మొగలాయి అంగట్రాజమ్మ

“సచ్చినాన్రా నాయినో… ఈ లం… ముం… నన్ను సంపేసిందిరో…”  రెండు కాళ్ళ సందుల్లో ఆయువుపట్టుకాడ అరిచెయ్యిలు అడ్డాంబెట్టుకోని యాన్నుంచో ఎగిరొచ్చి మా మజ్జిలో దబ్ మంటా పడి గిలగిలా కొట్టుకున్నాడు యంగటయ్య.
“ఓలమ్మల్లో…” అర్సుకుంటా పిలకాయిలందరం పొలోమంటా తలా ఒగ దిక్కుకు లగెత్తేసినాం.
“ఏందిరా యెర్రెదవల్లారా, యామైందిరా…” బిత్తరకపొయ్యి లేసి అమాన ఆపక్కకు ఒక్క దూకు దూకినాడు, దాసాని చెట్టు మొదులుకి ఆనుకోని కళ్ళు మూసుకోని బజినపాటలు పాడ్తా కానగబెత్తమాడిస్తా వుండే మా గెద్దముక్కయ్యోరు. పాం దూరేసింది గావాలనుకున్నాడో యామో.
“లవిడీ కొ,,, ఇటుమంటి గుడిసేటి పంలు నువ్వుంచుకోనుండే ముండల్తో జేస్కో, ఈ రాజెమ్మ జోలికొచ్చినావంటే వ… పిసికి ఊపిరి దీస్తా, యామనుకుంటావుండావో యామో.” గుడిసిలోనించి ఎనకాలే పరిగెత్తుకోనొచ్చిన అంగట్రాజెమ్మ, ఎంగటయ్య ముడ్డిమింద ఎగిసెగిసి నిగడ దన్నింది. దాంతో గమ్మునుళ్ళా… పక్కనే దిబ్బ దెగ్గిరుండే పొరక్కట్టను ఎత్తుకోనొచ్చి ఈడ్చీడ్చి మొగమ్మింద బాదేసింది.
“కూలీనాలీ జేసుకొని సంపారిచ్చుకోనొచ్చి పెల్లాన్ని సాక్కునేదానికి బగిసి లేదుగానీ, నీ బతుక్కి ఊలోల్ల పెల్లాలు గావాల్సొచ్చిందిరా పేడినా కొ…” ఓపలేని కోపంతో కడాన ఒగ తన్ను ఎగిసి తన్నేసి, పొరక్కట్ట వోడి మొగమ్మిందనే ఇసిరికొట్టి ఏం జరగనట్టే పందిల్లోకి దూరి కనబడకుండా పొయ్యింది రాజెమ్మ.
ఆడాడా నిలబడి, కుచ్చోని సారాయి దాగతా వుండే మొగోళ్ళు ఆయక్క దాటికి బైపడి పొయ్యినారో యామో… దూరదూరంగా కంప దెగ్గిరికి జారుకోనేసినారు.
“యాం జరిగింది జయమ్మా, సిగమొచ్చేసుండాది రాజెమ్మికి. సెట్టంత మొగోన్ని బట్టుకోని కాల్తో, పొరకతో వాంచేసిందీ…”
     “ఇబ్బుడు నేన్నీకు పెసల్గా జెప్పాలా. నాలుగైద్దినాల కోపారి మనవంతా  జూస్తావుండే బోగాతవే గదా. యెనకింటోల్ల యంగటయ్య గాకపోతే దుదుగుంటోల్ల సీనయ్య… సీనయ్య గాకపోతే రాయులూరు బక్కయ్య.”
“థూత్తెరికీ… ఈ మానంబొయ్యిన బతుకు బతికేదానికంటే నీల్లేని బాయిలో దూకి సావగూడదా, ఊరికి పట్టిన పీడా వొదిలిపోతాది…” క్యాకరించి నేలమీద ఊంచినారు, చుట్టూ మూగిపొయ్యి అప్పుడిదాకా తమాషా జూసిన జనాలు. వోళ్ళూంచింది ఎవురిమిందో తెలీనేలేదు నాకు.
ఉందామా ఊడదామా అంటా ఊగలాడే మా రామ్మందిరం బడి, ఈ మజ్జొచ్చిన గాలీవోనకు నిలవనా గూలిపొయ్యినాక ఈ అంగట్రాజమ్మే ఆదుకొనింది. మా గెద్దముక్కయ్యోర్ని పిల్సి మరీ ఆమి గుడిసి ముందుండే రెక్క దాసాని చెట్లకింద నాలుగైద్దినాలు బడి బెట్టుకునేదానికి చోటిచ్చింది. చుట్టూరా అడివి మండల కంప గట్టుకోని  గొడ్లు దూరకుండా గెట్టి జేసుకొనుండాది రాజెమ్మ. ఆ అరెకరా చోటులో ఆమేసుకొని కాపరం జేస్తావుండేది ఒగ మూలన చిన్న గుడిసి, దానిముందర ఒగ నాలుగు బార్ల పందిల్లోనే. సారాయంగిడి, ఇడ్లీ ఆంగిడి గూడా ఓటిల్లోనే బెట్టుండాది.
“యేమైంది యేమైందం”టా ఊలోల్లందురూ ఎగబడొచ్చే కాడికి ఎప్పుడెప్పుడా అని కాసుకోనుండే మా అయ్యోరు కట్టుకోనుండే పంచీ జూబ్బా ఇదిలించుకున్నాడు.
“రేయ్ అబ్బోల్లారా, ఇంగ మీకు పాటాలు జెప్పేది అయినట్టే గానీ మీరిల్లకు బోండి” బడిడిసి పెట్టేసి డొక్కు సైకిలెక్కేసినాడు రాగ్గుంటకి.
“అమా నాకు జొరమొచ్చేసుండాది. నువ్వేజూడు, ఒల్లు కాలిపోతా ఉండ్లా.” మెడకింద అరిచెయ్యి తిరగేసి పెట్టుకోని ఎనకాల బడినా.
“అగ్గో కిర్సనాయిలు బుడ్డీ పెట్టుండ్లా, ఆ గూట్లో పావలా ఉండాది, ఎత్తుకోంబొయ్యి అంగట్రాజమ్మింటికాడ రొండిడ్లీ తెచ్చుకోబో.” ఈడు ఇడ్లీకి ఎత్తేసినాడని అమ్మకి తెల్సిపొయ్యింది. అయితే నాకేంది… ఎప్పుడూ నాసినం సద్దికూడేనా…
గూడంతా ఎదికితే రొండు పది పైసలు బిల్లలు, ఒక అయిదు పైసలు దొరికేసినాయి. పిర్రలకాడ సినిగిపొయ్యిన చెడ్డీ జోబులో వోటిల్ని ఏసుకోని, సత్తు గిన్నెత్తుకోని లగెత్తూ…
“యాన్నించి దేవాలే ముండా. ఈ ముండమోపోడు సచ్చినాడనీ. ఈడు గట్టిన తాళి నా పాలిటి ఉరితాడై పోయ్యింది గాదటే. ఆ తాడు మెళ్ళో పడ్తానే ఇంత పురుగు మొందు దీసుకొని చచ్చున్నా సుకపడి బోదును గదే. మిమ్మల్ని నా ఎదానేసి ముంగి మాదిరిగా మూల గుచ్చున్నాడు జూడూ.. నేనేం జెయ్యాల్రా బగమంతుడా, ఏ నుయ్యోగొయ్యో జూసుకుందామన్నా సేత గావడంలేదురా నాయినా…” యడం చేత్తో ముక్కు చీమిడి తీసి ఇదిలిస్తానే, కుడిచేత్తో పొయ్యిమీదుండే గిన్ని కిందకు దించింది. ఆయిర్లొస్తా వుండే గుడ్డమీద బెట్టిన ఇడ్లీ దీసి పక్కనే ఉండే దబర్లో ఏస్తా, పాడతా ఉండాది రాజెమ్మ.
“నేనేం జేసేది మా. నీ మొగుడుకు తొడుబోయ్యే వోడిని ఎదిక్కోనొచ్చి నా గొంతు గోసింది మీరే గదా. ఇప్పుడోడు మీ అమ్మోల్లను అడిగి దుడ్లు తీసుకోనొస్తావా పిల్లోని గొంతు బిసికి సంపమంటావా అని గూకున్నాడు. పాపిస్టోడు… ఏంజేసినా జేస్తాడని బయపడిపొయ్యి కొంగు నెత్తినేసుకొని ఆలో లచ్మనా అంటా ఎలబారొచ్చేసినా. ఆడదానికి కస్టమొచ్చినాకా ఆదుకోని పుట్టిల్లొక ఇల్లా, ఆ తల్లొక తల్లా… ” ఒల్లో పాల్దాగుతున్న పసిబిడ్డతో పందిలి గుంజకానుకోని పోటీగా ఏడస్తా ఉండాది ఆయక్క పెద్దకూతురు లచ్చక్క. గెడ్డాంకాడ దేంతోనో యీడ్చి గొట్టినట్టు యేందో దెబ్బ కనిపిస్తా ఉండాది. ఎడం కన్ను కొసాన కణత కాడ, కమ్మితో వాత బెట్టినట్టు ఎర్రగా కమిలుండాది. ఈయక్కెప్పుడొచ్చిందో తెలీలేదు.
వోల్ల యవ్వారమేందో నాకర్తంగాలేదు. అయినా ఎవురెట్టా బోతే నాకేంది… కడుపులో ఎలికలు పరిగెత్తతా వుంటే.
“రాజక్కా గబాన రొండిడ్లీ బెట్టు నేంబోవాల…” ఓమని ఆర్సినా గెట్టిగా. వోల్ల ఏడుపుదుక్కాల మజ్జ ఇనిపించాల గదా.
“మ్మో రాజెమ్మో… రొండు లోటాలు సారాయి బోస్తూ రామ్మోవ్…” నా మాటినిపించుకోకుండానే పిల్సినాయన దెగ్గిరికెల్లింది.
గవుర్మెట్టు సారాయంట అది. గవుర్మెట్టోల్లే పెద్దపెద్ద నల్ల డబ్బాల్లో ఎత్తుకోనొచ్చి ఇస్తారంట. ఆ యాపారం గూడా జేస్తాది అంగట్రాజెమ్మ. నాకేం దెలుసు… నా సావాసగాడు గుడ్డెంగటేసులు జెప్పిందే.
అంగట్రాజెమ్మ మొగుడు అంగట్రామయ్య ఆన్నే కుచ్చోనుందాడు, ఇంగో గుంజకానుకోని. పొవ్వాకు తాటదీసి, సీలికలు పేలికలు జేసి నోట్లో దోపుకోని కసాబిసా నమల్తావుండాడు.
“న్నోవ్, నువ్వన్నా ఇట్టా యీడికొచ్చి ఇడ్లీ బెట్టేమి…” అంగట్రామయ్య చెవ్వులో బన్నట్టు ల్యా. కుచ్చున్న కాన్నించి కదల్లేదు.
“కొంచిం తాలబయా… నేనొస్తా ఉండా. ఓడికి జెప్పినా గుండ్రాయికి జెప్పినా ఒగటే… మూగినాబట్ట.” ఒకరెనకాలొకరు వొస్తావుండే మొగోల్లకు రంగురంగుల పిలాస్టిక్ లోటాల్లో సారాయి పోస్తానే మజ్జిలో తమాలించుకోనొచ్చి ఇడ్లీ బెట్టింది రాజెమ్మ. మిరపరాయిమింద నూరిన నీల్ల కారం ఓటిమింద కుమ్మరించింది.
ఆ తాగుబోటోల్లు అదోమాదిరిగా జూస్తా, జేస్తా వుండే ఎకసెక్కాలు ఆయక్క లెక్కే బెట్టుకోలా.
“అట్టా అంగట్రాజమ్మింటి కాడికి పొయ్యేసొస్తా… ఆమి పెద్ద కూతురు ఇజీలచ్చిమిని, మొగుడు తరిమేసినాడంట. అమ్మోళ్ళింటికొచ్చేసింది బిడ్డతో. యాం కస్టమొచ్చిందో కనుక్కోనొస్తా…” ఆ సాయింత్రం బడినించీ వొచ్చి ఒల్లికి బోసుకున్నాక పంచి గట్టుకోని, పైగుడ్డ బుజమ్మిందేసుకోని అమ్మకు జెప్పి ఇంట్లోనించీ బైట పన్నాడు మా నాయిన.
నాలుగైద్దినాలు గడ్సిపొయ్యినాయి. వొగ దినం…
“ప్పదొకట్ల ప్పదీ… ప్పది రొండ్లిరవై…” తలాకిట్లో గుఛ్చోని, ఎక్కాల పుస్తకం అడ్డాం బెట్టుకోని, నాకు నోటికొచ్చేసిన పదో ఎక్కం జెప్తా, ఈదిలోకి జూస్తా ఉండా. మా నాయిన కోవనూరులో బడి జూసుకోని ఇంటికొచ్చే టయిమది. సైకేలేసుకొని ఆయినొచ్చే టయానికి నా సేతల్లో పుస్తకం ల్యాకపోతే చెవడాలూడి పోతాయి.
“ఓ నాగయ్యా, రమణయ్యా, ప్రెతాపూ… రాండ్రా నాయినా, అంగట్రాజెమ్మ కూతురు ఇజీలచ్చిమి బాయిలో దూకేసిందంటా… దాన్ని పైకెత్తండ్రా దేవుడా…” ఊల్లో ఉండే మొగోల్లకంతా ఇనబడే మాదిరి యాణ్ణించో జయమ్మ బెడ్తా ఉండే కేకలు ఇనబన్నాయి ఉన్నట్టుండి.
నాయినొచ్చినాక జూసుకోవొచ్చు ఊడే చెవాడాల కత. జారిపోతావుండే కొంగును బిగదీసి బొడ్లో దోపుకుంటా బయల్దేరిన అమ్మను తోసుకుంటా లగెత్తినా.
“నేనేం పాపం జేశానే తల్లా.. మీరిట్టా రాచి రంపాన పెడ్తా వుండారు. నీకేం పొయ్యే కాలమొచ్చిందే పాపిస్టి ముండా, పసిగుడ్డునన్నా చూసుకోకండా ఈమాదిరి పంజేసినావు. నువ్వు సచ్చి సుకపడిపొయ్యి దీన్ని గూడా నా ఎదానేసి పైన్నుంచి యేడుక సూద్దామనా…” సంకలో సిన్నబిడ్డ నేసుకోని లచ్చక్క చెంపలు యడాపెడా వాంచేస్తా ఉండాది అంగట్రాజెమ్మ.
ఎవురు బాయిలో దూకి బైటేసినారో గానీ… కాల్లూచేతులూ గీరుకోనిబొయ్యి ఒళ్ళంతా నీల్లోడతా ఉండాది ఇజీలచ్చక్క. చెంప దెబ్బలు దింటానే గెట్టుమింద గుఛ్చోని ఓమంటా ఒగటే యాడస్తా ఉండాది.
యెప్పుడు బడినించి వొచ్చేసినాడో మా నాయిన. రాజెమ్మను ఇవతలికీడ్చేసినాడు. లచ్చక్క రెక్క బట్టుకోని బలంతంగా పైకి లేపి, ఈదికా పక్కుండే రాజెమ్మ గుడిసి ముందర పందిల్లోకి లాక్కోని బొయ్యి నులక మంచమ్మింద కూలేసినాడు. నాయిన జెప్తావుండే బుద్ది మాటలు ఆయక్కకెక్కినాయో లేదో.
“నువ్వేమీ యీబల్లేదత్తా… నా పెల్లాంబిడ్డల్ని అంపిస్తే సాలు, కూడా దీస్కపోతా.” ఎప్పుడొచ్చినాడో పందిలి కీపక్కనే నిలబడుకోని అడుక్కుంటా ఉండాడు లచ్చక్క మొగుడు కిష్టయ్య.
“మెడ్తో గొడ్తా మాదర్చోత్. గు… నోరు రొండూ కతక్కన మూసుకోని బైటికి పో ముందు. నా పెళ్లాన్ని పంపియ్యమంటా మల్లీ నువ్వు నా గడప దొక్కినావంటే జూడు యేంజేస్తానో. ఆడదాన్ని సాక్కోలేన్నా కొ… క్కి పెల్లీ పెల్లాం పిలకాయిలు… థూ నీ బతుకు చెడా…” ఆ బావను కడిగేస్తా ఉండాది రాజెమ్మ… పెద్ద దబర నీల్లల్లో ఇడ్లీకోసరం ఏసిన పచ్చి బియ్యింతో కలేసి.
“తీగికి కాయి బారమా.. కన్న పేగుకు బిడ్డ బారమా. నా బిడ్డను ఏమాదిరిగా బతుకు సూపించి గెట్టనెయ్యాలో నాకు తెలుసు. నువ్ మల్లీ ఈపక్క కనిపించినావంటే నల్లేరు జేసి నలగ్గొట్టి, ఊలోల్లందరి సేత ఉ… లు పొయ్యిస్తా.” బియ్యిం గడిగిన నీల్లను కుడిత్తొట్లో పడే మాదిరి ఇసిరేసింది.
“కాదు నాయినా, పెళ్లాన్ని సాక్కోలేనోడివి నువ్వేం మొగుడివి. ఆ పిల్లను గొడ్డుని బాదినట్టు బాదుండావే… నువ్వు పిల్సినావని ముర్సిపొయ్యి ఇప్పుడు నీ యెనకాల పంపిస్తే దాన్ని గొంతు పిసికి బాయిలో యెయ్యవని గ్యారంటీ యావన్నా ఉండాదా…” ఆ దినం ఆదారం, బడిలేదు. తెల్లారే కాడికి ఈడికొచ్చి పంచాయితీ బెట్టుండాడు మా నాయిన.
“అట్టా గెడ్డి బెట్టు నాదన్నా. అయినా వోడికి నోటితో మాటలేంది, కాలి చెప్పుతో బుద్ది జెప్పాల.” రాజెమ్మలో మావూరి గంగమ్మ తల్లి కనిపించింది.
పందిలికి బైట దాసాని చెట్టుకింద యేసుండే గోతాం సంచి మింద రంగురంగుల మిటాయిల గాజు సీసాలుండాయి. కిందకొంగిన దాసాని కొమ్మలకు పిలాస్టిక్ కాగితాల్లో పొట్టపేగులు, ఇష్ణు చెక్రాలు, సిగిరెట్టు మిటాయిలు, చెక్కిరి అప్పచ్చులు… నోట్లో నీల్లు గారిపొయ్యే మాదిరిగా తగిలించుండాయి. బీడీలు, సుట్టలు, సిగిరేట్లు… వరసాగ్గా అట్టపెట్టిల్లో పెట్టుండాయి. ఈ కొత్తంగిడి రాజెమ్మెప్పుడు బెట్టిందో తెల్లా.
ఆ ఆంగిడి ముందరేసుండే పీట మింద గుచ్చోనుండాది అచ్చక్క. ఉలుకూపలుకూ లేకండా ఆంగిడికొచ్చే వోల్లకు మిటాయిలు, సిగిరేట్లు, బీడీలు గమ్మున అమ్ముకుంటా ఉండాది.
నేనొచ్చింది కాపీ బిల్లల కోసరం. ఇంట్లో కాప్పొడి బొత్తిగా అయిపోతే అంపింది మాయమ్మ. అది మర్సిపొయ్యినా. పిడికిట్లో గెట్టిగా మూసి తెచ్చిన పావలా బిల్లను లచ్చక్క సేతికిచ్చి నాలుగు సిగిరెట్టు మిటాయిలు, ఒగ బెల్లం కమ్మరకట్టు కొనుక్కున్నా. సిగిరెట్టు మిటాయొగటి నోట్లో బెట్టుకోని మా నాయిన మాదిరితో పొగ బీల్చినట్టు యాక్సను జేస్తా ఇంటికి తిరుక్కొనొచ్చేసినా.
“ఓలమ్మల్లో, ఓలక్కల్లో…” నేను చేసిన గనకార్యానికి మాయమ్మ సింతమెల్లితో ఈపుమింద వాయించింది జూడూ నా సామిరంగా. నా కేకలకు మా యాపసెట్టుమింద గూట్లోని పిట్టపిల్లలు బెదిరిపొయ్యి కిందబడి, ఎగరడానికి సేతగాకండా తనకలాడి పొయ్యినాయి.
“యామైంది రాజెక్కా ఈయమ్మికీ…” దీర్గం దీస్తా అడిగినా.
“యామని జెప్పాల… నా కర్మ నాయినా…” యాందో పొసురు మొందు సిన్న కూతురు బూసన కాళ్ళకు బట్టిస్తా ముక్కల్లో నించీ ఇంత పొడుగు ఊపిరొదిలింది.
“ఈసలాపురానికి తీస్కబోరాదా. బాగవతంది గావాల.” సాయింత్రం రాజెమ్మ గాల్చే పొంగలాల కోసరమొచ్చిన కాంతమ్మ ఒగ మాటనింది.
“ఇదేందో సచ్చు రోగమంటకా… ఈసలాపురం, గీసలాపురం లాబం లేదంట. ఇల్లకొచ్చి రోగాలకు మొందులిస్తా ఉండ్లా, ఆ డాకట్రు జెప్పినాడు. రొండ్రోజుల్దాలితే కాలాస్త్రి బొయ్యి ఆయెనే యేందో సూది మొందు దెచ్చి యేస్తాడంట. ఇప్పుడు ఈ పొసురు మొందిచ్చి పూస్తా ఉండమన్నాడు.” రాజెమ్మ జెప్పింది, రుద్దతానే.
“నాదన్న గూడా అదే మంచిదనిజెప్పినాడు” సొంత అన్నదమ్ముడి మాదిరుండే మా నాయిన మాటమింద అంగట్రాజెమ్మకు అంత నమ్మకం.
ఆయమ్మి బూసనమ్మతో ఆటలాడదామని వొచ్చినాను నేనీడికి. ఇంగిక్కడ యెవురితో ఆడాల… ఇంటికి తిరుక్కోనొచ్చేసినాను.
మేం కాలాస్తిరికి కాపరమొచ్చి ఇరవయ్యేల్లు గడిసి పొయ్యినాయి. నాయిన క్యాన్సరుతో జచ్చిపొయ్యి పదమూడు దినాలవతా ఉండాది. ఆ దినం కర్మంతరాలు బెట్టుకున్నాం. ఏట్లో కార్యక్రమాలన్నీ అయిపొయ్యి ఇంటికొచ్చి షామియానాల కింద బోజనాలకి కుచ్చున్నాం దాయాదులమంతా.
నోట్లో ముద్ద బెట్టుకోబోతా ఈదిలోకి యెగ జూసినా… ఇంగా ఎవురన్నా తినకండా మిగిలుంటే పిలద్దామని. మిడిమాలంగా కాస్తా ఉండాది ఎండ. గుండ్రాయిలు పగిలిపొయ్యే అంత యేడిలో దూరంగా ఒగ ఆకారం యెగబడొస్తా కనిపించింది. పక్కనే కొంచెం పొట్టిగా ఇంగో రూపూ తెలిసింది.
అవును ఆయక్కే… అంగట్రాజెమ్మ. ఎమకలు బయట పడినాయి. నిట్రాడు మాదిర్తో నిటారుగా ఉండే రాజెమ్మ, వొంగిపొయ్యి నడస్తా ఉండాది. కూడా ఒగ పదేనూ పదారేళ్ళ పిల్ల.
సేతిలో ఉండే ముద్ద ఇస్తారాకులోకి ఇడిసేసి గబక్కన పైకి లేచి ఎదురెళ్లినా.
“బాగుండావా రాజెక్కా…”
“ఇంకా సావలేదురా నేను. సచ్చినానకునింది నువ్వేరా బాలయ్యా. మీ నాయిన చావు గురిచ్చి ఒక్క మాటైనా జెప్పకుండా ఆయిన కట్టిని ఎత్తేసినావు గదరా…”
కళ్ళనిండా నీళ్ళతో నిలదీసింది నిరసనగా.
“ఊల్లో మీ ఇంటి జాగా కోసరం తిరగలాడే ఈస్పరయ్య జెప్పబట్టి గానీ. నేనీ జల్మకు మిమ్మల్ని జూసిండే దాన్నేనా.” సరాసరా ఇంట్లోకి బొయ్యింది.
నడీ ఇంట్లో బెట్టిన నాయిన పటానికి, కూడా దెచ్చిన మాలేసి బొరోమంటా ఏడ్సేసింది రాజెమ్మ. అన్నం దినమన్నా దింలేదు.
“నువ్వు బెట్టే పిండాకూడు కోసరం రాలేదబయా నేనూ…”
రెక్కబట్టి బోజనాల బల్ల దెగ్గిరికి లాగతావుండే నా చెయ్యి ఇదిలించి ఇసిరి కొట్టింది.
“బతికుండగా సూడలేక పొయ్యినాను. కనీసం చచ్చినాకైనా మాయన్నదమ్ముని పటానికి మాలేసి కడాన మొక్కి పోదామని వొచ్చినానంతే.”
ఇసురుగా గడప దిగి బిరబిరా ఈదిలోకి వొచ్చేసింది. యెంటే ఆ పిల్ల గూడా.
“ఆ పిల్లెవురు రాజెక్కా…” ఇందాకట్నించి ఉగ్గబెట్టుకోనుండి ఇంగ నా శాతగాక అడిగేసినా.
“నా సిన్న కూతురు బూసన బిడ్డ. ఆ ముండమోపి మొగుడు బెట్టే ఇంసలు బరించే ఓపిక ల్యాక, పెల్లి జేసంపిన రొండేల్లకే  ఆ బతికే దైర్నిం. లేని ఆడది ఉరేసుకోని చచ్చింది. ఇది నా యదాన బడింది.” యేమాత్రం ఆక్కుండా యల్లబారి పోతానే చెప్పింది నిరామయంగా అంగట్రాజెమ్మ.
నా నోట్లో మాటల్రాలా.
*

చిట్టత్తూరు మునిగోపాల్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు