వీణ- తమిళ అనువాద కథ

నా ఎదుట నిలబడ్డ ఈమె పేరు కూడా నా జ్ఞాపకాల్లో నుండి దూరమయ్యింది. నిన్న రాత్రి నుండి నా రెండుచేతులతో పట్టుకుని ఉన్న ఫిలోమి అన్న పింగాణీ పాత్ర నేలమీద పడి ముక్కలైపోయింది.

తమిళ మూలం: బవా చెల్లదురై    

 

ఎంతో అందంగా పార్శీల్ చేశారు దాన్ని.

ఆ వీణ నా పక్కనుండటంతో, ఒక యువతి సాన్నిహిత్యాన్ని గాఢంగా ఊహించుకున్నా. బస్సు ఎత్తుపల్లాలలో కదులుతున్నప్పుడు ఆ స్పందన మరింత తీవ్రతరమైంది. జీవితంలోని కొన్ని అపూర్వ సంఘటనలు ఇలా ఎప్పుడో ఒకసారే జరుగుతుంటాయి.

రాత్రి పదిగంటల సమయంలో

కొరియర్‌ ఆఫీసు షట్టర్‌ను లాగి మూసేస్తుండగా, ఆ యువకుడు గబగబ బుల్లెట్‌పై వచ్చి దిగాడు. సగం మూసిన షట్టర్‌ ముందు అతణ్ణి చూస్తూ నేనలాగే నిలబడ్డా. అతను తన చేతిలో నిధిలాగా పట్టుకున్న ఆ పార్శీల్ తో నన్ను సూటిగా చూశాడు.

‘‘అయాం స్టీఫెన్‌ రాజ్‌, ఫ్రమ్‌ సేలం. ఇది వీణ… రేపటికి ఎలాగైనా గోవాకు చేరాలి. ఎంత ఖర్చయినా సరే. రేపు బర్త్‌డే. ఇది నా గిఫ్ట్‌.’’ సగం ఇంగ్లీషు, సగం తమిళంలో…ఆదుర్దాగా చెప్పాడతను. నేను అతణ్ణి చూస్తూ నిదానంగా షట్టర్‌ను కిందికి లాగి మూశాను. నిరాశతో కూడిన అతని కళ్లను గమనించా. అతణ్ణి మరింతగా అస్థిర పరచటానికి మనసొప్పుకోక, ‘‘నేనివ్వాళ రాత్రికి గోవాకే వెళ్తున్నా. బిల్‌ వెయ్యను. నేరుగా డెలివరీ చేస్తా, ఏడు వందలవుతుంది. పర్వాలేదా?’’ అన్నా నిదానంగా. మరుక్షణం, అతను తన ప్యాంటు వెనక జేబులో నుండి పర్సు తీసి రెండు ఐదువందల రూపాయల నోట్లను నా చేతిలో పెట్టి, ‘‘దీన్ని ఉంచండి, ఎలాగైనా రేపటిలోగా వాళ్లకు చేరిస్తే చాలు.’’ అతని ఆదుర్దా, ఉత్సాహం నన్ను ఓడించటానికి కారణం, ఆ ప్యాకింగ్‌ మీద రాసిన పేరే.

మిస్‌. జెన్నిఫర్‌ ఫిలోమి.  ఆ పేరు తప్ప, దాని కింద రాసిన చిరునామా నా మనసులో నమోదు కాలేదు. ఆ పేరుకు చెందిన యువతిని ఒక్క నిమిషంలో గొప్ప అందగత్తెగా ఊహించుకున్నా. అంతలోనే ఆమె పూర్తి రూపాన్ని మనసులో చిత్రీకరించుకున్నా. ఒక యువతి పేరుకున్న వశీకరణం క్షణకాలంలో ఒక మగవాడి మనసులో ఇవన్నీ చేస్తాయి కదా?! నేనిప్పుడు ప్రేమతో నిండిన స్టీఫెన్‌ రాజ్‌ లాగానే మారిపోయా.

నాకు చిన్నప్పటి నుండే సాహిత్యం మీద ఓ విధమైన ఆసక్తి. నేను చేతిలో పట్టుకొని ఉన్న వీణను, ‘వణ్ణనిలవన్‌ (రచయిత) యొక్క ‘కడల్‌ పురత్తు ఫిలోమియా’ను పట్టుకున్నట్టు స్పర్శించా. ఎస్‌.తమిళ్‌ సెల్వన్‌ (మరో రచయిత) కథలో వచ్చే అగ్గిపెట్టల కర్మాగారంలో పనిచేసే ఆడవాళ్ల క్యూ వరుస… నా జ్ఞాపకానికి వచ్చింది. హాజరు పట్టికలో ఉండే రామాయి, మారియమ్మలవి తలెత్తి చూడాల్సిన పన్లేని ముఖాలు. బృందా, సవితా, లీనా, నీమా వంటి పేర్లకు తలెత్తి చూసేలా ప్రేరేపించే ఆకారాలులుంటాయి. కానీ  పేర్లకూ, ఆకారాలకూ సంబంధం లేదని తలెత్తి చూసినప్పుడే తెలుస్తుంది. ఉద్యోగం చేస్తున్న ఈ కొరియర్‌ సంస్థలోనూ ఈ అనుభవం రోజూ సంభవించేదే. ‘కడలోర కవిదైగళ్‌’ (సత్యరాజ్‌ సినిమా)లోని  జెనిఫర్‌ టీచర్‌ (రేఖ) కూడా నా కళ్ల ముందుకొచ్చి వెళ్ళింది. ఇప్పుడు ఈ పార్శల్‌కు పైభాగాన ఎంతో అందమైన చేతిరాతితో రాసిన, ఫిలోమిని నేను తలెత్తి చూసే అవసరముండదు. ఆమె అందెగత్తెగానే ఉండేందుకు అవకాశముంది. అందులోనూ సేలం నుండి రాత్రి పదిగంటలకు ఒక వ్యక్తి తొందర తొందరగా వచ్చి ఒక వీణను ఆమె పుట్టినరోజుకు అంత దూరం పంపిస్తున్నాడంటే, ఆమె గోవాకే అందగత్తెగా ఉండాలి.

ఎవరైనా నన్ను గమనిస్తున్నారా అని ఒకసారి అటుఇటు చూసి, వీణను నాకింకా దగ్గరగా హత్తుకున్నా. అది మిగిలినవాళ్ల కంటికే వీణ. నాకు ఫిలోమి! ఈ క్షణంలో ఎంతో పశ్చాత్తాపంతో స్టీఫన్‌ రాజ్‌ను కూడా మనసు గుర్తుచేసుకుంది.

బస్సు మితమైన వేగంతో వెళ్తోంది. నాకెప్పుడూ మంచి మానసిక స్థితినీ, చక్కటి నిద్రనూ తానుగా తీసుకొస్తుంది బస్ ప్రయాణం. ఏదో ఒక అంత:స్పందన ఊరు రాకను తెలియజేసి లేపుతుంది. అవ్వాళా  కూడా అదే జరిగింది. అలవాటైన గోవాలోని పనాజీని చేరుకున్నాను. నా ఫిలోమి ని చేతుల్తో ఎత్తుకుని దిగటాన్ని కొందరు వేడుకగా చూశారు. దేని గురించీ పట్టించుకోని మానసిక స్థితిని నేను నిన్న రాత్రి ప్రయాణపు ప్రారంభంలోనే సాధించా. గోవాలో నాకంటూ ఎప్పుడూ ఉండే ఆ గదిలో ఒక గోడకు దాన్ని ఆనించి పెట్టి స్నానం చేద్దామనుకున్నా. ఆ పార్సిల్ ని అందుకున్నప్పటి నుంచీ  ప్రతి క్షణమూ నాలో ఏర్పడ్డ ఓర్పూ, నిదానమూ నా జీవితంలో అంతకు మునుపు లేవు. స్నానం ముగించి ఉన్నంతలోనే బాగున్న దుస్తుల్ని ఎంచుకుని, టక్‌ చేసుకుంటున్నప్పుడు… ఆ దుస్తులు నాకొక ఆఫీసర్‌ హోదాను కలిగించాయి. ఊహించని ఈ ప్రయాణానికి ఈ దుస్తుల ఎంపిక సరిగ్గా సరిపోయింది. నేనెప్పుడూ కొరియర్‌ సంస్థకు డెలివరీ బాయ్‌ను కాను. దానికన్నా రెండు రెట్లు ఎక్కువ. మా మండలం మొత్తం వెతకటానికి నాకు లభించిన చిరు అధికారం చొక్కాను టక్‌ చేసుకోగలిగిన హోదాను కూడా ఇచ్చింది. ఇప్పుడు నా గది మంచం మీద కూర్చుని నాకు చాలా దగ్గరగా గోడకు ఆనించి ఉన్న ఆ వీణ యొక్క పొడవైన వైశాల్యాన్ని నా కళ్ళతో కొలిచా. అది అలాగే ఫిలోమి యొక్క పొడవు వైశాల్యంలోనే ఉండాలి. వీణ ఎంతటి గంభీరమైన సంగీత వాయిద్యం!? మిగతా సంగీత వాయిద్యాలలాగా దాన్ని అశ్రద్ధతో పట్టుకున్న ఏ ఒక్కరినీ నేనింతవరకూ చూడలేదు. అదే దానికున్న  ఔన్నత్యాన్ని కళాకారుల నుండి స్వీకరిస్తుంది. ఐదవసారి ఇంగ్లీషులో ఎంతో అందమైన చేతిరాతితో రాసిన, ఆ పేరును ఇప్పుడూ నేను నిదానంగా చదివా.

మిస్‌ జెన్నిఫర్‌ ఫిలోమి

దాని కింద రాసిన చిరునామాను ఇప్పుడు కూడా చదవటానికి మనసొప్పలేదు. దాన్ని మనసు బయటికి నెట్టేసింది. ఇక్కణ్ణించి వాస్కో కు కొన్ని మైళ్లు ప్రయాణించాలి. నా ప్రయాణపు హద్దు ఇక్కడి దాకానే. అయితే ఇప్పుడు నేనొక అందమైన పేరు కోసం మాత్రమే ఆరేడు మైళ్లు ప్రయాణం చెయ్యబోతున్నా. మనసంతా ప్రేమను నింపుకుని, సముద్రతీరానికి అభిముఖంగా ఇంకొన్ని నిమిషాలలో ఆమెను కలుసుకోబోతున్నా. ఇప్పుడు నేను కొరియర్‌ సంస్థ ఉద్యోగస్థుడిని కూడా కాను. అందుకనే ఏడువందల రూపాయలకు బిల్లు వెయ్యలేదు.

ఈ క్షణం నా పేరు నాకు మరపుకొచ్చింది. నా పేరు స్టీఫెన్‌ రాజ్‌. జెన్నిఫర్‌ ఫిలోమి అన్న ఆ అందమైన పేరు కోసం, స్టీఫెన్‌ రాజ్‌ అన్న ఆ సేలం యువకుడి తరపున, అతని తరపున ఏమిటి?నేనే స్టీఫెన్‌ రాజ్‌గా వెళ్తాను. నాకంటూ గిరిగీసిన హద్దులంటూ ఏవీ లేవు. గోవాలోని ఈ స్థలం, ఈ సముద్రం అన్నీ ఇక నావే. ఒక పేరు ఇలా ఒకరిలో ఇంతటి మార్పును కలిగిస్తుందా? కలిగించిందే! నేను పదేపదే వెళ్లే అలవాటైన ప్రాంతం వాస్కోడిగామా కాకపోయినప్పటికీ, కొన్నిసార్లు అలా అలా చుట్టి తిరిగిన ప్రదేశమే. దాని సందులు, వీధులు నా జ్ఞాపకాల్లో నిలబడనివి. అయినప్పటికీ స్టీఫెన్‌ రాజ్‌కు ఫిలోమి లాగా నాకూ కొందరు జెన్నిఫర్‌లు ఈ ప్రాంతంలో ఉన్నారు.

ఫిలోమి ఉన్న వీధిని కనిపెట్టటంలోనూ, ఆమె ఉన్న ఇంటిని తెలుసుకోవటంలోనూ ఎక్కువ శ్రమ అనిపించలేదు. మారుగా, నా ఊహల్లో రూపుదిద్దుకున్న సరిహద్దు గోడ కలిగిన పెద్ద బంగళాకు బదులుగా, సన్నని సందులో పెంకులు కలిగిన ఒక మామూలు ఇల్లుగా అది కనిపించింది. పెంకుటిండ్లల్లో జెన్నిఫర్‌ లాంటి దేవతలు నివసించరా ఏంటీ? కాలింగ్‌ బెల్‌ లేని ఆ ఇంటి తలుపును కొట్టిన కొంతసేపటి  తర్వాత అవి తెరుచుకున్నాయి. ఇంగ్లీషులో ఏదో రాసిన లేదూ గీసిన అక్షరాలున్న ఎరుపు టీ షర్టు, పావడా ధరించిన ఒక మధ్యవయస్కురాలు, ఎదురుగా నేనొక  పెద్ద పార్శీల్ తో నిలబడటాన్ని ఎలాంటి ఆశ్చర్యమూ లేకుండా చూసింది. నేను కాస్త జంకి, ‘‘మిస్‌ జెన్నిఫర్‌ ఫిలోమి’’ అని సాగదీస్తున్నట్టుగా చెప్పగానే, ఏదో గుర్తుకొచ్చినట్టుగా, ‘‘ఎస్‌, కమిన్‌’’ అన్న గొంతు మాత్రం తలుపు పక్కన విడిచిపెట్టి ఆ చిన్న హాల్లోకి నడిచింది. నేను మరో మార్గం లేక ఆమె వెనక నడిచా. జెన్నిఫర్‌ ఫిలోమి ఈమె అయ్యే అవకాశమే లేదు. కథల్లో కూడా ఎప్పుడూ దేవతలు వెంటనే దర్శనమివ్వరు. వాళ్ల ఆవాసాలను చేరుకోవటానికి ఇంకా ఇంకా మనం ఎదురుచూడాల్సి ఉంటుంది. ‘‘అవి ఇప్పటివరకూ ఎవరూ చూడని అందమైన కళ్లు’’ కొరియర్‌ ఉద్యోగం కోసం నేను విడిచిపెట్టిన కవిత్వపు పంక్తులు అరిగిపోయి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.  వైరుతో అల్లిన ఓ చెక్క కుర్చీలో నేను కూర్చున్నా. గాజు గ్లాసులోని చల్లని నీళ్లను ఆ ముప్పై అయిదేళ్ల ఎరుపు టీ షర్టు వేసుకున్న స్త్రీ నా చేతికి అందిస్తున్నప్పుడు నేను ఎంతో జాగ్రత్తగా ఆ వీణను ఎదురుగా ఉన్న గోడకు ఆనించి పెట్టి గ్లాసును తీసుకున్నా. ప్రశాంతత, మౌనం, ప్రేమ ఊసులు… ఆ గది దేన్నీ అనుమతించలేదు.             ‘

“మ్‌. చెప్పూ.’’ అనడంతో నేను మాట్లాడక తప్పలేదు. నేను డెలివరీ బాయ్‌ను కానన్న భావన మాత్రం నా మెదడులో బాగా లోతుగా నమోదైంది. టెలివిజన్‌లో వచ్చే ముఖాముఖిలో మాట్లాడుతున్నట్టుగా, ‘‘నేను సేలం స్టీఫెన్‌ రాజ్‌కు స్నేహితుణ్ణి. అతను ఇవ్వాళ జెన్నిఫర్‌ పుట్టినరోజుకు రావటానికి వీలు కాలేదు. అందుకనీ ఈ బహుమతిని నాకిచ్చి పంపాడు.’’ ఇప్పుడు ఆ స్త్రీ కుడిపక్కగా ఉన్న ఆ చిన్నగది వైపుకి తిరిగి జెనీ లేదూ ఫిలోమీ అంటూ పిలుస్తుందని ఆశించి నేను మోసపోయా.

‘‘నేనే, జెన్నిఫర్‌ ఫిలోమీ ని. అయితే ఇవ్వాళ నా పుట్టినరోజు కాదే!’’ మాటలు మాత్రం నా చెవిలోకి వెళుతున్నాయి. నేను ఆ హాల్లో ఖాళీ లేకుండా, ఏ పద్ధతీ లేకుండా అతికించిన  ఆ స్త్రీ యవ్వన ప్రాయాన్ని మోస్తున్న ఫోటోలను అప్పుడే గమనించా. ఎన్నో సినిమా పత్రికలలో వచ్చిన ముఖచిత్రాలను అవి గుర్తుకు తెచ్చాయి. మోసపోయానన్న భావనతో  నిరుత్సాహాన్ని గదిలో నుండి నాలోకి నింపుకున్నా. నేను పూర్తిగా స్పృహలోకి వచ్చా. ఇక ఏ గదిలో నుండీ దేవతలు బయటికి రావటమంటూ ఉండదు.

‘‘లేదే, నా స్నేహితుడు స్టీఫెన్‌ ఇవ్వాళే మీ పుట్టినరోజని చెప్పి దీన్ని ప్రత్యేకమైన ఒక పుట్టినరోజు బహుమతిగా అంత దూరం నుండి నన్ను పంపించాడే!’’ అని చెబుతున్న నా మాటలను అడ్డగిస్తూ, ‘‘నేను ఒక్కొక్కరి దగ్గర ఒక రోజును నా పుట్టినరోజుగా చెబుతా. దాన్ని సీరియస్‌గా తీసుకుని ఇలాంటి ఒక బహుమతితో నిన్ను పంపించాడే… దీన్ని నేనెలా స్వీకరించాలి?’’ రాత్రి ప్రేమలు గుసగుసలాడే మనసుతోటి ఆమెను అంగీకరించిన స్టీఫెన్‌ రాజ్‌ ఇప్పుడు మాటల్లో పలుచనయ్యాడు. నాలో ఉన్న ఏ కాస్తో కూస్తో… అణిగిపోయింది. అప్పుడే ఆమె గోడకు ఆనించి పెట్టిన ఆ పార్సిల్‌ను పూర్తిగా చూసింది.

‘‘ఇదేంటో నీకు తెలుశా?’’ ఆమె నన్ను ప్రశ్నించింది.

‘‘వీణ.’’ అన్న మాటే ఓ కవిత్వంలా వచ్చింది.

‘‘దీని ధర ఎంతుంటుంది?’’

‘‘తెలియదు… అయితే ముప్పై నలభై వేల రూపాయల దాకా ఉండొచ్చు.’’

‘‘నాకు వీణను గురించి ఏమీ తెలియదు. నేను దాన్ని చూసింది కూడా లేదు. దీన్ని మీ స్నేహితుడు సేలంలో కొన్నాడు.’’

ఇప్పుడు నేనే ఆమె అనుమతి కోసం ఎదురుచూడకుండా పార్సిల్‌ను విప్పాను. కొరియర్‌లో పని చేసే నాకు పార్సిల్‌ను విప్పుతున్నప్పుడు మాత్రం ఇంత నైపుణ్యం ఎలా ఒంటబడుతుంది? వీణకున్న తీగకు కట్టి వేలాడుతున్న చీటీలో నేను చెప్పినదానికన్నా ధర ఎక్కువ ఉంది. అది సేలంలో కొన్నది కాదు. ‘తంజావూరు’ అని పూర్తి చిరునామా అందులో స్పష్టంగా ఉంది.

‘‘లేదు, దీన్ని తంజావూరుకెళ్లి మీకోసం కొని తెచ్చినట్టున్నాడు.’’ ఆమె పెదాల చివరన ఒక చులకనైన చిరునవ్వు కనిపించి  కనుమరుగవ్వటం గమనించా. మహిళలందరి పెదాలూ, అన్ని రకాలైన బహిరంగ స్పందనలనూ మరుగుపరిచి ఉండే రహస్యమైన చోట్లు కాబోలు!

‘‘మీరు నాకొక సాయం చెయ్యగలరా?’’ ఉన్నట్టుండి ఆమె నుండి స్పష్టమైన మాటలు బయటికొచ్చాయి. ‘‘చెప్పండి.’’ అనాలనుకున్నా. కానీ అనలేదు. అదేమీ అవసరం లేదన్నట్టుగా ఆమే, ‘‘దీన్ని కొన్న అంగట్లోనే తిరిగిచ్చేసి డబ్బుగా ఇవ్వగలరా?’’

ఇప్పుడు నా కళ్లను చూడకుండా ఆ వీణను చూస్తూ మాట్లాడింది. నా చివరిబొట్టు ఎదురుచూపు కూడా అణగారిపోయింది.

నా ఎదుట నిలబడ్డ ఈమె పేరు కూడా నా జ్ఞాపకాల్లో నుండి దూరమయ్యింది. నిన్న రాత్రి నుండి నా రెండుచేతులతో పట్టుకుని ఉన్న ఫిలోమి అన్న పింగాణీ పాత్ర నేలమీద పడి ముక్కలైపోయింది. ఏ ఆకర్షణీయమైన పేరు ఒక యువకుడిని 800 కి.మీ.ల దూరం అగచాట్లు పడుతూ పిలుచుకొచ్చిందో ఆ పేరు ఇప్పుడు గుర్తుకు లేదు. ఇప్పుడు, కొరియర్‌ సంస్థ తాలూకు, చొక్కాను టక్‌ చేసిన సాధారణమైన ఒక కార్యాలయపు వ్యక్తిగా మాట్లాడటం మొదలుపెట్టా. అవి పూర్తిగా వ్యాపార సంబంధమైన మాటలు.

‘‘డబ్బుగా మార్చి ఇవ్వటానికి కుదరదు మేడం. మొదట ఈ పార్సిల్‌ను నా దగ్గర నుండి తీసుకున్నట్టుగా రశీదులో సంతకం చేసి ఇవ్వాలి…. తర్వాత ఈ పార్సిల్‌ను వేరే కొరియర్‌ ఆఫీసుకు తీసుకెళ్లి ఆ వీణను అమ్మిన అంగడికి బుక్‌ చెయ్యాలి. అందులో ఈ వీణను వాళ్ళు తీసుకొని డబ్బుగా ఇవ్వగలరా?… అన్న మీ విన్నప లేఖను చేర్చొచ్చు. దాన్ని అంగీకరించటమూ, తిరస్కరించటమూ వాళ్ల హక్కు.’’ నా మాటల్లో బహిర్గతం అయిన విషయాన్ని విని ఆమె నిరుత్సాహపడింది.                                                                         ‘‘

“మీరు కొరియర్‌లో పని చేస్తున్నారా?’’

నేను ఒక్క క్షణం తబ్బిబ్బై… ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రోజును పుట్టినరోజుగా చెప్పే ఈమె ముందు, ‘‘మొదట స్టీఫెన్‌ రాజ్‌ స్నేహితుణ్ణి, తర్వాత కొరియర్‌లో పనిచేస్తున్నా.’’

ఇప్పుడు ఆమె హాల్లో నుండి కదిలి, ఆ చిన్న గదిని  సగం మరుగుపరుస్తున్న తెర ముందు నిలబడి నన్ను తీక్షణంగా చూసింది. ఎలా ఎదుర్కోవాలో నాకు అలవాటే. ఆమె తీక్షణమైన కళ్లను తప్పించి ఆ వీణను చూస్తూ అన్నాను:

‘‘ఏదో ఒకరోజు ఇదే ప్రేమతో స్టీఫెన్‌ రాజ్‌ ఇక్కడికొచ్చి ఈ ప్రేమ బహుమతిని వెతికితే అతణ్ణి ఎలా ఎదుర్కోగలరు?’’ ఆమె ఇంకా రెండడుగులు నాకేసి వేసి వచ్చి తల వంచుకుని నిలబడ్డది. శబ్దంలేని ఒక క్షణం… గది దాన్ని స్వీకరించింది. ఆమె వీణను చూస్తూ నాతో అంది: ‘‘దీన్ని ఇంతకు ముందులా ప్యాక్‌ చేసి ఈ అటక మీద పెట్టగలవా?’’ తలపైకెత్తి ఆమె చెయ్యి చూపించిన అటక కేసి చూశాను. పనికిరాని వస్తువులతో నిండిపోయింది ఆ అటక. ఏ మనిషీ ఒక వీణను కాస్త కూడా అలక్ష్యం చేయటం నేను చూడలేనప్పుడు, దీన్ని నేను అటక మీదికి విసిరివెయ్యలేను.

‘‘నేను చెయ్యలేను.’’ మళ్లీ అదే మాట చెప్పా.

‘మీ స్నేహితుని కోసం దీన్ని మీరు చెయ్యకూడదా?’’

‘‘నా స్నేహితుడి కోసమే దీన్ని నేను చెయ్యలేను.’’

+++

 

జిల్లేళ్ళ బాలాజీ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు