“నాకు వందేళ్లు వచ్చాయి నీకు తెలుసా” అన్నాడు నా స్నేహితుడు మొన్నీమధ్యన.
అవును తెలుసు. నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పాను కదా!
“అవును కదా !మరి పేపర్లలో నన్ను గురించి రాసింది చూసావా?”
“చూసానని చెప్పాను కదా!”
“సరే మరి కైసే హై ఆప్”
ఇలా వుంటుంది సంభాషణ. అన్ని భాషల్లో.పదిహేను రోజుల కొకసారి.
వారం పది రోజుల కిందట అయిదు నిముషాలు మాత్రమే మాట్లాడాడు ఆయన. గొంతులో అదే ఉత్సాహం.అదే నవ్వు.అదే వాత్సల్యం.
“ముసలితనపు అడుగుల సడి,ముంగిట నిలబడినా
వీట లేడని చెప్పించు, వీలు కాదని పంపించు”
అనే కవి మాటలకి ప్రతిరూపం నా స్నేహితుడు కృష్ణ మూర్తి గారు.
నాకన్న అన్ని విధాలుగా పెద్దాయన . ఏం చదువుతున్నావు , ఏం రాస్తున్నావు ఎందుకు రాయటం లేదు అని అక్కర చూపే నేస్తం. ఈయన ఎవరు? నాకు స్నేహితుడు ఎలా అయ్యాడు?
దాసు కృష్ణ మూర్తి గారిది స్వాతంత్ర్యం రాకముందటి బెజవాడ. అక్కడ వాళ్ల తాతగారికి పెద్ద ఇల్లు. అందులో ప్రెస్ . ప్రెస్ కి నిరంతర విద్యుత్ సరఫరా కోసం స్వంత పవర్ హౌస్. చలం గారి ఇల్లు కూడా అక్కడే. బెజవాడ అంటే చాలా ఇష్టం ఆయనకి. అక్కడ కాలేజీ చదువు అయిపోయాక ఆయన బెల్గాం లో లా చదివారు.కానీ జర్నలిజం మీద ఆసక్తి తో ఉస్మానియా యూనివర్సిటీ లో అప్పుడే ప్రారంభమైన జర్నలిజం కోర్సు లో చేరారు.అబ్బూరి ఛాయా దేవి తన క్లాస్ మేట్ అట.
ఆయన వ్రాసిన Seaside bride అనే ఆత్మకథ లో ఆనాటి బెజవాడ గురించి ,తన బాల్యం కాలేజీ చదువు బంధువుల రాక పోకలు, తరువాత కుటుంబం హైదరాబాద్ తరలి పోవడం అప్పటి హైదరాబాద్ స్వరూపం తన వివాహం,అన్నీ కాస్త హాస్యం రంగరించి వ్రాస్తారు. ఆయన భార్య మధుర గారిది బాపట్ల. ఆవిడే seaside bride.
కృష్ణమూర్తి గారు నన్ను చూసింది 1963 లో.
అప్పుడు ఆంధ్ర ప్రభ , ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒకే బిల్డింగ్ లో వుండేవి. రెండిటి మధ్య ఒక పార్టిషన్ వుండేది. కృష్ణ మూర్తి గారు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో , నేను ఆంధ్ర ప్రభ లో అప్పుడే చేరాను.రెండు ఆఫీసుల్లో కలిసి నేను ఒక్క ర్తినే స్త్రీ ని . అందరికన్నా చిన్న. నన్ను అందరూ అపురూపంగా చూసేవారు.
రెంటాల గోపాల కృష్ణ గారు బెల్లంకొండ రామదాసుగారు అజంతా గారు వంటి మహామహుల మధ్య ఒక పిచ్చిక లా వుండేదాన్ని. అక్కడ పనిచేసిన రెండేళ్ళ లో కృష్ణ మూర్తి గారితో ఎప్పుడూ మాట్లాడలేదు.
తరువాత ఆయన వేరే పత్రికలోకి దిల్లీ వెళ్లి పోయారని విన్నాను.సీనియర్ జర్నలిస్టుగా అనేక సమావేశాలకు రాజకీయ నాయకుల వెంట అనేక దేశాలు పర్యటించారు. ఒక ప్రయాణంలో ఒక పాకిస్తానీ తనకు ఎంత సహాయం చేసింది వ్రాస్తూ ఇండియా పాకిస్తాన్ ప్రజల మధ్య వున్న స్నేహ భావాన్ని చెడగొడుతున్నది మీడియా , రాజకీయ నాయకులు అంటారు.
కొన్ని దశాబ్దాలు గడిచాక ఒక రోజు ఒక మెయిల్ వచ్చింది.

“ఎప్పుడూ కాటన్ చీరలు కట్టుకుని సింపుల్ గా వుండే సత్యవతి అనే అమ్మాయి ఆంధ్ర ప్రభ లో పనిచేసేది. ఆ సత్యవతి వేనా నువ్వు. పెద్ద రచయిత వై పోయావు”
అది మొదలు మా స్నేహం!
మధుర గారి మరణం ఆయన్ని కుంగదీసింది.అప్పుడు ఆయన కూతురు తామ్రపర్ణి ఆయన్ని అమెరికా తీసుకెళ్లి అపురూపంగా చూసుకుంది .అక్కడ ఒంటరితనాన్ని ఆయన జయించిన తీరు అద్భుతం.
“నేను రోజుకి ఎనిమిది గంటలు కంప్యూటర్ తో గడుపుతాను. గూగుల్ నాకు డిక్షనరీ,ఎన్ సైక్లోపీడియా, ఫార్మాకోపియా ,కార్నొకోపియా” అన్నారు. నేను 2022 లో ఆయన్ని కలిసినప్పుడు.
తామ్రపర్ణి తో కలిసి “literary voices of India “ అనే వెబ్సైటు ప్రారంభించి చాలా తెలుగు కథలను ఇంగ్లిష్ లోకి అనువదించారు. తర్వాత అందులో కొన్ని కథలను “Santhoshabad passenger and other stories” పేరుతో రూపా పబ్లికేషన్స్ ప్రచురించింది. ఇటీవల Aleph publications ఈ తండ్రీ కూతుళ్ళు అనువాదం చేసిన కథలను “Greatest Telugu stories “ గా ప్రచురించింది. ప్రస్తుతం ఆయన తన 99 ఏట ,స్త్రీలు వ్రాసిన కథలు కొన్ని అనువాదం చేసి ప్రచురించాలనే ఉద్దేశ్యంతో వున్నారు.ఈ మధ్య నే ఆయనకు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం శాఖ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చింది.
ఏం తిన్నావు ఏంచదువుతున్నావు , రేమండ్ కార్వర్ వి ఏం చదివావు , మురకామి ఇష్టమేనా బెజవాడ లో రవీంద్ర కూల్ డ్రింక్స్ ఇంకా వుందా వంటిసంభాషణలు ఆగిపోయాయి.
బ్రతికి నన్నాళ్ళు జీవించి వుండడం అనే పాఠం నేర్చుకున్నాను ఆయన దగ్గర.
నాకు నూరేళ్ళ నిండాయి తెలిసిందా అంటున్న ప్రియ మిత్రుడికి శ్రధ్ధాంజలి.
*








బ్రతికినన్నాళ్ళు జీవించడం! ఎంత నిజమైన జీవిత పాఠం. !!🙏
🌺🙏🏻🌺
ఆత్మీయ నివాళి చాలా బాగుంది సత్యవతి గారూ
బ్రతికి నన్నాళ్ళు జీవించి వుండడం…ఎంత అద్భుతమైన వాక్యం.