రేఖలు దాటని రంగవల్లులు

తమిళ మూలం:  జయకాంతన్

వూరు ఎంతో అందమైన వూరు. ఆ వూరికి అందాన్నిచ్చేది ఆ అగ్రహారమే! యాభై ఇండ్లు ఉండవచ్చు. పెద్ద పెద్ద అరుగులు కలిగిన ఇండ్లు. వాటిల్లో కొన్ని చిన్నవిగా వున్నాఅరుగులన్నీ పెద్దవిగానే వున్నాయి. వీధి కూడా విశాలంగానే ఉంది. తారు రోడ్డు కాదు. ఎంతో కాలంగా నడిచీ నడిచీ మెత్తబడి,  నడవటానికి సుఖవంతంగా వున్న మట్టిరోడ్డు. తిరునాళ్ళ రోజుల్లో ఆ వీధి గుండానే తేరు వెళుతుంది. తేరు ఏడాదికి ఒక్కసారే వస్తున్నప్పటికీ వీధి మామూలుగానే  విశాలంగా వుంది. వీధికి రెండు వైపులా ఇండ్ల పక్కన వేపచెట్లు, పగడపూల చెట్లు, ఎత్తు తక్కువున్నకొబ్బరి చెట్లూ వరుసల్లో వుండి నీడనిస్తుంటాయి.

వీధి చివరన ఒక కోవెల వుంది. ఆ కోవెలకు సాయం సమయాలలో ఆడవాళ్ళు వస్తుంటారు. పగటి పూట పశువులు కాసే పిల్లలు, రోగిష్టి భిచ్చగాళ్ళు… ఆడుకుంటూనో, నిధ్రపోతూనో పొద్దు పుచ్చు తుంటారు. కోవెలకు వెనకున్న ఆ పెద్ద చెరువులో బట్టలుతికే శబ్దం, ఆ వూరి గుండె లయలా సదా వినిపిస్తూ ఉంటుంది. ఆ వూరికి ఆ చెరువు ఎంతో పెద్దది. ఆ చెరువుపై ఆధారపడే చుట్టూరా వూరు ఏర్పడింది. చెరువుకు తూర్పు ప్రాంతంలోనే కోవెలా, ఆ కోవెల నుండి మొదలయ్యే అగ్రహారమూ ఏర్పడ్డాయి.

చెరువుకు దక్షిణ భాగంలో రైతులు, కోమట్లు, అగ్రహారంలో వున్నవాళ్ళ కన్నాకాస్త వసతి కలిగిన  బ్రాహ్మణేతరులూ నివశిస్తున్నారు. ఉత్తర భాగాన, శుచీ శుభ్రతా లేని ఎన్నో చిన్నచిన్నవీధులూ, గుడిసెలతో కూడిన ప్రాంతంలో ఎప్పుడూ  గానుగాడే శబ్దం వినిపిస్తూ ఉంటుంది.  ఆ ప్రాంతంలోనే చేపల మార్కెట్టూ, ముస్లిముల వీధీ వున్నాయి. అక్కడే జన సంచారమూ, అరుపులూ ఎక్కువగా ఉంటుంది. అంగడి వీధీ, సినిమా కొటాయీ, చావిడీ, కార్యాలయాలూ, బస్టాండూ అన్నీఅటు వైపే. ఆ ప్రాంతంలో ఖాళీ స్థలం లేకపోవటం మూలానా, వూరి తూర్పు మైదానంలో ఎక్కడి నుండో వచ్చిన కొందరు ముస్లిములు చిన్నచిన్న గుడిసెలను, గుడారాలనూ వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు.  వాటిల్లో నాటుమందులు అమ్మేవాళ్ళూ, మంత్రించేవాళ్ళూ, ఓ కసాయి కొట్టువాడూ ఉన్నారు. అక్కడ జీవించే మనుషుల కన్నా, వాళ్ళు పెంచే మేకల సంఖ్యే అధికం.

అగ్రహారంలోని వాళ్ళకు వాళ్ళను చూస్తే భయం. వాళ్ళు దేశద్రిమ్మరులన్న ఒక మూఢ నమ్మకం

వుంది; ఆ భయం కలిసిన ఉత్సాహంతో బడిలేని సెలవు దినాలలో కొందరు అగ్రహారపు పిల్లలు ఆ మైదానానికెళ్ళి వాళ్ళను వింతగా చూస్తూ వుంటారు. మైదానంలోనివాళ్ళూ వాళ్ళను సరదాగా భయపెడుతూ వుంటారు. పగటి పూట అక్కడ మగవాళ్లే వుండరు. పసిబిడ్డల్ని పిలిచే అరుపులతోనో, నేల మీదికి రాసుకునేలా వున్న పొదుగులతో కూడిన మేకల పాలు పితుకుతూనో, చెట్లకింద వంట చేస్తూనో వున్నఆడవాళ్ళ మధ్యన ఉత్సాహం పొంగి పోర్లుతుంటుంది. వాళ్ళు నడుస్తున్నప్పుడల్లా కాళ్ళకున్న గజ్జెలు కదులుతూ సవ్వడి చేస్తుంటాయి. వాళ్ళ దుస్తులూ, అలంకరణా చూడ్డానికి వింతగానూ, అందంగానూ ఉండేవి. ఆ వూరికే ప్రత్యేకమైన అందాన్నిచ్చేవాళ్ళు… ఆ మైదానంలోని దేశ ద్రిమ్మరుల ఆడంగులూ, అగ్రహారంలో వుండే బ్రాహ్మణ స్త్రీలూనూ.

ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆ మైదానవాసులను గుర్తుచేసే… అగ్రహారంలో ఏడుస్తున్న పిల్లలను భయపెడతారు. తినటానికి మొండికేసే పిల్లలతో ‘మేకపోతు మీసాలోడోస్తున్నాడు’ అన్నఒక్కమాట చెప్తే చాలు, తట్టెడు అన్నమైనా ఒక్క మెతుకు లేకుండా తినటం పూర్తి చేస్తారు.

ఆ మేకపోతు మీసాలోడే… ఆ మైదానంలో నివసించే మాంసపు కొట్టు కసాయి వాడు.

అగ్రహారపు పిల్లల మధ్య అతని గురించి భయం గొలిపే కల్పిత కథలు ఎన్నెన్నో. వాళ్ళందరికీ అతన్ని పరిచయం చేసినవాళ్ళు ఆ పిల్లల తల్లులే. అతని గురించి ఏం చెప్పినా పిల్లలు నమ్మే విధంగా అతని ఆకారముండేది. ఆ పిల్లలకు బాగా అలవాటైన పెద్దవాళ్ళందరికన్నా అతను ఆకారంలో పెద్దవాడుగా వున్నాడు. వీధి చివర్న కొబ్బరి మట్టలతో పైకప్పు వెయ్యబడి మట్టిలో నిలబెట్టి వున్న- ఏడాదికొకసారి వంద మంది కలిసి లాగే – ఆ తేరును, అతనొక్కడే లాగేస్తాడని చెప్పినా ఆ పిల్లలు నమ్మేటంతగా అతను బలాడ్యుడుగా వున్నాడు.

అతను రోజూ ఉదయం తుప్పు పట్టిన తన సైకిలుపైనే ఆ అగ్రహారాన్నిదాటి వెళ్ళేవాడు. అగ్రహారం చివరన తూర్పు దిక్కున, వెదురు పొదల వెనక, సూర్యుడు ఉదయించే సమయంలో అతని సైకిలు ఆ మైదానం నుండి అగ్రహారంలోకి ప్రవేశిస్తుంది. అగ్రహారంలోకి ప్రవేశించే ముందు ఆ మూలలో కాసేపు ఆగుతుంది. అతని ఎత్తుకు ఆ సైకిలు చాలా చిన్నది. అతను ఏ వైపుకూ కొద్దిగా కూడా వాలకుండా రెండు కాళ్ళనూ వెడల్పు చేసి నేలమీద ఆనించి సైకిల్ మీద నిలబడుతాడు. చేతిలో వున్న బీడీని గబ గబా గాడంగా రెండు మూడు సార్లు పీల్చి, దాన్నిదూరంగా విసిరి పారేసి, ఆపైనే అగ్రహారంలోకి ప్రవేశించేవాడు.

అతనొచ్చే సమయంలో ఆగ్రహారపు స్త్రీలు వాకిళ్ళ ముందు నీళ్ళు చల్లుతూనో, ముగ్గులు పెడుతూనో వుంటారు. వాళ్ళల్లో చాలామంది, తమ బిడ్డల్ని భయపెట్టేందుకు ‘మేకపోతు మీసాలోడు’  అని అతని పేరును మాత్రం పలుకుతారే కానీ అతనిని చూడాలనేంతగా కూడా అతనికి ప్రాముఖ్యం ఇవ్వరు.

() () ()

అలా ఒకరోజు తెల్లవారు ఝామున వాకిట్లో ముగ్గేస్తున్న శంకరయ్యర్ పంతుల కూతురు మీనా సైకిలు శభ్డం విని, వంచిన తలను పైకెత్తకుండా కళ్ళను మాత్రం పైకెత్తి, అతని పాదాలను చూసి ఆ తర్వాత మనిషిని చూడాలని పైకి లేచి నిలబడింది. సైకిలుపై వెళుతున్నవ్యక్తి ఎవరో అగ్రహారపు మనిషేనన్న తలంపుతో అతన్ని చూసేందుకు సాహసించిన మీనాకు, అతను అన్యమతస్తుడు కావటంతో ముఖంలో సన్నని మార్పు కనిపించింది. అయినప్పటికీ ఆ వినోదమైన అన్యమతస్తుడి గాంభీర్యం, అతను వీధి మలుపు తిరిగేంత వరకూ ఆమెను చూసేలా చేసింది.

మైదానంలో నివాసముంటున్న దేశద్రిమ్మరుల గుంపు గురించి ఆమెకు తెలియదు. ఆమె యింత కాలమూ మెట్టినింటి చెరసాలలో బంధింపబడి, అంతకు క్రితంరోజే పుట్టింటికి శాశ్వతంగా తరిమి వేయబడ్డది. అందుకు ఆమెకు కొంత సంతోషం కూడానూ. ఆమె హృదయ విదారకమైన వ్యక్తిగత జీవితపు నిరాదరణలో నిండిన మోసమూ, పదే పదే మగవాళ్ళను చూసేలా చేస్తోంది. కొన్ని సమయాలలో చూసీ చూసీ నిట్టూర్చేలా కూడా చేస్తోంది.

పదేళ్ళు కలిసి జీవించి, ఎనిమిదేళ్ళ ఓ కొడుకుకు తల్లీ అయిన ఆమెను, ఆమె భర్త దూరం పెట్టేశాడు. శంకరయ్యర్ భార్య ఈమధ్యే కాలం చెయ్యటంతో, ఆయనకు వంటా వార్పూ చేసిపెట్టేందుకు ఓ మనిషి సాయమూ కావలసి వచ్చింది. తండ్రికి కూతురుగానూ, బిడ్డకు తల్లిగానూ జీవితపు ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వానికి మార్చబడ్డ ఆ మార్పు, ఆమెకు ఒక ప్రశాంతతను చేకూర్చింది. అందుకు కారణం, ఈ మార్పు అన్నది ఆమెకు అలవాటైన పాత మార్పు కావటమే!

అంతే కాకుండా మీనా మెట్టినిల్లు తంజావూరులో వుంది. తంజావూరు చిన్నచిన్న సందులకు పెట్టింది పేరు. చూడటానికి చిన్నసందుగానే కనిపిస్తుంది, దాని లోపల అంత:పురం లాంటి ఇండ్లు వుంటాయి. మీనా ముగ్గులెయ్యటమే జీవితంగా భావిస్తున్నవ్యక్తి. ఆమె ముగ్గుల పుస్తకాలు ఆ అగ్రహారమంతా బాగా ప్రసిద్ధం. ఎప్పుడూ తన మనసులో కదలాడే భావాలన్నింటినీ కొత్త కొత్త ముగ్గులుగా నోటు పుస్తకంలో గీస్తూ వుండేది. వయసైన ముసలివాళ్ళ దగ్గరనుండి చిన్నవాళ్ళ దాకా మీనా గీసే గీతలను ఆశ్చర్యంగా చూస్తూ  పొగుడుతుండేవాళ్ళు.

ఆ అగ్రహారపు విశాలమైన వీధిలో సైతం ఆమెకు ముగ్గులు వేసేందుకు విస్తీర్ణం చాలదు. పక్కింటికీ  తమ ఇంటికీ మధ్యన ఎల్లలు ఏర్పరిచే విధంగా ముగ్గుపిండితో ముందుగా ‘బార్డర్’ గీసేది. అంత పెద్ద విస్తీర్ణంలో ఆమె ముగ్గులు పెట్టటం పూర్తి చేసి తల పైకెత్తే సరికి కొన్నిసందర్భాలలో ఎండ పైకొచ్చేసేది.

అలాంటి సుఖానుభూతికి తంజావూరులోని సంధులలో వీలుకాదు.

పుట్టినింటికి రాగానే ‘ హమ్మయ్య! ఇకపై హాయిగా ముగ్గులు వేసుకోవచ్చు’ అని ఆనందంగా ఊపిరి పీల్చుకుంది మీనా.

వంట చేసే సమయం పోనూ, రోజంతా వసారా ఊయలలో కూర్చుని ముగ్గులు గీస్తుండేది మీనా. కొన్నిసమయాలలో అరుగు మీదికొచ్చి స్తంభాన్నిఎడమచేత్తో చుట్టుకొని, తాను ఉదయం వీధిలో వేసిన ముగ్గును ఇతరులు కాళ్ళతో తొక్కిన శోకాన్ని అనుభవిస్తున్న దానిలా చూస్తూ వుండిపోయేది.

ముగ్గు మాత్రమేనా తొక్కబడుతోంది?

అగ్రహారంలో, పసి ప్రాయంలో ఆమెతో ఆడుకున్న, అలవాటైన, నవ్వుకున్న ఆ మగ పిల్లల్లో ఇవ్వాళ ఒక్కొక్కరూ ఒక్కొక్క స్త్ర్రీకి ఎంత మంచి భర్తగా మారిపోయారు. తన తలరాత తనను ఎలాగంతా పీల్చి పిప్పిచేసి, మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి పడేసిందన్న వ్యాకులతతో వాళ్ళను చూసి నిట్టూరుస్తూ వుండేది. ఆ నిట్టూర్పే ఆమె ఏకాంతానికి ప్రశాంతతనిస్తోంది. అలాంటి ఒక స్పృహతోనే అవ్వాళ తల పైకెత్తి ఆ అన్యమతస్తుణ్ని చూసింది. అయితే నిట్టూర్పులేవీ లేకుండా, ఒక వేడుకగానే ఆస్వాదిస్తూ నిలబడ్డది.

ముప్పైఏళ్ళకే దాంపత్య జీవితం ముగిసిపోయిందన్న తీర్పును శిరసా వహించి, పుట్టినింటికి వచ్చిన ఆమెకు, పరాయి మగవాళ్ళను చూడటానికి కూడా హక్కు లేదా? అయితే, బ్ర్రాహ్మణ కులంలో పుట్టిన ఒక స్త్రీ, పరాయి మతస్తుణ్ని చూసి నిట్టూర్పు విడవవచ్చా, ఏంటి? కానీ, అతనిని చూశాక ఆమెకు నిట్టూర్పు కలగలేదు. అయినప్పటికీ అతనిని ఆమె చూసేది.

ఆమె వంచిన తలను పైకెత్తకుండా ముగ్గు వేస్తూనే, సైకిల్ పెడల్నుతొక్కుతున్న, లావుపాటి  బూట్లు ధరించి, మోకాళ్ళ పైనున్నలుంగీ అంచున రోమాలు కలిగిన అతని కాళ్ళను మాత్రం చూసేది. కొన్ని సమయాలలో అతను తనను దాటి వెళ్ళాక లేచి నిలబడి, ఆ చిన్న సైకిలుపై ఆజానుబాహుడుగా వెళుతున్న అతని వెనుక భాగాన్ని చూసేది. అతను బూడిద రంగు టేర్లిన్ షర్ట్ ధరించేవాడు. వీపున, లోపల వేసుకున్న తెల్లటి బనియన్ అతని భుజాల వెడల్పును ప్రదర్శించేది. నాలుగంగుళాలకు  పైనే   వున్న వెడల్పాటి బెల్టూ కనిపించేది. ఆడవాళ్ళు కట్టుకునే చీర లాగా, ఒక్కోరోజు ఒక్కో రంగు లుంగీ ధరించేవాడు.

కొన్ని సమయాలలో చెరువులో స్నానం చేసి వస్తుంటే ఎదురుపడ్డప్పుడు అతని ఆకారాన్ని ఆమె పూర్తిగా చూసేది. ఎందుకంటే అతను ఆమెను చూడడు; అందుకని ఆమె అతనిని చూడడానికి వీలవుతుంది. అతను అన్య మతస్తుడైనప్పటికీ, ఏదో ఒక గుడిని దాటి వెళుతున్నట్టుగానే, ఎంతో పవిత్రతతో ఆ అగ్రహారాన్ని దాటుకుని వెళ్ళేవాడు. సైకిలుకు ‘హ్యాండ్ బార్’ లా, అతని ముఖంలో ఆ మీసం చెవుల దాకా అడ్డంగా పెరిగి వుండేది. అతని వయసు ముప్పైకి పైన నలభైకి లోపు అన్న రహస్యం తక్కిన వాళ్లకు తెలియకుండా ఆ మీసం వెనుక దాచిపెట్టినట్టుంది. తలంతా రింగు రింగులుగా తిరిగిన వెంట్రుకలు మెడదాకా పెరిగి వుండేది. అతనికి మీసంలాగే కనుబొమలూ మందం. అతని కళ్ళు పెద్దవిగా వుంటాయనే విధంగా తెలిపే కనురెప్పలు. పచ్చని నరాలు కలిగిన మెడపై, సన్నని వెండి చంద్రరేఖ, కాసులు, తాయెత్తుతో గుత్తుగా కట్టిన నల్లటి దారం. అతని విశాలమైన ఛాతీపై సరసరమని పెరిగిన రోమాలు. అతను ఎరుపు రంగో నలుపు రంగో కాదు; పసుపు. అతను సైకిలుపై వస్తుంటే ఎదురుగా వుండి చూడటానికి వినోదంగా వుండేది. అతని పెద్ద పొట్ట  ‘హ్యాండ్ బార్’ కు తగులుతుండేది. కనుక అతను కాళ్ళను కాస్త పక్కకు పెట్టి సైకిలును తొక్కేవాడు.

ఆ సైకిలు హ్యాండ్ బార్ పైన రక్తపు మరకలతో – కొన్ని సమయాలలో ఈగలు ముసురుకున్న ఒక చిన్న ఖాకీరంగు సంచీ వ్రేలాడుతుండేది. దాని లోపలి నుండి, సంచి కొస పైకి అతని కసాయి కత్తి పిడి కనిపిస్తుండేది. ఆ పిడిని చూస్తేనే, ఆ కత్తి పదును చూసేవాళ్లను కలవర పరిచేది.

ఉదయం పూట ముగ్గులు వేస్తున్న, కొలనులో స్నానం చేసి వస్తున్నఅగ్రహారపు ఆడవాళ్ళను దాటుకొని , వీధి చివరకు వెళ్ళగానే, మళ్ళీఅతను ఏ పక్కకూ కొద్దిగా కూడా వాలకుండా, రెండు కాళ్ళనూ నేలమీద ఆన్చినట్టు సైకిలుపై నిలబడేవాడు. నిలబడి, ఒక బీడీని వెలిగించుకున్నాక అగ్రహారపు దృష్టి నుండి కనుమరుగయ్యేవాడు.

సాయంకాలం అతను ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో అగ్రహారపు వీధిలో చిన్న పిల్లలు ఆడుకుంటూ వుంటారు. అక్కడా ఇక్కడా ఆడవాళ్ళు మంచినీటి బిందెలతో కనిపిస్తారు. ఆడుకుంటున్న పిల్లలు, అతని గురించి గుసగుసలుగా తమ కల్పనలను చెప్పుకునేవాళ్ళు.

అతను మేక చెవులను ఒంటి చేత్తో ఎత్తి పట్టుకొని ’సరక్’ మంటూ కత్తితో కోసేస్తాడట. ఆ మేక శరీరం అతని కాళ్ళకింద పడి గిలగిలా కొట్టుకుంటుందట. అతను విసిరి పడేసిన మేక తలలు గుట్టలుగా పడి ఉంటాయట. ఒక రోజుకు వెయ్యి మేకలను నరుకుతాడట. అతని శరీరం ఆ విధంగా ఉండటానికి కారణం అతను రోజుకు మూడు మేకల్ని తినటం వల్లనేనట. అతనిని ఎదిరించి ఎవరూ గెలవలేరట.

ఇలాగంతా తమ కల్పనలను చెప్పుకునేవాళ్ళు. ఆ అగ్రహారాన్ని దాటి వెళ్ళేలోపు, రోజూ ఏదో ఒక ఇంటి నుండి, “ఓ సాయిబూ, వీణ్ణి పట్టుకు పో!” అని పిల్లల్ని బెదిరించే గొంతు వినిపించకుండా వుండదు. కొన్ని సమయాలలో స్తంభాన్ని గట్టిగా పట్టుకొని రానంటే రానని ఏడ్చే బిడ్డను పట్టి లాగుతూ, “ఈరోజు నిన్ను సాయిబుకు పట్టిచ్చేస్తాను. ఇదిగో సాయిబూ…” అని భయపెట్టే తల్లులనూ అతను చూసేవాడు. చూసి లోలోన నవ్వుకుంటూ వెళ్ళేవాడు. అతని ముఖంలో మాత్రం ఆ నవ్వు కనిపించదు.

మీనా కొడుకు బాబూకు, మేకపోతు మీసాలోడి పేరు చెప్పగానే వణుకు వచ్చేసేది. అతను వస్తున్నప్పుడు వీధిలో ఆడుకుంటున్నా, “అమ్మో, మేకపోతు మీసాలోడోస్తున్నాడు. మేకపోతు మీసాలోడోస్తున్నాడు. “ అని అరుచుకుంటూ ఇంట్లోపలికి వచ్చేసేవాడు. వాడి భయాన్నీ, అరుపునూ  చూసి నవ్వుకుంటూ, బయటికొచ్చి నిలబడి అతణ్ణి చూసేది మీనా. అప్పుడు ఆ మేకపోతు మీసాలోడూ ఆమెను చూసేవాడు. అయితే ఆమె నవ్వును అతను పదే పదే చూసే సందర్భంలోనూ బదులుకు అతను నవ్వేవాడు కాడు.

తమ గుంపులో ఎప్పుడో ఎక్కడో కలిసిన ఒక స్త్రీ ముఖ ఛాయను ఆమెలో అతను గుర్తించాడు. సంబంధమే లేని ఆ పోలికలోని విద్డూరాన్నితలచుకొని అతను ఆశ్చర్యపోయేవాడు.

రోజూ తమ పిల్లలు చేసే అల్లరినీ, అతినీ ఒక నెపంగా భావించి, “ఓ సాయిబూ! ఓ సాయిబూ !” అని అతనికి ఎన్నో ఇండ్ల నుండి ఆహ్వానాలు అందినా, అప్పుడంతా తిరిగి కూడా చూడనివాడు, ఇప్పుడు శంకరయ్యర్ పంతుల ఇంటిని దాటుతుంటే, ఏ విధమైన ఆహ్వానమూ లేకపోయినా మెల్లగా తల తిప్పి చూడటం మొదలుపెట్టాడు. అలాంటి సందర్భంలో అక్కడ మీనా నిలబడుండేది.

తమ గుంపులో తాను ఎప్పుడో ఎక్కడో కలిసిన ఒక స్త్రీ …

అది శంకరయ్యర్ పంతుల ఇల్లని అతనికి తెలియదు. ఆ ఇంటి ఆనవాలు అతనికి ఆమె మాత్రమే. ఏదో ఒకరోజు అతను అక్కడ చూసేసరికి, ఏ కారణం చేతనో ఆమె అక్కడ లేకపోయేసరికి, అది ఎవరి ఇల్లో తెలియక అతను తికమకపడేవాడు. ఆపైన, మరోసారి ఆ ఇంట్లో ఆమెను చూసేసరికి స్తంభానికి కట్టిన ఎరుపు రంగు తపాలా పెట్టెను ఇంకో ఆనవాలుగా అతను గుర్తుపెట్టుకున్నాడు.

కొన్ని సమయాలలో మీనా ఇలా అనుకునేది! ‘ఇతన్ని చూసి బాబూ, అగ్రహారపు పిల్లలూ ఎందుకు భయపడుతున్నారో?’

అతని పెద్ద పెద్ద మేకపోతు మీసాలు గుర్తుకొచ్చి ఆమెకు కలిగే ఆ ఆశ్చర్యం తొలగిపోయి, పిల్లలకు కలిగే భయానికి న్యాయం చెప్పేది.

ఆమె ఇలా కూడా అనుకునేది: ‘అతనికి ఆ మీసం లేకపోతే?… ఎవరైనా అతణ్ణి ఆ మీసాన్ని తీసెయ్యమని చెప్తే?… అనవసరంగా భయపడి చచ్చే పిల్లలకు ఎంత ఓదార్పుగా వుంటుంది! ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని తానే అతనికి చెప్పేయాలి!’ అనుకుంటూ మళ్ళీమళ్ళీ వచ్చే అతని ఆలోచనను, ‘ఓసి మొద్దూ, నాకున్న దిగుల్లో అతని మీసం గురించి ఎందుకిలాంటి ఒక ఆలోచన!’ అని తనలో తానే నవ్వుకోవటం ద్వారా తప్పించేది.

ఓసారి అగ్రహారపు పిల్లలు కొందరు కలిసి, వేడుక చూసేందుకు మైదానానికి వెళ్ళారు. ఆ గుంపులో బాబూ కూడా వున్నాడు. మైదానం మధ్యలో, ఒక ఈత చాపపై మాంసాన్ని రాశిలా పోసుకుని, ఒక ముసలి వ్యక్తి వాటిని  ముక్కలు కొట్టి భాగాలు వేసి అక్కడున్న కుటుంబాలకు వినియోగం చేస్తున్న దృశ్యాన్ని వాళ్ళు వింతగా చూడసాగారు.  ఆ అనుభవం వాళ్లకు ఏంతో ఆసక్తిగానూ, ఒంటిని కితకితలు పెట్టే పారవశ్యంగానూ అనిపించింది.

అప్పుడు బాబూను వెతుక్కుంటూ మీనా అక్కడికొచ్చింది. ఆ అగ్రహారపు పిల్లలు అక్కడి తతంగాన్ని ఆస్వాదిస్తూ వేడుక చూస్తూ వుండటాన్నిచూడగానే ఆమెకు కోపం తన్నుకొచ్చింది.            “ఏయ్ గాడిదల్లారా! ఇక్కడికొచ్చి నిలబడి ఏం వింత చూస్తున్నారు? ఇండ్లకు పరిగెత్తండి. ఏరా మణీ, వాడు చిన్న పిల్లవాడు. నీకు బుద్ధి లేదూ? ఉండుండు. ఇంటికొచ్చి మీ అత్తయ్యకు చెప్తాను.” అని అక్కడున్న పిల్లల్నితరమగొట్టి బాబూ చెవిని పట్టుకొని మెలితిప్పింది.

“అదృష్టం, చెరువు కెళ్ళావేమోనని అక్కడంతా వెతికి వస్తున్నాను. మధ్యాహ్నం ఇల్లోదిలిపెట్టి వెళ్లినవాడివి, వూరు తిరగడం బాగా నేర్చుకున్నావు. ఇంటికి రా, చెప్తాను!” అంటూ వాడి చెవిని మళ్ళీ తిప్పేసరికి, బాబూ ఏడవటం మొదలుపెట్టాడు.

ఆ సమయంలో ఒక గుడారంలోనుండి ఆమె బయటికొచ్చింది.

“మీరంతా అయ్యోరింటి బిడ్డలు… ఇయ్యన్నీ సూడకూడదని నేనూ ఎంతో సేపట్నిండి సెప్తానే ఉండా? ఇన్నంటున్నారు!” అంటూ మీనా దగ్గరికొచ్చింది ఆమె.

మీనా కూడా ఆమెను చూసింది.

మీనా కళ్ళకు ఆ అన్య మతస్తురాలూ ఒక వేడుకగానే అనిపించింది. ‘ఆ మతానికి చెందిన మగవాళ్ళూ ఆడవాళ్ళూ ఎంత అందంగా వున్నారు!’ అని మనసులోనే అబ్బురపడింది.

మీనా తన చూపుల్ని మరల్చకుండా, ఆమెను  ఆపాదమస్తకమూ  పరిశీలించింది.

ఆమె తలపై వేసుకున్న పరదా కాస్త పక్కకు తొలిగింది. ఆమె రెండు చెవులూ  చిన్నచిన్నవెండి వలయాలతో అలంకరింపబడి వున్నాయి. వాటిలో కొన్నింటి నుండి ముత్యాలు వ్రేలాడుతున్నాయి. ఆమె గుండ్రటి ముఖంలో పెద్ద పెద్ద కళ్ళు, నల్లటి కనురెప్పల అడుగు నుండి ఈమెను ప్రేమగా కలుసుకున్నాయి. ఆ మేకపోతు మీసాలోడు లాగానే ఆమెకూడా పెద్ద ఆకృతితో వుంది. మోచేతుల దాకా అద్దాల గాజులు అపరిమితంగా వేసుకొని వుండటం కూడా అందంగానే ఉంది. ఎదను మాత్రం దాచి వుంచేలా వున్నఆమె ధరించిన రవికె, రెట్టలు మాత్రం మోచేతుల దాకా పొడిగించబడి వుంది. పసుపు రంగు లోని పొత్తి కడుపు ముడుతా, నాభి గుంతా కనబడుతోంది, ఆమె ఒట్టి లంగా మాత్రమే ధరించింది. ఆమె నడిచి వస్తుంటే, ఆమె నడుము రెండు వైపులా కదులుతూ తేరు కదులుతున్నట్టే వుంది. ఆమె నడుస్తుంటే ఆమె పాదాలకున్న – భూమికి తగిలేలా పెద్దవిగా ధరించిన వెండి గజ్జెల శబ్దం ఇంపుగా ధ్వనించింది.

‘ఈమె ధరించిన ఈ నగలన్నీ నిజంగా బంగారమేనా?’ అన్న అనుమానం కలిగింది మీనాకు. ఆ విషయం అడుగుదామా అన్న కోరికను ఒక్క సెకను సందిగ్ధంలో తనలోనే అణచుకుంది.

మీనా ఏ విధంగా ఆమెను చూసి ఆస్వాదించిందో, అదే విధంగా ఆమె కూడా మీనాను చూసి ఆస్వాదించి వుండాలి. మీనా సన్నని ఆకారమూ, చెవుల్లో నూనె దిగిన కమ్మలూ, ముక్కుపుడకా  ఆమెను ఆకర్షించిన దానికన్నా, ఈమె నుదుటనున్న గుండ్రటి పెద్ద కుంకుమ తిలకం, ఈమెను గొప్ప అందగత్తెను చేసి మైమరిచేలా చేసాయి. తీగెలా మెలి తిరిగిన ఒంటిపై ధరించిన బ్రాహ్మణ కట్టు చీర, దాన్ని ఈమె ఎలా కట్టుకుందో తెలుసుకోవాలన్నఆసక్తి కలిగిన ఆమె చూపులు… ఈమెపై అలాగే నిలిచి వున్నాయి. వాళ్ళిద్దరూ, కొట్టంలోని రెండు పశువులు ఒకదాన్నొకటి స్నేహం కోరి తపించేలా పరస్పరం దగ్గరగా వచ్చారు.

అప్పుడు ఒక మేకపిల్లను తరుముకుంటూ దాని వెనుక బాబూ వయసే ఉన్న ఒక పిల్లవాడు పరుగెత్తాడు. ఆ శబ్దాన్నివిని వెను తిరిగిన ఆమె, వాళ్ళ భాషలో వాడిని తిట్టింది. ఆమె తిరిగినప్పుడు, ఆమె ఆచ్చాదన లేని వీపును చూసిన మీనాకు ఆమె మేని అందం పూర్తిగా మనసులో నగ్నంగా ముద్రితమై గిలిగింతలు పెట్టాయి. మీనా కేసి తిరిగి ఆమె అంది, “అమ్మంటే ఈ బిడ్డలకి అసలు భయమే లేదు. నాయిన అంటేనే భయం.” ఆమె మాట్లాడే భాష అర్ధమైనప్పటికీ మీనాకు ఎందుకో నవ్వొచ్చింది.

“ఔను! వీడు కూడా నా మాటను వినటమే లేదు.” అని మీనా అంటుండగానే, ఆమె అడ్డుపడి చెప్పింది: “మీరెందుకమ్మా ఇంత దూరం వొచ్చినారు? వీడి నాయినతో చెప్పకూడదా?ఆండోల్ల చేతుల్లో బిడ్డలు అణగరు.”

ఆమె మాటల్ని విన్న మీనా కళ్ళల్లో కనిపించిన శోకాన్ని ఆమె గ్రహించినట్టుంది.

“వాడు మీ కొడుకా?” అని మేకపిల్లను తరుముతూ పరుగెత్తిన పిల్లవాన్ని చూసి అడిగింది మీనా.

“ఔను. వాడి నాన్నతో నాకు తలాక్ ఐపోయింది.” అని అంటూ తిరిగినప్పుడు, బయట తన భార్య ఎవరితోనో మాట్లాడుతూ వుండటం విని, ఆ మేకపోతు మీసాలోడు గుడారం నుండి బయటికొచ్చాడు.

అతణ్ణి చూడగానే పరదాను కాస్త ముందుకు లాక్కుంటూ ఆమె, “ఆ తర్వాతే నేను ఈయనను నిక్కా చేసుకున్నాను.” అని గొప్పగా, నిజాయితీగా చెప్పింది.

మీనాకు, ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు అర్ధమైనప్పటికీ కొన్ని పదాలకు అర్ధంతెలియలేదు.

“తలాక్ అంటే?” అని అడుగుతూ, గుడారంలోనుండి వంగి బయటికొచ్చి నిటారుగా నిలబడ్డ అతనిని చూసింది మీనా.

అయ్య బాబోయ్, అతని కళ్ళు ఎంత పదునుగా, లోతుగా, పెద్దదిగా, అల్లరిగా చూస్తున్నాయి!

అతను లుంగీ బనియను మాత్రమే ధరించాడు. మీనాను చూడగానే, నోట్లో ఉన్న బీడీని తీసి కింద పడేసి కాలితో తొక్కి ఆర్పేసాడు. ఇదివరకే పరిచయమున్నభావనతో ఆమెకు సలాం చేస్తూ దగ్గరికొచ్చాడు.

“అమ్మా, ఎందీ ఇంత దూరం వొచ్చినారు?” అన్నఅతని ప్రశ్నకు బదులేమీ ఇవ్వకుండా చిర్నవ్వు నవ్వింది మీనా.

అప్పుడతని భార్య ‘తలాక్’ అంటే ఏమిటో వివరించింది. అప్పటిదాకా, ‘ఈ అగ్రహారానికి బయటే మనుషులూ, జీవితాలూ ఎంతో అద్భుతంగా, అందంగా వున్నాయి’  అని భావిస్తున్న మీనాకు, అన్ని జీవితాలూ ఆడవాళ్ళకు ఒక బందీఖానానే అనిపించింది.

మేకపోతు మీసాలోడిని చూడగానే, మీనా వెనక్కొచ్చి దాక్కున్న బాబూ, అతను ఇంకా కొంచెం దగ్గరికి రాగానే, “అమ్మా, ఇంటికి పోదామే!” అంటూ కొంగు పట్టుకుని లాగుతూ గొణగటం మొదలెట్టాడు.

వెనుక వైపుకు చేతిని చాపి వాడి తలను నిమురుతూ, “ఈ సాయుబును చూసి నీకెందుకు భయం? వీళ్ళందరూ మంచివాళ్ళుగానే వున్నారుగా? ఏమీ చెయ్యరు!” అని వాడికి సమాధానం చెప్పిన మీనా, మేకపోతు మీసాలోడిని చూస్తూ అంది: “నీ మీసాన్ని చూసే పిల్లలందరూ భయపడుతున్నారు. నువ్వు దాన్ని తీసేశావంటే అగ్రహారంలో వున్న పిల్లలందరూ నీ వెనకే పరుగెత్తుకొస్తారు.” అని అంటుంటే ఆమె ముఖం ఎర్రబడి అదోలా అయ్యింది.

“ఏమ్మా, ఈ మీసం నాకు బాగాలేదా?” అని అతను అమాయకంగా అడిగాడు.

‘అయ్యో, ఏంటితను ఇలా అడుగుతున్నాడు! దీనికేం సమాధానం చెప్పాలి?’ అనుకుంటూ సిగ్గుతో మీనా తల దించుకుంది. “బాగా లేకపోవటం ఏంటీ? పిల్లలు భయపడుతున్నారని చెప్పాను.”

“ఇది ఈ మీసాన్ని చూసేగా నన్నునిక్కా చేసుకుందీ?” అని భార్య భుజాన్ని తట్టి, ఆడతనాన్ని దోచుకునేలా అతను నవ్వాడు. తన భుజంపై వున్న అతని చేతిని సున్నితంగా పక్కకు తోసి, తమ భాషలో ఏదో చెప్పి అతని  నుండి కాస్త ఎడంగా జరిగి నిలబడింది.

‘ఓ సాయిబూ, నువ్వు చాలా మోసగాడివి.’ అని చూపులతోనే అంది మీనా.

() () ()

ఆ కలయిక తర్వాత ఆ సంభాషణను, ఆ అనుభవాన్నీ తలుచుకుంటూ ఎంతో సంతోషించింది మీనా. ఒకరోజు ఆ మేకపోతు మీసాలోడిని ఆమె కలలో కూడా దర్శించింది. కలలో, అతని భార్యలా దుస్తులూ, ఆభరణాలూ అలంకరించుకొని తాను నిలబడితే, ఆతను అగ్రహారపు బాపడిలా జంధ్యం వేసుకొని, పట్టు పంచె కట్టుకొని ఎదురింటి అరుగుమీద కూర్చుని వున్నాడు. అయితే, ఆ మేకపోతు మీసం మాత్రం అలాగే వుంది.

‘అయ్యో  గ్రహచారం! పోయి పోయి ఒక బ్రాహ్మణుడు ఇలాంటి మీసాలు పెట్టుకుంటాడా?’ అని ఆమె ఆశ్చర్యపోతున్న సమయంలో, అతను తన వేషం చేరిపెసేలా, ముఖంలో నుండి ఆ మీసాన్ని తీసి పడేసాడు.

అంతే కాదు; తనను వదిలించుకున్న భర్త ఆనందంగా ఉన్నరోజులలో పిలుస్తున్నట్టుగా, ‘మీనూ మీనూ’ అని పిలుస్తూ ఈ ఇంటి మెట్లెక్కి లోపలికొస్తున్నాడు. అతని నుండి ఆమె దూరం దూరంగా పోతోంది.

అతను ‘మీనూ మీనూ’ అని పిలుస్తూ నట్టింటి వరకూ వచ్చి ఊయలపై పరిచి వున్న పడకపై కూర్చున్నాడు. ఎంతో దర్పంగా ఊయలలో కూర్చుని ఊగుతూ అతను అంటున్నాడు: ‘అంతా వేషం వే మీనూ, వేషం! నేనొక వేషం వేసుకుని, నువ్వొక వేషం వేసుకుని మనిషికొక నాటకం ఆడుతున్నాం!’ అని ఆడతనాన్ని దోచుకునే నవ్వుతో అతను అంటుంటే మీనాకు కోపం ముంచుకు  రాసాగింది.

‘నేనేమీ వేషం వెయ్యలేదు. నువ్వే వేషం వేస్తున్నావు. నీ వేషాన్నివేసుకుని నువ్వు వీధిలో పోతూ వుండు. నేను వింతగా చూస్తూ ఉంటాను. లోపలికి రావద్దు.’ అని కటినంగా అనగానే, అతను రోషంతో లేచి వెళుతూ వుంటే ఆమెకు ఆవేదనగా అనిపించింది.

నిద్ర నుండి మేలుకున్న మీనా, లేచి, మంచి నీళ్ళు తాగి, దేవుని పటం ముందుకెళ్ళి నిలబడి, “ఇలాంటి స్వప్నాలన్నీ రాకుండా కాపాడు, దేవుడా!” అని ప్రార్దించింది.

మరుసటి రోజు ఉదయం ఆమె వాకిలి ముందు ముగ్గు వేస్తుంటే, వంచిన తలను పైకెత్తకుండా కళ్ళను మాత్రం లేపి, సైకిల్ పెడల్ను తొక్కుతున్న, లావుపాటి బూట్లు ధరించిన, మోకాళ్ళకు పైన లుంగీ అంచుపై రోమాలు కలిగిన అతని కాళ్ళను మాత్రం ఆమె చూసింది.

తర్వాత, అతను తనను దాటి వెళ్ళాక పైకి లేచి నిలబడి ఆ చిన్న సైకిలు పై అజానుబాహుడుగా వెళ్తున్న అతని వెనక వైపు ఆకారాన్ని చూసింది.

కొన్నిరోజుల తర్వాత ఒకరోజు చెరువులో స్నానం చేసి వస్తుంటే అతను ఎదురుపడ్డప్పుడు, అతని ఆకారాన్ని పూర్తిగా చూడకుండా ఆమె తల దించుకుని ముందుకు నడిచింది.

***

 

జిల్లేళ్ళ బాలాజీ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది కథ..పేరుకు తగినట్లుగా అర్థవంతంగా ఉంది.రాసిన వారికీ అనువదించిన మీకు అభినందనలు!

  • కథ బాగుంది. భర్త నుండి విడివడి వచ్చిన ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక సాయిబును కలలో వూహించుకోవడం కూడా వూహించసాధ్యం కాని కాలంలో జయకాంతన్ ఈ కథ రాయడం పెద్ద సాహసమే. జిల్లెల్ల బాలాజీ గారి అనువాదం తేటగా బాగుంది. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు