మంచి రాజు, చెడ్డ రాజు!

టీవల “Magnificent Bharat” శీర్షికన ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ సోషల్ మీడియాలో చూశాను. సంఘ్ పరివారీయులు దీన్ని విస్తృతంగా ప్రచారంలో పెడుతున్నారు. ఆ ప్రజెంటేషన్ లో మొదటి నాలుగు స్లయిడ్స్ లో అతిశయోక్తులు, చారిత్రిక దురవగాహన స్పష్టంగా కనిపిస్తున్నది. మొదటి నాలుగు స్లయిడ్స్ ఇట్లా ఉన్నాయి.

ఈ నాలుగు స్లయిడ్స్ పై విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. మొదట మూడు, నాలుగు స్లయిడ్స్ పై విశ్లేషిద్దాము.

  1. This is not our past
  2. This is our past

మూడవ స్లయిడ్ లో ఉన్నదే నిజానికి మనుషులందరి గతం. భారతీయులు ఒక్కసారిగా నగర నిర్మాణ కౌశలంతో భూమి మీద అవతరించలేదు. భూగోళం మీద ఉన్నసకల మానవ జాతులు మానవ పరిణామ దశలన్నిటిని దాటుకొని ఇప్పుడున్న స్థితికి వచ్చాయి. భారతీయులు అందుకు అతీతులు కారు. గంగా, సింధు నదీ మైదానాలలో ఉద్భవించిన మన నాగరికతలు అత్యంత ప్రాచీన నాగరికతలు అంటే ఎవరికి  అభ్యంతరం ఉండదు. మనతో పాటు చైనా, మొసపటేమియా, నైలు, దక్షిణ అమెరికాలో అమెజాన్ నదీ లోయలో అజటెక్ నాగరికతలు కూడా ప్రాచీనమైనవేనని మనం అంగీకరిస్తే మనకు జరిగే నష్టం ఏమీ లేదు. ఆనాటి నాగరికతలు అన్నీ కూడా ఒకదానితో మరొకటి ప్రభావితమైనవే.

కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏక ఖండంగా ఉన్న భూమి భూఖండాల కదళికల (Continental Drift) వలన భూభాగాలు వేరు పడి ఖండాలు ఏర్పడినాయని భూగోళ శాస్త్రం చెపుతున్నది. ఆనాటి తొలి మానవులు ఆఫ్రికా ఖండం నుంచి ఎక్కడ నదీ జలాలు ఉంటే అక్కడకి వలస పోయారు. అక్కడ నాగరికతలు విలసిల్లినాయి. ఈ అన్నీకూడా నదీ తీరాల్లో వెలసిన నాగరికతలని మనం గుర్తించాలి. కాబట్టి ఈ ప్రజెంటేషన్ లో మూడవ స్లయిడ్ అశాస్త్రీయం, కాల పరీక్షకు, మానవ పరిణామ చరిత్ర పరిశీలనకు నిలవదు.

ఇక మొదటి, రెండవ స్లయిడ్స్ ను విశ్లేషిద్దాము .

  1. These are our real Heros
  2. These are invaders

ఇది తప్పుడు అభిప్రాయమని నా భావన. ఆనాడు..  మధ్య యుగాల్లో దేశాలు, జాతులు  లేవు. రాజ్యాలు మాత్రమే ఉన్నాయి. జాతీయత అన్నది ఇటీవలి కాలపు ఆధునిక భావన. జాతీయతా భావం (Nationality) అన్నది యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఉద్భవించి స్థిరపడిన భావన అని చరిత్రకారులు, రాజకీయ, ఆర్థిక శాస్త్రవేత్తల  నిర్ధారణ. భారత జాతీయత అన్నది కూడా 18 శాతాబ్దానికి ముందు లేదు. రాజ్య భావన మాత్రమే ఉన్నది. రెండవ స్లయిడ్ లో ఉన్న వారే కాదు మొదటి స్లయిడ్ లో ఉన్నవారు కూడా ఇతర రాజ్యాలపై దాడి చేసి, ఆక్రమించి తమ రాజ్యాలను విస్తరించుకున్నవారే. వారిని కూడా ఆక్రమణదారులుగానే (Invaders) గానే చూడాలి. ప్రాచీన భారత దేశ చరిత్రను చూస్తే 18 గణ రాజ్యాలు ఉండేవని చరిత్రకారులు నిర్ధారించారు.

అందులో ఇనుప గనులు, రాగి గనులు ఉన్న మగధ తర్వాత కాలంలో అనేక రాజ్యాలను జయించి ఒక సువిశాల మగధ సామ్రాజ్యాన్నిపశ్చిమాన  మధ్య ఆసియా వరకు విస్తరించారు. ఇతర గణ రాజ్యాలను ఆక్రమించిన వారు ఆక్రమణదారులు కారా? చంద్రగుప్త మౌర్య ఇతర రాజ్యాలను ఆక్రమించిన ఆక్రమణదారుడు కాదా? అశోకుడు యుద్ధాలలో పారించిన అపారమైన రక్తం చరిత్రలో నమోదు అయ్యింది. అతను కళింగ రాజ్యాన్ని ఆక్రమించిన ఆక్రమణదారుడు కాదా? శివాజీ తమిళ రాజ్యం తంజావూరును ఆక్రమించిన ఆక్రమణదారుడు కాదా? శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయులు, గజపతులు, బహమనీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, కుతుబ్ షాహీలు, పీష్వాలు, సింధియాలు, రాజపుత్రులు .. ఎవరైనా సరే అందరు తమతమ రాజ్యాలని విస్తరించాలన్న కాంక్షతో యుద్ధాలు చేసిన వారే.

మధ్య ఆసియా రాజ్యాల నుంచి భారత దేశ రాజ్యాలపై దండయాత్రలకు వచ్చిన నాదిర్శా, గజనీ, ఘోరీ, బాబర్, అలెక్జాండర్, చెంగిజ్ ఖాన్.. వీరంతా సంపద దోచుకోవడానికో, రాజ్యాలను జయించడానికో వచ్చిన వారే. వారు ఆక్రమణదారులు కాదని అనడం లేదు. వారు మాత్రమే ఆక్రమణదారులు మిగతావారు మన హీరోలు అనడం పట్లనే అభ్యంతరం అంతే. రాజులు, చక్రవర్తులు ఎవరైనా .. సరే.. వారు స్వదేశీయులైనా, విదేశీయులైనా అందరూ ఆక్రమణదారులే. నిజానికి మధ్య యుగాల్లో స్వదేశం, విదేశం అంటూ ఏమీ లేదు. స్వరాజ్యం, పర రాజ్యం అనే భావనలే ఉన్నాయి.

ఆనాడు భారత దేశం అనే జాతి భావన ఉండి ఉంటే భారత దేశం విదేశీ ఆక్రమణదారులకు లొంగి పోయి ఉండేది కాదు. ఆనాడు ఉన్నది భారత దేశం కాదు, భారత ఉప ఖండం అనేక రాజ్యాల సమాహారం. కాబట్టి రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం వలన ఆక్రమణదారులు (Invaders) మన రాజ్యాలను జయించారు. మన సంపదలను దోచుకున్నారు. రాజ్యాలను కలిపేసుకున్నారు. భారత ఉప ఖండంలోనే ఒకరి రాజ్యాలను మరొకరు దోచుకున్నారు. అటువంటి ఆక్రమణదారులకు సహకరించిన వారు మన స్వదేశీ రాజులే.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దక్షిణ భారతంలో అడుగు పెట్టనీయకుండా  వీరోచితంగా నిలువరించిన టిప్పు సుల్తాన్ ను ఓడించడానికి బ్రిటిష్ వారికి సహకరించిన వారు మరాఠ పీష్వాలు (హిందువులు), నిజాం రాజులు (ముస్లింలు). 1857 లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వెల్లుబుకిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామం ఒడిపోవడానికి స్వదేశీ రాజ్యాల మధ్య ఐక్యతా భావన లేకపోవడమే కారణం. బ్రిటిష్ వారి అత్యున్నత అధికారానికి (Paramount Authority) లోబడి హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టుకున్న నిజాం 1857 తిరుగుబాటుకు మద్దతునీయలేదు. మద్దతు ఈయకపోగా నిజాం హైదరాబాద్ రాజ్యంలో  బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన రాంజీ గోండ్ ను, హైదరాబాద్ నగరంలో బ్రిటిష్ రెసిడెన్సీ పై దాడి చేసిన రోహిల్లా వీరుడు పఠాన్ తుర్రేబాజ్ ఖాన్, సహకరించిన మౌల్వీ అల్లావుద్దీన్ తదితరులను అణిచివేశాడు. తుర్రెబాజ్ ఖాన్ ను పట్టుకొని బహిరంగంగా ఉరి తీసింది నిజాం ప్రభుత్వం. మౌల్వీ అల్లావుద్దీన్ ను రంగూన్ జైలుకు ప్రవాసం పంపించారు. ఆయన అక్కడే తన తనువు చాలించాడు.

రాజులు ఎవరైనా ప్రజల గోళ్ళు ఊడదీసి పన్నులు వసూలు చేసి నిరంకుశంగా రాజ్యాలు ఏలినారు. రాజరికం స్వభావ సిద్దంగానే నిరంకుశమైనది. మంచి రాజు, చెడ్డ రాజు అన్న విశ్లేషణకు ఈనాడు ప్రాసంగికత (relevance) లేదు. రాజరికాలు మంచివే అయితే చరిత్రలో మానవ సమాజాలు వాటిని నిలుపుకొని ఉండేవి. రాచరికాలు నిరంకుశమైనవి కనుకనే అన్ని దేశాలలో ప్రజలు రాచరికాలను కూలదోసి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి దాకా మనుగడ సాగించిన నేపాల్ రాచరికం కూడా ప్రజా ఉద్యమంతో కూలి పోయింది.

ముస్లింలను మాత్రమే ఆక్రమణదారులుగా చిత్రీకరించే సంఘ్ పరివార్ భావజాలం ఈనాటి మన ప్రజాస్వామ్య భారత దేశానికి పనికి రాదు. దాని వలన విభిన్న మతాలు ఉన్న భారత సమాజం విచ్ఛిన్నం అవుతుంది. భారత ప్రజాస్వామ్యం ప్రమాదకరమైన  ఫాసిస్ట్ రాజ్యంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. వారిది లోపభూయిష్టమైన చారిత్రిక పరిశీలన. భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విశ్లేషణ. హిందుత్వమే భారత జాతీయత అన్న భావన భారత దేశ రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం.

***

శ్రీధర్ దేశ్ పాండే

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు