సరైన సిద్ధాంతం అవసరం: రంగనాయకమ్మ

  1. కాలం చెల్లిన, పద్ధతులను పట్టుకు పాతర్లాడే వారిని ‘ఛాందసులు’ అని పిలుస్తున్నాం. ఒకప్పటి సమాజ అవసరాలకూ, పరిస్థితులకూ, తగ్గట్టుగా పూర్వీకులు కొన్ని పద్ధతులు అనుసరించి, వాటిని ఒక తరం నుంచి మరో తరానికి ఇచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు, మృత దేహాన్ని చూసి వచ్చాక, స్నానం చేయాలన్న నియమం వెనక కూడా శాస్త్రీయత ఉందని, కరోనా వైరస్‌ నేపధ్యంలో నమ్ముతున్నారు. మనదైన ఆచారాల్లోని, సంప్రదాయాల్లోని, శాస్త్రీయతను గుర్తించి ఆచరించడంలో అభ్యంతర పెట్టాల్సిందేముంది?

జవాబు: మృత దేహాన్ని చూసి వచ్చాక స్నానం చెయ్యాలని మన వెనకటి వాళ్ళు చెప్పిన దాంట్లో ‘శాస్త్రీయత వుందని’ అన్నారు మీరు. ఏ ‘శుభ్రత’ అయినా, శాస్త్రీయతే అవుతుంది. ఈ దేశపు శీతోష్ణస్తితుల్ని బట్టి, రోజూ స్నానం చెయ్యాలనడం శుభ్రత గానే వస్తుంది. బైటి  పనుల మీద తిరిగి వచ్చినా; లేదా, ఇంట్లోనే వున్నా, రోజూ రెండు పూటలా స్నానాలూ, బట్టల మార్పులూ, ‘శుభ్రత’ కిందకి రావలిసిందే. రోజూ చేసే స్నానాలను మన వెనకటి వాళ్ళు, ‘శాస్త్రీయత’ గానే చెప్పారని, వాదించవచ్చు. ఇంత శాస్త్రీయతలు చెప్పిన వాళ్ళకి, సమాజంలో మొత్తం జనాలకు అందరికీ స్నానాలకు నీళ్ళూ, సదుపాయాల ఇళ్ళూ, పూట పూటా మార్చుకోడానికి బట్టలూ, శాస్త్రీయతకు తగిన ఆహారాలూ – వంటి వాటిని మన వెనకటి వాళ్ళు చెప్పినట్టు ఎక్కడా కనపడదేం? శుభ్రతలన్నీ శాస్త్రీయతలే. కానీ, శుభ్రతకి అవసరమైన వాటి కోసం, సమాజంలో నూటికి 90 మందికి అవకాశాలే లేవు! ఈ దేశం లోనే కాదు, ఏ దేశంలో నైనా ఇంతే. శాస్త్రీయతలు తెలిసిన వాళ్ళు, నిరు పేదతనాలు శాస్త్రీయత కాదని ఎక్కడైనా చెప్పారా? శాస్త్రీయతల్లో, ఒక ముక్క తెలిసి, అంత కన్నా స్పష్టంగా కనపడే ముక్కలు తెలియవా? తడిసి, నీళ్ళు కారే పట్టు బట్టతో వంటలు చెయ్యాలనే, మడీ, దడీ పేర్లతో చెప్పడాన్ని కూడా శాస్త్రీయతే అని వాదించడాలు వుంటాయి. ఈ ‘మడి’ని, నిరు పేదలకు కూడా ఎందుకు చెప్పలేదు? ‘నెల సరి’ కాలంలో ఆడ వాళ్ళని ముట్టుకోకూడదంటారు. వాళ్ళని ఇళ్ళల్లో తిరగ కూడదంటారు. దీన్ని ‘మడి’గా చెబుతారు గానీ, శాస్త్రీయతగా చూడరేం? శాస్త్రీయతగా చూస్తే, ఆ దశలో స్త్రీలని ఇంటికి దూరంగా వుంచనక్కర లేదు. శుభ్రతలే చెప్పాలి గానీ, వారిని ఇళ్ళకి దూరంగా వుంచనక్కర లేదు. నెల సరి రక్త స్రావం, మూడు రోజులతో ఆగదు. అయినా, ఆ స్త్రీయే, ఆ మూడో నాటి నించే ఇంట్లోకి ప్రవేశించి, వంటలన్నీ చేయవచ్చు. 2 రోజుల్లో వున్న తప్పు మూడో నాడు కనపడదు.

వేదాల్లో వున్న ఒక సూక్తి, “స్త్రీలు, పదేసి మంది మొగ పిల్లల్నే కనాలి. ఆడ పిల్లని ఒక్క దాన్ని అయినా కనకూడదు” అని చెపుతుంది. ఇలా మన వెనకటి పండితులు చెప్పారు కాబట్టి, దీన్ని ‘శాస్త్రీయతే’ అనుకోమంటారా మీరు? మాదిగా, బ్రాహ్మణా – కుల భేదాల్లో కూడా శాస్త్రీయతే చూడాలంటారా? వెనకటి వాళ్ళు పెట్టిన వాటి లోనే, పైగా శాస్త్రీయతలుగా చెప్పుకునే వాటి లోనే వందల, వందల, తప్పుడు నిర్ణయాలు వున్నాయి. ఆడ వాళ్ళ మీద, మొగ వాళ్ళ పెత్తనాలూ; అడుగు కులాల మీద, పై కులాల పెత్తనాలూ; పేద జనాల మీద, ధనవంతుల అధికారాలూ – వీటిని అన్నిటినీ కూడా శాస్త్రీయతలు గానే, ఏ మోసపు ఎత్తుగడలూ కాని వాటి లాగే, వాదించే వాళ్ళు వున్నారు. మీరు అయితే, ‘నేను ఒక్క విషయమే చెప్పాను గానీ, ప్రతీ దాన్నీ చెప్ప లేదు’ అనవచ్చు. మీరు చెప్పిన ఆ ఒక్క ఉదాహరణ వత్తాసు తోనే, ఆ ఉదాహరణనే చూపించి, సమాజంలో వున్న ప్రతీ తప్పునీ, శాస్త్రీయత గానే వాదించే వారు వున్నారు మరి!

  1. ‘దేవుడు’ – మనిషి సృష్టే. దేవుడి సాకుతో జరిగే వ్యాపారాన్నీ, మోసాలనూ, దోపిడీనీ వ్యతిరేకించాల్సిందే. మూఢ భక్తినీ ఖండించాల్సిందే. కానీ, ‘దేవుడు’ అనే భావన సైకలాజికల్‌గా ఉపశమనం కలిగిస్తోందనుకున్నప్పుడు – దేవుడి మీద ఆధారపడితే తప్పేమిటి? పలు రకాల ఒత్తిళ్ళు, అలజడులు, మానసిక సంఘర్షణలు, సంక్షోభాల నేపధ్యంలో – “నా కర్తవ్యం నేను చేశా. ఇక నా చేతుల్లో ఏమీ లేదు, దేవుడా! ఇక అంతా నీదే భారం!” అనుకుని, మానసికంగా రిలీఫ్‌ పొంది, బయట పడటం మంచిది కాదా? ఏ ఆలంబనా లేకుండా పిచ్చోడయి పోవటం మంచిదేనా? ఈ విషయంలో మీ ఆలోచనలు, మీరు సూచించే ప్రత్యామ్నాయాలు ఏమిటి?

జవాబు: మూఢ భక్తిని ఖండించాల్సిందే అన్నారు. ప్రకృతిలో ఎక్కడా లేని, ఏ నిజమూ కాని, మనుషుల సృష్టే అయిన దేవుడి భావం, ఉపశమనం కలిస్తుందా? అలా కలిగిస్తుందనడమే మూఢత్వం అవదా? ఒక జబ్బు పడ్డ మనిషి, దేవుడి పేరుతో ప్రార్ధించి వూరుకోడు; తప్పకుండా వైద్యం కూడా చేయించుకుంటాడు. వైద్యం ఎందుకు? దేవుడు చాలడా? – అనుకోడేం? అసలు, ‘దేవుడు మానవ సృష్టే’ అని మీరే అన్నారు. సమాజంలో పలు రకాల ఒత్తిళ్ళూ, అలజడులూ వుంటే, అవి ఎందుకు వుంటున్నాయో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు చూడాలి గానీ, ఎక్కడా లేని దేవుడి పేరుతో ఉపశమనం పొందాలా? ఇదే చేస్తే, ఎవర్ని వాళ్ళు దగా చేసుకోవడమే కాదా? సమస్యలకూ, బాధలకూ నిజమైన కారణాలు వుంటాయి. అవే తెలుసుకుంటే, ఆ మార్గంలో సాగితే, సమస్యలే లేకుండా చేసుకోవచ్చు. తగిన వైద్యం దొరికితే, జబ్బు పోదా? వైద్యం లేకపోతే, దాని కోసమే ప్రయత్నించాలా,  శూన్యపు దేవుడి పేరుని జపిస్తూ జీవితాలు గడపాలా? అది ‘ఉపశమనం’ అనుకోవడం, తనని తను నమ్మించుకోవడం కాదా? బిచ్చగాళ్ళ సమస్య కోసం, ఒక దేవుడి పేరుని ఉచ్ఛరించి చూడండి! సమస్య మాయం అవుతుందా? అది రిలీఫ్‌ కాదు. అది నూటికి నూరు పాళ్ళూ భ్రమ! కోపంగా చెప్పాలంటే, అది పిచ్చి! తనని తనే దగా చేసుకోవడమే అది!

  1. ఏ మత గ్రంధ అంతస్సార మైనా – మానవాళి మంచి కోరడమే గదా? ఆ యా మత విశ్వాసులు, తమ మత గ్రంధాల్లో చెప్పిన బోధనల స్ఫూర్తిని తీసుకుని ఆచరించ గలిగితే, ఇన్ని వైషమ్యాలూ, కొట్టుకు చావడాలూ, ఉండవు గదా? ‘వైఫల్యం’ ఎక్కడ ఉందంటారు?

  జవాబు: మత గ్రంధాలు చెప్పేది, మానవాళి మంచి కోసమే అన్నారు మీరు. ఇదే నిజమైతే, మతాలు పుట్టి లక్షల సంవత్సరాలు అయివుంటాయి ఇప్పటికి. మానవాళి కేం మంచి జరిగింది? మతాలు ఏం చెపుతాయి? మన మతాన్నీ, మన దేవుడి పేరునీ తప్ప, పరాయి దాన్ని ఉచ్ఛరించ వద్దు – అని చెపుతాయి. మతం అనేది, దేవుడి పేరుతో జరిగే వ్యాపారం – అని కూడా మీరు రెండో ప్రశ్నలో అన్నారు. ‘మతం అనేది, తేలికైన వ్యాపారం. చారెడు స్తలం మీద, చిన్న గుడి కట్టి; ఒక రాతి తోనో, చెక్క తోనో, విగ్రహాన్ని చెక్కి అక్కడ పెట్టి; దానికో పట్టు బట్ట కట్టి, పూల దండ వేస్తే; భక్తుల ద్వారా, ఆ సాయంత్రానికే ‘లక్ష’ డబ్బు సంపాదించ వచ్చు. ఇది తేలిక వ్యాపారం. అందుకే దీన్ని కని పెట్టినప్పటి నించీ, దీన్ని వ్యాపారులు వదలడం లేదు. ఈ రోజుల్లో, దేవుళ్ళ ప్రార్ధనలు ఫోనుల్లో కూడా జరుగుతున్నాయి. టీవీని తెరిస్తే, ఇంట్లో కూర్చుని దేవుళ్ళని చూడొచ్చు. అంటే, దేవుళ్ళ బొమ్మల్నీ, కధల్నీ చూడ గలిగేది ప్రకృతి సైన్సుల ద్వారానే గానీ, భక్తి ద్వారా కాదు.

‘దేవుడు వుంటే, ఒక్కడే వుంటాడు’ అని నమ్మే వేరు వేరు మతాల వాళ్ళు ఏమంటారంటే, ‘దేవుడంటే ఒక్కడే. మా దేవుడే, ఆ ఒక్క దేవుడు. ఇతర మతాల దేవుళ్ళందరూ, లేని వాళ్ళే’ అంటారు. ఈ తప్పుడు వాదాల వల్లా, భ్రమల వల్లా, దేవుళ్ళ వ్యాపారాల వల్లా, మతాల కలహాలూ, మీరు అన్న ‘కొట్టుకు చావడాలూనూ’.

“దేవుడు వుండడు. ఉన్నదంతా ప్రకృతే” అని గ్రహించుకుంటే, సమాజంలో సమస్యల్ని పరిష్కరించుకుంటాం. ఇదే మానవజాతికి నిజమైన శాంతి.

“వైఫల్యం ఎక్కడ వుందంటారు?” అన్నారు. ఎక్కడ వుంటుంది? సమస్యల కారణాల్ని, గ్రహించక పోవడం లోనే వుంటుంది.

‘మతాలన్నీ మంచినే బోధిస్తోంటే, వైఫల్యాలు ఎందుకు కలుగుతున్నాయి?’ అనే ప్రశ్న రావాలి కదా? వైఫల్యాలు, సమాజంలో వున్న ‘తప్పుడు సంబంధాల్లో నించే’ వస్తున్నాయి. లేని దేవుడికీ, సమాజంలో వైఫల్యాలకీ, సంబంధం ఎలా వుంటుంది? ఇది గ్రహించక పోవడం వల్లే; తప్పుడు నమ్మకాల్నీ, తప్పుడు సంబంధాల్నీ మార్చుకోక పోవడం వల్లే, వైఫల్యాలన్నీ. సరైన వైద్యం లేకపోతే, దాని కోసం ప్రయత్నాలే లేకపోతే, జబ్బు పోయే మార్గం వుంటుందా? ఈ వైఫల్యం ఎందుకు?

  1. చరిత్రలో కెళ్ళి చూస్తే, ఆ యా కాలాల్లోని మూఢాచారాలపై, అసమానతలపై, గొంతెత్తి పోరాడి సమాజ అభ్యున్నతికి పాటు పడిన వారెందరినో చూస్తాము. మార్క్స్‌ కంటే ముందు నుంచీ కూడా భారతీయ సమాజంలో పురోగామి కృషీ, సమ సమాజ స్థాపక కృషీ, సాగుతూనే వచ్చింది. వీరి కృషిని తక్కువ అంచనా వేయలేము కదా? మార్క్స్‌ సిద్ధాంత చట్రం లోకి రాని ప్రతి దానినీ ప్రగతి నిరోధక, తిరోగామి దృక్పధంగా చూస్తూ వాటికి ఆ విధంగా ముద్ర వేయడంలో హేతుబద్ధత ఏమిటి?

జవాబు:  ‘మార్క్సు’ కంటే ముందు నించి కూడా, భారతీయ సమాజంలో పురోగామి కృషీ, ‘సమ సమాజ స్థాపక కృషీ’ సాగుతూనే వచ్చాయి – అన్నారు మీరు. ఇన్ని రకాల కృషులు సాగితే, ‘సమ సమాజ కృషి’ కూడా సాగితే, అతి నిరు పేదలూ; అడుక్కుంటూ తిరిగే బిచ్చగాళ్ళూ; వ్యభిచారాలతో బ్రతికే బికారి స్త్రీలూ, మన కళ్ళ ముందు ఇంకా ఎందుకు వున్నారంటారు? కొన్ని కొన్ని సంస్కరణ భావాల వారి కృషులు జరిగాయి, కాదనలేము. రామమోహన రాయ్, జ్యోతిబా ఫూలే, వీరేశలింగం, గురజాడా, అంబేద్కరూ, వంటి వారూ, అంతకన్నా ముందు బుద్ధుడు వంటి వారూ, చేసిన సంస్కరణలు నిరుపయోగాలు కావు. కానీ, ‘సమ సమాజం’ అనే మార్పు కూడా సంస్కర్తల కృషి వల్లే జరుగుతుందంటున్నారు మీరు. అసలు, ‘పేదా – ధనికా’ అనే వ్యత్యాసాల కారణాన్ని ఏ సంస్కర్తలైనా గ్రహించారా? అసలు, మానవ సమాజాన్ని నడిపే ‘శ్రమలూ, శ్రమ విభజనలూ’ అనే విషయాల్ని సంస్కర్తల్లో ఎవరు అర్ధం చేసుకున్నారు? మార్క్సు కన్నా ముందు వున్న రికార్డో వంటి వారు, ‘శ్రమ’ గురించి గ్రహించినా, దాన్ని గురించి ఏం చెప్పారు? జరుగుతున్న దాన్నే సరైన సమాజం గానూ, అది అలా సాగ వలిసిందే అన్నట్టు గానూ, చెప్పారు. అసలు, మానవ సమాజానికి, యుద్ధాలతో ఏం సంబంధమో, అవి ఎలా పోతాయో, మార్క్సు – ఎంగెల్సులు గాక, ఎవరు చెప్పారు? మార్క్సు సిద్ధాంత చట్రం లోకి రాని ప్రతీ దానినీ తిరోగామి దృక్పధంగా చూస్తున్నామా? అలా చూడడం లేదు; కానీ మార్క్సు కన్నా వెనకటి దానినే ‘సమ సమాజ దృక్పధం’గా భావించడం మాత్రం నూటికి నూరు పాళ్ళూ తప్పు.

మానవ సమాజం, యుద్ధాల తోనే ప్రారంభమై, ఈ నాటికీ యుద్ధాల తోనే ఎందు కు వుందో, గ్రహించాలి మానవులు. ‘సమ సమాజం’ అంటే, మానవ సంబంధాల్లో, అసలు ఎటువంటి మార్పు ప్రారంభం కావాలో గ్రహించిన మేధావులు మార్క్సు – ఎంగెల్సు ఇద్దరే. దాన్ని, ఆ ఇద్దరి తర్వాత అనేక మంది నేర్చుకున్నారు; దాన్ని గ్రహించిన వాళ్ళు, దాన్ని ఇతరులకు బోధిస్తున్నారు. దాన్ని గ్రహించకుండా బుద్ధుడి దగ్గిరో, గాంధీ దగ్గిరో, అంబేద్కర్‌ దగ్గిరో, ఆగిపోతే, అది అసలు జరగ వలిసిన నమానత్వ మార్పుని ఇవ్వదు. హేతు బద్ధత లేని ఏ సంస్కరణా, ‘సమ సమాజాన్ని’ ఏర్పర్చగలిగే హేతు బద్ధత అవదు. ఈ విషయం గ్రహించక పోతే, కుల భేదాలూ; మత మూర్ఖత్వాలూ; భిక్షాటనలూ; వ్యభిచార వ్యాపారాలూ; పిల్లల్ని, తల్లులే, తండ్రులే నరుక్కోడాలూ; ఒక దేశంలో మీట నొక్కగానే, విదేశాలు దగ్ధమై పోయే కొత్త కొత్త చమత్కార యుద్ధ మార్గాలూ; కోర్టులూ, జైళ్ళూ, తుపాకులూ, హత్యలూ, ఆత్మహత్యలూ –  ఇవన్నీ ఇలా సాగుతూనే వుంటాయి.

‘భారతీయమైన ప్రతీ దాన్నీ తిరస్కరిస్తూ పోవడం ఎంత వరకూ మంచిది?’ అన్నారు మీరు. ఏ దేశాని దైనా ప్రతీ దాన్నీ తిరస్కరిస్తున్నారా? తిరస్కరించ వలిసింది, అది విదేశానిది – అని కాదు. తిరస్కరించకుండా ఆచరించ వలిసింది, అది మన దేశానిదే – అనీ కాదు. చెడ్డలన్నిటినీ, ఎక్కడివి అయినా, తిరస్కరించ వలిసిందే; అలాగే, ‘మంచి’ అనేది, ఎక్కడి దాన్ని అయినా స్వీకరించ వలిసిందే. గౌరవాలతో కాదు, ప్రేమలతో. రెంటికీ తేడా వుంది. గౌరవాలు, మానవుల్ని ఎక్కువ తక్కువలుగా చేస్తాయి. ప్రేమలు అలా చెయ్యవు. ప్రేమ, అందర్నీ సమానం చేస్తుంది. మత గ్రంధాల్లో, ‘సర్వే జనా సుఖినో భవంతు’ అంటారు. ఈ నాడు ‘వసుధైక కుటుంబం’ అంటున్నారు. అవి, శూన్య నినాదాలు! అంతే. ఆ ‘సర్వే జనుల’ సుఖాలకు మార్గం ఏమిటో అయితే, చెప్పరు. అది, ఆ చెప్పే వాళ్ళకే తెలీదు. అలా అంటారే గానీ, సర్వే జనం సమానంగా జీవించడాన్ని ఆ నినాదాల వాళ్ళే అంగీకరించరు. అసలు ‘జనాభా’ అంతటినీ కలిపేసి, వాళ్ళలో ఎంతెంత తేడాలున్నాయో చూడకుండా, ‘సర్వే జనులు’ అనడమే శుద్ధ తప్పు.

  1. రష్యా, చైనాల్లో కూడా కమ్యూనిజమూ, విప్లవాలూ రాక ముందు కూడా సంప్రదాయ జానపద సాహిత్యమూ, కళారూపాలూ ఉన్నాయి. అక్కడ వారు కమ్యూనిష్టు వ్యవస్థలో సైతం తమ జానపద సాహిత్యాన్ని, కళారూపాలనూ, సంప్రదాయాలనూ, గౌరవిస్తూ ఆచరిస్తున్నారు. మన రామాయణ, భారత, భాగవతాలను కూడా మనం అలాంటి ‘జానపద సాహిత్యం’ గానే పరిగణించి, ఆ యా కాలాల నేపధ్యంలో నుంచి చూస్తూ గౌరవించ వచ్చు గదా? రామాయణ విషవృక్షం చదవనందు వల్లే ఈ ప్రశ్న వేశానని మీరనవచ్చు. ఎరువు తెచ్చుకున్న సిద్ధాంతంతో భారతీయమైన ప్రతి దాన్నీ తిరస్కరిస్తూ పోవటం ఎంత వరకు మంచిది?

జవాబు: ‘రష్యా, చైనాల్లో కూడా కమ్యూనిజమూ, విప్లవాలూ రాక ముందు కూడా …’ అని మీరు ప్రారంభించారు. ‘అక్కడ కమ్యూనిస్టు వ్యవస్తలో సైతం’ అని కూడా అన్నారు. అంటే, అక్కడ, ఇప్పుడు కమ్యూనిజాలూ, విప్లవాలూ, వచ్చి ఉన్నాయని భావిస్తూ ఈ ప్రశ్న వేశారు. ఆ దేశాల్లో ఆ ప్రయత్నాలు కొన్ని చేసి, దోపిడీ ప్రభుత్వాల్ని కూలదోయడం వరకూ చెయ్య గలిగారు. ఆ తర్వాత జరిగిందీ, అక్కడ వున్నదీ, మళ్ళీ దోపిడీయే. అక్కడేదో కమ్యూనిజమూ, విప్లవాలూ, సాగిపోతున్నాయి – అనుకోకూడదు. అక్కడంతా పాత సాంప్రదాయాల్లో వున్న తప్పులన్నిటినీ నిలబెట్టి వుంచుతున్నారంటే, దాన్ని ‘కమ్యూనిజం’ అంటారా? మనం కూడా ఆ రకం తప్పుల్నే పాటించు కోవాలి – అంటారా? తప్పుల్ని పాటించడమే కాదు. ‘గౌరవించడం’ కూడా చెయ్యాలంటున్నారు మీరు. ‘కమ్యూనిజం’ అనే విషయాన్ని, ‘ఎరువు తెచ్చుకున్న సిద్ధాంతం’ అన్నారు. ‘సైన్సు’ అనే దాన్ని దేన్ని అయినా, ఒకరి నించి ఒకరు నేర్చుకోవాలి. అది ఎరువో, అప్పో, అవదు.

‘కమ్యూనిజం’ అనేది కూడా ఒక సైన్సే. ఇది సమాజపు సైన్సు. మన వాళ్ళే కాదు, ప్రపంచ దేశాల్లో అనేక మంది, ప్రకృతి సైన్సులకు కూడా వ్యతిరేకులే. కానీ, విదేశాల నుంచి నేర్చిన రైళ్ళూ, షిప్పులూ, విమానాలూ, అన్నీ అందరూ వాడతారు. అవి, ఎరువు తెచ్చుకున్న సైన్సులే. మీరు రైలు ఎక్కరా? వినాయకుడి విగ్రహాలు పట్టుకుని, ఇతర గ్రహాల పరిశోధనలు చేస్తూ వుంటే, మీకు వ్యతిరేకత లేదు! అటువంటి అగ్న్యానులు, సమాజపు సైన్సు వేపు కన్నెత్తి చూస్తారా? అసలు చూడవలిసింది, ఆ రకం వాళ్ళు కాదు. ఒక సైన్సు అనేది, భారతీయుల కైనా కావాలి; జపానీయుల కైనా కావాలి. ఏ ఈయుల కైనా, మొత్తం ప్రపంచాని కంతటికీ కావాలి. మనుషులకు వేరు వేరు పేర్లు వున్నట్టే, దేశాలకూ వేరు వేరు పేర్లు అవసరం. పేర్లు తేడాగా వున్నా, మానవులందరూ ఒకటే. వాళ్ళ శీతోష్ణ స్తితులూ, ఆహారాలూ, ఇవి మాత్రమే తేడాలు అవుతాయి. ఇతర ఏ విషయాల్లోనూ తేడాలకు అర్ధం వుండదు. మానవులు బ్రతక వలిసింది, ఎక్కడైనా ‘మానవత్వం’ తోనే. ‘సమానత్వం’ తోనే. ‘మన దేశం’ అనే మాటకి అర్ధం, ‘మన ఇల్లు’ అనే ఒక్క అర్ధంతో మాత్రమే అవసరం. ‘మన సంస్కృతీ, వాళ్ళ సంస్కృతీ’ అనే తేడాలతో కాదు. ఎక్కడి సంస్కృతి అయినా, మానవత్వ, సమానత్వ సంస్కృతులు గానే సాగాలి.

  1. మార్క్సిస్టు చైనాలో కూడా అధిక జనాభా వల్ల తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలతో శ్రమ శక్తిని దోచుకుంటూ, చౌకగా వస్తువులను తయారు చేస్తున్నారు. దీని వల్లే ప్రపంచ మార్కెట్లతో పోటీని తట్టుకుని చైనా దూసుకెళుతోంది. మార్క్సిస్టు సిద్ధాంతం చైనాలో ఆచరణలో అమలు కాకపోవడం పెద్ద ట్రాజెడీ కాదా? మీ కామెంట్?

జవాబు: చైనాలో విషయాల్ని వర్ణించారు. అటువంటి తప్పుడు విషయాలెన్నో సాగుతోన్న దేశం, కమ్యూనిస్టు దేశం ఎలా అవుతుంది? – అవదు. అది, ఇంకా పెట్టుబడిదారీ దేశం గానే వుంది. అక్కడి కార్మిక ప్రజలకు ఇంకా కమ్యూనిజం తెలీదు. వెనకటి నాయకులు కూడా, కార్మిక ప్రజలకు సరైన సిద్ధాంతాన్ని తగినంతగా బోధించ లేదు, నేర్ప లేదు. ఆ నాయకులు, ఆ సిద్ధాంతాన్ని వాళ్ళకి వాళ్ళే బోధించుకోలేదు. నేర్చుకోలేదు. ఒకరో ఇద్దరో ఉత్తములు వుంటే, దేశం అంతా ఉత్తమంగా వుండదు. జరగ వలిసిన మార్పు జరగదు. ‘మార్క్సు సిద్ధాంతం చైనాలో ఆచరణలో అమలు కాకపోవడం పెద్ద ట్రాజెడీ కాదా?’ అన్నారు.  అవును, ట్రాజెడీయే; కానీ అక్కడ ఏ ప్రయత్నాలూ జరగలేదని కాదు. వర్గ పోరాటంలో కూడా గెలుపు ఓటములు వుంటాయి. శ్రామిక వర్గానికి వర్గ చైతన్యం తగినంతగా ఇంకా అందలేదని అర్ధం.

  1. భారతీయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ‘పెట్టుబడిదారీ’ పాత్రలో కొచ్చేసరికి ‘ఆతని కంటె ఘనుడు’ చందంగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పత్రికలూ, పుస్తక ప్రచురణ సంస్థలూ కొనసాగుతున్నాయి. వారి సంస్థల్లో శ్రమకు, జీవన వ్యయానికీ తగ్గట్టు, జీతాలు ఇవ్వడం లేదు. వాస్తవం చెప్పాలంటే, ఇతర సంస్థల్లో కంటే ఇక్కడే దోపిడీ ఎక్కువగా ఉంది. పైగా కోవిడ్-19 సంక్షోభంలో లాక్‌డౌన్‌ సమయంలో ఏ కార్మిక చట్టాలనూ గౌరవించకుండా, వచ్చే నెల నుంచీ ఉద్యోగాల్లోకి రావద్దన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులను ఎందుకు, ఎలా ఆదర్శంగా తీసుకోవాలి? కమ్యూనిస్టులు మిగతా వారి కంటే భిన్నం కానపుడు, వారినీ, వారి సిద్ధాంతాన్నీ ప్రజలు ఎందుకు ఆదరించాలి? అనుసరించాలి?

జవాబు: భారతీయ కమ్యూనిస్టు పార్టీల గురించి చాలా విమర్శించారు మీరు. వాళ్ళ పత్రికల్లో, ప్రచురణ సంస్తల్లో పని చేసే వారికి జీతాలు తగ్గించారనీ, కార్మికుల్ని తీసేశారనీ, ఇటువంటి విషయాలు చెప్పారు. ఆ పార్టీల ఆదాయాలు ఎలా వున్నాయో, ఆ పార్టీలకు ఏ పనులు సాధ్యం కాలేదో, ఈ విషయాలు స్పష్టంగా తెలియకుండా, వారి గురించి నేను మాట్లాడలేను. వివరాలు చూస్తే, పార్టీల్లో నిజమైన తప్పులే జరిగితే, వాటిని కమ్యూనిస్టు పార్టీలు అనలేము. కమ్యూనిస్టు పార్టీల నడక, దోపిడీ పార్టీల నడక కన్నా భిన్నం కానప్పుడు, వారి దగ్గిర కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదని అర్ధానికి రావాలి. అటువంటి అన్యాయాలతో సాగే పార్టీల్ని ప్రజలు ఆదరించాలని ఎవ్వరూ అనక్కర లేదు.

  1. మీరు మార్క్సిజాన్ని గాఢంగా నమ్ముతారు. దాని కన్నా మంచి సిద్ధాంతం రాదంటారా?

జవాబు: ‘మార్క్సిజం’ అంటే ఏమిటో తెలిసి వుంటే, ఈ ప్రశ్న రాదు. అయినా, మీ ప్రశ్న కైనా జవాబు చెప్పాలి. మార్క్సిజం కన్నా మంచి సిద్ధాంతం వుంటే, అది వస్తే, అప్పుడు దాన్నే మరింత గాఢంగా నమ్ముతాను. కానీ, మార్క్సిజం కన్నా మంచి సిద్ధాంతం మరొకటి వుండడం సాధ్యం కాదు. ఒక ఉదాహరణ చూడండి! “5కి 6ని కలిపితే, మొత్తం ఎంత?” అనే ప్రశ్నకి, మీరేం జవాబు చెపుతారు? “11” అంటారు. అంతే కదా? అప్పుడు ఎవరైనా, “ఆ లెక్కకి, 11 కన్నా ఇంకా మంచి జవాబు వస్తే, మీరు అప్పుడేమంటారు?” అని మిమ్మల్ని అడిగితే, మీరేమంటారు? నవ్వుతారు. “ఆ లెక్కకి ఇంకో జవాబు ఏదీ వుండదు” అంటారా; లేకపోతే, “5కి 6ని కలిపితే 30 అవుతుంది. ఇదే చాలా మంచి జవాబు” అంటారా? అలా అనరు. ఆ లెక్కకి 2 జవాబులు వుండవు. కాబట్టి, గ్రహించ వలిసింది ఏమిటంటే, ‘నిరు పేదలూ X భాగ్య వంతులూ వున్న సమాజంలో, ఆ వైరుధ్యాల్ని తీసి వేసే జవాబు ఏమిటి? దానికి మార్క్సిజం ఏం చెప్పింది? ‘శ్రమ దోపిడీని తీసి వెయ్యడమే ఆ సమస్యకి పరిష్కారం’ అని చెప్పింది. దాని కన్నా మంచి పరిష్కారం కోసం చూస్తారా? మరో మంచి పరిష్కారం సాధ్యమేనా? మరేదీ వుండడం సాధ్యం కాదు. ఎందుకంటే, బానిసత్వ కాలం నించీ ఈ నాటి పెట్టుబడిదారీ కాలం వరకూ, మానవ సమాజం, ‘శ్రమ దోపిడీ’తో, గతం కన్నా కూడా తీవ్రంగా మారుతూ, బీదా – ధనికా తేడాలతోనే సాగుతోంది. మార్క్సిజం దృష్టి ఏమిటంటే, ఈ తప్పుడు సమాజాన్ని, ఉత్తమ సమాజంగా మార్చాలని!

అంటే, మానవుల మధ్య, సమానత్వ సంబంధాలు ఏర్పడాలని. అదే జరిగితే, దాని కన్నా మంచి ఇంకేముంటుంది? ‘సమానత్వమే’ మంచి అయినప్పుడు, దాన్ని ఏర్పరిచే, దాన్ని స్తిర పరిచే, మార్గమే ‘మంచి, అవుతుంది. ‘ఇంకా మంచి’ ఎలా వుంటుంది? మార్క్సిజాన్ని మంచి పరిష్కారంగా భావించడం, కేవలం ‘నమ్మకం’ కాదు. అందులో వున్న ‘మంచి’ ఏమిటో, తార్కికంగా తెలుసుకోవడమే అది. ‘కమ్యూనిజం’ గురించి మీ అభిప్రాయాలు, వైరుధ్యాలతో వున్నాయి. అది, ‘మంచి సిద్ధాంతం’ అన్నట్టూ; అది, పెట్టుబడిదారీ విధానాల వంటిది కాదు – అన్నట్టూ; అది ఆదర్శమైనది – అన్నట్టూ, ఈ రకంగా ఈ ప్రశ్నలో చెప్పారు. కానీ, దీనికి ముందు చెప్పినదంతా వేరు! రష్యా, చైనాల వంటి కమ్యూనిస్టు దేశాలు కూడా పాత కాలపు సంస్కృతులనే పాటిస్తున్నారనీ; అది ఎరువు తెచ్చుకున్న సిద్ధాంతం అనీ – చెప్పారు గానీ, అది, ‘సమాజపు సైన్సు’ అని ఎక్కడా చెప్పలేదు. దాన్ని ‘సైన్సు’గా అర్ధం చేసుకోకుండా, దాని మీద వ్యతిరేకత ప్రకటించారు. ఈ రకంగా మీరు, కమ్యూనిజం గురించి, వ్యతిరేకంగా గానూ, అనుకూలం గానూ – రెండు రకాలుగా వున్నారు.

అది, మంచి సిద్ధాంతమే అయితే, ఆ ‘మంచి’ని విదేశాలు కూడా పాటించ కూడదా? లేకపోతే, అది సైన్సే కాకపోతే, దాన్ని ఆదర్శంగా తీసుకుని, స్వదేశస్తులు అయినా ఆచరించవచ్చా? ఇంత వైరుధ్యం ఎందుకు జరిగిందంటే, అసలు ‘కమ్యూనిజం’ అంటే ఏమిటో, అదేం చెప్పిందో తెలియక! అంతే కదా? మీరు మరింత మంచి సిద్ధాంతాన్నే కోరేటట్టయితే, అది వచ్చినప్పుడు దాన్నే పాటించ వచ్చు. ఇప్పటికి వున్న ‘మంచి’ని ఎందుకు స్వీకరించరు? మీకు ‘మంచే’ కావాలంటే, మీరు ‘మార్క్సిస్టు’ అయి తీరాలి! ఇంకా ‘మంచి’ కోసం ఎదురు చూస్తూ, దొరికిన మంచిని వదులు కుంటారా? దారిలో ఒక ‘రత్నం’ దొరికితే, దాని కన్నా గొప్పది దొరుకుతుంది – అని, చేతిలో రత్నాన్ని పారేస్తారా? – రత్నాన్ని అయితే, నిజంగా పారెయ్య వచ్చు. ఇంకో దాని కోసం ఆశించక పోవచ్చు కూడా. కానీ, ఇది రత్నాల మాటా, ముత్యాల మాటా, కాదు. ఇది కమ్యూనిజం! ఆలోచించండి మరి.

  1.  మీరు ‘భక్తి’ ని అంగీకరించరు, తెలుసు. కానీ, ‘భక్తి’ మీద, అన్ని మతాల్లోనూ, అద్భుతమైన పాటలు వున్నాయి. ఆ పాటలు వింటూ ఉంటే, తన్మయత్వం చెందుతాము. రేపు ‘నూతన ‘సమాజం ‘ అనేది, మీరు అనే నూతన సమాజం, ప్రారంభమైతే, ‘భక్తి ‘మీద పాఠాలు పోతాయనుకోండి. కానీ, పాటల్నిఏం చేస్తారు? ఏం చెయ్యాలంటారు? ఈ విషయం గురించి, మార్క్సుఎంగెల్సులు ఏమైనా చెప్పారంటారా?

జవాబు: ఇంతపెద్ద ప్రశ్న ఎందుకండీ? ‘భక్తి  పాటల సంగతి ఏమిటి?’అని అడిగితే చాలు గదండీ? భక్తి పాటల్లో వున్న భక్తి  ఎవరికి కావాలి ? ఆ పాటల్లో వున్న రాగాలే, వాటిని వినడమే కావాలి. కళల్లో, సంగీతం ఒక కళ కదా? భక్తిగల పండితులు, ఆ పాటలనిండా భక్తిని కూరి పెట్టారు. కానీ, భక్తులు కూడా ఆ రాగాలనే తీసుకుంటారు. రాగం లేకుండా భక్తి వ్యాసాలు చెప్పమనండి, ఎవరు వింటారో! పాటలో రాగం బాగుంటేనే, ఆ పాటని వింటారు, వంద సార్లు.

రాగం బాగోకపోతే, ఆ మాటల్లో ఎన్ని మహిమలు వున్నా, రాగం నచ్చని పాటని వదిలేస్తారు. నాకు చిన్న తనం నించీ, “మరుగేలరా, ఓ రాఘవా..” మహా ఇష్టం. నాకు నాస్తికత్వం మొదలైనా, కమ్యూనిజం మొదలైనా, ఆ పాటని వినడం మానను. ఎందుకూ? ఆ రాగం కోసం. ఆ పాటలో దేవుణ్ణి గురించి ఎంతెంత వర్ణనలు వున్నా, ‘చరాచర రూపా, సూర్య సుధాకర లోచనా’ లాంటి ఆ మాటల్ని లక్ష్య పెట్టను. అయినా, ఆ పాటని వదలను. ఇది ఉదాహరణకే చెప్పాను. సంగీతాన్నీ, దాని మధురమైన రాగాల్నీ ఎలా వదులుకుంటాం? మా ఇంట్లో చిన్న పిల్లవాడికి, తెలుగు భాష బాగా రావాలని సంగీతం మాష్టారిని పెడితే, ఆయన భక్తిని తప్ప రెండో దాన్ని చెప్పరు. పిల్లాడు, “ రామా, రామా, సీతా పతీ, నీవే గతీ” అని అరుస్తూ, ఇల్లంతా గందర గోళం చేస్తున్నాడు.

“ దేవుణ్ణీ చూశావా?” అంటే, “దేవుడో, దేవుడో, దేవుడంటారు; దేవుడంటే ఎవరు? ఎక్కడుంటాడు?” అనే పాఠం అప్ప చెపుతాడు. ఈ మధ్య ఒక వీడియోలో ‘ఏసయ్యా’ అనే పాటలు విన్నాను. ఆ భక్తులు, శిలవకి దణ్ణాలు పెడుతూ పాడుతున్నారు. కత్తి తో పొడిచి చంపితే, ఆ కత్తికి దణ్ణం పెట్టాలా? ఆ భక్తులకు ఇష్టమైన ఏసయ్యని శతృవులు శిలవ మీద పెట్టి, మేకులతో కొట్టి అంటించారంటే, ఆ శిలవ ప్రార్ధనా వస్తువు అయిందా? ఆ శిలవని చూడడం నాకు ఎంత దుర్భరంగా అయిందో! కానీ, ఆ పాటలు ఎంత బాగున్నాయో! రేపు, నూతన సమాజాన్ని ఊహిస్తే, భక్తి పాటల్ని, వాటి రాగాల కోసం నిలుపుకోవచ్చు. నిలుపు కోవాలి. సినిమా పాటలు తప్ప, ఇతర రాగాలు నచ్చని వాళ్ళు, ‘మరుగేలరా’ ని హాయిగా వింటారా? నాకు మంచి రాగాలు కావాలి. భక్తీ, గిక్తీ కాదు. అది అబద్దం  అని తెలిశాక, అది ఎప్పుడో పోయింది. ఎంగెల్సు, బితోవెన్ ని తెగ మెచ్చుకుంటూ చెప్పడం ఒక చోట చదివాను. అది అంతా వాయిద్యమే.

శాస్త్రీయ సంగీతపు రాగాల్ని, భక్తి విషయాలు చెప్పడానికి కాక, హేతుబద్ధ మైన విషయాలు చెప్పడానికి ఉపయోగించవచ్చును. ఉదాహరణకి, టీ.ఎం. కృష్ణ పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా ఉన్న ఒక పాటకి, శాస్త్రీయ సంగీతపు బాణీ కట్టి, ఆ రాగాలతో అద్భుతంగా పాడాడు. ‘పొరంబోకె’ అనే పాటలో.

*

గోవిందరాజు చక్రధర్

25 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా గొప్ప గా వుంది ఇంటర్వ్యూ

    చక్కని లోతైన ప్రశ్నలు , వాటికి తగ్గ విశ్లేషణాత్మక జవాబులు

  • ఇంటర్వ్యూ లో ప్రశ్నలు బాగున్నాయి , మనమంతా మాట్లాడుకునే భాష లో , మనకొచ్చే ప్రశ్నలు లానే ఉన్నాయి . మార్క్సిస్ట్ లు ఇంటర్వ్యూ అంటే , సిద్ధాంతాలు అంటూ ఏవో అర్ధం కానీ పదాలు వాడతారేమో అనుకుంటూ ఓపెన్ చేసాను .

  • వితండవాదాలు ఒక వయసులో చాలా అద్భుతంగా అనిపిస్తాయి.
    నేను 21 వచ్చేవరకు రంగనాయకమ్మ అంటే ఓ గొప్ప అభిప్రాయం ఉండేది. ఆవిడ రచనలు అన్నీ చదివేసాను 1983 వరకు…
    తరువాత ఉద్యోగంలోకి వచ్చాకా యూనియన్ల ధర్మామా అని కమ్యూనిజానికి కమ్యూనల్ శక్తులైన ఎం ఐ ఎం కి ఉన్న అనుబంధం హైదరాబాద్ వచ్చాక చాలా చక్కగా తెలిసింది.
    చదువుకోడానికి చదువు కొనడానికి ఉన్న అంతరమే మనని పొరపాటు ఆలోచనల్లోకి నెట్టి వేస్తుంది.
    నిబద్ధత లేని రాజకీయాలలాంటిదే ఈ నాటి కమ్యూనిజం. కమ్యూనల్ శక్తులతో అంట కాగుతూ మావోని ఊహించుకుంటూ రతి ప్రక్రియ చేసుకునే వర్గాలని చూసి జాలి పడటం తప్పా చదివి సమయం వృధా చేసుకోవడం అవసరమా అనే ఆలోచన విజ్ఞత ఉన్నా ఏం తోచనప్పుడు కాసేపు కాలక్షేపపు బఠానీల్లాంటివే ఇక్కడి భావ వ్యక్తీకరణలు.

    చూస్తుంటే జాలి వేస్తుంది..కూపస్థ మండూకాలు ..మూర్ఖుడు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే విధంగానే వీరి తర్కం కొన సాగుతుంది తప్పా అవతలి విధానాల్లో మంచి చూద్దామనే ఆలోచన ఎక్కడా ఉండదు…పేదరికంతో మూడి వేస్తారు ప్రతీ సమస్యని..అంతే కానీ మానవ మనస్తత్వం పై ఎక్కడా విశ్లేషణ జరగదు. కారణం మావో ఆలోచనా విధానమే… భారతీయ పేద వారు హింసాత్మకంగా మారక పోవడానికి కారణాలు ఏమిటి అనేది ఆలోచించడంలో కూడా ఒక దోపిడీ రాచరిక వ్యవస్థ కనపడే వీరికి చైనాలో కమ్యూనిజం పేరిట జరుగుతున్న దోపిడీ మీద గొంతు పెగలదు.

    భారతీయత అంతా గొప్పదనే వాదం కాసేపు పక్కన బెట్టి ఆలోచిస్తే…వీరికి ఊక దంపుడు ఆలోచనలే తప్పా ఒక వ్యక్తిత్వ వికాసపు ధోరణి కాని ఆలోచనలల్లో సమగ్రత పరిణితీ కానీ ఎక్కడా లేవు అనేది ఈ నాటి యువతరం చాలా తొందరగానే గ్రహించ కలదు.. కారణం మా రోజుల్లో ఇంతటి విషయసంగ్రహణ సాధనాలు కానీ సామాజిక దృశ్య మాధ్యమాల ద్వారా ప్రపంచం చిన్నదయ్యిపొయింది దానికి తోడు సాంకేతికత అభివృద్ధి ఆలోచనా తీరు తెన్నులను మార్చేసి…ఇలాంటి చాదస్తపు మనుషులను ఇంకా పట్టించుకునే వారుండడం నిజంగా సాహిత్యంలో విష వృక్షాలను పోషించే సారంగ లాంటి యాజమాన్యాలే…

    • చాలా భయపడ్డట్టున్నారు. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని నిజంగానే భయపెట్టింది.
      1)’వితండవాదాలు ఒక వయసులో చాలా అద్భుతంగా అనిపిస్తాయ’ని రాశారు. పై జవాబుల్లో ఎక్కడైనా ‘వితండం’ ఉందా?లేదే.చైనాను కూడా విమర్శించారు,రంగనాయకమ్మ గారు. మరోసారి చదవండి. పైగా, తప్పొప్పులను గ్రహించడంలో-‘ప్రాంతీయ పక్షపాతం లేకుండా ఉండాల’ని మరీ అన్నారు,వారు. ఇంతకన్నా విశాల హృదయం ఇంకేముంది?
      2) ‘నిబద్ధత లేని రాజకీయం లాంటిదే ఈనాటి కమ్యూనిజం’ అన్నారు. చాలా తప్పుడు అవగాహన ఇది. కమ్యూనిజం లో ఈనాటి కమ్యూనిజం ఒకనాటి కమ్యూనిజం అనేది ఉండదు. రాజకీయాలలో నిబద్దత లేకపోవడం ప్రతీ బూర్జువా పార్టీ వాళ్ళకూ ఉంటుంది.కమ్యూనిస్టు పార్టీలో కూడా అలా కొందరు ఉంటే,వాళ్ళను వ్యక్తులుగా తప్పుపట్టవచ్చు.అంతేగానీ, దాన్ని కమ్యూనిజం తప్పుగా చూడకూడదు.
      3)ఇక్కడి భావవ్యక్తీకరణలు కాలక్క్షేపపు బఠానీల్లా0టివే అయితే, వాటిని మీరు పట్టించుకోవడం ఎందుకు?వదిలేయండి. మీ టైం వెస్ట్ కదా?ప్రత్యేకంగా పట్టించుకుంటున్నారు అంటేనే, ఇక్కడ ఆ భావవ్యక్తీకరణలకు అంత బలం ఉందని అర్ధం. ‘కాలక్షేపపు బఠాణీలు’ అని మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినంత మాత్రాన,ఆ మాటల్లోని నిజం గ్రహించే వాళ్ళు గ్రహించక మానరు.
      4) ‘పేదరికంతో ముడివేస్తారు ప్రతి సమస్యనూ’ అన్నారు,మీరు. కమ్యూనిస్టులు ప్రతి సమస్యను పేదరికంతో ముడివేయరు,శ్రమదోపిడీతో ముడి వేస్తారు. పేదరికం అనేది శ్రమ దోపిడీ ఫలితం. సమస్యని, కారణంతో ముడివేస్తారే గానీ ఫలితంతో కాదు.
      5) మనస్తత్వం అనేది ఉత్త పనికి మాలిన మాట. సమస్యకు గల అసలైన కారణాన్ని వెతకకుండా, వంకర మార్గాన్ని పట్టించే ప్రయత్నమే మానవ మనస్తత్వ వాదన.మావో ఆలోచనా విధానం తెలియని వాళ్లే మానవ మనస్తత్వాన్ని పట్టుకుని వేళ్లాడతారు.
      6) పరిణతి చెందని వాళ్లే వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడతారు. ‘సంఘ వికాసమే వ్యక్తి వికాసం లేదా వ్యక్తిత్వ వికాసం’ అనే గ్రహింపు లేని వాళ్ళు మాత్రమే, ‘వ్యక్తిత్వ వికాసం’ అంటూ నసుగుతారు.
      ఈనాటి యువకులు సత్యాలను గ్రహించక మానరు. ఇవి చాదస్తపు మాటలు కాదనీ,ఇవే అసలు జీవిత సత్యాలనీ గ్రహించి తీరతారు. తద్వారా ‘భారతీయత’ పేరుతో హిందూత్వ పేరుతో పెరిగిన విష వృక్షాలను పెకిలివేయకా పోరు.

      శ్రీనివాసు గారు,
      21 ఏళ్ళ వయసు వరకే రంగనాయకమ్మ రచనల్ని చదివారట! నేను 21 ఏళ్ళ వయసులో రంగనాయకమ్మ రచనలు చదవడం మొదలెట్టాను. ఇప్పుడు నా వయసు 47. కానీ, అన్ని రచనలూ చదివానూ, ‘మార్క్సిజమూ, రంగనాయకమ్మ రచనలూ’ అనే గ్రూపు ఎడ్ మిన్లలో ఒకడిని. రంగనాయకమ్మ రచనల పాఠకుడిగా, శ్రీనివాసు గారి కామెంట్ల కి జవాబు ఇవ్వదలిచాను.

      మావో ఆలోచనా విధానం గురించీ, చైనాలో కమ్యూనిజం పేరుతో జరుగుతున్న దోపిడీ గురించీ గొంతు పెగలదని కామెంట్ చేసిన శ్రీనివాసు గారు, అవ్యాజమైన ద్వేషం తో మూసుకుపోయిన తన కళ్ళని తెరిచి చూస్తే, 1983 లో, రంగనాయకమ్మ ప్రచురించిన “చైనాలో ఏమ్ జరుగుతోన్ది?” అనే పుస్తకం కన పడుతుంది. ఆ పుస్తకం లో, మావో వ్యక్తి పూజని రంగనాయకమ్మ ఎంతగా విమర్శించిందో, చైనాలో ఉన్నది ఫక్తు పెట్టుబడిదారీ విధానం అని వివరాలతో ఎలా చర్చించారో తెలిసేది.

      మానవ మనస్తత్వం పై ఎక్కడా విశ్లేషణ లేదని ఒక మిడిమిడి విమర్శ. ‘కొండని తవ్వి ఎలకను కూడా పట్టనట్టు!” అనే పెద్ద వ్యాసం లో రంగనాయకమ్మ చర్చించినది అంతా ఏమిటి? ప్రతిదీ పేదరికం తో ముడి పెడతారని ఇంకో వ్యాఖ్య! ఈయనకి 1983 తర్వాత, ఉద్యోగం దొరక్కుండా, చెప్పులు అరిగేలా తిరుగూ వుండి వుంటే, తెలిసి వచ్చేది, ప్రతిదీ పేదరికం తో ముడి పడి వుంటుందని.

      ‘వితండవాదాలు’, ‘రతి ప్రక్రియ’, ‘కాలక్షేపపు బఠానీలు’ , ‘కూపస్థ మండూకాలు’ ’మూర్ఖుడు’, ‘ఊక దంపుడు ఆలోచనలే’ ‘చాదస్తపు మనుషులు’ వంటి మాటలు వాడిన సత్తిరాజు శ్రీనివాసు గారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాంటి మాటలే కాదు, ఇంకా చాలా మాటలు భాషలో వున్నాయనీ; అవన్నీ మాట్లాడ్డం వచ్చిన వారందరికీ తెలుసుననీ; వాటినీ, అంతకంటే తీవ్ర మైన పదాల్నీ శ్రీనివాసుగారిని ఉద్దేశించి వాడగలరనీ ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి,శ్రీనివాసుగారిది కుతర్కం అనీ, ఆయన కామెంటు ‘స్వకుచ మర్దనం’ అనీ, ఆయనది ‘సొల్లు వాగుడు’ అనీ, ఆయన లాంటివాళ్ళు ‘ఉష్ట్ర పక్షులు’ అనీ, ‘మూర్ఖ శిఖామణులు’ అనీ, ఆయనవి ‘రోకటి పాటలు’ అనీ, ఆయనవంటి వాళ్ళు ‘ ఆధునికానంతర చాందసులు’ అనీ….ఇలా ఎవరైనా అంటే ఎలా వుంటుంది?
      యూ. హెచ్. ప్రీతం

      • సంస్కారవంతమైన మీ ఆవేదన చదివాకా..నేను పూర్తిగా లోతైన చర్చ చెయ్యకుండా కమ్యూనిస్టు మూర్ఖ సిఖామణులకు తీసిపోని వాదం చేసానని మీరు చెప్పినది నిజమే అని మనస్పూర్తిగా అనిపించింది. అందుకని అలాంటి చర్చ చెయ్యలేక పోవడానికి కారణాలు వెతుక్కోకుండా నా పొరపాటు ఒప్పుకుంటున్నా..నిజమె ఒక ముద్ర వేసి ఇది అంతే అనే భావజాలం ఆవిడది మొన్న మొన్నటి దాకా…2017 లో అనుకుంటా ఆవిడ గారి భారతం మీద మరియూ వేదాల మీద రాసిన అసంపూర్ణ విశ్లేషణ చూసాకా అసలు రామాయణ విషవృక్షం కూడా ఇవిడ రాయలేదు అనే వాదనల మీద ప్రగాఢ నమ్మకం కలిగింది. వ్యక్తి అరాధనను వ్యతిరేకించే భావజాలం నిజంగా నమ్మిన వాడిని కాబట్టి ఆవిడను తేలికగా వయసు మీద బడ్డ వ్యక్తిగా కొట్టి పారేసాను. కానీ ఆవిడ భవజాలంలో వచ్చిన మార్పుని చూసి మీరు ఆనంద పడొచ్చేమో కానీ మొన్నీమధ్య బాబే రావాలి అని ఆవిడ రాసిన రాతలు చదివాకా కూడా ఆవిడని గౌవురవించడం నా వల్ల కాదు అంతే కాదు సింధూ అనే క్రీడా కారిణి మీద ఆవిడ రాసిన రాతలు కూడా చదివాను కాబట్టే ఆవిడలో వస్తున్న రసాయన మార్పుల గురించి ఆలోచించాను నాకున్న పరిధిలో…మనిషి ఒక రసాయనాల సమ్మేళనమే అని హేతువాదులు నమ్మేది నిజమే అయ్యితే…సిద్ధాంతాలు అనేవి కాలాన్ని బట్టి వ్యవస్థలని బట్టి మారుతాయి అనే చిన్న పాటి అవగాహన లోపించిన ప్రతీ వారికి ఆవిడ చాలా గొప్పగా అనిపించవచ్చేమో కానీ..నాకు కాదు. ప్రీతం గారు మీరు యూ హెచ్ అని రాసారు ..కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు నుంచి అనుకోవచ్చా…నిజం చెప్పాలంటే మీ విమర్శలో ఆఖరి వాక్యాలు నిజంగానే నన్ను కుంచెం మేల్ మేనో పాజ్ అవస్థలోకి వెడుతున్నానా అనిపించేసాయి..ఆ విషయంలో నా విమర్శ సహేతుకంగా లేక పోవడమే నిదర్శనం కాబట్టి ఆ కోణంలో నేను కూడా అవాకులు చవాకులు రాసినట్టుగా అనిపించింది. అందుకు నా క్షమార్పణలు. కాకపోతే…మీరు ఏమన్నా చెయ్యగలిగితే మీ అభిమాన రచయిత్రికి ఆ అవస్థ తప్పేలా లేదా కాస్త ఉపశమనం కలిగేలా చూడండి.. ఇక పోతే…మీరు రాసిన మిగతా విషయాలు నన్ను పెద్దగా కదిలించ లేక పోయాయి. కారణం యువతరానికి ఏం కావాలో ఏం అక్కర్లేదో వారికి తెలుసు జ్ఞానం అనేది ఇదివరకూలా కేంద్ర గ్రధాలాయలు లేదా ప్రపంచం చూసి వచ్చిన వారి ప్రసంగాలు లేదా తాము చదివిన దాన్ని గుడ్డిగా నమ్మే ( తరువాత సాంకేతికత మూలంగా ఒప్పుకోక తప్పని అంశాలలో వెసలు బాటు చూపించే మూఢ అభిప్రాయాలు కేవలం కుల పిచ్చ ద్వారా ఏర్పడ్డవే అని ఈ మాధ్యకాలంలో చూసిన దృస్య మాధ్యమాల్లో అసలు రంగు బయట పడ్డాకా)..వితండవాదాలకి పోయే ఆమె కాస్త మారిందా అనే కన్నా…మార్పు మానవసహజమే అనేది..నిజమైన దృగ్విషయమే అయ్యితే..వాదించుకోడానికి ఏం మిగిలింది..ప్రీతమా.. కేవలం అహంకారాం తప్పా…అవసరమా ఈ వయసులో..నాకు ఈ చెత్త…ఎత్తి నెత్తినేసుకోవడం అని అనను..అదో దూల అంతే…కాక పోతే ఎందుకు రాసానో అనే దానికి నిజమైన సమాధానం బహుశా నువ్వు చెప్పినట్టుగా నాలో కలిగిన రసాయన మార్పులే కారణం ఏమో విశ్లేషించుకున్నాకా నీకు సమాధానం ఇస్తాను సూటిగా అంత వరకు …పెద్దగా నా వీమర్శని కూడా పట్టించుకుని ఆవేశ పడకు అనేది మాత్రం నిజమైన సలహా… చట్టం తన పని తాను చేసుకెడుతోంది ఈ మధ్య నిశబ్దంగా..కాబట్టి హిందూ జాతి ఇదివరకూలా అంత సహనం శాంతి ఏం చూపించక పోవడమే వీరిలో వస్తున్న అసలయిన మార్పుకి అసలు కారణం..అనేది కాస్త ఆలోచించ గలిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే..సత్యం..

      • ప్రీతం చాలా చక్కగా విమర్శకి బదులిచ్చారు .

    • శ్రీనివాసా……
      యూ హెచ్ అంటే ‘యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్’ అనే చచ్చు పుచ్చు అనుమానాలు పెట్టుకున్నారు. అలా అనుకోడానికైనా అర్ధం ఉండాలి కదా?అది మాఅమ్మ పేరునూ,నాన్న పేరునూ సూచిస్తుంది.వారి అసలు పేర్లే నాకు ఇంటిపేరు. ‘ఇంటిపేర్లు ఎలా ఉండడం నూటికి నూరుపాళ్లు సరైంది?’ అనే రంగనాయకమ్మ గారి వ్యాసం చదివి, నేను అలా పెట్టుకున్నాను.నేను ఖమ్మం జిల్లాలో టీచర్ని.

      వారు రాసిన ‘ఇదండీ మహా భారతం’ ఏం చెప్పాయి వేదాలు?’చదివాక మీ శ్రేణుల్లో వణుకు మొదలైనట్టుంది.వారిది వితండవాదమే అయితే, వారి రాతలు పట్టించుకోచాల్సిన అవసరం ఏంటి మీకు?

      రంగనాయకమ్మ గారు, ‘బాబే రావాలని’ రాసినట్టుగా చెప్పారు,మీరు. అలా ఎక్కడ రాశారో ఆధారాన్ని చూపించండి.మార్క్సిస్టు లేవరూ,ఒక బూర్జువా నాయకుణ్ణి వ్యతిరేకిస్తూ మరో బూర్జువా నాయకుడు కావాలి/రావాలి అనరు.’మార్క్సిస్టులు అలా వుండరు’ అన్న విషయమే తెలియదా? ఇంత అజ్ఞానమా? ఇంత మూర్ఖత్వమా? బురద చల్లే ప్రయత్నం కాక మరేమిటిది?
      సుతి మెత్తని బెదిరింపు దాకా పోయావంటేనే అర్థం అవుతోంది, నా రిప్లై కి ఎంత ప్రభావం వుందో, అని.

  • ప్రశ్నలూ బాగున్నాయి. వాటికి ఇచ్చిన జవాబులూ బాగున్నాయి. ఒక ముప్పై ఏళ్ళు లేదా ముప్పై ఐదేళ్లు వెనక్కు వెళితే,
    ‘అక్కినేని’ గురించీ ‘గద్దర్’ ఏదో అన్నాడు. నేను అప్పటికి అక్కినేని అభిమానిని. గద్దరా విప్లవ కళాకారుడు. అక్కినేనా మహా ఇష్టమైన కళాకారుడు.

    ఏం చెయ్యాలి? ఎవర్ని వొదలాలి? అప్పటికి ఈ సాహిత్యం అంటే- హేతువాద సాహిత్యం దాటి, మార్క్సిస్టు సాహిత్యం వైపు వొచ్చేసాం. ఏది చదివినా, ఏది విన్నా అదొక ఉద్రేకం. అదొక అలజడి. అదొక దాహం.

    విడిగా ఉత్తరంలో అడిగానో, లేక ఆంధ్రజ్యోతిలో అడిగానో గుర్తు లేదు. ‘గద్దర్ అభిప్రాయం తప్పు. అతను బూర్జువా కళాకారుడైనా అతనిలో ‘కళ ‘ అంటూ ఉంటే ఆ ‘కళను’ అభిమానించడంలో తప్పులేదు. సైగల్ శ్రావ్యంగా ఒక భక్తి గీతం పాడితే విని ఆనందించడలో తప్పులేదు.’ అంటూ రాశారు.

    అయితే, అంతటితో ఆగితే; ఆమె రంగనాయకమ్మ గారు కాదుకదా! ‘చక్కగా ఏ బడి పంతులుగానో, ఏ లాయర్ గానో నటించక, ఈ బూతు, రోత, వెకిలి వేషాలు అతనికి ఇంకా అవసరమా? సుడిగుండాలు తీసి నష్ట పోయానో అని ఒకటే గోల పెడతాడు.
    డబ్బు లెక్కలు అవన్నీ. రూపాయి పెడితే పది రూపాయలు రావాలి. ఇప్పుడు కొడుకుని నిలబెట్టాలని ఒకటే తాపత్రయం. మీరు ఇంకా అతన్ని అభిమానిస్తూనే ఉన్నారా , అతని ఫోటోలు గోడకు తగిలించుకునే ఉన్నారా?’ అని, అడిగారు.

    (ఆ గద్దరే నయం. ఏదో ఒక్క మాటతో పోయేది. అడిగి ఎన్ని అనిపించు కున్నామో కదా!)

    ఇప్పుడు ‘సారంగ’ వి చదువుతూ ఉంటే అది గుర్తు కొచ్చింది.

  • సత్తిరాజు శ్రీనివాస్ గారూ,
    “ఆవిడ రచనలు అన్నీ చదివేశాను 1983 వరకు….”-
    ఏం చదివారు! పచ్చి బురద అబద్ధం రాశారు. రంగనాయకమ్మ గారు 1983 అక్టోబర్ లొనే
    ” చైనాలో ఏంజరుగుతోంది?”అనే పుస్తుకం రాశారు. భారత దేశంలో లొనే మొట్టమొదట, చైనాలో కమ్యూనిస్టు పాలన మీద,మావో మీద మార్క్సిజం దృష్టితో విమర్శిస్తూ ఆ పుస్తుకం రాశారు,రంగనాయకమ్మ గారు. మార్క్సిజంలో ఖాళీలు వెతికిన బాలగోపాల్ లాంటి వారికి,చనిపోయే వరకు ఆ పుస్తుకంలో మావో మీద విమర్శలు మింగుడుపడలేదు. ఆయనకే కాదు,ఇప్పుడున్న అన్ని కమ్యూనిస్టు పార్టీల వారికీ మింగుడుపడలేదు,ఈనాటికీ.
    దీన్ని బట్టి మీరు పేద్ద వజ్ర మూర్ఖడువి లాగున్నావు. నీవు రాసిన ప్రకారం మీకు 58 ఏళ్ళు. మీకు చాదస్తం,మతితప్పడం లాంటివి ఉన్నాయేమో.
    మీ వైద్య పరీక్షలు జరిపించుకొనుటకు సాయం అవసరమైన యెడల మీ బాంక్ వివరాలు రాయండి

    • అయ్యా కొంగర గారు మీ నందన వనంలో విహరించే ఓపికా తీరుబాటు నాకు లేవు..పైన ప్రీతం గారికిచ్చిన సమాధానం చదువుకోండి వీలు చిక్కితే..ఇంక డబ్బు చాలా ఆడేస్తోంది అనుకుంటా మీ దగ్గిరా కోవిడ్ సమయంలో పనీ పాటా చేసుకోలేకా అలాగని అడుక్కోలేక అలమటిస్తున్న పేద కుటుంబాలకి కాస్త పంచి పుణ్యం మూట కట్టుకోండి నాలాంటి వదరుబోతుని సంస్కరించడం కన్నా..అది చేస్తే..మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు పుష్కలం. తరువాత ఎలక్కి పిల్లి సాక్ష్యం అన్నట్టుగా..ఎప్పుడో చచ్చిపోయిన బాల గోపాల్ లాంటి మహాను భావునితో ఈవిడని పోల్చడం బాల గోపాల్ ని చిన్నబుచ్చడమే.. కోర్టు ముందుకెళ్ళి బాల గోపాల్ అర్రెస్ట్ తప్పించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు..క్షమార్పణలు చెప్పలేదు పైగా వెరెవరి అభిప్రాయలో నావి కావు..కేవలం నేను పంచుకున్నా అంతే..అనే సిగ్గు మాలిన మాటలు మాట్లాడలేదు…ఇది చాలు మీ వ్యక్తి ఆరాధన ఏ స్థాయిలో ఉందో అనేది..తెలుసుకోడానికి…

      • సత్తిరాజు శ్రీనివాసు, నువ్వు నిజంగానే వదరుబోతువి. కోర్టు ముందుకెళ్ళి క్షమాపణ చెప్పుకున్నది ఎవరు? మార్క్సిస్ట్ రంగనాయకమ్మా? గుంటూరులో ఫేస్ బుక్ షేర్ చేసుకున్న అలాంటి పేరే ఉన్న ఇంకొక వ్యక్తా? పేస్ బుక్ లో పోస్టు చేసిన రంగనాయకమ్మ గుంటూరుకి చెందిన వారు. ఆమె సీఐడీ విచారణకి హాజరైనారు. క్షమాపణ ఏమీ చెప్పలేదు. ఈ మాత్రం స్పృహ లేదంటే నీ బుర్రలో వదరుబోతు రసాయనాలు ఊరు తున్నా యన్న మాట.

  • ఈ మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని చదివి , స్నేహితులు తో చర్చిద్దామంటే ఒక్క ఉదాహరణ కూడా లేకపోయే .. నార్త్ కొరియా ???

    మొట్ట మొదటి పారీశ్రామిక విప్లవం వచ్చిన యూరోప్ లో పిల్లలు, స్త్రీలు, బలహీనులు అన్న తేడా లేకుండా జనాలని బలవంతంగా పని చేయించుకుని ( లేక పేదరికం తో పని లో వెళ్లాల్సి వచ్చి ) , తక్కువ డబ్బులు ఇచ్చి ( ఇందులో బానిసత్వం కూడా ఉంది ) శ్రమ ని దోచుకునే వర్గాలు ఉన్న పరిస్థితులు నుండి పుట్టుకొచ్చిన సిద్ధాంతం . ఆ దేశాల్లో , ఆ సమాజాం లో ఉన్న పోకడలు, ధనిక , పేద వర్గాలు ఇవన్నీ ముఖ్య పాత్ర పోషించాయి .
    శారీరక శ్రమ తప్పిస్తే, మేధో శ్రమ గురించి చర్చ ??. అప్పట్లో శారీరక శ్రమ పాత్రే ఎక్కువ కాబట్టి . తక్కువ జనాభా , అప్పటికే అక్షరాస్యత కూడా ఉండటం , ఇవన్నీ కూడా విజయం లో ఒక భాగమే .

    కానీ మిగతా దేశాల్లో , ఆయా సమాజాల్లో ఉన్న పోకడలు భిన్నంగా ఉన్నాయి . ఇండియా లో ఉన్న కుల వ్యవస్థ దీనికి ఉదాహరణ .

    చైనా లాంటి దేశాలు ఈ సిద్ధాంతాన్ని వదిలి , పెట్టుబడి దారి వ్యవస్థ లోకే వెళ్లిపోవాల్సిన అవస్థ ,ఎందుకో తెలియదు .

  • కామ్రేడ్ రంగాజి ( రంగనాయకమ్మ గారు ) నిత్య, నిరంతర అధ్యయనం చేస్తూ, ఎంతో కష్టపడి విషయ పరిజ్నానంతో, సాధికారికతో రచనలు చేసారు కానీ ఊహాలోక ఉబుసుపోని చౌకబారు సాహిత్యాన్ని సృష్టించలేదు. అప్పటినుంచీ, ఇప్పటి వరకూ రంగాజి తన రచనా వ్యాసాంగాన్ని పేరుకోసమో, డబ్బుకోసమో చెయ్యటం లేదనేది… ఓ సామాజిక బాధ్యతగా తీసుకునే చేస్తున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. సత్తిరాజు శ్రీనివాసు గారు తన స్పందనలో పరుషమైన పదజాలం వాడటమే కాక కొన్నిచోట్ల సభామర్యాదల హద్దులు మీరుతూ కొంత జుగుప్సాకరమైన అసభ్య పదజాలం వాడారు. వారు తన వాదన వినిపించాలి కానీ, తనే ఓ వన్ సైడెడ్ జడ్జ్మెంట్, తీర్పూ ప్రకటించకూడదు కదా.

    క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు ఫిలాసఫర్స్ సోక్రటీసు, ప్లేటో, అరిస్టోటిల్…. బుధ్ధ, కన్‌ఫ్యూషియస్, కాంట్… నుండి హెగెల్, కార్ల్ మార్క్స్ … హిందూ, బుద్దిస్ట్, జైన్, క్రైస్థవ, ఇస్లాం వేదాంతుల ప్రతిపాదనల నేటి పరిణామక్రమంలో … కాలపరీక్షకు నిలిచి నేడు మనం పరిశీలిస్తున్న ప్రతిపాదనలను చాదస్తపు మనుషుల ఊక దంపుడు ఆలోచనలే అని కొట్టిపారెయ్యడం సబబేనా.

    సత్తిరాజు శ్రీనివాసు గారి కువిమర్సను తమ ప్రతివాదనలతో ఖండించిన యూ. హెచ్. ప్రీతం, కొంగర నందకుమార్ లకు అభినందనలు, నెనర్లు తెలియచేసుకుంటున్నా.

    • రామయ్యగారికి..సాంప్రదాయ పద్ధతిలో విమర్శలు ఆవిడెప్పుడూ చెయ్యలేదు నాకు తెలిసినంత కాలమూ..ఆ దృష్టిలోపం మీదైనప్పుడు నన్ను మాత్రమే అభిశంసించడం మీకు ఆవిడ పట్ల ఉన్న వ్యక్తి పూజో ఆరాధనో ఇంకేమన్నానో నాకనవసరం. ఆవిడ ఆలోచనలు నిజంగా గొప్పగానే ఉంటే..కాలానికి నిలబడతాయేమో చూద్దాము. ఆవిడ విషవృక్షాలు రాసిన సమయంలో నేను ఎక్కాల పుస్తకం చదువుకుంటున్నాను రామాయణ విషవృక్షం మానసిక పరిపక్వత లేని సమయంలో చదివిన పాపానికి రామాయణంలో ఉన్న ఉన్న గొప్ప విషయాలు తెలుసుకోడానికి ఓ 30 ఏళ్ళు ఆలస్యం అయ్యింది ప్రపంచం తిరగటం మూలాన్న భారతీయత గొప్ప తనం అర్ధమయ్యింది ..అక్కడే ఉంటే మీ అభిప్రాయాలు బహుశా నావి కూడా ఉండేవేమో..ఎదగడం అంటే..ఆలోచనను ఆవిష్కారపు తాలూకు మూలాలు వెతికి పట్టుకుంటే..అవి ఆత్మ న్యూనతలోనుంచి వచ్చిన ఓ గొప్ప ఆధిపత్య ధోరణే…ఈ సిద్ధాంతాల రాద్ధాంతాలు అనేది. మామూలు మనుషులకి ముఖ్యంగా నేటి యువతరానికి చాలా స్పష్టం గా అర్ధమవుతుంది కారణం..వారికి విషయాలలో ఉన్న లోతు పాతులు అరచేతిలో ఇమిడే సాంకేతికతగా మారి పోవడం తో హిట్లర్ లాంటి నాయకులకి గోబెల్స్ లాంటి ప్రచారకులకి కాలం చెల్లింది..అని తెలుసుకోలేక పోవడమే నిజగా విచారించ వలసిన విషయం తప్పా నా వాచాలత కానే కాదు…పొరపాటుని ఒప్పుకునే నా ముందు మీలాంటి వారు ఒక వ్యక్తి పూజలో కొట్టుకు పొయే మనుషులే…

      • బాబే రావాలి అని రంగనాయకమ్మ గారు ఎక్కడ అన్నారో,కొంచెం ఆ వివరాలు యిస్తారా.
        సింధు గురుంచి ఆవిడ ఏ సందర్భంలో అన్నారో మీకు ఒక్కసారి గుర్తు చేస్తా.
        రజత పతకం తెచ్చిందని ప్రభుత్వాలు ఒళ్ళు మరిచి బహుమతులు ప్రకటించిన సందర్భంలో ఆవిడ ఒక వ్యాసం రాసారు ఆంధ్రజ్యోతిలో.
        ఆ వ్యాసం ఏ విధంగా తప్పు ?

      • “గోబెల్స్ లాంటి ప్రచారకులకు కాలం చెల్లింది” అన్నారు. కానీ, అది నిజం కాదనడానికి రుజువు, మీరు రంగనాయకమ్మ గురించి రాసిన అబద్ధాలే. కోర్టుకి క్షమాపణ చెప్పిందనీ, వేరెవరి అభిప్రాయాలో పంచుకున్నాననే సిగ్గుమాలిన మాటలు అన్నదనీ, బాబే రావాలని రాసినదనీ – ఇలా, గోబెల్స్‌ని మించిన అబద్దాలు రాసి, ఆమె ఎక్కడన్నదీ చూపించమంటే, తేలు కుట్టిన దొంగలా కిక్కురుమనలేదు. పైగా, పొరపాటు ఒప్పుకునే నా లాంటి వాడు… – అని ఆత్మ స్తుతి, పర నింద .

        – ప్రసాద్

      • సత్తిరాజు గారూ , ” పొరపాటుని ఒప్పుకునే నాముందు….” – అని ఊరికే స్వంత డబ్బా కొట్టుకోవడం,అబద్దాలు రాయటం తప్ప,పొరపాటుని ఎక్కడ ఒప్పుకున్నారు ? మార్క్సిస్టు రంగనాయకమ్మగారు కాదు,
        గుంటూరు వాస్తవ్యురాలైన రంగనాయకమ్మ fb లో పోస్ట్ పెట్టేరు,అని మీకు రాసిన కామెంట్ లో రాశాను. ఎక్కడ మీ పొరపాటుని ఒప్పుకొన్నారు?
        రామాయణంలో ఉన్న గొప్ప విషయాలు ఏవో రాయండి. మీ ఆలోచనా విధానం ఏమిటో తెలిసికుంటాము.

      • శ్రీనివాస సత్తిరాజు,
        ద్రుష్టి లోపం రామయ్య గారిలో లేదు. వారు ఇప్పటికీ చదువుతూనే వున్నారు, నేర్చుకోవడం ఆపలేదు. మీలోనే వుంది దృష్టి లోపం! అందుకే 1983 వరకే చదవగలిగారు. దృష్టి లోపం వల్ల ఆ తర్వాత చదవలేక పోయారు.
        వ్యక్తి పూజకు రంగనాయకమ్మ గారు ఎంత వ్యతిరేకమో,వారి పాఠకులూ అంతే వ్యతిరేకం.రామయ్య గారైనా నేనైనా మరొకరైనా. అంతే మరి!
        వారి ఆలోచనలు కాలానికి నిలబడతాయో లేదో చూస్తూ ఉండండి, ఫరవాలేదు.మరి, ఈ చెత్త రాతల పనెందుకు నెత్తిన పెట్టుకుంటున్నట్టు?ఈ సిద్ధాంతాలూ రాద్ధాంతాలూ, ‘ఆత్మ న్యూనత లోనించి వచ్చిన ఓ గొప్ప ఆధిపత్య ధోరనే’ అని ఊరుకోరాదా? ఈ రాతలవెంట ఎందుకు పరిగెడుతున్నట్టు?
        ఒక విషయం బాగుంది. మీవంటి గోబెల్స్ ప్రచారకులకి కాలం చెల్లింది.మరి,కాలం చెల్లిన మాటలతో ఊగులాటెందుకో?

  • సత్తిరాజు శ్రీనివాసు గారు ,

    ఉద్రేకాలకు, ఆవేష కావేషాలకు లోను కాకుండా… పరుష పదజాలాలను వాడకుండా… ఎదుటివారి దూషణ సొంత భూషణల లౌల్యాయలకు లొంగకుండా… రంగాజీ గారి క్రింది వాదనలకు ధీటైన ప్రతివాదనలేమైనా మీవద్ద ఉంటే వినిపించండి.

    1) ఆడ వాళ్ళ మీద, మొగ వాళ్ళ పెత్తనాలూ; అడుగు కులాల మీద, పై కులాల పెత్తనాలూ; పేద జనాల మీద, ధనవంతుల అధికారాలూ – గురించి రంగాజీ గారు మాట్లాడారు. అండులోని అనౌచ్యం ఏవిటో చెప్పండి.

    2) సమాజంలో పలు రకాల ఒత్తిళ్ళూ, అలజడులూ వుంటే, అవి ఎందుకు వుంటున్నాయో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు చూడాలి గానీ, ఎక్కడా లేని దేవుడి పేరుతో ఉపశమనం పొందాలా? మూఢ భక్తిని ఖండించాల్సిందే అన్నారు

    3) ‘మార్క్సు’ కంటే ముందు నించి కూడా భారతీయ సమాజంలో పురోగామి కృషీ, ‘సమ సమాజ స్థాపక కృషీ’ సాగుతూనే ఉంటే అతి నిరు పేదలూ; అడుక్కుంటూ తిరిగే బిచ్చగాళ్ళూ; వ్యభిచారాలతో బ్రతికే బికారి స్త్రీలూ, మన కళ్ళ ముందు ఇంకా ఎందుకు వున్నారంటారు? చెడ్డలన్నిటినీ, ఎక్కడివి అయినా, తిరస్కరించ వలిసిందే; అలాగే, ‘మంచి’ అనేది, ఎక్కడి దాన్ని అయినా స్వీకరించ వలిసిందే.

    4) ‘రష్యా, చైనాల్లో దేశాల్లో కమ్యూనిజము, విప్లవాలూ కొన్ని ప్రయత్నాలు చేసి, దోపిడీ ప్రభుత్వాల్ని కూలదోయడం వరకూ చెయ్య గలిగారు. ఆ తర్వాత జరిగిందీ, అక్కడ వున్నదీ, మళ్ళీ దోపిడీయే. అక్కడేదో కమ్యూనిజమూ, విప్లవాలూ, సాగిపోతున్నాయి – అనుకోకూడదు.

    5) ‘కమ్యూనిజం’ అనే విషయాన్ని, ‘ఎరువు తెచ్చుకున్న సిద్ధాంతం’ కాదు. ‘సైన్సు’ ( సమాజపు సైన్సు ). ‘సైన్సు’ అనే దాన్ని దేన్ని అయినా, ఒకరి నించి ఒకరు నేర్చుకోవాలి. అది ఎరువో, అప్పో, అవదు. ఎక్కడి సంస్కృతి అయినా, మానవత్వ, సమానత్వ సంస్కృతులు గానే సాగాలి.

    6) కమ్యూనిస్టు పార్టీల నడక, దోపిడీ పార్టీల నడక కన్నా భిన్నం కానప్పుడు, వారి దగ్గిర కమ్యూనిస్టు సిద్ధాంతమే లేదని అర్ధానికి రావాలి. అటువంటి అన్యాయాలతో సాగే పార్టీల్ని ప్రజలు ఆదరించాలని ఎవ్వరూ అనక్కర లేదు.

    7) ‘నిరు పేదలూ X భాగ్య వంతులూ వున్న సమాజంలో, ఆ వైరుధ్యాల్ని తీసి వేసే జవాబు ఏమిటి? దానికి మార్క్సిజం ఏం చెప్పింది? ‘శ్రమ దోపిడీని తీసి వెయ్యడమే ఆ సమస్యకి పరిష్కారం’ అని చెప్పింది. మార్క్సిజం దృష్టి ఏమిటంటే, ఈ తప్పుడు సమాజాన్ని, ఉత్తమ సమాజంగా మార్చాలని!

    8) ఇంత వైరుధ్యం ఎందుకు జరిగిందంటే అసలు ‘కమ్యూనిజం’ అంటే ఏమిటో, అదేం చెప్పిందో తెలియక! మీరు మరింత మంచి సిద్ధాంతాన్నే కోరేటట్టయితే, అది వచ్చినప్పుడు దాన్నే పాటించ వచ్చు. ఇప్పటికి వున్న ‘మంచి’ని ఎందుకు స్వీకరించరు? మీకు ‘మంచే’ కావాలంటే, మీరు ‘మార్క్సిస్టు’ అయి తీరాలి! ఇంకా ‘మంచి’ కోసం ఎదురు చూస్తూ, దొరికిన మంచిని వదులు కుంటారా?

    • శ్రీనివాస్ సత్తిరాజుగారూ,

      సాంప్రదాయ పద్ధతిలో విమర్శలు చెయ్యడం అంటే ఏమిటి? విమర్శలు చెయ్యడంలో ఒక్కొక్కరి పద్ధతి ఒక్కోలాగా ఉంటుంది. మీ సాంప్రదాయ పద్ధతి ఏమిటి? విమర్శ వొదిలెయ్యండి. మీ స్పందన కూడా సాంప్రదాయ పద్ధతిలో లేదని మీ పదజాలాన్ని చదివితే తెలుస్తుంది.

      రామాయణ విషవృక్షం రంగనాయకమ్మగారు రాయలేదా? అందుకని ఆవిడ రాసిన చిత్తుప్రతి మీకు చూపించాల్సిన అవసరం ఆవిడకే కాదు ఎవరికీ లేదు. ఆవిడ విషవృక్షం రాసిన సమయంలో మీది ఎక్కాలు చదివే వయసు. అప్పుడే మీకు చదివే వయసు ఉండివుంటే ఏం చేసేవారు? ఇప్పుడు చదివితేనే మీకు “పాపం” చుట్టుకుంటుందేమో? పోనీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ శ్రీరామచంద్రుడు పిత్రువాక్య పరిపాలకుడేనా?

      భారతం మీదా వేదాల మీదా అసంపూర్ణ విశ్లేషణ చేశారు అన్నారు. సంపూర్ణ విశ్లేషణ అంటే ఏమిటి?

      ప్రపంచం తిరగటం మూలానా మీకు భారతీయత గొప్పదనం అర్థమైందా? మాకు కూడా చెప్పండి. మేమూ తెలుసుకుంటాం. శ్రమ దోపిడీ ఎక్కడైనా ఒకటే. మీ భారతీయత ఇక్కడి ప్రజల సమస్యలకి చిట్టి పరిష్కారం అన్నా చెబుతుందా? తాగునీళ్ళు, రోడ్లు, వేశ్యల సమస్య, హిజ్రాల సమస్య – ఇన్ని లేవా? ఇన్ని పెట్టుకుని మా సంస్కృతి గొప్ప అనుకుంటే దాన్ని ఏమనాలి? భారతీయతే కాదు, ఏ “యత” అన్నా మంచిదే ఆ దేశంలో సమస్యలేవీ లేకుంటే, ముఖ్యంగా ” శ్రమదోపిడీ”.

      రంగనాయకమ్మగారి మీద ఇప్పటికి వంద విమర్శలూ, నూటాపదిహేడు నిందలూ చదివాము. ఆవిడ రాసిన దాని మీద సరిగ్గా ఎవరూ ప్రశ్నలే అడగలేదు. ఎందుకంటే అడగలేరు కాబట్టి.

      పోనీ – రంగనాయకమ్మగారి రచనల్ని వొదిలెయ్యండి. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒక్కదానికి శాశ్వత పరిష్కారం చెప్పి, ఆ రకంగా “విషవృక్షం” చదివిన పాపాన్ని పోగొట్టుకోండి.

      – భూషణ్

  • “…చట్టం తన పని తాను చేసుకెడుతోంది ఈ మధ్య నిశబ్దంగా..కాబట్టి హిందూ జాతి ఇదివరకూలా అంత సహనం శాంతి ఏం చూపించక పోవడమే వీరిలో వస్తున్న అసలయిన మార్పుకి అసలు కారణం..అనేది కాస్త ఆలోచించ గలిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే..సత్యం..”
    Is it a waning???

  • “‘సమ సమాజం’ అంటే, మానవ సంబంధాల్లో, అసలు ఎటువంటి మార్పు ప్రారంభం కావాలో గ్రహించిన మేధావులు మార్క్సు – ఎంగెల్సు ఇద్దరే. దాన్ని, ఆ ఇద్దరి తర్వాత అనేక మంది నేర్చుకున్నారు; దాన్ని గ్రహించిన వాళ్ళు, దాన్ని ఇతరులకు బోధిస్తున్నారు” this is an excellent part of this interview.

  • ప్రశ్నలు, వాటికి రంగాజీ సమాధానాలు చాలా బాగున్నాయి. 👍👍👍

    • ఇక ఈ ఇంటెర్వ్యూ మీద చర్చ ముగిస్తున్నాం.
      -ఎడిటర్

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు