రెండు ప్రయాణాలు 

కటి రైల్లోను, రెండవది రథం మీదా లేదా కింద .
రెండూ రెండు రకాల మానసిక అవస్థలను చెప్తున్నాయి.ఐతే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనడం ఖాయం. మొదట రెండోది చూద్దాం. రథ ప్రయాణం. ఒకరకంగా ఇదే మొదటిది
నీ రథము (శీర్షిక)
ఓ ప్రభూ! నీ రథమ్ము దీక్షాప్రణీత
విధురవేగమ్ము పరువులు పెట్టుచుండె
నాశరీరమ్ము దానికింద పడి నలిగి
నలిగిపోయినది రక్తనదములింకి
ఇక్కడ రథము అంటే రథం కాదు. కాలచక్రాలతో పరిగెత్తే విశ్వ గమనమే. దాని దీక్ష ముందు మరేదీ సరిపోలదు. సూర్యచంద్రుల ప్రవేశ నిష్క్రమణ ల క్రమబద్ధతే దాని కి సాక్షి.
 దానిది దీక్ష తో తోయబడిన ఎడతెగని వేగం.
దానికింద పడి నా శరీరం నలిగి నలిగి పోయింది. కవి రెండుసార్లు ‘నలిగి’ పద ప్రయోగం చేశాడు.
రక్త నదము లు ఇంకి పోయేలాగ. కారిపోయేలాగ, ప్రవహించేలాగ కాదు. ఇంకిపోయేలాగ. పైగా నదులు కాదు. నదములు.
తర్వాతి పద్యం చూడండి
“దివ్యతేజోవిరాజత్ త్వదీయ రథము
ఈ గతుకుడేమి యనియైన నాగలేదు
నా విరోధించిన హఠాన్నినాదమునకు
వెనుదిరిగియైన మరి చూచికొనగలేదు”
అది మామూలు రథం కాదు. నీ రథం కింద నా శరీరం పడినప్పుడు ఈ గతుకుడు ఏమిటీ అనికూడా ఆగలేదు సరికదా నేను చేసిన ఆక్రందన కు (మామూలు అక్రందన కాదు హఠాత్తు గా పెగిలివచ్చిన అరుపు) వెనుతిరిగి చూసుకోలేదు కూడా. ఇక్కడ చూడలేదు అనకుండా చూచికొనలేదు అంటున్నాడు కవి.
తర్వాత
“నాదు రక్తంబు నీ రథచోదకుండు
కడిగివేయును రేపు చక్రములనుండి
అచటి బహు రక్త చిహ్నములయందు
నాది ఇదని గుర్తేమి కన్పడును సామి”
రేపు నీ రథం నడిపేవాడు రథం కడిగేటప్పుడు అంటుకున్న నా రక్తం కడిగేస్తాడు. కానీ అక్కడ ఎందరో నాలాగే పడి నలిగిన వారి రక్తం ఉంటుంది. అందులో ఇది నాది అని నువ్వయినా నీ రథచోదకుడైనా ఎలా గుర్తుపట్టగలరు. రథం కింద పడి నలిగిన నేను ఎలా నీ లెక్కకి వస్తాను అని అడుగుతున్నాడు కవి
ఆలోచించే కొద్దీ ఎంతో దూరం తీసికెళ్లే కిటికీ ఈ పద్యత్రయం.
మన కష్టాలు, వ్యథలు, హింసలు ఏవీ ఈ రథాన్ని ఆపలేవు. దాని కింద పడి నలగవలసినదే. రక్తాలు ఓడ్చవలసిందే. మానవజీవితమే ఇంత. మన హఠాన్నినాదం ఈ విధికి వినపడదు.
కానీ చివరి వాక్యం ఏమంటోందంటే ఇది అంటే ఈరక్తం అంటే ఈ కష్టం నాది అని చెప్పడానికి మిగిలిన వారి నుంచి విడదీసి చూపడం ఎలా?? ఎలా వేరుగా ఉంటే ఓ ప్రభూ నువు నన్ను గుర్తుపడతావు?? అని
అంటే అందరూ ఈ రథం కింద పడి నలిగేవారే అన్న ఎఱుక ఒక్కటే శరణ్యం.
ఐతే నీ రక్త చారికల గుర్తు తెలిపే మార్గం ఒకటుంది. అదేమిటో మరో కవితలో ఇలా రాస్తాడు. కవి పేరు చివర చెప్తాను. కానీ శీర్షిక పేరు వినగానే చాలామందికి తెలిసిపోయి ఉంటుంది.
ఇప్పుడు మొదటిది అనుకున్న రెండో ప్రయాణం, రైలు ప్రయాణం.
అంధ భిక్షువు (శీర్షిక)
“అతడు రైలులో నే బోయినపుడెల్ల
ఎక్కడో ఒక్కచోట తానెక్కు – వాని
 నతని కూతురు నడిపించు ననుసరంచి
అతడు దాశరథీశతకాంతరస్థ
మైన ఆ పద్యమె పఠించు ననవరతము.”
ఇప్పుడు మన మధ్యతరగతి వాళ్లం చేసే రైలు ప్రయాణాల విధానమే మారిపోయింది గానీ చాన్నాళ్ల కిందట ఇలాంటి అంధ భిక్షువులు మనకీ తెలుసు. వాళ్లు ఎప్పుడో ఏదో ఒకటే ఐన పాటో పద్యమో పట్టుకుని ఉంటారు. పాడుతూ రైల్లో అడుక్కుంటూ ఉంటారు.
అలాంటి అతని గురించి కవి చెప్తున్నాడు. ఇప్పుడు ఇతన్ని కూతురు అనుసరించి నడిపిస్తూ ఉంది. క్రియా పదం చాలా జాగ్రత్తగా గమనించాలి.
“అతని ఆ గొంతుకట్లనే – అతడు పూర్వ
జన్మమందు ఏ నూతిలోననో చచ్చిపోవుచు
ఎంతపిలిచిన వినువారలేని లేక,
ఆ పిలుపు ప్రాణకంఠమధ్యముల యందు
సన్నవడి సన్నవడి నేటికి అతని
కనుచు వెదకుచు వచ్చి చేరినది గాక”
కృష్ణశాస్త్రి గారు ముసలితనంలో తనకు వచ్చిన మూగతనం గురించి శిథిలాలయం లో అంధకారం లాగ ఉందంటారు. మనసును కోస్తుంది ఆ మాట.
ఇక్కడ ఇతనికి దారిద్య్రం లో అంధత్వం. అదొక వేదనామయ జీవితం. ఆ వ్యధంతా అతని కంఠంలో వినిపిస్తోందంటాడు కవి. కానీ అలా చెప్పడు. కవి కదా
పూర్వజన్మలో నూతిలో పడిపోయి, రక్షించమని అరచి అరచి, వినేవారు లేక ఆ ఎలుగు (కంఠధ్వని) సన్నపడి సన్నపడి ఇప్పుడు ఇతన్ని కనిపెట్టి వెతుక్కుంటూ వచ్చినట్టు ఉందట.
మాట నూతి లోంచి వస్తోందంటాం జబ్బుచేసిన వాళ్లను గురించి చెప్తూ.
కంఠ స్వరం గురించి చెప్పడం అయింది. చూపు లేని అతని కన్నుల గురించి  ఇలా రాస్తాడు.
“అతని కన్నులా బొత్తలే – ఆ సమయము
నందు తన్ను రక్షింప నెవరైన వత్తు
రేమొ యని చూచి చూచి యట్లే నిలబడి
అతనిప్రాణాలు కనుగూళ్లయందు నిలిచి
మరల కనెగాక నేటి జన్మమున అతని”
కన్నులు చిల్లుపడిన పాత్రల్లా ఉన్నాయి. నూతిలో పడిఉన్న తనను ఎవరేనా రక్షంచడానికి వస్తారేమో అని ఎదురుచూచి చూచి అతని ప్రాణాలు కళ్ళల్లో నిలబడిపోయాయి. ‘నిలిచి’ అంటాడు చూడండి. అవి ఈ జన్మలో మళ్లీ ఇతన్ని చూసాయి. కళ్లకి చూపులేకపోయినా ప్రాణాలున్నాయిట. అతను చూడలేకపోయినా అవి ఇతన్ని చూసి వచ్చి చేరాయి. ప్రాణభీతితో ఎదురనచూసిన చూపులు బొత్తల్లాంటి కళ్లలో కవికి కనిపించేయి.
కళ్లలో ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడంటాం చివరి దశకు చేరినవాణ్ని
“అతను పాడినయంతసేపు అల్ల – అట్టి
అతని కన్నులు చూచినపుడెల్ల
నూతిలో మున్గు అతని తీరునంచు
వేగిరముపుట్టు నాదు హృధ్వీధి యందు”
అతను పాడుతున్నంతసేపూ, అతనికన్నులు చూస్తున్నంత సేపూ నూతిలో మునిగిపోతాడేమో అని నా గుండెల్లో కంగారు గా ఉంటుంది.
“అంతలో పాటనాపి, తానచట నచట
కానుక లడిగి కూతురు ముందుగా, వినిర్గ
మించు నాతడు——
                        నేనందు మిగిలిపోదు. “
పాట ఆపి అక్కడక్కడ ప్రయాణీకుల నుంచి – ముష్ఠి అనలేదు కానుకలు అన్నాడు కవి – తీసుకుని కూతురు ముందుకు పోగా విశేషంగా నిర్గమించేడ ట. వెళ్లిపోయాడు.
కానీ నేను అక్కడే మిగిలిపోయాను అంటున్నాడు కవి. ‘నేనందు మిగిలిపోదు’
తాను కానుక ఇచ్చింది లేనిదీ చెప్పడు.
కానీ అతని కంఠంమూ, కన్నులూ నూతిలో నుంచి రక్షించమని కోరడం విన్నాడు, చూచాడు. అక్కడే ఆగిపోయాను అంటాడు. ఈ ఆగి పోవడం వెనక చాలా ఉంటుంది. కవితకు అదే ప్రాణం.
మొదట కూతురు అనుసరించి వచ్చింది. ఇప్పుడు ముందుకు వెళ్లింది.’ కూతురు ముందుగా వినిర్గమించు’ ఇలాంటి మరెన్నో వివరాలు ఉన్నాయి. ఇవి ఆలోచించమంటాయి. కిటికీలు తెరవమంటాయి.
కానీ వీటన్నిటి కన్న తెరుచుకున్న పెద్ద కిటికీ ఒకటి ఉంది.
ఇటువంటి వారి దగ్గర ఎవరైతే ఆగిపోతారో,ఎవరు వారిని దాటి ముందుకు వెళ్లలేరో  ఎవరి హృదయం సంక్షుభితమౌతుందోవారు మిగిలిన ప్రపంచం నుంచి వేరైనవారు. వారు సంసార రథచక్రాల కింద పడి నలిగినా, వారి రక్తపుటేరులు చక్రాల కింద ఇంకినా మర్నాడు వారి రక్తపు చారికల గుర్తులు రథ చోదకుడు కడిగినా పోవు. ఆ రథం కింద పడి నలిగిన మిగిలిన వారి రక్తపుమరకల నుంచి ఆప్రభువుకు విడిగా కనపడతాయి. ఆయన గుర్తు పట్టగలడు, అని ఆ పెద్ద కిటికీ లోంచి చూస్తే నాకు కనిపించింది.
ఇంతకీ ఈ పద్యాలు రెండూ విశ్వనాథ సత్యనారాయణ గారివి. ముద్దుకృష్ణ గారి సంకలనం వైతాళికుల లోవి. రెండూ వేరు వేరు కవితాఖండికలు. వాటిని ఇలా కలిపిన కొంటెతనం నాదే. కానీ ఇలాగే కలపాలేమో!!!
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి పద్యాలను పరిచయం చేశారు. అభినందనలు

  • అద్భుతమైన రెండు పద్యాలను కలిపి కట్టి అందగించారు. ఎంతో బాగా

    వివరించారు. బహు కృతజ్ఞతలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు