బుర్రతిన్నోడే… బుద్ధిమంతుడు

“అమ్మా! నేను బుద్ధిమంతున్నికదా!..” అని అడిగేను మా అమ్మను.

“అవున్నాయనా నువు చాలా బుద్ధిమంతుడివి. నీకేమి?”అంది మా అమ్మ

“సీతప్ప  మంచిదాయి కాదు కదా!” మళ్లీ అడిగేను.బుంగమూతిపెట్టి,

నాప్రశ్నకి మా అమ్మ కిసుక్కున నవ్వింది. ముఖం పక్కకితిప్పేసి.వెంటనే నావైపుచూసి అంది తన నవ్వునాపుకుంటూ.

“అది వొట్టి అల్లరిదిరా! ఎప్పుడూ అలుగుతాది, దానికంటే నువ్వే మంచోడివి.” తేల్చి చెప్పే సింది. నాకు చాలా ఆనందమనిపించింది. ఆరోజు ఉదయం అప్పుడే నిద్రలేచి మంచందిగి అక్కడికి వచ్చేను.

నాకు రాత్రి జరిగిన సంగతి గుర్తొచ్చి మనసు  ఒకదగ్గర నిలవడంలేదు. సీతాకోకచిలుక లాగా గొప్ప ఉత్సాహంగా ఎగురుతోంది. అమ్మంటే మరింత అభిమానమేర్పడింది. కానీ అమ్మ ఎందుకో నవ్వింది. ఎందుకు నవ్విందో అర్ధం కాలేదు.

ఉదయం వంటచేస్తూ పొయ్యిదగ్గర కూచుంది అమ్మ. మట్టిపొయ్యి రెండు ఆయిలాలది. రెండు పక్కల్ల రెండు కుండలు పెట్టి వండుతోంది. ఒకవైపు బియ్యముడికే కూటికుండ వుంది. మరో వైపు అంబలి వొండే అంబలటిక వుంది. అంటే అమ్మ పొయిలో అగ్గిపెట్టి ఎంతో సేపవ్వలేదని తెలిసిపోతోంది. బువ్వుడకడం,అంబలికి ఎసర్లు మరగడం ఆలిశ్యమవుతాయి.

ఈలోపల కూరగాయలు కోయడం. తాలింపులమర్చడం చేస్తాది. ఆ రెండూ పొయ్యిదిగితే ఓవైపు కూర, మరో వైపు చారూ పెడతాది. అవైపోతే పశువులకు దాణా ఒకవైపు, వుడుకునీళ్లు మరొకవైపు పెడతాది.అవికూడా అయిపోతే వంటంతా అయిపోయినట్టే. తొక్కునంతా తుడి చేసి పొయ్యికి ఎగబెట్టేస్తాది.

నేనొచ్చి రెండోవయిపున కూర్చున్నాను. అమ్మపొయ్యిలో కట్టిక కర్రలెగేస్తూ మాట్లాడుతోంది నాతో. నన్ను మెచ్చుకుంది.అయినా

నాకింకా ఆఉత్సాహం సరిపోవటం లేదు. నామనసు మరిన్నిపొగడ్తల్ని ఆశిస్తున్నట్టుగా ఉంది. రాత్రి  అమ్మచేసిన వాగ్ధానాన్ని గుర్తు చేయాలని వువ్విళ్లూరుతోంది.

“రాత్రి బుర్రలన్నీ నేనే తినేసాను కదమ్మా!” అన్నాను.

అప్పుడికి విషయమర్ధమైనట్టుగయ్యి, మళ్లీ చిన్ననవ్వు నవ్వింది.అంతవరకు నాతో మాట్లాడుతునే వుంది కానీ, నేను దేనిగురించి మాట్లాడూతున్నానో సరిగ్గా అర్ధమైనట్టులేదు.

“ఎందుకు నవ్వుతున్నావు!?”  అడిగాను సందేహంగా

“వుత్తినేన్నే”  అనేసి,

“నువ్వు చాలా మంచోడివమ్మ, ఏదీ వదలకుండా సుబ్బరంగా తినేశావు. అలాగే తినాలి. ఏదిపెడితే అది తింతేనే పిల్లలు. సుబ్బరంగా అరోగ్గెంగా వుంతారు. ఏదీ తిన్నోలు ఎల గుంతారు! ఎండునక్కల్లాగుంతారు.” అంది.

నేను ముందురోజు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుచేసుకున్నాను.

రాత్రి బువ్వలు తింటున్నప్పుడు,బువ్వలతో పాటుగా, కూరగిన్నెల్లో కూర కూడా ఏస్సి ఎవలి ది ఆలకి ఇచ్చేసింది అమ్మ. అన్నయ్య, సీతప్ప, నేను, అయ్య.. వరసగా గోడకి ఆనుకొని కూర్చున్నాము. ఎవరిగిన్నెలు ఆలు తీసుకున్నాక మాసీతప్పకి నాకు  ఒకలి కూర గిన్నెలు ఒకరు చూడడం అలవాటు. ఎవరికి ఎక్కువ కూరేసిందో మా అమ్మని. మా యిద్దరికి ఏన్నర్దం వ్యత్యాసమట. మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది.

ఆరోజు చేపలుకూర. మా సీతప్ప దాని  కూరగిన్నెలో వేలుపెట్టి నొక్కిచూసింది.

“నాకన్నీ బుర్రలే ఏస్సావు.మంచిదొక్కటీ ఎయ్యనేదు..” అని అంది

“ఎంది అవి మంచివికావా! “గట్టిగా అడిగింది మా అమ్మ.

“మీయిద్దరికి రోజూ అలవాటైపోయింది, తిండిదగ్గర అల్లరి పెట్టడం. ఏదిపెడితే అది తినీసి నెగండి.” అంది కోపంగా.

“నన్నెందుకంతావు.నేనేటన్లేదుకదా!?..” అన్నాను.నేను

“ఎవులంతే ఆలకే అంతన్ను” అంది.

“ఏటి మంచివి కాదే నీకు!…రెండుబుర్రలు తోక ఏసాను. ఆడికి అలగే ఏసాను.అన్నయ్యకి నాలుగు నడుం పిసర్లు ఒకతోక , అయ్యకి అలగే ఒకతోక నాలుగు పిసర్లు ఏసాను. ఎవలికేటి ఎక్కువేసీనేదు నీకు మానీసి“ అంది.

“తెచ్చినివి నాలుగు మిట్టపిల్లలు. అవీ కసింత నిమానంగా వుండబట్టి సరిపోయింది, మనిసికి మూడేసి నాలుగేసి పిసర్లొచ్చినాయి. అవే మూడురూపాయిలు. బజారులో ఏటికొన్నేము.రోజు రోజుకి రేట్లు పెరిగి పోతుంతే ఏటికొంతాము.ఏటి తింతాము.” తన ఆవేశాన్ని బాధను తను వ్యక్తంచేసింది.

అప్పుడికీ సీతప్ప తినకుండా గిన్నెలో ఏలుపెట్టి తిప్పుతూనే వుంది.

మా అమ్మకి కోపమెక్కువవుతోంది.

“తొందరగా తినీసి నెగుత్తావా రెండు దరువులేసిమన్నవా!” అంది.

“నాకొద్దు ఆడికే ఏసి” అని అలిగీసి అక్కన్నుంచి లెగిసిపోయింది.

“అలగేన్నే… నువ్విపుడు తినప్పోతె మరేం వట్టం నేదు. ఎల్లు.. ఎల్లి పడుకో”అనేసి తనపని తాను చేసుకుంటోంది. అయ్య,అన్నయ్య పల్లక తినేసి  లెగిసిపోయారు గానీ ఎవులూ ఏటన్నేదు. ఇది రోజూ వుండే తగువేలె అన్నట్టు వూరుకున్నారు.

కాసేపాగేక

“తిన్నగా వత్తావా! రావా!?” అమ్మ మళ్లీ కేకేసింది.

సీతప్ప లెగిసిపోయింది గానీ పెద్దగది తలుపు దగ్గరే నక్కింది .పూర్తిగా తిండిని వొదులు కోలేకపోతోంది. అలాగని పట్టుదలని మానుకోలేకపోతోంది.

అప్పుడే అమ్మకేక వినపడింది.

“నాకింకో తోకిమ్మను.” అంది అక్కడనుంచే

“నువ్వే పిల్లవు, మరి ఆడు పిల్లడుకాడు. ఆడికి మానీసి నీకిచ్చేత్తాడూ…నువ్వు బుగ్గలాడిద్దువు గానీ! ..నువురాకపోతే మానీ..అన్నం సుబ్బరంగా కలేసేస్తాను. అప్పుడు తిందువు రెండు చేతుల తోని..”  కోపంగానూ,ధృడమైన కంఠంతోనూ అంది.

“అసలు నాది బుద్దితక్కువ,మీ అయ్య రెండురోజులబట్టి ‘బజారులో సేపలున్నాయి గావాల!.. సేపలొత్తన్నాయి గావాల!’ అంతండనీసి తెచ్చాను. డబ్బుల్లేని టైము…” అంది.

“డబ్బుల్లేకపోతే మరేల తెచ్చావు!? మానీవొలిసింది..అన్నాడు మా అయ్య, అప్పుడే ఎంగిలినీలు బయట వూసేసి వచ్చి, పెద్దగదిలోని నులక మంచం మీద కూచున్నాడు.

“డబ్బుల్లేవు…పోనీలే ఎండుపరిగెలన్నా తెద్దుమనీసీ బజారెల్లాను. పుల్లాబెల్లమేసి వొండు కుంతే అవే బాగుంతాయనే…అనుకొని. తీరాసూస్తే బజార్ల పరిగిలు ఎక్కువలేవు. ఒక్కడి దగ్గరే ఉన్నాయి. వొంతులేసి అమ్ముతున్నాడు .రెండు పుంజీల్లేవు అద్దురూపాయికొక వంతు అంతన్నాడు. పరిగిలూ పెద్దవికావు. సిన్నీరిసెలు.

నేనొట్టికెల్లిన రెండు రూపాయిలిచ్చినా ఈ పూటకూరే గడదు. సరే సూద్దు మనీసి పెద్దసేపల కాసెల్లాను.

అక్కడసూస్తే పెద్దపెద్ద పరిగెలు ఒక్కొక్కటి నాలుగేసి ఐదేసి కేజీల బరువుతో కుడుప్పె య్యిల్లా గున్నాయి. మనమేటికొనగలమని వొచ్చేత్తుంతే గూలోలి సిన్నోడు గిడిసెలు మిట్ట పిల్లలు అమ్ముతూ కనిపించాడు. అక్కడకెల్తే వొంతు నాలుగు రూపాయిలు చెప్పాడు. మూడురూపాయిలకు బేరమాడి ఈ నాలుగు గిడిసెలు తెచ్చాను అంది.

“ యింక రూపాయి బాకీ..అయితే”అన్నాడు మా అయ్య.

“ఏ బాకీనేదు. ఆడు మనకి ఏనాట్నుంచో రూపాయి బాకీ ఉన్నాడు. అడిగినన్నాలూ…’ యిదిగో అదిగో’ అని తిప్పాడు, తప్ప యివ్వనేదు.

అడిగి అడిగి .. మనసుకి సాలొచ్చి అడగడం మానుకొన్నాను. ఈవేల దొరికాడు.పట్టుమీది కోడిలాగ” అంది.

“యిచ్చీసేడా అయితే..” అడిగాడు మా అయ్య

“ఆడు అంత సుళువుగా యిచ్చేత్తాడా! నేనే తీసుకున్నాను” అంది

“అమ్మమ్మ..తల్తల్లీ యివి నావిగాదు అంతండు. యింకెవులో అమ్మమంతే అమ్ముతున్నా డట. నిజమే సెప్తుండో అబద్దమే సెప్తుండో…ఎవులికి తెలుసు.”

“అడివైతే నాకేల… యింకెవులివైతే నాకేల !? ఆ బాధేదో ఆడే పడతాడు. ఎంది ఆడివే డబ్బులు గాని మనవి డబ్బులు కావేటి!?.”

అమ్మ మాటలు గొప్ప ఆవేశంగా ఉన్నాయి. అంతవరకూ మాట్లాడి మళ్లీ సీతప్ప కాసి చూసి గట్టిగా కేకేసింది.

“ఏమే నువ్వూ…ఎంతసేపిలాగ?” అని

అమ్మ మాటతీరుకు అదికొంచెం భయపడినట్టుంది.

అలక కొంచెంతగ్గించి మెల్లగా గోడను వీపుతో పాముకుంటూ యిష్టంలేని దానిలా నెమ్మెదిగా వస్తోంది.

అప్పుడు మా అమ్మ నావైపు చూసి అంది.

“పోనీ నాయనా, దానికా తోక పిసరిచ్చీసి నువ్వు రెండుబుర్రలు తీసుకో” అని అనేసి నా కూరప్లేటులో తోక తీసేసి దానిప్లేటులో వేసి, దానిప్లేటులోని బుర్రలు రెండు నాకేసేసింది.

అప్పుడు ముసిముసి నవ్వు నవ్వుకుంటూ గబగబా వచ్చింది సీతప్ప.

నా ప్లేటులో ఇపుడు నాలుగూ బుర్రలే వున్నాయి.

నీను గతుక్కు మన్నాను.చుట్టూ తిరిగి నాకే గాలొస్తుందనుకోలేదు. ఆకరిలో  తినాలని కూర దాచుకున్నాను. అదే తప్పయిపోయింది.

అయోమయంగా అమ్మ వైపు చూసాను.

“నువ్వు మంచోడివికదూ! అదొట్టి ఏడుబ్బిత్తులదాయిరా!..”అని బుదరించబోయింది. నేను అదోలా ముకంపేట్టేసాను.

“రేపు నీకేదైనా యిత్తాన్లే తిండానికి “అని మెల్లగా చెవిలో  చెప్పింది. దాంతో నాలో ఏదో హుషారు వచ్చేసింది.

సీతప్పని చూసి గసురుతూ అంది

“తినెయ్యమ్మా కడుపులో కాపరం చేస్తాది. తోకల బంగారముంది, బుర్రల లేకపోయింది.”

“అసలు బుర్రతిన్నోలే బుద్దిమంతులు, నడుము తిన్నోలు నంజికొడుకులు, తోక తిన్నోలు తొత్తికొడుకులు. తెలుసునా” అంది. దానిని వెక్కిరిస్తూ… నావైపు మెచ్చుకోలుగా చూస్తూ.

తెల్లవారి యిప్పుడు పొయ్యిదగ్గర కూర్చొని ఎన్నో రకాలుగా గుర్తు చేద్దామని ప్రయత్నించినా రాత్రింటి వాగ్ధానం గురించి మాట్లాడటం లేదు అమ్మ. మరిచిపోయినట్టుగావుంది. యింక వుండ లేకపోయాను.

“నాకేదైనా యిస్తానన్నావు” అని నెమ్మదిగా అడిగాను.

“యిప్పుడేటుంది. తరవాత సూద్దుమునే..అవతల పనికేలైపోతోంది” అనేసి తను హడావుడి లో తనుపడింది.

నేను అలా చూస్తూనే వున్నాను. సాయంత్రమైనా ఏదో ఒకటి యిస్తాదన్న ఆశతో…

*****

రెడ్డి రామకృష్ణ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు