రైతు మనసు తెలిసిన మేఘమాలా…

హాసముద్రం దేవకి గారు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి ఆచార్యులుగా పదవీ విరమణ చేసి పదిహేను ఏళ్లు దాటినా, ఆమె కలం పదును ఏమాత్రం తగ్గలేదు. ఆమె రచన ఏది తీసుకున్నా ఒక స్పష్టమైన దృశ్య చిత్రణ (Imagery) పాఠకులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం మనం విశ్లేషించుకుంటున్న ‘మేఘమాల’ కవితలో మేఘాన్ని కేవలం ఒక నీటి మూటగా కాకుండా ఒక గాయనిగా, ఒక వస్త్రంగా, ప్రకృతి అల్లిన ప్రేమబంధంగా దర్శించడం ఆమె కవితా శక్తికి నిదర్శనం.
_________

మేఘమాల

ఆకాశపు నీలి నుదుటిపై
తేలియాడే తెల్లని కలల దండ
ఈ మేఘమాల

ఎండ వేడిలో వాడిపోయిన
పొలాల శరీరాలపై
చల్లని నీడను పరచే ధవళ వస్త్రం

పంట పొలాల్లో
ఆకాంక్షల విత్తనాలు నాటుకున్న రైతుకు
ఆకాశరాజు పంపిన అమృతదీవెన

గిరుల మీదుగా గాలిని తాకుతూ
నదీ వేదికపై జల గీతం పాడుతూ
భూమి దాహం తీర్చే ప్రకృతిమాత యాత్ర

మెరుపుల అక్షరాలతో
ఆకాశం రాసుకున్న పాటలను
వర్షబిందువుల సంగీతంతో
భూమాతకు వీనుల విందు చేసే
మధుర గాయని

దాహంతో తపించే నేలకు
సలిల ధారలుగా జారిపడి
పొలిమేరల్లో పచ్చని కలలను
పండించే కరుణామయి

మేఘమాల అంటే
కేవలం మబ్బుల గుంపు కాదు
భూమి, ఆకాశాల మధ్య
ప్రకృతి అల్లిన ప్రేమబంధం

జీవితం ఎడారి అయిన వేళ
ప్రాణమై ఆదుకొనే జలగీతం

మట్టి మనసులో
ఆశల్ని మొలకెత్తించే
నిత్య జీవధార
ఈ మేఘమాల

-మహాసముద్రం దేవకి
_________

కవైపు ప్రకృతి సౌందర్యాన్ని, మరోవైపు ఆ ప్రకృతి మనిషికి (రైతుకు) ఇచ్చే భరోసాను మేళవించి అద్భుతంగా దృశ్యమానం చేసిన కవిత ఇది. ఆకాశపు నీలి నుదుటిపై తేలియాడే తెల్లని కలల దండగా మేఘమాలను వర్ణించిన తీరులో అద్భుతమైన కవిత్వీకరణ కనిపిస్తుంది. సాధారణంగా మేఘాలను వర్షానికి సంకేతంగానే చూస్తాం, కానీ ఇక్కడ కవయిత్రి వాటిని ఆకాశం ధరించిన ‘కలల దండ’ అనడం విశేషం. ఆకాశం ఒక నీలి నుదురైతే, దానిపై కదిలే మేఘాలు ఒక అలంకారంలా, ఒక స్వప్నంలా గోచరిస్తున్నాయనే ఊహ ఎంతో సున్నితంగా ఉంది. అలాగే, ఎండ వేడిలో వాడిపోయిన పొలాల శరీరాలపై చల్లని నీడను పరచే ‘ధవళ వస్త్రం’ అన్న ప్రయోగం భూమాత పట్ల మేఘానికి ఉన్న వాత్సల్యాన్ని చాటుతోంది. ఇక్కడ మేఘం కేవలం నీటిని మోసే మబ్బు కాదు, అది తపించే భూమాతకు ఆకాశం కప్పిన ఒక రక్షణ కవచం. పొలాల్లో ఆకాంక్షల విత్తనాలు నాటుకున్న రైతుకు ఆకాశరాజు పంపిన ‘అమృత దీవెన’గా మేఘాన్ని దర్శించడం రైతు హృదయావిష్కరణకు అద్దం పడుతోంది.

రైతు నాటిన విత్తనాలు కేవలం గింజలు కావు, అవి అతని ఆశలు. ఆ ఆశలు చిగురించాలంటే మేఘం కరుణించాల్సిందే.
ఈ కవితలో అత్యుత్తమ ప్రయోగం ‘మెరుపుల అక్షరాలతో ఆకాశం రాసుకున్న పాటలను వర్షబిందువుల సంగీతంతో భూమాతకు వినిపించే మధుర గాయని’ అన్న వాక్యాలు. ఇందులో దృశ్యాన్ని శబ్దంతో ముడిపెట్టిన తీరు దేవకి గారి కవితా పరిణతిని చాటుతోంది. మెరుపుల అక్షరాలు అన్నది ఇక్కడ ఒక లోతైన రూపకం (Metaphor). మెరుపు వెలుగునిస్తే, అక్షరం జ్ఞానాన్ని ఇస్తుంది; ఈ రెండింటికీ అభేదాన్ని కల్పిస్తూ ఆకాశం అనే కాగితంపై ప్రకృతి రాస్తున్న అక్షరాలు ఈ మెరుపులని చెప్పడం వల్ల కవితా వస్తువుకు గాఢత చేకూరింది. ఇక ఆకాశానికి ‘నుదురు’ అనే అవయవాన్ని ఆపాదించడం ద్వారా నిర్జీవమైన శూన్యాన్ని ఒక సజీవ మూర్తిగా మార్చారు. ఆ నీలి నుదుటిపై మబ్బులు ఒక అలంకరణలా, ముత్తైదువ ధరించిన తిలకంలా కనిపిస్తున్నాయని ఊహించడం వెనుక గొప్ప భావుకత ఉంది.

భూమికి, ఆకాశానికి మధ్య సంబంధం తెగిపోకుండా కలిపి ఉంచేది మేఘమేనని, అది ప్రకృతి అల్లిన ‘ప్రేమబంధం’ అని చెప్పడం ద్వారా కవయిత్రి ఈ కవితను ఒక తాత్విక శిఖరానికి చేర్చారు. పదాల ఎంపికలో శబ్ద సౌందర్యంతో పాటు ఒక అంతర్లీనమైన లయ ఈ కవితలో కనిపిస్తుంది. ‘గాలిని తాకుతూ’, ‘జల గీతం పాడుతూ’ వంటి పదాల్లోని అనుప్రాసలు శ్రవణానందాన్ని కలిగిస్తాయి.

అచ్చతెలుగు పదాలైన నుదురు, మట్టి, మొలక వంటివి కవితకు సహజమైన నేల వాసనను అద్దాయి. ఈ కవితా వస్తువు ఆకాశం అనే అనంతమైన ఎత్తు నుండి మొదలై, మట్టి అనే లోతైన నేల వరకు ప్రయాణించిన తీరు (Vertical Structure) కవయిత్రి శిల్ప పరిణతిని సూచిస్తుంది.

మట్టికి సైతం ఆలోచనలు, వేదనలు ఉండే మనసును ఆపాదించి, అందులో ఆశల్ని మొలకెత్తించే జీవధారగా మేఘమాలను కీర్తించడం ద్వారా పాఠకులకు ఒక ఉదాత్తమైన కవితను చదివిన తృప్తిని మిగిల్చారు.

*

విల్సన్ రావు కొమ్మవరపు

7 comments

Leave a Reply to Vankireddi Reddappa Reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను చేసిన కవితా విశ్లేషణకు చోటిచ్చిన సారంగ టీం కు,సంపాదకులు అఫ్సర్ గారికి ధన్యవాదాలు

  • దేవకి గారి కవిత బాగుంది . భూబంధువు మేఘం అలరించే తీరును ఆహ్లాదకరంగా కవిత్వీకరించిన విధానం బాగుంది . మంచి కవితను ఎత్తిచూపే మిత్రుడు కొమ్మవరపు విల్సన్రావు తన విశ్లేషణతో ఋజుజువు పరిచారు . రచించిన దేవకి గారికి ప్రచురించిన సారంగకూ , విశ్లేషించిన విల్సన్ రావుగారికి అభినఒమదనలు .

    • అమూల్యమైన మీ స్పందనకు ధన్యవాదాలు మిత్రమా

  • మహాసముద్రం దేవకీ గారు రాసిన కవిత ‘మేఘమాల’ ఎంత బావుందో… మాటలకందనిది.

    విల్సన్ రావు కొమ్మవరపు గారి ఈ కవితా విశ్లేషణ కవిత స్థాయి తగ్గనంత చక్కగా విషదీకరించారు.

    ఈ ఇద్దరికీ శుభాభినందనలు.

  • ఉత్తమ కవిత్వం. ఆ ఉత్తమత్వాన్ని విప్పి చెప్పిన తీరు అత్యుత్తమం. ఏ విశిష్ట పద ప్రయోగాన్ని వదలకుండ గుర్తించి కవి హృదయాన్ని పట్టుకున్నారు. 👏👏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు