సాయిబంగడి

“ఏమే, బాషాకు నీళ్లివ్వు. ఎండనపడి వచ్చాడు పాపం.” నాయన కేకతో నీళ్ళు రాలేదుకానీ, వరండాలో వాలు కుర్చీలో తీరుబడిగా కూర్చుని సాయికోటి రాసుకుంటున్న మా అవ్వ చివ్వున తలెత్తి చూసింది.

ఆమె చూపులు చురచురా తాకాయి కాబోలు- వాకిట్లో సైకిలు స్టాండు వేసి, వెనుక క్యారేజీ మీద వున్న బియ్యం మూట దింపి భుజాన వేసుకుని గుమ్మంలోకి వస్తున్న అంగడి సాయిబు కొడుకు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. ఏం చేయాలన్నట్టు బెరుకుగా నాయనవైపు చూశాడు.

“ఫరవాలేదు బాషా, లోపలికి వెళ్ళి అదిగో ఆ తలుపు వారగా దించేయి.” భరోసా ఇచ్చాడు నాయన. అలాగే అన్నట్టు తలూపి, గబగబా గడప దాటి వెళ్ళి నాయన చెప్పిన చోట బియ్యం మూట దించి ముఖానికి పట్టిన చెమటను రెట్టకు తుడుచుకుంటూ ఇవతలకు వచ్చాడు బాషా.

“ఇదిగో ఇది ఉంచు.” పది రూపాయల నోటు చేతికి ఇవ్వబోయాడు నాయన. తీసుకోలేదు అతడు.

“వద్దు సార్, అబ్బాజాన్ తిడతాడు.” చెప్పాడు. ఈలోగా లోపలినుంచి అమ్మ తెచ్చి ఇచ్చిన నీళ్ళ చెంబు చేతిలోకి తీసుకుని పైకి ఎత్తి గొంతులో పోసుకుని గటగటా తాగేసి, వాకిట్లో ఉన్న కుళాయి తిప్పి కడిగి ప్రహరీ గోడపైన పెట్టాడు. “వెళ్లొస్తాను సార్” అన్నాడు సైకిలు స్టాండు తీస్తూ.

“అలాగే, జాగ్రత్త.” అతడిని సాగనంపి వాకిట్లో నుంచి లోపలికి వచ్చాడు నాయన.

“నీకెన్ని సార్లు చెప్పాను ప్రకాశం, తురకోళ్ళకు చనువు ఇయ్యద్దని. ఒక్కనాడన్నా నామాట విన్నావా?” రుసరుసలాడింది అవ్వ. అవ్వంటే మా నాయనకు అమ్మన్న మాట.

ఎప్పటిలాగే చిన్న నవ్వు నవ్వేశాడు నాయన. “నీకు తెలియదులేవే అమ్మా. అంగడి సాయిబు ఎంత మర్యాదస్తుడో, మంచివాడో” అన్నాడు.

“అవునవును, అంతా మీకే తెలుసు. మా ఇద్దరికేమీ తెలియదు. ఆ తురకాయన మర్యాదస్తుడు, మీరేమో నిదానస్తుడు. మిమ్మల్ని అమాయకుడిని చేసి ఆడిస్తున్నాడు ఆ అంగడి సాయిబు.” లోపలినుంచి అందుకుంది మా అమ్మ.

“ఎందుకే మీ అత్తాకోడళ్ళు పాపం సాయిబు మీద విరుచు పడతారు. ఎందుకు అతనంటే ఇంత కోపం?” కొంచెం కరుగ్గానే విసుక్కున్నాడు నాయన.

“ఎందుకా… గుళ్ళో గురూజీ ప్రవచనాలకు రారా అంటే రావు. కనీసం పొద్దున్నే టీవీలోనన్నా ప్రవచనాలు వినరా అంటే వినవు, ఆ న్యూస్ పేపరు పట్టుకోని కుచ్చుంటావు…” అవ్వ కొడుకుతో కొట్లాడాలనే నిర్ణయించుకుంది.

“ఏం చెప్పారో మీ గురూజీ?” నాయనా తగ్గలేదు.

“జకాత్ అంట నాయనా. ఈ తురకోళ్ళు దాన ధర్మాలు చేయాలంట. దేనికనుకున్నావు? అవేందో తురకోళ్ళ బడులంట కదా మదరసాలని, వాటికి. వాటిల్లో మన దేశంపై కుట్రలు చేసే చదువులు చెప్తారంట. అక్కడ మన దేవుళ్ళను అవమానిస్తారంట. హవ్వా… ఎంత అన్యాయం. ఈ దేశం కూడుదింటా ఈ దేశాన్నే కూల్చేయాలనుకోవడం.. పాలు దాగి అమ్మ రొమ్ము గుద్దే రకాలు ఈ తురకోళ్ళు. ఎడారి దేశాల నుంచీ పొట్ట చేతిలో పట్టుకొచ్చినోళ్ళంట ఈ మూకంతా. మన గుళ్ళముందు టెంకాయలు, పొండ్లు, పూలు అమ్ముకోని బతకతా, మళ్ళీ మన దేవుళ్ళనే అవమానిస్తారా? గురూజీ చెప్పే మాటలు వింటావుంటే ఎంత కడుపు రగిలిపోతాదో.” అవ్వ శరసంధానం చేసింది.

నాయన మునిగాళ్ల మీద నిక్కి కుడివైపు చూశాడు. మా ఇంటికి, మసీదులో నమాజు చదివే సాయిబు ఇంటికి మధ్యలో ఒక ఇల్లు మాత్రమే ఉంది. ఆ నమాజు సాయిబు ఎక్కడ అవ్వ మాటలు వింటాడేమోనని ఆయన భయం. అయితే, నాయన అదృష్టం… ఆయన ఇంట్లో ఉన్నట్టు లేడు.

“ఆ గురూజీ చెప్పింది నిజం కాదే అమ్మా. జకాత్ అంటే దేశ ద్రోహులకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం కాదు. జకాత్ అంటే, ప్రతి ముస్లిం తాను సంపాదించిన దాంట్లో రెండున్నర శాతాన్ని పేదసాదలకు దానం చేయడం. ఇంక మదరసాలు అంటావా. వాటిల్లో వాళ్ళ మత విద్య బోధిస్తారు అంతే. మన దేవుళ్ళను అవమానించడం అనేది నిజం కాదు.” సమాధానపరచడానికి ప్రయత్నించాడు నాయన.

“నువ్వు ఎన్నయినా చెప్పురా, ఈ తురకోళ్లని నమ్మకూడదు. గురూజీ గెట్టిగా చెప్పినాడీ మాట. ఏమే సుశీలా నిన్న ఆ సాయిబంగడి నుంచి మీ ఆయన తెచ్చిన సామాన్ల మూట ఇలా తేవే. సాయిబు ఎంత నమ్మకస్తుడో నీ మొగుడికి చూపిస్తా.” కోడలిని కేకేసింది అవ్వ.

“అవునవును, ఆ సామాన్లు ఈయనగారి ముందే విప్పితే తెలుస్తుంది, ఈయన నెత్తికి ఎక్కించుకుంటున్న సాయిబు మర్యాదస్తుడో, లేక నమ్మినవాళ్ళను నట్టేట్లో ముంచే రకమో.” రుసరుసలాడుతూ సామాన్ల మూట తెచ్చి నాయన ముందు ఉంచింది అమ్మ.

రాస్తున్న సాయికోటి పుస్తకం పక్కన పెట్టి వాలు కుర్చీలోంచి లేచి కింద కాళ్ళు చాపుకుని కూలబడింది అవ్వ. మూట విప్పి అందులోని సామాన్ల పొట్లాలు బయట పెట్టింది. కోన్ ఆకారంలో కాగితంలో చుట్టిన చింతపండు పొట్లం చేతిలోకి తీసుకుని దారం విప్పింది. బయట పడిన చింతపండు నాయన కళ్లముందు పెట్టి “చూడు, ఎంత నాసినంగా ఉండాదో.” అంది.

నాయనకే కాదు, నాకు కూడా అర్థం కాలేదు.. తెల్లగా నిగనిగలాడుతూ ఉండే ఆ పండు నాసినం ఎందుకైందో.

“బంగారంలాంటి పొండు, దీనికి ఏం తక్కవ?” కొంచెం జంకుతూనే అన్నాడు నాయన.

“నిజిమే, ఏం తక్కవ. చిటికిడు పొండుకు రొండుమూడు ఇత్తులు. ఈ ఇత్తులను పెరట్లో నాటుకుని చింతచెట్లు పెంచి పుట్లకు పుట్లు చింతపొండు పండించి తినీ, అమ్ముకోనీ మహారాజులై పోవచ్చు.” పొండు విచ్చదీసి నల్లటి చింతగింజలు ఏరేరి వీధిలో విసిరి వేస్తూ గయ్యిమంది అవ్వ.

“అత్తమ్మా, ఇదిగో ఈ కందిపప్పు చూడు.. ఎట్టా పురుగు పట్టిందో…” ఇంకో పొట్లం అప్పటికే విప్పిన అమ్మ, అవ్వ కళ్లముందు పెట్టింది.

“చూశావా ప్రకాశం, మీ అంగడి సాయిబు ఎంత మర్యాదస్తుడో. ఈ తురకోళ్ళ బుద్ధే అంత. నమ్మక ద్రోహం వాళ్ళ రక్తంలోనే ఉంటుంది. నీకు నువ్వు తెలుసుకోవు, నాబోటివాళ్ళం చెబితే వినవు. మన మతం, సంప్రదాయం ఎంత గొప్పవిరా. ఆ తురకోడి దగ్గర తెస్తావు కదరా సామాన్లు. ఈ మైల పడిన సామాన్లతో చేసే పదార్థాలు కడుపుకు కొట్టుకుంటున్నాను చూడు, నేనెంత పాపిష్టిదాన్ని…” అవ్వ ఎత్తుకుంది.

ఇక ఆమె నోరు ఆగదని తెలుసు. అందుకే, చల్లగా అక్కడినుంచీ జారుకున్నాడు నాయన.

“ఏమండీ, టీ తాగి వెళ్ళండి…” అమ్మ పిలుస్తున్నా వినిపించుకోనుండా సైకిలు ఎక్కాడు. వెనుక క్యారేజీలో ఎప్పటిలాగే మడత పెట్టిన ఖాకీ సంచి ఉంది. పనేమీలేకున్నా అ పోవడం- అమ్మా, అవ్వల దాడినుంచి తప్పించుకోవడానికే అని నాకే కాదు, వాళ్ళిద్దరికీ కూడాన్ తెలుసు.

“హూ… అరిచి అరిచీ నా నోరు పోవడమే కానీ, వీడా తురకతో స్నేహితం మాత్రం వీడేది లేదు.” అస్త్రసన్యాసం చేసిన అవ్వ, మళ్ళీ వాలు కుర్చీ ఎక్కి సాయికోటి పుస్తకం అందుకుంది.

“నాయనా ఎందుకు ఇంత మొండిగా ఉంటావు? అవ్వా, అమ్మా చెప్పేది కూడా నిజమే కదా. ముస్లిం అని నాకు భేదభావమేమీ లేదుకానీ, ఆ అంగడి సాయిబు అన్నీ నాసిరకం సామాన్లు అంటగడుతున్నాడు మనకు. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నాడు. నువ్వు కూడా చూశావు కదా. అంగడి మార్చేద్దాం.” ఒకసారి ఇంట్లో ఇటువంటి తగువే జరిగినప్పుడు నేను నాయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను.

“మీకు ఇప్పుడు తెలియదురా…” అన్నాడు నాయన. మాకు తెలియనిది, నాయనకు మాత్రమే తెలిసినది ఏమిటో అప్పట్లో అర్థం కాలేదు నాకు.

ప్రాథమిక పాఠశాల బడిపంతులు అయిన నాయన, హైస్కూల్ టీచర్ గా ప్రమోషన్ కోసం ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు రాశాడు. తర్వాత ఇన్ సర్వీస్ కింద బీయీడీలో చేరి, వారానికి రెండు రోజులు తిరుపతిలో జరిగే క్లాసులకు హాజరయ్యేవాడు. ఆయనతోపాటు ఇంకో ఇద్దరుముగ్గురు స్నేహితులైన టీచర్లు కూడా. అలా ఒకరోజు తిరుపతి వెళ్ళిన నాయన సాయంత్రం చాలా పొద్దుపోతున్నా ఇంటికి రాలేదు. కంగారు పడిన అమ్మ, అవ్వ నన్ను సాయిబంగడికి తరిమారు. సాయంత్రం స్కూల్ వదిలిపెట్టాక ఆ అంగడివద్ద చాలామంది టీచర్లు కలిసి పిచ్చాపాటీ మాట్లాడుకోవడం అలవాటు. ఒక్కొక్కరు రెండుమూడు టీలు ఉఫ్ మని ఊదేసేవాళ్ళు. చాలాసార్లు నాయనే అన్నింటికీ డబ్బులు చెల్లించేవాడు. అందుకని సాయిబంగడికి వెళ్ళడం. అయితే అక్కడ మిగిలిన టీచర్లు ఉన్నారు కానీ, నాయన కనిపించలేదు. ఆయనతోపాటు తిరుపతి క్లాసులకు వెళ్ళే టీచర్లు కూడా లేరు. వాళ్ళెవరూ నాయన గురించి తెలియదన్నారు.  టీచర్లని కంగారుగా అడగడం చూసి కౌంటర్ లో ఉన్న అంగడి సాయిబు దగ్గరగా రమ్మని చేయి ఊపాడు. ఏవో లెక్కలు రాసుకుంటూ, ఎవరెవరో తెచ్చిన సామాన్ల లిస్టు చదివి, అంగట్లో ఉన్న ఇద్దరుముగ్గురు పిల్లోళ్ళ చేత పొట్లాలు కట్టిస్తూ చాలా బిజీగా ఉన్నాడాయన. నాయనతో ఉన్న స్నేహాన్ని, ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని నాసిరకం సామాన్లు అంటగడుతున్నాడని సాయిబుమీద నాకెందుకో ఒకరకమైన ద్వేషం. అయిష్టంగానే దగ్గరకు వెళ్ళాను.

“బాగుండారా సార్? నేనే మీ ఇంటికి పిల్లోడిని పంపదామని అనుకుంటున్నాను సార్. ఇంతలో మీరే వచ్చేశారు. టీ తాగండి.” తనముందు ఈగలు ముసురుతున్న టీ గ్లాసు ముందుకు తోశాడు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా, అప్పటికే సాయిబు వయసు యాభై కి పైనే అయినా నన్ను కూడా సార్ అనే పిలుస్తాడు ఆయన.

“వొద్దు నా. నాయనకోసరం వొచ్చినాను. ఇక్కడ ఉంటాడనుకున్నా, లేడు. ఇంకా తిరుపతి నుంచి రాలేదా నాయనోళ్ళు?” నాయన గురించిన సకల విషయాలు అంగడి సాయిబుకన్నా ఎక్కువగా తెలిసినోడు లేడు ఈ భూ ప్రపంచంలో. అందుకే అడిగాను.  అప్పట్లో మొబైల్స్ కాదుకదా, ల్యాండ్ ఫోన్స్ ఉండడం కూడా తక్కువే. అందుకే ఇంకా ఇంటికి చేరని నాయనకోసం ఈ ఆరాలు.

“ముందు ఈ నీళ్ళు తాగండి, చెప్తాను.” నన్ను ఎందుకో సంసిద్ధం చేస్తున్నట్టు పక్కనే పెట్టుకున్న గాజు సీసా ముందుకు జరిపాడు.

“వొద్దు నా, నాయన వచ్చాడా లేదా? వస్తే ఎక్కడున్నాడు? మీకు తెలిస్తే చెప్పండి.” ఆతృతగా అడిగాను.

“మీరు కంగారు పడొద్దు సారూ. నాయన తిరుపతి నుంచి వొచ్చేశాడు. కొంచెం జ్వరంగా ఉంటే కూడా ఉండే సార్లు హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు.” మెల్లగా చెప్పాడు అంగడి సాయిబు.

అంతే, నాకు అనుమానం ఎక్కువైపోయింది. జ్వరం కాదుకదా, నాయనకు ఇంతదాకా చిన్న జలుబు చేసింది కూడా నేను చూడలేదు. పైగా చిన్నచిన్న రోగాలకు లొంగి హాస్పిటల్ కు వెళ్ళే మనస్తత్వం కాదు.

“నిజం చెప్పునా. నాయనకు ఏమైంది? ఏ హాస్పిటల్ కు వెళ్లారు?” చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగాను.

“నాయనకు ఏమీ కాలేదు, మీరు భయపడకండి సారూ. ఆర్టీసీ బస్టాండు కాడ మన పౌర్ణవారి కండ్రిగ డాక్టర్ చంద్రశేఖర సార్ ఉండా, ఆయన దగ్గరికి తీసుకుని వెళ్లారు.” భుజం మీద చేయి వేసి సముదాయిస్తున్నట్లు చెప్పాడు.

ఇక ఒక్క క్షణం కూడా నిలవలేదు అక్కడ నేను. పరుగులు పెట్టాను హాస్పిటల్ ఉన్న దిక్కుకు. డాక్టర్ చంద్రశేఖర్ అంటే గుండె జబ్బుల డాక్టర్. నాకు ఒళ్ళంతా దడగా ఉంది.

నేను వెళ్ళేసరికి బెడ్ మీద నాయనను పడుకోబెట్టి ఈసీజీ తీస్తున్నారు. కొంచెం ఆయాస పడుతున్నాడు. పక్కనే ఒక ఫ్రెండు, ఆ గదికి ఇవతల ఇంకో ఫ్రెండు నిలుచుని ఉన్నారు.

నీరసంగా ఉన్న నాయనను చూస్తూనే నాకు దుఖం ముంచుకు వచ్చింది. అణచిపెట్టుకుని దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. నన్ను చూస్తూనే తన ఆయాసాన్ని అదుపు చేసుకుని అంతా బాగా ఉన్నట్టు కనిపించడానికి నాయన చేస్తున్న ప్రయత్నం అర్థమవుతోంది.

“ఏమైంది సార్?” అడిగాను, అక్కడే నిలబడివున్న నాయన ఫ్రెండును.

“ఏమీ కాలేదు నాయనా. కొంచెం…” నాయన చెప్పబోతుంటే నర్సు వారించింది.

నన్ను బయటకు తీసుకువచ్చి చెప్పాడు నెమ్మదిగా సార్, “టీ తాగుతుండగా గుండెల్లో నొప్పి అన్నాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందని, అదే పోతుందని చెప్పాడు. కానీ అయిదు నిమిషాలు గడిచేసరికి ఎక్కువైంది నొప్పి. తీసుకొచ్చి ఇక్కడ చేర్చాము.”

“ఏమీ లేదు, మైల్డ్ స్ట్రోక్ అంతే. మందులతో నయమైపోతుంది.” రాత్రికి తన ఛాంబర్ లో డిశ్చార్జ్ షీట్ రాస్తూ ధైర్యం చెప్పాడు డాక్టర్.

“పద వెళ్దాము.” పక్కనే ఉన్న నాయన ఫ్రెండు చెప్పి లేచాడు.

“సార్… హాస్పిటల్ బిల్లు…” సందిగ్ధంగా ఆగాను. అయినా సంపాదించి సంసారాన్ని పోషించేది నాయనే. ఈ పరిస్థితుల్లో ఆయనను ఎలా అడిగేది?

“అయిపోయింది లే, సర్దేశాము. ఏదైనా ఉంటే నాయనకు బాగయ్యాక చూసుకుందాం.” భుజం తట్టాడు ఇంకో సార్.

వీళ్ళు కదా నిజమైన స్నేహితులంటే. నాయన ప్రాణాల మీదికి వచ్చిందని తెలిసి కూడా కౌంటర్ నుంచి కదలకుండా, సంపాదనే ధ్యేయంగా బతికే అంగడి సాయిబు స్నేహితుడు ఎలా అవుతాడు? ఆరోజునుంచి సాయిబుపై ఏ మూలనో అంతోయింతో మిగిలివున్న మంచి అభిప్రాయం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.
*                                    *                                   *

ఆర్టీసీ బస్టాండు నుంచి కిందికి వెళ్ళే రోడ్డు మలుపులో ఒక పెద్ద మురుగు కాలువ మీద ఉండేది సాయిబంగడి. అంగడిముందు కాలువమీద పరిచిన బండరాళ్లపై ఉప్పు మూటలు, పొవ్వాకు చెక్కల తట్టలు, ఎర్రగడ్డల మూటలు ఉండేవి. ఒకరోజు నాయనకోసం అంగడికి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక జేసీబీ నిలబడివుంది. మూటలన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు కాలవల మీదకు వచ్చిన ఆక్రమణలు తొలగిస్తున్నారట. తన అంగడిదాకా వస్తుందని ఊహించనట్టు ఉన్నాడు సాయిబు. లుంగీలో ఉన్న సాయిబు, రెండు చేతులూ తలమీద పెట్టుకుని మోకాళ్ళు మడిచి గొంతు కూర్చుని ఉన్నాడు. ఆయన కళ్ళవెంట కన్నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయి. పద్దెనిమిదేళ్ల కొడుకు మున్సిపల్ అధికారులతో ఏదో వాదిస్తున్నాడు. నాయన కూడా ఆవేశంగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. అక్కడున్న మిగిలిన టీచర్లతో సహా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గుంపులుగా నిలబడి చోద్యం చూస్తున్నారు.

అప్పటికి డిగ్రీ అయిన నేను ఖాళీగా ఉన్నాను. నాయన ఆవేశం చూడగానే చిరాకు అనిపించింది నాకు. కాలవ ఆక్రమించి అంగడి కట్టింది సాయిబు. ఈయన అడ్డం పడడం ఏమిటి? పోనీ… అలా అడ్డం పడితే అధికారులు కూల్చకుండా ఆగుతారా?

గబగబా వెళ్ళి నాయన చేతిని పట్టుకుని ఈవలకు లాక్కుని వచ్చాను. “నీకెందుకు నాయనా. ఒక్క సాయిబు అంగడే కూలుస్తుండారా? టవునంతా జరగతానే ఉండాది కదా…” అసహనంగా అన్నాను.

“అదికాదురా? అన్యాయంగా కూల్చేస్తా ఉండారు. అదిగో అక్కడ చూసినావా… ఆ బిల్డింగు కూడా కాలవ మీదనే కదా ఉండాది. దాని జోలికి మాత్రం ఎందుకు వెళ్లడంలేదు వీళ్ళు?” అన్నాడు ఆవేశంగా.

నాయన చెప్పింది నిజమే. సాయిబంగడి ఎదురుగా రోడ్డుకు ఆపక్క, కొత్త బిల్డింగ్ పైకి లేస్తోంది. మూడు అంతస్తుల ఆ బిల్డింగులో పావు వంతు కాలవమీదనే ఉంది.

“అదంతా నీకెందుకు నాయనా? అయినా మనం ఆపితే ఆగుతుందా? అదిగో, పోలీసులు కూడా వస్తున్నారు. మళ్ళీ పెద్ద రచ్చ అవుతుందేమో. పద ఇంటికి వెళ్దాము.” చెప్పాను చేతిని పట్టుకుని లాగుతూ.

“లేదురా, నేను ఇప్పుడు రాను. ఇక గొడవ చేయను లే, నువ్వెళ్ళు. సాయిబు ఏమైపోతాడోనని భయంగా ఉండాది. తోడుగా ఉండి, ఇంటిదగ్గర దిగబెట్టి తర్వాత వస్తాను.” చేతిపట్టు విడిపించుకుని మళ్ళీ అంగడి దగ్గరికి వెళ్ళిపోయాడు.

తిరుపతిలో ఏదో చిన్న పని వెదుక్కుని వెళ్లిపోయాను నేను తర్వాత. రెండుమూడు నెలలు ఊరికి రానేలేదు. ఆపైన ఎప్పుడో రెండు రోజులు సెలవు దొరికితే బస్సులో వచ్చి సాయిబంగడి దగ్గరే దిగాను. అసలు గుర్తించడానికి వీలు కానంతగా మారిపోయింది ఆ ప్రాంతం. సర్కిల్ లో ఉండాల్సిన పెద్ద రావిచెట్టు లేదు. దానికి బదులుగా పెద్ద షాపింగ్ ఏరియా కనిపించింది. బిగ్ బజార్ అని రాసివున్న అక్షరాల మెరుపు కళ్ళల్లో గుచ్చుకుంది.

కాలువమీద మరో పెద్ద భవనం. దాని మూడంతస్తుల్లో విస్తరించిన రిలయన్స్ మార్ట్ స్మార్ట్ బజార్.

దానికి ఎదురుగా ఇటువైపు బిక్కుబిక్కుమంటూ సగం కూలిన సాయిబంగడి. అక్కడక్కడా మరమ్మతులు చేసి అందులోనే ఇంకా అంగడిని నడుపుతున్నాడు సాయిబు.

“నా దగ్గర ఇవే ఉన్నాయి సాయిబూ. రేపు నెలలో అప్పు పూర్తిగా తీర్చేస్తాను.” చెబుతున్నాడు నాయన నేను వెళ్ళేసరికి.

“ఫరవాలేదు సార్. మీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతాయి. నేనుమాత్రం మీకు నాణ్యమైన సామాన్లు కడుతున్నానా? పెద్దగా పెట్టుబడి పెట్టే స్తోమతు లేక, ఏదో నా శక్తిమేరకు మూడవరకం సామాన్లు కదా కొంచెం తక్కువ ధరకు ఇస్తున్నాను. మీరు మంచివాళ్ళు కాబట్టి, ఏళ్లతరబడి నా దగ్గరే కొంటున్నారు. ఆ నమ్మకం చాలు నాకు.” డబ్బులు చేతికి తీసుకుంటూ నాయన చేతులను గట్టిగా పట్టుకుని అంటున్నాడు అంగడి సాయిబు.

*                                    *                                       *

బతుకు తెరువుకోసం భార్యాబిడ్డలతో సహా దేశాలు పట్టుకొని వెళ్ళిన నాకు, ఒకరోజు ఇంటినుంచి ఫోన్ వచ్చింది. నాయనకు హార్ట్ ఎటాక్, సీరియస్ గా ఉన్నదని దాని సారాంశం. మేము వెళ్ళేసరికి ఐసీయూలో ఉన్నాడు నాయన. అమ్మా, ఇంకా దగ్గరి బంధువులు ముగ్గురు నలుగురు బయటే కనిపించారు. మమ్మల్ని చూస్తూనే గబగబా వచ్చి నా భుజాలమీద వాలిపోయి భోరుమంది అమ్మ. ఇంకా చిన్నవాళ్ళైన మా పిల్లలు ఇద్దరినీ ఎవరో బయటకు తీసుకుని వెళ్లారు.

“ఊరుకోండి అత్తయ్యా. మామయ్యగారికి బాగయిపోతుంది. అంతా మంచే జరుగుతుంది.” ఊరడిస్తోంది ధన్య.

“మేము వచ్చేశాముగా అమ్మా, నాయనకు ఏమీ కాదు. నేను చూసుకుంటాను.” లేని ధైర్యాని ఇవ్వడం సాధ్యం కావడంలేదు నాకు.

మెల్లగా అమ్మ చెయ్యి విడిపించుకుని ఏదో పని ఉన్నట్టు కౌంటర్ వైపు వెళ్ళాను. వెనుకే వచ్చారు అక్కడున్న బంధువుల్లో ఇద్దరు.

“బిల్లు ఎంత అయింది మామయ్యా?” అడిగాను.

“ఇంకా పూర్తి బిల్లు చెప్పలేదు కానీ, ఇప్పటిదాకా లక్ష అయింది సుమారు.” చెప్పాడు.

“ఏం చేశారు?”

“మీ అమ్మే ఇచ్చింది యాభై వేలు. మిగిలింది మీ నాయన ఫ్రెండ్స్ ఉన్నారుగా ఆ ఇద్దరు టీచర్లు, వాళ్ళు సర్దారు.”

కొంచెం ఊరట కలిగింది ఆ మాటలు వింటూనే.

అదే రోజు రాత్రి నాయనకు ఆపరేషన్ చేశారు. పరిస్థితి కొంచెం మెరుగు కావడంతో రెండు రోజుల తర్వాత జనరల్ వార్డుకు మార్చారు.

“ఇలా రారా నాయనా.” బెడ్ కు దూరంగా కూర్చున్న నన్ను పిలిచాడు నాయన, ఆ మధ్యాహ్నం పూట. అన్నిరోజులూ హాస్పిటల్లోనే ఉన్న అమ్మ, స్నానం చేసి రావడానికి ఇంటికి వెళ్ళివుంది.

నాయన పక్కనే బెడ్ మీద కూర్చున్నాను. నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు నాయన.

“అంగడి సాయిబు ఎలా ఉన్నాడురా?” అడిగాడు.

నాయనకు ఇంత అనారోగ్యమై, ఆపరేషన్ కూడా జరిగింది. చచ్చి బతికాడు. అయినా ఇటు తొంగి చూడలేదు, ఆ సాయిబు. ఈయన మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకోగానే ఆయనగారి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు. కోపం ముంచుకొచ్చింది. అయితే అది ప్రదర్శించడానికి ఇది తగిన సమయం కాదు.

“ఆయనకేం, గుండ్రాయిలా ఉన్నాడు.” చెప్పాను.

“నీకు తెలీదు…” గొణిగాడు నాయన. ఆయనకు అర్థమైపోయిందేమో, నా కోపం.

“సరే, నాకు తెలీదు. మీ అంగడి సాయిబు గొప్ప స్నేహితుడు సరేనా. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు.” సాధ్యమైనంత నెమ్మదిగా అన్నాను.

“సరే, మాట్లాడను. కానీ నాకు ఇది రెండోసారి స్ట్రోక్ రావడం. ఆపరేషన్ అయిందికానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆలోగా నీకు కొన్ని విషయాలు చెప్పాలి.”

“సరే, రెండుమూడు రోజుల తర్వత చెబుదువులే నాయనా. ఇప్పుడు కామ్ గా రెస్టు తీసుకో.”

“లేదు, ఇప్పుడే చెప్పాలి. మళ్ళీ నాకు సమయం మిగిలి ఉంటుందో లేదో, జాగ్రత్తగా విను. ఇంట్లో అటకమీద గోతాముపట్ట ఒకటి చుట్టి ఉంటాది. దాంట్లో యాభైవేల కట్టలు రెండు ఉండాయి. నేను ఉన్నట్టుండి హాస్పిటల్ పాలు కావడంతో ఆ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేకపోయాను. డబ్బు కట్టల్లో ఒకటి వెంకటేష్ సారు ఉండా, ఆయనకు ఇవ్వు. రెండో యాభై వేలు అంగడి సాయిబుకు చేర్చు. సాయిబు అప్పట్లో మొదటిసారి స్ట్రోక్ వచ్చినప్పుడు సాయం చేశాడు. మునిగిపోతూ కూడా ఇప్పుడు సైతం సార్ దగ్గర పాతిక వేలు పంపించాడు.”

అవే నాయన చివరి మాటలు. అదేరోజు రాత్రి సివియర్ స్ట్రోక్ రావడంతో ఆయనను డాక్టర్లు కాపాడలేకపోయారు.

నాయన చెప్పినట్లు అటకమీద గోతాము పట్టలో రెండు యాభైవేల నోట్ల కట్టలు ఉన్నాయి. వాటిని చూస్తూనే ముందుగా నాయన… ఆయన వెనుక, కౌంటర్లో లెక్కలు చూసుకంటున్న అంగడి సాయిబు గుర్తుకు వచ్చారు. ఎంత అపార్థం చేసుకున్నాను అంగడి సాయిబును… అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

అయితే సాయిబుకే కాదు, వెంకటేష్ సారుకు కూడా మూడునాలుగు నెలలదాకా డబ్బులు చేర్చలేక పోయాను. కర్మక్రియలతో సహా ఖర్చులమీద ఖర్చులు మీద వచ్చి పడ్డాయి. మధ్యలో వెంకటేష్ సార్ ఏదో ఇబ్బంది అని ఆడగలేక అడిగితే వేరేచోట అప్పుచేసి యాభైవేలు తీర్చేశాను. అంగడి సాయిబు బాకీ అలాగే ఉంది. అలాగని ఎప్పుడూ సాయిబు ఇంటికి రావడం కానీ, డబ్బులు అడగడం కానీ చేయలేదు. అసలు తాను నాయనకు అప్పు ఇచ్చినట్టు కూడా నాకు కాదుకదా, వేరేవరికీ చెప్పలేదు. నేను కూడా ఊళ్ళో పనులు ముగిసిన అయిదు రోజులకే భార్యాపిల్లలతో సహా పనిచేస్తున్న ఊరికి వెళ్లిపోయాను.

ఎప్పుడో నాయన బ్యాంకులో లక్ష రూపాయలకు చేసిన డిపాజిట్ చేసిన పత్రాలు బయటపడినప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకు ఇచ్చిన మాట. ఆ పత్రాలను క్యాష్ చేసుకోవడానికి స్వంత ఊరికి వచ్చాను.

మరుసటి రోజు ఊరునుంచి తిరిగి వెళ్లిపోతూ సాయిబంగడి దిక్కు వెళ్ళాను, యాభైవేలు పట్టుకుని.

అంగడి లేదక్కడ, దాని స్థానంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లేచింది. ముందున్న కాలువను పూర్తిగా ఆక్రమించుకుని ఉంది బిల్డింగ్.

“ఇక్కడ ఒక చిల్లర అంగడి ఉండాలి, అదేమైంది?” అడిగాను ఆ షాప్ కౌంటర్లో ఉన్న వ్యక్తిని.

“రెండు నెలల క్రితమే అంగడిని కూల్చి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాము.” చెప్పాడు.

“మరి అంగడి సాయిబు? ఆయనేమయ్యాడు?”

“అంగడి సాయిబా? ఓ… మునీర్ బాషానా? అదిగో అక్కడున్నాడు చూడండి.”

ఆయన చూపించిన దిక్కు చూశాను. రిలయన్స్ స్మార్ట్ బజార్ ముందున్న ఫుట్పాత్ మీద ఒక వారగా రెండుమూడు అరటి పండ్ల బండ్లు కనిపించాయి.

అంగడి సాయిబు ఇక్కడ ఎందుకుంటాడు?

సందేహిస్తూనే కొంచెం పరిశీలనగా చూశాను. ఒక బండి వెనుక కూర్చున్న బక్కపలచటి టోపీవాలా ఏదో గిరాకీ వస్తే పైకి లేచాడు.

దాదాపు నాయన వయసులో ఉన్నాడు. నెత్తిమీద తెల్లటి టోపీ. ఎడమ బుగ్గమీద మిరియం గింజంత ఉలిపిరి, వక్కాకు వేసివేసి ఎర్రబారిన పళ్ళు, పెదాలు, లోతుకుపోయిన బుగ్గలు, బుర్ర ముక్కు, పొట్టిగా, పీలగా, ఎముకలు బయటపడి… అంగడి సాయిబే. గబగబా వెళ్ళి బండి ముందు నిలబడ్డాను.

“ఎన్ని డజన్లు కావాలి సార్. కలకండ తీపి. ఒక పండు తిని చూడండి.” అరటి పండ్ల చీపు లోనుంచి పండు ఒకటి తుంచబోయాడు.

“వొద్దు నా, బాగుండావా నా?” పలుకరించాను ఆప్యాయంగా, చేతిని గట్టిగా పట్టుకుని నొక్కుతూ.

“ఎవరు సార్ మీరు?” అడిగాడు చేతిని కనుబొమల మీద ఏటవాలుగా పెట్టి ఎగజూస్తూ.

“నేను నా, నాదముని సార్ కొడుకు గోపీని.” చెప్పాను.

“సారూ, మీరా? అమ్మా, పిల్లలూ అంతా బాగా ఉండారా సార్? చాలాకాలమైంది మిమ్మల్ని చూసి. క్షమించాలి సార్. నాయనకు అంత బాగలేకపోయినా రాలేకపొయ్యాను. అంగడి అమ్మకాల్లో ఉందాది అప్పుడు. బతుకు ఆగమైపోయింది. సారును కడసూపు కూడా చూడలేక పొయ్యినాను.” చెబుతున్న అంగడి సాయిబు కళ్ళనిండా తడి.

“ఎవరేమి చేస్తారు లేనా… అంతా తలరాత. సారీ నా, ఖర్చులు వచ్చి మీద పడిపోవడంతో తొందరగా ఇవ్వలేకపోయాను. ఇదిగో తీసుకో నా.” కాగితంలో పొట్లం కట్టి, ప్లాస్టిక్ కవర్లో చుట్టిన కట్ట చేతికి అందించాను.

“ఏంది సారూ ఇదీ?” అడిగాడు సంశయంగా అందుకుంటూ.

“యాభై వేలు నా. మీరు నాయనకు అప్పుగా ఇచ్చింది. అవసరంలో ఉన్నప్పుడు చాలా ఆదుకున్నారు. మీకు చాలా థ్యాంక్స్. ఇదిగో ఈ అయిదువేలు కూడా ఉంచుకోండి, వడ్డీ అనుకోండి.” మరికొన్ని అయిదువందల నోట్లు చేతిలో పెట్టబోయాను.

“క్షమించాలి సార్, వద్దు. అల్లా వడ్డీకి అప్పు ఇవ్వడాన్ని ఒప్పుకోడు. అది పాపం. నేను కాకపోతే ఇంకెవరో సాయం చేసేవాళ్ళు. సారు మంచివాళ్ళు సార్. మంచివాళ్లను దేవుడు ముందుగానే తీసుకు వెళ్ళిపోతాడు. సారు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా చూస్తాడు.” తిరస్కరించాడు సాయిబు. మనసు నిండా దీవించాడు.

అప్పుడే నేను ఊరికి వెళ్లాల్సిన బస్సు వచ్చి ఆగింది పక్కనే, ట్రాఫిక్ స్తంభించడంతో.

“వస్తాను నా, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తాను.” చెప్పి బస్సు ఎక్కబోతున్న నా చేతిలో హడావుడిగా కాగితంలో చుట్టిన డజనుపైగా అరటిపండ్లు పెట్టాడు సాయిబు.

“అల్లా మిమ్మల్ని చల్లగా చూడాల.” దీవించాడు రెండు చేతులూ పైకెత్తి.

అంగడి సాయిబు నెత్తిమీద ఇంతెత్తున లేచిన రిలయన్స్ స్మార్ట్ బజార్ బిల్డింగ్ నీడ, అక్కడున్న మిగలిన చిన్నాచితకా అంగళ్లను క్రమేణా ఆక్రమిస్తోంది.

ఈ నీడలు, ఇంకా ఎన్ని ‘సాయిబంగళ్ళ’ను కూల్చేస్తాయో…

ఆలోచనల మధ్య బస్సు ముందుకు కదిలింది.

*

చిత్రం: సృజన్ రాజ్ 

చిట్టత్తూరు మునిగోపాల్

పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం అనే చిన్న గ్రామం. చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిత్వం. సుదీర్ఘకాల సాహిత్య పఠనమే నన్ను రచనలవైపు మళ్లించింది. రచనలు చేయడం ఈమధ్య కొన్నేళ్ళ నుంచే. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో రచనలు ప్రచురితం.

4 comments

Leave a Reply to చిట్టత్తూరు మునిగోపాల్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టిన కథ. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న తీరును కథలో చక్కగా చెప్పారు. ఒకవైపు కార్పోటీకరణ, మరోపక్క మతంతో దేశంలోని పరిస్థితులు ఇలాగే దిగజారిపోతున్నాయి. మంచి కథ రాసిన చిట్టత్తూరు మునిగోపాల్ గారికి అభినందనలు.

  • కథ చాలా బాగుంది..‌ ముఖ్యంగా.. ఎత్తుగడ…

    దానిని చాలా బలంగా వ్రాశారు..

    తర్వాతి..కథ మాత్రం… డ్రమెటిగ్గా సాగింది..

    ఇంకొంచెం సాయిబు జీవితం మీద ఫోకస్ పెట్టి ఉంటే.. మొదటి ప్రశ్నలకు సమాధానం చెప్పేట్లుగా…
    ఇంకా బాగుండేది..
    ఈ ఉక్కపోతలకాలంలో.. కాస్త నీడ

    • మీ విలువైన సమీక్షకు ధన్యవాదాలు సార్ 🙏

      ఈ కథలో ముప్పావు వంతు మా నాన్న జీవితమే ఉంది. జీవితం కంటే డ్రామా ఏదీ లేదనుకొంటాను. మీకు తెలియనిది ఏముంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు