మనం పోగొట్టుకున్న అమాయకత్వాలు!

‘రాసిన కథల్లో యే కథ యిష్టం’ అని అడిగినప్పుడు ప్రతీ కథా యిష్టమే అని అనిపిస్తుంది.

వొక్కటి యెంచుకొని యెందుకు యిష్టమో చెప్పమన్నప్పుడు చాల కథలు “మేం మేం” అని ముందుకు వచ్చాయి. మళ్ళీ ఆ కథలే చక్కని స్నేహితుల్లానో అక్కచెల్లెళ్ళల్లానో యే కథని తీసుకున్నామాకు సంతోషమే అన్నాయి.

యీ సారికి ‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్సు’ కథ యిష్టమైన కథ గా నిలిచింది.

(‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్సు’ కథ ఇక్కడ చదవండి)

యెందుకు యిష్టం?!

యిష్టాన్ని వివరించటం సాధ్యమా?!

యెప్పుడైతే వో యిష్టాన్ని వివరించటానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ మొత్తం పలచపడిపోతుందనిపిస్తుంది.

యెందుకిష్టం అనే దాని కంటే యీ కథానేపథ్యం కొద్దిగా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.

ప్రతి తరం తమదైన జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. యెప్పటికప్పుడు

అన్ని రకాల మార్పులు మనందరి జీవితాల్లోకి వస్తాయి. వాటిలో సోషియో.. పొలిటికల్.. యెకనామిక్..    కల్చరల్ .. యిలా అనేక  నేపధ్యాలు పెనవేసుకొని వుంటాయి.

ఆ మార్పులు సమాజానికి యే విలువలని యిస్తాయి?! యే విలువల్ని నరికేస్తాయి?!

యే సంతోషాలకి చెక్ పెడుతాయి?!

మన వ్యక్తిత్వానికి సమాజ పోకడకు మధ్య యెటువంటి ఘర్షణ వుంటుంది?!

మనం యెటువంటి అభివృద్ధిని ఆహ్వానించాలి? యే అభివృద్ధిని తిరస్కరించాలి? అసలు అందరికీ ఆమోదయోగ్యమయిన ఆభివృద్ధి యేమిటీ ?!

మారుతోన్న ఆర్ధిక వనరుల నేపధ్యంలో యీ సమస్యలు, పరిస్థితులు యేదో వొక వర్గానికి సంబధించినది మాత్రమే కాదు.

వ్యక్తులు లేదా  సమూహాలు  ర్యాట్  రేస్ భాగ్యమయ్యే  పరిస్థితులు యెలాంటి సమజాల్లో  ప్రస్పుటంగా కనిపిస్తుంటాయి!? మనం  అన్ని సందర్భాలలో  అన్ని అసమానతల్ని, పవర్  పాలిటిక్స్ ని  వ్యక్తిగతం గా  వొంటరిగా  యెదురక్కోవటం అసాధ్యం. అలానే వాటిని  నివారించటమూ వ్యక్తులు గా వీలైయ్యేపనీ  కాదు. అయినా  వొంటరిగానైనా పీల గొంతుతోనైనా  మాటాడకుండా వుండలేము. కనీసం  అలాంటి  పీల గొంతులన్నీ అడ్డుకొంటున్నవి యేమిటి?!

యింతగా మనిషిని కాపిటలిజం చుట్టుముట్టాక మనిషి మనిషిలా వుండే అవకాశం లేదు. మనిషి తను  అనుకునేట్టు వుండే పరిస్థితి లేనప్పుడు జరిగే పెనుగులాట మనిషిని పరిస్థితులకి అనుగుణంగా తన ఆలోచన  ధోరణిని కుదించుకోవాల్సి రావటం అలా కాంప్రమైజ్  అవ్వటాన్నికూడా అనేక జీవితపు కొలతల చుట్టూ  అల్లుకొంటూ తను చేస్తోంది సబబే అనుకునే వో ధోరణిలోకి  వచ్చేస్తారు.

అలానే యీ  పరిస్థితికి  తలొంచమూ లేదా ఆమోదించమూ లేదా కాంప్రమైజ్ కాలేమూ అనుకొని కొందరు పూర్తిగా ఆయా పరిస్థితుల నుంచి తప్పుకుంటారు. లేదా తమ గొంతెత్తుతారు. యీ గొంతులకి మరి కొన్నిగొంతులు కలపటం అన్ని సమయాల్లో అన్ని సందర్భాలూ జండర్ సమస్యగానో వ్యక్తుల సమస్యగానో చూసే అవకాశం లేదు.

బ్రేక్ అప్ బొకేలు గుండెల్ని మెలిపెడుతోన్నా ర్యాట్ రేస్ లో చాల సార్లు యెందుకు ఖచ్చితంగా భాగం అవ్వాల్సి వొస్తుంది?!

మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోయాయని మాట వరుసకు చాలమంది అంటుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య, అన్నతమ్ములు – అక్క చెల్లెళ్ళ మధ్యన, స్నేహితుల మధ్యన సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోతున్నాయి అని అంటే చాల మందికి నచ్చుతుంది. అవుననే అంటారు.

మరి యిన్ని సంబంధాలు వ్యాపార సంబంధాలుగా మారిపోతోన్న సందర్భంలో స్త్రీ పురుషుల మధ్య ప్రేమ మాత్రం పవిత్రంగా వుంటుందని వొక పిచ్చినమ్మకాన్ని పట్టుకొని ముందుకు యెందుకు పోతూ వుంటారు?!

స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అంత పవిత్రంగా యేమి మిగలలేదు అని వొక స్పృహ  లోకి రావటం చాల హింసతో  కూడుకొన్న వ్యవహారం. కానీ ఆ సృహ రాకుండా లేదా యితరులకి కలగకుండా అడ్డు పడటం దుర్మార్గం అని చెపితే చాల మందికి అర్ధం కాదు.

యీ కథలో దర్శన, విహాన్ తమ ప్రేమ ర్యాట్ రేస్ లో యేమయింది? యే అందమైన అమాయకత్వాన్ని అనివార్యంగా యెలా కోల్పోయారు?! నవ్య జీవితపు వుత్సాహాన్ని నింపుకునేందుకు అన్ని రకాల దుమ్ము ధూళిని శుభ్ర పరిచి తమ ముందున్న జీవితాన్నిశుచిగా శుభ్రం  సంతోషంగా జీవించాలనే ఆకాంక్షని  పూయించిందేమిటి?!!

‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్సు’ కథలో మనుష్యులు గా యెదిగే క్రమంలో ప్రతి తరంలోనూ ప్రతి మనిషి యెప్పుడో అప్పుడు యేదో వొక రకంగా యెదుర్కోవలసిన హింసని, సంపాదించుకోవలసిన స్పృహని.. ఆ విషయాన్ని బలంగా చెప్పగలిగేనని  అనిపిస్తుంది.

అందుకే ఆ కథంటే నాకిష్టం.

*

కుప్పిలి పద్మ

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకు నచ్చిన కథ…Laws of innocence లో ఇది మొదటి కథ..అప్పుడే అనిపించింది ఇది మీకు ఇష్టమైనది కాబట్టే మొదటి ప్లేసులో ఉందని…కథ నిండా హ్యూమన్ సైకాలజీ తో నిండిపోయింది…బాగా అర్థం చేసుకుంటే లైఫ్ లో కొన్ని కొన్ని ఈసీ గా తీసుకోవచ్చు అనిపించింది…

  • “‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్సు’ కథలో మనుష్యులు గా యెదిగే క్రమంలో ప్రతి తరంలోనూ ప్రతి మనిషి యెప్పుడో అప్పుడు యేదో వొక రకంగా యెదుర్కోవలసిన హింసని, సంపాదించుకోవలసిన స్పృహని.. ఆ విషయాన్ని బలంగా చెప్పగలిగేనని అనిపిస్తుంది.” మీరు బాగా చెప్పారు . కధ నేను చదివాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు