మూడింటికీ చెడని రేవడు

క విధంగా చెప్పాలంటే రెండిటికీ చెడిన రేవడు, అవ్వా కావాలి, బువ్వా కావాలి, అడ్డ కత్తెరలో పోక చెక్క అంటే కుదరదు మొదలైన సామెతలు నాకు అన్వయించే అవకాశం ఉన్నా, ఉద్యోగ రీత్యా నేను మూడింటికీ చెడని రేవడిలా మా ఐఐటి లో చెలామణీ అయ్యాను అనే చెప్పుకోవాలి. అసలు ముందుగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాది “గండర గండడు’ అని మేము ముద్దుగా పిలుచుకునే సుబీర్ కార్ గారి దగ్గర ఫ్లూయిడ్ పవర్ డిపార్ట్మెంట్ అయినప్ప్పటికీ, అక్కడ ఫేకల్టీ లో  ఖాళీలు లేవు. అందుకని ఒకే ఒక్క లెక్చరర్ పదవి ఖాళీ ఉన్న ఇన్ స్ట్రుమెంటేన్ & కంట్రోల్స్ విభాగం లో నన్ను ఎంపిక చేశారు. హీట్ ట్రాన్స్ఫర్ విభాగం ప్రొఫెసర్ అయిన ఎస్. పీ. సుఖాత్మే అంత వరకూ ఆ విభాగానికి తాత్కాలిక అధిపతిగా ఆ సబ్జెక్ట్ చెప్తూన్నారు కానీ అది ఆయనకి సవతి సంతానం లాంటిదే!. ఆయన ప్రొఫెసర్ కాబట్టి ఇప్పుడు నేను ఆయన క్రింద  పనిచెయ్యాలి. అంటే నాకు మా గండర గండడు అనే బెంగాలీ ఆయనా, ఈ సుఖాత్మే అనే మరాఠీ ఆయనా ఇద్దరూ ‘బాస్’ లే.  కానీ పాపం వాళ్ళు పేరుకే బాస్ లు. పూర్తిగా అన్ని బాధ్యతలూ నాకే ఇచ్చేసే సంస్కారం ఉన్న అమెరికన్ రిటర్న్డ్ పెద్ద మనుషులు.

అంచేత నేను ఆ రెండు విభాగాల సబ్జెక్ట్స్ లోనూ కాస్త సిలబస్ కి అనుగుణంగానూ,  మరికాస్త నా సొంత “సాంకేతిక  పైత్యమూ” కలిపి నా ఇష్టం వచ్చినట్టు పాఠాలు చెప్ప గలిగాను. ఉదాహరణకి, కంట్రోల్ సిస్టమ్స్ లో ఒక అధ్యాయం చెప్పేటప్పుడు విద్యార్ధులందరినీ కేంపస్ ఎక్కడో మారుమూల ఉన్న ఎలెక్ట్రికల్ సబ్ హౌస్ కి తీసుకెళ్ళి, అక్కడ ఉన్న సిస్టమ్ చూపించి, ఆరు బయట పాఠం చెప్పేవాడిని. దాని మీదే పరీక్షాపత్రం ఇచ్చేవాడిని. “Seeing is believing” సిద్దాంతం అనమాట. అదే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో మేష్టరికం చేస్తే అలాంటి వేషాలు వేసే స్వాతంత్ర్యం ఉండదు. మాకు Thermodynamics చెప్పిన తరుణయ్య గారు ఎప్పుడో పల్చటి కాగితాల మీద ఇక్ష్వాకుల కాలం నాడు ఆయన లెక్చరర్ గా చేరిన మొదటి సంవత్సరం లో రాసుకుని  ఏం చెప్పాడో అదే రిటైర్ అయేటప్పుడు మాకు అప్పచెప్పేవారు. పాఠం చెప్పేటప్పుడు గాలికి కాగితం ఎగిరిపోయిందో….అంతే సంగతులు! ఆయన చాలా మంచివాడు… పాపం,

అలా నా రెండో బాస్ అయిన సుఖాత్మే గారు బోస్టన్ లోని ఎమ్.ఐ.టి. డాక్టరేటే కాక డిల్లీలో రాజకీయ పరపతి ఉన్నవాడు. అంచేత అంచెలంచెలుగా ఎదిగి మా ఐ.ఐ.టి కె డైరెక్టర్  గానే కాక Chairman of the Atomic Energy Regulatory Board  గా పనిచేసి ‘పద్మశ్రీ” అవార్డు పొందారు. నాలుగేళ్ళు కలిసి పని చేసిన ఆయనని నేను ఇండియా వెళ్ళినప్పుడు ఒకటి, రెండు సార్లు కలుసుకున్నాను. ఈయన నాన్న గారు స్టాటిస్టిక్ లో పద్మభూషణ్ గ్రహీత.

ఇక మూడోది….1973 లో మా డిపార్ట్ మెంట్ లో ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమో కోర్స్ మొదలు పెట్టారు. దానికి మెషీన్ డిజైన్ విభాగానికి ప్రొఫెసర్ అయిన డా. కనిట్కర్ గారు ఆ కోర్స్ లో ఫ్లూయిడ్ పవర్ కంట్ఱోల్స్ అనే సబ్జెక్ట్ నన్ను చెప్పమన్నారు. నిజానికి ఆ సబ్జెక్ట్ లో నాకే కాదు, మా ‘గండడి’ తో సహా ఎవరికీ ప్రవేశం లేదు. అయినా నేను పాపాల భైరవుడిని కదా!. అంటే,నేను వారం రోజులు ముందు చదువుకుని, అదే పాఠాన్ని కుర్రాళ్ళకి చెప్పాలన మాట!.  దాంతో నాకు ముగ్గురు బాస్ లు అయ్యారు. అయినా మూడింటికీ చెడని రేవడిలా బాగానే గెంటుకొచ్చాను.

ఇక్కడో తమాషా గురించి చెప్పాలి. ఈ కోర్స్ లో ఉన్న ఐదుగురు విద్యార్ధులలోనూ, ఒకతను నాకు కాకినాడ ఇంజజీరింగ్ కాలేజీలో ఐదేళ్ళు క్లాస్ మేట్ అయిన వోలేటి సుందర రావు అనే ఆప్తమిత్రుడు. అతనికి హాస్టల్ లో సీటు రాకపోతే స్టాఫ్ హాస్టల్ లో నాతోనే నా గదిలొ ఉండేవాడు. అంటే ఇంట్లో రామయ్యా, వీధిలో కృష్ణయ్యా లాగా నేను డిపార్ట్ మెంట్ లో అతనికి లెక్చరర్ ని, బయట నాతో చిన్నప్పటి స్నేహితుడిగా నా గదిలోనే బస. అతనే కాదు. బి. టి. రావు గారు అనే మిత్రుడు కూడా చాలా కాలం నా గదిలొనే ఉండేవాడు. ఆయన ఘంటసాల గాయకుడు. తర్వాత మొత్తానికి అక్కడ మెటలర్జీ డిపార్ట్ మెంట్ లో లెక్చరర్ గా చేరి క్వార్టర్స్ కి వెళ్ళిపోయాడూ. ఇక బొంబాయి లో ఉద్యోగాలు చూసుకోడానికి వచ్చి నెలల పాటు నా గదిలోనే ఉన్నమరొకడు ఎస్. వీ. కృష్ణారెడ్డి అనే తిరుపతి వాస్తవ్యుడు. అతను నాకు ఎలా పరిచయం అయాడో నాకు గుర్తు లేదు. అలా నా గదిని ‘పావనం’ చేసిన వారిలో హ్యూస్టన్ లో ఎప్పుడు కనపడినా ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఇప్పటికీ నాకు ధన్యవాదాలు చెప్పుకునే యలమంచిలి దంపతులు. ఎందుకంటే…అతను మా ఐఐటి లో చదువుకుంటున్నప్పుడే  వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది, కానీ తొలి రోజులు వాళ్ళు ఉండడానికి చోటు లేకపోతే నేను నా స్టాఫ్ హాస్టల్ గది # 47 వాళ్ళకి ఇచ్చి ఇంచుమించు ‘హనీమూన్’ ఏర్పాట్లు చేశాను. నేను పక్క వరండాలోనూ, మరో స్నేహితుడి గదిలోనూ పడుకున్నాను అనుకోండి..అది వేరే విషయం.

ఇక 1969 లో  మొదలు పెట్టిన నా డాక్టరేట్ కి సరియిన పరిశోధనాంశం ఎంపిక చేసుకోడానికి రెండేళ్ళు పట్టింది. ఇహ మన వల్ల కాదు బాబోయ్ అనుకుని చేతులెత్తేసిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ 1971 నాటికి టాపిక్ నిర్ధారణ అయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకో లేదు. రిసెర్చ్ టాపిక్ ఎంపిక విషయం లో నాకు ఎంతో సహాయం చేసిన చెల్లూరి శివరామ్ నీ, చెయ్యని మా గండర గండడినీ ఈ జన్మ లో మర్చిపోలేను.

నాకు పగలు ఇంచుమించు అంతా లెక్చరర్ బాధ్యతలతో సరిపోయేది. 22 గంటల టీచింగ్ లోడ్ ఉండేది. దానికి ముందూ, వెనకాలా కలిపి వారం రోజులూ అలా, అలా గడిచిపోయేది, అది కాక సుఖాత్మే గారికి ‘సవతి’ విభాగం అయిన, నేనొక్కడినే ఉన్న ఇన్ స్ట్రుమెంటేన్ & కంట్రోల్స్ లాబోరేటరీని పూర్తిగా తీర్చి దిద్ది బి.టెక్, ఎమ్. టెక్ విద్యార్ధులకి థీరీ, ప్రాక్టికల్స్ మొత్తం సిలబస్ తయారు చెయ్యడం, ఆయా క్లాసులు తీసుకోవడం …అంతా నా బాధ్యతే. పరాంజపే అనే మరాఠీ వాడూ, చౌదురీ అనే బెంగాలీ ఆయనా టెక్నీషియన్స్  నా క్రింద పని చేసేవారు. అసలు సమస్య ఏమిటంటే…రెండు పెద్ద గదుల్లో నిండిపోయిన పరికరాలు అన్నీ రష్యా నుంచి దిగుమతి అయినవే.  ఆ మాన్యువల్స్ అన్నీ రష్యా భాషలోనే. నేను ఏదో చిలక పలుకులు నేర్చుకున్నా మా ముగ్గురిలో ఎవరికీ ఆ భాష బొత్తిగా రాక పోవడం తో మేము పడిన బాధలు వర్ణనాతీతం. మొత్తానికి రెండేళ్ళలో ..అంటే 1971-72 నాటికి అక్కడ ఆ లేబొరేటరీని ఒక కొలిక్కి తీసుకు వచ్చాం. ఈనాటి అత్యాధునిక కంప్యూటర్ సాంకేతిక యుగం లో ఆ నాటి పరికరాలు వెల వెల బోతూ ఉంటాయి. ఆ లేబొరేటరీ ఇప్పుడు ఉందో, లేదో తెలియదు.

ఇక నా రోజువారీ పని తీరు ఇప్పుడు తల్చుకుంటే అలా ఎలా చెయ్యగలిగే వాడినా అని ఆశ్చర్యం వేస్తుంది. పొద్దున్నే 7 గంటలకి టీచింగ్ క్లాసులు ప్రారంభం అయేవి. సాయంత్రం దాకా క్లాసు పీకడమో, పరీక్షలు పెట్టడమో, పేపర్లు దిద్ది మార్కులు వెయ్యడం, లేబొరేటరీ నిర్వహణ, అప్పుడప్పుడు కేఫటేరియా కి వెళ్ళి బటాటా వడ తిని టీ తాగడం, స్టాఫ్ మీటింగు లూ, ఇతర హంగులూ, ఆర్భాటాలతో సాయంత్రం 5 దాకా కాలక్షేపం అయిపోయేది. వెంటనే స్టాప్ హాస్టల్ కి వెళ్ళిపోయి, మా సింగ్ గాడు పెట్టిన టిఫిన్ తినేసి గంట సేపు బిలియర్డ్స్ ఆడేవాడిని. నాకు ఇష్టమైన వ్యాపకాలలో అమెరికా రాగానే మటుమాయం అయిపోయిన వ్యాపకం ఈ బిలియర్ద్స్ ఆట ఒకటి. ఆ రోజుల్లో ఆట లో ఇండియా చాంపియన్స్ అయిన విలియం జోన్స్, మైకెల్ ఫెరైరా లాంటి వాళ్ళ బిలియర్డ్స్ ఆట చూడడానికి కొలాబా, ఖార్ జింఖానా మొదలైన  సత్య తల్వార్, చతురానీ మొదలైన మిత్రులతో వెళ్ళే వాడిని. బిలియర్డ్స్ అంటే చాలా నైపుణ్యం కావాలనీ, అమెరికాలో అన్ని బార్స్ లోనూ కేవలం బంతిని కన్నం లోకి కొట్టేసే సులువైన ‘పూల్’ ఆట కాదు అని అందరికీ తెలుసు అనే అనుకుంటాను. ఇలాంటి ‘పూల్’ ఆట బల్లలు మన వాళ్ళలో అలంకారార్ధం చాలా మంది ధనవంతుల ఇళ్ళలో కూడా ఉంటుంది. మా ఇంట్లో లేదు. బిలియర్డ్స్ కుదరక పోతే మా ‘గండర గండడు’ గారూ, బి.వై. మూర్తీ, చతురానీ లతో టెన్నిస్ ఆడేవాడిని. అదీ కుదరక పోతే మా స్టాఫ్ క్లబ్ లో టి.ఆర్.ఆర్. మోహన్ తోటో, ఇంకెవరితోటో టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని. ఇంకా కుదరక పోతే కాస్సేపు చదరంగం పావులు కదుపుతూనో, కేరమ్స్ ఆడుతూనో, మరీ అన్యాయంగా ఉన్న రోజున నాకు ఇప్పటికీ అప్పుడు ఎలా ఆడానో తెలియని బ్రిడ్జ్ అనే పేకాట కూడా ఆడేవాడిని. ఏది ఆడినా మహా అయితే రెండు గంటలు. ఎప్పుడైనా తెలుగు కార్యక్రమం ఉన్నా, నాటకం వేసినా…ఆట విడుపే!

అంతే కాదు, ఎప్పుడైనా బొంబాయి నగరం లో మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు, ఖచ్చితంగా వెళ్ళేవాడిని.  అలాటి వాటిల్లో ప్రతిష్టాత్మకమైన జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చెట్టు క్రింద కూచుని ఒక నెల పాటు జిడ్డు కృష్ణమూర్తి గారి ప్రసంగాలు వినడం, మా పవయ్ సరస్సుకి అవతలి ఒడ్డున ఉన్న చిన్మయానంద స్వామి వారి ప్రవచనాలు వినడం లాంటివి ఒక ఎత్తు అయితే కొలాబా లో ప్రముఖ పార్శీ నటుడు ఆలిఖ్ పదామ్శీ ఇంగ్లీష్ నాటకం (గాంధీ సినిమా లో జిన్నా పాత్రధారి), అలనాటి అద్భుతమైన మెజేషియన్ పి.సి సర్కార్ మేజిక్ షో లాంటి కార్యక్రమాలు చూడడం మరొక ఎత్తు. తెలుగు సినిమా చూడాలంటే ఆదివారం పొద్దున్న ఒకే ఒక్క ఆట ఏదో ఒక్క డొక్కు సినిమా హాల్ లో చూడవలసినదే. వాటికి ఆచంట శేషగిరి రావు తో వెళ్లేవాడిని.

ఇక రాత్రి 8 గంటలకి భోజనం చేసి సత్య తల్వార్, ఎ,జి. రావు, నీలిమ తదితర స్టాఫ్ హాస్టల్ మిత్రులతో సుమారు మా కేంపస్ ఔట్ గేట్ దగ్గర ఉండే రాధాకృష్ణ అనే చిన్న రెస్టారెంట్ కి వెళ్ళి టీ తాగేవాళ్ళం. నమ్మండి, నమ్మక పొండి. ఆ రోజుల్లో, ఆ కుర్ర వయస్సులో కూడా ఎక్కడా బీర్ తాగాలన్న కోరిక కానీ, సామాజికంగా ఆ అలవాటు కానీ లేదు. రెస్టారెంట్స్ లో దొరికేదు కాదు. ఎప్పుడైనా అందరికీ సరదాగా ఓ బీర్ తాగుదాం అనిపిస్తే, దానికి వారం రోజులు ముందునుంచీ ప్రయత్నం చేసి ఆ సరుకు రవాణాకి ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా చాలా మంది ఇళ్ళలో వాళ్ళ రిఫ్రిజిరేటర్ల లోనే సరుకు దొరుకుతుంది. దేశం పురోగమించింది.

ఇక్కడ మరొక ప్రధానమైన జ్ఞాపకం ఏమిటంటే…ఇంచుమించు ప్రతీ రోజూ మేము ఔట్ గేట్ కేసి వాక్ కి వెళ్తున్నప్పుడే అటు క్వార్టర్స్ నుంచి సర్వ మంగళ, అన్నగారు గురునాధం గారూ ఎదురు వచ్చేవారు. కేంపస్ ఉన్న ఒకే ఒక్క తెలుగు అమ్మాయి, అందగత్తె అయిన ఆనాటి సర్వమంగళ తో నేను ఎప్పుడైనా హలో చెప్పానేమో కానీ, మాట్లాడిన గుర్తు లేదు. ఇప్పుడు అమెరికాలో మా కుటుంబానికి సర్వమంగళ కుటుంబం అత్యంత సన్నిహితులు అవడం తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

చివరిగా…..అలా పగలంతా క్షణం తీరుబడి లేకుండా పని చేసి, సాయంత్రం కాసిన్ని ఆటలు ఆడుకుని, స్నేహితులతో ‘రాధాకృష్ణ’ రెస్టారెంట్ లో తీ తాగి……వాళ్ళు హాస్టల్ కి వెళ్ళిపోతే నేను మా డిపార్ట్ మెంట్ కి వెళ్ళి నా డాక్టరేట్ పని మొదలు పెట్టేవాడిని. రాత్రి 9 గంటల నుంచి కనీసం అర్ధరాత్రి పన్నెండు, ఒంటి గంటల దాకా లేబొరేటరీ లో పని చేసేవాడిని. నాకు తోడుగా శివరామూ, మూర్తీ తదితరులూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు జరదా కిళ్ళీ తో మా గండర గండడు, సతీమణినీ, పెంపుడు కుక్కనీ వేసుకుని షికారుగా వచ్చి మమ్మల్ని పని చేసుకోనివ్వకుండా కాలక్షేపం చేసినా అంతా సరదాగానే ఉండేది. అలా మూడేళ్ళ రాత్రి కష్టం తో ఆగస్ట్ 1974 నాటికి నా డాక్టరేట్ పని పూర్తి అయింది. అంటే ఇప్పటికి..అనగా ఈ ఆగస్ట్ 2020 కి సరిగ్గా 46 సంవత్సరాల క్రితం…

ఆ డాక్టరేట్ ఆఖరి రోజుల కష్టాల గురించి….వచ్చే నెలలో….

*

 

వంగూరి చిట్టెన్ రాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ అనుభవాలు చాలా బాగున్నాయి, మాతో పంచుకున్నందులకు ధన్యవాదములు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు