సాగర్ టూర్

  మా ఇంటికి ఎదురుంగ మసీదు పక్కనే ఉన్న మా చిన్న క్రికెట్ గ్రౌండ్‌ల మేం బానే ఆడుకుంటంగానీ – ఎప్పుడన్న ఒక్కసారి ఆదివారం పూట అట్ల – “మనం ఏమన్న చిన్నపిల్లలమారా?” అని అప్పటికప్పుడు బుద్ధివుడితే కట్టకాడికి పోయి ఆడేది. పెద్ద కట్ట అంటే మా గ్రౌండుకి ఎన్నింతలు పెద్దగుంటదో చెప్పలేను.. అంత ఉంటది! బాల్ పోయి కంపచెట్లల్ల పడుడు, మోర్ల పడుడు ఉండది. ఎటుగొట్టినా గ్రౌండే.

కట్టకి ఇవతల మొత్తం పాతబస్తీ ఉంటదా, అవతల మొత్తం హౌజింగ్ బోర్డు కాలనీ.. అంటే మా అక్కోళ్ల ఇల్లు అటుసైడే. ఈ మధ్యల కొన్ని గోరీలు ఉంటయి, ఈద్గాగూడ అటు పక్కన్నే ఉంటది. కొండ చెల్మ బాయి కానించి కట్టకాడికి పోతానికి కంప చెట్లల్ల మధ్యల్నే ఒక సన్నటి దారి ఉంటది. అట్నుంచిపోతే గాలి సోకుతదని.. గోరీలకాడ దయ్యాలుంటయని పంపరు. రోడ్డుమీదినించే పోతే పెద్ద కట్ట చానా దూరం. క్రికెట్ ఆడుతానికి మా పిల్లల్ని కట్టకాడికి ఎందుకు పంపకపోయేదంటే.. ఈ కొండచెల్మ బాయి కాడ్నించే పోతరని. సరే, ఒక ఆదివారం ఎట్లనో ఒప్పిచ్చి సైకిళ్ల మీద పోతమని కట్టికాడ ఆడుతానికి పోయినం.

నేను సాయికిరణ్ గాని సైకిల్ ఎక్కిన. మా దోస్తులల్ల వానంత తీటోడు ఇంకోడు ఉండడు. అప్పటికీ భయపడుకుంటనే వాని సైకిల్ ఎక్కిన. సందులు బొందులల్ల తీస్కపోయి ఒక గడ్డ ఎక్కించేకాడ స్పీడు పెంచిండు.. నేను ఆ..ఆ.. అట్ల ఎగిరి ఒక్కసారే కిందవడ్డ. మోకాలు చిప్పకు, అరికాలికి దెబ్బతాకింది. చిన్నగ రక్తంగూడ కారుతున్నది. ఏం జెయ్యాల్నో తెల్వక అటు ఇటుజూసి హౌజింగ్ బోర్డ్ దిక్కు పోయినం.

మా అక్క ఇంటికేపోతే పసుపో ఏదో రాస్తదిగానీ – “ఈందాక ఎందుకొచ్చిర్రా అసలు?” అని కొట్టినా కొడ్తదని అక్కకాడికి పోలే. ఆ దార్ల పడి పోతుంటే ఒకాయన ఎవలో మమ్ముల ఆపిండు. ఆరెంపీ డాక్టరంట. అప్పటికప్పుడు ఆ దెబ్బకు మందు రాసి పంపిచ్చిండు. ఇగ ఎట్లనో చేసి ఇంట్ల పడ్డదాంక వచ్చినం.

ఇంటికొచ్చినంక మా అమ్మతోటి తిట్లు తినేది ఎట్లనైనా ఉండేదేగానీ – ఆ దెబ్బ నా మీద ఇంకో దెబ్బ కొట్టింది. అదేంటంటే.. సాగర్ టూర్. నల్లగొండల ఉన్నోళ్లకు టూరంటే పుణ్యక్షేత్రాలు.. లేకుంటే ఈ నాగార్జున సాగర్. అంటే అందరి సంగతి ఇట్లనే ఉంటదనిగాదూ.. నాకు తెల్శినకాడికైతే టూరంటే సాగరే. అట్ల మా స్కూల్లగూడ తీస్కపోక తీస్కపోక ఎస్కర్షన్‌కి అని సాగర్‌కే తీస్కపోవుడు వింతేం గాదు!

మామూలుగనైతే ఇట్లాంటివాటికి పైసల్లేవని ఇంట్ల చెప్పకుంట నేనే రానని అనేటోడ్ని. ఆసారి ఎందుకనో మా అమ్మ పైసలున్నయని చెప్పింది. చిన్నక్కను పొమ్మన్నది, నా కాడికొస్తాలికల్ల – “నడ్వనీకే వస్తలేదు.. ఎట్లపోతవులేరా?” అన్నది.

ఇగ అయ్యాలంతా ఒకటే బాధ.. ఈ బాడ్కావులంత మంచిగ టూర్ ఎంజాయ్ చేస్తున్నరు, నేనేమో ఇక్కడ నొప్పులు పడుకుంట కూసున్న అని. పోయినోళ్లు వచ్చి ఊకనే ఉంటరా? ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగ కథలు చెప్పుడు. ఇగ అప్పట్నించి మనసుల పడ్డది.. ’ఎట్లనన్నజేసి సాగర్ చూస్తానికి పోవాలి’.

స్కూల్లనే మళ్లొకసారి సాగర్‌కి తీస్కపోయిన్రు, అప్పుడు పోలే. హైద్రాబాద్ తీస్కపోయిన్రు.. అప్పుడుగూడ పోలే. అసలు స్కూల్ల ఎస్కర్షన్‌కి పోవుడన్నది ఎర్కలేదునాకు. స్కూలనే కాకున్నా మామూలుగనైనా నేను చిన్నప్పుడు వేరే ఊర్లు చూసింది లేదు. ఆ మాటకొస్తే నల్లగొండ జిల్లా దాటిందే లేదు.

ఒక ఏడు ఫుల్లుగ వానలు పడి సాగర్ గేట్లన్నీ ఎత్తేసిన్రని వార్తొచ్చింది. అప్పటికి మేం కొంచెం పెద్ద పిల్లలమే. మా రాంబాబుగాడైతే ఏకంగ సొంతంగ ఒక ఓపెన్ టాప్ ఆటోగూడ నడుపుకుంటున్నడు అప్పటికే. వాని ఆటోల సాగర్‌కి పోదామనుకున్నం. తలా ఇన్ని పైసలేస్కొని స్టార్టయినం.

ఆ చిన్న ఆటోలనే తొమ్మిది పది మంది దాంక ఎక్కినం. సాయికిరణ్ వాళ్లమ్మయితే.. “ఈళ్లందరి పానాలు నీ చేతుల ఉన్నయి బిడ్డా” అని బార్డర్‌కి పంపిస్తున్నట్టు చెప్పింది. డ్యామ్‌కి మూణ్నాలుగు కిలోమీటర్ల ఇవతల్నించే బండ్లన్నీ ఆగిపోయినయి. అంత మంది జనం. అంత మంది జనంలగూడ నీళ్లు అంతెత్తునించి ఎగిరిపడుతుంటే మనుషులు చేస్తున్నది సప్పుడు కానట్టే ఉన్నది. మొత్తానికైతే సాగర్ చూశి ఇంట్ల పడ్డం. కాకపోతే అంతమంది జనాల మధ్యన ఉరుక్కుంట పోయి చూసినట్టే అయ్యింది. నా కండ్లద్దాలుగూడ పోయినయి.

ఇది అసలు కథ కాదుగానీ.. ఇంకోసారెప్పుడో మళ్ల బుద్ధివుట్టి “సాగర్ పోదాంరా” అనుకున్నం. “అవున్రా.. వెంకన్నగాడు బండి పట్టుకొస్తడు” అని ప్లాన్ గీసిండు సాయికిరణ్ గాడు. ఇట్లాంటివాటిల్ల వాడు ముందుంటడు. అబ్బుగాడు, నేను, ఆరిఫ్ గాడు, రాజు మామ, విశ్వరూపం గాడు.. ఇంతమందిమి ఒక్క కారుల పోదామని ప్లాన్ పెట్టుకున్నం.

అందరిండ్లల్ల సరే అంటరుగానీ, విశ్వరూపంగానికే తలకాయనొప్పి. ఈడు క్రికెట్ ఆడుతానికి వస్తేనే ఉరికిచ్చి కొట్టే రకం వాళ్ల నాన్న. టూరంటే ఏమన్న ఉందా? ఫోన్ చేసి చెప్పినం. చానాసేపు ఏవేవో ప్రశ్నలు అడిగి పంపిస్తా అన్నడు. అయితే ఒక్క మాటన్నడు – “నువ్వున్నవన్న నమ్మకంతోటి పంపిస్తున్న”. మనకున్న పేరు అసొంటిది!

తలా ఎన్ని పైసలైతయో లెక్కలేసుకున్నం. చికన్, గోధుమ రొట్టెలు వండుకొని పోవాల్నని అనుకున్నం. ఎవలొండి పెట్టాలి మరి? మా అమ్మనే.

మా అమ్మ వంట గురించి చెప్పాల్నంటే ఇంకో కథ రాయాలి. ఎట్లాంటిది వండి పెట్టమన్నా పెడుతది. మా ఇంటికి దగ్గర్ల ఉన్న ముస్లిమోళ్లకు పండుగలప్పుడు అప్పలు పంపిస్తే వాళ్లు మా అమ్మని ఇంటికి పిలిపిచ్చుకొని వండిపెట్టమని బతిలాడుకునేది.  మా ఇంటికాడ శీనన్న బంగ్లాల ఒక బెంగాలాయన ఉండేది. ఒక్కడే ఉండేటోడు, ఔసల పనిచేసుకునేటోడు. మాతోటి ఆయనకి రోజువారీ మాటలేం లేకుండేది. ఆయనేం మా షాపులకొచ్చి కొనుక్కపోయేటోడుగూడ కాదు. కానీ ఎప్పుడన్న కలిస్తే మంచిగ మాట్లాడుకునేది. ఈ మనిషి ఏ ఆరు నెల్లకో ఏడాదికో సొంత ఊరికి పొయ్యేది రైల్ల. రెండు రోజులు అనుకుంట ప్రయాణం. ఆయన ఊరికి పోతప్పుడల్లా.. అప్పుడే పట్టిచ్చిన గోధుమ పిండి, నూనె, వంటకు కావాల్సిన పప్పులు, ఉప్పులు, కూరకు ఆలుగడ్డలు తెచ్చి అమ్మకు ఇచ్చేటోడు. మా అమ్మ మంచిగ రొట్టెలు చేసి, ఆలుగడ్డ ఫ్రై వండి బాక్సులల్ల పెట్టిచ్చేది. రైల్ల పోతప్పుడు బయట ఏం తినకుండ.. మా అమ్మతోటి వండిచ్చుకపోయినయే తినేదంట. ఆయన ఎప్పుడు ఊరికి పోయేదున్నా మా అమ్మకు ఈ పని తప్పేదిగాదు. అట్ల అని ఏం గులగకుండనే చేసిచ్చేది. ఆయన నల్లగొండల ఉన్నన్ని రోజులు దీన్నొక ఆచారం లెక్క ఫాలో అయ్యిండు.

అట్ల ఎవలో అడిగితేనే చేసిపెట్టే మా అమ్మ.. మేం అడిగితే చెయ్యదా? సాగర్ పోతున్నమని మేం గూడ అమ్మతోటే రొట్టెలు, చికెన్ చేపిచ్చినం. రొట్టెలు పేపర్ల చుట్టుకున్నం, చికెన్ కోసమని మా నాన్న ఆ మధ్యల్నే ఎప్పుడో కొన్న ఒక స్టీల్ గిన్నె బయటికి తీసినం. సాగర్ నేను ఫస్ట్ టైమ్  పోయినప్పటిలెక్క లేదు. నిమ్మలంగ ఉంది. జనం లేరు. డ్యామ్‌కి దగ్గర్ల ఒక చెట్టు కింద కూసొని మంచిగ తిన్నం. అరిగేదాంక తిరిగినం. నీళ్లల్ల ఆడుకున్నం. అట్ల ఆడుకుంటున్నప్పుడే – “చీకటి పడకముందల్నే ఇంట్ల పడాలిరా” అన్నడు వెంకన్నగాడు.

“తొందర దేనికిరా?” అని మేమంటే –

“అట్ల కాదులేరా.. అద్దం ఖరాబైంది.. లైట్లు పడితే కష్టం” అన్నడు. అట్లనే నాలుగున్నరకే కారెక్కి కూసున్నం.

ఆ కారు సాగర్ గుట్ట మీదికెల్లి చిన్నగ దిగుతున్నది. అంతసేపు పెట్టుకున్న పాటలుగూడ ఎవడో ఆపమన్నడు. రెండు మూడు మలుపులు తిరిగితే కింద ఉంటం. అగో సరిగ్గ అప్పుడే – ఏం పుట్టిందో ఏమో బండి స్పీడు పెరిగింది.

“ఏమాయెరా వెంకన్నా” అంటనే ఉన్నం.. క్షణాలల్ల ముందల రోడ్డుకి అడ్డంగ ఏదో కారు ఆగింది. దాన్ని ఇట్ల చూస్తుండగనే దబ్బని గుద్దింది మా బండి. ఆ ఊపుకి మేమందరం సచ్చినమనే అనుకున్నం.

ముందలున్నోళ్లకు అద్దాలేమో గట్టిగనే తగిలినైగానీ, మేం ఎన్క కూసునోళ్లం ఎగిరి అట్లనే కూసున్నకాడనే పడ్డం. అందరికీ చిన్న చిన్న దెబ్బలే. బండి దిగి చూస్తే ముందలంతా తుక్కు తుక్కు అయ్యింది. ఆ ముందలి కారోడు వచ్చి మా అందరిమీద గట్టిగ అర్శిండు. “పిల్లల్లెక్క ఉన్నరు.. ఏందిరా ఇది? పా పోలీస్‌స్టేషన్‌కి పోదాం” అని ఫోన్ చేస్తనే ఉన్నడు. కార్ల ఇంతమందిమి ఉన్నమంటే అందరికీ పడ్తయని నన్ను, విశ్వరూపంగాడ్ని అక్కడ్నే ఆగమన్నరు. వాళ్లు మాత్రం ఆ పాడైన కార్లనే వెనుకకి.. అంటే పోలీస్‌స్టేషన్‌కి పోయిన్రు.

చిన్నగ చీకటి పడుతున్నది. ఎటుచూసినా జనాల్లేరు. పులులు, మొసళ్లు ఉంటయని పెద్ద పెద్ద బోర్డ్‌లు. అది అసలే రోడ్డు మధ్యల. అటు ఇటు అడివేనాయె. వెనుకకి పోదామా.. వాళ్లొస్తరేమో. పోనీ ఇక్కడ్నే ఉందామంటే చీకటి పడుతుండె. మాకాడ ఫోన్‌గూడ లేకపాయె. మా ఇద్దరికి వణుకుడు మొదలైంది.

“మా నాయన ఫోన్ చేస్తున్నాలెరా ఈపాటికి” అంటున్నడు విశ్వరూపంగాడు. ఆడ పోలీస్‌స్టేషన్‌ల ఏమైతున్నదో!

ఏదయితే అదయిందని ఒక ఆటో ఆపుతానికి చూస్తున్నం. అప్పుడే ఈ సాయికిరణ్ గాడు ఇంకో ఆటోల నించి దిగి – “పైకే పోదాం పారా” అని ఇంకో ఆటో ఎక్కిచ్చి పోలీస్‌స్టేషన్ కాడికే తీస్కపోయిండు.

అందరం బస్టాండ్ కాడనే నిలబడ్డం. వెంకన్నగాడు పోలీసులతోటి మాట్లాడుతున్నడు. వాళ్ల సేఠ్‌తోటి మాట్లాడిస్తున్నడు.

ఇంటికాడ్నించేమో ఫోన్ల మీద ఫోన్లు. విశ్వరూపం వాళ్ల నాన్న సంగతి తెల్సిందేగా.. పైగా నమ్మకం మీద పంపించిండాయె.. వాడ్ని ఎమ్మటే బస్సెక్కిచ్చి పంపిచ్చినం. వెంకన్నగాడు ఇగొస్తున్న.. ఇగొస్తున్న అని తిరుగుతున్నడు.

జెరసేపటికి మాకాడికొచ్చి – “అరే.. ఇది ఏ రాత్రికి అయితదోగానీ మీరైతే పోండ్రి.. ఇట్లాంటియి మాకు అయితనే ఉంటయి” అన్నడు. “మేం ఉంటంలేరా!” అన్నంగానీ ఉండి మాత్రం ఏం చేస్తం? అని పోదామనే అనుకున్నం.

బస్సు వస్తదని నిలబడ్డం. అయితే ఆ విశ్వరూపంగాడ్ని ఎక్కిచ్చిందే లాస్టు బస్సంట.

ఎట్లరా దేవుడా అనుకుంట ఏదో ఆటోల ఇరికి కూసున్నం. అది హాలియా దాంక పోదంట. మధ్యల్నే వదిలేసిండు. హాలియా దాంక పోతే ఏదోకటి చెయ్యొచ్చుగానీ ఆందాంక ఎట్ల పోతం? చిమ్మ చీకటి. అటుఇటుగ పది కిలోమీటర్లయిన ఉంటది. సరిపోనట్టు.. చిన్నగ మొదలైన వాన పెద్దగైంది. ఎటూపోతానికి లేదు. ఆ వానల, ఆ చీకట్ల నడుసుకుంటనే హాలియా దిక్కు పోతున్నం. మధ్యల ఏదో బ్రిడ్జి కడుతున్నరు. పక్కనించి పోతానికి ఏదో దారున్నది. ఆ దార్ల ఆ బ్రిడ్జిని ఎట్ల దాటినమో.. అప్పటికే అలిసిపోయి ఉండిగూడ అన్ని కిలోమీటర్లు ఎట్ల నడ్శినమోగానీ.. హాలియాకైతే చేరినం. ఆనించిగూడ నల్లగొండకు పొయ్యే బండ్లు లేవు.

“మిర్యాలగూడల దిగిపోదురు ఏమైతది?” అని ఒక లారీ ఆయన అందర్నీ ఎక్కించుకున్నడు. మా అవతారాలు, కథ చూసి ఏమనుకున్నడో.. నిమ్మలంగ పోనిచ్చిండు లారీ. మిర్యాలగూడ బస్టాండుల దిగుడు దిగుడే.. నల్లగొండ బస్సెకి కూసొని టికెట్ తీస్కొని కండ్లు మూసుకున్నమా.. నల్లగొండ బస్టాండ్‌ల దిగినంక తెర్శినం.

పానం లేచొచ్చింది అప్పటికే. ఇంట్లనించి ఫోన్లు వస్తుంటే – “బండి పంచర్ అయ్యింది”, “వర్షానికి ఎట్లొస్తమే.. ఈ షాపులనే ఆగినం” ఇట్లాంటి మాటలు చెప్పుకుంట వస్తున్నం.

నల్లగొండల అంత వాన లేకున్నా చిన్నగ చినుకులైతే పడుతనే ఉన్నయి. బస్టాండ్ బయటికొచ్చి నేను, ఆరిఫ్ గాడు ఇంటి దిక్కు నడుస్తుంటే – “కిదర్ భాయ్?” అని అన్నడు అబ్బుగాడు కోపంగ. నల్లగొండ లోపట లోపట్నే అయితే ఎంతటి దూరమైనా నడ్శి పోవుడే అలవాటు. అంత చీకట్లగూడ మేం ఎప్పట్లెక్కనే నడుస్తుంటే – “చల్ ఆటోపే” అని తిట్టిండు అబ్బుగాడు.

ఆటో ఎక్కి ఏ రాత్రికాడనో ఇండ్లకు చేరినం. అప్పటికే ఇంట్లోళ్లు ఎవ్వలు పండుకోకుండ మాకోసం చూస్తనే ఉన్నరు.

బండి పంచరైతే ఇంట్లోళ్లు మాత్రం ఏం చేస్తరు? ఆ రాత్రి అల్లిన కథనే ఎప్పుడడిగినా అచ్చంగ అట్లనే చెప్పుకొచ్చేది.

ఆ తర్వాత నేను సాగర్లనే కాలేజీ ప్రాజెక్టు చేసిన. చానాసార్లు సాగర్ చూస్తానికి పోయినం.. పోతనే ఉన్నంగానీ ఇదైతే ఎప్పటికీ మర్శిపోతానికి లేకుండ భయపెడ్తుంటది.

సరే.. ఇగ ఎట్లనో ఇంటికైతే చేరిన్రు కదా అని ఇంట్లోళ్లుగూడ ఆ రాత్రి హాయిగనే పండుకున్నరుగానీ – ఆ తెల్లారి, ఆ తర్వాత చానాసార్లు మటుకు.. మా నాన్న ఈ సాగర్ టూర్‌ని గుర్తుచేసి మరీ తిట్టేటోడు- “ఏ పనన్న సక్కగ చేస్తారువయా మీరు? ఆ పిలగాడు ఏడి? బంగారమసొంటి కొత్త గిన్నె.. అటే తీస్కపోయి తేకనేపాయె” అని.

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు