యిప్పుడే మొదలయ్యే ప్రయాణం!

నిర్దిష్టమైన స్థల కాలాల్లో అయినా సరే, వొక కవి రాస్తున్న కవిత్వమంతా వొకే గాటన కట్టేయడం కుదురుతుందా?

1

మొదటి కవిత యేదో చెప్పడం కష్టమే ఇప్పుడు.

కానీ, ఇంటర్ చదివే రోజుల్లో కొన్ని వుదయాలో, ఆదివారం మధ్యాన్నాలో, సాయంత్రాలో గుర్తు. అవి కాగితానికీ, సిరాకీ మధ్య ప్రేమని వంతెన కట్టుకునే సమయాలు. కాయితమ్మీద మాత్రమే రాయగలిగిన రోజుల నించి కీబోర్డు మీద తప్ప భాషకి వునికి లేని రోజుల దాకా వచ్చామనుకోడంలో సాంకేతిక గర్వమేదో తొణికిసలాడుతున్నా- మనసుకీ, సిరాకీ, కాగితానికీ మధ్య దూరం కూడా తేటగా కనిపిస్తూనే వుంది. ఇది నా వ్యక్తిగత సాంకేతిక బలహీనతే అనుకున్నా, కంప్యూటర్ పూర్వ యుగ అస్తిత్వ వేదన కొందరికైనా గుర్తేనేమో!

షెల్లీ, కీట్స్, Wordsworth లేని టీనేజీ వుండదు. కానీ, సాహిత్య వూహలింకా తెలిసి రాని ఇంటర్ మొదటి సంవత్సరపు రోజుల్లో ఆ ముగ్గురితో పాటు మరో యిద్దరు నన్ను బాగా వెంటాడారు: వొకరు వర్జీనియా వుల్ఫ్, మరొకరు వాల్ట్ విట్మన్.

ఆ రోజుల్లోనే యెక్కడో చదివాను. నేను అమితంగా ఇష్టపడే రచయిత్రి వర్జీనియా వుల్ఫ్ తన suicide note కూడా మరీ మరీ ఎడిట్ చేసుకొని వదిలి వెళ్లిందట. ఆత్మహత్య అనేది taboo అయిన చోట అట్లా ఎడిట్ చేసుకోవడం తప్పదేమో. మరీ ముఖ్యంగా స్త్రీలకు! కానీ, ఆమె సామాజిక కోణం నుంచి కాదు. తీవ్రమైన వ్యక్తిగత వ్యక్తీకరణ సంఘర్షణ కోణం నుంచే అట్లా ఎడిట్ చేసుకుందని నా నమ్మకం. ప్రతి రచయితా తనదైన వాక్యం రాయడానికి యిట్లాంటి అనేక నిషిద్ధ రేఖల్ని దాటుకుంటూ రాక తప్పదనీ అనుకుంటాను.

అమెరికా వచ్చిన కొత్తలో నేను చూసిన మొట్టమొదటి సినిమా వర్జీనియా వుల్ఫ్ జీవితం ఆధారంగా తీసిన “The Hours.” (2002). అందులో ఈ suicide note కూడా కనిపిస్తుంది. కానీ, సాధికారికంగా అందుబాటులో వున్న నోట్ లో లేని వొక వాక్యం అందులో వుంది. ఆ వాక్యం నిజంగా ఆమె రాసిందేనా అన్నది ఇంకా చర్చ జరుగుతూనే వుంది. ఇదీ ఆ వాక్యం:

“Always the years between us. Always the years. Always the love. Always the hours.”

నాకూ నా కవిత్వానికీ వర్తించే వాక్యంలా వుంది అది. అయితే, కవిత్వ వస్తువుకి సంబంధించి నన్ను బాగా ప్రభావితం చేసిన స్వరం విట్మన్ దే! ఈ మధ్య మా యూనివర్సిటీలో విట్మన్ రెండు నూర్ల పుట్టిన రోజు వుత్సవాల్లో విట్మన్ గురించి మాట్లాడే అవకాశం నాకూ దక్కింది. ఆలోచనల్లోని అనేకత వైపు తీసుకువెళ్లడంలో విట్మన్ ప్రేరణ గురించి నా ప్రసంగం అమెరికన్ కవిమిత్రులకు కూడా బాగా నచ్చింది.

Do I contradict myself?

Very well I contradict myself;

(I am large, I contain multitudes.)

నెమ్మదిగా ఆలోచిస్తే, మనలో అందరిలో అట్లాంటి multitudes వుంటాయని అనుకుంటున్నాను, అనుభవ స్థల కాలాల దూరాల్ని సరిగా అర్థం చేసుకుంటే!

మొదటి కవిత రాసిన సందర్భం 1979 లకి అటూ ఇటూ అనుకుంటే, అప్పటి నా మనఃస్థితి, సామాజిక స్థితి కూడా ఇప్పటికీ నాకు బాగా గుర్తే. అప్పటి ఖమ్మం– విప్లవ పోరాటాల గుమ్మం. శ్రీశ్రీ నుంచి శివారెడ్డి దాకా మహోపన్యాసాల వుప్పెన మా చుట్టూరా- ప్రగతి శీల విద్యార్థి సంఘాలు కేవలం రాజకీయాల మీదే కాకుండా సాహిత్య సాంస్కృతిక అంశాల మీద దృష్టి సారించిన కాలం. ఆ సమయంలో “ప్రస్థానం” అనే బులెటిన్ కోసం మేం కవిత్వమూ, వచనమూ రెండు చేతులా రాస్తూ వున్నప్పటి కాలం. అదే సమయంలో శ్రీశ్రీని, శివారెడ్డి గారినీ కలవడం మరచిపోలేని అనుభవం.

అప్పటికే నా ఇంగ్లీషు కవిత్వం పెద్ద పత్రికల్లో అచ్చుకావడం, ప్రితీష్ నంది, ప్రభాగోవింద్ లాంటి పెద్ద ఇంగ్లీషు ఎడిటర్లు మెచ్చుకోవడం వల్లా- ఇంగ్లీషు కవిత్వంలో ఇంకో కాలు వుండేది. కానీ, ఆ కాలు అక్కడ నిలదొక్కుకునే లోపే “ఇంగ్లీషులోనే రాయ్. నీకు ఆ idiom దొరికింది!” అని మోహన ప్రసాద్ గారు గొడవ పెడ్తున్నా, పెడచెవిని పెట్టేసి, రెండు కాళ్ళూ తెలుగులోకి లాక్కొచ్చుకున్నా. వొక కాలు కవిత్వంలోకీ, ఇంకో కాలు కథల్లోకీ అన్న మాట. ఆ రకంగా మొదట “అడివి” కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. ఆ కథ నచ్చడంతో పురాణం గారు తరచూ పోస్టు కార్డులు రాసేవారు. ఆ కథ చదివి, బి. నరసింగ రావు గారు ఛార్జీలు ఇచ్చి మరీ, హైదరాబాద్ పిలిపించి, అక్కడి సాహిత్య మిత్రులతో కలిసే అవకాశమిచ్చారు. ఆ రకంగా నేను మొట్టమొదటి సారి ఖమ్మం అనే ఎల్లలు దాటి, వేరే లోకం అంటూ వొకటి వుందని తెలుసుకున్నా.

నిజానికి అంతకుముందే కవిత్వం అచ్చేశారు అప్పుడు ఆంధ్ర ప్రభలో వున్న “నిజం” శ్రీరామ్మూర్తి గారు. అప్పట్లో అది “తెలుగు” కవిత్వంలాగా లేదని కొంత మంది సంతోషించడమూ, ఎక్కువ మంది దిగులు పడ్డమూ చేశారు. కానీ, వాక్యం భిన్నంగా వుందని మాత్రం అందరూ అనుకున్నారు. నేనేమిటో నాకే అర్థం కాని సంశయంలో కొన్నాళ్లు అజంతా, బుచ్చిబాబు, త్రిపుర ల వచనం మాయలో కొట్టుకుపోయాను. కథకీ , కవిత్వానికీ మధ్యలో narrative poem అనేది యెలా వుంటుందో రాసి చూడాలన్న ప్రయత్నం కూడా అప్పటికి కొంత చేశాను. అప్పుడు కేవలం డైరీలకు మాత్రమే పరిమితమైన ఆ వాక్యాల్ని తీసుకువెళ్లి, “రక్తస్పర్శ” అచ్చేసి తీసుకువచ్చాడు సీతారాం. ఈ మధ్యలో చాలా రచనలు నోట్స్ పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోయాయ్.

యే మాత్రం నమ్మకం లేనితనంతో సతమతమవుతూ అట్లా కవిత్వంలోకి ప్రయాణమయ్యాను.

కవిత్వ రచనకి వస్తే, నా మటుకు నేను అప్పుడూ అంతే, ఇప్పుడూ అంతే! వచనం మాటెలా వున్నా, కవిత్వం మాత్రం కాగితమ్మీదనే పురుడు పోసుకోవాలి. నా కవిత్వ వాక్యాల వెనక నొప్పికి అత్యాధునిక ఆస్పత్రుల పొడగిట్టదు. తొమ్మిది నెలలో, తొమ్మిది క్షణాలో ఆ నొప్పి అంతా కాగితానికీ, సిరాకే తెలుసు. అట్లాగే, కవిత్వ వాక్యానికి సంబంధించినంత వరకూ కొన్ని సందర్భాలు నేను శకలాలుగా కనిపించినా, ఆ శకలాలు కూడా నిజానికి- పుట్టలేక విఫలమైన అబార్షన్ శిశువు వదిలేసిన తడి ముక్కలు కావు. నిస్సహాయురాలైన తల్లి వాటి వంకే చూస్తూ చూస్తూ కన్నీళ్లతో, తన తడియారని వేలికొసలతో తీర్చిన విరిగిన విగ్రహాల శిథిలాలు. శిథిలాలకు వాటిదైన శిల్పం వుంటుంది కదా!

అందువల్ల, narrative గొప్ప బలమైన genre అన్న స్పృహ పెరుగుతూ వచ్చింది. అసలు narrative వొక్కటే discourse (సంవాదం)గా యెట్లా మారాలో కూడా అర్థంచేసుకునే ప్రక్రియలోనే “సాహిల్ వస్తాడు” (2019) కథల సంపుటి దాకా వచ్చానని అనిపిస్తుంది. కథా, కవిత్వం రెండూ కలిసిన వ్యక్తిత్వం నా తొలి అడుగుల్లోనే వుందని చెప్పుకోగలను. ఈ రెండూ చాలా బలమైన ఆత్మనిబ్బరంతో కూడిన ఎడిటింగ్ ని కోరుకుంటాయని యిప్పటికీ నమ్ముతున్నా – వర్జీనియా వుల్ఫ్ సంప్రదాయంలోనే! యింకో వైపు వాటికి నిలకడైన ఆలోచన కూడా అవసరమే – వాల్ట్ విట్మన్ ప్రయోగంలా-

“ఇంటివైపు” (2018) దాకా వచ్చేసరికి ఈ ప్రక్రియ చాలా మటుకు అర్థవంతంగా అనిపించింది.

2

1979-1985ల మధ్య తొలి కవిత్వం వెలువడినప్పుడు వెంటవెంటనే రివ్యూలు వచ్చాయి. “విడిగా వచ్చి వుంటే, ఈ యేడాది అవార్డులన్నీ నీకే వచ్చేవి” అని శివారెడ్డి, శీలా వీర్రాజు, దేవీప్రియ గార్లు గట్టిగానే కోప్పడ్డారు. అట్లాంటి ప్రతిస్పందనలు ఆ తరవాత 1991 లో “ఇవాళ” వచ్చేసరికి కనీసం వొక డజను అవార్డులుగా మారాయి, మా తరం అంతా గౌరవంతో ఎదురుచూసే ఫ్రీవర్సు ఫ్రంట్ తో సహా-

చెప్పాను కదా, అక్షరాన్ని నేనెప్పుడూ శంకిస్తాను, బైరాగి లాగే! యిప్పటికీ అంత తేలిగ్గా వాక్యం భరోసా యివ్వదు. తొలి నాటి కవిత్వానికి అసంఖ్యాకంగా వచ్చిన సమీక్షలు అప్పటికి కాస్త పర్లేదన్న ఫీల్ యిచ్చాయి. . “తెలుగు కవిత్వానికి అది కొండ గుర్తు” అని కెవియార్ లాంటి ప్రసిద్ధ విమర్శకులు వ్యాఖ్యానించారు. “మంచి కవిత్వం మాబాగా వస్తోంది” అని చేకూరి రామారావు గారు వొక నిండు పేజీ వ్యాసమే రాశారు. త్రిపురనేని మధుసూదన రావు గారు ఆ కవిత్వానికి భయపడి పాతిక పేజీల విమర్శ రాశారు. యింకో వైపు వరవర రావు గారు “ఈ మధ్య నా బెడ్ సైడ్ పొయెట్రీ బుక్ ఇదే” అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇలాంటి సమీక్షా వ్యాసాలు ప్రచురితమవుతున్న కొద్ది కాలంలోనే “అఫ్సర్ బ్రాండ్ కవిత్వం” అని ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక దాదాపు వొక పూర్తి పేజీ వ్యాసం ప్రచురించి, కొత్త చర్చకి దారి తీసింది. “అఫ్సరీకులు” అనే పదబంధాన్ని కృష్ణుడు ప్రచారంలోకి తెచ్చాడు. “అఫ్సరిజం” అనే మాటని కొంతమంది ఈ తరం కవులు వాడడం మొదలు పెట్టారు. వాటి విలువా ప్రాధాన్యం ఎంతవరకు అన్న చర్చని విమర్శకులకు వదిలేస్తే, ఇప్పటికీ ఆ తాజా పరిమళం వడలిపోలేదని ఈ తరం కవులూ, విమర్శకులు కూడా అంటూనే వున్నారు. అయితే, మార్పు అనేది తప్పించుకోలేని లక్షణం. పైగా, కొంత కాలం గడిచాక వాక్యాలు మారుతాయి. నిజానికి కాలమే వాక్యాల్ని మార్చేస్తుంది.

ఆ మార్పు యెలాంటిది? అన్న ప్రశ్న ప్రతి అడుగులోనూ నన్ను నేనే నిలదీసుకుంటూ వుంటాను. ఇన్ని దశాబ్దాల తరవాత యింకాస్త గట్టిగా నిలదీస్తాను నా self ని- “రక్తస్పర్శ” “ఇవాళ”లకు భిన్నంగా మారుతూ వచ్చిన self ని–అది మా తొలి ఆనవాలు అయినా సరే.

నిన్ననో మొన్ననో మిత్రుడు సీతారాం మాట్లాడుతూ “చింతకాని మొదలుకొని విజయవాడ, హైదరాబాద్, అనంతపురం మీదుగా అమెరికా దాకా సాగిన ప్రయాణంలో స్థలాలు, దేశాలు వాటికవే మలుపులు” అన్నాడు. నిజానికి నా కవిత్వ సంపుటాలకు ఆ స్థల చరిత్ర కూడా వుంది. 1979 నుంచి 1985 దాకా కవిత్వమంతా చింతకాని, ఖమ్మం. 1985 నుంచి 1991 దాకా నన్ను వొక కుదుపు కుదిపిన బెజవాడ రోజులు, 2000 లో వెలువడిన “వలస” శీర్షికే అనంతపురం బతుకులోంచి పుట్టింది. అమెరికా వచ్చాక 2009 “ఊరి చివర” సముద్రాల చివరకొచ్చిన ప్రవాసం. వీటన్నిటికీ భిన్నంగా “జంగమం నా ఇలాకా” అని ప్రకటించుకోగలిగిన “ఇంటి వైపు” 2018 – ఇల్లు యేమిటి అని ప్రశ్నలోకి వెళ్లిపోతూ.

ఇన్ని దూరాల్ని యెట్లా కొలవాలీ అన్నది ప్రస్తుతం నా పెద్ద ప్రశ్న. వీటి మధ్య సామీప్యాలు అంటూ వుంటే, ఆ సామీప్యత యెలాంటిది యేమిటీ అని దాన్ని అనుసరించే యింకో ప్రశ్న.

3

యెన్ని విధాలుగా చూసినా, ఇది “రక్తస్పర్శ” కాలం కాదు. “ఇవాళ” (1992) కాలం కూడా కాదు!

యెటో “వలస” వెళ్లిపోతూ – వొక విధంగా యెవరికి వాళ్ళం “ఊరి చివర”లు కూడా దాటుకునే వస్తున్నాం, చేతుల్లో చిన్న పిచ్చుక లాంటి మొబైల్ అనే బ్రహ్మాస్త్రం ధరించి-

“ఈ”కాలంలో ఇతరేతర అనేక మార్పులతో పాటు రాత సాధనాలు కూడా విప్లవాత్మకమైన మార్పు సాధించాయి. ప్రపంచీకరణ తరవాతి ఈ ప్రపంచం కొత్త idiom లోకి translate అవుతోంది. సాహిత్యం కూడా ఆ idiomలోకి బదిలీ కాక తప్పదు. Market economy అనంతర లోక సంచారం ఇదివరకటిలా అమాయకంగానూ వుండదు. అనేక కాలాలూ, వాదాలూ, సంవాదాలూ వొక్కసారిగా పెనవేసుకుని వ్యక్తిత్వాన్నీ, సమూహాన్నీ కుదిపేస్తున్న సందర్భంలో కవిత్వం song of innocence గా మిగలదు గాక మిగలదు. అది song of experience గా మారాల్సిందే.

అయితే, అది యెలాంటి experience అన్నదే ఇప్పుడు ప్రశ్న. భిన్న కాలాల్లోంచి బతికి బయటపడిన వ్యక్తిత్వాలకు వొక అగ్ని పరీక్ష యెప్పుడూ వుంటుంది. ఆ కవులు తమ గతాన్ని వర్తమానంతో యెట్లా బేరీజు వేస్తారు అని! వర్తమాన అనుభవం చెప్పేటప్పుడు గత అనుభవం తప్పనిసరి కొలమానంగా వుంటుంది. ఆ కొలమానాన్ని యెట్లా privilege చేస్తాం అన్న దాన్ని బట్టి వ్యక్తి సమకాలీనత వుంటుందని నేను అనుకుంటున్నా. ఉదాహరణకు: స్త్రీలూ, దళితులూ, ముస్లింలకి సంబంధించిన సంవాదం జాతీయోద్యమ దశ నించే వున్నప్పుడు 1980 లోనూ, 90 లోనూ, 2000 తరవాతా అవి యెట్లాంటి రూపాల్లోకి మళ్ళాయో గుర్తించలేకపోతే అస్తిత్వ చైతన్య సమస్య యెటూ తేలదు. పూర్వం నుంచీ వున్న కొలమానాలే దిక్కవుతాయి. అట్లా కాకుండా కొత్త దిక్కులోకి మళ్ళీ, కొత్త శిరస్సుతో వాటిని అనుభవంలోకి తెచ్చుకోవడం సరైన సమకాలీనత అవుతుంది.

ఆ కోణం నుంచి చూస్తే, అప్పటి అనుభవాలు “ఇంటి వైపు” దాకా వచ్చేసరికి వొకేలా లేవు అని చదువరికి ఇట్టే తెలిసిపోతుంది. ఆ తెలివిడినీ, మెలకువనీ కలిగించడం నాకు ముఖ్యమైన కవిత్వ అనుభవం. మరో సవాల్ యేమిటంటే, ఈ మార్పుని నాలో నేను ఎంతగా చూసుకుంటున్నానో, చదువరులు కూడా అంతే సమానంగా సహానుభూతితో చూడగలుగుతున్నారా అన్నది!

పాఠక ప్రతిక్రియ (రీడర్ రెస్పాన్స్) గురించి మా మిత్రబృందం మొదటి నుంచీ చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ, ఆ పాఠక వాదం పదును “ఊరి చివర” “ఇంటి వైపు” సంపుటాలు వెలువడినప్పుడు చాలా స్పష్టంగా చూశాను. ఆ రెండు పుస్తకాల మీదా మామూలుగా విమర్శకులు మాత్రమే కాకుండా, సాధారణ చదువరుల నించి నాకు దక్కిన ప్రతిస్పందనలు యెప్పటికీ గుర్తుండడమే కాదు, నా కవిత్వ వ్యక్తిత్వాన్ని బలంగా కుదిపాయని కూడా చెప్పగలను. అచ్చు పత్రికల నియమ నిబంధనలు దాటుకుంటూ వచ్చిన తరం యింకాస్త స్వేచ్ఛగా మాట్లాడడం నేర్చుకుంది. ఆ కొత్త వెలుగులో నిన్నటి కవిత్వం కూడా యింకో కోణాన్ని వెతుక్కుంది. ఆ నిన్నటి కవిత్వం మరో afterlife ని అందుకోవడం నాలోని కవికి తృప్తి.

4

నలభయ్యేళ్ల అక్షర సాహచర్యంలో కవిత్వమైన క్షణాలు వందల్లో వుంటాయి. 1979 నుంచీ అచ్చయిన పుస్తకాలు కవిత్వం కేవలం ఎంపిక చేసిన కవితలే. వివిధ పత్రికల్లో, కవి సమ్మేళనాల్లో, ప్రత్యేక సంచికల్లో ప్రచురితమైన చాలా కవితలు యెప్పటికప్పుడు మిగిలిపోతూనే వున్నాయి. ఆ రకంగా వదిలేసిన కవితలు లెక్కలేనన్ని. దాచుకునే అలవాటు లేక పోగొట్టుకున్నవీ పెద్ద సంఖ్యలోనే వుంటాయి.

రాశి సరే గాని–ఇప్పుడు కొత్తగా వెలువడుతున్న ఈ collected poems సంపుటిలో తొలి కవిత నుంచీ చివరి కవిత దాకా ప్రూఫ్ చూస్తున్నప్పుడు నాకూ కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. 1992 దాకా కవిత్వంలో అనేకానేక ఇతర ఇతివృత్తాల కవితలతో పాటు సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా, ఫైజ్ అహ్మద్ ఫైజ్, శ్రీశ్రీ లాంటి కవులకి, సఫ్దర్ హష్మి వంటి ప్రజా కళాకారులకు రాసిన ఎలిజీలున్నాయి. ఈ నలుగురు నా తొలినాళ్ళ కవిత్వ లోకంలో చెరగని అనుభవ ముద్రలు. వాళ్ళ నించి నేను నేర్చుకున్న/ నేర్చుకోని పాఠాలు రెండూ వున్నాయి. నిస్సందేహంగా వాళ్ళ సామాజిక దృష్టే నన్ను అప్పుడు గట్టిగా ఆకట్టుకుంది. అప్పటి కవిత్వంలోని density వల్ల అందులోని వైయక్తిక కోణం యెక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందని 1985-1990 దాకా జరిగిన తర్జనభర్జనలని బట్టి నాకు అర్థమైంది. అయితే, “అఫ్సర్ బ్రాండ్ కవిత్వం” అని వి. రాజీవ్ మొదటి సారి చేసిన సిద్ధాంతీకరణ దీనికి మినహాయింపు. ఆ “వైయక్తికత” లోని సామాజికతని అతనూ, ఆ తరహా విమర్శకులూ గుర్తుపట్టారు.

కానీ, ఇన్నేళ్ల కవిత్వ సాహచర్యం తరవాత నేను అడగగలిగిన ప్రశ్న వొకటి వుంది. నిర్దిష్టమైన స్థల కాలాల్లో అయినా సరే, వొక కవి రాస్తున్న కవిత్వమంతా వొకే గాటన కట్టేయడం కుదురుతుందా? ఇవాళ ఈ అయిదు సంపుటాల కలయిక చూస్తున్నప్పుడు కూడా మీలో ఆ ప్రశ్న మొలకెత్తవచ్చు.

కవిత్వాన్ని కేవలం వుద్వేగానికి సంబంధించిన హృదయ వ్యాపారం అనుకోవడం నాకు మొదటినించీ లేదు. అట్లా అనుకుంటే, “రక్తస్పర్శ” విప్లవ కవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనాకి ఎలిజీతో మొదలయ్యేదే కాదు. ఈ మొత్తం మార్పులో అవతార్ సింగ్ పాష్ దాకా వచ్చిన నా అనువాదాల్లోనూ రాజకీయ కోణం యెట్లా వుంటుందో మిత్రుడు వేణుగోపాల్ ‘ఊరిచివర” ముందుమాటలో నిక్కచ్చిగా చెప్పుకొచ్చాడు. అది నా వ్యక్తిత్వంలోని బాహాటమైన దృక్కోణం. అప్పటి నుంచీ అదొక కొనసాగింపుగా నిర్విరామ ప్రతిఘటన స్వరంగా “ఇంటి వైపు” తరవాత కూడా ప్రవహిస్తూనే వుంది, నిలకడగా-

5

ముందే చెప్పినట్టు మొదటి కవిత యేదో చెప్పడం కష్టమే!

రాసిన కవితో, అచ్చయిన కవితో కళ్ల ముందు కదలాడుతుంది కానీ, వాటి వెనక చెరిపేసిన అనేక కవితలు తెరవెనక్కి జారుకుంటాయి. వొక రాత్రికి రాత్రి మెరుపై మెరవదు కవిత్వం. అనేక రాత్రుళ్ల, అనేక పగళ్ళ నిర్విరామ నిద్రారాహిత్య మెలకువ ఇది. ఆ మెలకువలోని కల ఇది.

అంతేకాదు,

యెప్పటికప్పుడు యిప్పుడే మొదలయ్యే ప్రయాణం కూడా!

నవంబర్ 19-23, 2019

 *

https://www.amazon.in/gp/product/B083BF46J2/?fbclid=IwAR05ruBBUxuLeYOI5J9Q8749nRJxlHERgFJeiB8-_L0YV4o5DYHmjZ3r99c

 

 

 

 

 

 

 

అఫ్సర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎప్పటి కప్పుడు,మొదలయే,మీ ప్రయాణం గురించి, రాసిన.. మీ write-up చాలాబాగుంది.. Afsar ji. మీ గురించి1986నుంచి.. మీకవిత్వం గురించి తెగ, ఆసక్తి చూపే వాళ్లం. అప్పట్లో,.. ఇప్పుడు కూడా అనుకోండి.మీరు, మా ever green రైటర్&లవర్ కూడా😊.మీనుంచి మరిన్ని రచనలు ఆశిస్తున్నాము… long leave Afsar ji..!💐💐.నమస్సులు.!

  • అనేక రాత్రుళ్ల, అనేక పగళ్ళ నిర్విరామ నిద్రారాహిత్య మెలకువ ఇది. ఆ మెలకువలోని కల ఇది.

    అంతేకాదు,

    యెప్పటికప్పుడు యిప్పుడే మొదలయ్యే ప్రయాణం కూడా!

    Truthful rendition Sir.. This is like talking in dream! Excellent!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు