“మాతృ” భాష వెతుక్కుంటున్న తెలుగు కవిత్వం

“నీలి మేఘాలు” పై 1993 లో వెలువడిన తొలి విశ్లేషణ.

తెలుగు నాట స్త్రీ దృక్పథానికి సంబంధించిన చర్చకి గొప్ప ప్రారంభం వుంది. కానీ, అంతే స్థాయిలో కొనసాగింపు లేదు. వీరేశలింగం పంతులు గారు సామాజిక, సాహిత్య రంగాలలోనూ, గురజాడ అప్పారావు గారు సాహిత్యరంగంలోనూ ప్రారంభించిన ఈ చర్చ తరవాత కాలంలో కొనసాగలేదు. వాళ్ళిద్దరూ స్త్రీ చైతన్యాన్ని గురించి చేసిన ప్రయత్నాలను కవిత్వంలో అందుకున్న వాళ్ళు లేరు. స్త్రీల పట్లా, స్త్రీ చైతన్యం పట్లా మన దృక్పథాన్ని మార్చడంలో భావకవిత్వం కొంతవరకే వుపయోగపడిందనడానికి భావకవిత్వమే రుజువు.

భావకవులు స్త్రీకి ఒక వ్య్కటిత్వాన్ని సంతరించే ప్రయత్నంలో విఫలమై, ఆమెకో అసాధారణమైన మానవాతీత శక్తిని మాత్రం ఆపాదించగలిగారు. గొప్ప సామాజిక దృక్పథం నుంచి బయలుదేరిన చర్చని భావకవులు వైయక్తిక దృక్కోణానికి మళ్లించడంతో స్త్రీల సాహిత్యానికి అన్యాయమే ఎక్కువ జరిగింది. కవిసహజమైన అతిశయోక్తికి భావకవులు ఒక సదుద్దేశాన్ని బలిచేశారు. అవాస్తవికతకి దారితీసిన ఈ దశలో వచన సాహిత్యంలో ఒక వైపు నుంచి శ్రీపాద, మరోవైపు చలం షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ కవిత్వంలో భావకవుల వల్ల ఏర్పడిన అంతరాన్ని ఎవరూ తొలగించలేకపోయారు.

తరవాత్తరవాత వచ్చిన కవయిత్రులు కూడా తాము స్త్రీలమనీ, తమకూ ఒక హృదయం, ఒక ఆలోచన వుందని గుర్తించలేకపోవడమే విషాదం. తక్కువమంది స్త్రీలే కవిత్వం రాసినప్పటికీ వాళ్ళెవరూ తమదైన వ్యక్తిగత ముద్రని ప్రదర్శించలేకపోయారు. మిగతా కవులకూ, ఈ కవయిత్రులకూ వ్యక్తీకరణలో ఏ మాత్రం వ్యత్యాసం కనిపించదు. తమకు తెలియకుండానే తామూ పురుషస్వామ్య వ్యవస్థ విధించిన చట్రంలో వుండిపోయారు.

1980 తరవాత వచ్చిన కొత్త తరం కవిత్వంలో సమూలంగా వచ్చిన వస్తువైవిధ్యం, రూప పరిణామం వల్ల వ్యక్తీకరణలో ఒక సారళ్యం వచ్చింది. ఈ మార్పులో భాగంగానే కవిత్వంలో స్త్రీ స్పృహ పెరిగింది. కవయిత్రుల సంఖ్య పెరగడంతో పాటు స్త్రీ మనోభావాలకు సంబంధించిన వివిధ కోణాలకు కవిత్వ వ్యక్తీకరణ దక్కింది. కవులు కూడా స్త్రీ దృష్టి నించి కవిత్వ వస్తువుని తీసుకొని రాయడం మొదలయింది. ఇంతకు పూర్వం కవయిత్రులు రాసిన కవిత్వంలో భాషలో, భావంలో లోపించిన ప్రత్యేక వ్యక్తిత్వం, ఈ కవిత్వంలో ఏర్పడ్తూ వుండడం మనం గమనిస్తాం. ఇవి స్త్రీల భావాలే, ఇది స్త్రీ గొంతుకే అని చెప్పుకునేందుకు వీలు కుదిరింది.

అంటే, అప్పటివరకూ తమని శాసిస్తున్న పురుషస్వామ్య వ్యవస్థ భావజాలాన్నీ, భాషా నిర్మాణాన్నీ ఈ కవయిత్రులు ఛేదిస్తున్నారన్నమాట. ఆ విధంగా మన కవయిత్రులు పరాయీకరణ నుంచి బయటపడ్డారు. ఫెమినిస్టు భాషా నిపుణులు భాషా సంబంధమైన ఈ పరాయీకరణని నిర్వచిస్తూ inability to express our own experience because no suitable framework, vocabulary exists అంటారు.

తెలుగులో ఇది ఏ తరహా కవిత్వానికైనా వర్తించే మాటే కానీ కవయిత్రుల కవిత్వానికి ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. స్త్రీలకు ఒక అభిప్రాయం వుండడమే నేరమైన సమాజానికి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. సమాజంలో స్త్రీల మనోభావాల్నీ, అభిప్రాయాల్నీ ఎలా అణచివేశారో కవిత్వంలోనూ కచ్చితంగా అలాగే జరిగింది. సాధారణమైన కంటికి కనిపించకపోవచ్చు కానీ పురుషాధిక్య ప్రపంచం స్త్రీ మనోభావాల్ని నిర్దాక్షిణ్యమైన సెన్సార్ బోర్డులా శాసించింది. స్త్రీకి బౌద్ధికమైన స్పందనలు తక్కువనీ, స్త్రీ అంటే కేవలం దేహం అనే సర్వసాధారణ స్థిరాభిప్రాయమే కవిత్వంలోకి ప్రవహించింది.

1980 తరవాత వచ్చిన కవయిత్రుల కవిత్వంలో ప్రధానంగా కనిపించే కవిత్వ వస్తువు కూడా దేహమే కావడం యాదృచ్ఛికం కాదు. పురుషుడి ప్రధాన ఆయుధం- దేహమే! “నీలి మేఘాలు” కవిత్వ సంకలనంలోని సగానికి పైగా కవితల్లో దేహమే పదేపదే కనిపిస్తుంది. దైహిక సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే, ఒక్క డోమెస్టిక్ లేబర్ ఒక్కటే ఒక ఎత్తు. శ్రమ సౌందర్యాన్ని కీర్తించిన వ్యవస్థ కూడా ఇంటిపనిని అసలు పనిగానే గుర్తించ లేదు. ఆర్థిక వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధం వుండకపోవడంలో ఇంటి పని అనుత్పాదక శ్రమగానే వుండిపోయింది.

సమాజంలో స్త్రీ స్థానాన్ని పూర్తిగా దీన్నిబట్టే నిర్ణయించడం జరుగుతోంది కనుక అసలు డోమెస్టిక్ లేబర్ స్వభావం మీద స్త్రీవాదులలో విస్తృతమైన చర్చ జరిగింది. “కేవలం డబ్బు ద్వారానే ఉత్పత్తి విలువని నిర్ణయించే చోట డబ్బుకి ఆవల వున్న శ్రమ విలువలేనిదవుతోంది.” (Margaret Benston, Political Economy of Women’s Liberation, 1969).దీనివల్ల శ్రమంతా డబ్బు తెచ్చేవాడిదే కానీ నిజంగా ఇంట్లో శ్రమ పడేవాళ్ళకి భాగస్వామ్యం లేకపోయింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పరిస్తితి దీనికి భిన్నంగా లేదు. కానీ జూలియట్ మిచెల్ మాటల్లో చెప్పాలంటే domestic labour, event today, is enormous if quantified in terms productive labour. కేవలం ఆర్థికం మీద ఆధారపడి, ఉత్పత్తి విలువని లెక్కగట్టే మార్క్సిస్టులను ఆమె విమర్శిస్తుంది.

ఈ స్త్రీవాద విమర్శ దృకోణాన్ని అందుకున్న కవిత్వ సంపుటి “నీలి మేఘాలు.” అంటే, ముఖ్యంగా పరాయీకరణ అనే అంశాన్ని తీసుకొని, వాళ్ళు చూస్తున్న/ అనుభవిస్తున్న జీవితాన్నీ, సామాజిక స్థితులను ఈ కవయిత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం స్త్రీల పరాయీకరణలో భాగంగా మేరీ డాలీ అనే భాషా శాస్త్రవేత్త చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుకువస్తున్నాయి. “we have inherited a contaminated language” అని ఆమె కుండబద్దలు కొట్టేసింది. వీళ్ళల్లో కొద్దిమంది భాషాశాస్త్రం ద్వారానే సామాజిక అధ్యయనం చేశారు. సాహిత్య అధ్యయనమూ చేశారు. భాష పరిధి ఏమిటో, మన ఆలోచనల మీద భాష ప్రభావం ఎంత గాఢంగా పడుతుందో చెప్పారు. ఆ మేరకు వాళ్ళు తేల్చిందేమిటంటే మనదాకా వచ్చిన భాష, మనం వుపయోగించే భాష పూర్తిగా పురుష కేంద్రీతమే అని!

అసలు పరాయీకరణ అనే భావం స్త్రీలకు సంబంధించినంత వరకూ అక్కడే మొదలవుతుందని వాదించారు. అంటే, భాషలోని పురుషత్వాన్ని ధిక్కరించినప్పుడే స్త్రీవాద కవిత్వం నిజంగా స్త్రీల గొంతుక అవుతుంది. ఆ క్రమంలో వాళ్ళు పితృస్వామ్య భాషని వినిర్మించి, నిజంగా మాతృభాషని నిర్మించుకోవాలి. ఆ మాతృభాషని అందుకునే ప్రయత్నమే “నీలి మేఘాలు.”

(అఫ్సర్ 1993 లో ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వ్యాసంలో కొన్ని భాగాలు ఇవి. 1993 లో  “నీలి మేఘాలు” ప్రచురణ అయిన వెంటనే వెలువడిన వ్యాసం ఇది. ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వం వహించిన “స్త్రీవాద వివాదాలు” ఈ వ్యాసంతోనే మొదలవుతుంది.)

 

అఫ్సర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “సమాజంలో స్త్రీ స్థానాన్ని పూర్తిగా దీన్నిబట్టే నిర్ణయించడం జరుగుతోంది కనుక అసలు డోమెస్టిక్ లేబర్ స్వభావం మీద స్త్రీవాదులలో విస్తృతమైన చర్చ జరిగింది. “కేవలం డబ్బు ద్వారానే ఉత్పత్తి విలువని నిర్ణయించే చోట డబ్బుకి ఆవల వున్న శ్రమ విలువలేనిదవుతోంది.” (Margaret Benston, Political Economy of Women’s Liberation, 1969).దీనివల్ల శ్రమంతా డబ్బు తెచ్చేవాడిదే కానీ నిజంగా ఇంట్లో శ్రమ పడేవాళ్ళకి భాగస్వామ్యం లేకపోయింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పరిస్తితి దీనికి భిన్నంగా లేదు. కానీ జూలియట్ మిచెల్ మాటల్లో చెప్పాలంటే domestic labour, event today, is enormous if quantified in terms productive labour. కేవలం ఆర్థికం మీద ఆధారపడి, ఉత్పత్తి విలువని లెక్కగట్టే మార్క్సిస్టులను ఆమె విమర్శిస్తుంది.”

    అఫ్సర్ గారు మంచి విశ్లేషణ చేశారు

  • తెలియక అడుగుతాను. స్త్రీవాదం, పురుషవాదం నిర్వచానేలేమిటి? ట్రాన్స్‌జెండర్ అన్నపదం కూడా ఎక్కువగానే వినిపిస్తోందీమధ్య.

    బాల్య, కౌమార, వృద్ధ వాదాలు కూడా ఉన్నాయా?

    హిందూ, ముస్లిం, మత-ఉపమత వాదాలెలాగూ ఉన్నాయి.

    తూర్పుపడమర, తెల్లజాతినల్లజాతి, అగ్రకులంనిమ్నకులం వాదాలతో మారణహోమాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడప్పుడే ఆగే ఆశల్లేవు.

    మేధావివర్గానికి చెందిన వాదులందరూ సంఘటితమై మానవతావాదులవచ్చుగా! ఈనాటికైనా.

    తెలియకడుగుతాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు