సరిహద్దులు మలిగే వేళ వస్తుందా?

రెండు గదుల నడుమ గోడ వేళాకోళమాడుతోంది.
ఇంటికీ ఇంటికీ మధ్య సరిహద్దు రాయి
పక పక నవ్వుతోంది.
దేశాల మధ్య ఊహా రేఖల కంచెలు
వేలంవెర్రిగా గోల చేస్తున్నాయి.
అన్నీ కలిసి
సామాన్యుడి దీన గాథాలహరి కి
తూటాల పేలుళ్ల దరువులతో
యుద్ధ గీతాన్ని శ్రుతి చేస్తున్నాయ్.
ప్రాణం పోయేప్పటి
భయ విహ్వల ఆర్తనాదాలు- ఆరోహణ.
బొంగురు పోయిన గొంతులో గాయాల మూల్గులు- అవరోహణ.
వెరసి హృదయ విదారక
విశ్వ విషాద గీతిక.
ఒకరి కోసం ఒకరు నిలిచిన  ఆదిమ క్షణాలు
ఎప్పుడో గతంలో కలిసి పోయాయి.
ఆ తొలినాళ్ళ భూగ్రహ పచ్చందనమంతా
దారుణ మారణ కాండకు బలైన
మానవ దేహాలతో మసి బారిపోయింది.
సాటివారిని మూకుమ్మడిగా కూలదోసే అగ్రరాజ్యపు క్రూరుడు,
నీరో వారసుడు… చూడు!
పైనాపిల్ కేక్ మీద
ఏ పళ్ళ ముక్కలు అమర్చు కోవాలో
ఎంచుకునే సుదీర్ఘ మౌనంలో మునిగి, తేలుతున్నాడు.
చెవులు లేని కపాలం వాడిది
కనుదోయి బదులు
అహం వరల అడుగున కణపెణలాడుతూ
యుధ్ధాగ్ని రవ్వలున్న నుయ్యి, గొయ్యి.
వాడి దేహంలో రక్తం లేదు ఆధిపత్యం ప్రవహిస్తోంది.
మాత్సర్యం,మదం, ఉన్మాదం ముప్పేటగా
వాడి ఎముకల మజ్జలో నిత్యం ఊరుతున్నాయి.
ఆకలి, కామం, కోపం
లాభం,అధికార మదం అనే పంచాగ్నుల్లో కాలి కనలి,
స్వార్ధం పెచ్చులు కట్టిన లోహపురుషుడు వాడు.
వాడే…
యూరప్ లో తొలిసారి
రక్తం చిందే యుద్ధ కాగడా వెలిగించిన సైన్యాధికారి.
విషవాయువు గదుల్లో వేలమంది ఉసురు తీసిన నియంత.
శాంతి పతాకపు తెలుపు అంటే వాడికి వెగటు.
హంస, పావురం జాతి కాదు వాడు.
కనీసం కొంగైనా కాదు.
దొంగ చాటున ఎట్నుంచో దూసుకొచ్చి,
పసి పిల్లల తన్నుకు పోయే డేగ…వాడు.
కడబట్టిన ప్రాణం
ఈసురోమని ఏడుస్తుంటే పొడుచుకు తినే
రాబందు… వాడు.
యుద్ధంలో,
గెలుపు- ఓటమి,
వీరమరణం-విజయ హాసం దక్కుతాయనే నీతిని పాతిపెట్టి
చావుకి లొంగని స్వార్థం తో, గెలుపుకు సంతృప్తి చెందని క్రౌర్యం తో
కనిపించినవన్నీ కబళించే క్యాన్సర్ లాంటి క్రూరుడు వాడు.
తడవ తడవకి
బలం కూడగట్టుకుంటోన్న
కొత్త ‘ధాతువు’ వీడు
ఏమన్నా అంటే
పురాణాలు విప్పేనంటారు గానీ
చిందిన ప్రతి రక్తపు చుక్క లోంచి
మరొకడు పుట్టాడన్నా,
తెగిపడిన తలచోట
కొత్త తల మొలిచిందన్నా ‘వింత కతలు’ అని అంటారు గానీ….
రవి అస్తమించని సామ్రాజ్యమేలినా,
పిన్నీసు నుంచి పిడకల దాకా ఆన్లైన్ లో అమ్మినా
ఈ కుటిల వ్యాపారి ధనార్జన కాంక్షే కదా!
తిండీ- బట్టా, విద్యా-వినోదం ఇల్లు- విహారం అన్నింటా
తన బ్రాండ్ వస్తువులే
అమ్మి, అమ్మి,
చరవాణి వైరస్ ను మెదడు  లోకి
డాలర్ రోగాన్ని మనసు లోకి ఇంకా ఇంకా లోపలికి ఇంకించి,
సంపదల డాబు కౌగిట్లోకి ‘రా రమ్మం’టూ ప్రేరేపించే
పక్కా వర్తకుడు వాడు.
సరికొత్త జన్యు మార్పిడి చెందిన
ఈ తరం రక్త పిపాసి వాడు.
కయ్యానికి కాలు దువ్వి
అమాయకుల ఆర్తనాదాల నేపథ్య సంగీతం లో
నగరాలను కూల్చి,
బడీ- గుడీ పేల్చి
బీభత్స యుద్దభూమి లో
పసికందుల కళేబరాల గుట్ట మీద
కరాళ నృత్యం చేసే
నిలువెల్లా విషం నిండిన ఖలుడు వీడు.
డైనోసార్ల యుగం నాటి అంతర్యుద్ధం,
రాజుల కాలంలో ప్రత్యక్ష యుద్ధం
విన్నాం.
కళ్ళారా చూసాం.
అయ్యో,అయ్యో,
వామ్మో!!!
ఈ నరహంతకుల తరంలో అంతరించబోతున్న జాతి ఏది?
పొంగి పొరలే ‘డౌలీ’ లాంటి నదులెన్ని?
పృధివి పొరల్ని కకావికలం చేసే
హింసా విస్ఫోటన విన్యాసాలేంటి?
వాడి చేతిలో తుపాకులకి ప్రాణం వచ్చి ఎదురు తిరిగితే బాగుణ్ణు!
ఆ క్షిపణుల మీటలకి విసుగు పుట్టి
మొండికేస్తే బాగుణ్ణు.
‘తమ చిత్తం బాస్’ అంటున్న సైనికులంతా
నేలకొరిగిపోతున్న మానవ సమూహాన్ని చూసి
పొగిలి పొగిలి ఏడ్చి,
కదిలి కదిలి ఎదిరించి
వాడి వికటాట్టహాసాన్ని తుడిచిపెట్టి,
ఆ వంకర్లు తిరిగిన మెదడుకు గురిపెట్టి,
“ఆధునికత అంటే
నిత్య యుధ్ధం కాదురా,
ఖగోళ గ్రహాలను సైతం కబళించే నీచ ప్రవృత్తి కాదురా!”
అని హుంకరిస్తే బాగుణ్ణు.
థెమిస్ న్యాయదీక్షకు వారసురాలు ఇరీన్ ,
జూపిటర్ ధర్మనిరతికి
సొంత కూతురు పాక్స్ ,
శాంతాకారుడు విష్ణువు,
అహింసా మూర్తి బుద్ధుడు… ఎవరి ప్రతినిధైనా పర్లేదు.
ఎవరో ఒకరు వస్తే బాగుణ్ణు.
కంటికి కన్ను,
బాంబుకు బాంబు
జవాబు కాదని చాటి చెప్పి
లక్షల ఏళ్ళ సంస్కృతిని
రక్షిస్తే బాగుండు.
చిటికెడు మట్టిలోంచి మొలకలు పుట్టించే
నేల తల్లిని కదా!
పిడికెడు గర్భసంచిలో
పది మంది పిల్లల్ని కనే అమ్మను కదా నేను?
ఏ దేశ ప్రజలైనా
నాకు బిడ్డలే కదర్రా!
నా
కంఠశోష
గుండె కోత
కన్నీటి వెత
కడుపు తీపి
వినగల చెవులుంటే
మారు పలికే మనసుంటే
ఒక్కసారి రండర్రా!
తలో చేయి వేసి,
హింస లేని ప్రపంచాన్ని
మళ్ళీ సృష్టిద్దాం.
నమ్మితే మోసం చేయని నీతిని ప్రకటిద్దాం.
స్వేచ్ఛ స్వతంత్రత కలిపి,
ప్రాణ వాయువును పునరుధ్ధరించి ప్రసరింప చేద్దాం.
అంతరాల గోడలు లేని
ఏకాండీ లోకం లో
శిశువుల కేరింతలకు
వంత పాడే అమ్మానాన్నలను రక్షిద్దాం.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

శైలజ కాళ్ళకూరి

6 comments

Leave a Reply to VLNARASIMHARAO Bodapati Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నీ స్థాయిలోనూ జరిగేది ఇదే.
    జవాబుదారీ వ్యవస్థ లేక పోవడం, లేదా ఉన్న సరిగ్గా పనిచేయ లేక పోవడం ముఖ్య కారణం.
    ధన దాహం లావాలా కబళిస్తోంది మానవ జాతిని. ఎంత ఉంటే సంతృప్తో తెలియడం లేదు.
    టెర్రరిస్టు కి బెస్ట్ డెఫినిషన్ ట్రంప్.
    కంటికి కనిపించే లా , చెవులకి వినపడేలా ఉంది మీ కవిత., కానీ వాడికి ఈ రెండే కాదు ఏవి లేవు. వ్యాపారం తప్ప.

  • చాలా బాగా రాసేరు. చిన్నపటి పద్యం గుర్తు వస్తోంది చెల్లీ. బలవంతుడ నాకేమన్ని పలుగురు తో నిగ్రహించి పలుకుట మేలా. బలమైన సర్పము చలి చీమల చిక్కి చావదే సుమతీ.
    పద్యం పూర్తిగా గుర్తు లేదు.

  • “కనుదోయి బదులు
    అహం వరల అడుగున కణపెణలాడుతూ
    యుధ్ధాగ్ని రవ్వలున్న నుయ్యి, గొయ్యి.
    వాడి దేహంలో రక్తం లేదు ఆధిపత్యం ప్రవహిస్తోంది.
    మాత్సర్యం, మదం, ఉన్మాదం ముప్పేటగా
    వాడి ఎముకల మజ్జలో నిత్యం ఊరుతున్నాయి”

    “రక్తం చిందే యుద్ధ కాగడా వెలిగించిన సైన్యాధికారి.
    విషవాయువు గదుల్లో వేలమంది ఉసురు తీసిన నియంత.
    శాంతి పతాకపు తెలుపు అంటే వాడికి వెగటు”

    నరనరాన క్రౌర్యం, పైశాచికత్వం, యుద్ధోన్మాదం నిండిన రక్తపిపాసి గురించి మీరు రాసిన వాక్యాలు అద్భుతం..
    చివర్లో మరింత అద్భుతమైన ముగింపుతో కవితకు సామాజిక పారమార్థికతను, ప్రయోజనాన్ని అందించారు. అభినందనలు మేడమ్ గారు. 💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు