రెండు కతలు – రెండు నుడుగులు- నాలుగు ముచ్చట్లు

రెండు కతలు – రెండు నుడుగులు- నాలుగు ముచ్చట్లు

‘మళుపు కూడా తిరిగేసింది’

‘తెల్లారి పోయింది’

రెండు వేరువేరు కతల్లోని చివరి నుడుగులివి. మొదటిదేమో తెలుగుకతలోనిది. రెండవ నుడుగు ఒక తమిళ కతకు తెలుగుసేత.  రెండు కతలూ 1935లో వచ్చినవే. ఎన్నిసార్లు చదివినా చదివినప్పుడల్లా అబ్బురపడిపోతుంటాను నేను. ఒక్క చిన్న నుడుగుతో (వాక్యం) ఇంత గొప్పగా కతను ముగించవచ్చా, ఒక చిన్న నుడుగు కతకు ఇంత చేవను ఇస్తుందా అన్న అబ్బురమది. అది కూడా ఒకే కాలంలో వెలువడడం మరింత అబ్బురం కాదా!

మొదటిది, కతలను చదివే తెలుగువాళ్లందరూ ఎరిగినదే. శ్రీపాదగారు రాసిన ‘అరికాళ్ల కింద మంటలు’ లోనిది. కతంతా చిట్టిపొట్టి నుడుగులు. కతను చదువుతున్నట్టు అనిపించదు. కట్టెదుట ఏదో నాటకం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. విరవిర, ఊపిరి తీసుకునే తడవు కూడా ఇవ్వకుండా సాగిపోతుందీ కత.

కత సరే, ఎంత గొప్ప నుడుగును తెలుగువాళ్లకు అందించినాడండీ శ్రీపాద! గిడుగు చేసిన వాడుకనుడి పోరాటపు తొలిపంట గురజాడ అయితే మలిపంట శ్రీపాద. పక్క నుడుగులతో పోల్చుకొని చూస్తే, గిడుగు తెలుగుకు చేసిన మేలేమిటో ఎరుక పడుతుంది మనకు. తెలుగులో గురజాడతో మొదలయి, శ్రీపాదతో కొండకొమ్ముకు చేరుకొనింది వాడుకనుడి. ఈ పని చాలా జాగుతో 1970లలో కానీ మొదలవలేదు తమిళంలో. కీరా అనే తెలుగాయన మొదలిడినారు తమిళంలో. కీరా మొదలు పెట్టినా దానిని కొనసాగించిన, సాగిస్తున్నవారు బాగా తక్కువ. ఇప్పటికీ తమిళంలో చేంతాడంత పొడవయిన నుడుగులతో కతను చెప్పేవారే ఎక్కువ.

శ్రీపాదవారిది తియ్యటి గోదాటి నల్లింటి (అగ్రహారపు) తెలుగు. నోరూర చవులు పుట్ట… అంటారే అట్టాంటి తెలుగది. ఒక్క సంగీతమేదో పాడునట్లు… అంటారే అట్టాంటి నుడుగది. ఆయన కతల్లోని కరుగు (వస్తువు)ను అట్టుంచండి. ఆ నుడుగులకే మైమరపు కలుగుతుంది. కతంతా అయిపోయినాక చివరలో ‘మళుపు కూడా తిరిగేసింది’ అని ఆపేయడం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ ఒక్క నుడుగు కోసం పలుమార్లు చదవాలనిపిస్తుంది ఆ కతను.

రెండవదయిన ‘తెల్లారిపోయింది’ తమిళ రచయిత కు.ప.రా., గారి నుడుగు. ‘తెల్లారునా’ అనే కత పై నుడుగుతో ముగుస్తుంది. కతకు గొప్ప ముగింపును ఇచ్చిన నుడుగిది. చెన్నపట్నంలో ఉండే కుంజమ్మ, పండుగకు కుంబకోణంలోని పుట్టినింటికి పోతుంది. ఆమె అక్కడ ఉండగానే పెనిమిటికి ఆవడి (సీరియస్‌)గా ఉందని తీవ (తంతి) వస్తుంది. ఆ మాపటివేళ అడావిడిగా తమ్ముడిని తోడుకొని బయలుదేరుతుంది. రేయంతా సాగిన పయనంలో కుంజమ్మ పడిన అలమటా ఒత్తిడీ అంతాయింతా కాదు. తెల్లవారేసరికి  పట్నానికి చేరుకొన్న కుంజమ్మకు తెలిసిపోతుంది ‘తెల్లారిపోయింది’ అని. ఈ చివరి నుడుగు కుంజమ్మకే కాదు చదువరుల గుండెల్లోని ఒత్తిడిని కూడా తీర్చేస్తుంది.

తమిళంలోని గొప్ప రచయితలలో కు.ప.రా ఒకరు. వీరి నిక్కపు పేరు పురాణం రాజగోపాల శర్మ. తెలుగువారు. కావేటి నీటితో తడిచిన కమ్మటి తమిళంలో కతలను రాసినవారు ఈయన. ఊరు కుంబకోణం. బతికింది నలబైరెండేళ్లే. అందులోనూ చివరి నాలుగయిదేళ్లు కంటిచూపును కోలుపోయినారు. తెలుగులో చెలం లాగా తమిళంలో ఆడువారి గురించి తపన పడిన రచయిత. వీరి చెల్లెలయిన సేతు అమ్మ కూడా రచయిత్రే. సేతు అమ్మకు చాలా చిన్న ఈడులోనే పెళ్లయి, ఆ ఈడులోనే పెనిమిటి చనిపోయినారు. చెల్లెలు పెద్ద అయినాక, తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలికి మారుమనువు చేసినారు రాజగోపాల్‌ గారు.

గోదావరి తీరంలో వీరేశలింగంగారు మొదలిడిన మారుమనువులు కావేటిగట్టును తాకి, మరింత కిందికి పోయినాయి. కాబట్టే తమిళ మహాకవి సుబ్రమణ్య బారతిగారు, వీరేశలింగంగారిని కతానాయకుడిగా చేస్తూ ‘చంద్రిక’ అనే కొత్తెన (నవల)ను మొదలిడినారు. దానిని ముగించకుండానే ఆయన కనుమూసినారనుకోండి.

పురాణం రాజగోపాల శర్మ గారి కతలనన్నిటినీ తెలుగులోకి తెచ్చుకుంటే మంచిదేమో తలపోయాలి మనం.

*

స వెం రమేశ్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “అమ్మా పరీక్షలు వచ్చినవి కాదుటే!” అన్నాడు రాజగోపాలం.
    —నోరి నరసింహశాస్త్రి, గాన భంగము, కథ, 1920

    ఒంటరిగా – చంద్రుడు.
    —మల్లాది రామకృష్ణశాస్త్రి, మ్చ్!, కథ, 1934

    చంద్రోదయాన్ని వదిలిపెట్టి పారిపోయినవాడికి లేం దీచంద్రోదయాని కెదురు పరిగెత్తేవాడి కెందు కీదుఃఖం?
    —కొడవటిగంటి కుటుంబరావు, చంద్రోదయం, కథ, 1935

    ‘అరికాళ్లకింద మంటలు పెడితే…?’ అన్న మూలకథ (పబుద్ధాంధ్ర, జూన్ 1935)లోని ముగింపు వాక్యం ఇది: “నిజంగానే, జట్కా, మేఘాలమీదే యెగిరిపోవడం వల్ల యీకసిన్ని మాటలే వినిపించాయి.” మీరు రాసిన ముగింపు 1940 నాటిది; ‘చిన్నకథలు’, నాలుగో సంపుటి ముద్రణ సమయంలో సవరించిన ముగింపు.

    ఈకథకంటే ముందుకాలంలోనే రాసిన కొన్ని మంచి ముగింపువాక్యాలని పైన ఉదహరించాను. వాటిని ఆయా కథాసందర్భంతో సహా మూలకథలో చదివిచూడండి. వాటి సమర్ధత అర్థమవుతుంది. శ్రీపాదకి ముందే అటువంటి ప్రమాణాలు అందుకునే ప్రయత్నాలు జరిగాయన్నదీ విశదమవుతుంది!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు