రాచకొండ గుర్తులు!

రావిశాస్త్రి గారిని తలచుకుందాం!

సాయంత్రం   తెల్ల ఫేంటూ, షర్టూ టక్ చేసుకొని నల్లటి బూట్లతో, చేతిలో సిగరెట్టుతో ఆయన ఎల్లమ్మ తోటలోని తన ఆఫీసునుండి జిల్లా పరిషత్ వద్దనున్న ఇంటికి కేజీఎచ్ మీదుగా నడిచి పోతుంటే ఆనాటి నా ప్రాణస్నేహితుడైన సురా, నేనూ  ఆయన్ను గౌరవంతో కూడిన ఆరాధనా భావంతో దూరం నుంచి  చూసి సంబరపడ్డ సందర్భాలు అనేకం. మాకప్పుడు 17-18 ఏళ్ల వయసు. ఎప్పుడైనా సురా సాహసించి ఆయనకు అడ్డం తగిలి నమస్కరించేవాడు, గుర్తుపట్టేవాడో లేదోగానీ, విలాసంగా ఒక చిరునవ్వుతో ఆయన తలాడించేవాడు. ఆ తరవాత మా సంభాషణలు కిళ్లీకొట్టు బంగారివైపో, రొట్టెలపెట్టెలో ఈగలు దాచినవాడివైపో, లేదా గేదెల రాజమ్మ దిశగానో మళ్లేవి. శ్రీశ్రీని కోట్ చెయ్యకుండా, కన్యాశుల్కంలోని సంభాషణని తలచుకోకుండా, శాస్త్రిగారి పాత్రలను ప్రస్తావించకుండా నాకూ, సురాకీ ఒక్క రోజైనా గడిచేదికాదంటే అది అతిశయోక్తి కాజాలదు.

నాకు తెలిసి శాస్త్రిగారు పెద్ద ఉపన్యాసకుడు కాదుగానీ ఆయన ఉన్నారంటే ఆ సభకు తప్పక హాజరయ్యే వాళ్లం. ఒక మీటింగులో శాస్త్రిగారు మాట్లాడిన వేదికపై అప్పుడే విద్యార్థి నాయకుడుగా గుర్తింపు పొందుతూన్న సురా కూడా ఉపన్యసించాడు. తన సహజ ధోరణిలో ఆవేశంగా, ఉద్రేకంగా – వాళ్లనీ, వీళ్లనీ కోట్ చేస్తూ మాట్లాడుతూ ఎటో వెళ్ళిపోయాడు; సభాధ్యక్షుడి జోక్యంతో హడావుడిగా ముగించాడు. అంతటితో ఊరుకోకుండా, “శాస్త్రిగారూ, ఎలా ఉందంటారు నా ఉపన్యాసం?” అని ఆయన్ను స్టేజి మీదే అడిగేశాడు. “తరవాత మాట్లాడదాం,” అన్నాడట ఆయన. మీటింగు పూర్తయ్యాక (అక్కడ నేనున్నాను) శాస్త్రిగారు సిగరెట్టు వెలిగించి – సురాతో, “నీకు గుర్రం ఎక్కడం ఒచ్చేసిందోయ్, సుబ్బారావ్! ఇంక దిగడం ఒక్కటే నేర్చుకోవాలి!” అనేశాడు. ఈ మాటలు తల్చుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నామో!

మా అందరికి ఈ న్యాయ విషయలపై సలహాదారుడు శాస్త్రిగారే. ఒకసారి ఏదో సందేహ నివృత్తికోసం ఆయన వద్దకు వెళితే, అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని ఆయన మందలిస్తున్నాడు. తాగి, డ్రైవ్‌చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఆ డ్రైవర్‌ని బైలుమీద విడుదల చేయించారని అర్థం అయింది. మధ్యవర్తిగా వచ్చిన మరో తలపండిన డ్రైవర్, పట్టుబడ్డ కుర్ర డ్రైవర్‌తో, “సాతుల్లు బాబు ఏటంటన్నాడంటే – పటాసుమీద బండి తోలొద్దనీసంటన్నాడు,” అని మూడే మూడుమాటల్లో విశదీకరించాడు. అంతవరకూ శాస్త్రిగారితో మాట్లాడేందుకు సందేహిస్తూ బెరుగ్గా ఉన్న ప.బ. డ్రైవర్ అంతా అర్థం అయినట్టు తలూపాడు. “తప్పైపోయింది సార్,” అన్నాడు. శాస్త్రి గారు మావైపు తిరిగి, “చూశారా? వాళ్ల భాషలో చెబితేనే వాళ్లకి తలకెక్కుతుంది,” అన్నాడు. అది మాకో మరపురాని గుణపాఠం.

విశాఖలో ఆర్.ఎస్.యూ. స్థాపనకు ముందస్తు సంప్రదింపులు శాస్త్రిగారింట్లో డాబామీద జరిగాయి. అప్పుడే తొలి అధ్యక్షుడు రమణిని చూసాను. ఆ తర్వాత సురా ఉపాధ్యక్షుడు కావడం, యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొని – ఎమెర్జెన్సీలో అతన్ని తప్పించడంలో నావంతు పాత్రను పోషించడం సంభవించింది.  ఆ తర్వాత అతను (ఎన్‌కౌంటర్ కాకుండా) అరెస్టు అయ్యే ఏర్పాట్లలో కూడా ఒక చెయ్యి వేశాను. అరెస్టయిన సురా – రావిశాస్త్రి, తుమ్మల వేణుగోపాలరావు, భూషణం, అత్తలూరి, చలసాని ప్రసాద్ లతో సహా విశాఖ సెంట్రల్ జైల్లో సుమారు సంవత్సరం పాటు ఉండడం – ఆ విశేషాలు సురా చెబుతూండేవాడు. వాటిని భూషణం తన జ్ఞాపకాలలో నమోదు చేశాడు.

‘ఆంధ్రజ్యోతి’ (వార పత్రిక) కోసం ‘రత్తాలు-రాంబాబు’ నవలను ఒక్కో విడతగా వ్రాస్తూ, ముందుగా తన జైలు సహచరులకు చదివి వినిపించే వారు రావిశాస్త్రి. ఒక్కోసారి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోవడం, మరికొన్నిసార్లు కంటతడి పెట్టడం ఆ సందర్భాలలో నిత్యకృత్యంగా ఉండేదని తెలిపాడు సురా. ఆ విధంగా జైలు గోడల మధ్య రూపుదిద్దుకున్న ఆ నవల వ్రాతప్రతిని ఎప్పటికప్పుడు కొందరు మిత్రుల సహకారంతో జైలు బయటకి పంపి, పురాణం శర్మగారికి చేరవేయడం, ‘ఆంధ్రజ్యోతి’లో అది సీరియల్‌గా   వెలువడి, విశేషమైన జనాదరణ పొందడం – తెలుగు సాహిత్య చరిత్రలో భాగాలయ్యాయని చెప్పుకోవచ్చు. అంతకాలం పాటు ఒకే చోట బంధింపబడటం వల్ల సహజంగానే వాళ్ల మధ్య చికాకులూ, వాదనలూ, స్పర్థలూ చోటు చేసుకున్నాయి. సురా వాటి గురించి ఎక్కువగా చెప్పేందుకు ఇష్టపడేవాడు కాదుగానీ, భూషణం తన జ్ఞాపకాలలో వివరంగానే వ్రాసాడు.

*

 

ఉణుదుర్తి సుధాకర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పరిచయం… సురా గారితో.. బావుంది

  • అప్పుడే అవగొట్టేశారే సుధాకర్ గారూ
    ఇంకొంచెం జ్ఞాపకాల్లో తడపాల్సింది మమ్మల్ని

  • “ఆయన్ను గౌరవంతో కూడిన ఆరాధనా భావంతో దూరం నుంచి చూసి సంబరపడ్డ సందర్భాలు అనేకం. మాకప్పుడు 17-18 ఏళ్ల వయసు.” సరిగ్గా మా అనుభవమే. అయితే ఎప్పుడూ పలకరించే సాహసం చేయలేదు
    తర్వాత ఎప్పుడైనా బాంక్ కి వచ్చినప్పుడు కూడా అంతే.

  • ఈ రోజు ఉదయం సాహిత్య అకాడమి మిత్రసాహితిసహకారంతో రావిశాస్త్రి శతజయంతి సభ పెట్తే హాజరయ్యాను. అక్కడ శాస్త్రిగారు ఎమర్జెన్సీ లో జైలుకెళ్ళిన విషయం విని తమ్ముడు సురా ఉన్నప్పుడు ఆయన కూడా వుండివుండాలనుకున్నాను. ఆ వివరాలన్నీ వివరంగా రాసిన సుధాకర్ కి ధన్యవాదాలు.
    రావిశాస్త్రి గారు యల్లమ్మ తోట ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడే అక్కడ పెట్టిన బుక్ సెంటర్ బ్రాంచి లోకి వెళ్ళేవారు. తన పుస్తకాలు డిస్ప్లేచేసిన రాక్ దగ్గర నుంచునేవారు కొంచెంసేపు. అక్కడ కొత్త గా చేరిన సేల్స్ బాస్ ‘ఈ సారు రోజు ఏమిటో ఇక్కడ నుంచుని ఆ పుస్తకాలను చూస్తూంటారు’ అంటుంటే విని ఎవరా అని చూస్తే తన పిల్లల ని చూసుకుని మురిసే తండ్రిలా శాస్త్రిగారు! అప్పుడతనికి ‘ఆ పుస్తకాల రచయిత ఆయనే బాబూ’ అని చెప్పటం గుర్తు. కాలేజీనుంచి వస్తూ పోతూ ఆ షాపులో కెళ్ళ డం అప్పట్లో అలవాటుగా వుండేది. సుధాకర్ వైజాగ్ వాస్తవ్యుడనిపించుకున్నాడు. యారాడ కొండతో పాటు ఆ కొండంత శాస్త్రిగారి తలపులు గుర్తుచేసి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు