శాశ్వత వర్తమానం…ఎండ్లూరి

‘‘ఓ నా చండాలికా
నీ వెండికడియాల నల్ల పాదాల ముందు
వెయ్యేళ్ల కావ్య నాయికలు
వెలవెలబోతున్నారు’’అంటూ తెలుగు సాహిత్యానికి దళిత్‌ ఈస్తటిక్స్‌ను జతచేసిన కవితా ప్రవాహఝరి ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌. ఎండ్లూరి అంటే వర్తమానం, నల్లద్రాక్షపందరి, అటజెనికాంచె, వర్గీకరణీయం, గోసంగి, కొత్తగబ్బిలం, మల్లెమొగ్గలగొడుగు మాదిగకథలు. ఈ రచనలతో గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎండ్లూరి పేరు తెలుగు సాహిత్యంలో ఒక చెరగని ముద్ర. ఆయన వాక్యం గతానికి వర్తమానానికి ఎడతెగని సంభాషణ. అతని అక్షరాల్లో అంటరాని వెలివాడలు గర్జించే డప్పుల దరువులై మార్మోగాయి. యుద్ధభేరిని మ్రోగించి సాహిత్యంలో ఒడవని లడాయిని చేశాయి. న్యాయం కోసం వేలయేండ్ల అధర్మాలపై నిప్పుల జమిడికై నిలిచాయి. అందుకే ‘‘నాది హిందూ నాగరికత కాదు, నాది చిందూ నాగరికత’’ అని ఆత్మగౌరవంతో ప్రకటించాడు.
దళితసాహిత్యాన్ని పదునెక్కించిన అతికొద్దిమంది కవుల్లో విలక్షణ కంఠస్వరం కలిగినవాడు ఎండ్లూరి.

అందుకే ఎండ్లూరి ఉద్యమకవి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, కథకునిగా, పరిశోధకునిగా, అనువాదకునిగా ఎండ్లూరి చేసిన కృషి అసామాన్యమైంది. ఒకవైపు సృజనకారునిగా తన వంతు పాత్రను పోషిస్తూనే సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారు. నిజామాబాద్‌ పాముల బస్తీలో పుట్టినా హైదరాబాదే తన ఆత్మగా జీవించారు. ఉద్యోగరీత్యా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం నుండి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ దాకా కొనసాగిన తన అధ్యాపకత్వంలో అనేకమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారు. పరిశోధకులుగా ఎదిగేందుకు మార్గదర్శనం చేశారు. ముఖ్యంగా దళిత సాహిత్యం ఉధృతంగా వెలువడిన తొంభయవ దశకంలో ఎండ్లూరి విస్తృతంగా రాశారు. అలా రాసినతనం నుండే తనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆయన రాసిన కొన్ని కవితలు ఇప్పటికీ అభిమానులు మరిచిపోలేదు. ఆయన పేరు వినబడితే చాలు, ఎండ్లూరి మార్క్‌ కవితలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అట్లా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన కవిత్వానికి వందలాదిమంది అభిమానులు ఏర్పడడం గమనార్హం. తన కోసం కాకుండా జాతికోసం నిలబడి సామాజిక న్యాయం కోసం కవిత్వం రాయడం వల్ల ఎండ్లూరికి శత్రువుల తాకిడి కూడా పెరిగింది. అర్థరాత్రి, అపరాత్రి తేడాలేకుండా ఫోన్‌ల బెదరింపులను ఎన్నో ఎదుర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనలోని కవి మాత్రం వెనుకడుగు వేసిందే లేదు.

వర్గీకరణ ఉద్యమానికి ఎండ్లూరి కవిత్వం ఒక మార్చ్‌ఫాస్టింగ్‌ గీతం అంటే అతియోక్తికాదు. ఇరవై ఐదేండ్ల సామాజిక న్యాయపోరాట ఉద్యమానికి బలమైన సాహిత్య మద్ధతును అందించిన ఘనత ఎండ్లూరిదే. మాదిగ కవుల పెద్దన్నగా, రిజర్వేషన్‌ పోరాట సమితి ఎమ్మార్పీఎస్‌ నిర్వహించిన అన్ని పోరాటాలకు తలలో నాలుకలా నిలిచి అక్షరకవాతు చేశాడు. గల్లీ నుండి ఢల్లీి వరకు తన అక్షరాలతో దళితేతరుల మద్ధతు కూడగట్టాడు. ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద నెలరోజుల పాటు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షలో ఎండ్లూరి కవిత్వం పోరాట నినాదంగా మారిందంటే ఆ కవిత్వానికున్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా ఎండ్లూరి రచించిన దీర్ఘకవిత ‘‘వర్గీకరణీయం’’ఒక గొప్ప తాత్విక బలాన్ని అందించింది. అట్లా ఒక సామాజిక ఉద్యమానికి సాహిత్యకారునిగా పెద్దదిక్కుగా నిలబడ్డాడు ఎండ్లూరి. ‘‘మా డప్పు విన్నాడా శివుడు చిందేయ్యాల్సిందే మా చెప్పు కొన్నడా కుబేరుడు పాదాభివందనం చేయాల్సిందే’’అంటూ అక్షరాల్లో అడుగడుగునా ఆత్మగౌరవాన్నే ప్రకటించాడు. అట్లా ఆయన దండోరా ఉద్యమానికి అండగా నిలబడేలా కొత్త తరానికి ఎంతగానో స్ఫూర్తినిచ్చాడు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ్లూరి స్ఫూర్తితో ఎంతో మంది కొత్తకవులు అందిరావడానికి ఆధారంగా నిలిచాడు. కారంచేడు నుండి ఖైర్లాంజి దాకా, రోహిత్‌ వేముల పోరాటం దాకా ఎండ్లూరి కవిత లేని సామాజిక ఉద్యమం లేదు. ‘‘నేనింకా నిషిద్ధమానవుణ్ణే, నాది బహిష్కృత శ్వాసే’’ అంటూ జాషువా స్వరంలో గొంతుకలిపాడు.

ఇక ఎండ్లూరి కృషిలో సింహభాగం మహాకవి జాషువా గురించే కేటాయించాడు. పరిశోధనాంశంగా ‘‘జాషువ సాహిత్యం`దృక్పథం పరిణామం’’ మీద పీహెచ్‌డీ చేసి జాషువా కృషిని వెలుగులోకి తీసుకొచ్చారు. జాషువా మీద సాధికారికమైన ప్రసంగాలు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక వేదికల మీద ప్రసంగాలిచ్చారు. ఈ సమాజంతో జాషువా చేసిన పోరాటం ఎండ్లూరిని ఆలోచింపజేసింది. అణగారిన ప్రజలకు అవకాశాలు అటుంచి, అవమానాలు నిత్యకృత్యం అవుతాయని, వాటిని ఎదురించి నడవడంలో మనకు జాషువాయే స్ఫూర్తిని చాటిచెప్పాడు. జాషువా దారిలోనే ఈ సమాజానికి సాహిత్యంతో షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడానికి పూనుకున్నాడు. అట్లా ఎండ్లూరిలో జాషువా సాహిత్య ఒరవడి క్రమంగా వచ్చి చేరింది. అందుకే తన కవిత్వానికి కొత్తగబ్బిలం అని పేరు పెట్టుకున్నాడు. ఇది సాహిత్యకారులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అభినవ జాషువాగా నిలిచేందుకు ఎండ్లూరి ఎంచుకున్న మార్గానికి సామాజిక మద్ధతు లభించింది. ప్రతీ వేదిక మీద జాషువా కవితలను అలవోకగా గుర్తు చేస్తూ, సభికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపాడు ఎండ్లూరి.

తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసినతనం నుండి రచనలోను, వాక్కులోను ఎన్నో భాషాప్రయోగాలు చేసే విద్య ఎండ్లూరి సొంతం. అంత్యప్రాసలతో సభల్లో ఆయన నవ్వులపువ్వులు పూయించి సభికుల చేత చప్పట్లు కొట్టించేవారు. గంభీరమైన స్వరంతో, ఎక్కడా తొనకనితనంతో సాధికారికంగా మాట్లాడడం ఎండ్లూరిలాంటి కొందరికే సాధ్యమనిపించేలా మెప్పించేవాడు. ఉర్దూ, మరాఠి, హిందీ భాషల్లో తనకున్న పట్టు తనను అనువాదాలవైపు నడిపించింది. గజల్స్‌, షాయిరీలను తెలుగు పాఠకులకు చేరువ చేశాడు. ఇంత చేసినా, కేవలం ప్రతిభ ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదని, దళితులు ఈ బ్రాహ్మణీయ సమాజంలో గెలిచి నిలవాలంటే పాండిత్యాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించేవాడు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో తిష్టవేసుకున్న బ్రాహ్మణిజానికి తన ప్రతిభా, పాండిత్యాలతో చెక్‌ పెట్టగలిగాడు ఎండ్లూరి. పాఠ్యాంశాన్ని బోధించడంలోను, పరిశోధకులకు మెథడాలజీని చెప్పి మంచి పరిశోధకులుగా తీర్చిదిద్దడంలో ఎండ్లూరిది అందెవేసిన చెయ్యి.

సాహిత్యంలో తనకున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఏనాడు గర్వించకుండా తన పని తాను చేసుకుపోయాడు. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు సంతోషాలకు పొంగిపోకుండా, కష్టాలు, బాధలకు కృంగిపోకుండా నిటారుగా నిలబడగలిగాడు. అవమానాలను చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ అంబేద్కరిజం మార్గంలో నడిచాడు. అందుకే ఎండ్లూరిలోని స్నేహ మాధుర్యానికి కులమతాలకు అతీతంగా ఆయనను యిష్టపడని సాహిత్యకారుడు లేడు. అతని కవిత్వంలో ఉండే సౌందర్యం, అతని మాటాల్లో ఉండే మృధుస్వభావం ఎంతో మందిని ఆత్మీయులుగా అక్కున చేర్చింది.

ఇంత సుదీర్ఘకాలం పాటు సాహితీ సృజనకు, తెలుగు సాహిత్య బోధనకు తన జీవితకాలాన్ని కేటాయించినా తనకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవాలు దక్కలేదు. అయినా ఏనాడు తాను చిన్నబుచ్చుకున్నదే లేదు. ఆరోగ్యం సహకరించకున్నా, పరిస్థితులు అనుకూలించకున్నా తాను రాయాల్సింది రాసి తన చారిత్రక బాధ్యతను నెరవేర్చాడు. సాధారణంగా సామాజిక దృక్పథం కలిగిన కవులు తమ వ్యక్తిగత జీవితం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారు. కానీ, సమాజాన్ని ఎంతగా ప్రేమించాడో తన కుటుంబాన్ని కూడా అంతే ప్రేమించాడు ఎండ్లూరి. ముఖ్యంగా తన సహచరి పుట్ల హేమలతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. అన్యోన్యమైన దాపత్యంలో ఇద్దరూ ఎన్నో మధురజ్ఞాపకాలను పోగుచేసుకున్నారు. కానీ, 2019లో ఆమె అకాల మరణానికి తట్టుకోలేకపోయాడు. ఉద్యమకవిగా ఎన్నో ఎత్తుపల్లాలను అవలీలగా దాటి వచ్చిన ఎండ్లూరి, సహచరి ఎడబాటుకు ఎంతో కృంగిపోయాడు. నిత్యం ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ పలు ఎలిజీలు రాశాడు. గుండెలు పిండే దు:ఖం, వేదన ఆ కవితల్లో కనిపించేది. ఎన్నో కష్టకాలాలకు ఎదురీది నిలిచిన ఎండ్లూరి సహచరి వియోగ బాధ నుండి మాత్రం బయటపడలేకపోయాడు. అనారోగ్య బారినపడ్డాడు. తన ఇష్టసఖి పుట్ల హేమలత మృతికి మూడోవర్ధంతి అయినా నిండకుండానే సహచరిని వెతుక్కుంటూ శాశ్వతంగా ఈ లోకం విడిచివెళ్లాడు.

వర్తమాన కవిత్వానికి చిరునామాగా నిలిచిన ఆయన స్మృతికి మృతిలేదు.  సాహిత్యరూపంలో అభిమానుల గుండెల్లో సజీవంగా బతికే ఉంటాడు ఎండ్లూరి. సామాజిక ఉద్యమాలకు అక్షరాల మద్దతునిచ్చిన ఆయన మార్గం ఆచరణీయం. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత, ఇవాళ దళితసమాజం మీద మాత్రమే కాదు, సాహిత్యకారులందరి మీద ఉందనేది కాదనలేని వాస్తవం. తన కవిత్వంతో ఒక తరాన్ని వెలిగించిన కవికి కడసారి కన్నీటి జోహార్లు.

*

 

పసునూరి రవీందర్

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గొప్ప కవి, మంచి మనిషి. తన గురించి రాయడానికి ఎంతో మిగిల్చినవాడు. ఎంత రాసినా కొంత మిగిలే ఎండ్లూరి కీర్తికి ‘శాశ్వత వర్తమానం’ తగిన శీర్షిక.

  • ఎండ్లూరి గురించి బాగా ఎరిగిన మనిషి అనే కంటే కూడా ఆయన సాహిత్యాన్ని దగ్గరి నుండి చదివి ఔపోసాన పట్టిన యువ రచయిత మీరు. ఆయన వదిలి వెళ్లిన లోటు సాహితీ ప్రపంచం లో పూడ్చ లేనిది కావచ్చు కానీ మీలాంటి వారు సాహితీవనంలో ప్రవేశించాక ఆయనకు ధైర్యం వచ్చి ఉండొచ్చు ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళే సమర్థుడైన రవీందర్ ఉన్నాడని.
    మీరు చక్కటి అక్షర నివాళి అర్పించారు.మీరు రాసిన ప్రతి అక్షరం ఎండ్లూరి ఖ్యాతిని వెదజల్లుతుంది. ఎండ్లూరి గారి జీవితం నిజామాబాద్ టు హైదరాబాద్ వయా రాజమండ్రి చక్కగా వివరించారు అన్న.

  • ఎండ్లూరి సుధాకర్ సర్ కవిత్వాన్ని, జీవితాన్ని ఉద్వేగభరితంగా పరిచయం చేసిన వ్యాసం ఇది. చాలా బాగుంది అన్న. ప్రొఫైల్ వ్యాసాలు రాయడంలో మీది అందెవేసిన శైలి.

  • శాశ్వత వర్తమానం
    కవి కృషి స్మరణీయం
    కవులకు ప్రేరనియ0
    సుధాకర గురుదక్షణ0
    రవి కలం జ్ఞాపకం

  • నిశ్శబ్దం గా శబ్దంతో యుద్ధం చేసి

    చివరికి కలలో జారిని కన్నీరు గా వెళ్లిపోయారు.

    ఈ మధ్య ఏ వ్యాసం చదివినా అది అతిశయోక్తి కి ఉదాహరణగా ఉండేది.

    ఇందులో అలా అనిపించలేదు.

    అందుకు రచయిత జీవితం ఆ మాటలకు అర్హత కలిగిస్తోంది కాబోలు.

    పసునూరి అన్న బాగుంది. వ్యాసం.

  • ఆచార్య ఎండ్లూరి సుధాకర్ నాన్నతో ముఖ పరిచయం లేకపోయినా యూట్యూబ్ ఉపన్యాసాలు వింటూ పెరిగిన వాన్ని. వారి రాతలతో నా లాంటి వారెందర్కో తండ్రి అయి నడిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అదరని బెదరని ధైర్యశాలి.తన అక్షరాలతో మనువాదుల గుండెల్లో గుబులు పుట్టించారు.తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం నాన్న అక్షరాల రూపంలో జీవించి ఉంటారు.సుధాకర్ నాన్న మీ రూపం(అక్షరాల)లో మనలోనే ఉంటూ తను నడిచిన తోవలో ముందుండి నడిపిస్తారని ఆశిస్తున్నాను అన్న గారు 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు