సంయమన ఉద్యమగానం – ‘నాగస్వరం’

చాలా సాధారణoగా కనిపించే వాక్యంలో తీవ్రమైన అంశాన్ని ప్రభావశీలంగా చెప్పగలిగాడు కోటేశ్వరరావు.

“గాయాలే స్వర మాతృకలుగా చేసుకుని పిల్లనగ్రోవిరాగాలు పలికినట్లు రాసుకున్న కవిత్వమిది”అంటూ యాభైకవితలసారాన్నిఒకేఒకవాక్యంగా తనముందుమాటలో ప్రకటించుకున్న కవి,విమర్శకులు డా. కోయి కోటీశ్వరరావు కవితాసంపుటి “నాగస్వరం”. “ఈ దేశంలో దళిత బహుజనులను అనేక పేర్లతో పిలిసినప్పటికీ చారిత్రకంగా వారంతా నాగజాతి వారేనని డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ నుండి భూపతి నారాయణమూర్తి వరకూ ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. బుద్ధుని కాలం నుండీ నాగుల ప్రస్తావన ఉంది” అంటూ ‘నాగస్వరం’ శీర్షికకు గల నేపథ్యాన్ని పాఠకులు కవిత్వంలోకి ప్రవేశించడానికి ముందే వివరించాడు కోటేశ్వరరావు.ఐతే,ఈనాగస్వరానికి స్వరమాతృకలై, ఇంతటిఆవేదనకు, చైతన్యానికి, ప్రతిఘటనకు వాటన్నిటి ఫలితమైన తీవ్రత నిండిన కవితలకు కారణమైన ప్రధాన గాయాలు రెండే  – అంటరానితనం, పేదరికం.

మొదటిసారి చీరకట్టుకున్న కూతురిని చూసి, అమ్మ గుర్తొచ్చి, కళ్ళు చెమర్చి రాసుకున్న కవితలో – “నిన్న నా ఎద మైదానంపై ఆడుకున్న పసిమొగ్గ,  నేడు తారుణ్య పుష్పమై ప్రత్యక్షమైంది” అంటాడు.ఆమెను అలా చూడగానే, “మనసుతోట నిండా మా అమ్మ వాసన” అంటూ తల్లిని తలచుకుని మురిసిపోతాడు, కవి.

మరో కవిత “ప్రాణ వాయువు”లో “పాదు జాడనే  కాదు, పందిరి నీడను కూడా సదా స్మరించుకోవాలి” అని తండ్రి త్యాగాన్ని తెలియజేస్తాడు.  తన తమ్ముడిని “తాపీ పెన్నుతో నగరం ఎదపై మహాసౌధ కావ్యాలను రచించే భవన ఋషి” అని కీర్తిస్తాడు. ఇది వారి తమ్ముడికే కాదు, తాపీవృత్తి కార్మికులందరికీ కి కావ్య గౌరవం కలిగించిన వాక్యం.

***

పుస్తకం 2024లో ప్రచురించినా, చాలా కవితలు రెండు, మూడు దశాబ్దాలకు ముందు రాసినవే. వాటిపై కలేకూరి ప్రసాద్ (2005లో) రాసిన అభిప్రాయాన్ని పదిలపరచుకుని ఈ పుస్తకంలో ప్రచురించడం ఈ సంపుటికి ప్రత్యేక ఆకర్షణ.

పుస్తకంలో కొన్ని కవితలు 1995-2000 మధ్యకాలంలో రాసినవి. అప్పటికే దళితవాద కవిత్వంలో అంబేడ్కరిష్టునేపథ్యాన్ని విస్తృతపరచుకుంటూ కవిత్వాన్ని కేంద్రీకృత వస్తువులో రాయడంమొదలయింది. అంటే తాను రాస్తున్న వస్తువు పట్ల, అభివ్యక్తి పట్ల కోటేశ్వరరావుకిపూర్తి స్పష్టత ఉంది, ఆ వాదానికి అవసరమైన స్వచ్చమైన, సమగ్రమైన తాత్విక భావధార పట్ల ఎరుక ఉంది. వీటికి తోడు, కోటేశ్వరరావు పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో కావ్యసౌరభాన్ని ఆఘ్రాణిoచిన వారు. అందుకే ఆవేదన అక్షరీకరించే క్రమంలో ఎక్కడా ఆలంకారికతకు లోటు రానీయలేదు.

“మిట్ట మధ్యాహ్నం,  వాడు మోస్తున్న ఇటుకల కాంతిలో

ఎరుపెక్కిన చెమట చుక్కలు తనువు నుండి రాలి పడుతుంటే

నేలతల్లిపై పగడాల వాన కురిసినట్లుంటుంది” – ఎంత గొప్ప కవిత్వం ఇది. ఇలాంటి చాలా ఉపమలు, ముందు చెప్పుకున్న అమ్మ కవితలో “రోకలిబండ కింద చితికిన దోసబద్దయి” లాంటి రూపకాలు ప్రతి కవితలో తారసపడతాయి. అలాగే, మద్దూరి నగేష్ బాబు పై రాసిన ఎలిజీలో – “కోడిపుంజులకు మేలుకొలుపులు నేర్పిన వాడా!” అనడం మరో అద్భుతమైన కవితా వాక్యం.   మరికొన్ని కవితల్లో “మల్లెతోట ముంగిట్లో మధుర పరిమళ సరిత్తులు” లాంటి అరుదైన పద సమూహాలు ఆశ్చర్య పరుస్తాయ్.

***

పుస్తకంలో తనకు  దార్శనికులు, మిత్రులు అయినవారు దూరమైనపుడు వ్రాసిన స్మృతి కవితలున్నాయి.ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాను ‘దివ్య నక్షత్రం’గా కీర్తించాడు.  ఎండ్లూరి సుధాకర్ స్మృతి కవిత ‘అగ్నిరాగం’లో వారి కావ్యనామాలనూ ప్రస్తావించి “వర్తమానం గుండెల నిండా కవన వర్షం కురిపించిన నల్ల ద్రాక్ష పందిరి తన జీవన లతను వెతుక్కుంటూ వెళ్ళి పోయింది” అనడం ద్వారా వారి సతీమణినీ స్మరించాడు.  ‘మద్దెల శాంతయ్య’ యాదిలోని కవితలో “మనుషుల్ని హృదయాలకు హత్తుకునే మగతల్లి”అనడం;  కవి శంబూక స్మృతిలో ‘నీలిపాటల ఏరువాక’ శీర్షికతో రాసిన కవిత – ఆయా వ్యక్తులతో సాన్నిహిత్యంగల వారికి ఆ అనుభవాలను గుర్తుచేస్తాయి, కొత్తవారికి వారి మూర్తిమత్వాన్ని కొంతైనా పరిచయం చేస్తాయి.

***

పల్లెనొదిలిపట్నంవచ్చినవారందరిదీఒకేలాంటిదుఃఖమేమో!శిఖామణి“యానాం కవితలు”లో

“పాతబడ్డ టైరులాంటి జీవితాన్ని

ఆట సాకుతో దొర్లించుకుంటూ, దొర్లించుకుంటూ

మాయానగర సర్కస్ గుడారానికి దారి తప్పి వచ్చానా?” అని వాపోతారు. కోటేశ్వరరావు అంతే.

“నా ప్రాణాలతో పల్లె తల్లి పాదాలు కడుగుదామని ప్రయత్నిస్తుంటే

రంగు రంగుల లోకం మళ్ళీ నన్ను పిలుస్తుంది.

పైర జొన్న చేలు విడిచి ప్లాస్టిక్ నవ్వుల వైపు వలస పోయే

సీతాకోక చిలుక లా మళ్ళీ నేను ఆ రంగుల లోకం వైపు పరుగు తీస్తాను.

అప్పుడు మా పల్లెతల్లి పాలపిట్టను, పైరగాలిని పిలిపించి

నన్ను తీసుకురమ్మని పంపిస్తుంది.

పట్టణమంతా అల్లుకున్న కరెంటుతీగల మధ్య

పాలపిట్ట కాలిపోయిందని

పరిశ్రమలు విసర్జించిన పొగమబ్బులు

పైరగాలి ఉసురు తీశాయని

ఊరు పొలిమేరల్లో నాకోసం ఎదురుచూసే మా పల్లె తల్లికి తెలీదు.

అసలు ఆమెకు ఏం తెలుసు? మనుషులను ప్రేమించడం తప్ప”.

కవి కేవలం పల్లె పట్ల ఆపేక్షను మాత్రమే కాదు, పర్యావరణ కాలుష్యాన్ని, తనకు మట్టితో గల మమకారాన్ని కవితలో నిక్షిప్తం చేశారు. మరోకవితలో మనిషితనం కోల్పోవడం గురించి తనదైన కోణంలో కవి వేదన చెందుతాడు. అనుదినం వార్తాపత్రికలకు ప్రధాన శీర్షికలవుతున్న అకృత్యాలను గురించి, వాటికి బలవుతున్న అక్కచెల్లెళ్ళ గురించి   “భూమినిండా విస్తరించిన వాంఛా సాగరంలో కొట్టుకుపోతున్న కన్నీటి పాటను నేను; నా దేహ క్షీరమంతా బొట్టు బొట్లుగా ఒలికిపోతుంది” అని సహానుభూతి చెందుతూ వాపోతాడు. ఈ కవితకు “ఆగర్భ శత్రువు” అని పేరు పెట్టి, ఇంతకీ ఎవరాశత్రువు అని పాఠకుడిని ఆలోచింప చేసి చివరకు “ఆడతనమే ఆగర్భశత్రువై అడుగడుగునా నా అస్తిత్వాన్ని హత్య చేస్తుంది” అంటాడు. అత్యాచారమే కాదు, హత్యా జరుగుతోంది. ఐతే, మరణిస్తున్నది అస్తిత్వం అనడం ద్వారా చాలా సాధారణoగా కనిపించే వాక్యంలో తీవ్రమైన అంశాన్ని ప్రభావశీలంగా చెప్పగలిగాడు కోటేశ్వరరావు.

***

ప్రాత:స్మరణీయులైన వారిపై వ్రాసిన కవితల్లోపంక్తులను అంతే ఉన్నతంగా అల్లాడు. భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా – “నెర్రెలిచ్చిన నేలపైకి జీవనదిలా నువ్వు వచ్చిన తరువాతే గోడలు గోడలుగా విడిపోయిన నా దేశం అఖండ భారతమై పరవశించింది” అనడంలో జాతిని ఏకీకృతం చేయడానికి జరిగిన ఒక నిరుపమాన కృషిని ఏక వాక్యంగా రాశారు

ప్రవాహంలో కొట్టుకుపోయినవారికి  చరిత్రలో శాశ్వత స్థానం దొరకదు, ఎదురొడ్డి నిలిచిన వారే ఆరాధనీయులవుతారు. అందుకే కవి –  మొదటి శ్రేణికి చెందినవారిని కరిగిపోయే మట్టిబెడ్డలుగా, ప్రవాహగతిని మార్చే వారిని జ్ఞాన శిఖారాలుగా అభివర్ణిస్తూ ‘సావిత్రీబాయ్ పూలే’ గురించిన కవితను మొదలు పెడతాడు.  గర్భిణీ వితంతువులు, అత్యాచార బాధితుల రక్షణ కోసం పూలే దంపతులు ‘బాల్హత్య ప్రతిబంధక్ గృహ’ అనే పిల్లల సంరక్షణ కేంద్రాన్ని స్థాపించారు. ఈ విషయాన్ని –

“మొగ్గకూ మోడుకూ మధ్య అల్లిన పెనుబంధం

పుటుక్కున తెగిపోయినపుడు

రగిలిన వేదనాగ్నిలో

రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణ దీపాలను

గుండెలకు హత్తుకున్నావు”.

పై వాక్యంలో – చిన్నారి పెళ్ళికూతుళ్ళను మొగ్గలుగా, ముసలి పెళ్ళి కొడుకులను మోడులుగా,  ఆ వితంతువులు జన్మనిచ్చిన శిశువులను వేదనాగ్నిలో రహస్యంగా పురుడుపోసుకున్న ప్రాణ దీపాలుగా పేర్కొని,  ఒక చారిత్రిక సత్యాన్ని చిరకాలం నిలిచే కవితగా మలిచాడుకవి.

ఆచార్య బిరుదురాజు రామరాజు స్మృతిలో “దేశీయ వాజ్మయ మందిరానికి మహనీయ గేయ సోపానాలు రచించిన అమేయ కవన శిల్పివి నీవు” అనడం మరో సతత హరిత కవితా వాక్యం.

***

ఏ సంగతిని స్పష్టం చేయడం తన కవిత్వపు పరమోద్దేశమో ఈ పంక్తులలో వెల్లడిచేస్తూ, సంపుటిలో చివరి కవితగా “నాగజాతి రక్త సంతకాన్ని నేను; దమ్మపథ బాటసారిని నేను; సత్య జ్యోతి కిరణాన్ని; నేను భీమ పతాకాన్ని; నాది నాగస్వరం” అని స్పష్టంగా నినదిస్తూ ముగిస్తారు. ముందుమాటలో కవి ఏమి చెప్పాడో చివరి కవితలోనూ అదే చెప్పడం ద్వారా తనకు ముందో మాట, వెనుకో మాట లేవని చాటుకున్నాడు.

డా. అద్దేపల్లి రామమోహనరావు 2001నాటి వారి వ్యాసంలో “ప్రతిఘటన వలన రాజకీయ పార్శ్వము, వాస్తవికత వల్ల సాంస్కృతిక పార్శ్వము, కవితాభివ్యక్తి వల్ల కళా పార్శ్వము దళితవాదం నిండుగా పండించుకున్నది” అంటాడు. ఈ మాటలు ఇపుడు ఎందుకు గుర్తుచేసుకోవాలి అంటే, పాతికేళ్ళు దగ్గర పడుతున్నా అద్దేపల్లి వారి నాటి మాటలు కోటేశ్వరరావు  “నాగస్వరం” కవితలకు అచ్చంగా అన్వయింపబడతాయి.

  • అవధానుల మణిబాబు.

99481 79437.

 

 

 

 

అవధానుల మణిబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు