్గంలో వెళుతున్నందుకు నా హృదయం తేలికయింది.

* * * * * * *

(ఇంకా వుంది)

అనువాదం: అరుణా పప్పు

అరిగపూడి ప్రేమ్ చంద్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాల ఆలస్యంగా అడుగుతున్నాను అని తెలుసు . ఈ సిరీస్ ఆగిపోయిందా ? మిగతా భాగాలు ఎక్కడ చదవగలను .
    Thank you.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు