సినారే ఒక సాధారణ వ్యక్తి, కవి, 20వ శతాబ్దిని ప్రభావితం చేసిన మహనీయుడు. వారితో దాదాపుగా 35 సంవత్సరాల పరిచయంలో ఆయనలో అనేక అసాధారణ ప్రజ్ఞలను చూశాను.
ఖాన్గీ బడిలో ఉర్దూమయమైన విద్యను అభ్యసించిన వ్యక్తి పదవ తరగతిలో సీతాపహరణం అనే పౌరాణిక పద్య నాటకం రాయడం అసాధారణమైన విషయం.
ఆయన సాహితీ సృజన 1947 నుంచి 2017 వరకు 70 ఏళ్ల పాటు నిరంతరంగా సాగింది. అందుకే నిరంతరకవి సినారే. ఆయనతో నా జ్ఞాపకాలు అప్పటికి, ఇప్పటికీ పరిమళభరితంగా తాజాగా ఉన్నాయి.
ఆయన ఏకకాలంలో అనేక కార్యకలాపాలను సమర్ధవంతంగా, సృజనాత్మకంగా నిర్వహించేవారు. ఏకకాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినా ప్రమాణాలు తగ్గడం ఏనాడూ లేదు.
సినారె సమయపాలన, క్రమశిక్షణ తో కూడిన దినచర్యకు పెట్టింది పేరు. ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం, నడక సాగించడం, నడకలోనే సినీ గీతాలకు పంక్తులకు పంక్తులు రాగా జేబులో ఉన్న చిన్న స్క్రీబ్లింగ్ ప్యాడ్ మీద రాసుకోవడం, తోటి నడక మిత్రులకు వినిపించడం, ఇంటికి వచ్చి స్నానం ముగించుకుని ఫోన్లు మాట్లాడడం, పత్రికలు చదవడం, అల్పాహారం తీసుకోవడం, కాస్త విశ్రాంతి, వెంటనే కార్యాలయానికి పయనం, కార్యాలయంలో ఎన్ని సభలు, సమావేశాలు ఉన్నా కొంత వ్యవధిని తీసుకొని తనకోసం వచ్చిన వారిని క్రమం తప్పకుండా కలుసుకోవడం, ఇంటికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేయడం, కాసేపు విశ్రాంతి, కవిత రాసుకోవడం, సాయంత్రం సమావేశానికి సిద్ధం కావడం, సమావేశానికి తాను ఎన్ని గంటలకు వచ్చేది ముందే నిర్వాహకులకు తెలపడం ఆ సమయానికి అక్కడికి చేరడం పక్కా ప్రణాళిక ప్రకారం సాగేది. ఏ పని ఏనాడూ వాయిదా వేయడం సినారె నిఘంటువులో లేని మాట.
సమావేశాలకు వెళ్లేటప్పుడు వేదికకు చేరుకోవడానికి ట్రాఫిక్ లో ఎంత సమయం పడుతుందో అంచనా వేసుకొని ట్రాఫిక్ తక్కువగా ఉండి అనుకున్న సమయానికి ఐదు నిమిషాల ముందే చేరే పరిస్థితి ఉంటే కారు కాస్త నిదానంగా పోనివ్వమని డ్రైవర్ కు సూచన చేయడం, సరిగ్గా వేదిక దగ్గరకు వెళ్ళగానే హారన్ మోగించడంతో అందరూ గడియారాలు సరిచూసుకోవాల్సిందే. అలా రోజుకున్న 24 గంటల్లో ఎప్పుడెప్పుడు ఏమేం పనులు చేయాలో కాలయంత్రాన్ని ఆ ప్రకారం తన అదుపులో ఉంచుకోవడం సినారే ప్రత్యేకత.
పరిపాలన పదవుల్లో తీరిక లేకుండా ఉన్నా ఏనాడూ అధ్యయనం మానలేదు. తోటి కవులు అందజేసిన పుస్తకాలను చదవడంతో పాటు, బ్రిటిష్ లైబ్రరీ నుంచి నేను తెచ్చి ఇచ్చే పుస్తకాలను కూడా ఏరోజు కారోజు చదివేవారు. కవిత్వం రాయడం, సభల్లో పాల్గొనడం ఈనాడూ ఆపలేదు. సాంస్కృతిక రంగానికి నిరంతరం అందుబాటులో ఉండేవారు.
నారాయణ రెడ్డి గారికి సినీ గీత రచన మొదటి నుంచి చివరి వరకు ఒక పార్ట్ టైం జాబ్ మాత్రమే. విశ్వవిద్యాలయంలో బోధన, సాహిత్య సమావేశాలు చూసుకుంటూనే పాట ఎప్పుడు ఇవ్వాలో ముందుగానే నిర్ణయించి నిర్మాతలకు, దర్శకులకు చెప్పటం, ఆ ప్రకారమే తప్పకుండా వారికి అందజేయడం జరిగేది.
జర్నలిస్టుగా పనిచేస్తున్న రోజుల్లోనే నాకు వారితో పరిచయం కలిగింది. ఒక సంస్థ కార్యక్రమానికి వస్తాను అని మాట ఇస్తే ఆ మాట ఎట్టి పరిస్థితుల్లోనైనా నిలబెట్టుకునేవారు. ఇల్లు దూరం. ఎవరైనా కలవడానికి ఇబ్బంది. కాబట్టి ఫోన్ లోనే మాట్లాడి ఆ వివరాలు డైరీలో రాసుకున్నారంటే ఇక తప్పక వెళతారన్నమాటే.
ఇది 1986 నాటి మాట. వారు ముఖ్యఅతిథిగా ఉన్న ఒక కార్యక్రమానికి నేను విలేకరిగా కవరేజ్ కి వెళ్ళాను. ఆయన జ్వరంతో ఉన్నా కార్యక్రమానికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో రాకపోతే ఏమైంది అని నేనంటే నిర్వాహకులను నిరాశపరచడం భావ్యం కాదు కదా అన్నారు. రోజుకు రెండు, మూడు సమావేశాల్లో పాల్గొనవలసి వచ్చినప్పుడు కూడా ఎందుకు అంత కష్టపడతారంటే మనం కావాలని కోరుకుంటున్న వాళ్లను నిరాశపరచటం ఎందుకు అనేవారు.
కవిత్వం, ఆచార్యత్వం అవే ముఖ్యం అనేవారు. ఆ దృష్టితోనే తెలుగు శాఖ అధ్యక్ష పదవితో సహా ఏ రకమైన పరిపాలన బాధ్యతలు చేపట్టడానికి ఆయన మొదట అంగీకరించలేదు. కానీ 1981లో 50వ పుట్టినరోజున రవీంద్ర భారతి వేదికపై నుంచి నాటి ముఖ్యమంత్రి టి. అంజయ్య అధికార భాషా సంఘం అధ్యక్ష పదవిలో నియమిస్తున్నట్లు ప్రకటించడంతో పరిపాలన పదవిని స్వీకరించక తప్పలేదు. ఒక మారు పదవిని చేపట్టిన తర్వాత ఇక ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తోడ్పాటుతో అధికార భాషగా తెలుగు అమలును అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లారు. జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లను కార్యోన్ముఖులను చేసి ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు పరిఢవిల్లేలా చేశారు. తెలుగు అమలు కోసం వేలాది కంప్యూటర్లు కొన్నారు. అధికారులకు భాషా పరమైన ఇబ్బందులు తొలగించేందుకు అనేక శాఖలకు సంబంధించిన పదకోశాలు సిద్ధం చేశారు. నమూనా లేఖలు అందించారు.
ఆ తర్వాత సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షులుగా పదవిని చేపట్టి దూరవిద్యను అందరికీ సమీప విద్యగా తీసుకువెళ్లారు. కారాగారాలకు స్వయంగా వెళ్లి ఖైదీలకు విద్యను పరిచయం చేశారు. అధ్యయన కేంద్రాలను పెంచారు. అంతేగాక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి జూబ్లీహిల్స్ లో ఇప్పుడున్న స్థలం ఆయన సాధించిందే.
తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం విసీ పదవిని చేపట్టమని ఎన్టీఆర్ ఆహ్వానించారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఛాన్సలర్ గా ఉన్నారు. ఆ కారణంతో యుజిసి గుర్తింపు రాలేదు. నిధులు ఆగిపోయాయి. సినారె ఎన్టీఆర్ కు నచ్చజెప్పి గవర్నర్ ను ఛాన్స్ లర్. ను చేయడంతో గుర్తింపు వచ్చింది, నిధులు వచ్చాయి.
ఎక్కడున్నా తన ప్రత్యేకతను నిలిపేలా కార్యక్రమాలు చేయడం సినారే విశిష్టత. తెలుగు విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఆయనే చేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను ముఖ్యఅతిథిగా తీసుకొచ్చారు. రెండవ స్నాతకోత్సవానికి పీవీ నరసింహారావును ఆహ్వానించారు. అప్పుడు పీవీ రాజకీయ సన్యాసం చేసే యోచనలో ఉన్నారు.అయినా సినారే చేసిన ఆహ్వానానికి పీవీ అంగీకరించారు. అందులో రాజీవ్ గాంధీ హత్య, లోక్ సభ ఎన్నికలు,పి.వి ప్రధాని కావడం వంటి పరిణామాలు సంభవించాయి.
ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వారం తిరగకుండానే సినారే మాట మన్నించి పివి తెలుగు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. తొలిసారిగా చరిత్రలో దేశ ప్రధాని హోదాలో తెలుగులో ప్రసంగించారు. తెలుగు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రధాని ముఖ్య అతిథిగా వచ్చిన మరో రికార్డు. ఆ విశ్వవిద్యాలయం నుంచి ఆవంత్స సోమ సుందర్, గోపాలరాజ్ భట్, కొంగర జగ్గయ్య, నండూరి రామ్మోహన్ రావు, ముళ్ళపూడి వెంకటరమణ, బాలమురళీకృష్ణ వంటి ఎందరో మహనీయులకు గౌరవ డాక్టరేట్ సత్కారం అందజేశారు. ఆయన చేతుల మీదుగా తెలుగు విశ్వవిద్యాయానికి వెలుగునిచ్చే పనులు ఎన్నో చేశారు.సినారె విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవిలో తీరికలేని పనుల్లో ఉన్నా ఎన్టీఆర్ నటించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమద్విరాటపర్వం మొదలైన చిత్రాలకు సినారే గీతాలు అందించారు.
తాను పనిచేసిన సంస్థలను తన ఇమేజ్ తో వెలిగించారు. మనిషికి జీవించడానికి ముఖ్యమైన, పరిమితమైన సౌకర్యాలు కావాలి గాని విలాసాలు కావు అనేవారు. అదే తమ జీవితంలోనూ ఆచరించారు.
*








Add comment