భోపాల్ ను మండించిన మణిపూర్

ది కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సాహిత్య అకాడమీ ‘ఉన్మేష’ పేరిట నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్యోత్సవం కావచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తోపాటు అనేక మంది కేంద్ర ప్రభుత్వ అధికారులు, రకరకాల భావజాలాలు గల వారు  హాజరైన సదస్సే కావచ్చు కాని ఒక వేదికపై  కవులు, రచయితలు సమావేశమైన చోట దేశ సామాజిక,రాజకీయ పరిస్థితులు వ్యక్తం కాకుండా ఉండే అవకాశం లేదని నిరూపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా రగులుతున్న మణిపూర్ ఆగస్టు  3-6 తేదీల మధ్య  సాహిత్య అకాడమీ నిర్వహించిన సమావేశాలను మండించింది. మణిపూర్ పరిస్థితి తెలిసినందువల్లనేమో సాహిత్యఅకాడమీ అనేక మంది ఆ రాష్ట్రానికి చెందిన కవులను ఆహ్వానించింది. మణిపూర్ కు చెందిన సాంప్రదాయ అంగవస్త్రంతోనే ఆహ్వానితులందర్నీ సత్కరించింది. ఒక రకంగా మణిపూర్ తన హృదయఘోషను పెల్లుబుకేలా ప్రకటించేందుకు ఉన్మేష దోహదం చేసింది.

‘75 సంవత్సరాలు నిండిన ఈ దేశం గురించి మాట్లాడదాం..’ అని కిరణ్ కుమార్ అనే ఒక మణిపూర్ కవి  తొలి రోజే ఈ సదస్సులో రచయితలు, కవుల్లో ఒక ఆలోచనను రగిలించారు.  ఇంఫాల్ కు చెందిన  కిరణ్ కుమార్ కేంద్ర సాహిత్య అకాడమీ మణిపూర్ సలహా బోర్డు కన్వీనర్ కూడా. మణిపూర్ మండుతోంది అని జంకూ గొంకూ లేకుండా ప్రకటించిన ఈ కవి చదివిన కవిత హృదయాల్ని జ్వలింపచేసింది.

నాకోసం ఒక కవిత రాయండి

ఈ దురదృష్టకరమైన రోజు

నా ఇంటిని ధగ్దం చేశారు

మా అమ్మపై అత్యాచారం చేశారు

నా గుండె రక్తమోడుతోంది

నేను కవితను రాయలేను

నా పెన్ను పదాలను

కనిపెట్టలేకపోతోంది

రక్తాన్ని స్రవిస్తోంది

పర్వతాలు మరణించాయి

ఆకాశం వాతావరణ రోదనను

ప్రతిధ్వనిస్తోంది

చరిత్రను బుల్లెట్లు రాస్తున్నాయి

అని కిరణ్ కుమార్ అక్కడి పరిస్థితిని వివరించారు.

నాకు గ్రామమే దేశం

గ్రామాన్ని కాపాడుకోవడమంటే దేశాన్ని

కాపాడుకుంటున్నట్లు

నాకు తిరంగా అంటే అర్థం తెలియదు

గ్రామం నుంచే దేశాన్ని ఆర్థం చేసుకుంటాను

విముక్తి అర్థం తెలుసుకున్నాను

గ్రామంలో కొండపై దేవత మాయమైంది

తలపై నుంచి ఆకాశం అదృశ్యమైంది

అని ఇంఫాల్ కు చెందిన మరో మణిపూరీ కవయిత్రి ప్రియబ్రతా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘మాయమైన పాదముద్రల్ని అన్వేషిస్తున్నాను’  అని రాసిన మరో మణిపూరీ కవి లెనిన్ ఖుమాంచా ‘మనమిద్దరం జీవితం గురించి ఆలోచించడం పూర్తి సత్యం కాదు’ అని చెప్పారు.

నీవు నన్ను కలుసుకోకముందే

నీవు జీవిస్తున్నావు

నీవు నన్ను కలుసుకోకపోయినా

నీవు జీవిస్తున్నావు

నా పరిస్థితి కూడా అంతే

నిన్నుకలుసుకోకముందు కూడా

నేను జీవిస్తున్నాను, జీవిస్తూనే ఉంటాను

జీవించడం అనేది అల్పమైన విషయం

మనమెప్పుడైనా

కలిసి జీవించడం గురించి

నీవు ఆలోచించావా?

అని లెనిన్ రాశారు. లెనిన్ మణిపూరీ కవిత్వంలో యవోల్ పేరిట పెల్లుబికిన  నూతన చైతన్యానికి ప్రతీక. మణిపూర్ అంతటా జరుగుతున్న విధ్వంసకాండ, రాజ్య హింస ను ఎన్నో ఏళ్లుగా అక్కడి యువకవులు ప్రశ్నిస్తున్నారు. తాజా కవితాత్మక ప్రతీకల్ని అన్వేషిస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన లెనిన్ ఖుమంచా వారిలో ఒకరు.

మణిపూర్ భారతీయ సంస్కృతిలో భాగమని, అర్జునుడు చిత్రాంగద ప్రేమ కథనం అక్కడే జరిగిందని మనం  ఇవాళ ఎన్నో చెప్పుకోవచ్చు. కాని నేటి బాధితులు ఎంతమంది ఈ కథల్ని గుర్తుంచుకుంటున్నారు? ‘ఈ  పౌరాణిక కథలు ఆ గాయాల్నిపూడ్చలేవు’ అని ఒక సదస్సుకు అధ్యక్షత వహించిన  మరో ప్రముఖ కవయిత్రి  సంజుక్త దాస్ గుప్తా అన్నారు. ‘కవులే గుర్తింపు పొందని ప్రజా ప్రతినిధుల’ని షెల్లీ అన్న వాక్యాల్నిగుర్తు చేసిన దాస్ గుప్తా ‘ఇవాల్టి ప్రజా ప్రతినిధులకంటే కవులే ఎన్నో రెట్లు గొప్పవారు. వారు నిజాల్ని మాట్లాడుతున్నారు’ అని చెణుకు విసిరారు. ఈదేశంలో మహిళలు ఎన్నో కురుక్షేత్రాల్ని తమ ఇళ్లనుంచే పోరాడుతున్నారని ఆమె తన ‘ఇన్ డామిటబుల్ ద్రౌపది’ అన్న కవితా సంకలనంలో రాశారు. ‘పదాలు   జీవించి ఉన్నంతవరకూ  నీలోని కవితను బయటకు వదలాలి’ అని  ఆమె అభిప్రాయపడ్డారు.

మణిపూరీ కవులు మాత్రమే కాదు, ఈశాన్య కవులందరూ భోపాల్ లో తమ హృదయ ఘోషను వ్యక్తం చేశారు.

మేమంతా మనోరమ తల్లులం

రండి, మమ్మల్ని రేప్ చేయండి

అమ్మ గర్భంలోకి ప్రవేశించండి

అని బోడో కవయిత్రి అంజలీ బసుమతారే తన శక్తివంతమైన  కవిత్వం ద్వారా సవాలు విసిరారు.  కొండలు, లోయల్లో బుల్లెట్ల ధ్వనుల్ని ఆమె కవిత్వీకరించారు. ‘రక్తంతో తడిసిన చేతులు లక్ష్మికి ఎలా స్వాగతం పలుకుతారు’ అని ప్రశ్నించారు. ఈశాన్య కవులే కాదు, పెద్ద సంఖ్యలో దేశం నలుమూలలనుంచి హాజరైన ఆదివాసీ కవులు అనేకమంది భోపాల్ లో  జల్, జంగల్,జమీన్ గురించి కవితాగానం చేశారు.

భోపాల్ ఎందరో అద్భుతమైన కవుల్ని ఒకే చోట ప్రవహించేలా చేసింది. ‘నీ సంధ్యాకాలంలోనైనా నీవు నావైపు చూస్తావు’ అని నాసిమ్ షఫేయి అనే కశ్మీరీ కవయిత్రి రాశారు. ‘ఇవాళ నీవు మరో సారి ఎప్పటి లాగే  నా తలుపు వద్దకు వచ్చావు. ఏమీ మాట్లాడలేదు. నా దగ్గర పిడికెడు శబ్దాలుంటే నీ పెదాల్ని అలంకరించేదాన్ని’ అని సున్నితమైన భావాల్ని వ్యక్తీకరించే కవయిత్రి ఆమె.

ఆకలయ్యేంతవరకూ పిల్లలకు అమ్మ గుర్తు రానంత మాత్రాన అమ్మవిలువ తగ్గదని,  అలా కళ విలువ కూడా తగ్గదని మధు రాఘవేంద్ర అనే అస్సాంలో స్థిరపడ్డ కవి రాశారు.

‘మనం పిల్లలకు చీమల నుంచి నేర్చుకొమ్మని చెబుతాం. వరుసలో నిలబడి, క్రమశిక్షణగా అవసరమైన పనిని ఎంచుకొమ్మని అంటాం వేసవికాలమంతా ఆడుతూ పాడుతూ తిరిగే గొల్లభామ లాగా ఉండకూడదని పిల్లలకు చెబుతాం.  సంపదను పోగు చేయడమే కష్టపడి పనిచేయమని, సంగీతం నేర్చుకోవడం కాదని  చెబుతాం. అలాంటి మనమే కళ ఆకలితో మరణిస్తుందని ఆశ్చర్యపోతాం’ అని ఆయన కవితాత్మకంగా చెప్పారు. ఆయన కవితల్ని మానవ, పర్యావరణ హక్కులకు ఉపయోగించే కవి.

నేహా బన్సల్ ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారిణి. కాని ఆమె ఎక్కడ కవులు ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. భోపాల్ లో ఆమె సీతాదేవి గురించి ఒక కవిత చదివారు.

ఆమె గుండె బాధతో రోదించింది

ఆమె కళ్లు రాళ్లుగా మారాయి

ఆమె మెల్లగా ఎగిసిపడుతున్న

మంటల అడవిలోకి ప్రవేశించింది

భక్తుల గొంతెత్తే మంత్ర ధ్వనుల మధ్య

ఆమె సురక్షితంగా బయటకు వచ్చింది

అద్భుతాలు చూసిన భక్తులు

ఆమె  పవిత్రత గురించి రాగాలందుకున్నారు

ఆమె రాముడిని చూసింది

ఏడుస్తూ చేతులు చాచి

స్వాగతించిన అతడిని చూసింది

ఆమె మనసు

కాలిన సతీదేవి శవాన్ని

భుజాన వేసుకున్న శివుడిని తలచుకొంది

తీవ్రతరమవుతున్న ఆమె బాధను

ఏదీ చల్లార్చలేదు

అని రాసిన ఆమె కవిత అందర్నీ కదిలించింది.

గంట మోగకపోయినా అన్ని నియమాలను ఛేదించుకుని మృత్యువు వచ్చిందని అకాల మృత్యువు గురించి రాసిన హిందీ కవి బదరీనారాయణ్.   పచ్చి అబద్దాల చెట్లు, మంటల ఆకులు, బూడిద ఆకులు గురించి రాసిన మరో హిందీ కవి దిలీప్ ఝవేరీ, తనను ఎవరో ఒకరు ఈ అడవి నుంచి బయటపడేయండి అని వేదన వ్యక్తం చేశారు. ప్రపంచం అంతా ధ్వనిగా కుదించుకుపోయింది అని అన్నే తన్నం అనే ఐరిష్ కవయిత్రి అన్నారు.

మనం కోరుకునే శాంతి

గుండెచప్పుడుకూ, తుపాకీ మొనకూ మధ్య ఊగిసలాడుతుంది.

మనం కోరుకునేశాంతి

మరణించే మనిషి చివరిశ్వాసలాగా మంచం మీద ఉంది

అన్న  యాకూబ్ కూడా ‘మసీదు, మందిరం, ప్రవచనాల్లో నేనెవర్ని?’ అనే ప్రశ్నను సంధించారు.

మన  యువకవి పల్లిపట్టు నాగరాజు కూడా ఏమీ తక్కువ తినలేదు.

కాలం రాను రాను రాతియుగంలోకి వెళ్లిపోతోంది

అస్తమానం నమ్మించి గొంతు నులిమే మాటలమారి

పూటకో వేషం వేస్తూ విద్వేషాల్ని నిప్పుల బంతిగా విసురుతుంటే

దేశం కాలిన బొమ్మల గొంతై

నెత్తురోడుతున్న ప్రేమ తోటల దుఃఖం

లోపల సుడులు తిరుగుతోంది

అనే శక్తివంతమైన కవిత్వాన్ని సంధించారు.

అన్నిటికన్నా ఎక్కువ ఆనందం కలిగించిన విషయం భోపాల్ సాహిత్యోత్సవంలోనే మన ఆధునిక కవి శివారెడ్డి తన 81 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం.

బహుభాషా కవుల సమ్మేళనం ఒక సెషన్ కు అధ్యక్షత వహించిన శివారెడ్డి కవిత్వం చదువుతుంటే వినడం ఒక అనుభవం.

తన అధ్యక్షోపన్యాసంలో ఆయన నిరసన లేనిది కవిత్వం లేదన్నారు. రాజకీయాలను తప్పించుకోలేమన్నారు. దేవుడికి పట్ల అవిధేయత ప్రకటించిన మిల్టన్ ను గుర్తు చేశారు. నిశ్శబ్దం కవిత్వ మూల సారాంశం అని ప్రకటించారు. ప్రేమ కవిత్వ ఆత్మ అని చెప్పారు. తాను ఆరు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నానని, 20వ ఏట కవిత్వం రాసిన నాటికంటే ఇప్పుడు కవిత్వం రాయడం కష్టమైందని, జీవితం సంక్లిష్టం కావడమే అందుకు కారణమని అన్నారు.

‘ప్రజాస్వామ్యం అంటే ఇతరులను సహించడం’ అని స్పష్టం చేసిన శివారెడ్డి ప్రజాస్వామ్యం ఎంతో కొంత జీవించినందుకే మనం మనుగడలో ఉన్నామని చెప్పారు. ‘ప్రపంచం అందమైంది, ఎంతకాలం బతకడానికి వీలుంటే అంతకాలం బతకాలి’ అని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కుటుంబ పెద్ద గతంలో కంటే ఇప్పుడు ఒకే ఇంట్లో బతకడం కష్టమైందని ఇంటిలోనే రకరకాల విభజనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చెట్టు క్రింద నిలబడ్డా, జంతువు ముందు నిలబడ్డా, చెరువు ముందు నిలబడ్డా, వ్యక్తి ముందు నిలబడ్డా గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, చివరకు అద్దం ముందు నిలబడ్డా తనను తాను గుర్తించలేకపోతున్నానని అన్నారు. పుస్తకం ఆభరణం కాదని, పుస్తకం చేతుల్లో ఉంటే చదవకపోయినా విద్యుత్తులా శరీరంలోకి ప్రవేశిస్తుందని, నిశ్శబ్ద సంభాషణను అర్థం చేసుకోగలమని, భాష లేని భాష ఉంటుందని శివారెడ్డి అత్యంత ప్రతిభావంతంగా కవితాత్మకంగా చెప్పారు.

గత 50 ఏళ్లుగా ఈ

వంతెనపై నడుస్తున్నాను

వంతెన విశాలమైంది, బరువెక్కింది

అన్నిటినీ మోసే

ఆ నిర్జీవమైన వంతెన

ఎవరిపై ఫిర్యాదు చేయదు,

బాధపడదు,

ఎవరో తన భారాన్ని తగ్గిస్తారని

ఎదురు చూస్తుంది.

గత 50 ఏళ్లుగా ఆ వంతెన

వంగిపోయిందని

కళ్లు చూడలేవు

గత 50 ఏళ్లుగా వంతెన నన్ను మోస్తోంది

వంగినా అది కూలిపోలేదు

వంతెనకు లాల్ సలామ్ !

అని ప్రకటించిన శివారెడ్డి ఎనిమిది దశాబ్దాలు దాటినా కవితల భారంతో ఆయన కుంగిపోలేదని భోపాల్ స్పష్టం చేసింది!

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు