మనిషిని నేను…  

     “నువ్వు వెళ్తేనే బాగుంటుంది. ఎంతైనా ముసలామె. ఎన్నాళ్ళు బతుకుతుంది ఎనభై నాలుగేళ్ల మనిషి? ఒక ఆర్నెల్లకేగా అడుగుతున్నారు? డబ్బు బాగానే ఇస్తారట. ఆలోచించు. నీకు ఇప్పుడు బాగా ఆవసరం” దేవికా మేడమ్

కోపంగా ఉంది. ఎవరి మీదో తెలీడం లేదు. నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేటంత జీతం వస్తే చాలు దేవుడా? అప్పు లేని గౌరవప్రదమైన జీవితం. అది పేదదైనా పర్లేదు” అని కనీసపు కోరిక కోరుకునేది దేవుడిని. ఇప్పుడప్పుడప్పుడే తీర్చలేను అనేంత అప్పు పడింది నెత్తిన.

ఎగ్గొట్టి పారిపోయే తత్వమైతే బాగానే ఉండును. అణా పైసలతో సహా తీర్చాలి. తిరిగి నా ఆరోగ్యం చెడుతుందేమో అని సందేహం వచ్చే లోపల కష్టపడి మొత్తం తీర్చాలి. 

ఒప్పుకున్నాను. 

నేను పని చేసే హాస్పటల్లో కూడూ, గూడూ ఇస్తారు గానీ, ఆ వంకతో జీతాలు తక్కువ. కూడబెట్టాలంటే పనికొచ్చే జీతం కాదది

********

ఆస్పత్రి వెనకాల ఉన్న నర్స్ క్వార్టర్స్ లో నా కొంప, నాతో పాటు మరో ముగ్గురు పంచుకునేవారు ఆ గదిన్నర క్వార్టర్ ని. వాళ్ళిద్దరూ వేరే చోట కాస్త మంచి ఉద్యోగాలొచ్చి వెళ్ళిపోవడంతో నేనొక్కదాన్నే ఇప్పుడు.

 ఇదే నా ఇల్లు. నా రాజ్యం. నా ఫ్రెండ్స్, అదే నాతో పాటు పని చేసే నర్సులు అంటారు “ఈ చిన్న గదిని ఎంతందంగా ఉంచుకున్నావో” అని

నా సొంతం కాక పోయినా నేనున్నన్నాళ్ళూ నాదే గా. బెడ్ మీద నీటుగా మడత నలగని దుప్పటి, టేబుల్, కుర్చీ, ఫ్లవర్ వేజు, ఇంకా ఏవో ఆర్టు పీసులూ, గోడకు డ్రీమ్ కాచర్…! ఎంత ఆసక్తి గా ఇవన్నీ చేసినా ఒక్కోసారనిపిస్తుంది

“ఇవన్నీ నావా? ఎందుకింత హడావుడి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండక?”

ఎవరూ లేని అనాధని. ఆశ్రమంలో పెరిగి, చచ్చీ చెడి నాలుగు వేళ్ళూ నోట్లోకెళ్లేలాగా నా కాళ్ళ మీద నిలబడి నర్సునయ్యాను. ఇదే నా బతుక్కి పెద్ద విశేషం. అనుకోని పరిస్తితిలో మూడు లక్షల అప్పు చేశాను. అది తీర్చాలంటే ఈ జీతం చాలదు

రెణ్ణెలు సెలవంటే.. ఇస్తారు హాస్పటల్ వాళ్లు. ఎందుకంటే, నేను సర్వీసులో చేరాక ఈ ఆరేళ్లలో ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు పెట్టెరగను.పెట్టి ఏం చేయాలని? ఎవరు సెలవు పెట్టినా, వాళ్ల డ్యూటీ కూడా నేనే తీసుకుని చేస్తాను. కాబట్టి సెలవు సమస్య కాదు. నన్ను వదులుకోరు వాళ్ళు. 

రోగులకు సేవ చేయడం నాకేం కొత్తకాదు. అసహ్యించుకునే పనీ కాదు

ఇంతా చేసి నేను నర్సునని ఆవిడకు తెలీదు. కేర్ టేకర్ కావాలని అడిగారట. 

కిటికీకున్న నీలి పూల కర్టెన్ బయట నుంచి సన్నగా వర్షం చప్పుడు వినిపిస్తోంది.

“వెళ్తాను. తిండీ, రూమూ ఇచ్చి నెలకు 50 వేలు ఇస్తామంటే ఏం రోగం వెళ్ల్డానికి? రోజంతా కాళ్ళరిగేలా ఫ్లోర్ నుంచి ఫ్లోర్ కి పరిగెడుతూ ఇంతమందికి చేసే సర్వీసేదో అక్కడ ఒక్క దానికే చేస్తానంతేగా? సిటీ వదిలి పోను అని చెప్పుకునేంతగా నాకిక్కడ ఎవరూ లేరు.

వెళ్తాను!! వెళ్ళాలి 

మంచం మీద వాలి దుప్పటి పైకి లాక్కున్నాను

************

గేట్లో అడుగు పెడుతుండగానే ఇంట్లోంచి పెద్దగా కేకలు వినపడుతున్నాయి.

“పోతే పో, నీ బాబు లాటిదాన్ని తెచ్చి పెట్టుకుంటాను. నా కొడుకు ఎన్ని డబ్బులైనా పంపిస్తాడు.అంత పొగరా? హమ్మా హమ్మా.. అబ్బాయి ఫోన్ చేస్తాడుండు, చెప్తా నీ సంగతి”

లోపల నుంచి ఒకమ్మాయి చేతిలో సూట్కేసు, చంకకి హాండ్ బాగ్ తో చివాలున బయటికి వచ్చి గబ గబా గేట్లోకి వస్తూ నన్ను చూసి ఆగింది. మొహం కోపంతో ఎర్రబడి ఉంది.

“ఎవరు?” అంది అనుమానంగా

ఆవిడను గారిని చూసుకోడానికి వచ్చాను. నర్స్ ని “

“ఆల్ ది బెస్ట్. వారం కంటే ఎక్కువ రోజులు ఉంటే నాకు కనపడు. పార్టీ ఇస్తా” వ్యంగ్యంగా చెప్పి గేటు ధడేల్న వేసి ముందుకు దూకినట్టు గా వెళ్ళిపోయింది.

చుట్టూ చూశాను. పెద్ద ఆవరణా, విల్లా పోలికలతో దాదాపు పాతికేళ్ళ నాటి రెండంతస్థుల ఇల్లు. ఆవరణ నిండా పచ్చగా చెట్లూ. 

లోపలికి అడుగు పెట్టగానే పనమ్మాయి ఎదురొచ్చింది. “నీ పేరు ఫలానా కదూ? “

తలూపాను.

“రా” దారి తీసింది ముసలావిడ గదిలోకి 

పాత స్టైల్ ఇల్లు కావడం వల్లనేమో, ఆవిడ బెడ్ రూం అతి పెద్దగా ఉంది. మా నర్స్ క్వార్టర్స్ మూడో, నాలుగో కలిస్తే గానీ ఆవిడ పడగ్గది కాదు.

వీల్ చీర్ లో ఉన్నావిడ ఇటు తిరిగింది. నన్ను చూస్తూనే ఆవిడ మొహం లోకి ఉత్సాహం వచ్చింది

” దేవిక   పంపిందా నిన్ను?”

“అవును, మిమ్మల్ని చూసుకోడానికి కేర్ టేకర్ కావాలని చెప్పారు కావాలని చెప్పారు. నర్స్ ని నేను “

“రా , రా. కాసేపు రెస్ట్ తీసుకో. నీ గది పనమ్మాయి చూపిస్తుంది. నేను భోంచేశాను లే. కాసేపు ఏదైనా చదువుకుంటాను. ముందు స్నానం చెయ్యి వెళ్ళు”

నేను విన్నంత కఠినంగా లేదు  ఈవిడ వ్యవహారం ‘అయినా వచ్చిన రెండో నిమిషంలో ఏం తెలుస్తుంది’ అనుకుంటూ పనమ్మాయి చూపించిన గదిలో సామాను పెట్టుకుని స్నానానికి వెళ్ళాను.

**********

వారం రోజుల వరకూ ఆమె మామూలుగానే  ఉంది.వెట్ స్పాంజ్ ఇవ్వడం, జుట్టు దువ్వడం,బట్టలు, డైపర్లు మార్చడం, వీల్ ఛైర్లో బయటంతా తిప్పడం, వేళకు మందులు ఇవ్వడం, ఆవిడ భోజనంలో ఏం ఉండాలో చూసి, తినిపించడం.. అన్నీ బాగానే నడిచాయి.

ఈవిడ దగ్గర అంత మంది కేర్ టేకర్లు ఎందుకు ఉండలేక పారిపోయారో అనుకునేలా ఉంది. 

మరో వారం కూడా గడిచింది. నెమ్మదిగా ఆమె లో మార్పులు మొదలయ్యాయి. 

ఏది వండించినా తినేది కాదు. అది నచ్చలేదు, ఇది బాలేదని కంచాలు విసిరి కొట్టేది. అదంతా పనమ్మాయి శుభ్రం చేస్తే ఊరుకునేది కాదు. నేనే చేయాలనేది

వృద్ధాప్యం, రుగ్మతలు, కొడుకు, బంధువులెవరూ పట్టించుకోక పోవడం అన్నీ కల్సిన కోపం నా మీద చూపిస్తోందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.

ఒకరోజు అన్నం కంచం విసిరి నా మొహన కొట్టింది. ప్లేటు కింద పడి పగిలి పోయింది గానీ, అన్నం కూరలన్నీ నా మొహాన పడ్డాయి. అన్నం పారేసింది కాబట్టి. మజ్జిగ  తాగించి మందులు ఇచ్చాను.

ఆ రోజు తర్వాత అన్నం విసిరి కొట్టడం ఆవిడ అలవాటుగా మార్చుకుంది. అన్నం, కూరలు తెస్తే, చపాతీ కావాలనేది. సరే అని మర్నాడు చపాతీ చేయిస్తే 

” నాకు పళ్ళు లేవనేగా ఈ పన్లు చేస్తున్నావు? మెత్తగా చారన్నం పెట్టాలని తెలీదా ? నాశనమై పోతావు” అని తిట్లు.

చపాతీ నోట్లో పెట్టుకుని “ఇది కూడా నీ మొహం లాగా ఎండి పోయి ఉంది.” అంటూ తుపుక్కున. బయటకు ఉమ్మేసేది. ఒకరోజు అవి నా మీద పడ్డాయి కూడా.

“మీరు ఇలా చేస్తే చాలా కష్టం. ఎదుట ఉన్నది మనిషి అని గుర్తు పెట్టుకోండి” అన్నాను అసహనంగా.

వెంటనే ఆమె చేతిలోని నీళ్ళ గ్లాస్ ఎగిరొచ్చి నా మీద పడింది. భుజం ఎముక మీద తగిలిందేమో, బాగా  నొప్పెట్టింది. గాజు గ్లాసైఅతే ప్రమాదమని స్టీలు గ్లాసు ఇస్తే వద్దు, గాజు గ్లాసే కావావలని మొండికేసింది. గ్లాసు పగలగొట్టి, ఆ ముక్కలు రోజూ నా చేతి ఎత్తించి, శుభ్రం చేయించాలని పంతం 

నా మీద గ్లాసు విసిరేసి పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది.

“ఎవరూ లేరని మనిషిని పెట్టుకుంటే నా నా మాటలూ అంటున్నది” 

ఏమీ మాట్లాడలేదు నేను. కింద పడిన నీళ్ళన్నీ తుడిచి, పగిలిన గాజు ముక్కలు ఎత్తి చెత్తలో పడేసి వచ్చాను.

కాసేపటికి నా చేతులు పట్టుకుని ఏడ్చింది. 

“నాకు కోపం వచ్చింది. అందుకే” అంది 

మౌనంగా కిటికీ తెరలు సరిచేసి, వేజ్ లో పూలు సర్ది ఒక ఆస్ప్రిన్ టాబ్లెట్ పడేసి, ఆమె వీలు చైర్ తుడిచి నా గదికి వెళ్ళిపోయాను. కాసేపటికి జాలేసింది.

నిజంగానే అందరూ ఉన్నా ఎవరూ లేని మనిషే ఆమె. ఆమె వృద్ధాప్యపు చాదతంతో ప్రవర్తిస్తే నేను కౌంటర్ పార్ట్ గా ఉంటే ఎలా?

ముసలామె గదిలోకి వెళ్లాను కాసేపయ్యాక. దిగులుగా కిటికీ లోంచి చూస్తూ కుచునుంది.

“టాబ్లెట్ వేసుకోండి” కొంచెం నవ్వు మొహంతో మంచినీళ్ల గ్లాస్ అందించాను.

మొహం చాటంత చేసుకుని అందుకుంది.

జాలేసింది.

******

పని చేసే అమ్మాయి చెప్పింది, చిన్న వయసులోనే భర్త పోయాడట. ఏడాది కొడుకుతో ఇబ్బంది పడుతూ, నానా కష్టాలూ పడి, టీచర్ గా ఉద్యోగం చేసి పెల్లాడిని పెంచుకుందట. అతడు పై చదువుల కోసం విదేశాలు వెళ్ళి, అక్కడే పెద్ద ఉద్యోగం సంపాదించి, అక్కడే సెటిల్ అయ్యాడట. ఈవిడ ఆస్తి మీద అతడికేం ఆశలేదు  సరికదా, ప్రతి నెలా దండి గా డబ్బు పంపిస్తాడట కూడా.

వాళ్ళ కథ ఏదైనా కావచ్చు,నాకు మాత్రం బాగానే ముట్టజెపుతున్నారు. అంత పెద్ద ఇంట్లో నేను కలలో అయినా ఊహించనంత పెద్ద గది. మంచి భోజనం,ఆస్పత్రిలో నాకొచ్చే జీతానికి మూడు రెట్ల జీతం.

కానీ ఈవిడ పెట్టే టార్చర్ భరించలేక, ఎవరూ పట్టుమని పది రోజులు కూడా పని చేయలేదట.

కంచాలు విసిరి కొట్టి, తిట్టి, నానా మాటలూ అంటుంటే ఎవరుంటారు మరి? ఏదో ఆవిడకు స్నానం చేయించి, మందులు వేసి, బాత్ రూం అవసరాలు చూస్తే సరి పోతుంది కాబోలనుకుని వచ్చిన వాళ్ళు ఈవిడ ధోరణి చూసి హడలి పోయి పారి పోయుంటారు. నాలుగు జీతం డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు అందరూ అవమానాలు పడటానికి సిద్ధంగా ఉండరు కదా?

*******

నేను అక్కడ చేరి ఏడాదిన్నర దాటింది. కొంత అప్పు తీర్చేశాను. మరి కొంత తీర్చాలి. అందుకే సహనంగా ఉంటున్నాను.

రోజులు గడుస్తున్న కొద్దీ ముసలావిడ మొండితనం, పంతం, హఠం ఎక్కువైపోయాయి. రాత్రిళ్ళు అవసరం లేకపోయినా సరే, నేను తన గదిలోనే ఉండాలనీ, మేలుకుని ఉండాలనీ ఆర్డరేసింది.

ఇది చాలా కష్టమై పోయింది నాకు. ఆవిడకు తెల్లవారు జామువరకూ నిద్ర పట్టదు. నేను నిద్ర పోతుంటే ఆవిడ ఓర్చదు.  నా గదిలోని చిన్న టేబుల్ లైట్ ఆవిడ గదిలోకి మార్చి కిటికీ గట్టు మీద పెట్టి పుస్తకాలు చదువుకుంటూ ఆవిడ నిద్ర పోయే దాకా గడటం మొదలు పెట్టాను. నాలుగు రోజులయ్యాక, ఆ లైట్ వల్ల తనకు ఇబ్బంది గా ఉందని, అది వాడటానికి వీల్లేదనీ గొడవ పడింది.

చీకట్లో కుర్చీలో కాళ్ళు జాపుకుని కూచునే దాన్ని. కాళ్ళు పట్టేసేవి. రాత్రంతా నిద్ర ఉండేది కాదు. ఏ మూడింటికో కళ్ళు మూతలు పడితే, అరిచి లేపేసేది.

అలాగని పగలు ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఉండేది కాదు. కడుపు నిండా తినడానికి కూడా కూచోనివ్వదు. నేను అన్నం సగంలో ఉండగా, సరిగ్గా అదే సమయానికి  డైపర్ మార్చమని గొడవ పెట్టేది. ఆలస్యం అయితే ఊరుకోదు

డైపర్ మార్చాక, దెట్టాల్ తో చేతులు కడుక్కున్నా సరే, ఇక తిండి తినబుద్ధి అయ్యేది కాదు. 

పైగా రెచ్చగొడుతున్నట్టుగా “పాపం, అన్నం మధ్యలో లేచావు కదూ, తిను పో ” అనటం

రోజు రోజు కీ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతోంది సహనం చచ్చి పోతోంది గానీ తీర్చాల్సిన అప్పు గుర్తొచ్చి, నోరు మూసుకుని ఉంటున్నాను. అదీ కాక, నిజంగా నేను వెళ్ళి పోతే ఈవిడను మొరొకరు వచ్చినా , చూడరు. ఇన్ని గొడవలు భరిస్తూ ఉండరు. 

పనమ్మాయి నా మీద జాలి పడేది.

“నాదేముంది, ఇంటి పని, వంట పని చేసి వెళ్ళిపోవడమే. నువ్వు రోజంతా ఉండాలి ముసలామె తో. పోనీ వెళ్ళి పోతావా?” 

నిట్టూర్చాను.

“వెళ్ళిపోదామనే ఉంది. కానీ నేను వెళ్ళిపోతే ఇంకెవరూ రారు, ఈవిడకు సర్వీస్ చెయ్యరు. అదే ఆలోచిస్తున్నాను”

“అది నీ సమస్య కాదు” పనమ్మాయి విసుక్కుంది.

******

ఆ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. పనమ్మాయి గంగ రాక పోవడంతో ఇంటి పని వంట పనీ కూడా నేనే చేయాల్సి వచ్చింది. చాలా అలసట గా ఉంది. రాత్రంతా నిద్ర లేదు. తిన్నాక ఒక అరగంట పడుకుని విశ్రాంతి తీసుకుంటే బాగుండని ఉంది. చాలా ఆకలి గా ఉంది కూడా 

ఆవిడకు బ్రేక్ ఫాస్ట్ పెట్టాక, నేను తినడానికి కూచున్నాను.

“నన్ను వీల్ చైర్ లో బయటికి తీసుకెళ్ళి తిప్పు” గట్టిగా వినపడింది ముసలామె గొంతు

నీరసంగా కళ్ళు మూసుకున్నాను.

వెంటనే సర్దుకుని “ఇదిగో టిఫిన్ తింటున్నా. తినగానే తీసుకెళ్తా” చెప్పాను.

“ఎప్పుడు చూసినా తిండి గోలే. తర్వాత తినొచ్చు. ముందు  నన్ను బయటికి తీసుకెళ్ళు” అరిచింది.

“బాగా ఆకలిగా ఉంది. తిన్నాక తీసుకెళ్తా ఆగండి” కొంచెం విసుగ్గానే అన్నాను స్పూన్ తో ఉప్మా తీసుకుంటూ.

పెంకి ఘటం. మంచం మీద నుంచి నన్ను తిడుతూ లేవబోయి ధబేలున కింద పడింది. 

ఉప్మా ప్లేటు వదిలేసి గాభరాగా పరిగెత్తాను.

“దొంగ ముం.. నీ వల్లే నేను పడ్డాను. ఎప్పుడు చూసినా తిండి గోల తప్పితే ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ ధ్యాసే లేదు. అప్పనంగా డబ్బు దొబ్బడానికి నీ లాటి (ఒక బూతు మాట వాడింది) వాళ్ళు ఊడి పడతారు. సిగ్గుండాలి నా తిండి అన్ని సార్లు తినడానికి. నీ బాబు సొమ్మేమైనా దాచావా నా దగ్గర” నోరు పారేసుకుంది.

“చాలు ఆపండిక. నా బాబు సొమ్ము కాదు. నా సొమ్మే తింటున్నాను. నీ దగ్గర చేరేటప్పుడే వసతీ, భోజనం, జీతం అని చెప్పారు. మీకు ఒప్పుకున్న చాకిరీ కంటే ఎక్కువే చేస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఏదో కాస్త అవసరమై  చేరాను కానీ, ఇన్ని అవమానాలు పడుతూ ఇక్కడెవరూ పని చేయలేరు అసలు”

నా మాటలు వింటూనే ముసలావిడ ఉగ్రురాలై పోయింది. “ఓసి నీచురాలా.. అన్నేసి మాటలంటావా నన్ను? జాతి తక్కువ దానివైనా, ఏదో నర్సు ఉజ్జోగంలో ఉన్నావని పెట్టుకున్నాను గానీ..” కోపంగా పక్కన ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్ వేజ్ విసిరేసింది. మంచానికి ఇవతల ఉన్న నేను అది నా మోకాలికి తగలడంతో మంచం మీద తూలి పడి పోయాను.

బిత్తర పోయాను. ఏమందీ? “జాతి తక్కువ దానా?” అనా? 

ముసలామె కోపం ఆకాశాన్ని అంటింది.

“నీ ఆశ పాడు గానూ, నా మంచం మీద పడుకోవాలనుందా నీకు అలా పడ్డావ్? నిన్నూ” అని తన హాండ్ స్టిక్ నా గొంతుకు లంకె లాగా వేసి నొక్కింది. ఆ లంకె నా గొంతుకు నొక్కుకుపోతూ ఊపిరాడట్లేదు.

“వదలండి, వదలండి” అని ఎంత విడిపించుకోవాలన్నా వీలు కావట్లేదు. చచ్చి పోయేలా ఉన్నాను. గొంతు నొక్కుకు పోతోంది. శక్తి అంతా కూడదీసుకుని ఆ హాండ్ స్టిక్ ని అవతలికి తోసి ఆవిడను ఒక్క తోపు తోశాను. మంచం మీద ఆనుకుని కూచుందాల్లా పక్కకి పడి పోయింది.

పడి పోయి ఊరుకుందా? పదునైన గోళ్ళతో నా మొహం మీద రక్కడానికి ప్రయతించింది. తప్పించుకునే ప్రయత్నంలో తలగడ అడ్డుగా పెట్టి ఆవిడను వెనక్కి తోశాను.

ఆమె చాచి నా డొక్కలో తన్నింది. నడవటానికి రాని కాళ్ళు తన్నడానికి ఎలా వచ్చాయో తెలీదు.

ప్రతిఘటిస్తూ ఆవిణ్ణి వెనక్కి తోసి తిరిగి లేవకుండా తలగడ అడ్డం పెట్టాను. 

ఆవిడ కాసేపు పెనుగులాడి నీరస పడి ఆపేసింది.

“అమ్మయ్య. దీని ఓపిక చచ్చిందిక” అని తలగడ తీసేసరికి, బొమ్మ లాగా వెనక్కి పడిపోయింది.

లేచి, నొక్కుకు పోయిన గొంతు సవరించుకుని, చెదిరి పోయిన బట్టలు సర్దుకున్నాను

“అమ్మో, ఎంత భయంకరంగా ప్రవర్తించింది ఈమె? ఇంక ఇక్కడ ఉజ్జోగం చేసే సమస్యే లేదు” రొప్పుతూ బయటికొచ్చాను.

నా గదికి పరిగెత్తి రెండు గ్లాసుల నీళ్ళు తాగి పది నిమిషాలు అలా కూలబడి పోయాను మంచం మీద

అరగంట తర్వాత కాస్త ఓపిక వచ్చినట్టయింది. ఆవిడ కి టీ ఇచ్చే టైం అయింది. టీ పెట్టి తీసుకెళ్ళాను.

గదికి వెళ్ళే ముందే , “ఇక నా వల్ల కాదు లెండి. వేరే ఎవరినైనా చూసుకోండి. నేను వెళ్ళి పోతాను. సెలవిప్పించండి” అని చెప్పాలని ప్రిపేర్ అయి వెళ్ళాను.

గదిలోకెళ్ళి చూసి కొయ్యబారిపోయాను .

అరగంట క్రితం నేను బయటికి వెళ్ళినపుడు ఎలా పడి పోయిందో, అలాగే పడి పోయి ఉందామె. 

చల్లని జలదరింత ఒకటి వెన్నుపూస ని నిలువునా వణికించింది.

తెప్పరిల్లి గబ గబా వెళ్ళి ఆమెని లేపి సరిగా పడుకోబెట్టాను. కళ్ళు మూసుకే ఉంది గానీ లేవలేదు

అనుమాన్మతో చేయి పట్టుకుని నాడి పరీక్షించి అదిరిపడి పోయాను. నా అనుమానం నిజమే.

ఆమె ప్రాణం పోయి అరగంట పైనే అయింది. తలగడ ఆమె మీద పెట్టి నొక్కి పట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు పోయాయి.

ఇన్ అదర్ వర్డ్స్ … చంపేశాను నేను.

హత్య చేశాను. ప్రాణాలు తీశాను. 

తల తిరుగుతోంది. కళ్ళ ముందు ఏవేవో వలయాలు , చుక్కలు, గీతలు, మెదడులో హోరున ఏవో శబ్దాలు, నవ్వులు, ఏడుపులు

 గబ గబా పరిగెత్తుకెళ్లి వాంతి చేసుకున్నాను

******

నలిగిపోయిన ఆమె పక్క దుప్పట్లు మార్చి, తెల్లని ఉతికిన దుప్పట్లు వేసి, తలగడ గలీబులు కూడా మార్చాను. ఆ తలగడ ముట్టుకోవాలంటే భయం వేసింది

ఆమెను వెల్లకిలా పడుకోబెట్టి, నైటీ సరిగా సర్ది, దుప్పటి కప్పాను.గది మొత్తం అలజడి జరిగిన ఆనవాళ్ళు లేకుండా  సర్ది శుభ్రం చేశాను.

పని మనిషికి, ఊర్లో ఉండే ఆమె దూరపు చుట్టాలు ఒకళ్ళిద్దరికి ఫోన్ చేశాను.

“ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేశాక నిద్ర పోయారు. నిద్ర లోనే ప్రాణాలు వదిలారు” 

మరో గంటలో పదిహేను మంది పోగయ్యారు ఇంట్లో. ఎవరైనా “డాక్టర్ని పిలిపించి చెక్ చేయించండి” అంటారేమో అని హడలి పోతూ గుండెలు ఉగ్గబట్టుక్కూచున్నాను.

ఏడుపో, విచారమో అభినయించాలని కూడా తోచలేదు.

ఇంతలో ఎవరో అన్నారు “ఆవిడ డాక్టర్ కి చెప్పావా అమ్మాయ్?”

గంగ జవాబు చెప్పింది.”ఆమె కూడా నర్సే. ఈమె వచ్చాక అసలు ఆ డాక్టర్ తో పనే లేకుండా పోయింది. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటమే గానీ. ఫోన్ చేసి చెప్పాము పోయిందని. అయ్యో అన్నాడు” 

గంగ ని ఆరాధనగా చూడాలనిపించింది గానీ ఆ సమయంలో కుదరలేదు

“వాళ్ళబ్బాయి రావాలంటే రెండు రోజులైనా  పడుతుందేమో?” ఇంకెవరో అన్నారు.

ఇంతలో బయటి నుంచి ఒకాయన వచ్చాడు. ఆవిడ కి మరిది అవుతాడట

“వాడికి వెంటనే రావడానికి వీలు పడదట. పదకొండో రోజుకు వస్తానన్నాడు. మనల్నే కానివ్వమన్నాడు. డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు” 

“పాపం, ఎంత సేవ చేసిందో ఈ అమ్మాయి. ఎన్ని మాటలన్నా విసుక్కునేది కాదు” ఎవరో నన్ను ప్రశంసించారు

ఇప్పుడు నాక్కావలసింది ప్రశంసలు కాదు. ఆవిడ దహన సంస్కారాలు. 

ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.

“ఎలా జరిగింది?” అప్పుడే వచ్చిన ఒక కొత్త విజిటర్ అడిగింది

“టిఫిన్ తిని పడుకుందిట. నిద్ర లోనే పోయింది. ఎలాటి దానికి ఎలాటి చావో చూడు. ఏమీ తెలీకుండా హాయిగా వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర ఆవిడ రికార్డ్ ఏమిటో మనకేం తెలుసు?”

ఆవిడ ఎలాటి చావు చచ్చిందో వాళ్లకేం తెలుసు? గుండె దడ దడ లాడింది.

సాయంత్రం ఆవిడ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకూ మనసు మన్సులో లేదు. 

ఆ రోజు సాయంత్రమే బయలు దేరి సిటీకి వచ్చేశాను. నా గదిలో ఎలాటి భయమూ లేకుండా నిద్ర పోయాను. ఆవిడ దెయ్యమై వచ్చి నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే నేను దెయ్యాల్ని నమ్మను.

********

నా చెవుల్ని నేనే నమ్మలేక పోయాను ఫోన్లో ఆ మాటలు విని 

“అవును, మీరు రావాలి. ఫార్మాలిటీస్ పూర్తి చేసి నేను న్యూజిలాండ్ వెళ్లిపోవాలి” వాళ్ళబ్బాయి మరో సారి అన్నాడు

ముసలామె ఆ ఇల్లు, ఇంటి వెనక ఉన్న మరో ప్లాటు, బాంక్ బాలెన్స్ మొత్తం నా పేరు మీద విల్లు రాసిందట.

“నాకు ఆ అమ్మాయి తప్ప ఎవరూ శ్రద్ధగా చాకిరీ చెయ్యలేదు. అందరూ విసుక్కున్నారు,తిట్టారు. కొందరైతే నన్ను చంపాలని కూడా చూశారు. ఆ అమ్మాయి చాలా శాంత స్వభావి. సేవా భావం గల పిల్ల. నేను ఎంత విసిగించినా విసుక్కోకుండా నానా చాకిరీ చేసింది. అందుకే ఈ ఇల్లు, ఇంటి వెనుక ప్లాటు, నా బాంక్ లో డబ్బులు,ఇవన్నీ ఆ అమ్మాయికే చెందాలి. ఆమెకు డబ్బు చాలా అవసరం” అని రాసిందట

తనకు ఆ ఆస్తి ఏమీ అక్కర్లేదన్నాడు వాళ్లబ్బాయి.

నాకున్నదే నాకు చాలు. ఈ పాత ఇల్లు  అమ్మడం ఇదంతా నాకు అవసరం, ఆసక్తి లేని పని.అమ్మ విల్లు ని మీరు గౌరవించాలి. చివరి వరకూ చాలా జాగ్రత్త గా చూసుకున్నారు” అతను మర్యాదగా మాట్లాడుతుంటే నాకు భయం మొదలైంది

*******

రెండు రోజులు ముందుగానే వెళ్ళాల్సి వచ్చింది రిజిస్ట్రేషన్ కోసం.

ఆస్తి రిజిస్టర్ అయిన కాగితాలు నా చేతికి ఇచ్చారు.వాటిని అందుకుంటుంటే చేతులు వణికాయి.

ఎదురు గా ముసలావిడ నవ్వుతూ వీల్ చైర్ లో వస్తూ కనపడింది. ఉలిక్కి పడ్డాను.

ఈ ఆస్తి నాకొద్దు. ఎవరికో ఒకరికిచ్చేయాలి. పాపం చేశాను నేను. 

హత్య చేశాను. ఒకరి ప్రాణం తీశాను. నా చేతిలో చచ్చిపోయినావిడ ఆస్తి అది. 

ఆ రాత్రి ఆలోచించాను. వీటిలో ఒకటి చేస్తే బాగుండనిపించింది 

  1. ఆస్తి అంతా ఆడపిల్లల హోమ్ కి రాసేయాలి
  2. గవర్నమెంట్ సంక్షేమ కార్య క్రమాలకు విరాళంగా ఇచ్చేయాలి
  3. ఏదైనా వృద్ధాశ్రమానికి ఇవ్వాలి

4.వీధి పిల్లల కోసం పని చేసే సంస్త ఏదైనా ఉందేమో చూసి వాళ్ళకు ధారాదత్తం చేసేయాలి

అంతే! ఆ ఆస్తిని అనుభవిస్తూ నేను ప్రశాంతంగా బతకలేను నేను. 

మనిషిని నేను

నిర్ణయం తీసుకున్నాక, హాయిగా నిద్ర పట్టింది

*********

కార్యక్రమానికి చాలా మందే వచ్చారు. అంత మంది బంధువుల్ని చూశాక, ఆమెను అందరూ దూరం పెట్టారని అర్థమైంది. అందరితోనూ నాతో ఉన్నట్టే ఉండేదేమో? 

ఒక పక్క తంతు ఏదో జరుగుతూ ఉండగా, ఆ పక్కన ఉన్న హాల్లోకి అడుగు పెట్టాను. అక్కడ 20, 30 మంది బంధువులు, ఇరుగుపొరుగు వాళ్ళూ కూచుని మాట్లాడుకుంటున్నారు

నన్ను చూడగానే ఒకావిడ అంది ” ఈ అమ్మాయే దానికి పోయే దాకా సేవ చేసింది. చేతులెత్తి దణ్ణం పెట్టాలి ఈ పిల్లకి”

పక్కింట్లో ఉండే కమల గారన్నారు “ఆవిడ చేసే గోల, ఈ పిల్లని తిట్లే తిట్లు అన్నీ వినబడుతూనే ఉండేవి. ఒక్క రోజన్నా ఈ అమ్మాయి గొంతు ఎలా ఉంటుందో వినాలన్నా వినబడేది కాదు. ఎంత సహనమో అసలు. ఆవిడ అరుపులు,గోల విని ఎప్పుడైనా వెళ్ళి ఈ అమ్మాయి తరఫున మాట్లాడదామన్నా, ఆ నోట్లో నోరు పెట్టి ఎవరు గెలవ గలరు?

ఇంతకు ముందు ఒకసారి అలాగే వెళ్ళి సర్ది చెప్తే నానా తిట్లూ తిట్టింది. అందుకే ఊరుకున్నాం “

“అమ్మో, దాని సంగతి నాకు చెప్పకు. చిన్నప్పుడే మొగుడు పోయాడని ఎంతో జాగర్తగా చూసుకునే వాళ్ళమా? నేనూ మా ఆయనా అలా సరదాగా నవ్వుతూ కనపడితే చాలు కళ్ళలో నిప్పులు పోసుకునేది. ఏదో ఒక వంకతో దెబ్బలాట పెట్టుకుని ఏడ్చి నానా రభసా చేసేది. అది ఇంట్లో ఉన్నపుడు కనీసం మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు ఆ తర్వాత ” ముసలావిడ మరదలు అట కళ్ళ జోడు తీసి తుడుచుకుంటూ అంది.

ఆవిడతో పాటు స్కూల్లో పని చేసిన టీచర్లు ముగ్గురు వచ్చారు. ముగ్గురిదీ ఒకటే పాట

“ఆవిడతో అసలు వేగలేక పోయే వాళ్ళం బాబూ. స్టాఫ్ రూం లో నోరెత్తే వాళ్ళం కాదు. ఊరికే తిట్లు, ఏదో ఒక వంకతో”

“సెలవులకని పిన్ని వాళ్ళింటికెళ్తే, ఎన్ని ఆక్షలు పెట్టేదో. తమ్ముడినీ నన్నూ సినిమాల్లు చూడనిచ్చేదే కాదు. అందుకే వాడు దేశంలోనే లేకుండా పోయాడు, ఈవిడను ఇక్కడ వదిలేసి. పాపం ఈ నర్స్ ఆవిడ పాల బడింది” ముసలావిడ అక్క కొడుకు.

“ఎదురింటాయన అన్నాడు “ఈ మూడేళ్లలో కనీసం ఇరవై ముప్ఫై మంది కేర్ టేకర్లు మారారు. కొంత మందిని కొట్టిందట కూడా ఆవిడ. మేము చూస్తూనే ఉంటాం కదా? ఈ అమ్మాయి మాత్రం రెండేళ్ళుగా అంటిపెట్టుకుని సేవలు చేసింది. ఎన్నెని హింసలు పడిందో పాపం

అందుకే ముసలావిడ ఆస్తంతా ఈ పిల్లకు రాసింది. చేసిన పాపాలకు కాస్త ప్రాయశ్చిత్తమన్నా అవుతుందిలే. ఎంత సంపాదించి ఏం లాభం, ఆస్తికి సార్థకత ఉండాలి గానీ. ఆవిడ బతికున్నంత కాలం ఏం పాపాలు చేసినా, ఆస్తి ఈ పిల్లకు రాసి మంచి లోకాలకే పోయింది”

ఇంకా ఎవరో, ఎవరెవరో.. అందరూ ఆవిడ పెట్టిన హింసల గురించి, ఆవిడ కోపం, ద్వేషం, వాటి వల్ల వాళ్ళు పడిన ఇబ్బందులూ ఇవే చెప్పారు

వీటన్నిటి మధ్యలో “అమ్మ చిన్నప్పటి నుంచీ చాలా కష్టాలు పడింది. ఎవరి సపోర్టూ లేక, మగవాళ్లని తప్పించుకుంటూ, అందరితో గొడవలు పడుతూ తను సేఫ్ గా ఉండేందుకు, గయ్యాళి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. అది నాతో సహా ఎవరమూ తట్టుకోలేక పోయాము. మీరు మాత్రం చాలా సహనంగా ఉన్నారు. యూ డిజర్వ్ దిస్. ప్లీజ్, అమ్మ కోరిక కాదనకండి” అని ఆమె కొడుకు చెప్పిన మాటలు నెమ్మదిగా నీళ్లలో వేసిన రాయి లాగా మునిగి మాయమై పోయాయి. 

***

ముందు రోజు రాత్రికీ ఈ రాత్రికీ పోలికే లేదు. 

మనసెంతో తేలిక పడింది. ఆవిడ అంత మందిని అన్ని రకాలు గా విసిగించి బాధలు పెట్టిందని తెలీనే లేదు. ఏదో వృద్ధాప్యపు మతి చాంచల్యం తో నాతో అలా ప్రవర్తించిన్దనుకున్నాను. 

అసలు మనిషే మంచిది కాదన్నమాట. ఏదో… అలా ముగిసిపోయింది ఆ జీవితం.    

నెమ్మది నెమ్మది గా నాలోని అపరాథ భావన కరిగి మసకేసి మాయమై పోయింది. దాని స్థానం లో నేను పొరపాటున చేసినా, మంచి పనే చేశానన్న నమ్మకం బలపడ సాగింది. ఆవిడ పరంగా కూడా ఆవిడకు విముక్తి కలిగింది. దేవుడే ఈ పని నా చేత చేయించాడు. అందుకు ఆవిడ నాకు కృతజ్ఞురాలై ఉండాలి అసలు. 

ఇంతకీ ఈ ఇల్లు అమ్మితే ఎంతొస్తుందో?? నర్స్ క్వార్టర్స్ లో గడుస్తోన్న నిస్సారమైన జీవితం నాది.

మంచి ఫ్లాట్, సకల సౌకర్యాలతో ఉన్నది కొనాలి. నాకంటూ చిన్నదో పెద్దదో బాల్కనీ, దాంట్లో మొక్కలూ, ఉయ్యాలా,స్నేహితులూ, కలయికలూ, పా…ర్టీ..లూ..!

అవును, ఇన్నాళ్ళకి దేవుడు నాకో అవకాశం ఇచ్చాడు, నా జీవితం సుఖంగా సాగేందుకు.

అనాధలకు, వృద్ధులకూ సేవ.. ఇలాటివి ముందు ముందు చేయొచ్చు. ఏమంత వయసై పోయిందని నాకు?

మనిషిని నేను!

*

చిత్రం: సృజన్ రాజ్ 

సుజాత వేల్పూరి

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మా
    మీ కథలోని అనుభూతిని అనుభవించాను. ఇంకా అనుభవిస్తున్నాను.

    • చాలా సంతోషం రెడ్డప్ప రెడ్డి గారూ కథ నచ్చినందుకు 🙏🏻

  • మనిషిని నేను…కథ బావుంది.
    వివరణ కాస్త ఎక్కువయింది గాని కథ బావుంది.
    ఆస్తి నర్స్ పేరు మీద రాయడం కొసమెరుపు,కానీ అక్కడ కూడా ఎక్కువ వివరణ కొనసాగింది.అయినా ఇడి మంచి కథ..రచయిత్రికి అభినందనలు.
    కథ చడడవమని ప్రేరేపించిన కథ/నవల,రచయిత్రి,కవయిత్రి,శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి కి
    కృత జ్ఞత లు.

  • కథ బాగుంది.ముఖ్యంగా ఆఖరి వాక్యం నేను మనిషినే అని కథను పండించింది. రచయిత్రి కి ధన్యవాదాలు

  • కథ చాలా బావుంది. కథనం ఆసక్తిని రేకెత్తించింది. అభినందనలు.
    A good writer is the one who
    knows where to stop and how to stop.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు